మలి కలయిక

72
9

[dropcap]రో[/dropcap]జూలాగానే ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి, తయారై మార్నింగ్ వాక్‌కి హుషారుగా బయలుదేరాను. అపార్టుమెంట్‌లో మేముండేది ఐదో ఫ్లోర్‌లో. లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్‌లో దిగి చూస్తే పార్కింగ్‌లో కార్లన్నీ ఇంకా మత్తు నిద్రలో జోగుతూ ఉన్నాయి. నిన్నంతా మండుటెండల్లో, ట్రాఫిక్ జాముల్లో ఎక్కడెక్కడో ఎంతంతో దూరం ప్రయాణం చేసి, అలసి, సొలసి నీరసించి కళావిహీనంగా ఉన్నాయ్…. పాపం!… అప్పుడే కొంత మంది డ్రైవర్లు కార్లకు మేలుకొలుపు పాటలు పాడుతూ పొడి బట్టతో దుమ్ము దులిపి, తడి బట్టతో మసాజ్ చేసి మరల వాటిని రోడ్లెక్కించడానికి ముస్తాబు చేస్తున్నారు.

బయట కెళ్తూ పోస్ట్ బాక్సుల వైపు కన్నేయడం, నా బాక్సులో ఏమైనా ఉత్తరాలు బయటకు కనిపిస్తే, వాటిని తీసుకోవడం, లేవంటే…. ప్రతి ఆదివారం బాక్సు తెరిచి చూసుకోవడం… నా అలవాటు. అలా చూస్తూ వెళ్తుంటే, అప్రయత్నంగా నా దృష్టి నేలపై పడియున్న పెద్దకవరు మీద కేంద్రీకృతమైంది. ఎవరిదో చూసి వాళ్ల బాక్సులో వేద్దామనే సదుద్దేశంతో నేల మీద పడి వున్న కవరును చేతిలోకి తీసుకొని దువ్వ దులిపి అడ్రసు వైపు చూశాను… అరే!… నా అడ్రస్సే!!. ఎవరిదో పెండ్లి శుభలేఖ. ఎవరు పంపారబ్బా…. డాక్టర్ యల్.వి.కె.ప్రశాంత్, హనుమకొండ… అంటే నా ప్రియ మిత్రుడు ప్రశాంత్… లోపలి కార్డు తీసి చూస్తే… వాళ్లబ్బాయి పెండ్లి, ఖాజీపేటలో…. ఇంక వారం రోజుల్లో… ఓ మైగాడ్… ఎన్ని సంవత్సరాలయింది ప్రశాంత్‌ని చూసి. దాదాపు ముప్పై సంవత్సరాల పైమాటే… ఇన్ని రోజులు ఎందుకు కలుసుకోలేకపోయామా… అని అనుకుంటే బాధనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు నా అడ్రసు కనుక్కొని నాకు కార్డు పంపాడు! ప్రశాంత్…. యు ఆర్ రియల్లీ గ్రేట్….!

నిజానికి మా పరిచయం మహబూబాబాద్‌లో. ఆ తరువాత నేను నిడుబ్రోలు, గుంటూరు, రాజమండ్రి, కరీంనగర్, తెనాలి, శ్రీకాకుళం, బర్హంపూర్ పట్టణాలకు బదిలీలపై తిరుగుతూ, తిరుగుతూ, ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసి హైద్రాబాద్‌లో స్థిరబడ్డాను. వాకింగ్ చేస్తున్నానే కాని మనసు అనాలోచితంగా ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్లింది.

***

అప్పట్లో నేను మహబూబాబాద్ ఆంధ్రాబ్యాంక్‌లో మేనేజర్‌గా ఉండేవాడ్ని. ప్రశాంత్ ప్రభుత్వాస్పత్రిలో దంత వైద్యుడిగా పని చేసేవాడు. మొదట్లో మా యిద్దరి మధ్య ఒక మేనేజర్… కస్టమర్ రిలేషన్‌షిప్ ఉండేది. తరువాత రోజుల్లో ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్న మీదట, మంచి స్నేహితులమయ్యాం.

ఇక ప్రశాంత్ వ్యక్తిత్వం గురించి చెప్పాల్సి వస్తే…. ఆయన మృదుమధుర భాషి. ఇతరులకు శక్తిమేర సహాయం చేయాలనే తపన ఉన్న వ్యక్తి. ఎవరి మనసును నొప్పించని సున్నిత మనస్కుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి మారు పేరు, ఆదర్శ స్నేహానికి చిరునామా ప్రశాంత్.

ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకు నా పనంతా ముగించుకుని, ప్రశాంత్ కోసం ఎదురు చూపులు చూస్తుండేవాడ్ని. తనూ ఆరు గంటలకల్లా మా ఆఫీసుకు వచ్చేవారు. మేమిద్దరం మరో ఇద్దరు మా స్టాఫ్, నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా ప్రధాన వీధిలో నడుచుకుంటూ రైల్వే స్టేషన్‍కి వెళ్ళి రెండు ఫ్లాట్‌ఫారాలపై అటూ ఇటూ నడిచేవాళ్లం. ఆ తరువాత ఒక చోట కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకొనేవారం. మా ఇద్దరి మధ్య మాత్రం ఒకింత సాహిత్య సంబంధ చర్చలు జరుగుతుండేవి.

వృత్తిరీత్యా ప్రతి రోజూ మేము ఎన్నో ఒడుదుకులకు లోనవుతుంటాం. కాని సాయంత్రానికి అలా మనసు విప్పి మాట్లాడుకుంటూ కొంత సేపు గడిపితే ఎంత ఊరట లభించేది. తిరిగి రాత్రి ఏడుగంటలకల్లా ఇళ్లకు చేరుకునే వాళ్లం.

ఇక పోతే ఆ ఊర్లో ఉండే వి.ఐ.పి.ల జాబితాల్లో మా ఇద్దరి పేర్లు కూడా ఉండేవి. మొత్తంగా మాతో పాటు మరో పది మంది, వివిధ వృత్తుల్లో జీవనం సాగించేవారు మాకు మంచి మిత్రులుగా ఉండేవారు. మేమందరం లయన్స్ క్లబ్‌లో మెంబర్లం కూడా. హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, వెటర్నరీ క్యాంప్స్, ట్రీ ప్లాంటేషన్, మరెన్నో సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. అప్పుడప్పుడు అందరం కలసి కుటుంబ సమేతంగా విహార యాత్రలకు కూడా వెళ్తుండే వాళ్లం. ఒకరికొకరం చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాళ్లం.

ఎవరింట్లో ఏ చిన్న పాటి ఫంక్షన్ జరిగినా అందరం కలిసి ఎంజాయ్ చేసే వాళ్లం. రోజులు హాయిగా జాలీగా గడుస్తుండేవి.

ప్రశాంత్ దంతవైద్యుడిగా అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ క్రమంలోనే, దంతపోషణ, దంత సంరక్షణ మొదలైన విషయాలపై ప్రజలలో ఒక అవగాహన కలిగించే ఆశయంతో మంచి ఆర్టికల్స్ రాసేవారు. ఆయన రచనలు తేలికపాటి భాషా ప్రయోగంతో, సాధారణ వ్యక్తులు సైతం సులభంగా అర్ధం చేసుకునే రీతిలో కొనసాగేవి. కొన్ని దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు కూడా ఆ ఆర్టికల్స్‌ని ప్రచురిస్తుండేవి. అప్పుడప్పుడు ఆల్‌ ఇండియా రేడియోలో కూడా దంత సమస్యలపై ప్రసంగాలు చేస్తూ శ్రోతల సందేహాలకు తగిన సూచనలు చేసేవారు.

ముద్రించబడిన ప్రతి ఆర్టికల్‌ని నాకు చూపించి, చదివి అభిప్రాయం చెప్పమనేవారు. చాలా బాగుండేవి. అలాంటి సందర్భాల్లో నేనంటుండేవాడ్ని…. “ప్రశాంత్… ఇంత బాగా రాస్తున్నారు. ఇక మీరు కథలు కవితలు, నవలలు కూడా రాయడం మొదలు పెడితే బాగుంటుంది. వాటి ద్వారా…. సమాజానికి ఉపయోగపడే సందేశాలను పంపిస్తూ, ఇతోధికంగా సమాజ సేవ కూడా చేయచ్చు కదా…! ఆలోచించండి…” అంటూ ఉచిత సలహా ఇస్తుండేవాడ్ని.

“ఆ… అది మనవల్ల కాదు లెండి… ఏదో ఇలా ఉండనివ్వండి” అంటూ మాట దాటేస్తూండేవాడు ప్రశాంత్.

ఏమనుకున్నాడో ఏమో కాని ఒక రోజు ప్రశాంత్ ‘ప్రయత్నం చేస్తేపోయేదేముంది..!’ ఒక మంచి కథ వస్తుందేమో అనుకొని, వెంటనే తన ఆలోచనలకు పదును పెట్టాడు. అప్పుడే స్వాతి వారపత్రికలో బాపు బొమ్మకు తన మొదటి కథ ‘ఆయుధం’ వ్రాయడం, అది వారికి నచ్చి ప్రచురించడం జరిగింది. ముద్రించబడిన ఆ కథను ప్రశాంత్… నాకు చూపించినప్పుడు ఆశ్చర్యచకితుడనవడం నావంతయింది.

ఆ తరువాత రోజుల్లో నాకు ఆ ఊరి నుండి బదిలీ అయింది. ముప్పై సంవత్సరాల తరువాత ఈ శుభలేఖ ద్వారా మరల ఈ రోజు మనసంతా, నేస్తం ప్రశాంత్ స్నేహం తాలూకు జ్ఞాపకాలతో నిండిపోయింది.

***

అంత మంచి స్నేహితులం కాదా! మరి గతించిన ఈ ముప్పై సంవత్సరాల కాల వ్యవధిలో మాట్లాడుకోలేదు… కలుసుకోలేదు… ఎందుకిలా జరిగింది… అందుకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన కారణాలంటూ ఏమీ లేవు. అప్పుడనిపించింది…

ఎవరు…. ఎప్పుడు… ఎందుకు… ఎక్కడ… కలుస్తారో… ఎందుకు విడిపోతారో…. మరల ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ… కలుస్తారో…. అంతా ఆ విధి నిర్ణయిస్తుందని.

ఇప్పుడు మా ‘మలి కలయిక’ కూడా ఆ కోవలోనిదే అయ్యుండచ్చు.

అందుకే… ఈ మలి కలయిక తుది కలయిక కాకుండా… నిరాటంకంగా, నిర్విఘ్నంగా… నిరంతరం…. కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే మదిలో శరవేగంగా పరుగిడుతున్న ఆలోచనలకు సడన్ బ్రేక్ వేసి లాప్‌టాప్ ముందు కూర్చున్నాను. పెండ్లికి ఇంకా వారం రోజులు మాత్రమే టైం వుంది. ఏ మాత్రం కాలయాపన చేయకుండా ఆన్‌లైన్‌లో ఖాజీపేటకు పెండ్లి రోజుకు రానూ పోనూ రైలు టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాను. ఒక సారి ప్రశాంత్‌తో ఫోన్‌లో మాట్లాడాలనిపించింది. శుభలేఖ పైన ఉన్న మొబైల్ నెంబరుకి ఫోన్ చేశాను. అవతల ఫోన్ రింగవుతుంది. ప్రశాంత్‌తో మాట్లాడబోతున్నందుకు…. ఏదో ఉత్కంఠ… ఉద్వేగం… నోట మాట పెగలట్లేదు. ఇంతలో… అటునుంచి

“హలో… ఎవరండీ… డాక్టర్ ప్రశాంత్ హియర్.”

యస్…. అదే స్వరం… అదే మాట తీరు…. ఏం మారలేదు.

“హలో…. ప్రశాంత్… సదానంద్ ఫ్రం హైదరాబాద్.”

“ఓ… ఎన్నాళ్లకెన్నాళ్లకు… హౌ ఆర్ యూ.”

“వెరీ…. ఫైన్….”

అంటూ…. కొంచం సేపు కుశల ప్రశ్నలు…. జవాబులు…. కార్యక్రమం ముగిసిన తరువాత ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. అలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పెండ్లి పనుల్లో బిజీగావున్న ప్రశాంత్… “ఆ! పెండ్లికి వస్తున్నారు కదా, మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం!! ఎదురు చూస్తుంటాను…” అన్నాడు.

“తప్పకుండా… మరి ఉంటాను” ఫోన్ కట్ చేసాను.

ఫోన్ సంభాషణలో నా కర్థమైంది ప్రశాంత్ ప్రస్తుతం ఒక డాక్టరు మాత్రమే కాదు.. సాహితీ ప్రపంచంలో పరిచయం అవసరం లేని ఒక పెద్ద రచయిత. ఆయన రచించిన కవితలు, కథలు, నవలలకు తెలుగు పాఠకులు నుండి విశేషమైన ఆదరణ లభించింది. నన్ను మరీ ఆశ్చర్యపరచిన విషయం ఏమిటంటే… తను రచయితగా ఇంతలా ఎదగడానికి నేనే కారణమట!…. అదెలా అంటే తన మొట్టమొదటి కథ వ్రాయడానికి నా ప్రోత్సాహమే కారణమట! ఆ తరువాత రచనా వ్యాసంగంలో వెనుదిరిగి చూసింది లేదట!

ఈ మధ్యనే ఒక పత్రిక వాళ్ళు తనను ఇంటర్వ్యూ చేస్తూ… “వైద్య వృత్తిలో రోజంతా తీరిక లేకుండా వుండే మీరు ఒక రచయితగా రూపాంతరం చెందడానికి వెనుక ఏమయినా కథ ఉందా…” అని అడిగారట!

అందుకు తాను చెప్పిన సమాధానాన్ని వాట్సప్‌లో పంపుతాను… చూడమన్నాడు ప్రశాంత్. వెంటనే వాట్సప్ ఓపెన్ చేశాను. పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ చెప్పిన జవాబు సారాంశం…. ఆయన మాటల్లోనే….

“నా మొదటి కథ ‘ఆయుధం’ బాపు బొమ్మకు కథ రాయడం. అది స్వాతి వారపత్రిక వారికి నచ్చి ప్రచురిచడం నా అదృష్టం.

అవి నేను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా పని చేస్తున్న రోజులు. అప్పటికే దంతవైద్య విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు అనేక పత్రికలకు రాసి వున్నాను. ఒక ప్రాంతీయ పత్రికకు వారం… వారం… రాస్తున్నాను.

ఆ నేపథ్యంలో అప్పుడు ఆంధ్రాబ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్న నా మిత్రుడు, శ్రీ వనం సదానంద్…. చనువు కొద్దీ… కాస్త సెటైర్‌గా… ‘ఎప్పుడూ ఆ వ్యాసాలేనా… కథలు రాయొచ్చు కదా!’ అన్నాడు. అప్పటికే, నేను కథలు రాయడానికి ప్రయత్నం చేసి సాధ్యం కాక…. ఆ ఆలోచనను తాత్కాలికంగా ప్రక్కన పెట్టాను. సదానంద్ మాత్రం నన్ను కథలు రాయమని చెప్తూనే వుండేవాడు. ఏది ఏమైనప్పటికి సదానంద్ మాటలు నాలోని కథా రచయితను మేల్కొలిపినట్టు అయింది. ఆ వారం ‘స్వాతి’ పత్రికలోని బాపు బొమ్మకు ‘ఆయుధం’ అనే పేరుతో కథ రాసి పంపిస్తే మరుసటి వారం ‘స్వాతి’లో వచ్చింది. సదానంద్‌ని ఆశ్చర్యపరిచింది. తరువాత, ఆ కథ చదివిన స్వర్గీయ శ్రీ పి.వి రమణ, శ్రీ పేర్వారం జగన్నాధంగారు కూడా నన్ను కథలు రాయమని ప్రోత్సహించారు. వారి ఆశీర్వాద ఫలితమే ఈ రోజు నేను ఒక రచయితగా గుర్తింపు పొందడం.”

డాక్టర్ ప్రశాంత్ చెప్పిన ఆ సమాధానాన్ని ఒకటి రెండు సార్లు చదువుకున్నాను. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన ఒక చిన్న సలహాను ఇంకా గుర్తుంచుకుని, ఆ సలహానే తను పెద్ద రచయిత అవడానికి నాంది పలికిందని తనలో లోపల అనుకోవడమే కాకుండా, బాహాటంగా… పది మంది తెలిసే విధంగా చెప్పడం అనేది…. నిజంగా ప్రశాంత్ గొప్పతనానికి, వినమ్రతకు అద్దం పడుతుంది.

‘హేట్సాఫ్… టు…. యు ప్రశాంత్’ అని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here