మలిసంజ కెంజాయ! -11

7
11

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[తమ ఇంటి గృహప్రవేశానికి తోడికోడలూ, బావగారూ రాలేదని అత్తగారితో అంటుంది రాణి. టిఫిన్ తిన్నాకా, అత్తగారికి ఏం ఇష్టమో కనుక్కుని అవి చేసిపెట్టమని వంటావిడకి చెబుతుంది. అత్తగారికి ఇల్లు చూపిస్తుంది, టెర్రస్ మీద పండిస్తున్న కూరగాయల మొక్కలనూ చూపిస్తుంది. కొడుకు రాజేష్ వచ్చి పార్వతమ్మని పలకరిస్తాడు. తన కొడుకులిద్దరూ ఒకరిలో ఒకరు ఎందుకు మాట్లాడుకోరో పార్వతమ్మకి అర్థం కాదు. వాళ్ళిద్దరూ కలిసుంటే బాగుంటుంది అనుకుంటుంది. అత్తగారిని బజారుకు తీసుకెళ్ళి చీరలు కొనిస్తుంది రాణి. శనివారం నాడు తన కొడుకూ కోడలు మనవరాలు వస్తున్నారని అత్తగారితో చెబుతుంది రాణి. మనవడు వేరు కాపురం పెట్టి ఎన్నాళ్ళయిందని పార్వతమ్మ అడిగితే రాణి చిన్నబుచ్చుకుని, నాలుగు నెలలయిందని అంటుంది. తన కోడలి గురించి చెప్తుంది. ‘నీకు నీ కొడుకు, కోడలూ, మనవలపై ఉన్న ఆపేక్షా నాకూ నా కొడుకు కోడళ్లపై ఉంటుంది గదా’ అనుకుంటుంది పార్వతమ్మ. వంటావిడ నాలుగు రోజులు సెలవు పెట్టిందని, కొడుకు కోడలి కోసం గబగబా టిఫిన్ సిద్ధం చేస్తుంది రాణి. రాజేష్ టిఫిన్ తిని బయటకి వెళ్ళిపోతాడు. కాసేపటికి రాణి కొడుకు సంతోశ్ ఒక్కడే వస్తాడు. అతని భార్యా, కూతురు రారు. నానమ్మని ఆప్యాయంగా పలకరిస్తాడు సంతోష్. కోడలూ మనవరాలు రానందుకు బాధపడ్తుంది రాణి. కొడుకు ఆమెకి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తాడు. టిఫిన్ తిని, వంట ఏం చేస్తున్నావని అడిగి వాతావరణాన్ని తేలిక చేస్తాడు. ఇక చదవండి.]

[dropcap]“అం[/dropcap]దరం ఉంటాం కదా అని రెండు కిలోల చేపలు తెప్పించాను. అవి రేపు వండుతాను. ఇవాళకి చికెన్ బిరియానీ, రైతా చేస్తాను. సాంబారుంది”

“మరి నాన్నమ్మకి?”

“ఆవిడకి పప్పూ మావిడి కాయా, మజ్జిగ పులుసూ, కొబ్బరి పచ్చడి చేసేసాను పొద్దున్నే. వంటావిడ లీవ్ నాలుగు రోజులు”

“అదీ సంగతి! అన్నీ నువ్వే చేసేసరికి నీకు చిరాగ్గా ఉంది. ఇలా కూర్చో ఆ బిరియానీ నేనే చేస్తాను. నాకు నేర్పించేసింది మీ కోడలు” అన్నాడు.

“ఇంకేం! ఉద్యోగం చేసింది కాకుండా వంటలు కూడా నువ్వే చెయ్యి. ఆ మాత్రం శ్రమ కూడా పడనివ్వకుండా కోడల్ని కూర్చోబెట్టు”

“లేదమ్మా! తనే చేస్తుంది. అవసరమయితే ఉంటుంది కదా అని నేనే నేర్చుకున్నాను అడిగి. అవును గానీ నానమ్మ కూరలు నేను తినకూడదా? అవి నాక్కూడా కావాలి” అన్నాడు కొంటెగా.

“ఏడిశావులే! చికెన్ బిరియానీ తిని పప్పు తింటావా?” అని నవ్వింది రాణి .

“ఏం తినకూడదా? అలా ఏమైనా రూలుందా నానమ్మా?” అంటూ నవ్వించాడు సంతోష్.

వైజాగ్‌లో తమ బంధువుల విశేషాలు కొడుకుతో చెబుతూ, కొడుకు చెప్పేవి వింటూ వంట పూర్తి చేసింది రాణి. ఇంతలో భర్త భోజనానికి రానని ఫోన్ చెయ్యడంతో ఇద్దరికీ వడ్డించింది రాణి. అత్తగారికి వంటలన్నీ అంటు కాకుండా కాస్త దూరంగా పెట్టి, కొడుక్కి చికెన్ వేపుడూ, బిరియానీ, రైతా కొసరి కొసరి వడ్డించింది. “నువ్వు కూడా తినమ్మా” అన్నావినకుండా వాళ్లిద్దరూ తిన్నాక తాను భోంచేసి టేబుల్ సర్ది వచ్చింది.

భోజనాలయ్యాక ముగ్గురూ పెద్ద హాల్లో చేరారు. అక్కడున్న దివాన్ కాట్ మీద పార్వతమ్మ నడుం వాల్చింది. రాణి కూడా సోఫాలో కొంత సేపు కళ్ళు మూసుకుంది. సంతోష్ వాట్సాప్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఓ అయిదు నిమిషాలయ్యాక అలసట తీరినట్టయింది రాణికి. అటు తిరిగి పడుకున్న అత్తగారు కదలడం మానేశారని నిర్ధారించుకున్నాక, కొడుకుని ఎదురుగా ఉన్న కుర్చీలోకి రమ్మని సైగ చేసింది.

“నాన్నా! నీకేమన్నా పనుందా? కొంచెం సేపు మాట్లాడొచ్చా?” అంటూ మెత్తగా అడిగింది రాణి.

“నాకేం పని లేదమ్మా!” అంటూ మొబైల్ పక్కన పడేసి, ఎదురుగా స్థిమితంగా సర్దుకుని కూర్చున్నాడు సంతోష్.

“అసలీ ఇంట్లో మీకేమి లోటు జరిగిందని ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టారో సూటిగా చెప్పు నాకు?” ఉక్రోషాన్ని అణచుకుంటూ అడిగింది రాణి.

“అమ్మా! అయిపోయింది కదా ఆ విషయం ఇప్పుడెందుకు? ఇంకా సంగతి వదిలెయ్యి. నాన్నా నువ్వూ హాయిగా ఉండండి. నువ్వు హాయిగా నీ మిత్రులతో కులాసాగా గడుపు. నాన్న ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ ట్రిప్‌కి వెళ్ళండి. సింగపూర్, మలేషియా లాంటి ప్రదేశాలకి వెళ్ళొచ్చుకదా!”

“మీ నాన్నకి తీరిక ఉంటుందా అసలు?”

“అలా అనుకుంటే నీ మిత్రులెవరైనా గ్రూప్‌గా వెళుతుంటే వెళ్లొచ్చు”

“మీ నాన్న లేకుండా నేను ఎక్కడికీ వెళ్ళను”

“ఇంకొన్నాళ్లలో నాన్న రిటైర్ అయిపోతారు. అప్పుడు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు”

“మీ నాన్న రిటైర్ అయినా ఆయన రియల్ ఎస్టేట్ గోల ఎప్పటికీ ఉంటుంది. ఆయనెక్కడికీ రారు సరేనా!”

“నానమ్మ వచ్చింది. నువ్వామెను కూడా చూసుకోవాలిప్పుడు”

“ఆ! ఆవిడేమీ ఒక నెల కంటే ఉండరులే”

“ఉండేట్టు చూస్తే ఉంటుందమ్మా”

“ఆవిడ సంగతి వదిలెయ్యి. ఆవిడని కూడా నేను చూసుకోగలను. నీ సలహాలు నాకక్కరలేదు గానీ, నువ్వు వేరు ఎందుకు వెళ్ళావసలు? ఇది చెప్పు?” అని నిలదీసింది రాణి.

“ఎందుకంటే ఏం చెప్పనమ్మా?”

“కోడలు ఏమన్నా అందా? నా గురించి?”

“ఏమీ అనలేదమ్మా!”

“అబద్దాలు చెప్పకు. తనేమీ అనకపోతే ఏ కొడుకైనా అమ్మా నాన్నలని వదిలి పోతాడా?”

“అంటే అమ్మా! ఏ కోడలికైనా స్వేచ్ఛగా భర్తతో విడిగా ఉండాలని ఉంటుంది కదమ్మా!”

“ఇక్కడ మీ స్వేచ్ఛకి ఏం తక్కువయ్యింది? పిల్లని కూడా నా దగ్గరే ఉంచుకుని, మిమ్మల్ని పంపాను కదా బైటికి? మీరిద్దరూ ఎక్కడికైనా తిరుగుతుంటే నేను అడ్డం వచ్చానా?”

“అడ్డం రాకపోయినా అత్తగారింట్లో అన్నీ ఆవిడ చెప్పినట్టుండాలి. నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టుంటాను అనుకుంటారు కోడళ్ళు”

“ఇక్కడ మీరు పైన బెడ్ రూమ్‌లో ఉంటున్నారు. పక్కనే బాల్కనీలో రోడ్ వ్యూ ఉంది. అయినా మీకు ప్రశాంతంగా లేదా?”

“నాకుంది కానీ తనకి లేదేమో!”

“ఏమిట్రా ఆ నంగనాచి మాటలు? అసలు నీ బాధ ఏంటీ అని ఆ పిల్లని అడగలేదా ఇప్పటి వరకూ?”

“ఇప్పుడడుగుతానమ్మా రేపు వెళ్ళాక”

“ఇంకెందుకు? ఇంట్లోంచి బైటికి వెళ్ళిపోయావు కదా!”

“అదే నేనూ అంటున్నది! నువ్వు అంటూ ఉంటావు కదా! అలా, అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకని?”

“జోకులెయ్యకు! అక్క మరి ఉమ్మడింట్లోనే ఉంది కదా! తోడికోడలితో, అత్తతో కలిసి?”

“వాళ్ళది బిజినెస్సు.. పైగా అక్క అత్తగారు మంచావిడ. తల్లిలా చూసుకుంటుందట కోడళ్ళని”

“అంటే నేను మంచిదాన్ని కాదా! రాక్షసినా? రాచి రంపాన పెట్టానా? కోడలిని ఇంకా కట్నమూ కానుకలూ తెమ్మని వేధించానా?”

“ఛ.. ఛ అలా ఎందుకనుకుంటున్నావమ్మా! అక్కకి అత్తగారితో ఉండడం ఇష్టమే కాబట్టి ఉంటోంది. మరి నీ కోడలు వేరుపడాల్సిందే అని పట్టుబట్టింది. నువ్వు కూడా సరే నన్నావు”

“పుట్టింట్లో కూర్చుని రానంది. అందుకే సరేనన్నాను”

“కదా! నేనూ అందుకే వెళ్ళిపోయాను. అంతే కానీ వేరే ఏమీ లేదమ్మా వదిలెయ్యమ్మా! ఆ విషయం”

“వదలను. నాకు కారణం తెలియాలి”

“ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నానమ్మా! ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిస్తే కొంత మనల్ని మనం మార్చుకోవచ్చు. దాంతో మనుషుల మధ్య సఖ్యత పెరుగుతుందని చెబుతున్నాను. అంతే కానీ నీ మీద కోపం అనుకోవద్దు. అమ్మ మీద ఏ కొడుక్కీ కోపం ఎప్పుడూ ఉండదు” అంటూ మొదలు పెట్టాడు సంతోష్.

“అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తావనీ, ఎదుటి వారి అభిప్రాయాల్ని కొట్టిపారేస్తావనీ, నీ కోడలి బాధ. కూర దగ్గర్నుంచీ పిల్ల గౌన్ వరకూ నీ ఇష్టానుసారం ఉండాలంటావట. వంటిల్లు నీ సొంత ఆస్తి అన్నట్టు గిన్నెల్నీ వస్తువుల్నీ కూడా ముట్టుకోనివ్వవట. ఎంతకాలం ఉన్నా ఇది నీ ఇల్లనీ కోడలైనా సరే ఆమె పరాయిదనీ అన్నట్టు చూస్తావట.

నీ వెంట గుడికంటే గుడికనీ, బంధువులింటికంటే బంధువులింటికనీ నీ వెనక తిరగకపొతే నీకు కోపం వచ్చేస్తుందట. అందుకని ఇష్టం లేకపోయినా నీ వెనకే తిరిగిందట. అందువల్ల తనకి విసుగ్గా ఉందట. ఇంకా నువ్వు ధనవంతురాలివని నీకు గర్వమట. వాళ్ళమ్మా వాళ్ళు పేదవాళ్ళన్నట్టు మాట్లాడతావట. వాళ్ళమ్మ ఇచ్చే వస్తువులన్నీ చీప్ అన్నట్టు చూస్తావట. వాళ్ళమ్మ మనవరాలికి కొన్న బట్టలు తక్కువరకంవి అని అర్థం వచ్చేట్టు మాట్లాడతావట. వాటిని పిల్లకు వెయ్యనివ్వవట. ఇలాగే ఏవేవో మనసులో చాలా పెట్టుకుని ఇక ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకుందట. నీకవేమీ తెలీక మామూలుగా ఉన్నావు. అవన్నీ తాను సీరియస్‌గా తీసుకుందని మనకి తెలీలేదు. అందుకే ఎదుటివాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా మనం ఆలోచిస్తూ మాట్లాడాలమ్మా!” అంటూ ముగించాడు.

“మనింటి కోడలు రిచ్‌గా ఉండాలనుకోవడం కూడా తప్పన్నమాట. నాకు తెలీలేదులే! నా మనవరాలు నాకు యువరాణి! అందుకే దానికన్నీ ఖరీదైన బట్టలు వేస్తాను అంటే, అది తను సంతోషించే విషయమే కదా! ఇంతలో ఆమె పుట్టింటి వాళ్ళ గొప్పతనం తగ్గిపోయిందని బాధ పడిందంటే నేనేం చెయ్యగలనూ?” రోషపడింది రాణి.

“అదిగో! అదే నేను చెప్పేది. మన కోరికలు మనకుంటాయి. వాళ్ళ కోరికలు వాళ్ళకుంటాయి. మనల్ని వాళ్ళర్థం చేసుకోవాలి అని మనం అనుకుంటాం. అలాగే వాళ్ళని మనం అర్ధం చేసుకోవాలి అని వాళ్ళనుకుంటారు. అక్కడే తేడా వస్తుంది. ఇలాగే మనుషుల మధ్య గొడవలొస్తాయి. అందుకే ఎవరి మీదా ఏదీ రుద్దకూడదు, అని తెలుసుకోవాలమ్మా!”

“అంటే ఇప్పుడు నాకు నువ్వు ఈ అరవయ్యోపడిలో పడే ముందు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నావన్న మాట. బావుంది. చాలా బావుంది. మా అమ్మ ఉద్దేశం ఇదీ! అని నువ్వు నీ పెళ్ళానికి చెప్పవన్న మాట. నాకు చెప్పేదేదో తనకి చెప్పొచ్చు కదా! పెద్ద తీర్పరిలా మాట్లాడుతూ ఉన్నావు కదా!”

“చెప్పలేదని ఎందుకనుకుంటున్నావు?”

“చెప్పినా వినలేదన్న మాట. ఇక ఇప్పుడు నాకు చెప్పొచ్చావన్నమాట. చాలా గొప్పవాడివిలే! ఇన్నాళ్లూ నువ్వేదో తెలివైన వాడివనుకున్నాను. నువ్వు కూడా పెళ్ళాం మాటకి తందాన తానా అనే వెంగళాయివేనని ఇవ్వాళ తెలిసింది నాకు” అంటూ సన్నగా ఏడుపు మొదలు పెట్టింది రాణి.

“అయ్యో! అమ్మా! అందుకే ఇన్నాళ్లూ ఏదీ చెప్పకుండా ఊరుకున్నాను. ఇవాళ చెప్పేవరకూ వదల్లేదు. చెప్పాక ఇలా అంటున్నావు. లోకం పోకడ ఇలాగే ఉంటుందమ్మా! మనమే గమనించుకుంటూ బతికెయ్యాలి”

“చాల్లే పెద్ద చెప్పొచ్చావు” అంటూ ఏడుపు కొనసాగించింది రాణి.

తల్లీ కొడుకుల సంభాషణ వింటున్న పార్వతమ్మ మనవడి మంచితనానికి ముగ్ధురాలయ్యింది. రాణి  మంకుపట్టూ, మూర్ఖత్వం అర్థం అయిందామెకి. ‘ఇంత చక్కగా తల్లిని సముదాయించే కొడుకులుంటారా లోకంలో?’ అనుకుంది.

“పిచ్చి అమ్మా! ఎందుకమ్మా! ఎక్కువ ఆలోచిస్తావు? హాయిగా ఉండక!” తల్లిని ఓదారుస్తూ అన్నాడు సంతోష్

“ఆలోచించకుండా ఎలా ఉంటానురా! ఈ ఊర్లోనే ఉంటూ దూరంగా ఉంటే నాకు చాలా అవమానంగా, బాధగా ఉంది”

“ఇందులో అవమానం ఏముంది? ఎంతో మంది తల్లి తండ్రుల దగ్గర ఉండకుండా విడిగా ఉంటారు. అందులో తప్పేం లేదమ్మా!”

“నువ్వు పాము చావకుండా, కర్ర విరక్కుండా మాట్లాడతావు తప్ప, నీ భార్యని కేకలేసి ఇక్కడే ఉందాం అనలేవు. ఇక్కడ నాకెంతో పెద్ద సర్కిల్ ఉంది. వాళ్లంతా ఏమనుకుంటారు? కోడలిని ఇబ్బంది పెట్టకపోతే ఎందుకు వెళ్ళిపోయింది అనుకోరా? ఒక్కొక్కళ్ళూ ఒకోలా మాట్లాడతారు. ఎంతమందికని నేను సర్ది చెప్పుకోవాలి? చెప్పినా నమ్ముతారా?”

రాణికి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. వాళ్ళిద్దరి సంభాషణా వింటూ పార్వతమ్మ ‘రాణి  మనసు లోలోపలి బాధ ఇప్పుడు బైటికొచ్చింది. భర్త ఇంట్లో లేకపోవడం, వంట మనిషి సెలవులో ఉండడం, నేను నిద్రపోయాననుకోవడం వల్ల అసలు బాధ వెళ్లగక్కింది. ఇంతకన్నా మంచి అవకాశం రాదనుకుని మనసు విప్పుతోంది. కోడలిని తనతో ఉంచుకుని, మంచి అత్తగారిలా పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డట్టుంది పాపం. ఇప్పుడు కోడలు కోడలు అని కలవరిస్తోంది కానీ ఏనాడైనా నా ఇంటికి కోడళ్ళు వచ్చి పది రోజులు ఉండమంటే ఉన్నారా? పిల్లల శలవులన్నీ అమ్మ గారింట్లో గడిపి వెళ్లేప్పుడు ఒక్కరోజు ఉండి, మీ అబ్బాయికి సెలవు లేదంటూ పారిపోయేవారు. తన దాకా వస్తే కానీ అంటారందుకే. వచ్చినా అర్థం కాదులే రాణి లాంటి వాళ్ళకి’ అనుకుంది.

తల్లి బాధ అర్థం చేసుకున్న సంతోష్, “అమ్మా! కేకలేసీ, భయపెట్టీ కాపురాలు చెయ్యలేమమ్మా! సర్దుకుపోవాలి కానీ. అది అందరికీ మంచిది. ఈ వారం మీ కోడలు రాలేదనే కదా నీ బాధ? వచ్చేవారం తప్పకుండా తీసుకొస్తానమ్మా!” అని మళ్ళీ తానే “ఒక ఐడియా! నానమ్మని తీసుకెళ్లి పోతాను రేపు రాత్రికి. ఒక వారం ఉంటుంది నా దగ్గర. అందరం కలిసి వచ్చేస్తాం వచ్చేవారం” ఉత్సాహంగా అన్నాడు. ఆ మాటకి కస్సుమంటూ, “ఏం వద్దు. నా మీద, నీ భార్య నానమ్మకి లేనిపోవన్నీ చెప్పి ఆవిడ మనసు విరిచేస్తుందేమో!” అంది.

ఆ మాటకి చిన్నబుచ్చుకున్న సంతోష్ “ఏమున్నాయమ్మా? నీ మీద చెప్పడానికి. నువ్వు తననెంతో ప్రేమగా చూసుకునేదానివి. పిల్లనైతే గుండెల్లో పెట్టుకుని పెంచేదానివి”

“ఓహోహో! ఓదార్పు మాటలా ఇవి? చిన్నప్పటి నుండీ మా అమ్మా నాన్నా నన్నెంతో గారంగా పెంచారు. మీ నాన్న కూడా నన్నొక్క మాట అని ఎరగరు. ఇన్నాళ్ళకి నీ భార్య చేత ఇన్ని మాటలు పడుతున్నాను. ఇవన్నీ నానమ్మకి చెప్పి నా మీద పంచాయితీ పెట్టించాలనా నీ దంపతుల ప్లాను?” ఆమె కంఠం మళ్ళీ రుద్దమయింది.

‘దీని గయ్యాళితనం రెండంచుల కత్తిలాగుంది సుమీ’ అనుకుంది పార్వతమ్మ.

“అన్నిటికీ అలా భయపడకూడదు. నీకు నీ కొడుకు ఫ్యామిలీ నీతో ఉండాలని ఉంది. ఆమెకి లేదు. మన కోరికలు మనకుంటే వాళ్ళ కోరికలు వాళ్ళకుంటాయి కదా! అనుకుని తేలిగ్గా తీసుకోవాలి కానీ మనసుకి పట్టించుకుని మన సుఖాన్ని పాడు చేసుకోకూదమ్మా!” అనునయంగా అంటున్న మనవడి మాటలు వింటూ పార్వతమ్మ ఆనందపడింది. ‘బంగారు తండ్రి నూరేళ్ళకీ నవ్వుతూ ఉండాలి’ అనుకుంది.

“మన ఇష్టాలని ఇంకొకళ్ళమీద రుద్దకూడదమ్మా! అలా చేస్తే విభేదాలొస్తాయమ్మా! నువ్వూ నాన్నా హాయిగా సంతోషంగా ఉండండి నా మాట విని. మా ఇంటికి భోజనానికి రండి నెలలో ఒక రోజు” అన్నాడు తల్లిని బుజ్జగిస్తూ సంతోష్.

“మంచిది. చాలా సంతోషం నాయనా!” అంటూ వెటకారం చేస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది రాణి.

“లే నానమ్మా! ఎంత సేపు పడుకుంటావు? నాకు బోర్ కొడుతోంది. నువ్వొక్కదానివీ అక్కడ రోజూ ఎలా కాలక్షేపం చేస్తావు చెప్పు?” అంటూ పార్వతమ్మని లేపి ఆమెతో కబుర్లు మొదలుపెట్టాడు సంతోష్.

ఆవిడ లేచి మొహం కడుక్కుని వచ్చి వసంతతో మొదలు పెట్టి, ఆమె తనకి ఎలా సహాయకారిగా ఉంటూ తనని ఎలా కనిపెట్టుకుని చూస్తోందో చెప్పడం మొదలు పెట్టింది. వంటింట్లోంచి అన్నీ వింటున్న రాణి  మొహం మాడ్చుకుంది. ‘ఈవిడ గోల ఈవిడది’ అనుకుని, ముక్కు విరుచుకుని బజ్జీలు వెయ్యడం మొదలు పెట్టింది. బజ్జీలు చేసి ఇద్దరికీ పెట్టి, టీ చేసేసరికి భర్త వచ్చాడు. మర్నాడంతా తండ్రి ఇంట్లోనే ఉండడంతో ‘అమ్మయ్య అమ్మతో ముఖాముఖీ బాధ తప్పింది’ అనుకుని, ఆ సాయంత్రం వెళ్ళిపోయాడు సంతోష్.

కోడలి నిరుత్సాహం చూస్తూ, ‘బాగానే ఉంది వరస. తీరి కూర్చుని కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే. మొగుడికి మంచి ఉద్యోగం, బోలెడు సంపాదన, కొడుకూ, కూతురూ ఉన్న ఊరిలోనే ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు వెళ్లి రావచ్చు. వాళ్ళూ వచ్చి పోవచ్చు. రైళ్ళూ, బస్సులూ ఎక్కక్కర్లేదు. కావలసినట్టు కట్టుకున్న లంకంత కొంప. ఇంకేం కావాలి? సుఖపడడానికి? అనుకోకుండా కోడలు వేరు కాపురం పెట్టినందుకు బాధగా ఉందట. నోరెక్కువ కదా! వాళ్ళకీ, వీళ్లకీ తీర్పులు దిద్ది ఉంటుంది. ఇప్పుడు వాళ్లంతా తిరిగి దెప్పుతారని బెంగ కాబోలు. నోటి దురద ఉన్నవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి. అణకువగా ఉండేవాళ్ళకి ఇలాంటి బాధలుండవు. బాగా అయ్యింది. ఆ మాత్రం గర్వం అణచాలి భగవంతుడు. లేకపోతే నా అంత తెలివిమంతురాలు జగాన లేరని విర్రవీగేదే అమ్మగారు’ అనుకుని నవ్వుకుంది పార్వతమ్మ.

రాబోయే ఆదివారం కోసం ఎదురు చూసారు అత్తా కోడళ్ళు సంతోష్ భార్యనీ పిల్లనీ తీసుకొస్తానన్నాడు కదా! అని. కానీ ఆ ఆదివారం చెప్పకుండా పదకొండు గంటలకి మనవరాలు శివానీ, భర్తా, కొడుకూ వచ్చారు.

రాణి  మొహం ఆనందంతో వెలిగిపోయింది. “అనుకుంటూనే ఉన్నాను మొన్నాదివారం రాలేదంటే ఈ ఆదివారం వస్తావని” అంటూ కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించింది మనవడిని ఎత్తుకుంటూ. శివానీ తాను తెచ్చిన స్వీట్ పాకెట్ విప్పి అందరికీ తలొకటీ ఇచ్చింది. రాణి టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది.

శివానీ నానమ్మ పక్కనే కూర్చుని ఆమె నోటికి స్వయంగా స్వీట్ తినిపించి, ఆమెను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టి, “ప్రణవ్! నీకే కాదు నాకూ ఉంది నానమ్మ! మా నానమ్మ” అంది వాడిని ఊరిస్తూ. వాడు వెంటనే వచ్చి పార్వతమ్మ ఒడిలోకెక్కాడు. ముద్దులు మూటకడుతున్న వాడిని దగ్గరగా తీసుకుని ముద్దుపెట్టుకుంది పార్వతమ్మ. వాడు ఆమె ఒడిలో సర్దుకుని, సర్దుకుని కూర్చున్నాడు. శివానీ భర్త “వాడిని పక్కన కూర్చోబెట్టు. ఆవిడ మొయ్యలేరు వాడిని” అన్నాడు. శివానీ వాడిని ఒడినుంచి “ఫర్వాలేదులే కూర్చొనియ్యి” అని పార్వతమ్మ అంటున్నా దింపి పక్కనే కూర్చోబెట్టింది. వాడు నిజంగానే ఇనప గుండులా ఉన్నాడు. కానీ చాలా ముద్దుగా ఉన్నాడు. వాడు తాతమ్మ మీద వాలి టీవీ చూస్తూ మధ్యలో ఆమె బుగ్గలు నిమురుతున్నాడు. కొంచెం వదులుగా, ఉన్నఆమె చర్మంతో ఆటలాడుతూ పార్వతమ్మని నవ్వించాడు కూడా.

శివానీ భర్త టీవీలో క్రికెట్ పెట్టి కూర్చున్నాడు. రాణి, శివానీ వంటింట్లో కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వంటలు మొదలు పెట్టారు భారీ ఎత్తున. ఈ సందట్లో కొడుకు కోడలిని తీసుకుని రాలేదన్న విషయమే మర్చిపోయింది రాణి .

పార్వతమ్మకి కాస్త నిద్ర తూలు వచ్చింది. “మీరు కాసేపు పడుకోండి మామ్మా!” అంటూ పిల్లాడిని ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు శివానీ భర్త. “అలాగే బాబూ! మీ అమ్మా నాన్నా అంతా బావున్నారా?” అని పలకరించి తన రూమ్‌లో కెళ్ళి పడుకుంది పార్వతమ్మ. కాస్త అలసట తీరాక ఆలోచనలో పడి, ‘అమ్మయ్య! మనవరాలిని కూడా చూసేసాను! ఇంక నిశ్చింతగా ప్రయాణం కడతాను’ అనుకుందామె.  కొడుకుని ఎలా అడగాలీ? అని మళ్ళీ ఆలోచనలో పడింది. ‘రెండు రోజులాగాక నెమ్మదిగా కొడుకు దగ్గర తను వెళ్లే ప్రసక్తి తేవాలి. ముందు అసలు నువ్వు తిరిగి వెళ్లే అవసరమే లేదు అంటాడు. ఓ రెండురోజుల తర్వాత మళ్ళీ అడిగినప్పుడు కాస్త మెత్తబడి ఓ రెండునెలలు ఉండమ్మా! అంటాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తానురా అబ్బాయీ, అన్నప్పుడు, నీకు అక్కడ ఏకాంతంగా రెస్టుగా ఉంటుంది. ఇక్కడ ఏదో హడావిడిగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండదు అంటూ సరేనని వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాడు. ఇదివరకు రైల్‌లో గానీ, బస్సులో గానీ టికెట్ తీసేవారు కొడుకులిద్దరూ. ఈ ఎనభయ్యోపడిలో పడ్డాక కారు మాట్లాడి పంపుతున్నారు. అదో సుఖం వచ్చింది ముసలరికం పెరిగాక’ అని నవ్వుకుంది పార్వతమ్మ. మరో గంటలో ఆమెకి పిలుపొచ్చింది. “మీరు నిద్రపోయారు. అమ్మాయికీ అల్లుడికీ పెట్టేసాను భోజనం. మనిద్దరం తిందాం” అంటూ ఇద్దరికీ వడ్డించింది కోడలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here