మలిసంజ కెంజాయ! -12

9
11

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[కొడుకు సంతోష్‌కి ఇష్టమైన వంటలు చేయాలనుకుంటుంది రాణి. బిరియానీ చేస్తానంటుంది. వంటమనిషి లేకపోవడంతో అన్నీ వంటలూ అమ్మే చేస్తుండడంతో ఆమెకి చిరాకుగా ఉందని అని, బిర్యానీ తాను చేస్తానంటాడు సంతోష్. వద్దని కొడుకుతో కబుర్లు చెబుతూ వంట పూర్తి చేస్తుంది రాణి. భోజనాలయి పార్వతమ్మ నిద్రపోయిందని నిర్ధారించుకున్నాకా, కొడుకుతో నెమ్మదిగా మాట్లాడుతుంది రాణి. వేరు కాపురం ఎందుకు పెట్టారో చెప్పమని నిలదీస్తుంది. అయిపోయిన సంగతి ఇప్పుడెందుకని అంటాడు సంతోష్. తల్లి గట్టిగా అడిగిన మీదట కారణం చెప్తాడు. తల్లి బాధపడితే, ఓదారుస్తాడు. మెలకువ వచ్చి తల్లీ కొడుకుల సంభాషణ వింటున్న పార్వతమ్మ మనవడి మంచితనానికి ముచ్చటపడుతుంది. తల్లి దుఃఖం ఆగకపోవడంతో, సర్దుకుపోవాలంటూ మరింత నచ్చజెప్తాడు సంతోష్. మన ఇష్టాలని ఇంకొకళ్ళమీద రుద్దకూడదనీ, అలా చేస్తే విభేదాలొస్తాయనీ అంటాడు. దాంతో లేచి అక్కడ్నించి వెళ్ళిపోతుంది రాణి. కాసేపు నానమ్మతో కబుర్లు చెప్తాడు సంతోష్. తర్వాతి ఆదివారం రాణి కూతురు శివానీ భర్తతోనూ, కొడుకుతోను ఇంటికి వస్తుంది. నానమ్మని ఆప్యాయంగా పలకరిస్తుంది. పార్వతమ్మ శివానీ భర్తని పలకరించి తన గదిలోకి వెళ్ళి కాసేపు నిద్రపోతుంది. ఒక గంట తర్వాత భోజనం వడ్దిస్తుంది రాణి. ఇక చదవండి.]

[dropcap]‘వా[/dropcap]ళ్ళు పడుకున్నట్టున్నారు. చప్పుడు లేదు’ అనుకుంది పార్వతమ్మ. అత్తాకోడలూ హాల్‍లో టీవీ ముందు కూర్చున్నారు.

మూడుగంటల కల్లా వాళ్ళు నిద్ర లేచారు. శివానీ “అమ్మా! మర్చిపోయాను. మా అత్తగారు నీకు ఈ కాలిఫ్లవర్ ఆవకాయ ఇమ్మన్నారు. ఈ జంతికలు కూడా!” అంటూ ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చింది. “ఎందుకే పాపం ఆవిడకి శ్రమ” అంది పార్వతమ్మ మర్యాదగా.

“ఆవిడకేమీ అంత బాగా వంటలు రావత్తయ్యా!” అంది కొట్టిపారేస్తూ రాణి.

“వేరుశనగపప్పు నూనె వేసిందో. మామూలు నూనె వేసేసిందో” అంది ఆవకాయ సీసా మూత విప్పి వాసన చూస్తూ. జంతికలు కవరు విప్పి “అబ్బే! గుల్లగా లేవు గట్టిగా ఉన్నాయి” అంది పెదవి విరుస్తూ. ‘వియ్యపురాలు ప్రేమతో ఏవో పంపినప్పుడు పిల్ల ముందే అలా అంటే దానికెలా ఉంటుంది? అలా అత్తగారిని తక్కువ చేసి మాట్లాడితే దానికి కూడా ఆ చులకన భావం కలుగుతుంది కదా! తప్పు అలా మాట్లాడకూడదు’ అని చెప్పాలనిపించింది పార్వతమ్మకి. ‘అసలే నోరెక్కువ రాణికి. ఏదో ఒకటి అంటే శివానీ ముందు నా పరువు పోతుంది’ అనుకుని ఊరుకుంది పార్వతమ్మ.

‘కోడలికి అహంకారం. తానే గొప్ప. తనకే అన్నీ తెలుసు. తానే తెలివయ్యింది. ఇదో అతి తెలివితనం. ఒక పక్క కోడలు ఈ దాష్టీకం భరించలేకే తప్పుకుంది. అయినా రాణి నోటి దురుసుతనం పోలేదు. మనుషులు మొట్టికాయల అనుభవాలు ఎదురవుతున్నా, దాని నుంచి ఏదీ నేర్చుకోరేమో!’ అనుకుని నిట్టూర్చింది పార్వతమ్మ. రాత్రి వరకూ ఉండి భోంచేసి బయలుదేరారు శివానీ భర్తా, పిల్లాడూ. శివానీ “మరొకరోజు ఉంటాను నానమ్మతో” అంది భర్తతో. పిల్లాడి చేతిలో ఒక వెయ్యీ, మనవరాలి చేతిలో రెండువేలూ పెట్టింది పార్వతమ్మ. ఇద్దరూ కాళ్ళకి నమస్కారం చేశారు. పార్వతమ్మ “మంచి అలవాట్లు నేర్పించావే పిల్లాడికి” అంది. “మా అత్తగారు నేర్పారు. ఆవిడకి ఇలా పద్ధతిగా ఉండడం ఇష్టం” అంది శివానీ. ఈ పిల్లకి అత్తగారంటే గౌరవం ఉంది. తల్లి అలా ఆమెను చిన్నబుచ్చడం ఇష్టముండదు కానీ, తల్లికి ఏమీ చెప్పలేక మనసులోనే బాధపడుతుంటుంది అనిపించింది పార్వతమ్మకి.

శివానీ మావగారు రామం గోదావరి జిల్లాల వాడే. చదువు అంత బాగా రాలేదు. ఇంటర్ దాటలేకపోయాడు. ఆయన తండ్రి సామాన్య వ్యవసాయదారుడు. పెద్ద కొడుకు పాలిటెక్నిక్ చదివి ఉద్యోగం సంపాదించి తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఒక కేంద్రప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడ్డాడు. శివానీ మావగారి తండ్రి ఊరివాళ్ళు కొందరు కాంట్రాక్టు పనులు చేసే ఉద్దేశంతో వైజాగ్ చేరారు. వాళ్ళ పని బానే ఉందని తెలిసాక తండ్రి శివానీ మావగారు రామంని అక్కడికి పంపాడు. మొదట్లో వాళ్లకు సహాయకుడిగా ఉన్న రామం నెమ్మదిగా తానే స్వయంగా చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. రామంకి ఇద్దరూ కొడుకులే, శివానీ భర్త చిన్నవాడు. అందుకే

మావగారు ఇద్దరు కొడుకులని చదివించాలన్న ఉద్దేశం పెట్టుకోకుండా టెన్త్ కాగానే తన దగ్గరే ఉంచుకుని పని నేర్పడం మొదలు పెట్టాడు. ఆ విధంగా వాళ్ళు మరి కాస్త పెద్ద కాంట్రాక్టులు మొదలు పెట్టి ప్రస్తుతం ఒరిస్సాలో స్థిరపడ్డారు. ఒరిస్సాలో ఫ్యామిలీతో ఉండడం కష్టం అనుకుని మకాం మాత్రం వైజాగ్ నుంచి ఎప్పుడూ మార్చలేదు. వెళుతూ వస్తూ ఉంటారు తండ్రీ ఇద్దరు కొడుకులూ.

అది చూసే రాజేష్ ఉద్యోగాలు చేసి ఏం సంపాదిస్తాం? వైజాగ్‌లో కోట్లకు పడగలెత్తింది కాంట్రాక్టర్‌లే అన్న భావంతోనే తన కూతురుని, రామం చిన్న కొడుక్కి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేసాడు. ఆ కుర్రాడు నెమ్మదస్థుడు. కష్టపడే మనస్తత్వమున్నవాడు. కొడుకులిద్దరికీ చెరొక కారూ కొనిపెట్టాడు తండ్రి.

ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్లు అయ్యాయి. చెరొక కొడుకు ఉన్నారు వాళ్ళకి. ఉమ్మడి శ్రమ కాబట్టి కుటుంబం కూడా ఉమ్మడిగానే ఉంది. శివానీ, తోటికోడలూ బాగా కలిసిపోయారు. రాణికి మాత్రం తన కూతురు అలా అత్తగారూ మావగారితో, బావగారూ తోటికోడలితో కలిసి కాపురం ఉండడం నచ్చదు. ఎవరి ఫ్యామిలీ వాళ్లకుంటే స్వేచ్ఛగా ఉంటారు కదా! లేకపోతే అత్తగారి కనుసన్నలలో ఉండాలి కదా! అని ఆమె బాధ. శివానీ అత్త మావలది మేనరికం వివాహం.శివానీ అత్తగారు మధ్య తరగతి నుంచి వచ్చినది. చక్కని పనిమంతురాలు. పొదుపరి. మధ్యలో కాంట్రాక్టుల వల్ల సిరి పెరిగినా ఆ గర్వాన్ని బుర్రలోకి ఎక్కించుకోకుండా నిరాడంబరంగా ఉండాలనుకుంటుంది. అత్యంత ఆడంబరంగా ఉండాలనుకునే రాణికి ఆమెని చూస్తే వళ్ళు మండుతూ ఉంటుంది. బోలెడు సంపాదిస్తూ ఉన్నప్పుడు డైమండ్ దుద్దులూ, డైమండ్ గాజులూ, హారాలూ కొనుక్కుని కోడళ్ళిద్దరికీ కొనివ్వొచ్చుకదా అని కోపంగా ఉంటుంది రాణికి ఆవిడ మీద.

మర్నాడు రాణి వంట చేసుకుంటూ ఉంటే రాజేష్ “శివానీ! నానమ్మని ఏదైనా గుడికి తీసుకెళ్లవే” అన్నాడు ఆఫీసుకి వెళుతూ. “అలాగే నాన్నా!” అంటూ నానమ్మని వెంటబెట్టుకుని కనకమహాలక్ష్మి గుడికి తీసుకెళ్లింది శివానీ. దారిలో వస్తూ వస్తూ ఒక బట్టల షాప్‌కి తీసుకెళ్లి ఆమెకి నప్పే మంచి నేత చీరొకటి వద్దంటున్నా కొని ఇంటికి తీసుసుకొచ్చింది శివానీ.

ఇంటికి రాగానే తల్లికి చూపించింది. “ఉమ్మట్లో ఉన్నావు నీకు డబ్బులెక్కడివే?” అంది తల్లి. “నాకు మా ఆయన ఇస్తుంటారులే” అంది శివానీ.

మధ్యాన్నం భోజనాలయ్యాక హాల్‌లో చేరారు ముగ్గురూ. పార్వతమ్మ దివాన్ కాట్‌పై అలవాటుగా వాలింది. శివానీ వచ్చినప్పుడల్లా ఒక రోజు తల్లి దగ్గర ఒంటరిగా ఉండాలి. ఎప్పుడొచ్చినా పిల్లాడూ, భర్తా ఒక రోజుండి వెళ్లిపోతుంటారు.

“ఏమిటే విశేషాలు? ఏమంటుంది మీ పిసినారత్తమ్మ?” అంది వక్క పలుకులు నోటిలో వేసుకుంటూ రాణి.

“పోనీలే అమ్మా! మంచావిడే కదా!” అంది శివానీ.

“మంచిది కాక ఏం చేస్తుంది? భర్తా, కొడుకులూ కలిసి చేసేవి ఉమ్మడి కాంట్రాక్టులు. అందుకే అందరితో మంచిగా ఉంటుంది. కొడుకులు విడిగా పనులు చేసుకుంటే వాళ్ళకే నష్టం కనుక అలా తియ్యగా మాట్లాడుతూ ఉంటుంది. తక్కువదేమీ కాదులే ఆవిడ. నోరిప్పదు. మాట్లాడదు. తెలివిగా పనులుచేసుకుంటూ ఉంటుంది”

“మా తోడికోడలు కూడా మంచిదే!”

“బాగా అణిగి మణిగి ఉన్నట్టు గొప్పగా నటిస్తుందిలే ఆ పిల్ల!” అంది రాణి  నవ్వుతూ.

“నటిస్తుందని ఎందుకనుకుంటావూ? నన్ను సొంత అక్కలా చూసుకుంటుంది!” అంది శివానీ.

“నువ్వొక పిచ్చి మొద్దువి. అందరూ మంచివాళ్ళే అనుకుంటావు.”

వింటున్న పార్వతమ్మ అనుకుంది, ‘ఇలాగే కదూ! తల్లులు పిల్లల బుర్రల్లో విషం నింపేది’ అని.

ఆ తర్వాత మరి కొంచెం గుసగుసగా నెమ్మదిగా ఏవో మాట్లాడడం మొదలు పెట్టింది రాణి. కూతురు అయిష్టంగా టాపిక్ మార్చడానికన్నట్టు “ఇంకేంటి విశేషాలు? నీ కాళ్ళ నెప్పులెలా ఉన్నాయి?” అంటోంది.

“చెప్పేది విను పిచ్చిమాలోకమా? మీ ఆయన్ని వేరే కాపురం పెట్టమని అడుగు. ఆ తర్వాత నేను కూడా అడుగుతాను” అంది రాణి  నెమ్మదిగా.

“చాల్లే! ఆ పని మాత్రం చెయ్యకు. నా మీద దయ ఉంచి, నా పరువు పోతుంది” అంది శివానీ కంగారుగా.

“చాల్లే! తింగరిమాటలు. నేను చెప్పేది, మీ మంచి కోసమే కదా! విని తలకెక్కించుకోవే పిచ్చిమొద్దా!” అంది రాణి.

“అమ్మా! నానమ్మని మా ఇంటికి తీసుకెళతానే! ఓ వారం ఉంచుకుని పంపిస్తా”

“ఎక్కడికీ తీసుకెళ్లేది? ఆ ఉమ్మడి దమ్మడి ఇంట్లోకా?” విసురుగా అంది రాణి.

“ఏమవుతుందమ్మా! మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా గెస్ట్ రూమ్ లున్నాయిలే” అంది ఉక్రోషంగా కూతురు.

“నువ్వు వేరు కాపురం పెట్టినప్పుడు తీసుకెళుదువుగాన్లే అంటున్నాగా!”

తల్లి గొంతులోని తీక్షణతకి శివానీ నోరెత్తలేదు. “పదా! నేను కొన్న కొత్తచీరలు చూడు. నీకు నచ్చితే తీసుకెళ్ళుకొన్ని” అంటూ కూతురిని తమ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది రాణి.

మర్నాడు శివానీ బయలుదేరింది. అమ్మలేని సమయం చూసి నానమ్మని కౌగలించుకుని, ముద్దుపెట్టుకుని “వెళ్ళొస్తాను నానమ్మా!” అంది శివానీ.

“అలాగే తల్లీ! పండగ నాడన్నా నాకు ఫోన్ చేసి నానమ్మా! అని పలకరించవా బంగారూ!” కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అంటున్న నానమ్మని చూసి శివానీకి కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. “ఇదిగో నానమ్మా! ఒట్టేస్తున్నాను. ప్రతీ పండక్కీ నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను సరేనా!” అంటూ చేతిలో చెయ్యివేసింది శివానీ. మనవరాలిని గుండెలకు హత్తుకుని తలపై చెయ్యివేసి “భర్తతో, బాబుతో నూరేళ్లు సంతోషంగా ఉండు బంగారం!” అని దీవించింది.

రాణి  చేతిలో రెండు ప్యాకెట్లు తీసుకుని వస్తూ “నీ కేదైనా తినడానికి ఇవ్వబుద్ధే కాదు. అక్కడందరితో కలిసి తినాలి. నువ్వూ మీ ఆయన దాచుకుని తినడానికి కుదరదు” అంది.

‘పిల్లని ప్రశాంతంగా కాపురం చెయ్యనిచ్చేట్టు లేదు ఈ మహాతల్లి’ మనసులో గొణుక్కుంది పార్వతమ్మ.

“అందరూ కలిసి తింటే ఇంకా బావుంటుందమ్మా! మా మావగారు మా తోడికోడళ్ళకీ, మనవలికీ, కొడుకులకీ అందరికీ తలా ఒకరకం మాకిష్టమైనది కొని తెస్తూ ఉంటారు. తండ్రిలా చూసుకుంటారమ్మా మా ఇద్దరినీ!” అంది శివానీ.

“చిన్నపిల్ల కదత్తయ్యా ! అందరూ మంచివాళ్ళే! అనుకుంటుంది” అంది రాణి  అత్తగారి వత్తాసు కోరుతూ.

“అంతేనమ్మా! ఎలా అనుకునే వాళ్ళకి అలా జరుగుతుంది మంచైనా, చెడైనా. దానిమనసు బంగారం అందుకే ఆ కుటుంబంలో అలా కలిసిపోయింది” అంది పార్వతమ్మ గర్వంగా. ఆ మాటకి రాణికి చిర్రెత్తింది. అయినా తమాయించుకుని కూతుర్ని ముద్దుపెట్టుకుని సాగనంపింది.

ఒక రోజు సోఫాలో పక్కపక్కన కూర్చున్నప్పుడు అడిగింది రాణి. “మీ పెద్దకోడలు, అదే మా తోడికోడలు నా మాటేమీ ఎత్తలేదా ? ఎప్పుడూ?”

“లేదమ్మా” అంది పార్వతమ్మ.

“ఒక్కసారైనా మా గురించి మాట్లాడకుండా ఉంటారా ఆ నెలలో? మీరు చాలా గడుసువారు. ఏదీ చెప్పరు” అంది కినుకగా.

అత్తగారు ఏమీ మాట్లాడకపోవడం చూసి “అలాగే ఇక్కడ జరిగేవి కూడా అక్కడ చెప్పకండెప్పుడూ” అంది అక్కసుగా.

ఆ మాటకి పార్వతమ్మకి కోపం వచ్చింది. అయినా బయటపడకుండా “ఏమున్నాయిక్కడ? అక్కడికి మోసుకుపోయి నేను చెప్పడానికి?” శాంతంగా అంది.

ఆ మాటలోని విరుపు అర్థం చేసుకున్న రాణి  సర్దుకుంటూ “ఊరికే సరదా కన్నానత్తయ్యా!”అంటూ నవ్వేసింది.

తాను కూడా నవ్వేసి ‘హన్నా! మాటలతో గిల్లడం అంటే ఇది కాదూ! నేనేమన్నాఉడుక్కుంటే ఇప్పుడు అల్లరే కదా!’ అనుకుంది పార్వతమ్మ మనసులో, అక్కడినుంచి లేచి వెళుతూ.

ఒకరోజు సాయంత్రం కిట్టీ పార్టీకి కలిసి వెళ్ళడానికి వచ్చిన రేణుకని కూర్చోమని తయారవుతోంది రాణి. పార్వతమ్మని పలకరించి పరిచయం చేసుకుని ఇల్లంతా స్నేహంగా తిరుగుతోంది రేణుక.

“రాణి! మీరు గత నెల కిట్టీ పార్టీకి రాలేదు కదా! ఒంట్లో ఏమన్నా బాలేదా? అని చూద్దామని వచ్చేసాను” అంది రేణుక.

“మంచి పని చేశారు. స్నేహం అంటే అదే మరి. మనసు బాలేక రాలేదంతే! ఇదిగో మంచి కాఫీ తాగండి” అంటూ అత్తగారికి ఆమెకూ అందించి తానూ తెచ్చుకుంది. ముగ్గురూ టీపాయ్ చుట్టూ కూర్చున్నారు. “ఏంటి? రేణుకా మన ఫ్రెండ్స్ అంతా అంటున్నారు, మీరెప్పుడూ మీ కోడలినేసుకుని సినిమాలకీ, షాపింగ్ లకీ తిరుగుతుంటారట?” వెక్కిరిస్తూ అంటోంది రాణి.

“అవున్నిజమే” అందామె నవ్వుతూ, కొంచెం కూడా చిన్నబుచ్చుకోకుండా.

పార్వతమ్మ కోడలి నోటి దురుసుకీ, రేణుక నిదానానికీ ఆశ్చర్యపోతూ వింటోంది.

“అంతలా కలిసిపోయిందా మీ కోడలు మీతో?”

“తాను కలవక పోయినా నేనే కలిపేసుకున్నాను”

“అంటే?”

“అంటే నేను మా అబ్బాయింటికి వెళ్లినా నేనే అన్ని వంటలూ చేసి పెట్టేస్తాను. ఆ పిల్ల ‘థాంక్స్ అత్తయ్యా!’ అంటూ ఎంతో సంతోషపడిపోతుంది”

“పడదా మరి! ఇంత అమాయకురాలైన అత్త దొరికిందని” నవ్వింది రాణి.

“ఇక్కడికొస్తే సరే సరి. బోలెడు రకాలు వండుతాను”

“వంట పనులన్నీ చేసిపెట్టాక మిమ్మల్ని బైట తిప్పుతుందన్న మాట”

“ఎంతిష్టమో తనకి అలా తిరగడం! విసుగూ, విరామం లేకుండా చీరల షాపులకీ, హోటళ్ళకీ సినిమాలకీ ఓపిగ్గా తిప్పుతుంది నన్ను”

“కోడలన్నాక కాస్త ఇంటిపనుల్లో మనకి సాయం చెయ్యకపోతే ఎట్లా?”

“ఇంకా చిన్నతనం. కొన్నాళ్ళయ్యాకా చేస్తుందేమో!”

“ఇప్పుడే చెయ్యనిది తర్వాత అస్సలు చెయ్యదు” తీర్మానించింది రాణి.

“పోనిద్దురూ. ఈ కాలం ఆడపిల్లలంతా అలాగే ఉన్నారు. చేయాలనుకుని వాళ్ళకి బుధ్ధి పుట్టి చెయ్యాలి తప్ప మనం బలవంతంగా చేయించలేము రాణి”

“అలా అని వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటే మన అత్తరికం ఏమయినట్టు?”

“మన పిచ్చి గానీ, అలాంటి భ్రమలకి పోకూడదు ఈ రోజుల్లో. వాళ్లతో స్నేహితులల్లే కలిసిపోవడమే మంచిది. అలా కాకుండా ఇలా ఉండు! అలా చెయ్యి! అంటే మాత్రం చేస్తారా? మనం ఏదో ఒకటి అనీ, దాన్ని ఆ పిల్ల వాళ్ళమ్మకి మోసుకుపోయి చెప్పగానే ఆవిడ వెనకేసుకొచ్చి ఇవన్నీ అనవసరమైన తలనొప్పి. ఆ పై మన ఆరోగ్యం పాడుకావడం తప్ప ఉపయోగం లేదు. ఈ రోజుల్లో అమ్మలు ఆడపిల్లలకి పనులు చెప్పడం లేదు. ఆధునిక సౌకర్యాలు వచ్చాక అసలు పెద్దవాళ్లకే పనులుండడం లేదు. దోశల పిండీ, ఇడ్లీ పిండీ కొనుక్కోవడం, బిరియానీలు ఆర్డర్‌ల మీద తెప్పించుకుని తినడం మిగిలిన పనులు సహాయకులు చెయ్యడం సాధారణం అయిపోయింది కదా!”

“నేను మా అమ్మాయికి పనులు నేర్పాను” అంది రాణి కోపంగా.

“అది మీ ఇష్టం. అలా అని కోడలి తల్లిని మనం తప్పుపట్టలేముగా. ఏమన్నా అంటే మా పిల్లని గారంగా పెంచుకున్నాం అంటారు”

“రేణుకా! మీరేమీ అనుకోకపోతే ఒకమాట. మీరిలా కోడలికి భయపడిపోయి, ఒక మాటనే ధైర్యం లేక నోరు మూసుకుని ఆ పిల్లనేసుకుని తిరగడం నాకస్సలు నచ్చలేదు” అంది రాణి నిష్కర్షగా.

“నాకలా అనిపించదు. ఇలా కొన్నాళ్ళు నేను ఉంటే, ఎప్పటికైనా ఆ పిల్లే అన్ని పనులూ నేర్చుకుని నాకు సాయం చేస్తుంది. లేదంటే ఇలాగే సర్దుకుపోతాం. ఊరికే, నస పెట్టడం వల్ల సామరస్యం చెడుతుంది. నాకున్నది ఒక్కగానొక్క కొడుకూ, కోడలూ! వాళ్ళని వదులుకోలేము. మా వారికి కొడుకంటే ప్రాణం. నేనే కాస్త వాడిని క్రమశిక్షణలో పెట్టేదాన్ని. ఇప్పుడు వాడినీ ఏమీ అనలేను. కోడలికి సలహాలు చెబితే తన భార్యని ఏడిపిస్తున్నానని వాడనుకోగలడు కదా!”

“మీ మెట్ట వేదాంతం నాకు నచ్చలేదు!”

“పోనివ్వండి. మాకిలాగే నడవక తప్పదు. అందరికీ మీ కోడలంత మంచి కోడలు రాసిపెట్టి ఉండొద్దూ!” అందామె సంభాషణ తేలిక చేస్తూ.

‘మా కోడలి మంచితనం మీకేం తెలుసూ?’ అన్నట్టు ఎర్రగా చూసింది రాణి.

“ఆ మధ్య ఒకరోజు మీ ఇంట్లో కిట్టీ పార్టీ జరిగినప్పుడు, మీ కోడలు మీకెంతో సాయం చేసింది కదా!” అందామె.

అది పొగడ్తా! వెటకారమా? అన్నట్టు అనుమానంగా చూసింది రాణి.

నిష్కల్మషంగా నవ్వుతూ ఉన్న రేణుక మొహం చూసి కాదని అర్థం చేసుకుని “అవునవును. మా కోడలు బాగా పనిమంతురాలు. బాగా కలిసిపోతుంది” అంది ఏమీ అనలేక.

“రాణి! మీరు మంచి అత్తగారు, ఎందుకంటే మీకు మంచి అత్తగారున్నారు. అదీ రహస్యం” అందామె ప్రశాంతంగా, ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వైపు సాభిప్రాయంగా చూస్తూ.

రాణి ఏమీ మాట్లాడలేకపోయింది. మాటలు అటూ ఇటూ తిరిగి మీ కోడలు వేరు కాపురం ఎందుకు వెళ్లిందన్న పాయింటు వస్తుందేమో! అన్న ఆలోచన రాగానే మాట తప్పించి “మీ చీర బావుంది. ఎక్కడ కొన్నారు” అనడిగింది. మరికొంత సేపు చీరల క్వాలిటీ మీదా, రేట్ల మీదా చర్చ నడిచాక రేణుకతో కలిసి రాణి కిట్టీ పార్టీకి బయలుదేరింది.

మర్నాడు కాఫీలు తాగేటప్పుడు కోడలితో “పాపం నిన్న వచ్చిన రేణుక చాలా మంచిదానిలా ఉంది కదా!” అంది పార్వతమ్మ.

“ఆ! అంతా నాటకం! ఆ కోడలితో ఏదో జగడం పడే ఉంటుంది. అంతా కలిసి ఈమెకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటారు. అందుకే అవేమీ చెప్పకుండా నంగనాచిలా నీతులు చెబుతోంది” అంది రాణి  కసిగా.

ఆ మాటకి పార్వతమ్మ తెల్లబోయింది. ‘నిన్న ఇద్దరూ స్నేహితుల్లా మాట్లాడుకుని, ఇవాళ ఆమెకి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేస్తోంది. దొంగ అందరినీ దొంగలే! అనుకుంటాడంట. అలాగే ఉంది దీని వరస’ అనుకుంది.

ఇంతలో వసంత ఫోన్ చేసింది పార్వతమ్మకి. “రోజూ ఫోన్ చేద్దాం! చేద్దాం! అనుకుంటూనే అశ్రద్ధ చేశాను. ఎలా ఉన్నారు పిన్నీ? ఆరోగ్యం బావుందా?” అని అడిగింది.

“బావుందమ్మా ఆరోగ్యం! నువ్వెలా ఉన్నావు?” అంటూ చాలాసేపు వసంతతో మాట్లాడుతూ ఉంటే పార్వతమ్మ మొహం వెలిగిపోతూ ఉండడం గమనించి రాణికి మండింది.

ఫోన్ పెట్టేశాక “ఎవరూ?” అంది తెలీనట్టుగా.

“మన వసంత. నేనంటే ఎంతో ప్రేమగా ఉంటుంది. కన్న కూతురిలా నన్ను పట్టించుకుంటుంది” అన్న అత్తగారి జవాబుకు రాణికి కాలింది.

“ఆ! ఏం చేస్తుందేమిటి? ఏదో కాలక్షేపం కబుర్లు నాలుగు చెప్పి ఏ పులుసో పచ్చడో ఇస్తుంది మీకు, అంతే కదా! రిటైర్ అయ్యింది. తనకూ ఏమీ తోచదుకదా!” అంది వ్యంగ్యంగా.

“తోచకపోవడానికేం? భర్త ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి భోజనం కట్టివ్వాలి. ఇంటి చుట్టూ మొక్కలుంటాయి. వాటిని చూసుకుంటుంది. కొడుకూ, కోడలూ వస్తుంటారు ఏడాదికి రెండుసార్లు. ఊరిలోనే ఉండే కూతురూ, అల్లుడూ వచ్చి పోతూ ఉంటారు. శలవులిస్తే మనవలిద్దరూ వచ్చి వారం, పది రోజులుంటారు. ఇంత హడావిడిలోనూ నన్ను కనిపెట్టుకుని ఉంటుంది. నాక్కాస్త వళ్ళు బాగోకపోతే టాబిలెట్లు తెప్పించి వేస్తుంది. మరొకళ్ళయితే అద్దెకుండే వాళ్లతో మాటలేమిటీ అనుకుంటారు. మంచి వాళ్ళని మంచి వాళ్ళు అనకపోతే పాపం!” అని అత్తగారు అనడంతో ఇంకేమన్నా అంటే బావుండదేమో అన్నట్టు తగ్గింది రాణి..

పార్వతమ్మ దివాన్ మీద పడుకుని ‘అసలు దీని బుర్రనిండా కుమ్మరి పురుగులే. నిత్యం తొలుస్తూ ఉంటాయి. నిమ్మళంగా ఉండలేదు. ఎవరైనా మంచి వాళ్ళున్నారంటే నమ్మలేదు. కూతురు అత్తామావలతో కలిసి ఉంటే బాధ. కొడుకు తల్లిని తప్పుబట్టకుండా విడిగా ఉంటే బాధ. అసలు దీన్ని ఎవరూ ఏమీ అనడం లేదు. అదీ దీని గర్వం. నా కొడుకేమో దీని బాధ పడలేకేనేమో ఉద్యోగం చేసాక ఇంకేదో పనిపెట్టుకుని బైట తిరుగుతాడు. వాడి సుఖం వాడు చూసుకుంటూ దీన్ని ఊరిమీది కొదిలేసాడు. పైకి ఎర్రగా బుర్రగా ఉంటుంది కానీ లోపలంతా నలుపే. దేవాంతకురాలు! నాకెందుకు? ఏదో ఒకరోజు నా మీదా ఎగరగలదు. మరో వారం పది రోజులుండి నెమ్మదిగా సర్దుకోవడం మంచిది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఏదైనా అనబోతే నా మీద మండిపడగలదు. నోరు మూసుకుని మర్యాద కాపాడుకోవడం మంచిది’ అనుకుంటూ కళ్ళు మూసుకుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here