మలిసంజ కెంజాయ! -14

6
11

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[ఓ వారం తర్వాత తనిక అమలాపురం వెళ్తానని కొడుకుతో అంటుంది పార్వతమ్మ. మరో వారం గడిచాకా, ఇంకో రెండు మూడు సార్లు బ్రతిమిలాడాకా, అప్పుడు కారు ఏర్పాటు చేస్తాడు రాజేష్. పార్వతమ్మ వచ్చే సమయానికి ఇల్లంతా శుభ్రం చేయించి ఉంచుతుంది వసంత. ఆ రాత్రికి పార్వతమ్మకి తన ఇంట్లోనే భోజనం వడ్డిస్తుంది. ఆ మర్నాడు ఒక ఫంక్షన్‍కి వెళ్ళాల్సి వస్తుంది వసంతకి. బస్‍లో మురమళ్ళకి వెడుతుండగా, కాషాయం రంగు చీరా జాకెట్టు వేసుకున్న ఓ మహిళ వసంతని పలకరిస్తుంది. తాను కామాక్షిననీ, డిగ్రీలో వసంత క్లాస్‍మేట్‍ననీ గుర్తు చేస్తుంది. మరి ఈ వేషం ఏంటని వసంత అడిగితే తాను కర్నూలులోని ఆనంద్ స్వామి శిష్యురాలినని, అక్కడే ఉంటాననీ, యానాంలో తమ ఇల్లని చెబుతుంది. మరి భర్తా పిల్లలూ అని వసంత అడిగితే, భర్త యానంలోనే ఉంటారనీ, ఒకే కూతురు ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అనీ, అదే కంపెనీలో పనిచేసే కుర్రాడిని పెళ్ళి చేసుకుందనీ, ఆమెకి  ఇద్దరు కూతుర్లనీ చెబుతుంది. కూతురికి సంబంధించిన పనులన్నీ వాళ్ళ అత్తగారే చూసుకుంటుందని చెబుతుంది. ఆశ్రమంలో తానేం పనులు చేస్తుందో చెబుతుంది. నువ్వు భక్తురాలయినందుకు మీ ఆయనకీ, పిల్లకీ శిక్షన్నమాట అంటుంది వసంత. తనని సమర్థించుకున్న కామాక్షికి బాధ్యతల గురించి చెబుతుంది, ఇక్కడే ఉండి రాగద్వేషాలతో బాధపడుతూ మరొకళ్ళని బాధపెట్టకుండా ఎలా ఉండాలో చూపించమనీ, నిర్మమకారంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండమనీ చెబుతుంది వసంత. సంసారం వదిలి పారిపోవడం గొప్ప కాదు, అక్కడే ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండగలగడం గొప్ప అని, తాను చెప్పిన విషయాలని బాగా ఆలోచించమని చెప్తుంది వసంత. ఒకరోజు మాధవ విశాలకి ఫోన్ చేస్తాడు. ఇద్దరూ ఒకళ్ళ గురించి మరొకరు చెప్పుకుంటారు. తర్వాతి వారంలో ఒక పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళిన వసంత, వెంకట్రావ్ – అది చూసుకుని ప్రమీలక్కా వాళ్ళింటికి వెళ్తారు. మర్నాడు కబుర్లు చెప్పుకుంటారు. ప్రమీలక్క కూతురు భార్గవి ఫోన్ చేస్తుంది. మేం వస్తాం అని చెబితే, వద్దు, మేమే మీ ఇంటికి వస్తాం, మీ ఇల్లు చూడాలని అంటుంది వసంత. అలాగే రమ్మంటుంది భార్గవి. కూతురింటికి వెళ్ళడానికి ప్రమీల సంకోచిస్తుంది. వసంత ఒత్తిడి చేస్తే అప్పుడు సిద్ధపడుతుంది. ఇక చదవండి.]

[dropcap]న[/dropcap]లుగురూ క్యాబ్ మాట్లాడుకుని మలక్‌పేట్ నుంచి కొండాపూర్ లోని భార్గవి ఇంటికి బయలుదేరారు. క్యాబ్ వాడు కరెక్ట్ అడ్రస్‌కి తీసుకుని వచ్చాడు, భార్గవి ఫోన్‌లో లొకేషన్ పంపడం వల్ల. ఒకే ప్రహరీలో రెండు బిల్డింగులు పక్కపక్కగా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, బిల్డింగ్ వన్ అని చెప్పింది భార్గవి. లిఫ్ట్ ఆగగానే భార్గవి ఎదురుగా వచ్చేసింది. “రండి, రండి!” అంటూ. పిల్లలిద్దరూ తయారయ్యి ఉన్నారు. భార్గవి భర్త నమస్కారం చేశాడు. వెంకట్రావూ, వసంతా అతన్ని “బావున్నావా బాబూ!” అని పలకరించారు. లోపలికి వస్తూనే దారిలో కొన్న స్వీట్ బాక్స్ భార్గవికి, పిల్లలిద్దరికీ చెరో పెద్ద చాకోలెట్ ఇచ్చింది వసంత. ఒక ఫ్లోర్‌కి రెండే ఫ్లాట్‌లున్నాయి. భార్గవి ఫ్లాట్ లోపల చాలా రిచ్‌గా ఉంది. మూడు బెడ్ రూమ్‌లూ, రెండు హాళ్ళూ ఉన్నాయి. రెండింటిలోనూ రెండు పెద్ద పెద్ద టీవీలున్నాయి. సోఫా చాలా ఖరీదైనదిగా ఉంది. గ్లాస్ డైనింగ్ టేబుల్ మరీ ముద్దుగా ఉంది.

వంటింట్లో పెద్ద గ్యాస్ స్టవ్, డిష్ వాషర్ అన్నీ అందంగా ఉన్నాయి. ఇల్లంతా ఎంతో ఆసక్తిగా చూసింది వసంత. “చాలా బావుందిరా నీ ఫ్లాట్ భార్గవీ!” అంది ఆమెను దగ్గరగా తీసుకుంటూ. “చాలా ఖర్చయ్యింది పిన్నీ!” అందామె.

“అయితే అయ్యింది గానీ, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. కొనుక్కున్నావు. నీలాంటి పిల్లకిలాంటి ఇల్లు ఉండాల్సిందే!” అంది ప్రేమగా. “థాంక్స్ పిన్నీ!” అంటూనే అందరికీ కూల్ డ్రింక్ తీసుకొచ్చింది భార్గవి. ఆమె భర్త ఇల్లు చూపిస్తుంటే తోడల్లుళ్ళిద్దరూ చూస్తున్నారు.

ప్రహరీ నానుకుని మొక్కలకి బాగానే స్థలం ఉంచారు. కాస్త పెద్ద మొక్కలేవేసారు. అవి పచ్చదనాన్ని చిమ్ముతున్నాయి. ఆ తర్వాత, నడవడానికి వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. ప్రమీల మనవల దగ్గర కూర్చుంది. వసంత కూడా వాళ్ళ దగ్గరికి చేరి, పిల్లలను దగ్గరకు తీసింది. పెద్దాడికి పన్నెండేళ్ళు. చిన్నవాడికి పదేళ్లు. వాళ్ళు చక్కని ఇంగ్లీషులోనూ, సరిగా రాని తెలుగులోనూ మాట్లాడుతున్నారు.

“మీ పిల్లలు అమెరికన్ ఇంగ్లీషూ, అమెరికన్ తెలుగూ మాట్లాడుతున్నారే భార్గవీ!” అంది వసంత నవ్వుతూ.

“పూర్తిగా ఇంకా తెలుగు రాలేదు పిన్నీ. స్కూల్‌లో తెలుగు లేదు” అంది భార్గవి.

“పిల్లలు అన్ని భాషలూ సులువుగా నేర్చేసుకుంటారు” అంది వసంత. “ఇద్దరూ దీపాల్లా ఎంతో బావున్నారు!” అంది వసంత అక్కతో. ప్రమీల నవ్వింది వసంత వీపు నిమురుతూ.

నెమ్మదిగా, అంతా పెద్దహాల్లో టీవీ ముందు చేరారు. భార్గవి కొడుకు తాతయ్యలకు వార్తలు పెట్టాడు. భార్గవీ, ఆమె భర్తా కిచెన్‌లో చాలా హడావిడిగా ఉన్నారు. “నేనేమైనా సాయం చెయ్యనా?” అంది వసంత అక్కడికి వెళుతూ.

“వద్దు పిన్నీ! అన్నీ రెడీ. టేబుల్ మీద సర్దడమే” అంది భార్గవి ఆయాసపడుతూ. భార్యతో సమానంగా వంటల తయారీలోనూ, టేబుల్ మీద సర్దడంలోనూ మునిగిపోయిన అల్లుడిని చూసి వసంత ఎంతో ముచ్చట పడింది. ‘ఈ దేశంలో అలవాటు ప్రకారం అయితే వంటచేసి వడ్డించే పని పూర్తిగా ఆడవాళ్లదే! మనకి సంబంధం లేదనుకుంటారు మగాళ్లు. అసలు పిలవగానే వెళ్లి తినడమే మేము చేసే పెద్ద సాయం అనుకుంటారు కూడా’ అని నవ్వుకుంది.

పెద్దవాళ్ళు ఆరుగురికీ పెద్ద టేబుల్ మీదా, పిల్లలిద్దరికీ చిన్న టేబుల్ దగ్గర అమర్చింది భార్గవి. “మా అమ్మాయికి చాలా సాయం చేస్తున్నావు బాబూ!” అంది వసంత అల్లుణ్ణి మెచ్చుకుంటూ.

అతను గట్టిగా నవ్వుతూ “మీరు తప్పు చెబుతున్నారత్తయ్యా! నేను వంట చేస్తే తాను సాయం చేసింది” అన్నాడు. భార్గవి కోపంగా చూడబోయి నవ్వేసింది. అంతా నవ్వారు.

“అందరూ బాగా తినాలి, మిగలకుండా” అంటూ భార్గవి వడ్డించింది. అంతా తినడం ప్రారంభించారు. “వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయి” అన్నాడు వెంకట్రావు. “అవును! మీ దంపతులిద్దరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి” అంది వసంత నవ్వుతూ.

“చాల్లే పిచ్చి మాటలు” అంటూ కోప్పడింది ప్రమీల. “లేదు పిన్నీ! నువ్వు వస్తున్నావని ఎంతో ఆనందంగా చేసేసాం ఇవన్నీ. మా ఆయన నాకు ఫుల్ హెల్ప్ కాబట్టి నాకసలు సమస్యే కాదు” అంది భార్గవి నవ్వుతూ.

“ఇల్లు చాలా బావుంది. గ్రీనరీ మరీ బావుంది, బావగారూ! మీరూ, అక్కా నెలకొక రెండు రోజులు ఇక్కడుండి వెళుతూ ఉండండి. పచ్చని చెట్లగాలి ఆరోగ్యం! కింద వాకింగ్ ట్రాక్‌లో రెండు పూటలూ కబుర్లు చెప్పుకుంటూ సుబ్బరంగా నడవండి. నెప్పులన్నీ పోతాయి” అంది వసంత.

ఆయన నవ్వుతూ “అలాగే! మీ అక్కకి చెప్పు” అన్నాడు.

“ఎక్కడా గృహప్రవేశానికి రావడమే! మళ్ళీ ఇదే రావడం” అంది ప్రమీల.

“నువ్వు ఇల్లు కదిలి రావు. ఇల్లు దాటి శరీరం కదుపుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటుందక్కా! వాళ్లు కనబడుతున్నారు కదా! అని మీరు రావడం మానకూడదు”

“అవును పిన్నీ! మేం పిలుస్తూనే ఉంటాం, కానీ అమ్మా, నాన్నా రారు” అంది భార్గవి.

“మీ అమ్మానాన్నలకి మొహమాటం ఎక్కువ. బలవంతంగా లాక్కురావాలి. ఇవ్వాళా నేను లాక్కొచ్చినట్టే!”. “తప్పకుండా అలాగే చేస్తాం అత్తయ్యా” అన్నాడు అల్లుడు.

భోజనాలయ్యేసరికి మూడయ్యింది. తోడల్లుళ్ళిద్దరినీ తీసుకుని అల్లుడు ఒక రూమ్ లోకి తీసుకెళ్లి కాసేపు పడుకోమన్నాడు. పిల్లలిద్దరూ తండ్రితో కలిసి హాల్‌లో టీవీ చూస్తూ కూర్చున్నారు. అక్కచెల్లెళ్ళూ, భార్గవీ గెస్ట్ రూంలో చేరి నడుం వాల్చారు. “శుభ్రంగా ఓ గంట నిద్రపోరా భార్గవీ! ఎంత అలిసిపోయావో, ఏమో!” అంది వసంత భార్గవిని మధ్యలోకి రమ్మని సైగ చేస్తూ.

ఆమె వచ్చి పక్కనే పడుకుని పిన్ని పై చెయ్యి వేసి “మీరు రావడం ఎంతో హ్యాపీగా ఉంది నాకు” అంది తృప్తిగా. “ఇంకేంట్రా? అమెరికా నుంచి వచ్చేసినందుకు బాధ ఏమీ లేదు కదా!”

“లేదు పిన్నీ! రావడానికి రెండేళ్ల ముందు నుంచీ ఆలోచించుకునే వచ్చేసాం. ఇక్కడా అలవాటైపోయింది ఈ ఆరునెలల్లో”

ఒళ్ళు అలిసినట్లయ్యి ప్రమీల నిద్రపోయింది. “చూడు, చీర కట్టుకుని క్యాబ్‌లో వచ్చి అలిసిపోయింది మీ అమ్మ”

“అవును పిన్నీ! అమ్మ ఈ మధ్య నీరసపడింది” అంది భార్గవి.

 “అవును. డెబ్భయ్యో పడిలో పడింది మీ అమ్మ. ఆమె వయసుకు భర్తకి వండిపెట్టి, ఇల్లు చూసుకోవడమే పెద్ద ఛాలెంజ్”

“అవును పిన్నీ!

“కాస్త కనిపెట్టుకుని ఉండమ్మా! వీళ్ళిద్దరినీ. మీ తమ్ముడేమో దూరంగా ఉన్నాడు”

“అలాగే! నా ఫోన్ నెంబరు తీసుకుని నువ్వు నాక్కూడా ఫోన్ చేస్తూ ఉండు పిన్నీ”

“అయ్యో! చెయ్యడానికేం! నువ్వు బిజీ కదా!”

“పర్వాలేదు. నువ్వు చేశావంటే ఏదో టైంలో నేను జవాబిస్తాను. చెయ్యి” అంది భార్గవి. మరో అరగంట కబుర్లు చెప్పుకుని భార్గవి ఇచ్చిన టీ తాగి బయలుదేరారు.

“ఈ రాత్రి ఉంటే బావుండేది పిన్నీ!”

“అవును. కానీ రేపు మీ అమ్మకి కాస్త ఇల్లంతా సర్దిపెడతాను. చీరలూ, జాకెట్లూ చక్కగా సర్దుకోదు. అన్నీ కలిపేస్తుంది. ఎక్కడికన్నా వెళ్లేప్పుడు ఏవీ కనపడలేదంటుంది. పాత చీరలు కొన్ని తీసేస్తాను. వంటిల్లు కూడా సర్దుతాను. అవసరం లేని డబ్బాలతో అలమారా అంతా నింపేసింది”

“నువ్వు అలిసిపోతావేమో చూసుకో! పిన్నీ!” అన్న భార్గవి మాటకి నవ్వింది వసంత.

క్యాబ్ ఎక్కేముందు అల్లుడితో “ఇల్లు చాలా బావుంది బాబూ! ఫర్నిచర్, ఇంటీరియర్స్ అన్నీ మంచి టేస్ట్‌తో చూసుకుని అమర్చుకున్నారు. మీరొకసారి అమలాపురం రండి” అంటూ ఆహ్వానించారు వెంకట్రావూ, వసంతా. “అలాగే తప్పకుండా!” అన్నారు భార్గవీ, అల్లుడూ. పిల్లలిద్దరూ దగ్గరగా వచ్చి మౌనంగా హగ్ లిచ్చారు. వసంత ఎంతో ఆనందపడి “బాగా చదువుకోండి బంగార్లూ! నేను కూడా టీచర్‌నే” అంటూ వాళ్ళను మరోసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టింది.

కాబ్‌లో కూర్చుని “బావా! నెలకొకసారి వెళ్లి ఓ రెండుమూడు రోజులుండండి అక్కడ. మీకు గాలి మార్పుగా ఉంటుంది. అలవాటు కూడా అవుతుంది. ఆ పిల్లలు స్కూల్‌కి వెళుతుంటే, చదువుకుంటుంటే చూడండి. తృప్తిగా ఉంటుంది. మీ ఆరోగ్యం చూసుకోండి. అక్క ఆరోగ్యం కూడా గమనించండి. చెయ్యగలుగుతోందో లేదో గమనించండి. చేస్తుందిలే అని నిర్లక్ష్యం వహించకండి. అమ్మ చెయ్యలేదేమో! అని కాస్త సూచనలిస్తూ ఉండండి పిల్లలకి. మీరు కాకపోతే అక్కని ఇంకెవరు కనిపెట్టుకుని ఉంటారు?” అని వసంత చిన్న స్పీచ్ ఇచ్చింది. “అలాగే టీచరమ్మా!” అని బావగారు అనగానే “ఇంక వదిలెయ్యి మా అన్నయ్యని” అన్నాడు వెంకట్రావు. నలుగురూ నవ్వుకుంటూ మరో గంటకల్లా ఇంటికి తిరిగి వచ్చేసారు.

మర్నాడు ఉదయం టిఫిన్ లయ్యాక వసంత కొంగు బిగించి, అక్కగారి చీరలన్నీ బీరువాలోంచి తీసి మంచంపై పడేసి రోజూ కట్టుకునేవీ, కొంచెం మంచివీ, చాలామంచివీ వేరుచేసి బీరువాలో పేపర్లు వేసి చీరలోనే జాకెట్ పెట్టి అందంగా సర్దింది. వెలిసిన పాత చీరలు ఓ పది తీసి, మూట కట్టేసింది. “ఇవి ఎవరికైనా ఇచ్చేసుకో!” అని చెప్పింది అక్కగారికి.

తర్వాత వంటచేసుకుని, మధ్యాహ్న భోజనాలయ్యాక, అక్కని పడుకోమని చెప్పి, వంటింట్లో పనికొచ్చే డబ్బాలూ, సీసాలూ, గిన్నెలూ మాత్రమే ఉంచి, వాడనివన్నీ ఒక అట్టపెట్టెలో పడేసి, స్టూల్ వేసుకుని, కబోర్డ్ పైన పెట్టేసింది. అలమారు సగం ఖాళీ అయ్యింది. పేపర్లు మార్చి వాటిని అందంగా సర్దింది. నిద్ర లేచి వచ్చిన ప్రమీల అది చూసి “నా బంగారే!” అంటూ మురిసిపోయింది. వసంత వంటిల్లంతా సర్ది హాల్ లోకి వచ్చి షో కేసులో ఉన్న బొమ్మలు చూస్తూ ఉండగా, “అవి కూడా సర్దుతానంటావా? ఏంటి? అవి మా సహాయకురాలు చేసి పెడుతుంది గానీ, ఈ గులాబ్‌జామ్, ఈ జంతికలూ తిను” అంటూ టీపాయ్ మీద పెట్టింది ప్రమీల.

“మరి నువ్వు? అంది వసంత చేతులు సబ్బుతో కడుక్కుని, టవల్‌తో తుడుచుకుంటూ. “నేను అవి రెండూ తిననే! డాక్టర్ తినొద్దన్నాడు. మరి జాగ్రత్తగా ఉండాలి కదా! నాకేవో బిస్కట్లుంటాయి. అవి తింటాను. వీళ్ళిద్దరూ ఇంకా లేవలేదు. లేచాక, టీ అందరూ కలిసి తాగుదాము” అంటూ ఉండగా,ప్రమీల ఫోన్ మోగింది.

ఆమె ఎత్తి “ఆ! ఆ! మాధవా! చెప్పు నాన్నా! రామ్మా! రా! వసంతా వాళ్ళ స్పెషల్ ట్రైన్ రాత్రికిలే. ఓ అరగంటలో వచ్చేస్తావుకదా! సరేమ్మా!” అంటూ పెట్టేసింది.

“మాధవ ఎవరక్కా?” అంది వసంత జంతిక కొరుకుతూ!

“మనం ఫోన్‌లో మాట్లాడుకునేటప్పుడు, నీకు చెబుదాం, చెబుదాం అనుకుంటూనే మర్చిపోయాను. మాధవ, మన చిన్నతాతయ్య మనవడు. వాళ్ళ ఊరు రాజోలు దాటాక ఉంటుంది. ఆ ఊరి పేరెప్పుడూ నాకు గుర్తుండదు. మనం సెలవులకి మన తాతయ్య ఊరికి వెళ్ళేవాళ్ళం కదా! తను కూడా రెండేళ్లకో, మూడేళ్లకో వేసవి సెలవులకి ఆ ఊరికి వచ్చేవాడు, మరి వాళ్ళ తాతయ్యదీ అదే ఊరు కదా! అంటే మన తాతయ్యలు అన్నదమ్ములన్న మాట! మీరంతా మావిడి తోటలో కోతి కొమ్మచ్చి ఆటలు ఆడేవారు. మర్చిపోయావా? నీ వయసే ఉంటుంది వాడికి”

వసంత ఆలోచనలో పడి, “ఆ! గుర్తొచ్చింది పొడవుగా ఉంటాడు కదా!” అంది.

“అవును వాడే! నువ్వు వాడికి బాగా గుర్తే !పదేళ్ల నుంచీ ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటున్నాడంట. ఈ మధ్యే వాడికి నేనిక్కడ ఉన్నానని ఎవరో చెబితే తెలిసిందంట. ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి, వచ్చాడు. పాపం భార్య పోయిందంటే! కొత్తపేటలో ఉంటున్నాడంట. ఇక్కడికి దగ్గరేలే! సూపర్ మార్కెట్టో ఏదో ఉందంట వాడికి. అది చూసుకుంటాడంట. ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒక్కతే కూతురు లండన్‌లో ఉంటుందంట.”

మరో అరగంటకి మాధవ వచ్చాడు. తలుపు తీసిన వసంతను “బావున్నారా? వసంతా!” అని పలకరించాడు.

“రండి, రండి!” అంది వసంత. ఇంతలో తోడల్లుళ్లిద్దరూ లేచారు. ముగ్గురికీ స్నాక్స్ తెచ్చింది ప్రమీల.

మాధవ గురించి భర్తకీ, వెంకట్రావుకీ చెప్పింది ప్రమీల. “నువ్వు ఫోన్ చేస్తున్నావని చెప్పింది మీ అక్కయ్య! బావున్నావా!” అని పలకరించాడు ప్రమీల భర్త.

వెంకట్రావు కూడా “ఏ ఊరు మీది?” అంటూ మాట కలిపాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అందరికీ టీలు తెచ్చింది వసంత. టీ, తాగాక వెంకట్రావూ, ప్రమీల భర్తా చిన్నపని ఉందంటూ బైటికి వెళ్లారు.

“మీరు బీ.ఈడీ. చేసి టీచర్‌గా పని చేస్తున్నారని తెలిసింది. హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యారని కూడా విన్నాను. ఇన్నాళ్ళకి కలిసాను” అన్నాడు మాధవ వసంతతో.

“మీరు ఇక్కడ సూపర్ మార్కెట్ నడిపిస్తున్నారంట కదా!” అంది వసంత.

లోపలి నుంచి వచ్చిన ప్రమీల, “ఈ మన్నింపులేంటి? మన ముత్తాత ఒకరే! నువ్వు, నువ్వు అనుకోండి!” అంటూ నవ్వింది. వసంతా, మాధవా నవ్వేశారు. వాళ్లిద్దరూ, ఒకరి కుటుంబం గురించి మరొకరు అడిగి తెలుసుకున్నారు.

“ఒకసారి అటొచ్చిన్నప్పుడు అమలాపురంరా మాధవా!” అంది వసంత అభిమానంగా. “తప్పకుండా వస్తాను” అన్నాడు మాధవ. “నా ఫోన్ నంబర్ తీసుకో! మిస్డ్ కాల్ ఇవ్వు. ఎప్పుడైనా ఫోన్ చెయ్యి” అంది చనువుగా వసంత.

మాధవ నంబర్, తీసుకుని అలాగే చేసాడు. ఇద్దరూ నంబర్ దగ్గర పేరు ఫీడ్ చేసుకున్నారు.

“నేనింక వెళతాను” అన్నాడు మాధవ.

“అక్కా! మాధవ వెళ్తానంటున్నాడు” అంది వసంత.

లోపలినుంచి వచ్చిన ప్రమీలతో, “వెళ్ళొస్తానక్కా!” అంటూ లేచాడు.

“వీలు చూసుకుని మళ్ళీరా! నాన్నా!”అంది ప్రమీల. తలూపాడతను. ఇద్దరూ బైటికి వచ్చి మాధవకి వీడ్కోలు చెప్పారు. అతను స్కూటర్ మీద వెళ్ళిపోయాడు.

“మంచివాడు పాపం! ఒక్కడే ఉంటాడంట” అంది ప్రమీల. “ఔనంటక్కా! అన్నీ చెప్పాడు” అంది వసంత లోపలికి నడుస్తూ. ఆ రాత్రే బయలుదేరి అమలాపురం వచ్చేసారు వెంకట్రావూ, వసంతా.

***

మాధవకి విశాలతో మాట్లాడి తన పొరపాటు గురించి చెప్పాక, ఆమెనుండి క్షమ దొరికిందనుకున్నాక చాలా ఆనందంగా ఉంటోంది. అప్పుడప్పుడూ ఆమెతో మాట్లాడుతూ ఉంటే అతనికి ఉత్సాహంగా ఉంటోంది. ‘మళ్ళీ విశాల నా జీవితంలోకి మిత్రురాలిగా రావడం వల్ల, తనకి తిరిగి జీవం వచ్చినట్లయ్యింది’ అనుకున్నాడు.

“ఎప్పుడూ నేనేనా! నువ్వు కూడా నాకు ఫోన్ చేయొచ్చుగా విశాలా!” అన్నాడొకరోజు.

“నీకు బిజినెస్ ఉంది. ఎప్పుడు నీకు తీరుతుందో నాకు తెలీదుగా! నేను రోజంతా ఖాళీనే కాబట్టి నువ్వెప్పుడు చేసినా నేను మాట్లాడతాను” అంది విశాల.

“అదీ నిజమేలే విశాలా!” అన్నాడతను.

ఇద్దరి మధ్యా ఎక్కువ కాలేజీ గురించిన కబుర్లే సాగేవి. డిగ్రీ క్లాసులోని సహాధ్యాయుల గురించీ, లెక్చరర్‌ల గురించీ మాట్లాడుకునేవారు. పదేళ్ల క్రితం వరకూ మాధవ అక్కడే ఉన్నాడు కాబట్టి ఉద్యోగాల మీద బైటికి వెళ్లిపోగా అక్కడే స్థిరపడిన మిగిలిన వాళ్ళ గురించి తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి ఆమెకి చెప్పేవాడు. వాళ్లలో చాలామందిని మర్చిపోయింది విశాల. అతను చెబుతుంటే జ్ఞాపకం చేసుకుంటుంది విశాల.

ఒక రోజు తమ డిగ్రీ ఆఖరి సంవత్సరం విద్యార్థులంతా లెక్చరర్స్ అందరితో కలిసి తీయించుకున్న ఫోటో పెట్టాడు వాట్సాప్‌లో. ఆ ఫోటో చూసి చాలా మందిని గుర్తుతెచ్చుకుంది విశాల. ఇద్దరూ మళ్ళీ ఆ ఫొటోలో ఉన్న అందరినీ తలుచుకున్నారు. ఇలాగే ఏవో కాలక్షేపం మాటలు నడిచేవి. వారానికి ఒక్కసారే ఫోన్ చేసే వాడు మాధవ.

ఒకోసారి విశాల, తాము డిగ్రీ చేసినప్పటి సినిమాలు టీవీలో వచ్చినప్పుడు అవి చూసిన సంగతి మాధవకి చెబుతుంది. అప్పుడిద్దరూ ఆ సినిమా ఎలా ఎవరితో చూసారో చర్చించుకుంటారు. ఆ సినిమా ఇప్పుడు చూస్తే ఎలా అనిపించిందో చెప్పుకుంటారు. కొందరు బాచ్‌లుగా కాలేజ్ ఎగ్గొట్టి ఓ సినిమాకి వెళితే, అది ప్రిన్సిపాల్ గారికి తెలిసిపోయి ఆయన తిన్నగా క్లాస్ కొచ్చి ‘మిమ్మల్ని చదువుకోమని కాలేజీకి పంపితే ఇలా సినిమాలు చూస్తే అది నాకు అవమానం’ అని ఇచ్చిన కోటింగ్ గుర్తు చేసుకుని చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఇద్దరూ కాలేజ్ విద్యార్థులైపోయేవారు.

ఒకరోజు “విశాలా! నాకు కాలేజీలో ఆఖరి సంవత్సరం ఒక్కటే బాగా సినిమా ప్రోమోలా గుర్తొస్తుంది ఎందుకో మరి” అన్నాడు మాధవ. “అబ్బో!” అంటూ నవ్వింది విశాల.

“మళ్ళీ ఒకసారి మా సూపర్ మార్కెట్‌కి రా విశాలా!”

“ఏం? అమ్మకాలు తగ్గాయా?”

“ఒకసారి చూద్దామని”

“దానికేం! మా ఇంటికే రా!”

“నువ్వొక్కదానివీ ఉంటావు కదా! నేను రావడం బావుండదు”

“నేను ఒక్కదాన్నీ ఉండను. నాతో మరొకరుంటారు”

“ఎవరు?”

“నేనొకరితో సహజీవనం చేస్తున్నానులే! ఒక సంవత్సరం నుంచీ!”

మాధవకి ఒక్కసారిగా మనసు చిన్నబోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని మౌనం విని “నీకెవరో మిత్రులొచ్చినట్టున్నారు, ఉంటాను” అంటూ ఫోన్ పెట్టేసింది విశాల.

విశాల నోటినుండి వచ్చిన సహజీవనం మాట మాధవ గొంతు పట్టుకుంది. అతని కొడుకు “నాన్నా! ఒంటరిగా ఉండడం బాధనిపిస్తే ఎవరినైనా నీకు నచ్చినావిడను పెళ్లి చేసుకో నాన్నా! నేనూ, మీ కోడలూ చాలా సంతోషిస్తాం” అన్నమాట గుర్తొచ్చి మనసులో ఎంతో బాధ కల్గింది.

వారం తర్వాత ఫోన్ చేసి “మీ ఇంటికి రానా విశాలా? రేపాదివారం” అనడిగాడు.

“తప్పకుండారా. లంచ్ కొచ్చెయ్యి” అంటూ ఎలా రావాలో చెప్పింది.

“లేదు. సాయంత్రం టీ కొస్తా” అన్నాడతను. సరే అంది విశాల.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here