మలిసంజ కెంజాయ! -17

6
11

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[రామ్మారుతి గారి ప్రసంగం కొనసాగుతుంది. చాదస్తం గురించి, ఆవేశకావేశాల గురించి చెప్పి, వాటిని వదిలించుకోవాలని చెప్తారాయన. వృద్ధాప్యంలో అహం, గర్వం పోవాలి, వినయం, విచక్షణ రావాలని చెప్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తారు. తాను పెద్దలకే, కాదు పిల్లలకీ మంచి మాటలు చెప్తానంటారు. ప్రసంగమైపోయాక, వసంత, పార్వతమ్మ ఆటోలో ఇంటికి వచ్చేస్తారు. ఒకరోజు పార్కుకి వెళితే, తన మనవడిని ఆడించాడినికి వచ్చిన ఒకావిడని చూస్తుంది వసంత. వాళ్ల మనవడికి కొమ్మ గీరుకుని చర్మం కందితే వాడు బాగా ఏడుస్తాడు. ఆవిడ బెంబేలు పడితే, వసంత వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ పిల్లాడి కాలు శుభ్రంగా కడిగి పౌడర్ అద్ది, చాక్లెట్ ఇస్తుంది. వాడు ఏడుపు ఆపేస్తాడు. ఆవిడ వివరాలు అడిగి, ఆవిడ కాస్త నిరాశగా మాట్లాడితే, ధైర్యం చెబుతుంది వసంత. ఒకరోజు బీరువా సర్దుతుంటే ఫోన్ నెంబర్లు ఉన్న చిన్న పుస్తకం దొరుకుతుంది వసంతకి. అందులో సుగుణక్క నెంబర్ కనబడుతుంది. చాలా ఏళ్ళయిపోయింది మాట్లాడి అని, ఆమెకి ఫోన్ చేస్తుంది. వసంత గొంతు వినగానే గుర్తుపట్టిన సుగుణ ఆప్యాయంగా మాట్లాడుతుంది. మాటల సందర్భంగా అమెరికాలో ఉంటున్న తన పిల్లల ప్రవర్తన గురించి, ఇక్కడికొచ్చిన వాళ్ళ ప్రవర్తన గురించి వసంతతో చెప్పి బాధపడుతుంది సుగుణ. ఆమెకి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వసంత. ఒకరోజు పార్వతమ్మ కాఫీ తాగి తీరిగ్గా కూర్చుని ఉండగా పెద్ద కోడలు లీల ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేస్తుంది. పార్వతమ్మ ఆశ్చర్యపోతుండగా, మీ అబ్బాయి మాట్లాడుతారంటూ ఫోన్ భర్తకిస్తుంది కోడలు. అమ్మని అర్జెంటుగా బయల్దేరి తమ ఊరికి రమ్మంటాడు కొడుకు. ఆ విషయం వసంతకి చెబుతుంది పార్వతమ్మ.  వసంత వచ్చి పెట్టె సర్దిపెడుతుంది. మర్నాడు ఉదయం కారు వస్తుంది. పార్వతమ్మ బయల్దేరి కొడుకు ఇంటికి చేరుతుంది. కొడుకు కాలికి పెద్ద కట్టుతో కనబడతాడు. ఏమైందంటూ ఏడుస్తుంది పార్వతమ్మ. ఇక చదవండి.]

[dropcap]“ఏ[/dropcap]మీ లేదమ్మా! చిన్న దెబ్బే!” అంటూ తల్లి చెయ్యందుకున్నాడు కొడుకు. బేలగా కోడలి వైపు చూసిందామె, ఏం జరిగిందో చెప్పమన్నట్టు.

“మీ అబ్బాయి కారాపి పక్కన పెట్టి, బ్యాంకు పని కోసం రోడ్ దాటుతుంటే ఎవరో స్కూటర్‌తో డాష్ కొట్టారు. దాంతో”

“పక్కకి పడ్డానమ్మా! కాస్త మోకాలి దగ్గర దెబ్బ తగిలింది. ఓ వారం రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వుంటే నా పక్కనే ఉంటావని పిలిచా అంతేనమ్మా!” అన్నాడతను నవ్వుతూ.

ఆ మాటకి ధైర్యం తెచ్చుకుని “తగ్గిపోతుందిలే నాన్నా!” అంటూ ప్రేమగా చెంపలు నిమిరిందామె.

నిజంగానే పార్వతమ్మ కొడుకు మంచం పక్కనే తన మంచం వేయించుకుని కొడుకుతో కబుర్లు చెప్పడం, అతని అవసరాలకి కోడలినీ, పనివాళ్లనీ పిలిచి పని చేయించడం మొదలు పెట్టింది. తల్లి పక్కనే ఉండడం కొడుకు నారాయణకి చాలా ఆనందం కలిగించింది. టీవీ తెచ్చి ఆ రూమ్‌లో పెట్టారు. అత్తగారు పక్కనే ఉండడం వల్ల కోడలికి రోజంతా అక్కడే ఉండాల్సిన ఇబ్బంది తప్పింది. అత్తగారు అటూ ఇటూ వెళ్ళినప్పుడు తానుండేది. కొడుకూ, కూతురూ వచ్చిపోతూ ఉండేవారు. తల్లి ఆరోగ్యం గురించి అన్నీఅడిగి తెలుసుకుని ఆమె వాడే మందులు కూడా చూసాడు కొడుకు. వాటి డోస్ కూడా గుర్తుపెట్టుకుని ఆ మందులు తానే తల్లికిచ్చి, రోజూ వేసుకోమంటున్నాడు. పార్వతమ్మకి చాలా ఆనందం కలిగేది. తమ బంధు సమూహం గురించి వివరాలడిగేవాడు తల్లిని. తాను ఆ ఊరిలో ఉండకపోయినా తనకు తెలిసిన సమాచారం చెబుతూంటే బోలెడు సంగతులు. కావాల్సినంత కాలక్షేపంగా ఉందిద్దరికీ.

“నాన్నా! ఉద్యోగానికి సెలవు పెట్టావా?”

“అవునమ్మా! రెండు నెలలు పెట్టాను. రెస్ట్ తీసుకోవచ్చని”

“మంచి పని చేసావు”

సరిగా చెప్పలేదు కానీ కాలు విరిగి ఆపరేషన్ కూడా అయినట్టు తెలుసుకుంది పార్వతమ్మ. ఎక్కువ ప్రశ్నలు వెయ్యకుండా కొడుక్కి తగ్గిపోయి మళ్ళీ ఎప్పట్లా తిరగాలని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ అక్కడే ఉండి పోయిందా నెల పార్వతమ్మ. తన మంచం పక్కనే ఉన్న మంచంలో పడుకున్న కొడుకుని చూస్తుంటే కొడుకులిద్దరూ చిన్నప్పుడు ఇలాగే, నా పక్కనే పడుకునేవారు, ఆయనేమో వీథిగదిలో పడుకునేవారు కదా! అనుకుంటూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుందామె.

ఆఫీస్ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండడం, రోజంతా తల్లితో కలిసి ఉండడం నారాయణకి కూడా బాగా అనిపిస్తోంది. అతను తన ఉద్యోగ విశేషాలూ, తన ఉద్యోగ ప్రస్థానం తల్లికి అర్ధమయ్యే భాషలో చెప్పాడు. ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫర్‌లయ్యి పని చేసాడో, తనెంత కష్టపడి ఈ పొజిషన్ కొచ్చాడో వివరంగా చెప్పాడు. ఆవిడెంతో గర్వపడింది. “మీ నాన్న పోలికొచ్చిందిరా నీకు. ఆయన కూడా ఎంతో కష్టజీవి. ఎప్పుడూ పొలాన్నే ఉండేవారు!” అంది గర్వంగా.

ఓ నెలన్నర తర్వాత, కొడుక్కి పూర్తిగా కాలినొప్పి తగ్గడంతో ఆమె మనసు తేలిక పడింది. ఆఫీస్‌కి వెళ్లడం మొదలు పెట్టాడు. “నేనిక వెళతారా!” అంది కొడుకుతో ఒక రోజు.

నారాయణ వెంటనే తల్లి పక్కన సోఫాలో కూర్చుంటూ “నేను చెప్పేది వినమ్మా! ఎనభై దాటాక ఒంటరిగా ఉండకూడదు, నీలాంటి పెద్దవాళ్ళు! ఎప్పుడు ఏం తేడా చేస్తుందో తెలీదు. ఇన్నాళ్లూ ఉద్యోగం గొడవలో నిన్ను పట్టించుకోలేదు. నేనిపుడు రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగం చేస్తూ ఊరిలో నువ్వు బాగానే ఉన్నావనుకుంటున్నాను.

మా అమ్మ అనుకోగానే ఒక ధైర్యం ఏ పిల్లలకైనా! చిన్నప్పటి నుండీ మనతో ఉండే అమ్మ ఎప్పటికీ ఇలాగే బానే ఉంటుంది అనుకునే మూర్ఖపు కొడుకుల్లో నేనూ ఒకడిని. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. నీకు మా అవసరం ఉండే వయసిదే! నేను పెద్ద కొడుకుని. నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి! అది ధర్మం. ఎప్పుడైనా చుట్టపుచూపుగా తమ్ముడింటికి వెళ్ళు అంతే! ఈ ఒక్కసారికీ మన ఊరు వెళ్ళు. నెమ్మదిగా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధం అవ్వు. ఒక నెలో రెండు నెలలో మహా అయితే ఒక ఆరునెలలు వరకే అక్కడుంటావు. తర్వాత ఇక్కడికి వచ్చెయ్యమ్మా! అక్కడిల్లు ఖాళీ చేసేసి పూర్తిగా” అంటూ కళ్ళ నీళ్లతో కొడుకు బతిమాలుతుంటే పార్వతమ్మకి భర్త గుర్తొచ్చి దుఃఖం పొంగుకొచ్చినా అణచుకుంది.

అప్పుడే వచ్చిన కోడలు కూడా “వచ్చెయ్యండత్తయ్యా! మీరు మాకేమన్నా బరువా? వంటమనిషీ, పని మనిషీ ఉన్నారు. నాకు మాత్రం ఏం ఇబ్బంది? మనవలు వస్తూ పోతూ ఉంటారు. మీ పూజలూ, పుస్తక పఠనం మీకుంటాయి” అంది భర్త వెనకే నిలబడి.

మరో రెండు రోజులున్నాక ఒకరోజు ఉదయమే బయలుదేరేట్టుగా కారు సిద్ధం చేసాడు నారాయణ.

“మీరు ఇక్కడికి వచ్చేసే ఉద్దేశంతోనే ఉండండత్తయ్యా!” అంటూ ఎంతో ప్రేమగా సాగనంపింది కొడుకుతో పాటు కోడలు.

“అలాగే వచ్చేస్తానులెండర్రా” అంది పార్వతమ్మ కారెక్కి చెయ్యి ఊపుతూ.

కారు వేగం అందుకున్నాక ‘అసలీ కొడుకులు తల్లుల మీద ప్రేమ కలిగి ఉండి, దాన్ని గట్టిగా ప్రదర్శిస్తే కోడళ్ళు కూడా వాళ్ళ వెనక తప్పకుండా నిలబడతారు’ అనుకుందామె. ఇన్నాళ్ళకైనా నా పెద్ద కొడుక్కి బాధ్యత తెలిసిందన్న సంగతి ఆవిడను సంతృప్తి పరిచింది.

‘ఎప్పుడెప్పుడు అమలాపురం వెళ్లి ఈ సంగతి వసంతకి చెబుతానా!’ అని ఆవిడ మనసు ఆరాటపడింది.

అక్కడ దిగాక ఎప్పట్లాగే వసంత ఆవిడని ఆదరించింది. మర్నాడు పనులన్నీ తీరాక, ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, కొడుకు తనని మకాం ఎత్తుకుని వచ్చెయ్యమన్నాడని చెప్పింది.

“పోనీలెండి పిన్నీ! మంచి మాట చెప్పారు! మీ నిదానం, నిబ్బరం గెలిచాయి. కొడుకుల్నీ, కోడళ్ళనీ ఒక్క మాట అనకుండా, వాళ్లపై నిష్ఠూరం వెయ్యకుండా పౌరుషంగా వండుకుని తిన్నారిన్నాళ్ళూ. అది ఇప్పటికైనా మీ పెద్దబ్బాయి గుర్తించారు. అదే సంతోషం” అంది వసంత మనస్ఫూర్తిగా ఆనందపడుతూ.

“ఇప్పుటికిప్పుడేమీ వెళ్లిపోనులే. మరీ నా ఆర్యోగం బాలేదు, చేసుకోలేను అనుకున్నాక సర్దుకుంటానక్కడికి. నువ్వు బెంగపడకు!” అంది పార్వతమ్మ వసంత వీపు చుట్టూ చెయ్యి వేస్తూ.

ఆ మాటకి వసంతకి కళ్ళ నీళ్లు తిరిగాయి. “స్నేహానికి వయసు అడ్డం కాదు పిన్నీ! అందుకే మనిద్దరం ఇంత బాగా కలిసిపోయి జట్టుగా ఉన్నాం!” అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ.

అది చూసి పార్వతమ్మ కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి.

“నేనెక్కడున్నా, అదే నీ పుట్టిల్లు అనుకుని నన్ను చూడడానికి రావాలి సుమా!” అంది పార్వతమ్మ.

“అంత మాటన్నారు అదే చాలు! తప్పకుండా వస్తాను” అంది వసంత ఆమె చెయ్యి పట్టుకుంటూ.

ఇంతలో ఎవరో గేట్ తీసుకుని రావడంతో ఇద్దరూ తెప్పరిల్లారు.

“పిన్నీ! సంవత్సరాది పండగ పది రోజులే ఉంది. మా పనమ్మాయి మొత్తం ఇల్లంతా దులిపి సర్దుతానంది. మీ కోసం చూస్తున్నాం” అంది, వసంత మర్నాడు సాయంత్రం వాకిట్లో కూర్చున్నపుడు.

పార్వతమ్మ “ఒక్క నిమిషం ఉండు తల్లీ ! అంటూ లోపలికి వెళ్లి తన చిన్న బీరువా తీసి, ఒక రవికెల గుడ్డ వెతికి అందులో పర్సులో ఉన్న వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చి “నువ్వు ఈ పండక్కి చీర కొనుక్కోవాలి నా పేరు చెప్పి” అంటూ వసంత చేతిలో పెట్టింది.

“అయ్యో! వద్దు పిన్నీ!” అంటుంటే “పిన్నీ అంటావు కదా! పినతల్లిని కాబట్టి నేనివ్వాలి నువ్వు తీసుకోవాలి!” అంటూ బలవంతంగా ఇచ్చింది పార్వతమ్మ. “ఆ చీర పండగనాడు కట్టుకోవాలి సుమీ!” అందామె. తలూపింది వసంత.

***

ఒక రోజు కూతురు నిర్మల నుంచి ఉదయాన్నే ఫోన్ వచ్చింది వసంతకి. ‘ఏదో గాలి దుమారంలా వచ్చి పోవటమే కానీ తల్లితో ఫోన్‌లో మంచీ చెడ్డా మాట్లాడే కుదురు ఉండదు కదా! ఈ మహాతల్లికి. ఏం పనొచ్చిందో? నాతో’ అనుకుంటూ ఫోన్ ఎత్తింది వసంత.

“అమ్మా! పిల్లలకి క్రిస్మస్ సెలవులు వారం రోజులిస్తున్నారు. మేం ఓ నాలుగు జంటలు కలిసి ఊటీ, కొడైకెనాల్ వెళదామని అనుకుంటున్నాము. పిల్లలకి అక్కడి చలిగాలి పడదని అంతా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరే వదిలేసి వెళుతున్నారు. నువ్వూ, నాన్నా పిల్లలిద్దరినీ ఒక వారం చూడండి మరి” అంది అధార్టీగా.

 “అలాగే పంపించు. నాకేం పనుంది ఖాళీయేగా నేను. పంపు నాన్నా!” అంది వసంత.

“నువ్వు ఖాళీగా ఉండవు. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటావు” అంది నిర్మల విసురుగా.

‘అవునమ్మా! అలా నటిస్తూ ఉంటాను’ అని మనసులో అనుకుని “ఏదో ఉద్యోగం చేసిన అలవాటు కనక ఖాళీగా ఉండలేక ఏ మొక్కల్లో పని చేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో ఉంటానంతే!” అని సంజాయిషీ ఇచ్చి

“సెలవులు రేపటినుంచి అనగానే ఆ రోజు రాత్రే పంపెయ్యి! స్కూల్ రేపనగా తీసుకుని వెళుదువుగానీ! సెలవుల్లో హోమ్ వర్క్ లేమన్నా ఇచ్చారేమో చూసి చెబితే నేను చేయించేస్తాను” అన్న తల్లి మాటలకి “సరే” అంటూ ఫోన్ పెట్టేసింది నిర్మల.

రోజూ మధ్యాహ్నాలు చదువుతున్న, ‘ప్రసిద్ధ భారతీయ నవలల పరిచయం’ అనే పుస్తకం తీసి రాక్‌లో గుర్తుగా పెట్టుకుంది వసంత. అన్నట్టుగానే మనవలిద్దరూ వచ్చి వారం రోజులు అమ్మమ్మా, తాతయ్యలతో ఉన్నారు. వసంతకి ఉత్సాహంగా గడిచాయి వారం రోజులూ, వాళ్ళకి చదువు చెబుతూ, స్నానాలు చేయిస్తూ అన్నాలు పెడుతూ రాత్రి పక్కలో వేసుకుని ఉత్సాహంగా కథలు చెబుతూ ఉంటోంది. వెంకట్రావు కూడా ఎంతో సంతోషపడ్డాడు ఈ వారమంతా.

వారం గిర్రున తిరిగింది. రావడం రావడం ఇటే వచ్చింది నిర్మల. “ఏం తిన్నారమ్మా వీళ్ళీ వారం రోజులూ?” అనడిగింది వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ.

“నేనేది చేసినా అన్నీ తిన్నారు. బియ్యం రవ్వ ఉప్మా, పుణుకులూ, పకోడీలూ, బజ్జీలూ, కోడి పలావూ, ఫిష్ ఇలాగే”

“అబ్బా! అవి మీ కాలం తిళ్ళు! మమ్మల్ని వద్దన్నా బెదిరించి అవే పెట్టారు. మా పిల్లలకి కూడా అవేనా?”

“ఏం పెట్టాలో నువ్వు చెప్పు మరి. నేనేది పెట్టినా వద్దనలేదు వాళ్ళు”

“పాస్తా, నూడుల్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, సూప్స్, కట్లెట్స్ లాంటివి చేసి పెట్టాలి”

“ఈసారి అలాంటి ప్యాకెట్లు తెచ్చి నాకు చూపించి చెయ్యి. ఆ కవర్లు దాచిపెట్టి మీ నాన్నచేత తెప్పించుకుంటాను”

అన్న తల్లి మాటలకి ఏం మాట్లాడాలో తోచక “సరే ఇంక మేం వెళతాం” అంది తల్లి ఇచ్చిన టీ తాగుతూ.

“రాత్రి ఏడయ్యింది. ఈ రాత్రికి ఉండిపో నిర్మలా! రేపు లేచి వెళుదురు గానీ” అంది వసంత.

“మీ పరుపు గట్టిగా ఉంటుంది, నాకు నిద్ర పట్టదు” అంది కానీ, ఆమెను దింపిన కారు తిరిగి రాకపోయేసరికి ఉండిపోవలసి వచ్చింది. అందరూ కలిసి భోంచేసాక తల్లి సర్దుకుంటూ ఉంటే, కొంతసేపు తండ్రితో మాట్లాడి పిల్లలతో కలిసి మంచం ఎక్కింది నిర్మల.

రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చూడడానికి వచ్చిన వసంతతో “అమ్మమ్మా! నాకు పాప్ కార్న్ కావాలి” అన్నాడు చిన్నాడు.

“ఇప్పుడొద్దమ్మా! అది తింటే రాత్రి నీకు దగ్గొస్తుంది” అంది వసంత.

వెంటనే నిర్మల “దగ్గొస్తే టాబ్లెట్ వేస్తాను గానీ, నువ్వు తెచ్చియ్యి” అంటూ విసుక్కుంది తల్లిమీద. వసంత మౌనంగా డబ్బా తెచ్చిచ్చి వెళ్లి పడుకుంది.

మర్నాడు పొద్దున్నే లేచి పెద్దవాళ్ళు కాఫీలు, పిల్లలు పాలూ తాగుతూ ఉండగానే కారు వచ్చింది. వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది నిర్మల.

“ఏంటండీ దీని అకారణ కోపం? చూసారు కదా దాని రుసరుసలు! రాగానే అమ్మా! ఈ వారం నీకు శ్రమ అయ్యిందా? వీళ్ళిద్దరూ నిన్ను విసిగించారా? అని అడిగేది పోయి ఇంటి యజమాని ఇంట్లో కాపలా మనిషి మీద విసుక్కున్నట్టు కసురుకుంటుందేమిటీ?” అని భర్త దగ్గర బాధ పడింది వసంత.

“ఏదో తిరిగి తిరిగి వచ్చింది కదా! అలిసిపోయి ఉంటుందిలే” అంటూ సర్ది చెబుతున్న భర్త వైపు తిరిగి “ధృతరాష్ట్ర ప్రేమంటే ఇదే కదా, మంచీ చెడ్డా చెప్పకుండా సమర్థించడం!” విసురుగా అంది వసంత.

భార్య ఆవేశం చూసిన వెంకట్రావు మౌనం వహించాడు. నిశ్శబ్దంగా షాప్‌కి వెళ్ళిపోయాడు.

భర్త మాటలకి వళ్ళు మండిపోయిన వసంత కొడుక్కి వీలైనప్పుడు ఫోన్ చెయ్యమని మెసేజ్ పెట్టింది,

కొడుకు ఫోన్ కోసం ఎదురుచూస్తూ పేపర్ ముందేసుకుని కూర్చుందామె. ఒక గంట ఆగాక ఫోన్ చేసాడు శైలేష్.

“చూడరా మీ అక్క! సెలవులకి పిల్లల్ని ఒక వారం పంపి, నేను బాగా చూడలేదన్నట్టు మాట్లాడి వెళ్ళింది. మీ నాన్నేమో, దాన్నే వెనకేసుకొస్తారు కానీ దానికి తప్పు చెప్పరు” అంది ఉక్రోషంగా.

“ఏడిసింది! ఎవరితో ఏం మాట్లాడాలో దానికి తెలియట్లేదు. కొంచెం పిచ్చెక్కినట్టుంది దానికి! నేనొచ్చినప్పుడు దాని సంగతి తేలుస్తాను” అన్నాడు ఓదార్పుగా.

“నువ్వొచ్చేదెప్పుడు? అడిగేదెప్పుడు?”

“నిజం, అమ్మా! జనవరి రెండో తారీకుకి వస్తున్నాం ఒక వారం ఉంటాం” అనగానే వసంత సంతోషపడిపోయింది.

 “సరే సరే వచ్చెయ్యండి మరి. వచ్చాక మాట్లాడుకుందాం” అంటూ ఫోన్ పెట్టేసి అప్పుడే హడావిడి పడిపోవడం ప్రారంభించింది వసంత. ఇల్లంతా సర్దడం మొదలు పెట్టింది. వాళ్ళుండే వారం రోజులూ ఏం వండాలీ? అని మెనూ రాసుకుంది. అందుకు కావలసిన కిరాణా సరుకులూ, కూరలూ లిస్ట్ రాసింది. పార్వతమ్మగారి చెవిన కూడా ఈ ఆనందపు వార్త వేసేసింది.

“మొన్ననే ఒక వారం పిల్లల్తో పరుగులు తీసావు. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోకుండానే మళ్ళీ సందడి మొదలా?” అంది పార్వతమ్మ అభిమానంగా

“తప్పదుకదా పిన్నీ” అంది వసంత

“మీరు కుర్ర ముసలివాళ్ళు కాబట్టి తప్పదు. మేం ముసలి ముసలివాళ్ళం, మాకిలాంటి బాధలేదులే!”

“అవన్నీ పడీ, పడీ ఇంత వరకూ వచ్చారు మీరు. మీ వయసుకి మిమ్మల్ని మీరు చూసుకోవడమే గొప్ప విషయం” అంది ప్రేమగా.

“ఇలాగే ఇంకొకళ్ళ మీద భారం వెయ్యకుండా, ఇలా నడుస్తూ నడుస్తూ వెళ్లిపోవడమే అదృష్టం మాకిప్పుడు!”

“అవేం మాటలు పిన్నీ! మీరు మీ కొడుకుల దగ్గరున్నా, నేను చూడడానికి వస్తాను కదా!” అంది.

“రాకపోతే నేను ఊరుకుంటానా?” అంది పార్వతమ్మ నవ్వేస్తూ.

చెప్పిన రోజుకే శైలేష్, భార్య స్వప్న, ఇద్దరమ్మాయిలూ దిగారు. పాపాయిలిద్దరూ “నానమ్మా” అంటూ చెరో భుజం మీదా వాలిపోయారు.

“ఎంతయినా ఆడపిల్లలు ఆడపిల్లలే!” అంది వసంత సంబరపడిపోతూ.

“చిన్నప్పుడు ఒకే! పెద్దయ్యాక ఎవరి పోలిక వస్తుందో ఏమిటో?” అంటూ తల్లిని ఉడికించాడు శైలేష్. “నీ తలకాయలే!” అంటూ వసంత నవ్వేసింది.

శైలేష్ అమ్మకీ, అక్కకీ చీరలూ, మేనల్లుళ్ళకి బట్టలూ, తల్లికీ, తండ్రికీ స్వెట్టర్లు తెచ్చాడు. “ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకూ?” అన్నాడు తండ్రి. “అవి పాతబడి ఉంటాయి. అవి తీసేసి ఇవి వేసుకోండి” అన్నాడు శైలేష్.

కోడలు స్వప్న బహు నెమ్మదస్థురాలు. ఆడపిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. “అత్తయ్యా! అత్తయ్యా!” అంటూ అత్తగారి వెనకే తిరుగుతుంది. ఆవిడ పని చేస్తుంటే పొరపాటున కూడా కూర్చోదు.

రెండు రోజులు రెండు నిమిషాల్లా గడిచిపోయాయి. వసంత చాలా స్పెషల్స్ చేసింది. పిల్లలు కూడా బాగా తిన్నారు అవన్నీ. మూడోరోజు “అమ్మా! రేపు మేం అక్కింటికి వెళతాం” అన్నాడు శైలేష్. “అలాగే” అంది వసంత. అక్క కోసం స్వీట్‌లూ, పళ్ళూ తండ్రిని తీసుకెళ్లి కొనుక్కొచ్చాడు శైలేష్. కొన్ని తండ్రి కిచ్చాడు వద్దంటున్నా వినకుండా.

మర్నాడు ఉదయమే లేచి, టిఫిన్లు తినేసి తయారయ్యి నిర్మల ఇంటికి బయలు దేరాడు శైలేష్ భార్యనీ, కూతుళ్ళని తీసుకుని. వసంత వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా సర్దుకుని మర్నాటికి టిఫిన్లకీ, లంచ్ డిన్నర్లకీ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడింది వసంత.

శైలేష్ ఫ్యామిలీని మర్నాడు మధ్యాహ్నం భోజనం చేస్తే కానీ వదల్లేదు నిర్మలా, శ్రీరామ్. అందరూ సాయంత్రం టీ టైంకి వచ్చారు. నిర్మల కూడా వచ్చింది. పిల్లలు నలుగురూ పరుగులు తీశారు ఇంటి చుట్టూ.

“అమ్మా! అక్కా, బావా మాకు తెగ మర్యాదలు చేశారు వియ్యంకుడూ, వియ్యపురాలూ వచ్చినట్టు” అన్నాడు శైలేష్  గట్టిగా నవ్వుతూ.

“ఇప్పుడు అమ్మాయిలకే గిరాకీ ఉంది మరి!” అన్నాడు వెంకట్రావు, అందరూ నవ్వారు.

“నాన్నా! అక్క అత్తగారూ, మావగారూ కూడా ఎంతో ప్రేమగా ఉన్నారు” అన్నాడు శైలేష్

“అవును. వాళ్ళు బంధువులంటే ప్రాణం పెడతారు. మంచి కుటుంబం!” అన్నాడు తండ్రి.

అక్కా, తమ్ముడూ, స్వప్నా కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటూ బాగా నవ్వుకున్నారు. అలా ఆ సాయంత్రం అంతా నవ్వులతో గడిచిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళిపోయింది నిర్మల కొడుకుల్ని తీసుకుని. మనవరాళ్ళిద్దరూ నాన్నమ్మకీ, తాతయ్యకీ మధ్యలో పడుకుని బోలెడు కబుర్లు చెప్పి మురిపించారు.

మర్నాడు శైలేష్ “అమ్మా! ఏదైనా గుడికి వెళ్లి అక్కడినుంచి లంచ్‌కి బైటికి వెళదాం” అన్నాడు. సరేనంది వసంత. పదకొండుకల్లా తయారయ్యి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి, అక్కడినుంచి హోటల్‌కి వెళ్లి భోంచేసి వచ్చారు. ఆ తర్వాతి రోజన్నాడు శైలేష్ “అమ్మా రేపు రాత్రికే ప్రయాణం. బెంగుళూరుకి టికెట్లున్నాయి”

“వారం అన్నావు కదరా?” అంది వసంత విస్మయంగా.

“లెక్క వెయ్యి. వెళ్ళేటప్పటికి వారం అవుతుంది” అన్నాడు కొడుకు నవ్వుతూ.

“అవునత్తయ్యా! మాకూ అలాగే ఉంది మొన్నే వచ్చినట్టుంది” అంది కోడలు.

వసంతకి కొడుకు కుటుంబం వెళ్ళిపోతోందంటే దిగులు కలిగింది. అయినా సర్దుకుని, “మళ్ళీ ఎప్పుడొస్తారు?” కొడుకు నడిగింది. “వేసవి కాలం మీరే రండి. ఓ నెల ఉండి రావచ్చు. అక్కడ చల్లగా ఉంటుంది” అన్నాడు.

“సరే” అన్నారు తల్లీ తండ్రీ.

కోడలు లేనప్పుడు చూసి ఆత్రంగా కొడుకునడిగింది వసంత “అక్కనడిగావా? అమ్మనెందుకే ఏడిపిస్తున్నావనీ? అమ్మతో కాస్త ప్రేమగా ఉండమని చెప్పావా?”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here