మలిసంజ కెంజాయ! -21

6
10

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[రేణుక తనే స్వయంగా తల్లికి సేవలు చేయడం చూసిన నిర్మలలో అంతర్మథనం మొదలవుతుంది. అమ్మకి అన్నం పెడుతూ రేణుక అన్న మాటలు విన్న నిర్మల తన గురించి, అమ్మ వసంత గురించి తలచుకుంటుంది. అమ్మ పట్ల తన ప్రవర్తనకి సిగ్గు పడుతుంది. అత్తగారిని చూడడానికి అమ్మానాన్నలు వస్తే, అమ్మని పరిశీలనగా చూస్తుంది నిర్మల. రేణుక వసంతకీ, వెంకట్రావుకి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు చెబుతుంది. తన ఆడపడుచు పాటి ఆప్యాయత కూడా తానెప్పుడూ వారి పట్ల చూపలేదు కదా అని నిర్మల సిగ్గుపడుతుంది. అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక, తండ్రికి, తమ్ముడికి జాగ్రత్తలు చెప్పి, నిర్మలకి అమ్మని గమనించుకుంటూ ఉండమని చెప్పి, అమెరికా వెళ్ళిపోతుంది రేణుక. ఒకరోజు వసంత మొక్కల్లో కలుపు తీసి, గొప్పు తవ్వి లేచి వస్తూ సిమెంట్ గట్టు ఎక్కబోతూ కాలి జారి తూలిపడబోయి నిలదొక్కుకుంటుంది. సాయంత్రానికి కాలు వాచడంలో వెంకట్రావు ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. ఎముక విరగలేదు. అతి సన్నని క్రాక్ వచ్చిందనీ ఏమీ ప్రమాదం లేదనీ చెప్పి కాలికి పట్టీ కట్టుకొమ్మని చెప్పి మందులిస్తాడు డాక్టర్. మరో గంటకల్లా తండ్రి ద్వారా కబురు తెలుసుకున్న నిర్మల వస్తుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ, వంట చేసి తండ్రికి బాక్స్ కట్టి ఇచ్చి పంపుతుంది. మర్నాడు కల్లా ఆడపడుచు రేణుక తల్లిని అమెరికా నుంచి వచ్చిచూసుకోవడం వల్ల కూతురి ప్రవర్తనలో కలిగిన పరివర్తన ఇది అని వసంత గ్రహిస్తుంది. మూడు రోజులయ్యాకా, వసంతకి తగ్గాకా, నిర్మల బయల్దేరుతానంటుంది. జడవేస్తాను రా అని వసంత పిలుస్తుంది.  అప్పుడు నిర్మల తన మనసులోని భావాలని తల్లికి చెప్పి, మనోభారం దింపుకుంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకి నిర్మల అత్తగారు కారులో వచ్చి, కాసేపు కబుర్లు చెప్పి, నిర్మలని తీసుకుని వెళ్ళిపోతుంది. నిర్మలలో వచ్చిన మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఒక రోజు వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి పవన్ అనే అబ్బాయి పుట్టినరోజు ఆశ్రమంలో జరుపుతున్నామనీ, వసంతనీ పార్వతమ్మని తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తారు. ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడి ప్రాంగణమంతా ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తుంది. పవన్ వచ్చి వీళ్ళని పరిచయం చేసుకుని పాదాలకు దణ్ణం పెడతాడు. ఈలోగా కేక్ వస్తుంది. ఆ కేక్‍ని ముగ్గులు వేసిన రమణమ్మ చేత కట్ చేయిస్తాడు పవన్. అప్పుడు పవన్ గురించి చెబుతూ – ఈ అబ్బాయి పురాణాలు బాగా చదువుకున్నాడు. వేదాంత విషయాలు బాగా మాట్లాడుతాడు. మీకెవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగండి అని అంటారు. ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]డగండి. జీవితాన్ని బాగా కాసి వడపోసినవాడు. ఏదడిగినా తడుముకోకుండా చెప్పగలడు” అన్నారాయన.

“నువ్వు పెళ్లి వద్దనుకుంటున్నావంట కదా! ఎందుకు బాబూ?”

“అయ్యో! అదంతా దుష్ప్రచారం అమ్మా! నేను పెళ్లి వద్దనుకోవడంలేదు. ఆడపిల్లలే నన్ను వద్దనుకుంటున్నారు”

పవన్ హాస్యస్ఫూర్తికి అందరికీ ఉత్సాహం కలిగింది.

“ఎందుకనీ? మంచి ఉజ్జోగం, జీతం ఉన్నాయంటకదమ్మా నీకు?”

“అవునమ్మా! ఉన్నాయి.కానీ నేను కంప్యూటర్ చదువు చదివిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కాదని ఎవరూ ఒప్పుకోవడం లేదమ్మా!”

“అయ్యోరామా!”

“ఇంకా నేను వాళ్లకిష్టమైన సినిమా హీరోలాగా లేనంటమ్మా!”

“కృష్ణ కృష్ణా! కలికాలం! ఆడపిల్లలకి పెళ్లికాని రోజులు చూశాం!” ఒకావిడ అంది.

“అవునిప్పుడు, మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు” మరొకావిడ అంది.

“ఎందుకలా?”

“అమెరికా పెళ్ళికొడుకు కావాలనేమో?” ఒకావిడ సందేహపడింది.

“అదీ ఒక కారణమే!” ఒప్పుకున్నాడు పవన్. “ఇంకో కారణం ఏంటంటే నాకు తల్లీ, ఇద్దరు పెళ్లికాని అక్కలూ ఉన్నారు”

“ఉంటే ఏంటట?”

“ఎవరూ లేని ఒంటికాయ శొంఠికొమ్ము కుర్రాడు కావాలంట” అన్నాడు పవన్.

“సరి, సరి. ఆ పిల్లాడి సంగతి పక్కకి పెట్టి మీ ధర్మ సందేహాలు అడగండి” అన్నారు వెంకటేశ్వరరావు మాష్టారు. ఆడవాళ్లు పక్కన ఉన్న మాష్టారి మిత్రుల వైపు బిడియంగా చూశారు.

అది గమనించిన మాష్టారు “భోజనాల వాన్ రావడానికి ఇంకో అరగంట టైం ఉందంట. మా మిత్రులమంతా అలా తోటలోకి వెళ్లొస్తాం” అనగానే మగవాళ్ళు లేచారు. ఆడవాళ్లు ‘అమ్మయ్య’ అనుకున్నారు.

“ఇంత దూరంగా ఎందుకు? నేనే మీ దగ్గరికి వస్తాను!” అంటూ తన కుర్చీ ఆడవాళ్ళకి దగ్గరగా వేసుకున్నాడు పవన్. వెంటనే వాళ్లంతా కుర్చీలు అతని చుట్టూ వేసేసుకున్నారు.

ఒకామె గొంతు సవరించుకుని “బాబూ! ధ్యానం చెయ్యండి అంటూ వుంటారు. అంటే దాన్నెలా చెయ్యాలో తెలీదు. ఒక పుస్తకం కూడా కొన్నాను, అయినా అర్థం కాలేదు. మాకు పూజ తెలుసు. స్నానం చేసి దేవుడి పటాలకి పువ్వులు పెట్టి, దీపం వెలిగించి ఏ అరటిపళ్ళో, కొబ్బరికాయో నైవేద్యం పెట్టి, మాకొచ్చిన శ్లోకాలు రెండూ, పద్యాలు రెండూ పలికి కళ్ళుమూసుకుని దణ్ణం పెడుతూ ఉంటాం. కానీ ఈ ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని అలా కొంతసేపుండి వెనక గోడకి అనుకుంటే నిద్ర పట్టేస్తుంది బాబూ!”

“అమ్మా! దాన్ని పగటి నిద్ర అంటారు కానీ ధ్యానం అనరమ్మా” పవన్ మాటకి అంతా గొల్లుమంటూ హాయిగా నవ్వారు. పార్వతమ్మ కూడా నవ్వుతున్న వసంత వైపు చూసి నవ్వింది.

“అమ్మా! కళ్ళు మూసుకుని కూర్చోగానే కంటిముందు ఏమీ కనబడక పోవడం వల్ల, మన మనసు జరిగిన సంఘటనల వైపు వెళ్ళిపోతుంది. మనకి అలవాటే కనుక పరనింద వైపు వెళ్ళిపోతాం. వాడలా అన్నాడు. వీడిలా అన్నాడు. ఈసారి వీడు కనబడినప్పుడు ఇలా అనాలి. వాడు కనబడినప్పుడు అలా కడిగిపారెయ్యాలి. ఊరుకోకూడదు. ఇలాంటివేగా! మన ఆలోచనలు. ఇలా అనేక ఇతర విషయాల్లో ధ్యానం నిలపడమే పరధ్యానం అన్నమాట. అలా ఏ విషయం పైనా దృష్టి నిలపకుండా ఏకాగ్ర చిత్తంతో ఉండడమే ధ్యానం అన్నమాట” అని మళ్ళీ కొనసాగించాడు పవన్.

“ఇంకా వివరంగా చెప్పాలంటే, ధ్యానం అంటే, తదేక దృష్టిలో మనసు అటూ ఇటూ పోకుండా ఒక చోట నిలబెట్టడం అన్నమాట! మొదట్లో కష్టం అయినా నిత్యం ఒకే ప్రదేశంలో కూర్చుని కొంత సమయం, అయిదు నిమిషాలో పది నిమిషాలో ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఏకాగ్రత అలవాడుతుందమ్మా! అదేం బ్రహ్మ విద్య కాదమ్మా!

ఇక, పూజలో కూడా మన ధ్యాస, దేవుడిమీద నిలవదు. మా పిన్ని గారొకావిడ దేవుడి ముందు కూర్చుని, ఓం శుక్లాంబరధరం అని మొదలు పెట్టి ‘ఒరేయ్ ఆ కుక్కర్ మూడు కూతలు వేసేసినట్టుంది. మరో కూత వెయ్యనిచ్చి కట్టేయండర్రా!’ అని, విష్ణుం శశివర్ణం అని అందుకుని ‘ఆ పొయ్యిమీద పప్పు మాడిపోతుందేమో! ఇంకో గ్లాస్ నీళ్లు పొయ్యండర్రా!’ అంటూ, చతుర్భుజం అని కొనసాగించి ‘పాలుగానీ పొంగాయా ఏమిటీ? ఆ మాడువాసనేమిటీ?’ అని అరుస్తూ, చిత్తాన్ని వంటింట్లో పెట్టి, శరీరాన్ని దేవుడి గదిలో పెట్టి అవధానం చేస్తుండేది. ఆ గంటాగి ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళాక, కాస్త ప్రశాంతంగా ఆ పూజ చేసుకోవచ్చు కదా! ఎందుకంత బాధ?” అన్న పవన్ మాటలకి అందరూ గుక్కపట్టి నవ్వారు.

నాగమ్మ “నేనొక మాట చెప్పొచ్చా బాబూ?” అనడిగింది నెమ్మదిగా పవన్‌ని.

“అవశ్యము చెప్పవచ్చును తల్లీ!” అన్నాడతను నాటకీయంగా. అందరి మొహాల్లో చిరునవ్వులు విరిశాయి.

“భగవంతునితో అనుబంధం పెంచుకోవడానికీ, గురి కుదరడానికీ మన కృషి కూడా చాలా ఉండాలి. మన తరఫు నుంచి ఒక్కడుగు వేస్తే చాలంట. దేవుడు పదడుగులు వేసి మన దగ్గరికి వస్తాడంట. ఇలా అని స్వాములు చెబుతుంటారు. నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే మొక్కుబడి పూజలు అలవాటుగా ఉండేది. కానీ దానివల్ల నా మనసుకు శాంతి దొరికేది కాదు. కోరికలు కలిగినప్పుడు మొక్కులు మొక్కే దాన్ని. కోరికలు తీరాక మొక్కులు చెల్లించి సంబరపడిపోయి అందరికీ చెబుతుండేదాన్ని. అలాగే కష్టాలు వచ్చినపుడు దేవుడి మీద నిష్ఠూరం వేసేదాన్ని. నేనిన్ని పూజలు చేసినా నీకు నా మీద జాలి లేదు కష్టాలు బహుమతిగా ఇస్తున్నావు. ఏ పూజలూ చెయ్యని వాళ్ళమీద కనికరం చూపించి లాభాలు కలిగిస్తున్నావు – అంటూ ఇలాగే ఏవేవో అనుకుంటూ దేవుడి మీద అలిగేదాన్ని.

జీవితంలో మొదటిసారి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ఇల్లు వదిలి ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నాలో ఒక పెద్ద మార్పు వచ్చింది. దేవుడిని ప్రార్థించడం అంటే ఏమిటో తొలిసారి అర్థమయ్యింది. ఇంతకు ముందు నేను చేసిన పూజలను మించిన ప్రార్థన గురించి అవగాహన కలిగింది. దేవుని పట్ల ఆర్తితో ఉండడం అంటే ఏమిటో తెలిసింది. ఆత్మ నివేదన ఎలా ఉంటుందో తెలుసుకోగలిగాను. ఇప్పుడే ఆ రుచీ అందులోని తాదాత్మ్యత కొంచెం కొంచెం అనుభవంలోకి వస్తున్నాయి. అయితే సర్వాంతర్యామి అయిన భగవానుని సృష్టి అయిన ఈ లోకంలోని ప్రతి చిన్నప్రాణిలోనూ, చెట్టూ, పుట్టలోనూ ఆ దేవదేవుని చూడగలిగే పరిణతి రావాల్సిఉంది. ఆ దిశగా అడుగులు వేయాలన్న తపన ఉంది. ఇవన్నీ మనోవికాసానికీ, నైర్మల్యానికీ నిదర్శనాలు. ఇవన్నీ అనేక మెట్లు! ఏవో కొన్ని మెట్లు ఎక్కగలిగామని సంతృప్తి పడి ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో ఎక్కాల్సిన మెట్లున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది బాబూ నాకు!” అని ఆగింది.

పవన్ ఆనందంగా “చూశారా! పై పై భక్తి కాకుండా లోపలి నుంచి భక్తి పుట్టాలని నాగమ్మ గారు ఎంత బాగా చెప్పారో! అందుకే మనలో మనమే సత్సంగం పెట్టుకోవాలి. ఎన్నో విషయాలు తెలుస్తాయి”

ఆ మాటలకి నాగమ్మ “అయ్యో మీరేదో చెబుతుంటే ఆనందంతో నేనూ ఏదో చెప్పేశానంతే!” అంటూ సిగ్గుపడింది.

“లేదు తల్లీ! మీరు చాలా మంచి సంగతులు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనివాళ మా అమ్మగారితో మీరన్న మాటలు చెబుతాను. ఆవిడ ఎంతో సంతోషపపడుతుంది” అన్నాడు పవన్.

“అమ్మా! ఇంకా ఎవరికైనా ధర్మ సందేహాలుంటే అడిగేస్తే, నేనేదో నాలుగు ముక్కలు చెబుతాను లేదంటే నాగమ్మ గారు చెబుతారు. ఆ తరువాత మనమంతా హాయిగా భోజనం చెయ్యొచ్చు” అన్న పవన్ మాటలకి స్పందిస్తూ ఒకావిడ, “మాలో చాలా మంది పిల్లలు ఉజ్జోగాలు చేసుకుంటున్నారు. మమ్మల్ని పోషించలేని స్థితిలో లేరు. కానీ వాళ్ళకి టైం లేదు. అందరికీ ఇద్దరేసి పిల్లలు. వాళ్ళ చదువులతో ఊపిరాడకుండా ఉంటారు. మా కోడలు కూడా ఉజ్జోగమే! మా గురించి పట్టించుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండడం లేదు. ఈ ఆశ్రమంలో తోటివాళ్లతో కలిసి ఉండొచ్చు కదా! అని ఇక్కడ జేరానన్నమాట”

“బావుందమ్మా! మంచి పని చేశారు. వాళ్ళమీద మీకేమీ కోపం లేదు కదా! అది గొప్ప విషయం” అన్నాడు పవన్.

“కోపం లేదు కానీ ఎప్పుడైనా కాస్త ఫోన్ చేసి పలకరించొచ్చు కదా! అంత తీరికుండదా? అని మాకు దుఃఖం వస్తుంటుంది బాబూ! అప్పుడప్పుడూ. మేమే ఫోన్ చేసినా ఎత్తరు” అందొకావిడ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. పక్కన మరో ఇద్దరు కూడా తలూపారు మా కథా ఇదే అన్నట్టు.

“మీ బాధంతా నూటికి నూరు పాళ్ళూ నిజమే. ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయిందమ్మా!”

“మా కాలంలో మేం మా అత్తామావల్ని చూశాం కదా!”

“అలా అని మనం పిల్లల దగ్గర రూల్స్ మాట్లాడే రోజులామ్మా? ఇవి? మీరే చెప్పండి?”

“అవును బాబూ! సత్యం చెప్పావు!”

“ఇలా అంటున్నానని అనుకోవద్దు. నేనూ మీలో ఒకణ్ణి అనుకుని చెబుతున్నానమ్మా” అంటూ పవన్ మొదలు పెట్టాడు.

“మనం ఇప్పటికైనా ఈ బంధాల్ని వదిలించుకోవాలి. మీరంతా పిల్లలకి పెళ్లిళ్లు చేశారు. మనవల్ని చూశారు. అరవై ఏళ్ళు దాటినవాళ్లు. ఇప్పటికైనా మనం ఈ సంసార వ్యామోహాల నుంచి మనకి మనమే విముక్తి కలిగించుకోవాలని అనుకోవాలి.

ఇష్టమైతే భగవన్నామస్మరణ చేసుకోవాలి. లేదంటే విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవాలి. కాస్త మనసుకు తెరిపిగా ఉండడానికి ఎలాగూ టీవీ ఉంది. మా పిల్లలు ఏం చేస్తున్నారో? మనవలు ఏం చదువుతున్నారో? అంటూ మనకి మనసు లాగడం తప్పు కాదు. కానీ అవతల వాళ్ళకి మన గురించి ఆలోచించే సమయమూ, మనసూ రెండూ ఉండవమ్మా! నిజం మాట్లాడుకుందాం. ఏమంటారు?”

“అవునవును. ముమ్మాటికీ నిజం”

“అంచేత మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి. పలకరించినప్పుడే సంతోషంగా మాట్లాడదాం. వాళ్లనే అస్తమానూ తల్చుకుంటూ దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా? ఇక్కడ మనల్ని అనారోగ్యం వచ్చినా చూసుకునే వాళ్లున్నారు. వేళకింత పెట్టే వాళ్లున్నారు. ఓపిక ఉంటే మనం కూడా కాస్త శ్రమ పడొచ్చు. లేదంటే కూర్చోవచ్చు. ఎంతో మంది బైట ఈ సదుపాయాలు లేక బాధపడుతున్నారు. వాళ్లందరికన్నా మనం అదృష్టవంతులం అని ఆనందపడడమే మనం చెయ్యవలసిన పని. పిల్లల మీద కోపం వద్దు. మనం ఎవరిమీదైనా కోపం పెట్టుకుంటున్నామంటే నిప్పుని మన కొంగుకు కట్టుకున్నట్టే! అది ఎదుటివాళ్లకంటే ముందు మనల్నే కాలుస్తుంది. ఆ సంగతి గుర్తించబట్టే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి చుట్టం అన్నారు. ఎవరిమీద అలిగినా ఆరోగ్యం, సమయం వృథా మనకే తప్ప వాళ్ళకి ఎంత మాత్రమూ కాదు!

పిల్లలు మనల్ని పట్టించుకోవడం లేదు అని అస్సలు బాధ పెట్టుకోవద్దు. పిల్లల్ని మనం కని పెంచామని గర్వపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళూ అదే పని చేస్తున్నారు. అది లోక ధర్మం. పిల్లలు మనమెలా మన తల్లితండ్రులనించి వచ్చామో వాళ్ళూ అలాగే వచ్చారు. అది ప్రకృతి. వాళ్ళమీద మనకి హక్కు ఉందనుకోవద్దు. అది చాలా పొరపాటు. ఈ ప్రపంచంలో అంతా ఒంటరివాళ్లమే! ఒంటరిగా వస్తాం! ఒంటరిగానే పోవాలి! తల్లి తండ్రులను దయతో చూడాలి అనే సంస్కారం ఉన్న సంతానం చూస్తారు. ఆ ఇంగితం లేనివాళ్లు చూడరు. దానికి మనం ఏమీ చెయ్యలేం. అది వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యడం తప్ప. మీ జీవిత ప్రయాణంలో బంధువులనో, మిత్రులనో, సహచరులనో, ఇంకా ఎవరెవరినో తప్పని పరిస్థితుల్లో మీరు క్షమించారు. ఇప్పుడూ అదే చెయ్యండి మీ పిల్లల విషయంలో.

ఇంతవరకూ మనకి బాగానే జరిగింది. ఇక ముందు కూడా బాగానే జరుగుతుంది అనుకుందాం. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనకి ఎంతో మంది సాయం చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞులుగా ఉందాం. ప్రేమగా ఉందాం. మన చుట్టూ ఉన్నవాళ్ళకి మన ప్రేమని పంచుదాం. ప్రతిరోజూ మనకి మంచి తెస్తుందని ఉదయం లేవగానే అనుకుందాం. అసలు అరవైల తర్వాత మనం జీవించే సంవత్సరాలన్నీ భగవంతుడు మనకిస్తున్న కానుకలు అనుకుంటే చాలు.

మనం చూస్తూ ఉండగానే ఎంతో మంది ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏమీ చెయ్యలేం. మన చేతిలో ఉన్నదల్లా ప్రశాంతంగా జీవించడం. తోటివారికి స్నేహం, అవసరానికి ఒక మంచి మాట మాత్రం ఇవ్వగలం. ఆ పనే చేద్దాం. నిర్మమకారంగా ఉండడం, బంధాలని నెమ్మదిగా వదిలించుకునే దారిలో వెళ్లడం మాత్రమే మన తక్షణ కర్తవ్యం తప్ప ఇంకా సంసార సమస్యల్ని మోసుకుంటూ వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు అనుకోవడం అనేది మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేముందు కిటికీ సీట్ కోసం దెబ్బలాడడం లాంటిది ఏమంటారు?” అన్నాడు పవన్.

అతను చెబుతున్న మాటలని అంతా ఆసక్తిగా ఆనందంగా వింటున్నారు. అన్నీ వాళ్ళకి తెలిసినవే అయినా ఎదురుగా మరొకరు చెబుతుంటే మెదడుకూ, మనసుకూ తృప్తిగా ఉంటుందన్నట్టు చెవులు రిక్కించి వింటున్నారంతా. పవన్ చెబుతున్న మాటలకి అంతా నిశ్శబ్దంగా, తృప్తిగా తలలూపారు.

“అమ్మలూ! నా బుద్ధికి తోచినవేవో చెప్పాను. నేనేమైనా తప్పులు చెప్పాననుకుంటే మన్నించగలరు. అందరికీ నమస్కారం” అని ముగించాడు పవన్.

ఇంతలో ఆహార పదార్థాలతో నిండి ఉన్నలంచ్ గిన్నెలతో చిన్న ట్రక్ వచ్చేసింది. ఇద్దరు కుర్రాళ్ళు ఆ పక్కనున్న భోజనాల బల్లల్ని దగ్గరగా కలిపి వాటిపై పేపర్లు వేసి తెచ్చిన గిన్నెలు సర్దేసారు. వాన్ లోంచి విస్తరాకులూ, గరిటెలూ స్పూన్లూ తెచ్చి బల్లల మీద పెట్టారు. పులిహోర, చెక్కెర పొంగలి, కలగలుపు పప్పు, రసం, బెండకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబారు, పెరుగులతో మంచి భోజనం వచ్చింది.

“మరి ఇవాళ్టికింక ఈ సత్సంగం ముగించి, భోజనాల సంగతి చూసుకుందామమ్మా!” అన్నాడు పవన్.

“అలాగే బాబూ! మరోసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎంతో గొప్పగా, చక్కగా చెప్పావు” అంది ఒకావిడ.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here