మల్లిక – అల్లిక

0
13

[dropcap]ఉ[/dropcap]దయగిరి రాజు భార్గవసింహుడు కళాపోషకుడు. అయన అస్థానంలో కవులు, చిత్రకారులు, శిల్పులు వంటి అనేక మంది కళాకారులు ఉండేవారు.

భార్గవసింహునికి కళ, శిల్ప, మల్లిక అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. వారికి వివిధ విద్యలు నేర్పించడానికి తగిన గురువులను నియమించాడు రాజు.

కళ, శిల్ప మటుకు, “మాకు ధనరాశులు ఉన్నాయి, ఉన్నతంగా  చూసుకునే తండ్రి ఉన్నాడు, ఇక మాకు ఈ విద్యలు ఎందుకు?” అనుకుంటూ వారు విద్యలమీద తగిన శ్రద్ధ పెట్టకుండా కాలం గడప సాగారు.

అయితే మల్లిక మటుకు తాను అద్భుత చిత్రాలు చిత్రీకరించాలని, ఉత్తమ కవితా గ్రంథాలు వ్రాయాలని తన కళలు ప్రపంచంలో నిలవాలని కలలు కని తనకు సాధ్యమైనన్ని విద్యలు నేర్చుకోసాగింది. కళల పట్ల మల్లికకు ఉన్న ఆసక్తిని చూసి రాజు భార్గవసింహుడు అమెను మరింత  ప్రోత్సహించాడు.

మల్లిక పురాణాలకు సంబంధించిన అనేక అద్భుత తైల వర్ణ చిత్రాలు సృష్టించింది. పండితులు మెచ్చుకునే పద్యాలు వ్రాసింది.

ఇలా ఉండగా ఒకసారి అంతఃపురం మేడపైనుండి మల్లిక రహదారిని గమనిస్తున్నది. రహదారికి ఒక ప్రక్కన కర్రలు పాతి కట్టిన తాళ్ళపై అందమైన అల్లికతో అల్లిన ఊలు వస్త్రాలు వేసి ఒక స్త్రీ అమ్ముతున్నది. ఆ అందమైన ఊలు వస్త్రాలను చూసేసరికి మల్లికకు కూడా ఆ అల్లిక కళ నేర్చుకోవాలనే జిజ్ఞాస పుట్టింది!

వెంటనే తన చెలికత్తెను తీసుకుని ఆ వస్త్రాలు అమ్మే వనిత వద్దకు వెళ్ళి ఆ ఉన్ని వస్త్రాలు పరిశీలించింది, వాటిలో కళాత్మకతను గమనించింది.

ఆ వనితతో “అమ్మా, నాకు కూడా ఈ అల్లికను నేర్పించు, నీకు కొంత డబ్బు చెల్లిస్తాను”అని చెప్పింది.

ఆ స్త్రీ మొదట ఆశ్చర్యపోయి,మల్లిక జిజ్ఞాస చూసి అల్లిక నేర్పిస్తానని చెప్పింది

ఆ సాయంత్రం తన చెలికత్తెను పంపి ఆ స్త్రీని అంతఃపురానికి తీసుకరమ్మంది. ఈ విషయాన్ని గమనించిన మల్లిక ఇద్దరు అక్కలు “ఇప్పుడు నీవు నేర్చుకుంటున్న విద్యలు చాలవా?మరలా ఇప్పుడు ఈ అల్లిక విద్య నేర్చుకుంటున్నావు” అని హేళనగా మాట్లాడారు.

“అక్కయ్యలూ, నా ఉద్దేశంలో మనం నిరంతర విద్యార్థులుగానే ఉండి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, అప్పుడే మన బ్రతుకుకు ఒక ఉత్తమ అర్థం లభిస్తుంది” అన్నది.

“మాకంత ఓపిక లేదు” అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.

మల్లిక ఆమెవద్ద ఊలుతో అల్లకం రెండు నెలలలోనే నేర్చుకున్నది. ఆ ఊలు ఎలా, ఎక్కడ ఏ జంతువులనుండి వస్తుందో కూడా తెలుసుకున్నది. ఆమెను తగిన విధంగా సత్కరించి, నేర్పినదానికి తగిన డబ్బు  ఇచ్చి పంపింది.

ఇలా ఉండగా ఉదయగిరికి పడమర దిక్కున ఉన్న కొండల్లో ఎక్కడినుండో ఒక రాక్షసుడు వచ్చి అక్కడి జంతువుల్ని తిని, వృక్షాలను పెకలించి తిని వేస్తున్నాడు. అక్కడి కొండ జాతి వారు రాక్షసుడి ఉనికి గ్రహించి రాజు భార్గవసింహునికి తెలియచేశారు.

వాడి మీదకు సైన్యాన్ని పంపాలని రాజు నిర్ణయించాడు. కానీ వాడు భీకర ఆకారంతో, మహాశక్తివంతుడని తెలిసింది. మంత్రులతో ఈ విషయం చర్చిస్తున్నపుడు అటుగా మల్లిక వచ్చింది, వారి సంభాషణ ద్వారా రాక్షసుణ్ణి గురించి గురించి తెలుసుకుంది.

“నాన్నా నేను మీ చర్చలో పాల్గొనవచ్చా?” అని తండ్రి అనుమతి తీసుకుని ఈ విధంగా చెప్పింది “నాన్నా ఎంత రాక్షసుడైనా వాడికి ఏదో ఒక బలహీనతో, కష్టమో ఉండొచ్చు, వాటిని గమనించి తగినవిధంగా మనం వ్యవహరించి ఆ కొండలనుండి తరిమి వేయడమో, సంహరించడమో చేయవచ్చు. నాకు అవకాశం కల్పిస్తే నేను వెళ్ళి వాడి బలహీనత తెలుసుకుని వాడిని కట్టడి చేస్తాను”అని చెప్పింది.

మల్లిక మాటలు విని రాజు, మంత్రులు ఆశ్చర్యపోయారు!

“తల్లీ, వాడు రాక్షసుడు, క్రూరుడు అటువంటి వాడి వద్దకు వెళ్ళి నీవు ఏం చేయగలవు? వాడు నిన్ను గుటుక్కున మింగినా మింగుతాడు, అందుకే ఈ ఆలోచన మానుకో”అన్నాడు రాజు.

“నాన్నా, నాకొక అవకాశం ఇవ్వు, నామీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఒకవేళ నేను వాడికి బలి అయిపోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీలేదు, వాడి రహస్యాలు తెలుసుకుని మీకు ఏదో ఒక విధంగా చేరవేసి చనిపోతాను” అని ఎంతో ఉద్వేగంతో చెప్పింది.

మల్లిక తెలివితేటల మీద నమ్మకం ఉన్న రాజు మంత్రులతో దీర్ఘంగా చర్చించి, పదిమంది అతి బలాఢ్యులైన సైనికుల తోడు ఇచ్చి మల్లికను పడమర కొండలకు పంపాలని నిశ్చయించాడు.

నాన్న గారి నిర్ణయం విని మల్లిక జయ జయ ధ్వానాలు చేసింది.

ఆ రెండో రోజే మల్లిక పదిమంది సైనికులతో ఒక కత్తితో, తన అల్లిక సూదులతో, కొంత ఉన్నితో బయలుదేరింది. ఎందుకంటే ఒకవేళ రాక్షసుడు కనిపించడం ఆలస్యమవుతే ఉన్ని వస్త్రం అల్లవచ్చని మల్లిక ఆలోచన, మల్లిక సమయాన్ని వృథా చేయదు!

అలా వారు ఆ కొండలను సమీపించే సరికి అది ఎత్తైన ప్రదేశం కనుక అక్కడ విపరీతమైన చలి వేస్తున్నది! మల్లికకు ఆ రాక్షసుడు ఓ మర్రి చెట్టును విరుస్తూ దూరంగా కనబడ్డాడు. వచ్చిన మల్లికను, ఆ సైనికులను చూసి వాడు ఆశ్చర్యపోయాడు!

“ఎంత ధైర్యమే పిల్లా, నా దగ్గరకు రావడానికి?” అని భీకరంగా అరిచాడు. అప్పటికే వాడు చలితో వణుకుతున్నట్టు మల్లిక గమనించింది.

“రాక్షసోత్తమా, నేను ఉదయగిరి రాజు గారి కుమార్తెను, దయచేసి నా మాట విను. ఎన్నిరోజులు ఈ కొండల్లో చలిలో ఉంటావు? చెట్లు విరిచేస్తే మరింత ఎక్కువ మంచు పడి చలి పెరిగిపోతుంది. జంతువులను చంపితే చెట్లుకూడా పెరగవు. చెట్లకు, జంతువులకు విడదీయలేని సంబంధం ఉంటుంది. అదంతా ఇప్పుడు నీకు చెప్పలేను. కొన్ని కొండ జంతువుల వలన మనుషులకి, రాక్షసులకి ఎంతో ఉపయోగం” అని చెప్పింది.

ఆ మాటలకు వాడు ఆశ్చర్యపోయాడు! “ఏ విధంగా మా రాక్షసులకు మేలు జరుగుతుంది?” అడిగాడు.

“చూడు నీవు చలిలోఉన్నావు, నీ శరీరం మీద చలినుండి కాపాడే బట్టలు లేవు, ఈ కొండలలో కొన్ని రకాల మేకలు ఉన్నాయి. వాటిని అంగోరా మేకలు (ఇవి కాశ్మీరు ప్రాంతంలో ఇప్పుడు కూడా ఉన్నాయి) అంటారు. వాటికి విపరీతమైన వెంట్రుకలు ఉంటాయి! వాటిని కత్తిరించి చక్కని ఉన్ని దుస్తులు తయారు చేసుకుంటే అవి చలినుండి కాపాడుతాయి. వాటికి త్వరలోనే వెంట్రుకలు పెరిగిపోతాయి. మరి నీవు అటువంటి ఉపయోగం ఉన్న జంతువులను తినివేస్తే మరి ఉన్ని ఎక్కడనుండి వస్తుంది? ఆలోచించు”

రాక్షసుడు అంత క్రూరుడైనా మల్లిక మాటలు వాడిని ఆలోచింప చేశాయి.

“సరే, మొదట నన్ను చలినుండి రక్షించు. అంగోరా మేకల నుండి నేనే ఉన్ని వెంట్రుకలు పీకి ఇస్తాను, నా వెచ్చదనానికి దుస్తులు చేసి ఇవ్వు, తిండి కోసం వృక్షాలని విరవను, పుష్కలంగా ఉన్న చిన్న జంతువులను మాత్రమే తింటాను” అని మల్లికకు చెప్పాడు.

వాడి మాటలు విని మల్లిక,ఆమెతో వచ్చిన సైనికులు ఎంతో సంతోషించారు..

రాక్షసుడు పరుగున కొండల్లోకి వెళ్ళి, పది అంగోరా మేకల్ని పట్టుకొచ్చి వాటి ఉన్ని వెంట్రుకలను జాగ్రత్తగా ఓ సైనికుడి కత్తితో కత్తిరించి కుప్పగా పోశాడు! వాటితో మల్లిక సాయంత్రానికి వాడికి సరిపోయే చక్కని ఉన్ని దుస్తులు అల్లి ఇచ్చింది!

మరి సాయంత్రానికి చలిఎక్కువ అవుతుంది కదా! వాడు ఆ దుస్తులు ధరించే సరికి వెచ్చదనం కలిగి ఎంతో హాయి అనిపించింది.

“నీవు అప్పుడప్పుడూ వచ్చి నాకు సలహాలు ఇవ్వు, నీ మంచి మాటలు, నీవు అల్లిన దుస్తులు నన్ను మార్చాయి, నీవు ఇంత మేలు చేశావు కాబట్టి నీకు ఒక బహుమతి ఇస్తాను” అని కొండలలోకి వెళ్ళి పది అంగోరా మేకలను మల్లికకు ఇచ్చి”వీటిని తీసుక వెళ్ళి పెంచుకో, వాటి ఉన్నితో బోలెడు దస్తులు చేసి ఈ వచ్చిన సైనికులకు కూడా ఇవ్వు, కొన్ని నాకు పంపు” అని ఎంతో సంతోషంగా చెప్పాడు. వాడి మాటలకు మల్లిక, సైనికులు ఆశ్చర్యపోయారు.

మల్లిక అంతఃపురానికి వెళ్ళి రాక్షసుణ్ణి తను అల్లిన ఉన్ని దుస్తులతో ఏ విధంగా మార్చిదో తండ్రి భార్గవసింహునికి వివరించింది.

రాజు మిగతా ఇద్దరు కూతుళ్ళు కళ, శిల్పలను పిలిచి “చూశారా మల్లిక అల్లిక కళ క్రూరుడైన రాక్షసుణ్ణి మార్చివేసింది. మనిషన్నాక ఏదో ఒక కళ నేర్చుకొని ఉండాలి. అది ఎప్పుడైనా ఉపయోగ పడవచ్చు” అని వివరించాడు.

మల్లిక అల్లిక కళ, తండ్రి మాటలు వారిలో మార్పు తెచ్చాయి! అప్పటి నుండి వారు శ్రద్ధగా కొన్ని కళల మీద దృష్టి పెట్టి నేర్చుకోసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here