మలుపులు తిరిగిన దారి

0
8

[dropcap]సు[/dropcap]గుణగారు, నవరంగపట్నంలో పేరున్న లాయరు. ఆ ఊరి నడిబొడ్డున, విశాలమయిన బంగళాలో ఆవిడ నివాసం. అందులో ఆవిడ ఒక్కరే నివసిస్తున్నారు. తల్లిదండ్రులకు, ఆవిడ ఏకైక సంతానం. వివాహం చేసుకోలేదు. కేవలం లాయరుగారనేకాక, ఆవిడ చేసిన ప్రజాసేవకు, దానధర్మాలకు, ఆ ఊరివారందరూ సుగుణగారిని నిండు మనసుతో గౌరవిస్తారు. నిన్నటి రోజున, సుగుణగారికి ఎనభై సంవత్సరాలు నిండేయి. తన పుట్టినరోజు పండుగ, సుగుణగారు, ఆ ఊరులో తను స్థాపించిన వృద్ధాశ్రమవాసులతో కలసి నిరాడంబరంగా గడుపుకొన్నారు. వారితో కలసి, తను ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

నిన్ననే ఎనభై ఏళ్ళు నిండిన సుగుణగారికి, ఈ తెల్లవారుఝామున నూరేళ్లూ నిండిపోయేయి. భరింపశక్యము గాని గుండెపోటు కారణంగా, వైద్యచికిత్స అందేలోపలే, సుగుణగారు స్వర్గస్తురాలయ్యేరు. నిమిషాలమీద, నమ్మశక్యము గాని ఆ వార్త, నలుదిక్కులా ప్రాకింది. ఊరంతా, శోకసముద్రంలో మునిగిపోయింది. ఊరిలోని, చిన్నా, పెద్దా, దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేసేరు. ఆమెకు నివాళులు అర్పించడానికి, సాయంత్రం గాంధీ పార్కులో సంతాపసభ ఏర్పాటయింది. సాయంత్రమయింది. ఊరులోని రోడ్లన్నీ గాంధీపార్కుకే దారితీసేయి. పార్కు జనంతో కిటకిటలాడుతూ ఉంది. అందరి ముఖాలలో విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. సభ ప్రారంభమయింది. ఒక్కొక్కరూ వేదిక చేరి, స్వర్గస్తురాలయిన సుగుణగారు, ఊరుకు అందించిన సేవలు, సభకు విన్నవించేరు. సభలో ఊరిలోని పెద్దలందరూ, ఆవిడ వివిధ వర్గాలకు చేసిన సేవలు, చేసిన దానధర్మాలు, నెమరు వేసుకొని, సుగుణ గారు, మానవ స్వరూపంలో జన్మించిన దేవత, అని కొనియాడారు. సభ ముగిసింది. జనమంతా ఇళ్లకు తిరుగుముఖం పట్టేరు. ఒక వ్యక్తి మాత్రం ఓ మూల ఏదో ఆలోచిస్తూ, కూర్చొనే ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎందుకలా, ఇంకా కూర్చునే ఉన్నాడు?

పార్కులో ఇంకా కూర్చుని ఉన్న వ్యక్తి పేరు, గోపాలం. అక్కడకు దగ్గరలో నున్న బొరిగుమ్మపల్లి, అతని స్వస్థలం. తల్లి సీతాలుకు, తండ్రి నారాయణకు, కలిగిన జ్యేష్ఠ పుత్రుడు. గోపాలంకు, ఒక తమ్ముడు శంకరం, ఓ చెల్లెలు సువర్ణ. తమ్ముడన్నా, చెల్లెలన్నా, గోపాలంకు వల్లమాలిన ప్రేమ. తమ్ముడికి, రోజూ హోమ్ వర్కులో సాయం చేస్తూండేవాడు. చెల్లెలికి పాఠాలు బోధపరుస్తూండేవాడు. ప్రతీ అట్లతదియ నాడూ, స్వయంగా చెల్లిని ఉయ్యాలలో కూర్చోబెట్టి మెల్లగా ఊపేవాడు.

నారాయణ, వృత్తి వ్యవసాయం. సాగునీటి సదుపాయం అంతగా లేని కారణంగా, వ్యవసాయం మీద నిబ్బరంగా ఆధారపడే పరిస్థితి లేదు. అందుచేత, పిల్లలకు పెద్ద చదువులు చెప్పిస్తే, నికరమయిన ఆదాయం, ప్రతి నెలా ఆర్జించుకొంటూ, ఒడుదుడుకులు లేకుండా, జీవితం సుఖంగా గడుపుగోగలరని, నారాయణ నిశ్చయించుకున్నాడు. పిల్లలకు, ఆ విషయం పదే పదే చెబుతూ, కష్టపడి శ్రద్ధగా చదువుకోమని హెచ్చరిస్తూండేవాడు. ఊళ్లోని హైస్కూలు చదువు అయిపోగానే, పెద్ద కొడుకు, గోపాలంను దగ్గరలోని నవరంగపట్నంలో, కాలేజీ చదువులో చేర్పించేడు. శంకరం, సువర్ణ కూడా స్కూల్లో చదువుకొంటున్నారు.

గోపాలం కాలేజీలో చదువుకొంటున్న రోజుల్లో, కొందరు తనతోటి విద్యార్థుల ఆలోచనలకు ప్రభావితుడై, సివిల్ సర్విసెస్ పరీక్షలు రాయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ విషయం తండ్రితో చర్చించేడు. ఆ పరీక్షలు పాసయితే, కలక్టరు ఉద్యోగం దొరుకుతుందని నచ్చచెప్పేడు. ఆ పరీక్షలు రాయడానికి, ఢిల్లీలో ఆరేడు నెలలు శిక్షణ తీసుకోవలసి ఉంటుందని, ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుందని చెప్పేడు. కలక్టరు ఉద్యోగం దొరకగానే తమ్ముని పై చదువు, చెల్లెలి పెళ్లి, తన బాధ్యత అని హామీ ఇచ్చేడు. కొడుకు ఉన్నతాశయాలు విన్న తల్లిదండ్రులిద్దరూ, సంబరపడ్డారు. కలక్టరు పరీక్ష తప్పక రాయమని ఇద్దరూ నొక్కి చెప్పేరు. రెండు, మూడు ఎకరాల భూమి అమ్మేనా సరే, కావలసిన ఖర్చు పెట్టగలనని తనయునికి హామీ ఇచ్చేడు, నారాయణ.

గోపాలం, పి.జి. చేసి, సివిల్ సర్విసెస్ పరీక్షలకు శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళేడు. తండ్రి నారాయణ, తనకున్న పది ఎకరాల భూమిలో, ఐదు ఎకరాలు అమ్మి, కొడుకుకు ఆర్ధిక సమస్య లేకుండా చూసేడు. గోపాలం కూడా, రాత్రీ పగలు కష్టపడి, పరీక్షలలో విజయం సాధించేడు. ఐ.పి.ఎస్.కు సెలెక్టయ్యేడు. ట్రైనింగ్ పూర్తిచేసుకొని, బీహారు రాష్ట్రంలో, ఉద్యోగంలో చేరేడు. గోపాలం, పెద్ద పోలీసు ఆఫీసరయ్యేడని, తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు, గర్వపడ్డారు. గోపాలం తరచూ ఉత్తరాలు రాస్తూ, తండ్రికి వీలయినంత డబ్బు పంపించేవాడు. కాని ఆ మంచి రోజులు కొంచెం రోజులే గడిచేయి. క్రమ క్రమంగా, ఉత్తరాలు రాయడం తగ్గిపోయింది. మనియార్డర్లు కూడా బందయిపోయేయి. కారణం, గోపాలం తన డిపార్టుమెంటులో మరొక జాతికి చెందిన ఒక ఉన్నతోద్యోగి కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. అది అప్పటికి, ఎప్పటికీ, గోప్యంగానే ఉంచేడు. భార్య, ఆత్తవార్ల, ఒత్తిళ్లకు ప్రభావితుడై, తన కుటుంబానికి దూరమయ్యేడు. ఊహించని ఆ మార్పులు, క్షీణించిన ఆర్ధిక పరిస్థితి, నారాయణను కృంగదీసేయి. అలా ఉండగా, శంకరం పట్నంలోని కాలేజీ చదువుకు సిద్ధమయ్యేడు. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకొంటాడనే గంపెడాశతో, శంకరం పై చదువుకు ఆర్ధిక సాయం అర్థిస్తూ, నారాయణ గోపాలంకు ఉత్తరం రాసేడు. జవాబు లేదు. నిజానికి, అది అతనిని చేరకుండా చేసింది, భార్యామణి. శంకరం పై చదువుకు ఫులుస్టాపు పడింది. ఆ మార్పులను తట్టుకోలేక, ఓ రాత్రి, నారాయణ హరీ అన్నాడు. ఆ వార్త కూడా గోపాలంను చేరనివ్వ లేదు, భార్యామణి. ఆ తరువాత క్రొద్ద రోజులకే, నారాయణ భార్య సీతాలు, కూడా పరలోకంలో భర్త చెంతకు చేరింది. ఆ విషయం అన్నకు తెలియజేయలేదు, శంకరం.

పదే పదే, భార్య చేస్తూండే ఒత్తిళ్లను తట్టుకోలేక, గోపాలం తన పదవిని దుర్వినియోగం చేస్తూ, పెద్ద లంచగొండిగా మారేడు. ఆ విషయంలో, రెండు మార్లు ఇంక్విరీలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. గోపాలంకు మనశ్శాంతి లోపించింది. భార్యామణి, ప్రతి చిన్న విషయానికి పెద్ద రగడలు చేయడం మొదలు పెట్టింది. ఆ ప్రవర్తన గోపాలంను కలవరబరచి, డాక్టరును సంప్రదించేడు. అది ఒక రకమయిన మానసిక రోగమని తేలింది. చికిత్స ప్రారంభమయింది. కాని, ఆ వ్యాధి క్రమంగా ముదిరిపోవడంతో, గోపాలం భార్యకు, మానసిక చికిత్సాలయమే శాశ్వత చిరునామాగా మారింది. గోపాలం కష్టాలు అక్కడితో ఆగలేదు. తన ఏకైక పుత్రుడు, వ్యసనాలకు లోనై, తండ్రి అండ దండలు చూసుకొని, ఒక దౌర్జాన్యాల ముఠాకు నాయకుడిగా మారేడు. ఒక మర్డరు కేసులో ఇరుక్కొని, ప్రస్తుతం జైలులో ఊచలు లెఖపెడుతున్నాడు.

చాలా రోజులనుండి, గోపాలం, తన తల్లిదండ్రులకు, తమ్మునికి, చెల్లెలికి, చేసిన అన్యాయం తలచుకొంటూ, మనసులో బాధపడుతున్నాడు. తలవని తలంపుగా, ఒక రోజు గోపాలంకు తన చిన్ననాటి స్నేహితుడు బజారులో కనిపించేడు. గోపాలం అతనితో మనసు విప్పి మాట్లాడుకొన్నాడు. అతనిని తన కుటుంబ వివరాలు అడిగేడు. ఆ స్నేహితుడు, తనకు తెలిసినంత వరకు, తల్లిదండ్రులిద్దరూ పోయిన తరువాత, ఆ కుటుంబం శాశ్వతంగా నవరంగపట్నానికి మారిపోయేరని, తమ్ముడు శంకరం, అదే పట్నంలో, వేంకటేశ్వర వస్త్రాలయంలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పేడు. మరే వివరాలూ తెలియవన్నాడు. అది విని గోపాలం పశ్చాత్తాపంలో మునిగిపోయేడు. దేముడు, తనకు తగిన శిక్షే వేసేడని అభిప్రాయబడ్డాడు. రాత్రంతా ఆలోచించేడు. ఏమిటి చెయ్యడమా అని. ఆఖరకు ఒక నిశ్చయానికి వచ్చేడు. ఉద్యోగానికి రాజీనామా చేసి, నవరంగపట్నంలో తమ్ముడు శంకరంను కలసి, భావి జీవితం, తమ్ముడు, చెల్లెలితో గడపాలని. ఆ నిశ్చయమే గోపాలంను ఈ దినం నవరంగపట్నం చేర్చింది. తమ్ముని తొందరగా చూద్దామనుకొన్న గోపాలం, సుగుణగారి మరణానికి సంతాపసూచకంగా, పట్నం లోని దుకాణాలన్నింటితో బాటు, వెంకటేశ్వర వస్త్రాలయం కూడా మూసివేయబడ్డ కారణంగా, తమ్ముని కలియలేకబోయేడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి, ఏమీ తోచక గాంధీ పార్కుకు వెళ్ళేడు. అక్కడ సంతాపసభ జరుగుతూంటే, తనూ ఓ మూల కూర్చుని, పరధ్యానంగా, వక్తల పలుకులు చెవిన వేసుకొన్నాడు. అలా ఏకాంతంగా ఉన్న గోపాలం, కొంతసేపైన తరువాత, తను బస చేసిన హొటలు చేరుకొన్నాడు. రాత్రంతా, ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. సంతాపసభలోని వక్తల పలుకులు, ఒక్కొక్కటి జ్ఞాపకమొచ్చేయి. వారిలో ఒకాయన, సుగుణ గారు, ఆమె తల్లిదండ్రులు, వారి వృద్ధాప్యంలో ఎట్టి ఇబ్బందులు ఎదుర్కోకూడదని తలచి, జీవితాంతం అవివాహితగానే ఉండిపోయారని, ఆమె చేసిన త్యాగాన్ని కొనియాడేడు. అది తలచుకొని, గోపాలం తన ఉజ్వల భవిష్యత్తుకై, తన తల్లిదండ్రులు చేసిన త్యాగానికి, వారి యెడ తను చేసిన అమానుష ప్రవర్తన తలచుకొని, తనను తానే ఛీదరించుకొన్నాడు.

ఆ మర్నాడు, ఉదయం దుకాణాలు తెరవడం గమనించగానే, గోపాలం వెంకటేశ్వర వస్త్రాలయానికి వెళ్ళేడు. వస్త్రాలయం యజమానిని కలిసేడు. అతని ద్వారా గోపాలం తెలుసుకొన్న విషయాలు ; తమ్ముడు శంకరం పోయి సుమారు మూడేళ్లు కావస్తోంది. అతని ఏకైక పుత్రుడు, పి. జి. చేసి ఏదో పెద్ద కంపెనీలో ముంబాయిలో ఆఫీసరుగా చేరేడు. భర్త పోగానే, శంకరం భార్య, కొడుకు వద్దకు వెళిపోయింది. చెల్లెలు సువర్ణ తెలివితేటలుగా చదువుకొని, బెంగళూరులో ఎం.బి.ఎ. చేసి, ఏదో పెద్ద కంపెనీలో మేనేజరుగా చేరింది. సువర్ణ ఉన్నత విద్యకు, దివంగత సుగుణ గారు ఆర్ధిక సాయం చాలవరకు అందజేసేరు. ప్రస్థుతం పెళ్లయిన తరువాత సువర్ణ, భర్తతో బాటు అమెరికాలో ఉంటోంది. మరే వివరాలూ తెలీవు. శంకరం గూర్చి, గోపాలం మరికొన్ని విషయాలు తెలుసుకొన్నాడు. గోపాలం కలుసుకున్న వస్త్రాలయం యజమాని, స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే, అతని తండ్రి హఠాత్తుగా పోయేడు. ఆ పరిస్థితిలో, వస్త్రాలయం నమ్మకంగా నడిపే పెద్ద దిక్కు ఎవరూ లేని కారణంగా, అప్పటికే తమ వద్ద పనిచేస్తున్నశంకరం మీద సదభిప్రాయం ఉండడం మూలాన్న శంకరానికి ఆ బాధ్యత అప్పచెప్పడమయింది. శంకరం ఎంతో నమ్మకంగా పనిచేస్తూ, ఎట్టి ప్రలోభాలకు లోనుగాకుండా, వస్త్రాలయాన్నిచాలా అభివృద్ధి చేసేడు. ఆ కారణంగా, శంకరం పై గల గౌరవసూచకంగా, ప్రతిఏటా అతని పుణ్యతిథినాడు, వస్త్రాలయ యాజమాన్యం బీదలకు అన్నదానం చేస్తున్నారు.

వస్త్రాలయంనుండి గోపాలం తను బస చేసిన హోటలు చేరుకొని, దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. తమ్ముడు ఇహలోకంలో లేడు. అతని భార్య, కొడుకు ఎక్కడున్నారో తెలీదు. చెల్లెలు, పై దేశంలో ఉంది. ఆమె చిరునామా కూడా తెలీదు. తనకు, భార్య, కొడుకు, ఉండీ, లేనట్టే అయింది. తను చేసిన ఘోరమయిన తప్పులన్నీ తలచుకొని, సమాజం ఏ దృష్టితో తనను, తమ్ముని చూస్తోందో ఊహించుకొని, తనను తాను నిందించుకొన్నాడు. పోలీసు శాఖలో అత్యున్నత పదవినధిష్టించినా, లంచకొండితనానికి చిరునామాగా మారి, మాయలేని మచ్చ తెచ్చుకొన్నాడు తను. మరి తమ్ముడో, ఒక బట్టల దుకాణంలో చిరుద్యోగిగా చేరి, నీతి నియమాలు, సత్ప్రవర్తనలతో, యజమానుల దృష్టినాకర్షించి, పరిస్థితుల ప్రభావాన్న, వస్త్రాలయ యాజమాన్యం దక్కినా, అధికార దుర్వినియోగానికి పెక్కు అవకాశాలున్నా, లేశమాత్రమూ దురాశకు లోనుగాక, అతి విశ్వసనీయమైన ఉద్యోగిగా యజమానుల మన్ననలందుకొని, చనిపోయిన తరువాతకూడా గౌరవింపబడుతున్నాడు. అంతే కాదు. తన ఉజ్వల భవిష్యత్తుకై సర్వమూ ధారబోసిన తండ్రిపట్ల, బాధ్యతారహితంగా తను చేసినదేమిటి. ఎట్టి బాధ్యతలూ లేకపోయినా, తన చెల్లిలి ఉన్నత విద్యకు, సుగుణగారు ఎంత సుహృద్భావముతో, చేయూతనిచ్చేరు. ఇలా, తలచుకొంటే ఎన్నో ఉన్నాయి. కాని తన గత చరిత్రను తిరిగి రాయలేడు. భవిష్యత్తు, తన చేతిలో ఉంది. దానికి కార్యాచరణ ఏమిటి. గోపాలం దీక్షతో ఆలోచించసాగేడు. పశ్చాత్తాపంతో ఋణం తీర్చుకొందామంటే, చెల్లి, తమ్ముని కుటుంబాల జాడ తెలీదు. కిం కర్తవ్యమ్, అని దీర్ఘంగా ఆలోచించేడు. తన చిన్ననాటి స్నేహితుడు కలిసినపుడు, తను పుట్టి పెరిగిన బొరిగుమ్మపల్లి, ఇప్పటికీ, ఎట్టి అభివృద్ధీ లేక దీనావస్థలో ఉందని చెప్పడం జ్ఞప్తికి వచ్చి, కనీసం, పుట్టి పెరిగిన గ్రామాభివృద్ధికి సేవలందించి, శేష జీవితాన్నైనా సార్థకం చేసుకొందామనుకొన్నాడు. కాని, పెద్ద సంశయం. ఆ గ్రామవాసులు గ్రామంలోకి అడుగు పెట్టనిస్తారా. అద్దంలో, తన ఆకారాన్ని చూసుకున్నాడు. ఊబకాయము, బట్టతల గల, తన ప్రతిబింబం చూసుకొని, ఆ ఆకారంలో తన్నెవ్వరూ గుర్తు పట్టలేరని నిబ్బరబడ్డాడు. మారుపేరుతో బొరిగుమ్మపల్లిలో అడుగు పెట్టడానికి నిశ్చయించుకున్నాడు.

గోపాలం, తన పేరును, గోవిందరావుగా మార్చుకున్నాడు. కొన్ని దశాబ్దాల తరువాత, గోపాలం, తను పుట్టి పెరిగిన బొరిగుమ్మపల్లిలో, గోవిందరావుగా అడుగు పెట్టేడు. ఆర్మీలో పని చేసి రిటైరయ్యేనని, గ్రామవాసులకు చెప్పేడు. తను ఏకాకినని, శేషజీవితం, ప్రశాంతంగా ఒక గ్రామంలో గడుపుదామని, బొరిగుమ్మపల్లి వచ్చినట్లు చెప్పేడు. రెండుగదుల పెంకుటిల్లు అద్దెకు తీసుకొన్నాడు. గోవిందరావుగా మారిన గోపాలం, మరోసారి యాదృచ్ఛికముగా, బొరిగుమ్మపల్లిలో జీవించ నారంభించేడు. క్రమంగా, ఇరుగు పొరుగు వారితోను, ఊళ్లోని పెద్దలతోను, పరిచయాలు చేసుకొన్నాడు. అలా ఉండగా, తను పుట్టిపెరిగిన ఇల్లు అమ్మకానికి వచ్చిందని తెలిసింది. జాప్యం చేయకుండా, అది తనదిగా చేసుకొన్నాడు. అది భగవత్సంకల్పమే, అని పొంగిపోయేడు. కావలసిన మరమ్మత్తులు చేయించి, తండ్రి కట్టిన ఇంటిని కంటికింపుగా చేసేడు. పెరడులో, దీనావస్థలోనున్న ఊయలను పునరుద్ధరించి, తన చిన్ననాటి రోజుల్లో, ఆ ఊయలులో చెల్లెలును కూర్చుండబెట్టి, మెల్లగా ఊపుతూండే మధుర క్షణాలు నెమరువేసుకొన్నాడు.

త్వరలో గ్రామదేవత పండుగలొస్తున్నాయి. ఆ పండుగలు నిర్వహించే విషయం చర్చించుకోడానికి రాబోయే ఆదివారం, గ్రామంలోని పెద్దలు ఊరి చివరనున్న గ్రామదేవత ఆలయంలో కలుస్తున్నారని గోపాలంకు (ప్రస్తుతం గోవిందరావు) తెలిసింది. ఆదివారంనాడు గోపాలం ఆలయం చేరుకొన్నాడు. అతని రాక గమనించిన, అతని పరిచయస్తులు కొందరు, గోపాలంను ఆహ్వానించి, సభలో పాల్గొనమన్నారు. పండుగల నిర్వహణ చర్చలో చురుగ్గా పాల్గొని, గోపాలం గ్రామపెద్దల దృష్టినాకర్షించేడు. పండుగల నిర్వహణకయ్యే ఖర్చులకు, సభ్యులొక్కక్కరు తమ చందా సభకు తెలియజేస్తున్నారు. గోపాలం కూడా తన వంతు చందా, అందరికంటే అత్యధికంగా తెలియజేసేడు. సభలో ఒకాయన, దేవి ఆలయానికి కొన్ని పెద్ద మరమ్మత్తులు చేయవలసి ఉందని, పండుగలకు ముందుగా అవి చేయిస్తే బాగుంటుందని, అభిప్రాయబడ్డాడు. అది ఎక్కువ ఖర్చుతో కూడిన పనని, పంటలు వచ్చేక అవి చేబట్టవచ్చని కొందరు సలహా ఇచ్చేరు. అది విని, గోపాలం ఎంత ఖర్చు కాగలదని వివరణ కోరేడు. సభలోనే ఉన్న, సివిల్ వర్క్స్ చేసే సివిల్నాయుడు, సుమారు యాభై, అరవై వేలవరకు అవుతుందన్నాడు. తక్షణం స్పందిస్తూ, గోపాలం ఆ ఖర్చంతా తన బాధ్యతని ప్రకటించి, సివిల్నాయుడుని వెంటనే పని ప్రారంభించి, కావలసిన ఎడ్వాంసుకు, తనను ఇంటివద్ద కలియమని చెప్పేడు. సభ్యులందరు గోపాలంను కోనియాడి, ధన్యవాదాలు కురిపించేరు. గోపాలం ప్రణాళికకు శుభారంభమయింది. గ్రామ పెద్దలలో, ఓ స్థానం పొందేడు.

గోపాలం, గ్రామంలో అధ్వాన్న పరిస్థితులలోనున్నరోడ్ల మరమ్మత్తుపై దృష్టి సారించేడు. గ్రామ పెద్దలతో బాటు, సంబంధిత ఉన్నతాధికారులను కలసి, సమస్యను తగురీతిలో వారికి తెలియజేసి, మరమ్మత్తులకు కావలిసిన ధనాన్ని మంజూరు చేయించేడు. రెండు నెలలలో, గోపాలం పర్యవేక్షణలో బొరిగుమ్మపల్లిలో నాణ్యమైన రోడ్లు వెలిసేయి. జరుగుతున్న అభివృద్ధికి తోడుగా, గ్రామంలో ఒక బేంకు శాఖ ప్రారంభమయింది. బేంకు ఋణాలతో గ్రామంలోని పాడిపంటలు అభివృద్ధి చెంద నారంభమయింది.

ఆ రోజు అట్లతదియ. గోపాలం,తన పెరట్లోని ఉయ్యాల బాగుచేయించేడని వీధిలోని ఆడపిల్లలకు తెలుసు. వీధిలోని పిల్లలందరితో చనువుగా ఉంటూండడం మూలాన్న, గోపాలంను, పిల్లలందరూ కలసి, ఆ నాటి పండుగ సందర్భంగా పెరట్లోని ఊయలలో ఊగవచ్చా, అని వేడుకొన్నారు. గోపాలం సంతోషంగా అంగీకరించేడు. అంతే కాదు. పిల్లలకు పళ్ళు, పాలు కొని తెచ్చేడు. గోపాలం పెరట్లో, పిల్లలది ఒకటే సందడి. అది చూస్తూ, ఆనందిస్తున్న గోపాలంకు, తన చిన్నతనంలో, అదే ఊయలలో చెల్లెలును కూర్చోబెట్టి సరదాగా ఊపిన ఘడియలు జ్ఞప్తికి వచ్చేయి. వయ్యారి భామలు ఉయ్యాలలూగుతూ ఉంటే, ఆప్యాయంగా వాళ్ళకి కమలా పళ్ళు అందిస్తూ, గోపాలం మురిసిపోతున్నాడు. ఇంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి, “అంకుల్, ఎవరో ఒకావిడ, చిన్న పాప, పైన నిలబడి, ఇంట్లోకి చూస్తున్నారు.” అని చెప్పి, చమ్మ చెక్కలాడుతున్న పిల్లల్లో కలసిపోయింది. గోపాలం సత్వరం వెళ్లి, “రండమ్మా, లోపలికి రండి….మీ పాపా.” అని ఆహ్వానించేడు.

“అవును. మా పాప.” అని వినయంగా చెప్పింది, ఆ యువతి.

“చిట్టితల్లీ, నీ పేరేమిటమ్మా,” గోపాలం ముద్దుగా అడిగేడు, ఆ పాపని.

“నా పేరు సుగుణ.” చిలక పిట్టలా పలికింది ఆ చిన్న పిల్ల.

“నేను పుట్టి పెరిగిన గ్రామం, అమ్మాయికి చూపిద్దామని తెచ్చేను.” తన రాకకు కారణం చెప్పిందామె.

“అలాగా తల్లీ. మంచి పని చేసేరు.”

“నన్ను మన్నించకండి వయసులో పెద్దవారు.”

“సరేలే అమ్మ. లోపలికి రా. వీధిలోనే నిలబడిపోయేవు.”

వచ్చినావిడ, కూతురుకు ఇల్లు చూపిస్తూ, “ఇక్కడే తాతగారికి, మామయ్యలకి, నాకు, అరిటాకులలో భోజనం పెట్టేది అమ్మమ్మ. అరిటాకులలో, గడ్డపెరుగు అన్నం తింటే, ఎంత రుచిగా ఉంటుందనుకొన్నావు.” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే,

“ఈ ఇంట్లో మీరుండేవారా అమ్మా.” ఆప్యాయంగా అడిగేడు, గోపాలం.

“ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. నా చిన్నతనం ఇందులోనే గడిపేను.” గోపాలంకు ఎదురుగా ఉన్న ఆ యువతి, తలను ఇటునటు త్రిప్పుతూ, ఇల్లు పరికిస్తూ, సమాధానమిచ్చింది.

“మీ నాన్నగారు…” క్వెశ్చను మార్కులాగ ముఖంపెట్టి, నిశ్చేష్టుడై అడిగేడు, గోవిందరావు అవతారమెత్తిన గోపాలం. .

“నారాయణ అని, ఈ ఊరిలో…” అని ఇంకా చెప్పబోతుండగా, ఎదురుగా కొయ్యబారి ఉన్న గోపాలంను చూసి, గాభరాగా “అంకుల్” అంటూ అతని కళ్ళలోకి చూసింది. ఇహలోకం లోకి వచ్చేడు, గోపాలం.

“తల్లీ, నీ పేరు…” కలా, నిజమా, అని తలచుకొంటూ అడిగేడు, గోపాలం.

“సువర్ణ.” మృదు మధురంగా వినిపించింది, గోపాలంకు.

దిగ్భ్రాంతితో కూడిన సంతోషంతో చూస్తున్న గోపాలం బుర్రలో ఆలోచనలేమిటో, సువర్ణకి తట్టలేదు. గోపాలం నోటి చివరిదాకా, “చెల్లెమ్మా.” అని వచ్చినా, అలా పిలిచే ధైర్యం లేకపోయింది. భగవంతుడు క్షమించేడనుకొన్నాడు. అంచేతనే, పుట్టి పెరిగిన ఇంట్లోనే తన చెల్లెమ్మని తనతో కలిపేడనుకొన్నాడు.

“అంకుల్, మీరు ఎన్నాళ్ళనుండి ఈ ఇంట్లో ఉంటున్నారు.”

“నన్ను మన్నించకమ్మా. అంకుల్ అని పిలవకు.” ఆప్యాయంగా సలహా ఇచ్చేడు, గోపాలం.

సంధిగ్ధంలో పడ్డాది సువర్ణ. మన్నించకుండా ఏమని పిలవాలని.

“అన్నయ్యా, అని పిలిచేదా.” అన్న సువర్ణ మాటలు వినగానే, ఒక్కమారు గోపాలం ఒళ్ళు జలదరించింది. వర్ణింప శక్యం కాని అనుభూతి పొందేడు. దశాబ్దాలయింది. ఆ మృదు మధుర కంఠం నుండి, “అన్నయ్యా” అన్న పిలుపు విని. “చెల్లెమ్మా” అని సమాధానం చెప్ప ప్రారంభించేసరికి, సువర్ణకి తన పెద్దన్నయ్యే పిలిచేడా అనిపించింది. ఆ పిలుపులో అపారమైన ఆప్యాయత చవి చూసింది.

“నాన్నగారు కట్టిన ఈ పవిత్ర దేవాలయంలో, గతాన్ని తలచుకొంటూ బ్రతుకుతున్నానమ్మా.”

సువర్ణకు ఆ మాటల్లో అంతరార్థం బోధపడలేదు. ఇంతలో, “అమ్మా, నువ్వూ రా. ఉయ్యాలలూగుదాం.” అన్న, కన్న కూతురు గొంతు వినిపించింది.

“రా, చెల్లెమ్మా, ఇవాళ అట్లతదియ. దైవ సంకల్పం. నీ పుట్టింటికి నువ్వు వచ్చేవు. ఉయ్యాలలూగుదానివి. పద.” పెరడులోనికి చెల్లెలును తీసుకెళ్ళేడు, గోపాలం.

ముగ్గురూ పెరడు చేరేరు. ఊయల చూడగానే, సువర్ణకు గతంలో తన పెద్దన్నయ్య గోపాలం, ప్రతీ అట్లతదియనాడూ, తనను ఆ ఊయలలో వూపుతూండే మధుర క్షణాలు జ్ఞాపకమొచ్చేయి. పట్టరాని సంతోషంతో, గోపాలం చెల్లెలును, మేనకోడలును, ఉయ్యాలలో ఊపుతూ, పళ్ళు, పాలు అందించ సాగేడు. స్వంత పెద్దన్నయ్యే ఉయ్యాల ఉపుతున్నాడని చెల్లెలికి తెలియదు. కాని అంత ఆప్యాయంగా ఆదరిస్తున్న వ్యక్తి, సువర్ణకు ఎందుచేతనో పరాయివాడిగా అనిపించలేదు. ఆ మధురానుభూతి, సువర్ణను ఊహాలోకంలో విహరింపజేసేయి. ఆ సమయంలో ఊగుతున్న ఊయల నెమ్మదిగా ఆగింది. సువర్ణ ఊహాలోకం నుండి ఇహ లోకం లోకి వచ్చింది. వెనుదిరిగి చూసింది. గోపాలం బాధతో చుట్టుకుపోతూ, మట్టిమీద పడి ఉన్నాడు. కెవ్వుమని, “అన్నయ్యా.” అని అప్రయత్నంగా గొంతు చించుకొని అరిచింది. అక్కడున్న ఆడపిల్లలు, పరుగున వెళ్లి ఊళ్ళో నలుమూలలకు ఆ వార్త చేరవేసేరు. సువర్ణ, గోపాలం ఛాతీని, రెండు చేతులతో గట్టిగా నొక్కుతూ, “అన్నయ్యా అని కంట తడి పెట్టుకొంటూ ఉంటే అది గమనించిన గోపాలం, సువర్ణ రెండు చేతులు పట్టుకొని “చె… ల్లె… మ్మా .., న .. న్ను.. క్ష .. మి.. స్తా.. వా…” అని దీనంగా ప్రార్థించేడు. మరణ బాధ పడుతున్న గోపాలం, లేని బలాన్ని కూడదీసుకుని చెల్లెలి తల నిమురుతూ, “చె…ల్లె…మ్మా…నే..ను…పా…పిష్ఠి…వాడి…ని…నేను…నీ..పెద్ద…అ…న్న…గో… పా…లాన్ని.” అంటూ తుది శ్వాస విడిచేడు. సువర్ణ, “పెద్దన్నా.” అని, భోరున ఏడవ సాగింది. ప్రక్కనే ఉన్న చిన్నది, భయంతో, “అమ్మా.” అంటూ తల్లి ఒళ్ళో చేరింది. జనం కూడేరు. ఆయుర్వేద వైద్యుడు, నాడి చూసి, గోవిందరావు గారు మరి లేరన్నాడు.”పెద్దన్నా, నన్నువదిలి వెళిపోయేవా.” అని వెక్కి వెక్కి, ఏడవసాగింది. ఏమిటి జరుగుతున్నదో తెలియక, గందర గోళంలో చుట్టూ ఉన్నజనానికి, నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టింది, సువర్ణ. పశ్చాత్తాపపడి, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని, గోవిందరావు పేరులో నున్న గోపాలంను అంతా మెచ్చుకొన్నారు. గ్రామ పెద్దలతో కూడిన జనం, ‘నారాయణా, నారాయణ.’ స్వరాలతో గోపాలంకు అంతిమ యాత్ర చేయించేరు. అతని భౌతిక దేహం, అగ్నికి ఆహుతి అవుతూంటే, బొరిగుమ్మపల్లి తలవంచి నమస్కరించింది. మరునాడు సంతాపసభలో, అంతా, గోపాలం గ్రామానికి చేసిన సేవలని నెమరు వేసుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here