కాజాల్లాంటి బాజాలు-58: మన ఖర్మ

2
5

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

ఆమె దీపిక. ఒక రాజకీయ నాయకురాలు. రాష్ట్రం లో చాలా పరపతి గల మంత్రిణి.

అతను రాజ్. సుమారు ముఫ్ఫై సంవత్సరాలనుంచీ హీరోగా చలనచిత్ర పరిశ్రమని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న హీరో. పిచ్చి అభిమానులు అతనిని వెర్రిగా ఆరాధిస్తూనే ఉన్నారు.

వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.

చాలాకాలం తరవాత వాళ్ళిద్దరికీ కాసేపు మాట్లాడుకునే సమయం చిక్కింది.

దీపిక–ఏమిటివాళ..ఇంట్లోనే ఉన్నారు? షూటింగ్ లేదా?

రాజ్– ఇవాళేమిటో అలసటగా ఉంది. ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను.

దీపిక– అయితే సరే.. నేనూ ఇవాళ ప్రోగ్రామ్స్ కాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉంటాను. అయినా ఇంక మీరు ఆ హీరో వేషాలు మానేసి కారెక్టర్ రోల్స్ వేస్తే బాగుంటుందేమో.. ఆ స్టెప్పులూ అవీ ఈ వయసులో మీరు వెయ్యలేకపోతున్నారు.

రాజ్– నేను హీరోగానే వెయ్యాలనుకుంటున్నాను. రిటైర్ అయినా హీరో లాగే అవుతాను.

దీపిక– ఎన్నాళ్ళు ఉండగలరు హీరోగా

రాజ్— ఇంకెన్నాళ్ళు.. మన సూరజ్ అందుకునేవరకూ.. వాడినీ ఈ ఫీల్డ్ లోకే దింపేస్తే బాగుంటుంది కదా..

దీపిక—మనబ్బాయి సూరజ్ మెడిసిన్ చేద్దామనుకుంటున్నాడండీ… ఏదో ఓ రాష్ట్రంలో సీటు కొందాం.

రాజ్—-సూరజా.. మెడిసినా.. ఎందుకు?

దీపిక—అదేంటండీ అలా అంటారు? వాడికి డాక్టరీ చదివి, రోగులకి సేవ చెయ్యాలనే ఆశ ఎప్పటినుంచో ఉందండీ.. ఆమాత్రం డబ్బులు కట్టగలం కదా మనం…

రాజ్—పిచ్చిదానా, డబ్బులు కట్టలేక కాదు. అంత కష్టపడి వాడు ఆ సేవలు చెయ్యవలసిన ఖర్మం ఏమొచ్చిందిప్పుడు?

దీపిక–మరి..ఇంజనీరింగ్ చదివిస్తారా..

రాజ్– అది మటుకు ఎందుకు? కాస్త నాలుగురోజులకోసారి షూటింగ్‌కి వస్తూండమను. మరో ఆరు నెలల్లో వాడిని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం.

దీపిక– కాని వాడి ఫేస్ ఫొటోజెనిక్ కాదుకదా.. హీరో గా పైకి రాగలడా..జనాలకి నచ్చుతాడా

రాజ్– నచ్చక ఏంచేస్తాడు? మొదటి సినిమా చూసి తిట్టుకుంటారు. రెండో సినిమా చూసి విసుక్కుంటారు. మూడో సినిమా నుంచి అలవాటు పడిపోతారు. నాలుగో సినిమాకి ఉత్సవాలు చేస్తారు. ఈ జనం నా పిచ్చిలో ఉండగానే వాడిని ఫీల్డ్‌లో దింపెయ్యాలి.

దీపిక–సినిమా తియ్యడంతో అయిపోతుందా.. సక్సెస్ అవద్దూ

రాజ్—ఎందుకు అవదూ.. మన థియేటర్‌లే బోలెడున్నాయి ఆడించేస్తే సరి. అదీ కాక ఒక ఆర్నెల్లు పోయాక ఒక టి.వీ. చానల్ కూడా మొదలుపెడదామనుకుంటున్నాను. అందులో అరగంట కొకసారి మనవాడి మొహం చూపిస్తుంటే సరి. కేప్టివ్ ఆడియన్స్ కదా.. అదే కుర్చీలో కట్టిపడేసిన ప్రేక్షకులు కదా.. కొన్నాళ్ళకి వాడే నచ్చుతాడు.

దీపిక– మరి మన నీల సంగతో.. దాన్ని కూడా సినిమా ఫీల్డ్ లోనే పెడదామా..

రాజ్—ఛఛఛ…వద్దు. వద్దు. మన ఆడపిల్లల్ని ఇలా ఎక్స్‌పోజింగ్ లోకి దించొద్దు.

దీపిక—మరి…. దాన్ని మెడిసిన్ చదివిద్దామా?

రాజ్– మెడిసిన్ చదివి అందరికీ సేవలు చేసే ఖర్మ దానికెందుకు? అలాగ అదేపనిగా చదువుతూ, సేవలూ, సంతృప్తులూ అని ఆలోచించే కొంతమంది పిచ్చివాళ్ళుంటారు. అంతగా అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టేసి, అలాంటి పిచ్చున్న పెద్ద పెద్ద స్పెషలిస్ట్‌లని ఎంప్లాయ్ చేసి,  ఆ హాస్పిటల్‌ని సూపర్‌వైజ్ చేస్తుందిలే. ఈ లోపుల పార్లమెంట్ మెంబర్ ఉన్నారు చూడు… సింహాలు.. వారి అబ్బాయితో సంబంధం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా…

దీపిక—ఆయన మన పార్టీ కాదు కదా..

రాజ్– అందుకే.. ఆయన కుడి పార్టీ…ఆయన కొడుకు ఎడమ పార్టీ.. నువ్వు మూల పార్టీ.. రేపు ఎలక్షన్లలో ఎటుపోయి ఎటొచ్చినా మనమ్మాయి గెలిచిన పార్టీ లోకి దూకెయ్యడానికి వీలుగా ఉంటుంది కదా…

దీపిక— నిజమేనండోయ్… ఈ సంగతి నాకు తోచనేలేదు. మరి జనాలు నమ్ముతారంటారా..

రాజ్—- అదే మరి. పదవీ, అధికారం, గ్లామరూ మన చేతిలో ఉంటే ఇన్ని కోట్ల మంది జీవితం మన చేతిలో ఉన్నట్టే. ఇలాగ పదవినీ, అధికారాన్నీ. గ్లామర్ నీ మన చేతిలోకి తీసుకోవడం మన అదృష్టం. ప్రతి రోజూ మనం వేసే పిచ్చి టేక్స్‌లు కడుతూ, పిచ్చి చట్టాలు పాటిస్తూ, ఇడియట్ బాక్స్‌లో పిచ్చి ప్రోగ్రాములు చూస్తూ ఉండడం వాళ్ళ ఖర్మం.

దీపిక—బలే..బలే…ఈ మాట నాకు బాగా నచ్చిందండీ..

రాజ్–ఏమాట?

దీపిక–అదే… మన అదృష్టం అనేకన్న వాళ్ళ ఖర్మం అనే మాట..

రాజ్—హహహహ… అంతే మరి. డెమాక్రసీ కదా. మెజారిటీ వాళ్ళ ఖర్మే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here