మన మనిషి

0
4

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మన మనిషి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]షూ[/dropcap] లేసు కట్టుకున్నాక, వాచీ చూసుకుని ,“లలితా నా లంచ్ బాక్స్ రెడీనా” అరిచాడు మధు హాల్లోంచి.

ఆ మాటలు వింటూనే గబ,గబా హాల్లోకి నడిచి వచ్చి, “లేదు, మన వంట మనిషి, అదే రమణి ఇంకా చేస్తోంది. ఓ పది నిమిషాలు ఆగుదురూ” చిన్న గొంతుతో చెప్పింది లలిత

“నేను ఆగుతాను సరే, మరి మనమ్మాయి కాలేజీకి లంచ్ బాక్స్ పట్టుకెళ్లలేదా” అడిగాడు

“లేదు, ఆ కాలేజ్ కేంటీన్‌లో తినేస్తుందిలెండి”.

“ఏడ్చినట్టుంది. ఈ రోజు టిఫిన్ కూడా తినలేదు, కడుపు ఖాళీ డబ్బాలా ఉంది. పైగా లంచ్ బాక్స్ కూడా ఆలస్యం. మరి మన హరి? అసలే వాడు ఆకలికి ఆగలేడు!”

“మీ తమ్ముడు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోం కదా, పైన పెంట్ హౌస్‌లో పని చేసుకుంటున్నాడు. టిఫిన్ అవ్వగనే తీసుకెళ్లి ఇస్తాలెండి. ఈ గంటా, అరగంటా ఆలస్యానికి చిక్కి చిక్కుడుకాయాలా అయిపోడు” చెప్పింది

“వాడి విషయం అంటే గుర్తొచ్చింది. మన వైజాగ్, విశాలక్షినగర్‌లో ఉంటున్న ఆ భుజంగరావ్ ఫోన్ చేసి తినేస్తున్నాడు – వాళ్ళ అమ్మాయి నచ్చిందా, నిశ్చిత్తార్థం ఎప్పుడూ అని. త్వరలోనే ఆ సంబంధం సరే అనుకుని, వాళ్ళిచ్చే కట్నంతో ఉన్న చిన్నా, చితకా అప్పులూ అవీ ఒకేసారి తీర్చేయొచ్చు” అని వాచీ చూసుకుని, “ఈ కొత్త వంట మనిషి వచ్చినప్పటినుండీ, ఆఫీసుకి లేటుగా వెళ్లాల్సి వస్తోంది. పోనీ ఇంతా సమయం తీసుకుని ఏమైనా రుచిగా చేస్తుందా అంటే అదీ లేదు. ఏదో తినబుల్‌గా చేస్తుంది అంతే” అని మధు ఇంకేదో మాట్లాడుతుండగా ,

“నెమ్మదిగా మాట్లాడండీ, ఆమెకి వినబడితే ఏ ఉప్పో, కారవో ఎక్కువేసినా వేస్తుంది” అంటూ చిన్న నవ్వు నవ్వింది లలిత.

“సరేలే”, అని మరో సారి వాచీ చూసుకుని, సోఫా వెనగ్గా జారబడిపోయాడు.

నెల క్రితం వరకూ వంట పని, ఇంటి పని మంగ చేసేది. పదేళ్ళ క్రితం లలిత, పనిమనిషి కావాలంటే, అప్పుడు వాళ్ళ  ఎదురు ఇంట్లో ఉండే బామ్మగారు మంగని తీసుకు వచ్చి లలిత ఇంట్లో పనికి కుదిర్చింది. ఆమె తల్లి అప్పుడపుడూ వచ్చి మంగని చూసి పోతూ ఉండేది. తండ్రి కూలి చేస్తాడు. అలా అప్పటినుండీ పదేళ్ళ పాటు మంగ ఆ ఇంటిపని, వంటపని చేసింది. అయితే, లలిత ఎక్కడికైనా వెళ్ళాలంటే, మంగని కూడా తీసుకు వెళ్ళేది. కొన్ని పెళ్ళిళ్ళలో, మంగని లలితతో పాటు చూసినవాళ్ళు, మీ చెల్లెలా అనడిగితే, ఔను అంటూ నవ్వుతూ చెప్పేది. మార్నింగ్ లలితకు పూజలో నుండి నైట్ గుడ్ నైట్ మస్కిటో రీఫిల్ ఆన్ చేసే వరకూ, అన్ని పనుల్లోనూ అక్కా ,అక్కా అంటూ బోలెడు కబుర్లు చెబుతూ మరీ సాయం చేసేది. పనిమనిషిలా కాక తన మనిషిలా లలితతో కలిసిపోయింది మంగ. అయితే ఈ మధ్య సడెన్‌గా తండ్రి పోయాడని తెలిసి వాళ్ళ ఊరు వెళ్లిపోయింది. లలితకి మోకాళ్ళ నొప్పులు ఉండటంతో తప్పక అప్పటినుండీ వేరే కొత్త వంట మనిషిని పనికి కుదుర్చుకుంది. ఆమె పని అంతంత మాత్రం చేస్తుంది. పెద్దగా మాట్లాడదు కూడా. అప్పటి నుండీ లలిత బాగా డల్ అయిపోయింది. కొంత పరధ్యానంగా కూడా తయారైంది. మధు ఆఫీస్‌కి వెళ్లిపోగానే, టి.వి. పుస్తకాలు, మొబైల్ చూసినా, ఇంకా ఏదో లోటుని ఆమె ఫీల్ అవుతూనే ఉంది. కొత్త పనిమనిషితో అంతా కొత్తగా ఉంది. అక్క అని కాకుండా మేడమ్ అని పిలుస్తోంది. ఏధైన కావాలంటే, పొడిగా నాలుగు మాటలు ఏదో ముక్కుపొడుం పీల్చినట్టు, మొక్కుబడిగా క్షణంలో చెప్పేసి వెళ్లిపోయేది. పైగా నెలకి నాలుగైదు రోజులు సెలవులు వేరే. పైగా ఆ పాన్ కావాలి, ఈ కుక్కర్ కొనండీ. సింగిల్ స్టోన్ గ్రైండర్ కావాలి అంటూ డిమాండ్లు కూడా.

“మేడం, వంట పూర్తి చేసి సార్‌కి లంచ్ బాక్స్ పెట్టాను. ఇదిగోండి” అంటూ అందించింది. ఆ బాక్స్‌ని లలిత చేతిలోంచి తీసుకుని కంగారుగా ఆఫీస్‌కి వెళ్లిపోయాడు మధు.

సాయంత్రం వేళ లలిత, ఏదో ఓ.టి.టి.లో సినిమా చూస్తుండగా, గేటు చప్పుడు కావడంతో, బయటికి వచ్చింది. మంగ వాళ్ళమ్మ, గేటు బయట నిలబడి ఉంది. ఆమెని చూస్తూనే “అరె నూకాలూ నువ్వా, మంగ రాలేదా?, ఏవిటి ఇలా హఠాత్తుగా!” అడిగింది లలిత.

“మంగ రాలేదమ్మగారూ. మా ఆడపడుచు, వాళ్ళ గల్లీలో ఓ పెళ్లి సంబందం ఉందంటే, పిల్ల ఫోటో, వివరాలు, ఫోన్ నెంబరూ ఇచ్చేసి ఎల్దావని వచ్చాను. మిమ్మల్ని ఓ మారు కలిసి ఎలా ఉన్నారూ ఏటీ అని మంగ సూసి రమ్మని మరీ, మరీ సెప్పింది. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇల్లంతా ఇపుడు అదే నడుపుతోంది”.

“అదేవిటి నూకాలూ, నీ వెనకాల మేం లేవూ, మంగ ఫోటో, వివరాలూ నాకిస్తే నేను చూడనూ” అంది లలిత.

లలిత మాటలకి సంబరపడిపోతూ, “దేవతే వరం ఇస్తానంటే, వద్దని మారాం చేసే మూర్ఖులుంటారామ్మగారూ” అని వాటిని లలిత చేతిలో పెట్టి వెళ్లిపోయింది నూకాలు.

ఆ తరువాత ఆఫీసు నుండి వచ్చిన మధుతో, “ఏవండీ మీకో విషయం చెప్పాలి”

“ఒక విషయం అంటే ఒక్క విషయవే చెప్పాలి మరి. ఆ విషయం పేరు చెప్పి, కషాయం లాంటి మాటలతో  నా కోపం నషాలానికంటించి నా బుర్ర మొత్తం తినేయకూడదు. సరేనా” అన్నాడు

“అబ్బా సరేలెండి. మీరు వర్రీ కాకుండా వినండి. అసలు, విషయం ఏవిటంటే, నేను మీ తమ్ముడికి ఓ అమ్మాయిని చూశాను. అన్నీ ఆలోచించాను. నాకైతే ఆ అమ్మాయి బావుంటుందని నా గట్టి నమ్మకం”. చెప్పింది.

“నువ్వా! సంబంధం చూసావా? సరిపోయింది పో. ఇంతకీ కట్నం ఎంత ఇస్తారో, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏవిటి. అమ్మాయి బావుంటుందా, అన్నిటికీ మించి, పప్పులో ఉప్పులా, కాయగూరపులుసులో ముక్కలా, చక్కగా మన కుటుంబంలో కలిసిపోయే అమ్మాయేనంటావా” అంటూ నాన్ స్టాప్ బస్సులా ఆగకుండా అడుగుతూ పోతున్నాడు .

“ముందు అమ్మాయి ఎలా ఉందో కొంచెం చూడండి” అంది మంగ ఫోటోని మధు చేతికి ఇస్తూ.

చూసి అదిరిపడ్డాడు. తర్వాత తేరుకుని, “ఏవిటే ఈ వైపరిత్యం! నీకు పైత్యం గానీ చేయలేదు కదా” అడిగాడు ఆవదం మొహంతో .

“మన ముందు, మన ఇంట్లో పెరిగిన పిల్ల. పనిమనిషిగానే అంత చక్కగా మనతో కలిసిపోయి, మనల్ని అంత జాగ్రత్తగా చూసుకున్న పిల్ల, మన మనిషైతే ఇంకెంత బావుంటుందో ఆలోచించండీ. పైగా అది వెళ్ళిపోయనప్పటి నుండీ, నా చెల్లెలు నాకు దూరం అయిపోయినట్టే అనిపిస్తోంది. ఒకటే లోటుగా ఉంది. ఆ లోటు ఇంటి పని వదిలేసిందని కాదు. మనతో ఇంతగా ముడిపడిపోయిన మనిషి, ఒక్కసారే దూరం అయిపోతే, అది నాకు ఎంత దగ్గరైందో తెలిసింది. మీరూ కొన్ని సార్లు, అది వెళ్లిపోయిందని మరిచిపోయి, మంగా, మంగా అంటూ పిలిచేశారు కూడా. ఇక డబ్బు విషయానికి వస్తే, ఆమె డబ్బుకి పేదే, కానీ గుణానికి కాదు” అంటూ అక్కడినుండి వెళ్లిపోయింది లలిత .

“ఏవిటిది, ఇలా అంటోంది .వాడి కట్నం వస్తే ఏదో కొంత అప్పు తీర్చి కొంత జల్సా చేద్దాం అనుకున్నాను. ఆ, అయినా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఏదోటి చెప్పి, హరి మనసు మార్చేస్తే సరి” అని మనసులో అనుకుని ఎదురుగా చూసి అదిరిపడ్డాడు. హరిని కూడా వెంటబెట్టుకొచ్చింది లలిత. “అన్నయ్యా, వదిన చెప్పింది నాకూ ఇష్టమే. ఇపుడే వదిన, మంగతోనూ, వాళ్ళమ్మతోనూ కూడా మాట్లాడిందన్నయ్యా” అన్నాడు హరి .

“డబ్బు శాశ్వతమా? మంచి అమ్మాయే కావాలి. పైగా మీ వదిన కళ్ళల్లో ఇది వరకటి సంతోషం కనిపిస్తోంది. ఇంకేం కావాలి. కానీ చేసుకోబోయే వాడివి, నువ్వు బాగా ఆలోచించుకో, లేదా సమయం తీసుకో. ఏదో మీ వదిన చెప్పిందని ఇన్‌స్టంట్ కాఫీలా ఇన్‌స్టంట్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు” చెప్పాడు మధు, వద్దన్నట్టు సైగ చేస్తూ.

ఆ మాటలకి హరి, నేల చూపులు చూస్తూ ‘కొన్నాళ్లుగా మంగని ప్రేమిస్తున్నానూ, ఆమెని పెళ్లి చేసుకుంటానూ అని మీతో ఎలా చెప్పి ఒప్పించాలా అని చూస్తున్న సమయంలో, ఇలా వదినే దేవతలా వచ్చి ఆమెని పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఒప్పుకోనూ’ అని మనసులో అనుకుని, “అన్నీ ఆలోచించాను, ఆమెని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అన్నయ్యా” అన్నాడు హరి .

“శుబ్బం” అన్నాడు మధు కాస్త బలవంతంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here