మన మూడు రంగుల జెండా?!..

0
10

[dropcap]“సా[/dropcap]ర్!.. రాఘవయ్యగారూ!.. పోస్ట్!..” పోస్ట్‌మన్ గోవిందు పిలుపు.. అతనూ ఆ వూరి వాడే..

మధ్య హాల్లో వున్న రాఘవయ్యగారు ఆ పిలుపు విని వరండాలోకి వచ్చారు..

“నమస్కారం సార్!.. అబ్బాయిగారి ఉత్తరం..” చిరునవ్వుతో అందించాడు గోవిందు..

రాఘవయ్యగారు ఆ ఉత్తరాన్ని అందుకొన్నారు. ఆయన వ్యవసాయదారుడు. మండల వ్యవస్థకు పూర్వం వారు ఆ గ్రామానికి కరణం.. ఇంటర్మీడియట్ వరకూ చదివారు. తల్లి సీతమ్మ.. గతించిన కారణంగా పై చదువులను అతను వదలి.. తండ్రిగారు సాగించే వ్యవసాయాన్ని చేపట్టారు. వారికి విశ్రాంతిని కల్పించారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను సాధించి.. ఇరువురు సోదరిలకు మంచి సంబంధాలు చూచి ఘనంగా వివాహాలు జరిపించారు. తండ్రిగారి ఆదేశానుసారంగా మేనత్త కూతురు.. సుశీలను వివాహం చేసుకొన్నారు. సంవత్సరం లోపలే తండ్రి కోదండరామయ్య చేతిలో మొగబిడ్డను పెట్టారు. ఆ బాబు బారసాలను కోదండరామయ్య ఘనంగా జరిపించారు. సత్యానందరావు అని నామకరణం చేశారు. ఆ రోజున కోదండరామయ్యగారు..

“ఓరేయ్!.. రాఘవా!..”

“ఏం నాన్నా!..”

“కొన్ని కారణాలవల్ల నీవు చదువును సాగించలేకపోయావు.. కానీ.. వీడు నా మనవడు.. డాక్టర్ కావాలి.. మన ఈ వూర్లో.. మీ అమ్మ పేరున ఒక హాస్పిటల్ స్థాపించాలి. మన చుట్టూ వున్న పల్లెల ప్రజలకందరికీ.. చక్కటి వైద్యసేవలు అందించాలి. మన ప్రాంత ప్రజలు ఆనందంగా వుండాలి కదరా!..” జిజ్ఞాసగా చెప్పాడు కోదండరామయ్య.

“అలాగే నాన్నా!.. మీ ఆశయం నెరవేరుతుంది!..” చిరునవ్వుతో బారసాల బాబును చూస్తూ చెప్పాడు రాఘవయ్య.

ఏనాడో.. తాను తండ్రితో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాఘవయ్యగారికి.

“అయ్యా!.. నాకో చిన్న సందేహం?..”

“అడగవయ్యా!..”

“సెల్‌ఫోన్స్.. స్కైపులు ఏవేవో ఇప్పుడు వున్నాయి కదా!.. అబ్బాయిగారు వాటిని వాడకుండా.. ప్రతినెలా ఇలా ఉత్తరాలను వ్రాస్తారు ఎందుకయ్యా!..” ఆత్రంగా ఏం చెబుతాడో అని రాఘవయ్య ముఖంలోకి చూచాడు గోవిందు..

“గోవిందా!.. నేను పాతకాలం మనిషిని.. నీవు చెప్పిన వాటి ద్వారా మాట్లాడటం నాకు నచ్చదు. సిగ్నల్సు వుండీ.. లేక.. చాలా అవస్థ. ఆ కారణంగా.. నెలకు రెండు సార్లు.. తన చదువును గురించి నాకు వివరంగా జాబు వ్రాయమని చెప్పాను. నా కొడుకు మంచివాడు. నా మాట పాటిస్తున్నాడు..” చిరునవ్వుతో చెప్పాడు రాఘవయ్య.

“అయ్యా!.. మీరు చెప్పిందీ నిజమే.. వస్తానయ్యా..” గోవిందు వెళ్లిపోయాడు.

అర్ధాంగి సుశీలమ్మ వరండాలోకి వచ్చింది. రాఘవయ్యగారి చేతిలోని కవర్‌ను చూచింది.

“సత్యా ఉత్తరమా!..”

“అవును సుశీ!..”

“చదవండి పెద్దగా.. నేనూ వింటాను..” ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంది.

రాఘవయ్యగారు కవర్ చించి.. ఉత్తరాన్ని చదవడం.. ప్రారంభించారు.

‘పూజ్యులు గౌరవనీయులైన నాన్నగారికి.. అమ్మకు.. నమస్కారాలు. ఇక్కడ నేను క్షేమం.. అక్కడ మీరు ఇద్దరు, అక్కలు బావలు కుశలమే కదా!.. ఎంతో ప్రశాంతంగా మూడు సంవత్సరాలు జరిగిపోయాయి. నేను ఎంచుకున్న డాక్టర్ వృత్తివిద్యను బాగానే అభ్యసిస్తున్నాను. నన్ను గురించి మీరు ఏ విషయంలోనూ దిగులు పడకండి. మీరు మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూచుకోండి. మన వారందరినీ అడిగినట్లు చెప్పండి. (నాన్నా!.. మరికొన్ని వివరాలు మరో కాగితంలో వ్రాశాను. ఆ విషయాలను మీరు మాత్రం చదువుకోండి. అమ్మకు చెప్పకండి) నా గురించి మీరు భయపడకండి..

ఇట్లు, .. మీ సత్య.’

అడిగినట్లు చెప్పండి వరకూ పైకి చదివి.. మిగతా రెండు లైన్లను.. రాఘవయ్య.. మనస్సులో చదువుకొన్నారు. “ఆ.. సుశీ!.. అదీ సమాచారం.. వాడు అన్ని విధాలా బాగున్నాడట..” మనస్సున ఏదో అనుమానం.. వున్నా పైకి నవ్వుతూ చెప్పాడు.

“సుశీ!.. నేను తోట వరకూ వెళ్లివస్తాను.. ఉత్తరాన్ని మడచి జేబులో పెట్టుకొని తోటకు బయలుదేరాడు రాఘవయ్య..

***

తోటలో మామిడి చెట్టుకిందవున్న సిమెంటు బెంచీమీద కూర్చొని వుత్తరాన్ని విప్పాడు.

‘నాన్నా!.. మీరు పోయినసారి వ్రాసిన ఉత్తరంలో మొదటి.. రెండో ప్రపంచ యుద్ధాలను గురించి వ్రాయమన్నారు. కారణం ఏమిటో మీకే తెలియాలి!.. వ్రాస్తున్నాను..

మొదటి ప్రపంచయుద్ధం.. 1914 జులై 28వ తేదీన మొదలయింది.. 1918 నవంబర్ 11వ తేదీన ముగిసింది. యుద్ధం యునైటెడ్ స్టేట్స్.. యుకే.. జపాన్.. వారి అలియన్స్‌లో ఉన్న యూరప్‌లో చిన్నదేశాలు ఒక వర్గం.. సోవియట్ యూనియన్ మరియు వారి అలియన్స్ కమ్యూనిస్టు దేశాలు రెండవ వర్గం.. సామ్రాజ్యవాదం.. భూభాగ ఆక్రమణ యుద్ధానికి ముఖ్య కారణాలు. యుద్ధానికి కేంద్రం ఐరోపా.. యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఫలితం.. పశ్చిమ మిత్రరాజ్యాల విజయం.. తూర్పు కేంద్రరాజ్యాల ఓటమి.. పశ్చిమ యు.ఎస్.. యుకె..ఐరోపాదేశాల ఆధిక్యతతో.. రష్యాతో ఒప్పందాలు.. షరతులు..

పడమటి ప్రపంచదేశాలు వారి మిత్రదేశాలు.. వారిదే స్వేచ్ఛా ప్రపంచమని భావించేవారు. వారందరి.. కలయికకు వారు పెట్టుకొన్న పేరు ‘నాటో’ (North Atlantic Treaty Organization). ఈ కూటమిలో అప్పటికి ముప్పై రెండు దేశాలు ఉన్నాయి. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం.. అవసరానికి ఒకరికొకకరు సైన్య సహకారాన్ని అందజేయటం.. మిత్ర రక్షణ.. పరస్పర సహకారం..

రెండవ ప్రపంచయుద్ధం.. 1939 సెప్టెంబరు 1వ తేదీ నుండి 1945 సెప్టెంబరు 2వ తేదీవరకు.. ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా.. విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వరంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి. మొదటిది 1937లో మొదలయిన రెండవ జపాన్ యుద్ధం. రెండవది 1939 జర్మనీ దేశం పోలండ్‌పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశల మధ్య యుద్ధానికి దారి తీస్తే.. జర్మనీచే పోలండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య.. యుద్ధానికి కారణభూతమయింది. అది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్రరాజ్యాలు, అక్షరాజ్యాల పేరుతో రెండు ప్రధాన వర్గాలుగా మారాయి. వారి మధ్యన యుద్ధం జరిగింది. అక్షరాజ్యాలు ఓడిపోయాయి. నాయకుడు జర్మనీ హిట్లర్.. మిత్రరాజ్యాలకు గెలుపు నాయకుడు ఇటలీ ముస్సోలినీ. కక్షతో యు.యస్. 1945 ఆగస్టు 6-9 తేదీల్లో జపాన్ నగరాలైన షిరోషిమా.. నాగసాకిలపైన ఆటమిక్ బాంబింగ్ ప్రయోగించి ఆ నగరాలను సర్వనాశనం చేసింది. ఆ యుద్ధంలో సైన్య పౌర నష్టం 70 నుండి 85 మిలియన్ల వరకు ఉంటుంది.’

‘నాన్నా!.. అదీ రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర. ప్రస్తుతంలో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతూ వుందట.. రష్యా యుక్రెయిన్ల మధ్య.. అమెరికా రష్యా శత్రుదేశం.. అమెరికా జనాభా 33.80 కోట్లు. రష్యా జనాభా 14.60 కోట్లు. ప్రక్కదేశం యుక్రెయిన్ జనాభా.. 4.38 కోట్లు. అమెరికా.. యుక్రెయిన్‌కు ‘నాటో’ సభ్యత్వ ఆశను చూపి.. చేర్చుకొని.. తన సైన్యాన్ని ఆయుధాలను యుక్రెయిన్‌లో దింపి.. రష్యాతో పోరు సాగించాలనే ఆకాంక్ష. యు.యన్. ఆలోచనను ఎరిగిన రష్యా.. యుక్రెయిన్ను ‘నాటో’ సభ్యత్వానికి అంగీకరించొద్దని వారించింది. కానీ యుక్రెయిన్.. అమెరికా మాటలను నమ్మి.. అతని పక్షమై రష్యాతో యుద్ధానికి సన్నిద్ధమౌతూ వుంది. మన భారత్ రెండు దేశాలకు మిత్రభావం కలిగియుండమని తెలిపింది.. ఇరుదేశ నాయకులు టర్కీలో సమావేశాన్ని జరిపి చర్చలు సాగించారు. యుక్రెయిన్.. రష్యా సలహాలకు అంగీకరించలేదు. ఆ కారణంగా యుద్ధం ఎపుడైనా ప్రారంభం కావచ్చు. ఈ విషయాలను అమ్మకు చెప్పకండి.. నా గురించి మీరు భయపడకండి.. మీ ఇరువురి ఆరోగ్యం జాగ్రత్త.

ఇట్లు.. మీ సత్య..’

సత్యా వ్రాసిన రానున్న యుద్ధవిషయాలను తలచుకొంటూ రాఘవయ్య తోటనుండి ఇంటికి బయలుదేరాడు.

***

నెల రోజుల తర్వాత..

యుక్రెయిన్ తన అభ్యర్ధనను తిరస్కరించిన కారణంగా రష్యా సైన్యం యుక్రెయిన్ భూభాగంలో ప్రవేశించింది. ఆ రెండు దేశాల్లో చదువులకోసం వెళ్లిన విద్యార్థులు హడలిపోయారు. రెండు వర్గాలవారి మధ్యన కాల్పులు, కొంత జననష్టం. యుక్రెయిన్ వాసులు ప్రాణభయంతో ప్రక్కదేశాలకు వలస ప్రయాణాలు ప్రారంభమైనాయి.

మనదేశ ప్రధాని ఆ రెండు దేశాలవారికి.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీలకు మన విద్యార్థులను గురించి హెచ్చరిక.. మైత్రీసందేశం పంపడం జరిగింది.

టీవీ.. వీడియో సెల్సులో వస్తున్న వార్తలు చిత్రాలు రాఘవయ్య సుశీలలు చూచి.. విని.. తమ కుమారుడు ఏమైనాడో అనే ఆవేదన బాధలతో కృంగిపోయారు. ఇరుగు పొరుగువారు.. ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చి ఆ పెద్దవారిని ఓదార్చి అండగా వారి ఇంట నిలబడ్డారు.

విమానాల మూలంగా మన ప్రధాని మన విద్యార్థులందరిని స్వదేశం చేరే ఏర్పాట్లు జరిపించారన్న వార్త ఆ దంపతులకు కొంతవూరట కలిగించింది.

సమయం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం.

రాఘవయ్యగారి సెల్ మ్రోగింది.. భయంతో వణికే చేతులతో దాన్ని చేతికి తీసుకొని చెవి చెంతకు చేర్చాడు.

“నాన్నా!.. నాన్నా!..” అది సత్యానందరావు పిలుపు.

“హలో!.. సత్యా!..” ఆనందంతో రాఘవయ్యగారి జవాబు.

ఒకరి తర్వాత ఒకరు అందరూ సత్యాతో మాట్లాడారు. అందరికీ సత్యా చెప్పిన సమాధానం.. మన త్రివర్ణ పతాకం.. మన దేశస్థులనే కాకుండా మన పొరుగు దేశాల విద్యార్థులను రక్షించిందని.. జండాను కప్పుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకోగలిగామని చెప్పాడు. చివరగా ‘మన భారతమాతా మహాన్ హై..’ జై.. జై.. జయ హో.. మన మూడురంగుల జెండా జిందాబాద్..” ఎంతో పారవశ్యంతో పలికాడు మూడవ సంవత్సరం యం.బి.బి.ఎస్., చదవుతున్న సత్యానందరావు.

చెన్నై ఎయిర్‌పోర్టు నుండి నెల్లూరిలోని తన ఇంటికి రాత్రి ఒంటిగంటకు టాక్సీలో చేరాడు సత్యారావు.. అతని కోసం మేల్కొని కన్నార్పకుండా ఎదురుచూపులు చూస్తున్న అక్కడివారందరూ అతను కంటపడగానే ఉద్వేగంతో.. ఆనందంతో కౌగలించుకున్నారు.

[మన మువ్వన్నెల జాతీయపతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యగారికి (1921) అంకితం.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here