మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-10

0
11

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

పుణ్యం, పాపం, వ్యక్తిత్వం:

[dropcap]ఈ[/dropcap] శ్లోకాన్ని గమనించండి.

శ్లో:

శ్లోకార్ధేన ప్రవక్ష్యామి

యదుక్తం గ్రంథకోటిభిః

పరోపకారః పుణ్యాయ

పాపాయ పరపీడనమ్‌॥

అంటే, కోటి గ్రంథాల్లో చెప్పిందాన్ని అరశ్లోకంలో చెబుతాను వినండి అంటున్నాడు. పుణ్యం వస్తుంది అన్న భావనతో ఇతరులకు మేలు చేస్తారు. పాపం వస్తుంది అనే భావనతో, భీతితో, నేరము చేయడానికి జంకుతారు. పాపపుణ్యాలు మతపరమైనవి. అన్నిమతాల్లోనూ ఉంటాయి. ఇంగ్లీషులో పాపానికి సమానార్థకమైన మాట (Sin) ఉంది కాని పుణ్యానికి లేదు. Charity లాంటి పదాలు సమానార్థకాలు కావు. తన మతం పట్ల విశ్వాసం కలిగి, పాపభీతి, పుణ్యకామన కలిగి ఉన్న వారి వ్యక్తిత్వం ఋజుమార్గంలో వెళ్ళుతుంది. ఒక రకంగా ఇవి preventives అంటే నిరోధకాలు.

హితోపదేశ కావ్యం: వ్యక్తిత్వవికాస సూత్రాల గని!

నారాయణ పండితుడు ‘హితోపదేశము’ అనే గ్రంథాన్ని రచించాడు. దానిలో మానవ జీవితాన్ని అర్థవంతంగా మలచుకోవడానికి తగిన ఎన్నో సూక్తులున్నాయి. It is a treatise on personality development. హితోపదేశమంటే మంచి బోధన, ఉత్తమమైన మార్గదర్శకత్వం అనే అర్థాలు చెప్పుకోవచ్చు. దీనిని కవి, ‘Light of Asia’ ను రాసిన, సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఇంగ్లీషులోకి అనువదించారు.

విష్ణుశర్మ అను పండితుడు, తన రాజు కోరిక మేరకు, రాజకుమారులకు వివిధములైన నీతిసూత్రాలను. రాజనీతిని, వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తాడు. అదే హితోపదేశ కావ్యం. ఇందులో రకరకాల కథల (fables) ద్వారా వారికి జీవితం పట్ల అవగాహన కల్గిస్తాడు. ఈ కథల్లో పశుపక్ష్యాదులే పాత్రులైనా, అవన్నీ మానవ భాషను మాట్లాడుతూ, మానవ స్వభావాన్ని ఆవిష్కరిస్తుంటాయి; పరోక్షంగా ఇంగ్లీషులోని Allegory అనే ప్రక్రియకు ఇది దగ్గరగా ఉంటుంది.

దీనినే ‘నీతి చంద్రిక’ అని పిలుస్తారు. బాలవ్యాకరణకర్త అయిన చిన్నయసూరి అనే మహా పండితుడు దానిని తెలుగు లోనికి శిష్టవ్యావహారిక భాషకు గ్రాంథిక భాషకు మధ్యలో ఉన్న కొంత ప్రౌఢమైన భాషలో అనువదించాడు. దానిని ఆయన 4 భాగాలుగా విభజించాడు. అవి 1) మిత్రలాభము 2) మిత్రభేదము 3) సంధి విగ్రహము 4) సంధి

భగవద్గీత తర్వాత భారతీయ సనాతన ధర్మాన్ని వ్యక్తిత్వ వికాసానికి జోడిస్తూ రచించిన Best seller ఇదే! దీనిలో మనం నేర్చుకోవలసిన అంశాలు:

  1. చెడ్డ స్నేహల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  2. పరాధికారము పైన వేసుకుంటే ప్రమాదం.

హితోపదేశం రామాయణ మహాభారతాల నుండి, భగవద్గీత నుండి సూక్తులను గ్రహించింది. కమందక నీతిసారం వంటి దౌత్య మరియు రాజనీతి గ్రంథాల నుండి, ధర్మశాస్త్రాల నుండి సారాన్ని గ్రహించింది.

నేర్చుకోవడం (Learning):

మనిషి నిరంతరం ఒక learner గా ఉండాలని హితోపదేశం సూచిస్తుంది. “దాచిన నిధి కంటే నేర్చుకోవడం గొప్పది. ఇది విదేశీ ప్రయాణాలలో తోడుగా ఉంటుంది. నేర్చుకోవడం అనేది ఎన్నటికీ తరగని శక్తినిస్తుంది. ఇది కీర్తికి మరియు విజయానికి మూలం. నేర్చుకోని వాడు మృగముతో సమానం.”

కరుణ:

మీ జీవితం మీకు ఎంత ప్రియమైనదో, ప్రతి ప్రాణికి కూడా అంతే. మంచివారు తమ సారూప్యతతో అందరి పట్ల కరుణతో ఉంటారు.

స్నేహితులను సంపాదించటం ఎలా? (మిత్రలాభం):

మంచి స్నేహితులు, జీవితం లోని సంతోషాలు మరియు దుఃఖాలు రెండిటిని నిక్షిప్తం చేసే పాత్రలు ఉంటారు. తెలివైన, నిజాయితీ గల స్నేహితులు పేదవారు కావచ్చు. కానీ జీవితంలో విజయాలు సాధించడానికి వారు మనకు దోహదం చేస్తారు. పదాలు స్నేహితుడిని నిర్వచించలేవు. వారి ప్రవర్తన, చర్యలు మాత్రమే వారిని నిర్వచిస్తాయి.

స్నేహితులను పోగొట్టుకోవడం (మిత్రభేదం):

అసూయ వల్ల గొప్ప స్నేహలు నాశనం అవుతాయి. తప్పుడు సమాచారం, చెప్పుడు మాటలు వినడం స్నేహితుల మధ్య చీలికలని సృష్టిస్తాయి. అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయని గుర్తించలేకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, తగిన విచారణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, స్నేహితులను కోల్పోయేలా చేస్తాయి.

విగ్రహము (యుద్ధం) (clash):

దీనికి కారణాలు – 1) దురాశ 2) విమర్శ 3) సిద్ధాంత వైరుధ్యం 4) సంయమన రాహిత్యం 5) బలహీనమైన దౌత్యం మొదలగునవి.

సంధి (శాంతి):

ఏడు రకాల వ్యక్తులతో మనం ఎప్పుడూ శాంతిని కోరుకోవాలి. వారు 1) సత్యవంతులు 2) సద్గురువులు 3) న్యాయవంతులు 4) బలవంతులు 5) విజేతలు 6) నిష్పక్షపాతులు 7) స్థితప్రజ్ఞులు.

ప్రత్యర్థి (opponent) గౌరవంగా అర్థం చేసుకుంటే శాంతి సాధ్యం.

ఉపసంహారం:

హితోపదేశ కావ్యం మానవాళికి ఈ క్రింది శుభాలను కోరుతూ ముగుస్తుంది.

  1. భూలోకంలో విజయం సాధించిన వారందరికీ ‘శాంతి’ కలకాలం సుఖాన్ని ప్రసాదించుగాక.
  2. న్యాయవంతులైన వారు కష్టాల నుండి విముక్తి పొందుదురుగాక
  3. మంచి చేసేవారి కీర్తి చిరకాలం వర్ధిల్లాలి.
  4. వివేకం, అద్భుతమైన కాంతితో చిరకాలం ప్రకాశించు గాక.

పైన చర్చించిన విషయాలనన్నింటినీ, abstract గా కాకుండా flesh and blood తో నిండిన పాత్రలతో (అవి జంతువులే అయినా), చిన్నపిల్లలను సైతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన వ్యక్తిత్వ వికాస పరమోత్తమ గ్రంథం హితోపదేశం. దీనిని చదివితే, వ్యవహార జ్ఞానం, కుశాగ్ర బుద్ధి, ద్వైదీభావాలలో సైతం సరైన నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యంతో పాటు, ఇంకా మరెన్నో కోణాలతో మన వ్యక్తిత్వం వికసిస్తుంది.

దీనిలో కొన్ని proverbial status పొందిన సూక్తులు:

  1. ధర్మేణహీనాః పశుభిస్యమానాః (ధర్మచ్యుతులైన వారు పశువులతో సమానం)
  2. విద్యాదదాతి వినయమ్ ( విద్యవల్ల వినయం లభిస్తుంది)
  3. అనభ్యాసే విషం విద్యా (అభ్యాసం (practice) చేయక పోతే విద్య విషంగా మారుతుంది)
  4. ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మి (ప్రయత్నపరుడైన మానవ శ్రేష్ఠుని సంపదలు వరిస్తాయి)
  5. ఉద్యమే నహి సిధ్యన్తి కార్యాణి న మనోరధైః (కేవలం సంకల్పాల వల్ల కార్యాలు సిద్ధించవు. ప్రయత్నాల వల్లనే)

కొన్ని గుర్తుంచుకోదగ్గ శ్లోకాలు:

శ్లో:

యయోరేవ సమం విత్తం, యయోరేవ సమం కులం।

తయోర్మైత్రీ వివాహశ్చ న తు పుష్టవిపుష్టయోః॥

(అన్ని విషయాల్లో సమానమైన వారి మధ్య మైత్రిగాని వివాహంగాని కుదురుతాయి)

శ్లో:

నాస్తి విద్యాసమో బంధుః నాస్తి విద్యాసమో సహృత్।

నాస్తి విద్యా సమం విత్తం నాస్తి విద్యాసమం సుఖం॥

(విద్యకు సమానమైన బంధువు, మిత్రుడు, విత్తము, సుఖము లేనే లేదు)

శ్లో:

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినమ్।

వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం॥

(సమక్షంలో మంచి మాటలు, పరోక్షంలో ద్రోహము చేసే మిత్రుని త్యజించాలి)

శ్లో:

రాజపత్నీ గురోః పత్నీ మిత్రపత్నీ తథైవ చ।

పత్నీమాతా స్వమాతా చ పంచైతా మాతరః స్మృతాః॥ (చాణక్యనీతి)

(రాజపత్ని, మిత్రుని భార్య, భార్యకు తల్లి, స్వంతతల్లి వీరంతా తల్లులే)

శ్లో:

 ప్రత్యాఖ్యేన చ దానే చ సుఖదుఃఖే ప్రియా అప్రియే।

ఆత్మౌపమ్యేన పురుషః ప్రమాణమధిగచ్ఛతి॥

(దానంలో, పరిశీలనలో, సుఖ దుఃఖాల్లో తనను ఇతరుల స్థానంలో భావించేవాడు ప్రమాణం నెలకొల్పగలడు)

శ్లో:

విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ।

వ్యాధిత ఔషధం మిత్రం ధర్మోం మిత్రం మృతస్య చ॥

(ప్రయాణాల్లో విద్య మిత్రుడు, ఇంట్లో భార్యే మిత్రుడు, రోగికి మందు మిత్రుడు, మృతునికి ధర్మమే మిత్రుడు)

~

భర్తృహరి సుభాషిత త్రిశతి:

ఇది ఒక సంస్కృత కావ్యం. లఘుకావ్య సంప్రదాయానికి చెందినది. భర్తృహరి 5వ శతాబ్దానికి చెందిన మహాకవి. ‘త్రిశతి’ అంటే మూడు వందల శ్లోకాలు గలది అని అర్థం. దీనిని ‘సుభాషిత రత్నావళి’ అని కూడా అంటారు.

ఇందులో మూడు భాగాలున్నాయి. 1) నీతి 2) శృంగారం 3) వైరాగ్యం. ఈ మూడూ మానవ వ్యక్తిత్వం లోని ప్రధానాంశాలే.

భర్తృహరి ప్రవచించిన, మనుషుల కత్యంత యోగ్యమైన గుణములు

  1. ఆత్మగౌరవము (self-respect): ఎన్ని సంకటములు కలిగినా, మన ఆత్మగౌరవానికి, స్వీయస్వతంత్రకు భంగము కలుగనీయరాదు.
  2. పట్టుదల (determination): దీనినే ఆయన ‘ధృడ ప్రవృత్తి’ అన్నాడు. దీనికి అభినివేశం, (enthusiasm), వ్యవసాయం (effort) తోడైతే వ్యక్తిత్వ పరిమళాలు వికసిస్తాయి.
  3. ధర్మానుష్టానము (Piety): సాంఘిక సేవ, పరోపకారము అనునవి పరమ ధర్మములు. సజ్జనుడు వీటిని ఆచరించవలెను.
  4. సచ్ఛీలము (Character, chastity): సద్గుణము లన్నింటిలో ఇది నాయకమణి. పరమోత్కృష్టమైనది.

ఏనుగు లక్ష్మణకవి:

సుభాషిత త్రిశతిని సరళమైన తెలుగులోనికి అనువదించిన వాడీయన. దానికి ‘సుభాషిత రత్నావళి’ అని పేరు. కూచిమంచి తిమ్మకవికి ఈయన సమకాలికుడు.

సన్మిత్రుని లక్షణాలు:

అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ

జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము,

విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు

మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.

(సరైన స్నేహితుడు మనలను చెడు పనులను చేయనివ్వడు. మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తాడు. మన రహస్యాలను కాపాడుతాడు, ఇతరుల లోని సుగుణాలను గుర్తిస్తాడు. ఆశ్రయించిన వారిని కాచుకుంటాడు. లేమిలో ఆదుకుంటాడు. అట్టి మిత్రులను కలిగి ఉండడం ఉత్తమ వ్యక్తిత్వానికి దోహదం చేస్తుంది)

శ్లో:

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,

ప్రారభ్య విఘ్నవిహతా విరమన్తి మధ్యాః।

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః,

ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి॥

దీనికి ఏనుగో లక్ష్మణకవిగారి తెలుగు అనువాదం:

శ్లో:

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై,

యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్,

ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై,

ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞా నిథుల్ గావునన్

(నీచులు విఘ్నాల భయంతో అసలు పనినే మొదలుపెట్టరు. ప్రారంభించినా, అడ్డంకులు కలుగగానే, పనిని మధ్యలో వదిలేస్తారు మధ్యములు. కానీ ఉత్తములు, ఎన్ని ఆటంకాలెదురైనా, గమ్యాన్ని చేరేంతవరకు- తమ పనిని వదలరు. మనం మూడవ కేటగిరీలో ఉండాలి. ఉదా: చాణక్యుడు, మహాత్మాగాంధీ, రాబర్ట్ బ్యూస్ మొ॥ వారు).

వినయం వ్యక్తిత్వ భూషణం:

ఈ మాటను ఎంత సోదాహరణంగా వివరిస్తున్నాడో చూడండి.

తరువు లతిరసఫలభార గురుత గాంచు

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుపకర్తలకు నిది సహజగుణము

(మంచి రసము కలిగియున్న పళ్ళు కాచిన చెట్లు ఆ భారాన్ని మోస్తూ వంగి ఉంటాయి. ఆకాశంలో వ్రేలాడుతూ, మేఘాలు అమృతతుల్యమైన వర్షాన్ని ఇస్తాయి. ఎంత సమృద్ధి పొందినా పండితులు గర్వమునొందరు. పరోపకారులకు ఇది సహజంగా ఉండే గుణము)

అట్లా, మనిషి వ్యక్తిత్వానికి చేవగూర్చేది అతని మాట తీరు మాత్రమే. దానిని మించిన ఆభరణం లేదు అని ఒక చక్కని పద్యం ఉంది. భర్తృహరి వారి ఆ సంస్కృత శ్లోకం –

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః।

వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్॥

దాదాపు కొన్ని దశాబ్దాల కిందట ఈ శ్లోకం ఆలిండియా రేడియోలో రోజూ ఉదయం వచ్చేది.

దానిని లక్ష్మణకవి హృద్యంగా తెనిగించారు

భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,

భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్

భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా

గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్

(మానవునికి అందమైన తలకట్టు, పూలహారాలు, మణి రత్నాలు, గంధం, ఇవన్నీ నిజమైన అలంకారాలు కావు. నిజమైన భూషణం (నగ) వాక్పటిమ మాత్రమే. భౌతికమైన అలంకారాలన్నీ నశిస్తాయి. వాక్కు అనే నగకు మరణం లేదు)

ఈనాడు వ్యక్తిత్వ వికాసంలో రాజ్యమేలుతున్న Communication Skills యొక్క ప్రాముఖ్యాన్ని, భర్తృహరి ఆనాడే వివరించాడు.

కావ్యాలతో సంబంధం లేకుండా విడిగా అన్ని భాషల్లోనూ కొన్ని సూక్తులు ఉన్నాయి. స+ఉక్తి=సూక్తి, అంటే మంచిమాట. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవి వీరవిహారం చేస్తున్నాయి. వాటిని చదివి ఎంతమంది ప్రభావితులవుతున్నారో తెలియదు గాని, వాటిని అర్థం చేసుకుని పాటిస్తే వ్యక్తిత్వం వికసితమౌతుంది. వాటిని చెప్పిన వారికంటే, ఆయా సూక్తులే జనం నోళ్లలో నాని ప్రసిద్ధి పొందాయి. వాటిలో కొన్ని:

  1. ‘చిరునవ్వు’ ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. దీనినే ‘Service with a smile’ అంటారు Management Gurus.
  2. గౌరవాలు పొందడం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
  3. రంగులు మారొచ్చు, గుళ్లూ గోపురాలూ పడిపోవచ్చు, మహా సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, తెలివైన మాటలు మాత్రం సజీవం!
  4. ఏ కారణం లేకుండా నిన్ను యితరులు విమర్శిస్తున్నారంటే విజయం సాధించబోతున్నావన్న మాట!
  5. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని కలిగించడం
  6. మన లోని ద్వేషం, ఈర్ష్య, అసూయ, కోపం తీసివేతలుగా చేసి వాటికి బదులు ప్రేమ, ఓర్పు, సహనం, కరుణ కూడికలుగా చేస్తే, మనిషికి సంతృప్తిగల జీవితం లభిస్తుంది.

రోజూ ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో ఇలాంటి సూక్తులు ఇతర భాషల్లో ఎన్నో ఫార్వర్డ్ చేయబడుతూంటాయి.

ఉపసంహారమ్:

మన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, శతకాలు, ప్రబంధాలు వ్యక్తిత్వ వికాస సుగంధాలను వెదజల్లే treasure houses లాంటివి. కేవలం పాశ్చాత్య దృక్పథమే వ్యక్తిత్వ వికాసానికి guiding force కాదు. మన ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం కూడా అమూల్యమైన వ్యక్తిత్వ సౌరభాలకు నిధి. ఇది ఒక సముద్రమంత సబ్జెక్ట్. దానినుండి కొంత సంగ్రహించి, వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ, ఆధునిక తరాన్ని enlighten చేసే ప్రయత్నమే ఈ రచన. దీన్ని ఆదరిస్తారని రచయిత నమ్మకం.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here