మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-3

0
11

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

కర్మ, ఫలితం, నిష్కామకర్మ:

[dropcap]భ[/dropcap]గవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన విషయాలను కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే చూడకూడదు. అవి వ్యక్తిత్వ వికాస సూత్రాలు కూడా. మనం ఒక పని చేస్తాము. సహజంగానే దాని నుండి ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తాము. దాని వల్లే మనకు ఆశాభంగం, దుఃఖం కలుగుతాయంటాడు కృష్ణ పరమాత్మ.

దానినే ‘Expecting no return’ అని కర్మయోగములో చెప్పాము స్వామి వివేకానందుల వారు.

‘కర్మణ్యేవాధికారస్తే, మాఫలేషు కదాచన’ అన్న గీతా వాక్యం, మన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. కృతజ్ఞతను ఆశించడం (looking forward to gratitude) కూడా అలాంటిదే. మనం ఎదుటివాడికి ఏదో సహాయం చేస్తాం. అంతే, అక్కడితో మన పని అయిపోతుంది. కృతజ్ఞత చూపడం, చూపకపోవడం అనేది సాయం పొందినవాడికి సంబంధించినది.

“కొడుకును బాగా చదివించావు. మంచి ఉద్యోగం రావడంలో నీ పాత్ర ఉంది. పెళ్ళి చేశావు. ఓ.కే! నీ వృద్ధాప్యంలో వాడు, కోడలు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదని, నిరాదరణకు గురి చేస్తున్నారని బాధపడుతున్నావు. ఆ బాధ దేని వల్ల వచ్చింది? కొడుకు నీవు చేసిన దానికి reciprocation చేయడం లేదని. అంటే నీవు return (ఫలితం) ఆశిస్తున్నావు. కొడుకును పెంచి, పెద్ద చేసి ప్రయోజకుడిని చేయడం నీ ధర్మం, బాధ్యత. అంతేగాని, తర్వాత నీ పట్ల వాడు చూపవలసిన ఆదరణ అనేది వాడి ధర్మం, వాడి బాధ్యత. దాని కోసం నీవు బాధ పడడంలో అర్థం లేదు.”

అద్భుతమైన ఈ వివరణ ఇచ్చినవారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు.

ఇంద్రియాలు, కోరికలు, విషయాసక్తి:

శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు – “అర్జునా, ఇంద్రియములు మహా బలమైనవి. తాబేలు వలె మనం మన కోరికలను ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవాలి”. అంటే ‘అంతర్ముఖుడు’ కావాలి. దీనినే William Blake, తన ‘Songs of Experience’ లో ‘turn inward’ అంటారు. తన మీద గీత ప్రభావం బాగా ఉందని ఆయనే చెప్పుకున్నారు. ఇంద్రియాసక్తి, కోరికలకు కారణం. కోరికలు తీరకపోతే కోపం, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధి నాశము, చివరకు సంపూర్ణ వినాశనము జరుగుతాయి.

ఇంద్రియ నిగ్రహమంటే మనసును అదుపు చేసుకోవటం. దానిని సాధిస్తే మనశ్శాంతి లభిస్తుంది. అది నిజమైన సుఖాన్ని ఇస్తుంది.

మళ్ళీ ఈ విషయాన్ని ఆధాత్మికతా పార్శ్వంలో కాకుండా, లౌకిక పార్శ్వంలో చూద్దాం. ఉత్తమ వ్యక్తిత్వ వికాసంలో ఇది కూడా ముఖ్యమే. మనకు అసంతృప్తి కలిగేది comparison వల్లనే. ఎప్పుడూ మనం ఇతరులతో పోల్చుకోకూడదు. మన అర్హత, మన విద్య, మన తాహతును బట్టి మనముండాలి. మనిషికి expectation అనేది అనంతంగా ఉంటుంది.

రైలు ప్రయాణీకుడిని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఫ్లాట్‍ఫారం మీదకి, ఓవర్ బ్రిడ్జ్ మీదుగా దూకుతూ చేరుకున్నాడు. రైలు కదులుతూంది. రిజర్వేషన్ లేదు. ఎలాగైనా సరే గమ్యం చేరాల్సిన అత్యవసర పరిస్థితి. జనరల్ కంపార్ట్‌మెంట్ క్రిక్కిరిసి ఉంది. డోర్ దగ్గర వేలాడుతున్నారు జనం.

ఎలాగో రాడ్ పట్టుకుని, ఫుట్ బోర్డ్ మీద ఒక కాలు పెట్టి నిలబడినాడు. ఇంకో కాలు గాలిలోనే ఉంది. “అమ్మయ్య! ట్రెయిన్ ఎక్కగలిగాను!” అనే రిలీఫ్. అది రెండు నిమిషాలు మాత్రమే. కొంచెం లోపలికి వెళ్ళగలిగితే బాగుండును! అదీ అయింది. జనం లోపలికి సర్దుకున్నారు. మనవాడు కొంచెం ఊపిరి పీల్చుకుని సరిగ్గా నిలబడ్డాడు. థాంక్ గాడ్!

ఆ ఫీలింగ్ అయిదు నిమిషాలుంది అంతే! జనాల్లోంచి సందు చేసుకుని కొంచెం లోపలికి వెళ్ళాడు. మీరెక్కడ దిగుతారని ఇద్దరు ముగ్గురిని అడిగాడు. ఒకాయన అనకాపల్లిలో దిగుతాడట. అమ్మయ్య! అనకాపల్లిలో సీటు దొరుకుతుంది! అక్కడితో సంతోషం!

అనకాపల్లిలో కూర్చున్నాడు. విజయవాడ వరకు వెళ్లాలి. ఇంకా ఐదు గంటలకు పైగా ప్రయాణం ఉంది. ఎదురుగా లగేజ్ ర్యాక్ వెడల్పుగా ఉంది. సాధారణంగా జనరల్ కంపార్ట్‌మెంట్‍లో వారు దాన్ని బెర్త్‌గా ఉపయోగించుకుని నడుం వాలుస్తారు. మనవాడు పైన పడుకున్న వాడిని అడిగాడు ఎంతవరకని? రాజమండ్రి! వెరీ గుడ్. రాజమండ్రిలో పైకెక్కి పడుకున్నాడు. స్వర్గంలా ఉంది. ఆ స్వర్గం పావుగంట కంటే ఎక్కువ లేదు. చెక్క రీపర్లు, వాటికి బిగించిన బోల్టులు వీపుకు గుచ్చుకుంటున్నాయి. ఇలా సా..గి..పోతూనే ఉంటుంది అసంతృప్తి. తనకంటే మెరుగైన స్థితిలో ఉన్నవాళ్ళతో పోల్చుకోవడం, అదీ లభించినప్పటికీ, మరింత మెరుగైన స్థితి కోసం వెంపర్లాడటం. దాని వలన మనశ్శాంతిని కోల్పోవడం. దీనికి పరిష్కారం ఒక్కటే – contentedness/contentment.

ఉన్నదానితో తృప్తి పడటం. వ్యక్తిత్వ వికాసం virtues (సుగుణాలు)లో ఇది కూడా ముఖ్యం. అంటే better life కోసం ప్రయత్నం చేయవద్దని కాదు, చేయాలి, సాధించాలి. కాని అది వచ్చేంత వరకు అసంతృప్తి పొందకూడదు.

జ్ఞానము, కర్మ:

అర్జునుని సందేహం.. కర్మ కంటే జ్ఞానం గొప్పదని కృష్ణుడు చెబుతున్నాడు కదా! మరి ఈ యుద్ధ ‘కర్మ’ చేయమని ఎందుకు చెబుతున్నాడు.. అని. దానికి సమాధానం భగవానుడు ఇలా చెప్పాడు:

ఆత్మవిచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము విముక్తి మార్గాలుగా పరమాత్మ బోధిస్తున్నాడు. కర్మ అంటే పని. దానిని మనిషి నిరంతరం చేస్తూనే ఉండాలి. కర్మ పరిత్యాగం అంటే పనులు చేయకుండా ఉండడం వల్ల మోక్షసిద్ధి కలుగదు.

ఒక్క క్షణం కూడా మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. గాలి పీల్చడం, తినడం, త్రాగడం, నడవడం కూడా కర్మ క్రిందకే వస్తాయి. మరి నిద్రపోవడం? అది కూడా పనే. వాటిలో రెండు రకాలున్నాయన్నారు స్వామిగారు.

  1. కర్మేంద్రియ కర్మలు
  2. జ్ఞానేంద్రియ కర్మలు

ఇవి రెందూ నిర్వహించవలసినవే. కాని మనసుతో వాటిని నియంత్రించి, వాటిపై ‘ఆసక్తి’ లేకుండా, ఫలితం ఆశించకుండా చేయాలి. దానినే ‘నిమిత్త మాత్రం భవ కౌంతేయ’ అన్నాడు స్వామి.

‘పనుల’ను చేయకుండా బ్రతికి ఉండడం కష్టం. దీనినే ‘An idle man’s brain is devil’s workshop’ అన్నారు. భగవంతునికి ప్రీతికరమైన కర్మలు ఏవి? Rituals కాదు, అంటే పూజలు పునస్కారాలు కాదు. లోకహితములైన కర్మలే ఆయనకు యిష్టమైనవి.

రవీంద్రనాథ్ టాగోర్ గారు విశ్వకవి. ఆయన తన గీతాంజలిలో ఇలా అన్నారు:

“Whom dost thou worship?

In this lonely dark corner of the Temple?

God is not there!

Find Him in the pathmaker

breaking stones

And the famer tilling the land.”

ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరించారా మహాకవి. కమ్యూనిస్టులు సైతం అంగీకరిస్తారు దీనిని.

“గుడిలోని ఆ చీకటి మూల, ఎవరిని పూజిస్తున్నావు?

దేవుడక్కడ లేడు!

రోడ్డు వేయడం కోసం రాళ్ళు పగలగొడుతున్న కార్మికుడిలో

భూమిని దున్నుతున్న రైతులో

ఆయన్ను చూడు!”

వ్యక్తిత్వ వికాసమంటే సరిగ్గా ఇది! కౌశికునికి అంతుబట్టని విషయాలను ధర్మవ్యాధుడు, మాంసం కొట్టు నడుపుకునే వాడు, ఎలా గ్రహించగలిగాడు? తన ‘పని’లో భగవంతుడిని దర్శించగలిగాడు కాబట్టి.

కర్మ, వికర్మ, అకర్మ:

కర్మలు మళ్ళీ నాలుగు రకాలు. 1. ఆధ్యాత్మికత 2. పరిపాలనా దక్షత, రక్షణ 3. వ్యాపారశీలత 4. శ్రమ, గతి. ఈ నాలుగు కర్మలు మనలను అంటకుండా, వాటి ఫలాలపై అపేక్ష లేకుండా, వాటితో బంధింపబడకుండా ఉండడమే కర్మయోగం. ‘కర్మ’ అంతే చేయదగిన పని, ‘వికర్మ’ అంటే చేయకూడని, తప్పు పని. ‘అకర్మ’ అనేది కోరిక, ఆసక్తికి అతీతం. ఇంకా పొందవలసినదేదీ లేనప్పుడు, మహాత్ములు కేవలం విశ్వకల్యాణం కోసం చేసేది. ఇది అత్యుత్తమం. రెండవది అధమం. మొదటిది ఉత్తమం.

దీనిని మనకు తెలిసిన రీతిలో వివరించుకుందాము. యోగి అయిన వాడు అకర్మలో కర్మనూ, కర్మలో అకర్మనూ చూడగలడు.

అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించే క్రమంలో, అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే సంస్థ ఉన్నతాధికారి “భగవంతుని దయ వల్ల మా ప్రయోగం సఫలమయింది” అన్నారు.

ఉపగ్రహమును launch చెయ్యడం కర్మ. దానిని భగవంతుని దయకు attribute చేయడం అకర్మ. భౌతిక కర్మల నుండి ఆత్మను విడిగా ఉంచడం అకర్మ.

వివేకవంతుడు (కేవలం జ్ఞాని కానివాడు), ఆత్మతో చూసి ‘తాను పనులను చేయడం’ అనేది నిజం కాదని గ్రహిస్తాడు. అకర్మలో కర్మను చూడడం అంటే ఏమిటి? ఆత్మను దూరంగా ఉంచినప్పటికీ, చేయదగిన, చేస్తున్న పనిని శ్రద్ధగా, నేర్పుగా, జాగ్రత్తగా చేయడం. ఆ పని వల్ల కలిగే ‘ఫలితానికి’ తాను కారణం కాదు అని గ్రహించడం. మనం ముందుగానే చెప్పుకున్నట్లు, అన్నమాచార్యుల వారన్నట్లు ‘నాహం కర్తా, హరిః కర్తా’!

‘కినిమా’ అని ఒక సినిమా పత్రిక ఉండేది. ఒకసారి వారు యన్.టి.ఆర్.ను ఇంటర్వ్యూ చేసి, దాన్ని ఆ పత్రికలో ప్రచురించారు. తన కెరీర్ లోని తొలినాటి మూడు చిత్రాలు – ‘పల్లెటూరి పిల్ల’, ‘షావుకారు’, ‘సంసారం’ – అద్భుత విజయాన్ని సాధించాయి. దానికి “మీ సౌందర్యం, లోకాతీత సమ్మోహత, నటనా ప్రతిభ కారణం కదా” అని అంటే ఆయన వినమ్రంగా ఇలా జవాబిచ్చాడట:

“ఆ సినిమాలలో  బలమైన కథలున్నాయి. వాటిని దర్శకత్వం చేసినవారు గొప్పవారు, సమర్థులు. అన్నింటిని మించి ప్రేక్షకులకు నాపై ఉన్న ప్రేమాభిమానాలు. వాటి విజయానికి ఇవన్నీ కారణాలు గాని, నేనొక్కడినే కాదు.”

మూడు సినిమాలలో కథానాయకుడిగా నటించడం కర్మ. దానిని ఘనతగా భావించకుండా, ఆత్మకు దానిని దూరంగా ఉంచి, కథ, దర్శకత్వం, ప్రేక్షకాదరణలను కారణాలుగా పేర్కొని, ఆ ‘ఫలితానికి’  తాను కారణం కాదని గ్రహించి, అకర్మను సాధించాడు ఆయన.

క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయము:

భగవానుని దృష్టిలో, ఈ భౌతిక శరీరమే క్షేత్రం. అన్ని రకాల పనులు, ధర్మాలు నిర్వహించడానికి, ఇదే సాధనం. అందుకే దానిని ‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనమ్’ అన్నారు. ‘ఖలు’ అంతే ‘కదా!’ అని అర్థం. ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. ఈ సృష్టిలోని అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడని తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు.

మనకు కనబడే ప్రకృతి, పంచభుతాలు, పది ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, కోరిక, ఏవగింపు, సుఖము, దుఃఖము, తెలివి, పట్టుదల – వీటన్నిటి సమాహారమే క్షేత్రం. అంటే శరీరం. ఇది శిధిలమై, నశించేంత వరకూ ఇవన్నీ దానిని ఆశ్రయించుకుని ఉంటాయి. ‘శీర్యతే ఇతి శరీరః’ అన్నారు. శిధిలం అయ్యేదే శరీరం. కానీ ఈ శరీరం తాను కాదు అనే ఎఱుక, క్షేత్రజ్ఞత్వంలో పై మెట్టు. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలిసినప్పుడు worship అనే concept మారిపోతుంది. ఆదిశంకరులంతటి వారు మాయకు లోనైతే, సాక్షాత్తు శివుడు చండాలుని రూపంలో ఆయన కళ్లు తెరిపించాడు.

శంకర భగవత్పాదులు శిష్యకోటితో ప్రయాణిస్తున్నారు. చండాలుని రూపంలో, భయంకర దుర్గంధాన్ని వెదజల్లుతూ, పరమేశ్వరుడు వారికి ఎదురైనాఅడు. శిష్యులు అతన్ని “పక్కకి తొలగు” అని హెచ్చరించినారు. శంకరాచార్యులు వారిని వారించలేదు. అప్పుడా చండాలుడు స్వామిని ఒకే ప్రశ్న అడిగాడు. “నన్ను పక్కకు జరగమంటున్నాడా, మీ గురువు? నాలోని పరమాత్మను పక్కకు తొలగమంటున్నాడా?”

అంతే! శంకరాచార్యులకు జ్ఞానోదయమైంది. చండాలుని కాళ్ళపై పడి, తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు. క్షేత్రజ్ఞుడైనాడు.

ప్రధాని నరేంద్ర మోడీ, దీపావళిని సైనికులతో జరుపుకోవడం, స్వయంగా వారికి స్వీట్లు తినిపించడం; ప్రపంచంలోనే అధిక ధనవంతులైన వారు తమ సంపదలో సింహభాగాన్ని సమాజ సేవకు వెచ్చించడం; క్రికెట్‍లో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన మేటి ఆటగాడు ఒక సిక్సర్‍తో ఆటను గెలిచిన వెంటనే బ్యాట్‍ను ఆకాశం వైపు చూపిస్తూ, భగవంతునికి వందనం చేయటం – ఇవన్నీ క్షేత్రజ్ఞుల లక్షణాలే.

జ్ఞానం:

శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానమంటే ఏమిటో పలు విధాలుగా నిర్వచించారు.

1. తన గుణాలను పొగుడుకోకుండా ఉండడం; బడాయిని చూపించకుండా ఉండడం

నిజమైన జ్ఞానిలో స్వోత్కర్ష (self-praise) ఉండదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే జ్ఞానం. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారు ఇందుకు చక్కని ఉదాహరణ. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన వెంటనే మీరేం చేయాలనుకుంటున్నారని విలేఖరులు అడిగితే, “అధ్యాపక వృత్తి” అని చెప్పారట. ఎన్నడూ ఆయన తన గొప్ప చెప్పుకోలేదు.

2. ఇతరులను మనసా, వాచా, కర్మణా పీడించకుండా ఉండడం

ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఇతరులను harass చేయాలని చూస్తూంటారు చాలా మంది. అధికారం, ధనం ఇలాంటి వాటి వల్ల ఈ గుణం కలుగుతుంది. ఇతరులకు సాధ్యమైనంతగా సాయం చేయాలి వీలైతే. అంతేగాని హాని చేయకూడదు. ‘పరపీడన పరాయణత్వాన్ని’ మహాకవి శ్రీశ్రీ తన కవిత్వంలో తెగనాడాడు. అలాంటి వాళ్ళంతా ఘోరమైన అంతాన్ని పొందారు. హిట్లర్, ఇదీ అమీన్ లాంటి వారు.

3. ప్రతీకారం చేయగలిన శక్తి ఉండీ, తప్పు చేసినవాడిని క్షమించడం

“అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతీ!” అన్నాడు సుమతీ శతకకారుడు. ఇందులో ‘నెపమెన్నక’ అన్న పదం ఏదో ప్రాస కోసం వేసింది కాదు. ‘మళ్ళీ ఎలాంటి కారణాలు వెతక్కుండా’ అని అర్థం.

మహాభారతంలో..

“పగయడంఛించు టెంతయు శుభం బది లెస్స; యడంగునే పగంబగ..” అంటాడు యుధిష్టిరుడు. “ఒక దశలో పగను అణచుకోవడమే మంచిది. పగతో పగ నశించదు”.

‘లాల్‍సింగ్ ఛద్దా’ సినిమాలో కథానాయకుడు dimwit. అంతే కొంచెం జడ్డివాడు. కార్గిల్ యుద్ధంలో క్షతగాత్రులను రక్షించే క్రమంలో ఒక తీవ్రవాదిని కూడా పొరపాటున తీసుకుచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుస్తాడు. ఆ తీవ్రవాది భారతదేశంపై నరనరానా ద్వేషం పెంచుకుని ఉంటాడు. కథానాయకుడు తన ప్రేమతో, అతని ద్వేషాన్ని జయిస్తాడు. అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తాడు. అదంతా భగవంతుని పూజలో ఒక భాగంగా భావిస్తాడు. తీవ్రవాది మనస్సు పశ్చాత్తాపంతో క్షాళనమవుతుంది. తన దేశానికి తిరిగి వెళ్ళి, ఒక స్కూలు ప్రారంభించి, పిల్లలకు క్షమను, దయను, అహింసను బోధిస్తాడు. నాకైతే వీళ్ళిద్దరిలోనూ క్షేత్రజ్ఞుడే కనబడతాడు. కర్మలో అకర్మను చూడగలిగినవాడే కనబడతాడు. ఈ సినిమాను ‘బాయ్‍కాట్’ చేయాలని సోషల్ మీడియాలో ఆందోళలనలు జరిగాయి. ఎందుకో మరి? నాకర్థం కాలేదు.

రాయలసీమలో ఒకప్పుడు ‘ఫాక్షనిజం’ చాలా తీవ్రంగా ఉండేది. వారి అనుచరులను పోటుగాండ్లు అంటారు. ఫాక్షనిస్టుల పగలతో పాపం వారికి ఏ సంబంధం ఉండదు. కరువు ప్రాంతం కావడం వల్ల, జీవనోపాధి కోసం వారు ఫాక్షనిస్టులను ఆశ్రయిస్తారు. మరొక అనుకూల అంశం ఏమిటంటే, పోటుగాండ్లు ఫాక్షన్ గొడవల్లో చనిపోతే, వారి కుటుంబాలను జీవితాంతం వారి నాయకులే పోషిస్తారు. ఒక రకంగా దీనిని faction ethics అనవచ్చేమో!

కాని రాను రాను, పోషించాల్సిన కుటుంబాలు ఎక్కువై, ఫాక్షనిస్టుల ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. క్రమంగా వారు దీని వల్ల నష్టమే గాని, లాభం లేదని తెలుసుకున్నారు. తమ పిల్లలను పెద్ద చదువులు చదివించి, ఫాక్షనిజంకు దూరంగా పంపించేశారు. ప్రస్తుతం దాని తీవ్రత బాగా తగ్గింది.

ప్రముఖ రచయిత, పాత్రికేయులు వల్లీశ్వర్ గారు ‘99 సెకన్లలో చదవగిగిన కథలు’ వ్రాశారు. అద్భుతమైన కథలవి. వ్యక్తిత్వ వికాస పాఠాలను ఫిక్షన్‍గా మార్చారు ఆయన. వాటిని సమీక్షించి ప్రధాన ప్రసంగం చేసే అవకాసం నాకు సంచిక.కామ్ సంపాదకులు, సోదరులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ కలిగించారు. అందులో ఒక కథ ఉంది.

సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ఒకాయన ఉంటాడు. ఆయన దిగువ స్థాయిలో పని చేస్తున్నప్పుడు తన పై అధికారి ఒకరు ఇతనిపై adverse remarks వ్రాసి ఇతనికి ప్రమోషన్ రాకుండా అడ్డుకొని ఉంటాడు. ప్రస్తుతం ఈయన సి.వి.సి. తనకు గతంతో ద్రోహం చేసినతని ఫైలు ఇతని దగ్గర కొస్తుంది. ఇతను అనుకూలంగా రాస్తే తప్ప, అతడు చీఫ్ సెక్రటరీ కాలేడు. అవకాశం దొరికింది కదా, ప్రతీకారం తీర్చుకుందామని సి.వి.సి. నిర్ణయించుకుంటాడు. కానీ శేషయ్య గారని ఈ కథల్లో ఒక protagonist ఉంటాడు. ఆయనకు ఈ సి.వి.సి. శిష్యుడు. ఆయన ఈ గుణాన్నే అతనికి చెబుతాడు – “ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉండి కూడా ఎదుటివాడు చేసిన తప్పును క్షమించడమే అసలైన జ్ఞాని లక్షణం” అని. సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ఆయన మాటల వల్ల ప్రభావితుడై, తనకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తాడు. అదీ కథ.

వల్లీశ్వర్ గారి ఈ కథల నిండా వ్యక్తిత్వ వికాస సుగంధాలు గుబాళిస్తుంటాయి.

4. పని చేసేటపుడు భావోద్వేగాలు లేకుండా స్థిరంగా ఉండడం

దీని వల్ల పనిలో perfection రావడమే కాకుండా, objectivity లభిస్తుంది. సచిన్ టెండూల్కర్ దీనికి చక్కని ఉదాహరణ. సెంచురీ సాధించినా, పది రన్లకే అవుట్ అయినా, అతని వదనంలో ఎటువంటి భావోద్వేగం ఉండదు. విజయాన్ని, అపజయాన్ని ఒకే రకంగా స్వీకరించగలగడం చాలా కష్టం. దాన్ని సాధించిన జ్ఞాని అతడు.

జ్ఞేయము అంటే తెలుసుకొన తగినది అని అర్థం. పైన తెలిపినవన్నీ జ్ఞేయములే. ఇంతకంతే లోతుగా దీనిని చర్చించనవసరం లేదు.

ఆధునిక సమాజం ఆలోచించదగ్గ విషయాలు:

యక్ష ప్రశ్నలలో, ధర్మరాజు ఎదురైన ఒక ప్రశ్న: “బుద్ధిమంతుడై, ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ, ఊపిరి తీస్తూ కూడా మృతుడితో సమానమైన వాడెవరు?”

దీనికి ధర్మరాజు జవాబు:

“దేవతాతిథిభృత్యానాం, పిత్రూణామాత్మనశ్చయః

న నిర్వపతి పంచానం ఉచ్ఛ్వసన్ సనజీవతి”

“ఎవడైతే దేవతలను, అతిథులను, తల్లిదండ్రులను సేవించడో, వాడు శ్వాసిస్తూ ఉన్నా, చచ్చినవాడితో సమానం”. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టే పిల్లలకు కనువిప్పు కలిగిస్తుంది ఈ కథ. మనం కొన్ని ఆటోల వెనుక చూస్తుంటాం ‘మా బాప్ కీ దువా’ అని. వారికున్నంత అక్కర తల్లిదండ్రులపై మనకి లేకపోతే, మనం ఎంత గొప్ప పదవిలో ఉన్నా, మనకు వ్యక్తిత్వం వికసించినట్లే!

చెప్పుడు మాటలు వినకపోవడం:

చెప్పుడు మాటలు వింటే, మన వ్యక్తిత్వం మసకబారుతుంది. అలా చెప్పేవారు మన అభిప్రాయాలను మార్చేస్తారు. విశేషమేమిటంటే, మన మేలు కోసమే, మన దృక్కోణంలోనే వాళ్ళు చెబుతున్నట్లుగా భ్రమ కల్పిస్తారు. కాని వారి అసలు ఉద్దేశం వేరుగా ఉంటుంది. దానిని గ్రహించి, మనం చెప్పుడు మాటలతో ప్రభావితం కాకూడదు.

రామాయణంలో మంధర పాత్ర అలాంటిది. ఎంతో మంచిది, శ్రీరాముని ఎంతో ప్రేమించే కైకేయిని ఆమె మార్చేయగలిగింది. Persuade చేసి ఒప్పించింది. ఈ persuade చేయడం అంటే తార్కికంగా వాదించి ఎదుటివారిని ఒప్పించడం. ఇది positive  గాను negative గాను జరగవచ్చు. కైకేయి విషయంలో దానిని మంధర నెగటివ్‍గా, విజయవంతంగా సాధించింది. దానివల్ల రామాయణమే ఒక మలుపు తిరిగింది.

మంధర శ్రీరామ పట్టాభిషేకం గురించి కైకేయికి చెప్పగానే, ఆమె చాలా సంతోషపడి, మంధరకు ఒక బహుమతి ఇచ్చింది. ఇలా అంటుంది:

“రామే వా భరతేవాహం విశేషం నోపలక్షయే

తస్మాత్ తుష్టాస్మియద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి”

“నాకు రాముడు, భరతుడు సమానమే. అందుకే ఈ పట్టాభిషేక వార్త నాకు మహా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది!”

అప్పుడు జాలిగా చూసింది మంధర ఆమె వైపు. చాలా జాగ్రత్తగా తన persuasion ను ప్రారంభించింది. కైక అమాయకురాలు అంది. దశరథుడు పక్షపాతి అంది. భరతునికి శాశ్వతంగా అన్యాయం జరగబోతోందని హెచ్చరించింది. కైక మనసును విషంతో నింపింది.

బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో, మంధర పాత్రను ఛాయాదేవి అద్భుతంగా పోషించింది. కైకేయిని ఒప్పించడంలో ఆమె హావభావాలు, సంభాషణలు పలికే తీరు, అనన్య సామాన్యం. సూర్యకాంతానికి ఏమీ తీసిపోని నటి ఆమె. కానీ ఆమెకు రావలసినంత ప్రాచుర్యం రాలేదు.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. “చెప్పేవాళ్ళకు బుద్ధిలేకపోతే, వినేవాళ్ళకైనా ఉండాలి కదా!” అనుకోవచ్చు మనం. ఆ చెప్పేవాళ్ళ persuasive skills అంత గొప్పవి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here