మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-5

1
9

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఎదుటివారి కోపాన్ని సహించడం:

[dropcap]ఇ[/dropcap]దేమీ అసమర్థత కాదు. ‘మౌనేన కలహం నాస్తి’ అన్నారు కదా! ఎదుటివాడు కోపంగా ఉన్నప్పుడు మనం కామ్‍గా ఉంటే అతనికి gap దొరికి శాంతపడతాడు. ఆర్. కె. నారాయణ్ కోపంగల వారిపై ఇలా చమత్కార బాణం విసిరారు – “I enjoy watching irritable men in action”.

ఎదుటివాడు చిరచిరలాడుతుంటే చూడడం ఈయనకు వినోదంగా ఉంటుందట! ఎంత గడుసువాడో చూడండి! పైకి ఆ మాటలు జోక్‍గా ఉన్నా, వ్యక్తిత్వ వికాసంలో ఒక పాఠాన్ని మనకి బోధిస్తాయి. ఎదుటివాడి కోపాన్ని లైట్‍గా తీసుకోవడం కూడా.

Balanced Mind లక్షణం:

తెనాలి రామకృష్ణుడు మహాకవి, పండితుడు. కానీ ఆయనపై ఎన్నో హాస్య వృత్తాంతాలు కల్పించబడ్డాయి.

ఒకసారి కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక మహా యోగి వచ్చాడు. యథావిధిగా సముచిత గౌరవం అందుకున్న తరువాత, “స్వామీ! మీరు ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగితే, ఆయన “హిమాలయాల్లో ‘ఘోర తపస్సు’ చేసి వచ్చాను” అన్నాడట. తెనాలి వారికెందుకో ఆయన వాలకం నచ్చలేదు.

“స్వామీ! ఘోర తపస్సు ద్వారా మీరేమి సాధించారో తెలుసుకోవచ్చా?”

“కోపాన్ని జయించాను నాయనా!”

“అయితే మహాత్మా! మీరు కోపాన్ని జయించానంటారు!”

“అవును చిరంజీవీ!” అదే దరహాసం.

“స్వామీ, మరి, పూర్తిగా జయించినట్లేనా, తమరు?”

“సందేహమేముంది నాయనా”

“అయితే మహానుభావా, మీకస్సలు కోపం రాదా?

“అబ్బే! రాదు” స్వామీజీ ముఖంలో కొంత మార్పు.

“స్వామీ, ఒక మనవి. మీకు కోపం అస్సలు రాదా, అయితే?”

“రాదని చెప్పాను గదా!”

“స్వామీ, మీకు కోపం పూర్తిగా పోయినట్లేనా?”

“ఎన్నిసార్లు చెప్పాలిరా త్రాష్టుడా? అడిగిందే అడిగి సతాయిస్తున్నావు! నోరుముయ్!” స్వామీజీ ఛర్రున లేచాడు తెనాలి వారిపై!

అదీ సంగతి! నాలుగైదు సార్లు అడిగితేనే కోపం వచ్చేసింది!

సో, కోపాన్ని జయించటం అంత సులభం కాదండోయ్!

సుఖం, దుఃఖం; శోకం, సంతోషం:

శోకం తాత్కాలికం కావాలి. అంతే గాని, నిరంతరం శోకంతో కుమిలిపోతూ ఉంటే, అది మన శక్తిని క్షీణింప చేస్తుంది. సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మెదడు పని తీరును paralyse చేస్తుంది. శ్రీరామచంద్రునితో సుగ్రీవుడు ఇలా అంటాడు:

“..వినష్టేవా ప్రణష్టేవా శోకః సర్వార్థ నాశనః”

రాముడంతటి వాడే దీన్నుంచి తప్పించుకోలేకపోయాడు. సీత జాడ తెలియని సందర్భంలో కిం కర్తవ్యతా విమూఢడు అయినాడు. కాని భగవంతుడే దుఃఖానికి ‘మరపు’ అనే ఔషధాన్ని మానవాళికి ప్రసాదించినాడు. అందుకే ‘Grief is brief’ అని అంటారు. ఎంత దుఃఖానైనా మాన్పగల శక్తి కాలాఇకి ఉంది. ‘Time is a great healer’.

కాని కొందరు మాత్రం దుఃఖాన్ని తట్టుకోలేరు. ఆత్మహత్యల వరకు వెళతారు కొందరు. అదంతా వ్యక్తిత్వ వికాసంలోని లోపాలే. సుఖమైనా దుఃఖమైనా మనలను ఎక్కువ కాలం ప్రభావితులను చేయకూడదు. ఎందుకంటే ఆ రెండూ స్థిరంగా ఉండవు. బండి చక్రంలో దానికి ఆలంబనగా పట్టెలు బిగిస్తారు. చక్రం తిరుగుతుంటే బండి ముందుకు సాగుతుంది. ఒక పట్టె క్రిందకి వస్తుంది. మరొక పట్టె పైకి పోతుంది. ఇది recur అవుతూనే ఉంటుంది.

వ్యాస మహర్షి ఇలా చెప్పారు:

“సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం

పర్యాయేణ ఉపసర్పంతే నరం నేమిమరా ఇవ”

సంతోషం కూడా తాత్కాలికమే. ఒక విజయాన్నో, శుభాన్నో చవిచూసిన తర్వాత వెంటనే కలిగే excitement, క్రమంగా తన తీవ్రతను కోల్పోతుంది. అది సహయం. కాబట్టి దుఃఖాన్నైనా, సుఖాన్నైనా అనుద్విగనతో, విగతస్పృహతో’ (గీత) స్వీకరించడం, వేదాంతం క్రింది కంటే, వ్యక్తిత్వ వికాసం క్రిందికే ఎక్కువ వస్తుంది. అలాంటి వారు స్థితప్రజ్ఞులుగా తమ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకోగలుగుతారు.

ఇతరుల స్థానంలో మనల్ని ఊహించుకోవడం – మన స్థానంలో ఇతరులను ఊహించుకోవడం:

మనం ఎప్పుడూ మన కోణం నుంచే ఆలోచిస్తాం. మనదే కరెక్ట్ అని సహజంగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఇతరుల స్థానంలో ఉండి, వారి point of view లో ఆలోచిస్తే, మన దృక్పథంలోని లొసుగులు మనకు తెలుస్తాయి. ఒకే situation ని ఇద్దరు వ్యక్తులు విభిన్నంగా విశ్లేషిస్తారు. ఒక బస్ స్టాప్‍లో కొందరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫలానా చోటకి వెళ్ళే బస్సు ఎప్పుడొస్తుందని ఒకాయన అడిగితే, ఒకాయన చెప్పాడు:

“ప్రతి పావుగంటకు ఒక బస్ ఉంటుందండి. సమస్య లేదు”

అడిగినతను అప్పుడు ఇలా అన్నాడు:

“బాబోయ్! అయితే పావుగంట వరకు ఇక బస్ లేదన్న మాట!”

చూశారా? అదే పావుగంట! ఆయనకు తక్కువ, ఈయనకు ఎక్కువగా భాసించింది.

‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న మాటలకు స్థూలంగా అర్థం ఇదే. ఎవరినైనా మనం అపార్థం చేసుకున్నామో తెలియాలంటే, అతని స్థానంలో ఉంటే మనం ఏమి చేసేవాళ్ళమో ఒక్క క్షణం ఆలోచించాలి.

“నా పరిస్థితిలో నీవుంటే తెలుస్తుంది” అనేది తరచుగా వినబడే మాట.

మహాభారతం లోని శాంతిపర్వంలో, భీష్మ పితామహుడు అంపశయ్యపై నుండి ధర్మరాజుకు అనేక ధర్మాలు బోధిస్తాడు. పైన మనం చెప్పుకున్న దాన్ని ఆయన ఇలా చెప్పాడు:

“యదన్యైర్విహితం నేచ్ఛేదాత్మనః కర్మ పూరుషః

న తత్ పరేషు కుర్యాచ్చ జానన్న ప్రియమాత్మనః”.

దీనిని వల్లీశ్వర్ గారు అద్భుతంగా అనువదించారు ఒక కథలో – “ఇతరులు నీ పట్ల ఎలా ఉంటే నీకు నచ్చదో, నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకు.” అని.

వ్యక్తిత్వ వికాసంలో అత్యంత కీలకైన అంశం ఇది.

మనం అతని స్థానంలో ఉంటే.. అనే భావం ఆత్మపరిశీలనకు, objectivityకి దారితీస్తుంది. ఎదుటివాడిపై మనకు కలిగే అయిష్టాన్ని, ద్వేషాన్ని, సానుభూతిగా, ప్రేమగా మార్చగల శక్తి దానికుంది.

అశ్వత్థామ, నిద్రలో ఉన్న ఉపపాండవులను (పాండవుల కుమారులను) అత్యంత కిరాతకంగా హతమారుస్తాడు. అలవి కాని శోకంతో కుములుతున్న తల్లి ద్రౌపది దగ్గరకు అతన్ని బంధించి తెస్తాడు అర్జునుడు. అతన్ని ఆమె కళ్ళ ఎదుటే వధిస్తానంటాడు (అశ్వత్థామ చిరంజీవి అంటారు కదా, ఎలా చంపగలడు? అని కోడిగుడ్డుకు ఈకలు పీకకండి! అది వేరే విషయం). అంత దుఃఖంలోనూ ద్రౌపదీదేవి, మనం పైన చర్చించిన గుణాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఆమె అశ్వత్థామను క్షమించినట్లుండదు. ‘అశ్వత్థామను చంపితే, పాపం, అతని తల్లి, అర్జునుడు తన కొడుకును ఏం చేస్తాడో అనే భయంతో అల్లాడుతూ ఉంటుంది కదా! నాకు కలిగిన దుఃఖం ఆమెకెందుకు కలిగించాలి?’ అని భావిస్తుంది ద్రౌపది. అశ్వత్థామతో ఇలా అంటుంది:

“అక్కట! పుత్రశోక జని తాకుల భార విషణ్ణ చిత్తనై

పొక్కుచునున్న భంగి నిను బోర కిరీటి నిబద్ధు జేసి, నే

డిక్కడి కీడ్చి తెచ్చుట సహించనిదై భవదీయ మాత, నే

డెక్కడ యెట్టి శోకమున యే క్రియ నేడ్చుచు బొక్కుచున్నదో!”

తాను అశ్వత్థామ తల్లి స్థానంలో ఉండి ఆలోచించింది ద్రౌపది. అదేదో మనలాంటి వాళ్ళకి ఎదురయ్యే మామూలు పరిస్థితి కాదు. ఐదుగురు కొడుకులను ఒకేసారి పోగొట్టుకున్న గర్భశోకంలో ఉండి, ఇంకో తల్లికి అలాంటి గతి పట్టకూడదని ఆలోచించిందంటే, ఆమె వ్యక్తిత్వం అనన్య సామాన్యం. ఇతరులను తన స్థానంలో.. అన్న గొప్ప వ్యక్తిత్వ వికాస గుణం ఈ వృత్తాంతం మనకు నేర్పుతుంది.

ధర్మం ధర్మం కోసమే – ధర్మం/చట్టం:

ధర్మాన్ని ధర్మం కోసమే ఆచరించాలి. ‘Piety has to be adhered to for its own sake’. అలాగే దానం కూడా. ‘దానధర్మాలు’ అనే పదంలోని రెండు గుణాలు అత్యంత ప్రశస్తమైనవి. దానాన్ని గురించి మొదట చర్చిద్దాం. మనకున్న దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడం ఒక పద్ధతి. మన ఆర్థిక పరిస్థితికి భంగం వాటిల్లకుండా చేసేదది. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, మొత్తం charity కోసం అర్పించేది రెండో పద్ధతి. ఇది చాలా కష్టం. కోటికొక్కరు మాత్రమే అలా చేయగలరు. మన పురాణాల్లో రంతిదేవుడు, శిబి చక్రవర్తి ఈ కోవ లోకి వస్తారు. ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి వారు సకృత్తుగా కనబడతారు.

దానం/ప్రచారం:

గుప్తదానమే శ్రేష్ఠమైనది. ‘కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా చేయాలి’ అని నానుడి. గుళ్ళల్లో ఫ్యాను ఒకటి వేయించి, దాని రెక్కల మీద ఇలా రాయించుకుంటారు:

“కీ.శే. చెరువోలు సుందరయ్య గారి కుమారుడు చెరువోలు రామసుబ్బయ్య, వారి ధర్మపత్ని నాగరత్నమ్మ గార్ల ధర్మం”

దేవస్థానాల్లో ఒక గది కట్టించి ఇస్తారు. దాని ముందు శిలా ఫలకం. దాని మీద దాన్ని వితరణ చేసిన వారి పేరు, భార్య పేరు, వివరాలుంటాయి. అంటే వీళ్ళు చేసే దానాలూ, వితరణలూ అందరికీ తెలియాలన్న మాట! అలా కాకుండా anonymous గా (అంటే దాత పేరు తెలియకుండా) చేయగలిగినవారే గొప్పవారు.

నంద్యాలలో యస్.పి.వై. రెడ్డి గారని ఒకాయన ఉండేవారు. పెద్ద పారిశ్రామికవేత్త. ఇంజనీరింగ్ కాలేజీ యజమాని, పెద్ద భూస్వామి. ఆయన ఉత్పత్తి చేసే ‘నంది పైపులు’ చాలా పాపులర్. నాణ్యమైనవి కూడా. ఆయన మహాదాత. అడిగినవారికి ఎంతో కొంత సాయం చేసేవారు. ఎవరయినా కవులు, రచయితలు ఆయన దగ్గరకి వెళ్ళి, “నేను పుస్తకం రాశాను. దీన్ని ముద్రించుకోవదానికి తమ సాయం కోసం వచ్చాను” అని చెబితే, “శానా మంచిదప్పా, అట్నేగానీ. ఇదిగో, సుబ్బారాయుడూ, ఈనకు ఐదువేలిచ్చి పంపియ్యి” అనేవారు. వారు డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు “సామీ, బుక్కులో నా పేరు గీరు ఏయించవాకు. నీవు చేసిన పని ముందు, నేనిచ్చిన దుడ్డు యాపాటిదిలే!” అనేవారు.

ఆయన పేదవారి కోసం, కేవలం ఒక్క రూపాయికే జొన్నరొఎట్టి, పప్పు – రాయలసీమ అంతటా చిన్న చిన్న outlet లలో సరఫరా చేసేవారు. ఎక్కడా ఆయన పేరు కనబడేది కాదు. అలాంటివారి వ్యక్తిత్వం, ఆ స్థాయిలో కాకపోయినా, మనకి స్ఫూర్తి కావాలి. పబ్లిసిటీని ఆశించకుండా మన చేతనయినంత మనం ఇతరకులకు సాయం చేయడం ఉత్తమ వ్యక్తిత్వంలో ఒక భాగం.

పురాణాల్లో, ఇతిహాసాల్లో కేవలం కర్ణుడిని మాత్రమే ‘దానకర్ణుడ’ని పేర్కొంటారు. దాన ధర్మజుడు, దాన దుర్యోధనుడు అనరే! ఆఖరికి సమాజంలో నిస్వార్థంగా దానాలు చేసేవారిని ‘అపర దానకర్ణుడ’ని కీర్తించడం కద్దు.

ఒకసారి వర్షాకాలంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం కోసం ఎండు కట్టెలు కావాలని సుయోధన సార్వభౌముడి దగ్గరకు వెళ్ళాడట. “వానల్లో ఎక్కడ నుంచి వస్తాయి స్వామీ, వర్షాలు తగ్గిపోయిం తర్వాత రండి, చూద్దాఅము” అన్నాడట ఆయన.

సరే అని, కర్ణుని దగ్గరకు వెళ్ళాడట. ఆయన క్షణం కూడా ఆలోచించకుండా, తన పాత గుర్రపుశాలను పడగొట్టించి, దానిపై కప్పులోని చెక్క దూలాలను, దంతెలను, కప్పుకు ఊతగా ఉన్న చెక్క స్తంభాలను, రీపర్లుగా కోయించి, బళ్ళకెత్తింతి, అవి తడవకుండా జాగ్రత్తలు తీసుకుని, పంపించాడుట. అందుకే ఆయనను మాత్రమే దానకర్ణుడనేది!

సత్వర దానం:

దానం చేయాలనుకుంటే వెంటనే చేయాలి. ఆలస్యం చేయకూడదు. అలా చేస్తే అది లబ్ధిదారునికి సకాలంలో అందక, దాని ప్రయోజనానికే భంగం వాటిల్ల వచ్చు (The very purpose of charity may be defeated).

ఒకసారి ధర్మరాజు దగ్గరకి ఒక యాచకుడు వచ్చి ధనసహాయాన్ని అర్థిస్తే, ఆయన కొంచెం ‘బిజీ’గా ఉండి, “రేపు రా” అన్నాడట. పక్కన ఉన్న భీమసేనుడు ఇలా అన్నాడట – “అన్నయ్యా, అయితే, రేపటి వరకు నీవు బ్రతికే ఉంటావని, నీకు ఖచ్చితంగా తెలుసన్న మాట!”.

ఈ మాటలలోని hard reality ని ధర్మజుడు గ్రహించి, ఆ యాచకునికి సముచిత సహాయం వెంటనే అందించి పంపాడట. ‘భీమునికి దేహ బలమే తప్ప బుద్ధి బలం తక్కువ’ అని అనుకుంటాం! ఎంత వివేకవంతుడో చూడండి. చేయగల్గిన సాయాన్ని సత్వరమే చేయడం ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం! అదీ గుప్తంగా! రేపటి సంగతి అనిశ్చితమే కదా!

అపాత్రదానం:

నిజంగా అవసరం ఉన్నవారికే సాయం చేయాలి. అలా కాకుండా indiscriminate గా అందరికీ సాయం చేయకూడదు. దాన్ని అపాత్రదానం అంటారు. అది దుర్వినియోగం కావడానికి అవకాశం చాలా ఎక్కువ.

సోషల్ మీడియాలు చూసి, జాలి పడి, మనం చేసే ఆర్థిక సాయం ఎంత వరకు ‘the really needy’ ని చేరుతుందో, దాన్ని నిర్వహించే వారి credentials ఏమిటో తెలియకుండా, గుడ్దిగా వారు చెప్పిన ఎకౌంట్‍కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. తిరుపతికి, శబరిమలకి వెళుతున్నామని, భక్తుల వేషంలో వచ్చి డబ్బు అడుగుతుంటారు. వారు నిజంగా వెళతారో, సాయంత్రానికి మేకప్ తీసేసి, తాగి తొంగుంటారో పెరుమాళ్ళకే ఎరుక! ఇలా అనుమానిస్తూ పోతే, మరి సాయం ఎవరికి చేయాలి? మనకు ప్రత్యక్షంగా తెలిసిన, చూసిన, దయనీయులకే మన సాయం అందాలి. లేకపోతే అది నిరర్ధకమవుతుంది. మన వ్యక్తిత్వానికి ఒక మరక అవుతుంది. ఆలోచించండి! అపాత్రదానాలను పరిహరించండి.

ధర్మం/చట్టం:

‘ధర్మవాణిజ్యకోహీనః జఘన్యో ధర్మవాదినాం’

ఏదైనా ప్రయోజనం ఆశించి ధర్మకార్యాలు చేస్తే, అది వ్యాపారంతో సమానం అని ధర్మరాజు ద్రౌపదితో అరణ్యపర్వంలో చెబుతాడు.

చట్ట ప్రకారం కరెక్ట్ అయినది ధర్మ ప్రకారం తప్పు కావచ్చు. ధర్మ బద్ధంగా ఒప్పు అయినది చట్ట విరుద్ధం కావచ్చు.

సత్యహరిశ్చంద్ర నాటకంలో, చంద్రమతీదేవిని అమ్ముకునే సందర్భంలో కాలకౌశికుడు వస్తాడు. “నీవు విశ్వామిత్రుడికి బాకీ ఉన్నట్లు పత్రములు గానీ, సాక్ష్యములు గానీ ఉన్నాయా?” అని హరిశ్చంద్ర మహారాజుని అడుగుతాడు.

“నా నోటి మాటయే పత్రము; నా అంతరాత్మయే సాక్ష్యము” అంటాడా సత్యవ్రతుడు.

“ఓరి అమాయకుడా! నోటి మాటతో ఇచ్చిన అప్పు కోసం భార్యని అమ్ముకుంటున్నావా? పద, నీవు, అసలు అప్పే చేయలేదని ఆ విశ్వామిత్రుడి వద్ద వాదిస్తాను” అంటాడు కాలకౌశికుడు. మాట మీద నిలబడి అప్పు తీర్చడం ధర్మం. పత్రాలు, ఋజువులు లేవు కాబట్టి ఇవ్వనక్కరలేకపోవటం చట్టం!

నలభై యాభై ఏళ్ళ క్రిందట భూముల క్రయ విక్రయాలు కేవలం నోటి మాట మీదే జరిగేవి. రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు కాదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలకు వెరచి కాదు. పరస్పర విశ్వాసం. అంతే. ఎకరం వందల్లో, వేలల్లో అమ్మిన/కొన్న ఆ పొలాలు రియల్ ఎస్టేట్ ప్రభావంతో కోట్ల రూపాయలు పలుకుతున్నాయి ఇప్పుడు. ఎవరూ, అప్పుడు మా నాన్న/తాత అంత చౌకగా ఇచ్చేశాడు; మీరు కొన్నట్టు పత్రమే లేదు, కాబట్టి మాకు చెందుతుందని, కోర్టుకు పోవడం గానీ, పంచాయితీలు చేయడం గానీ చేయడం లేదే! మనిషిని నిలిపేది ధర్మమే గాని చట్టం కాదు. కాబట్టి మన వ్యవహారాలలో ధర్మపు కోణాన్ని మనం పరిగణించాలి. ఏ ప్రయోజనాన్ని ఆశించకూడదు. అప్పుడే మన వ్యక్తిత్వం సంపూర్ణం అవుతుంది. చట్టంలో ఎన్నో లొసుగులు ఉండవచ్చు, కానీ ధర్మం నిష్కళంకమైనది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here