మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-6

0
8

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

అయిష్టత/వైరం/ద్వేషం/క్షమాగుణం:

ఈ మూడు గుణాలూ ఆరోహణ క్రమంలో ఉంటాయి. మొదటిది అంత ప్రమాదమైనది కాదు. మనకు ఒక విషయం గాని, ఒక వ్యక్తి గాని, ఒక పరిస్థితి గానే నచ్చదు. అదే అయిష్టత. మనకు ఫేస్‌బుక్‌లో ‘like’ అనే option ఉంటుంది కానీ ‘dislike’ అని ఉండదు. అక్కడే FB వారి తెలివితేటలున్నాయి. నచ్చకపోతే ‘కామెంట్’ లో రాయొచ్చుకదా! అంటారేమో. అది వేరే విషయం. Dislike కి కూడా ‘thumbs down’ symbol ఉంటే, మన అయిష్టతని వ్యక్తం చేయడం సులభం కదా! కానీ అలా option ఉంటే, like లతో సమానంగా dislike లు కూడా వస్తాయని నా నమ్మకం. నాకు యిష్టం లేదు, నాకు నచ్చలేదు అనే attitude ను మనం మన ముఖ కవళికల ద్వారా కూడా ప్రదర్శించవచ్చు. నచ్చడం నచ్చకపోవడం – అనేది అభిప్రాయాలలో, వైరుధ్యాన్ని బట్టి ఉంటుంది కాని దాని వల్ల అంత ప్రమాదం లేదు. కాపురాలు, స్నేహాలు కూలిపోయేంత వరకు వెళ్ళదు

వైరం అంటే శత్రుత్వం. ఇది ఆరోహణ క్రమంలో రెండవది. తీవ్రమయినది. దీనిలో రకాలు ఉంటాయి. సైద్ధాంతికపరమైన వైరం ఒకటి. రాజకీయంగా కావచ్చు, సాంస్కృతికపరంగా కావచ్చు, ఈ వైరం కొన్ని భావజాలాలకు`మాత్రమే లోబడి ఉంటుంది. వ్యక్తుల స్థాయికి వెళ్లదు. వెళితే అది మరింత ప్రమాదం అవుతుంది. రెండవది వ్యక్తిగత వైరం. కేవలం అవతలి వ్యక్తితో శత్రుత్వం. దానికి పగ (Vengeance), స్పర్ధ (envy) కారకాలు కావచ్చు .

రామాయణంలో రావణవధ తర్వాత రాముడు విభీషణునితో “మీ అన్నకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు, అపరకర్మలు నిర్వర్తించు” అని చెబుతాడు.

“మరణాంతాని వైరాణి”

ఎంతటి వైరమైనా మరణంతో అంతమవుతుంది. అవ్వాలి!

చనిపోయిన వాడిపై కూడా వైరాన్ని కొనసాగిస్తూ, అతని వారసులపై కూడ దానిని ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది. అది వ్యక్తిత్వ వికాసంలోని ఒక ముఖ్య లోపం.

విరోధులలో కూడా ‘మంచి’ని గుర్తించడం:

ఇది వ్యక్తిత్వ వికాసానికి పరాకాష్ఠ. రామ రావణులు యుద్ధభూమిలో తొలిసారి భేటీ అయినపుడు, ఒకరి తేజస్సును చూసి ఒకరు అబ్బురపడతారు. ప్రశంసిస్తారు. అదీ right spirit అంటే. వాజ్‍పేయి గారు ప్రతిపక్షంలో ఉండి కూడా, ఇందిరాగాంధీని బాంగ్లాదేశ్ యుద్ధ విజయంలో, ‘అపరకాళి’ అని పొగిడారు. అదీ సంస్కారం. ప్రస్తుత రాజకీయాలలో ఈ రకమైన సంస్కారం లోపించి, సైద్ధాంతిక వైరాన్ని వ్యక్తిగతంగా మార్చుకుని పరస్పర దూషణలు చేసుకుంటున్నారు అని ముందు చెప్పుకొన్నాం మనం.

సామూహిక వైరం/ద్వేషం:

ఇది మరీ ప్రమాదం. ఒక మతానికి లేదా కులానికి చెందిన వారినందరినీ శత్రువులుగా భావించడం లేదా ద్వేషించడం. ఒక దేశాన్ని ఏకమొత్తంగా ద్వేషించడం.

వైరం ద్వేషంగా మారకూడదు

Enmity వేరు hatred పేరు, ద్వేషం మనిషిని వివేకహీనుని చేస్తుంది. అయిష్టత వరకు ఫరవాలేదు, వైరం కూడ అర్థం చేసుకోదగ్గదే. కాని ద్వేషం అత్యంత ప్రమాదకరమైనది. ఉదాహరణకు ఇండియా, పాకిస్తాన్ మధ్య వైరం. అది ద్వేషంగా మారిపోయింది. ప్రభుత్వాలు, రాజకీయాలు, సరిహద్దు వివాదాలు సామాన్య ప్రజలకు ఏం సంబంధం? ఆఖరికి క్రికెట్ మ్యాచ్‌లు కూడా అగ్నికి ఆజ్యం పోసే పరిస్థితి వచ్చింది. Sporting Spirit నశించి, రెండు దేశాల విద్వేష ప్రదర్శనగా మారింది. ఇతర విషయాల్లో మనకు దేశభక్తి లేకున్నా, Indo- Pak cricket match లో మాత్రం ఇండియా గెలవాలని, పాకిస్తాన్ ఓడిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు క్రికెట్ అభిమానులు. అదే మన దేశం ఒక ఉపగ్రహన్ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినపుడో, ఒక యుద్ధ విమాన వాహక నౌకను తయారు చేసినప్పుడో, ‘ఇంత’ దేశభక్తి ఆవిష్కృతం కాదు. దేశాల మధ్యే కాదు, ఒకే దేశంలోని రెండు ప్రాంతాల మధ్య కూడ ఈ ద్వేషం రగులుతుంది. నార్త్ – సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియన్లు దక్షిణ భారతదేశాన్ని, చిన్న చూపు చూస్తున్నారనీ, అన్యాయం చేస్తున్నారనీ, ద్వేషం పెంచుకుంటారు. ప్రజలలో లేకపోయినా పొలిటీషియన్లు ఈ ప్రాంతీయ విద్వేషాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారు.

ఇక ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య సమతౌల్యం లోపించి, అది ద్వేషంగా మారి, అది ఆ రాష్ట్రం ముక్కలయ్యేంత వరకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం అలా ఏర్పడిందే. పోనీ ఆంధ్రప్రదేశ్ అన్నా ప్రశాంతంగా ఉందా అంటే, మళ్లీ రాయలసీమ, కోస్తా ఫీలింగ్స్, రాజధాని వివాదం రాజుకుంటున్నాయి.

ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు బాడీగార్డులు హత్య చేసినపుడు జరిగిన హత్యా, విధ్వంసకాండ – సామూహిక ద్వేషానికి చక్కని ఉదాహరణ. చంపింది ఇద్దరయితే, ప్రతీకారం కొన్ని వేల మంది సిక్కులపై తీర్చుకున్నారు. వారిని విచక్షణారహితంగా ఊచకోత కోశారు. మళ్లీ ఇక్కడ మనం గమనించాలి. అది ‘ప్రజాగ్రహం’ కాదు. రాజకీయ ఆగ్రహం! సిక్కులను నరికేవారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, కేవలం ప్రేక్షకపాత్ర పోషించమని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వంలోని పెద్దల నుండి ఆదేశాలు వెళ్లాయి.

ద్వేషాన్ని నియంత్రించాలి

ప్రేమను పెంపొందించాలి

పైన చేసిన చర్చ అంతా, వ్యక్తిత్వ వికాసంలో పరిహరించ వలసిన అంశాల గురించే. అయిష్టత, వైరం, ద్వేషం, వ్యక్తులనే కాదు సమాజాన్నే నాశనం చేస్తాయి. వ్యక్తుల సమూహమే కద సమాజం! వ్యక్తిగతంగా మొదట ద్వేషాన్ని నియంత్రించుకోవాలి. ప్రేమను అలవరచుకోవాలి. అది చిన్న విషయం కాదు. కాని దాన్ని సాధించగలిగితే అపురూప వ్యక్తిత్వం మన సొంతం. ప్రేమ వ్యక్తిగతం నుండి విశ్వగతం కావాలి. సర్వత్ర సమదర్శనం కావాలి. గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా దాన్నే చెబుతుంది. ప్రపంచాన్ని ఏలేది ప్రేమ ఒక్కటే.

Francis Bacon, తన ‘of love’ అనే వ్యాసంలో చివర ఇలా అంటారు.

“There is in man’s nature a secret inclination and motion towards love of others, which, if it be not spent upon someone or a few, doth naturally spread itself towards many, and maketh men become humane and charitable”

“ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులను ప్రేమించడం నుంచి, అందరికీ దానిని వ్యాపింప చేయడం ద్వారా, మనిషి తన మానవత్వాన్ని ధర్మ బద్ధతను చాటుకుంటాడు.”

వ్యక్తిత్వ వికాసం – ఆధ్యాత్మికత:

ఈ టాపిక్ ఏదో వయసు మళ్లిన వారికోసం కాదు. అందరికీ అవసరమే. ఆధ్యాత్మికత, దైవచింతన, అన్నివయస్సులోనూ ఉండాలి. రిటైరైన తర్వాత పూజలు ఎక్కువగా చేస్తారు కొందరు. ఆధ్యాత్మికత అంటే మెట్ట వేదాంతం కాదు. ప్రహ్లాదునికి, ధ్రువునికి, రియలైజేషన్ అతి చిన్న వయసులోనే వచ్చింది. అన్నమాచార్యులవారు ఒక అద్భుత కీర్తన వ్రాశారు

“ఎన్నడు విజ్ఞాన మిక నాకు

విన్నపమిదె, శ్రీవేంకటనాథ!

బాసిన బాయవు బంధములు

ఆశ దేహమున్నన్నాళ్లు

కోసిన తొలగవు కోరికలు

గాసిలి చిత్తము కలిగినన్నాళ్లు”

ఇక్కడ విజ్ఞానమంటే ఆధ్యాత్మక జ్ఞానం, దైవాన్ని గూర్చిన అవగాహన. దీన్నే, జాన్ మిల్టన్ ‘On my attaining 28th year of age’ అనే పద్యంలో చెప్పారు – “నాకు ఇరవై ఎనిమిదేళ్లు వచ్చేశాయి. ఓ ప్రభూ! ఇక నిన్నెప్పుడు తెలుసుకుంటాను?” అని వాపోతాడాయన.

‘Great men think alike’.

ఆధ్యాత్మికతపై అవగాహన వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది. ‘స్వస్వూరూపజ్ఞానం’ (self-realization) కలుగుతుంది. మన మతంపై అవగాహన ఏర్పడుతుంది. ఇతర మతాలతో ‘తులనాత్మక పరిశీలన’ (Comparative analysis) చేసి శక్తి వస్తుంది. మతం, జీవితం, సమాజం విడదీయరానివి కదా! కాబట్టి ఆధ్యాత్మికతను కేవలం నిజజీవితానికి అతీతం, దానితో మనకు పనిలేదు అని అనుకోకుండా, మరీ లోతుగా కాకపోయినా, దాని గురించిన basic principles తెలుసుకుంటే అది తప్పనిసరిగా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది.

మనం ఎవరు? నేను అంటే ఏమిటి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. Who am I? కోహమ్? ఈ శరీరమే మనమా? కాదు! మరి! ‘కేనోపనిషత్తు’ దీనిని చర్చించింది. తనను గురించి తాను తెలుసుకోవడం వల్ల, తనకు దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుస్తుంది. దానికి కారణం తెలుసుకోవడానికి వీలవుతుంది. దుఃఖానికి హేతువు తెలిస్తే, అది నివారణకు మార్గం చూపిస్తుంది, automatic గా! దుఃఖం నివారణ అయితే, సుఖమే కదా! అదే happiness.

Misery (దుఃఖం) నుండి happiness (సంతోషం) వైపు ఎలా పయనించాలో చూపుతుంది ఆధ్యాత్మికత. ఇది వైరాగ్యానికి సంబంధించిన అంశం కాదు. Real life కి సంబంధించిన అంశం. Education లో, career లో, marital life లో, sexual life లో, post retirement life లో, ఇలా జీవితం లోని అన్ని పార్శ్వాల్లో misery మరియు happiness ఉంటాయి. ఇది real life situation.

‘నదీనాం సాగరా గతిః’

అన్ని నదులకూ గమ్యం సముద్రమే.

‘ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి’. సత్యం ఒక్కటే, దానిని పండితులు రకరకాలుగా వివరిస్తారు!

దీన్ని బట్టి తేలిందేమిటి? అన్ని రకాల బోధనలనూ వినాలి.

వాటిలో ఏకసూత్రంగా ఉన్న సత్యాన్ని గ్రహించాలి.

కొన్ని ఉదాహరణలు:

‘ఆత్మవత్ సర్వభూతాని’ – హిందూమతం.

‘Love thy neighbour as Thyself’ – క్రైస్తవం.

‘శివాస్తే పంధానః’ అంటే wish you happy Journey అని అర్థం.

‘యెహోవా నీ మార్గమునందు నిన్ను కాపాడుగాక!’ – బైబిల్.

‘లోకాస్సమస్తాః సుఖినోభవన్తు’ అంటే విశ్వకల్యాణం.

“దుఃఖం మానవ జీవితంలో అనివార్యం. దానికి కారణం తెలుసుకుంటే నివారణ సాధ్యం” అన్నాడు గౌతమబుద్ధుడు. దీన్ని యోగవాశిష్ఠం “ఏతావానేవ సంసార ఇదమస్త్వితి యన్మనః” అని చెప్పింది.

అన్ని మతాలు మంచివే. కానీ వాటిలో కొన్ని negative elements ఉంటాయి. మన మతాన్ని అనుసరిస్తూనే, దానిలోని మూఢ విశ్యాసాలను (dogmas) పరిహరించాలి. అట్లా, ఇతర మతాలలోని మంచిని గ్రహించాలి. చెడును స్వీకరించకూడదు. అంతేగాని మతం మార్పిడి వల్ల ప్రయోజనం ఉండదు. Real Secularism కు Pseudo Secularism (కుహానాకు) తేడాను జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా వ్యక్తిత్వ వికాసంలో భాగమే. ఎందుకంటే మనిషి నుండి మతాన్ని వేరు చేయలేము.

హిందూమతం నిజానికి ఒక మతం కాదు. ఒక విశ్వాసాధారితమైనది కాదు. అది ఒక ధర్మం. ఒక ఆదర్శ జీవన విధానం. దానిలో కూడా కులవివక్ష, అస్పృశ్యత వంటి లోపాలున్నాయి. సెక్యులరిజాన్ని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన భావోద్వేగాలు మనల్ను, వ్యక్తిగతంగా ప్రభావితం చేయకూడదు. భారతదేశంలో ప్రజలు స్వచ్ఛందం గానే సెక్యులరిజాన్ని, అనుసరిస్తారు. రాజ్యంగంలో ఉందని, తప్పనిసరిగా పాటించరు.

మన భారత సనాతనధర్మం లోనే అది అంతర్లీనంగా ఉంది. హిందువులు మొహర్రం, రంజాన్ లాంటి పండుగల్లో పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతారు. ముస్లింలు వినాయకుని మండపాలు పెడతారు. గ్రామాల్లో అన్ని మతాలవారూ, మామా, బావా, అత్తా, అక్కా, చిన్నాన్నా అంటూ అప్యాయంగా, వరుసలు పెట్టి పిలుచుకుంటారు.

హిందూధర్మంలో, తమ తమ మానసిక, ఆధ్యాత్మిక సాయిని బట్టి, అందరికీ భగవంతుని చేరే మార్గం ఉంది. గ్రామదేవతకు ‘జంతుబలి’ ఇస్తాడొకడు. ఇంకొకడు రుద్రాభిషేకం, మరొకడు సత్యనారాయణ వ్రతం, మరొకరు అయ్యప్పమాల వేస్తారు. తిరుపతి, షిరిడీ, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. దారిలో ఏవైనా మహిమ గల దర్గాలు, చర్చిలు ఉంటే, వాటిని కూడా దర్శిస్తారు.

కొందరు దేవుడే లేడు పొమ్మంటారు. వారు కూడా మన ధర్మంలో భాగమే. మానవతే మతం అని వారి నమ్మకం. వారిని కూడా మన ధర్మం అక్కున చేర్చుకుంటుంది.

కాబట్టి, సహనం (tolerance) అనేది కెరీర్‌లో, సామాజిక జీవనం లోనే కాదు, మతంలో కూడా పాటించడం వల్ల మన వ్యక్తిత్వం objective గా మారి; మన దృక్పధాన్ని విశాలం చేస్తుంది.

Great men think alike:

గొప్పవాళ్లందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు. సాహిత్యంలో గమనిస్తే మనకు literary parallels చాలా కనిపిస్తాయి. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా గారు రాసిన ‘సత్యహరిచ్చంద్ర – కాటి సీను’ పద్యాలకు, Thomas Gray అనే ఆంగ్ల కవి రాసిన ‘An elegy written on a country churchyard’ అనే పద్యానికి చాలా పోలికలున్నాయి.

“ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము

మట్టిలో కలిసిపోయె.

ఇచ్చోటనే భూమి నేలు రాజేంద్రుని

అధికార ముద్రికయు నశించె”

అంటారు బాలిజేపల్లి, స్మశానాన్ని వర్ణిస్తూ!

‘Many Cromwels and Miltons

lie here forever,

not to wake up again’

అంటారు థామస్ గ్రే.

“కారే రాజులు రాజ్యముల్ కలుగవే, వారెల్లరన్ మూటంగట్టుకు పోవం జాలిరే ఇద్దరన్” అంటాడు ధూర్జటి తన ‘కాళహస్తీశ్వరశతకం’లో.

ఇవన్నీ క్షణికమైన జీవితాన్ని, వైరాగ్యాన్ని బోధించే భావాలే.

మన వైరాగ్యాన్ని స్వీకరించాల్సిన పని లేదు. మన limited ability (పరిమిత సామర్థ్యాన్ని) గుర్తించి, inevitable (తప్పనిదాన్ని) గ్రహించి, ముందుకు సాగుతూ, మన వ్యక్తిత్వాన్ని పండించుకోవాలి.

జిజ్ఞాస:

‘జ్ఞాతుమ్ ఇచ్ఛాజిజ్ఞాసా’. అంటే తెలుసుకోవాలనీ కోరికే జిజ్ఞాస. సమస్త జ్ఞానానికి ప్రాతిపదిక ఇదే. సాంకేతిక శాస్త్రాల నుంచి, ఆధ్యాత్మిక జ్ఞానం వరకు, మానవాభ్యుదయానికి కారణమవుతున్నది ఇదే. దీనికి వయసుతో నిమిత్తం లేదు. మనిషి నిరంతరం కొత్త విషయాలను తెలుసుకుంటూ, తనను తాను update చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అతని వ్యక్తిత్వం సార్థకమవుతుంది. లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది. మనిషి వెనకబడిపోతూ ఉంటాడు

ఈ రోజు సమాచార విప్లవం ప్రపంచాన్ని ముంచెత్తుతూ ఉంది. దాంట్లోనుంచి, మనకు కావలసిన దాన్ని స్వీకరించుకోవాలి. దాన్ని మన జీవితానికి అనుగుణంగా మలచుకోవాలి. జ్ఞానులు (learned men) అన్ని మతాల్లో ఉన్నారు. “Music has no language” (సంగీతానికి భాష లేదు) అన్నట్లే, “knowledge has no religion” (జ్ఞానానికి మతం లేదు). అబ్దుల్ కలాం గారిని ముస్లింలో చూడం. రమణమహర్షిని హిందువుగా చూడం. అలాంటి వారు విశ్వమానవులు.

Man is a relentless, learner. మనిషి నిరంతర విద్యార్థి. IT, సాఫ్ట్‌వేర్ రంగాలతో కూడా ఎప్పటికప్పడు కొత్త కోర్సులు, new coding languages వస్తూనే ఉంటాయి. ఆయా ఉద్యోగాలు వాటిపై పట్టు సాధిస్తేనే తప్ప, వారికి career లో prospects ఉండవు. ‘జిజ్ఞాస’ అనేది అప్పుడు వారికి driving force అవుతుంది అది లేనివాళ్లు career లో ఎదగలేరు. career advancement (వృత్తి అభివృద్ధి) కూడా వ్యక్తిత్వ వికాసంలో భాగమే.

జిజ్ఞాసలో కూడా అహంకారం ఉండకూడదు. గురువును (అంటే కొత్త విషయాన్ని మనకు నేర్పించేవాడిని) శరణు వేడాలి. మన అజ్ఞానాన్ని అతని పాదాల వద్ద పెట్టాలి.

‘గురు శుష్రూషయా విద్యా, పుష్క లేన ధనేనవా’

‘గురువుకు సేవలు చేయడం ద్వారా, లేదా గురు దక్షిణంగా అతనికి తగినంత ధనాన్ని సమర్పించడం ద్వారా, జ్ఞానాన్ని పొంద వచ్చు” అంటుంది శాస్త్రం. కానీ గురువులందరూ డబ్బు కాశపడి జ్ఞానం ఇవ్వరు. విధేయతతో కూడిన జిజ్ఞాస ద్వారా వారిని పుసన్నులను చేసుకోవాలి. కర్ణుడు పరశురాముని వద్ద అట్లే శస్త్రాస్త్ర విద్యనభ్యసించాడు

ఒక గురువుకు ఎంతో మంది శిష్యులున్నా, కొందరి పట్ల శిష్యవాత్సల్యము ఉంటుంది. ద్రోణాచార్యునికి అర్జునుని మీద ప్రత్యేకాభిమానం ఉంది అనే విషయం జగద్విదితం. ‘పాండు రంగ మహత్మ్యం’ – తెనాలి రామకృష్ణ విరచిత ప్రబంధం. దానికి ముందుమాట వ్రాస్తూ, కవిసమ్రాట్ విశ్వనాథవారు అందులోని అయుతనియతోపాఖ్యానాన్ని ప్రస్తావిస్తారు.

“వాసోనిగ్రహ మెన్నరా కలియు నీ ర్వట్టున్ గణింపరు” అనే పద్యాన్ని జిజ్ఞాసకు ఉదాహరణంగా, learners లో ఉండాల్సిన dedication కు, కమిట్‌మెంట్‌కు నమూనాగా మహాకవి శ్లాఘించారు. అయుతుడు, నియుతుడు అనే విద్యార్థులు తాము గురువు వద్ద విద్య నభ్యసించే క్రమంలో తమ శరీర స్థితిని కూడా పరిగణించరట. ఆకలిదప్పులకు అతీతంగా వారి అభ్యాసం సాగేదట.

మనం మన అతి తెలివి ప్రదర్శించకూడదు. ఆయనకు తెలుసో తెలియదో అని పరీక్ష చేయకూడదు. ఒక దశలో గురువు కంటే ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించినా, ఆయిన వద్ద మనం అణకువ గానే ఉండాలి. ఇదీ ఇతివృత్తంతో నేను రాసిన ‘వ్యక్తిత్వశిల్పి’ అనే కథకు ‘ఉపాధ్యాయదర్శిని’ అనే మాసపత్రిక వారు నాకు 2019లో మొదటి బహుమతి రూ. 4000/- బహూకరించారు.

నా దృష్టిలో గురువు మన వ్యక్తిత్వాన్ని మలచే శిల్పి లాంటి వాడు. ఈ కథ విహారి, సలీం, సింహప్రసాద్, వాణిశ్రీ, అట్టాడ అప్పలనాయుడు, మేడా మస్తాన్ రెడ్డి గారల వంటి హేమాహేమీలయిన సీనియర్ రచయితల ప్రశంసలందుకుంది.

మనం పి.హెచ్.డి చేసి ప్రొఫెసర్లమైనా, చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో మనకు అక్షరాలు, గుణింతాలు నేర్పిన టీచర్ గారు ఎదురైతే, ఆయనకు వినయంగా నమస్కరిస్తాము! అదీ భారతీయ సనాతనధర్మంలో గురువుకున్న విలువ! ఆయన అప్పట్ల ఎనిమిదో తరగతి వరకే చదివి, untrained teacher గా చేరి ఉండవచ్చు. నీవు ఇప్పుడు Ph.D. చేసి ఉండవచ్చు. కానీ నిస్సందేహంగా ఆయన నీకు గౌరవనీయుడే!

వి.ఎస్. శ్రీనివాస శాస్త్రిగారని, మహాత్మాగాంధీ గారికి ఆప్తమిత్రుడు. గొప్ప విద్యావేత్త, పరిపాలనా దక్షుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇంగ్లీషు భాషలో అద్భుతమైన ప్రావీణ్యం గలవాడు. ఆయనను గాంధీజీ “డియర్ బ్రదర్!” అని పిలిచేవారు. ఆయన గురువును గురించి ఇలా అన్నారు.

“The Calling of a pedagogue is never optional. It must be the only choice for a real educator”

కాలింగ్ అంటే వృత్తి. పెడగాగ్ అంటే టీచర్. టీచరు వృత్తిని ఎన్నుకునేవాడు దాన్నొక optional గా భావించకూడదన్నారు శాస్త్రిగారు. ఎన్నో ఇతర వృత్తులు, అధిక ఆదాయాన్నిచ్చేవి అతనికి అందుబాటులో ఉన్నా, ఉపాధ్యాయ వృత్తినీ, నిజమైన బోధకుడు ఎంచుకోవాలి.

విభిన్న మేధోస్థాయిలు గల విద్యార్థులకు ఆయన బోధించవలసి ఉంటుంది. చాలా చురుకైన విద్యార్థులకు నేర్పడం గొప్ప కాదు. Mediocre (Average) విద్యార్థులకు నేర్పడమే కష్టం. వారికి తెలివితేటలు లేవని నిందించే ఉపాధ్యాయుడు ఆ పదవికి అనర్హుడన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

“A teacher who blames his students is unfit for the job”

ఆయన మంచి వేదాంతి మాత్రమేకాదు, మంచి చమత్కరి కూడా. గురువు వేదాంతి అయితే ఆయన విద్యార్థులు పొందే వ్యక్తిత్వ వికాసం వేరుగా ఉంటుంది.

ఒకసారి ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉండగా, హౌరా స్టేషన్ లోని వెయిటింగ్ రూములో కూర్చుని రైలు కోసం వేచిచూస్తున్నారట. కొందరు విద్యార్థులు ఆయనను చూసి, నమస్కరించి, నిలుచున్నారు. అందులో ఒకరు, కొంటె కోణంగి, (విద్యార్థుల్లో ఇలాంటివారు కూడ ఉంటారు మరి) ఆయన్ను ఇలా అడిగాడట.

“Sir, what is the difference between the station master and school master? Both are masters!”

“సార్! స్కూలు మాస్టరుకు, స్టేషన్ మాస్టరుకు తేడా ఏమిటి? ఇద్దరూ మాస్టర్లే కదా!”

అప్పుడు రాధాకృష్ణ పండితులు నవ్వి, ఇలా చెప్పారట.

“Boys, the station master minds the trains; but the school master trains the minds”

ఎంత అద్భుతమైన వివరణ! ఇందులో ‘PUN’ (శ్లేష) అనే అలంకారం ఉంది. ‘Train’, ‘Mind’ అనే పదాలను రెండు విధాలుగా ధ్వనించాడా మహనీయుడు.

‘Train’ అంటే శిక్షణ యివ్వడం అనీ, రైలు అనీ రెండర్థాలు. ‘Mind’ అంటే గుర్తు పెట్టుకోవడం, బుద్ధి అని రెండర్థాలు.

“స్టేషన్ మాస్టర్ రైళ్లను గుర్తుంచుకుంటాడు (minds the trains), స్కూలు మాస్టర్ “బుద్ధులకు శిక్షణ యిస్తాడు (trains the minds)”. చూశారా ఎంత తేడా వచ్చిందో. ఇలాంటి గురువులు దొరకడం కూడ అదృష్టమే! వారి వల్ల మన వ్యక్తిత్వం బహుముఖాలుగా వికసిస్తుంది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here