మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-9

0
10

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

వేమన శతకం: వ్యక్తిత్వ వికాస పతకం

[dropcap]పా[/dropcap]మరుల నోటిలో కూడా వర్తించే, నర్తించే పద్యాలు వేమనవి. ద్రాక్షపాకంలా ఉంటాయి. అంత తేలిక భాషలో విశ్వసత్యాలను ఆవిష్కరించడం అనితరసాధ్యం. వ్యక్తిత్వ వికాసంలో పట్టుదల (determination) అన్నది ఎలా ఉండాలో ఆయన ఇలా చెప్పాడు:

“పట్టుపట్టరాదు పట్టి విడువరాదు

పట్టెనేని బిగియ బట్టవలయు

బట్టివిడుచుకన్న బరగ చచ్చుట మేలు

విశ్వదాభిరామ వినుర వేమ!”

పట్టుదల ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. లక్ష్యాన్ని సాధించేంత వరకు దాన్ని సడలి పోనివ్వకూడదు. పట్టుదలలోని slackness మరణంతో సమానం.

Practice (అభ్యాసము, సాధన):

సాధన మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. “Practice makes man perfect” అన్నారు ఆంగ్లేయులు. ఒక రాగాన్ని, పలుమార్లు అలపిస్తే, అది అతిశయిస్తుంది. “తినగ తినగ వేము తియ్యనుండు” అన్న మాట చాలా లోతైనది. కష్టం అని దేన్నీ వదలకూడదు. కష్టాలు కూడా క్రమంగా మనకు అనుకులంగా మారతాయి. దీనినే షేక్‌స్పియర్ “Sweet are the uses of Adversity” అన్నాడు. అంటే ఇక్కట్ల ప్రయోజనాలు మధురంగా ఉంటాయని. ‘Great men think alike’, గొప్పవారు ఒకేలా అలోచిస్తారు చూడండి. కాబట్టి ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్న వేమన మాట మన వ్యక్తిత్వాలకు శిరోధార్యం.

శుద్ది (Purity):

శుద్ధిని వేమన మూడు రకాలుగా చెప్పాడు. ఆత్మశుద్ధి, భాండశుద్ధి, చిత్తశుద్ధి. రెండవది భౌతికం అయినా, మొదటిది మూడవది మనకు అత్యవసరం. Purity of Self, Purity oy Mind లేని వ్యక్తిత్వం నిరుపయోగమే కాకుండా సమాజానికి ప్రమాదకరం. అందుకే వేమన ఏ ఆచారమైనా ఆత్మశుద్ధితో, ఏ పూజలయినా చిత్తశుద్ధితో చేయాలన్నాడు. లేకపోతే అవన్నీ కేవలం Mechanical Rituals (యాంత్రిక క్రతువులు) గా మిగిలిపోతాయి.

అట్లే, ‘Appearances are deceptive’, ‘All that glitters is not gold’ అన్న షేక్‍స్పియర్ భావాలను వేమన “ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు” అనే పద్యంలో వివరించారు. అందరూ మనుషులేకాని వారిలో పుణ్యపురుషులు అంటే మంచివారు వేరన్నాడు. ఇక్కడ మంచివారంటే ఉత్తమ వ్యక్తిత్వం కలవారని అర్థం చేసుకోవాలి

ఇక వ్యక్తిత్వ వికాస సూత్రాలలో తలమానికమనదగ్గ మాట వేమన ఇలా చెప్పారు.

“పూజకన్న నెంచ బుద్ధినిదానంబు

మాటకన్న నెంచ మనసు ధృడము

కులము కన్న మిగుల గుణము ప్రధానంబు”

బుద్ధినిదానము అనే మాట చాలా గొప్పది. మన బుద్ధి నిలకడగా నిదానంగా ఉండాలి. అటూ ఇటూ పరుగులు పెట్టకూడదు. అట్లా మాటతో పాటు మనసు ధృడంగా ఉండాలి. ఈ రోజు సమాజాన్ని విభజిస్తున్న కులవ్యవస్థను వేమన ఒక్కమాటలో తూర్పారబట్టాడు. గుణమే ముఖ్యమన్నాడు. నిజమే కదా! కులానికి గుణానికీ సంబంధం లేదు. గుణవంతుడు ఏ కులంలో ఉన్నా అతన్ని గౌరవించాలి. అతని నుండి నేర్చుకోవాలి.

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సరిగ్గా సంరక్షించుకోవడం వ్యక్తిత్వవికాసంతో ప్రధాన అంశం. అలా చేయని వారిని బ్రతికినా, చచ్చినా ఒకటే అన్నాడు వేమన.

“తల్లిదండ్రులందు దయ లేని పుత్రుండు

పుట్టనేమి వాణి గిట్టనేమి?”

వారిని ‘చెదల’తో పోల్చాడు! ఈనాడు వెలుస్తున్న వృద్ధాశ్రమాలకు కారణం అలాంటివారే కదా!

ఇతరులలో తప్పులు పట్టేముందు తన తప్పులను తెలుసుకోమన్నాడు వేమన. తప్పులే చేయనివాడు ఎవరూ ఉండరు.

“To err is human”. “ఉర్వి జనులకెల్ల నుండు తప్పు”. తప్పు చేయడం కంటే చేసినప్పుడల్లా దానిని సరిదిద్దుకోవడమే గొప్పతనం అన్నారు R.W. Emerson.

“It is not great not to fall at all, but to rise, every time we fall”.

హిపోక్రసీని నిరసించాడు వేమన. వ్యక్తిత్వ వికాసంలో పరిహరించాల్సిన దుర్గుణమది.

“మాటలాడు నొకటి మనసులోన నొకటి

ఒడలిగుణము వేరె యాచన వేరె”

దీన్ని మనం ‘కపటం’ అంటాము. వ్యక్తిత్వంలో transparency ముఖ్యం. మనసులో ఏదో ఉంచుకుని బయటకు ఇంకోవిధంగా నటిస్తుంటారు చాలామంది. దీనివల్ల Deliverance కలుగదు.

విదుర నీతి: వ్యక్తిత్వ వికాస సూత్రాలు

విదురుడు పాండురాజు, ధృతరాష్ట్రులకు కజిన్. మహాపండితుడు, జ్ఞాని, మేధావి. దుర్యోధనుడు ఆయన మాటలను పెడచెవిని బెట్టి చేటు తెచ్చుకున్నాడు. ఆయన విధానాలను ఔదల దాల్చి పాండవులు అద్భుత విజయాలను సాధించారు. కురు పితామహుడైన భీష్ముని వద్ద ఈయన శిక్షణ పొందాడు. వ్యక్తిగతంగా ఎదురుడు గొప్ప ధర్మాత్ముడు. మానవ స్వభావాన్ని అద్భుతంగా ఆకళింపు చేసుకున్నవాడు. మానవుడు తనకెదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఈ క్రింది లక్షణాలను తమ వ్యక్తిత్వంలో కలిగి ఉండాలని విదురుడు చెప్పాడు.

  1. తెలివి తేటలు: ఇవి ప్రతి ఒక్కరిలో కొంత హెచ్చుతగ్గులతో అందరికీ ఉంటాయి. కాని వాటిని సరైన సమయంలో సరైన విధానంలో వాడే వారే విజయాలు సాధిస్తారు. దానినే సమయస్ఫూర్తి అంటారు.
  2. గౌరవం: మనకు సమాజంలో గౌరవ ప్రపత్తులు లభించాలంటే అది మన ఋజు ప్రవర్తనను బట్టి ఉంటుంది.
  3. ఇంద్రియాలపై నియంత్రణ: తమ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోగలిగినవారే ఉన్నత వ్యక్తులు. తద్వారా వారు ఇతరులను, పరిస్థితులన సైతం నియంత్రించగలుగుతారు.
  4. జ్ఞానం: కేవలం అధిక జ్ఞానవంతులైనంత మాత్రాన సరిపోదు. దానిని పదిమందికి పంచినపుడే జ్ఞానికి గౌరవం లభిస్తుంది. కాని జ్ఞానమును ఎక్కడ, ఎంత, ఎవరికి అవసరమో గ్రహించి పంచాలి. అపాత్రదాన సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. అడగకుండానే మార్గదర్శనం చేస్తే దానికి విలువ ఉండదు.
  5. పరిస్థితులను తగినట్లు చరించడం: పరిస్థితులను అర్థం చేసుకొని, వాటికి తగ్గట్టు తమ ప్రవర్తనను మలచుకునే వారే వ్యక్తిత్వ వికాసానికి అర్హులు. వారే పరిపక్వత చెందినవారు. మన బలాన్ని, వివేకాన్ని, వనరులను బేరీజ వేసుకుని ముందుకు సాగేవాడే వివేకి, అవసరమైనప్పుడు తగ్గాలి కూడా.
  6. ధైర్యం: ధైర్యం, నిర్ణయం, వాస్తవాలను గ్రహించి వాటిని వెలిఋచ్చడంలో చూపాలి. మొండిధైర్యం ఒక్కోసారి దెబ్బతీస్తుంది.
  7. దానధర్మాలు: సమాజహితం కోసం తమ చేతనైనంత సహకారం దానధర్మాల రూపంలో అందించడం మంచి వ్యక్తుల లక్షణం.

యక్షప్రశ్నలు: సమాధానాలు – వ్యక్తిత్వ వికాస సోపానాలు

తన తమ్ములను ఒక యక్షుడు బంధిస్తే, వారిని విడిపించడానికి ధర్మరాజును ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలనడుగుతాడు.  ఆ ప్రశ్నలు, సమాధానాలు, మానవుడు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడేవే! వాటిలో మానవ జీవిత మథనముంది. వాటిలో కొన్ని:

1) మానవుడు మానవత్వాన్ని ఎలా పొందగలడు?

జ) అధ్యయనం వలన.

2) భూమికంటి బరువైనది ఏది?

జ) తల్లిదండ్రుల రుణం.

3) గాలి కంటి వేగమైనది ?

జ) మనస్సు

4) సజ్జనుడు అంటే ఎవరు?

జ) ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తనకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల అలా చేయకుండా, మాట్లాడకుండా ఉండేవాడు.

5) దుర్జనుడు ఎవరు?

జ) శరణు గారిన వారికి సాయం చెయ్యనివాడు

6) ధర్మానికి ఆధారం ఏది?

జ) దయ దాక్షిణ్యం

7) సుఖానికి ఆధారం?

జ) శీలం.

8) లాభాల్లో కెల్ల గొప్పలాభం ఏది?

జ) మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం

9) అన్నిటి కంటె గొప్ప సుఖం దీని వల్ల కలుగుతుంది?

జ) సంతోషంవల్ల

10) ధర్మాలలో అత్యుత్తమమైనది?

జ) అహింస.

11) మనిషి ఎలా జనాదరణీయుడు, శోకరహితుడు, సుఖి అవగలడు?

జ) గర్వాన్ని, క్రోదాన్ని, లోభాన్ని, తృష్ణను త్యజించడం ద్వారా

12) తపస్సు అంటే ఏమిటి?

జ) తన వృత్తిధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం.

13) క్షమ అంటే?

జ) ద్వంద్వప్రవృత్తిని సహించడం

14) సిగ్గు అంటే?

జ) చేయరాని పనాల పట్ల జంకు, భయం

15) జ్ఞానం అంటే ఏమిటి?

జ) మంచి, చెడ్డల మధ్య తేడాను గుర్తించగలగటం

16) దయ అంటే ఏమిటి?

జ) సృష్టి లోని ప్రాణికోటి సంతా సుఖంగా ఉండాలని కోరుకోవడం

17) ఆర్జవం అంటే?

4) సదా సమభావం కల్గి ఉండటం

(18) దుఃఖ హేతువు?

జ) అజ్ఞానం

19) ధైర్యం అంటే?

జ) ఇంద్రియ నిగ్రహం

20) పండితుడెవరు? మూర్ఖుడెవరు?

జ) ధర్మం తెలసినవాడు పండితుడు. ధర్మం తెలియిక అడ్డంగా వాదించేవాడు మూర్ఖూడు.

21) బ్రాహ్మణత్వం దేనివల్ల కలుగుతుంది?

జ) సత్ప్రవర్తన వలన

22) ఏది ఆశ్చర్యం?

జ) ప్రతిదినం ప్రాణులు మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా, తాను శాశ్వతం అని మనిషి భావించడం

ప్రశ్నలు నిగూఢమైనవి. జవాబులు అంతకంటే లోతైనవి. అడిగినవారూ, చెప్పినవారూ, జీవిత సారాన్ని కాచి వడబోసిన వారే. పైకి సింపుల్‌గా కనిపిస్తాయి. తరచిచూసే కొద్దీ, మన జీవన వ్యవసాయంలో ఇబ్బడిముబ్బడిగా ఫలసాయాన్ని అందించగలిగిన శక్తి ఈ యక్ష ప్రశ్నలకు, వాటికివ్వబడిన జవాబులకు ఉంది.

ధర్మవ్యాధుడు: కౌశికుడు

కౌశికుడనే తాపసి క్రోధం ఎంత ప్రమాదకరమైనదో, దాని వల్ల మనిషికి realisation ఎంత దూరం అవుతుందో, ఒక గృహిణి వల్ల తెలుసుకుంటాడు. ఆమె, కేవలం గృహిణీ ధర్మాన్ని, పతివ్రతా ధర్మాన్ని ఆచరించడం ద్వారా జ్ఞానాన్ని పొంది ఉంటుంది. మిథిలా నగరము లోని ఒక ధర్మవ్యాధుడనే జ్ఞానిని కలిసి, ధర్మసూక్ష్మాలను తెలుసుకొమ్మని ఆ గృహిణి కౌశికునికి చెబుతుంది.

ధర్మ సూక్ష్మాలంటే అఏవో మనకు అర్థంకాని గహనమైన ఆధ్యాత్మిక విషయాలు కాదు. మానవులందరూ తమ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఉపయోగపడే మార్గాలు అవి.

కౌశికుడు మిథిల చేరుకొని, ధర్మవ్యాధుని దగ్గరకు వెళతాడు. ఆయన ఒక కటికవాడు. మాంసం దుకాణం నడుపుకొంటూ ఉంటాడు. అంతటి ధార్మికశీలి ఇటువంటి వృత్తిలో ఉన్నాడేమని కౌశికుడు ఆశ్చర్యపోతాడు

అదే విషయాన్ని అడిగినపుడు ఆయన ఇలా జవాబిస్తాడు. “బ్రాహ్మణోత్తమా! ఇది నా కులధర్మం. ఇది నా వృత్తి, ఎటువంటి పరిస్థితుల్లోను, మన స్వధర్మాన్ని మనం వీడకూడదు. దానిని నీచమైనదానిగా భావించకూడదు. దానిని ఇతరులు అవమానిస్తే సహించకూడదు. నాకు భగవంతుడు నియోగించిన ధర్మం ఇది. ఇదే నా కర్మ. దీనిని అంకితభావంతో నేను నిర్వర్తిస్తాను.”

కౌశికుడు అతని ప్రశ్నిస్తాడు – “మరి మీ ధర్మంలో ‘హింస’ ఉంది కదా! ‘అహింసా పరమో ధర్మః’ అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా!”

ధర్మవ్యాధుడు చిరునవ్వు నవ్వుతాడు. “నేను మాంసం మాత్రమే. అమ్ముతాను. జంతువులను వధించను. మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఒకరి స్వధర్మంలో కొంత క్రూరత్వం ఉండవలసివచ్చినా, అతడు సాధువుగా ఉండవచ్చు.”

“స్వధర్మ నిర్వహణ అత్యంత సహజమైనది. ఆత్మసాక్షాత్కార ఫలం దాని వల్ల లభిస్తుంది. దానిని త్యజించరాదు. ‘The realm of the Subtle’ లోకి ప్రవేశించడానికి అది మార్గం. అదే శిష్టాచారం, అదే సత్ప్రవర్తన”.

“యజ్ఞం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వహించాలి? బ్రహ్మసాక్షాత్కారం ఎలా లభిస్తుంది?”

“ప్రతి కర్మలో ఎంతో కొంత హింస ఉంటుంది. కొన్నిసార్లు కర్తకు తెలిసి; కొన్నిసార్లు తెలియకుండా ఇది జరుగుతుంది. ధర్మానుగుణంగా చేసే కర్మ, అహింసను స్థిరంగా మనసులో ఉంచుకొని చేస్తే, అది ఆ కర్మను పరిశుద్ధం చేస్తుంది.”

‘ఎటువంటి వేదాలు శాస్త్రాలు చదవకుండా ధర్మవ్యాధుడు ఇంతజ్ఞానాన్ని ఎలా సంపాదించాడు?’ అని కౌశికుడు తలపోస్తాడు.

ధర్మవ్యాధుడు అతన్ని తన యింటికి తీసుకుని వెళ్లి, తన తల్లిదండ్రులను పరిచయం చేస్తాడు. వారు పరమ సాత్వికులు. వారిని వృద్ధాప్యంలో తన కంటికి రెప్పలా కాచుకుంటుంటాడు.

“వృత్తినే ధర్మంగా భావిస్తే, అది మరింత ఎత్తుకు ఎదుగుతుంది. అది ‘సత్యము’ లోని ఒక భాగము. ఒక వ్యక్తి ఒక స్థాయికి రావడానికి, అతడు అదుపు చేయలేకపోయినా, ఆ క్రమంలో అతడు ఆచరించే విధానంపై అతనికి అదుపు ఉండాలి. ధార్మికుడుగా ఉండాలి”

బ్రహ్మసాక్షాత్కారం అందరికీ సమానంగా అందుబాటులో ఉంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజాన్ని, తన ధార్మిక ప్రవర్తనతో objective గా చూడగలిగినవాడే దానిని పొందగలడు. ‘Arrogance’ (అహంకారం) దానిని నిరోధిస్తుంది. ధార్మిక ప్రవర్తన వల్ల మాత్రమే ఈ నాగరికత నిలిచి ఉంది. ఎన్ని వైరుధ్యాలున్నా సమాజం విచ్ఛిన్నం కాకుండా ఉండగలుగుతుంది. దీన్ని మన సనాతన ధర్మాన్ని, ప్రవచించిన వారు మన ఋషులు. మన శక్తిని ఇతరులకు హానిచేయడం ద్వారా దుర్వినియోగపరచకూడదు.”

ధర్మవ్యాధ – కౌశిక సంవాదాన్ని మనం సమకాలీన పరిస్థితులకు అన్వయించుకుంటే అది మన వ్యక్తిత్వ వికాసానికి ఎంత relevant గా ఉందో మనకు అర్థం అవుతుంది.

హింస అని యుద్ధం పట్ల విరక్తి చెందిన అర్జునుడిని కార్యోన్ముఖని చేస్తాడు పరమాత్మ. దుర్మార్గాన్ని శిక్షించి, ప్రపంచాన్ని కాపాడటం హింస కాదని బోధిస్తాడు. సైనిక బలగాలలో పని చేసేవారికి ఈ ధర్మం వర్తిస్తుంది

ప్రపంచంలో white collar ఉద్యోగాలు చేసేవారు మహా అయితే పది శాతం కూడా ఉండరు. మిగతా తొంభైశాంతం చెమట చిందించేవారే. దీనినే ఒక సినీ కవి – “కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా నీ బుగ్గ మీద గులాబి రంగూ, ఎలా వచ్చెనో చెప్పగలవా?” అని ఒక పాటలో చెప్పాడు. నాగరిక సమాజంలో మనం ఉపయోగించే ప్రతి ‘Finished Product’ మనల్ను చేరడానికి వెనుక ఎంతో శ్రమ శక్తి దాగి ఉంది. కోవిడ్ సమయంలో కొన్ని వేలమంది పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా బెట్టి, మనల్ను కాపాడారు. ‘కర్మయోగం’ అంటే అదీ! బ్రహ్మసాక్షాత్కారానికి ఇంతకంటే మార్గం ఏముంది.

గిరిజన ప్రాంతాల్లో, సరైన రవాణా సౌకర్యాలు, వసతులు లేకపోయినా, ఆ గూడేలలోని పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులు, గ్రామ సేవికలు, అక్కడ వైద్యం చేసే డాక్టర్లు, గ్రామ పంచాయితీ ఉద్యోగులు అందరూ, ధర్మవ్యాధుడు చెప్పిన వృత్తిధర్మానికి ఉదాహరణలే.

అత్యంత విలాసవంతమైన ఆకాశహర్మ్యాలు, అపార్ట్‌మెంట్లు, మల్టిప్లెక్స్‌లు, ఫ్లై ఓవర్లు, 6 లేన్ల రహదారులు రూపుదిద్దుకోవాలంటే కేవలం మేధోజీవులైన ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ మాత్రమే కాదు, శ్రమజీవులైన భవననిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌లు, అవసరం. వారందరూ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నందువల్లే ‘ఆధునికీకరణ’ సాధ్యం అవుతూంది.

Dignity of labour అన్న సిద్ధాంతంలో కూడా ధర్మవ్యాధుని బోధ అంతర్లీనంగా ఉంది. భూగర్భ డ్రైనేజీలు శుభ్రం చేసేవారు, నిస్సందేహంగా ధార్మికులే. భగవంతుని దృష్టిలో సాధకులే. యోగః కర్మసుకౌశలమ్’ అన్న గీతాచార్యుని వాక్యం, సర్వత్ర సమదర్శినః యోగినః’ అన్న శ్రీకృష్ణుని మాట మన సనాతన ధర్మానికి జవజీవాలనందించాయి.

నరేంద్ర మోదీ, ప్రధాని స్టేటస్‍లో, దీపావళి పండుగను సైనికులతో జరుపుకోవడం, వారి నోటికి స్వయంగా స్వీటు అందించడం, ఈ ధర్మసూక్ష్మాన్ని గ్రహించడమే.

మనం రైల్లో హయిగా ఎ.సి. కోచ్‌లో పడుకొని నిద్రపోతూ ప్రయాణించగలుగుతున్నామంటే దాని వెనుక ఎందరు రైల్వే ట్రాకు‌ను అప్రమత్తంగా రాత్రింబగళ్లు రక్షిస్తుంటారో, ఎందరు టాయిలెట్లను శుభ్రం చేస్తుంటారో, ఎందరు మనకు కావలసిన తినుబండారాలను అందిస్తూంటారో, వారందరి శ్రమను మనం గుర్తించడమే వ్యక్తిత్వం. వారికి కృతజ్ఞులమై ఉండడమే వ్యక్తిత్వ వికాసం. మనం రైలు దిగిపోయిన తర్వాత మనం ఉపయోగించిన బెడ్ షీట్లను, రగ్గులను, పిల్లో కవర్లను తీసేవారు, వాటిని పునర్వినియోగానికి సిద్ధం చేసేవారు సైతం ధార్మికులే. రైల్వే డివిజనల్ మేనేజర్, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ చిరుద్యోగి – ఇద్దరూ వారి వారి స్థాయిలో భగవంతునికి ప్ర్రీతిపాత్రులే. బ్రహ్మసాక్షాత్కారానికి అర్హులే. ఆయన దృష్టిలో ఉభయులూ సమానులే. దీన్ని గుర్తెరగడమే వ్యక్తిత్వ వికాసం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here