మానస సంచరరే -12: ఎదలో ఎగిరే ‘పసి’డి పతంగం!

6
8

[box type=’note’ fontsize=’16’] “జీవితమనే పుస్తకంలో బాల్యమొక బంగారు అధ్యాయం” అంటూ ‘మానస సంచరరే -12: ఎదలో ఎగిరే ‘పసి’డి పతంగం!’ కాలమ్‍లో మధురమైన బాల్యం గురించి వివరిస్తున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]వా[/dropcap]రాంతపు మధ్యాహ్నం. పట్టుదలగా ఏదో పుస్తకం కోసం వెదుకుతున్న నాకు షెల్స్ మూల పాత చాక్లెట్ బాక్స్ కనిపించింది. దాని మీద బర్త్‌డే కేక్ కట్ చేయబోతూ క్యాండిల్ ఊదేస్తున్న అందమైన చిన్నారి బొమ్మ నాకు ఎంత ఇష్టమో. అప్రయత్నంగా నా చేయి ఆ బాక్స్‌ను అందుకోవటం, మూత తెరవటం జరిగింది. రకరకాల నాణేలు రాగీ చిల్లి కాణీలు, పెన్నీలు, గుండ్రటి రాగి నయా పైసలు, చదరంగా ఉండి మూలల్లో వంపు ఉండే సత్తు నయా పైసలు, రెండు, ఐదు, పది పైసలు, ఇరవై, యాభై పైసలు, రకరకాల రూపాయి నాణేలు, రకరకాల విదేశీ నాణేలు కళ తగ్గి కనిపించాయి. ఇవి నా బాల్య స్మృతుల్లో ఓ భాగం. అన్నయ్య ఈ కాయిన్స్ అన్నీ తెచ్చిచ్చేవాడు. కొత్త కాయిన్లు వచ్చిన ప్రతిసారీ మళ్లీ అన్నిటినీ వేర్వేరు చేసి, తనివితీరా చూసుకుని మళ్లీ పొందిగ్గా ఎక్కడివక్కడ అపురూపంగా..

ఆ బాక్స్ అమూల్యనిధిలా అనిపించేది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో గబగబా ఆ బాక్స్ లోపల పెట్టేసి షెల్స్ మూసి వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా పిల్లల గుంపు. చేతుల్లో గాలిపటాలు, మాంజా కండెలు.

‘ఆంటీ మీ మేడమీద కైట్ పడ్డది. తీసుకుంటాం’ అడుగుతూనే జవాబు కోసం ఆగకుండా గబగబా పెరటివైపు వెళ్లి మెట్లెక్కేశారు. నేనక్కడే నిలుచున్నా. అక్కడ చిక్కుకున్న గాలిపటాన్ని నిముషాల్లో తెచ్చుకున్నారు. నాకు చటుక్కున మొన్న జామచెట్టుకు చుట్టుకుంటే తీసి దాచిన పెద్ద గాలిపటం గుర్తొచ్చి, ఆ పిల్లల్ని ఆగమని దాన్ని తెచ్చి వాళ్లకివ్వబోయాను. అందరి చేతులూ ముందుకొచ్చాయి. నవ్వొచ్చింది. అందరికన్నా చిన్న పిల్లాణ్ని చూసి వాడికిచ్చాను. వాడి కళ్లు ఆనందంతో మెరిశాయి.

‘మీ అందరికన్నా చిన్నకదా.. అందుకే.. అందరూ కలిసి ఆడుకోండి’ మిగతా పిల్లలతో నచ్చజెపుతున్నట్లుగా అన్నాను. ‘రండిరా’ అని పిల్లనాయకుడు కేకేయడంతో అందరూ కదిలారు.

మనసులో మళ్లీ ఆలోచనల అలజడి. అసలు వీధిలో పిల్లలు ఆడుకోవటమన్నది చూసి ఎంత కాలమైందో. ఏదో ఏడాదికొక్కసారి సంక్రాంతి సెలవుల పుణ్యమా అని పిల్లల హడావిడి కనిపిస్తుంది. లేకుంటే పిల్లలంతా చదువుల్లో, లేదంటే సెల్‌ఫోన్లోనో, టాబ్లెట్లలోనో వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. పిల్లల్ని కాస్తంత బయట కనిపింపజేసే మరో ఆట క్రికెట్. దగ్గరే ఉన్న ఖాళీ ప్లాట్‌నే గ్రౌండ్‌గా వాడుతుంటారు. తలెత్తి పైకి చూశా. రంగురంగుల గాలిపటాలు.. పైపైకి ఎగురుతూ. పిల్లల కేరింతలు, అరుపులు. ఆనందాల హరివిల్లులు.

అంతే! నా మానసాకాశంలో చిన్ననాటి జ్ఞాపకాల గాలిపటం ఎగరటం మొదలెట్టింది. లోపలికి నడిచి దీవాన్ మీద కూర్చున్నాను.

బాల్యం.. ఎంత మధురమైంది. కానీ అదేమిటో అదెంత మధురమో అప్పుడేం తెలియదు. ఎంత సేపూ ఎప్పుడెప్పుడు పెద్దయిపోతామా అన్న తొందరే. కాళ్లు పైకెత్తి నిలుచుని ‘చూడు నేనెంత పొడుగున్నానో’ అంటూ పోజులు కొట్టటం. ‘పెద్దయ్యాక ఏమవుతావు’ అనడగ్గానే ‘డాక్టర్‌నవుతా, పేద్ద స్కూల్లో హెచ్ఎమ్‌నవుతా, ఇన్‌స్పెక్టర్‌నవుతా, సోల్జర్‌నవుతా…’ ఇలా ఏవేవో జవాబులు చెప్పేయడం. పెద్దవాళ్లు మురిసిపోవడం మామూలే. “బుజ్జిబుజ్జి పాపాయి, బుల్లి బుల్లిపాపాయి.. బుజ్జిపాపాయి.. పాలు తాగు ప్రాయంలో నీలాగే ఉన్నాను. బంగారు ఊయలలో పవళించి ఊగాను.. పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా” అన్నాడో సినీకవి. “ఎదగడానికెందుకురా తొందర.. ఎదర బతుకంతా చిందరవందర.. జోజో.. జోజో..” అన్నాడు మరో కవి. నిజమే. కానీ కరిగే కాలానికి ఎవరం అతీతులం కాలేం. బాల్య చేష్టల విషయానికి వస్తే దేవుళ్లయిన రాముడు, కృష్ణుడు కూడా మంకుపట్టు పట్టారు, అల్లరి చేశారు. రాముడు ఆకాశంలో చందమామ కావాలని మారాం చేశాడట. తల్లి తెలివిగా అద్దంలో చందమామను చూపిందట. రాముడు మంచిబాలుడు కదా.. అందుకే అద్దంలో చందమామతోనే ఆడుకుని సంబరపడ్డాడు. ఆ చందమామ బయటకు రావల్సిందేనని పేచీ పెట్టలేదు. అసలు అల్లరి అంటే ఎన్నియుగాలైనా అగ్రస్థానంలో నిలిచేది కన్నయ్య చేసిన అల్లరి. బాలగోపాలుడు హైపర్‌యాక్టివ్. వీధిలో అందరిళ్లలో వెన్న దొంగిలించడం కాక ఆ వెన్నను ఆ యింటి కోడలిపిల్ల మూతికి పూసి, వారింట అత్తా, కోడలుకు తగవు రేపి ఆనందించేవాడట. ముద్దొచ్చే కన్నయ్యను ఏమీ అనలేక ఎంతోకాలం అలాగే భరించారు వ్రేపల్లె వాడలవారు. చివరకు విసిగిపోయి ఇంతులంతా కట్టకట్టుకుని, యశోద వద్దకు వచ్చి

ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ!

అని మొరపెట్టుకున్నారట.

పాపం యశోద! ఇంట వెన్నకేమైనా కొదవా, యిలా అందరిళ్లలో వెన్న దొంగిలించి తనకు తలవంపులు తెస్తున్నాడు అనుకొని కన్నయ్యకు అటు వంటి పనులు కూడదని నయానా, భయాన చెప్పింది. అసలు తనకేం తెలియదని బుకాయించే కన్నయ్యను యశోద ఏం చేయగలదు? మన్ను తిన్నాడని బలరాముడు చెప్పగా, ఏదీ నోరు చూపమంటే నోరు తెరిచి పదునాలు లోకాలు చూపించడంతో యశోద నోరూ ఆశ్చర్యంతో తెరుచుకుంది. ఒకటా, రెండా.. చిన్నికృష్ణుడి అల్లరి చేతలు.

బాల హనుమంతుడైతే సూర్యుడిని చూసి అదేదో పండనుకుని, అందుకుందామని వెళ్లాడట. ఆ వేడికి పాపం మూతే మారిపోయింది. పురాణ బాలల్లో ప్రత్యేక కోవకు చెందినవారు కొందరున్నారు. తండ్రిని ఎదిరించి మరీ నారాయణుడినే నమ్మి కొలిచిన ప్రహ్లాదుడు.. పసితనంతో మాట వినడం లేదని, గురువుల వద్ద బుద్ధులు నేర్చుకుంటాడని చండామార్కులవారి వద్దకు పంపాడు హిరణ్య కశిపుడు. ప్రహ్లాదుడు తాను మారకపోగా ఇతర పిల్లలకు కూడా నారాయణ మంత్ర పారాయణం నేర్పాడు. కుమారుడి చదువు ఎందాకా వచ్చిందో తెలుసుకుందామని వచ్చాడు తండ్రి. ఏం నేర్చుకున్నావని ప్రశ్నించాడు….. ‘చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ!’ అని దీటైన సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు. తీరా చూస్తే ప్రహ్లాదుడు ఇంకా శ్రీహరినే భజిస్తున్నాడని తెలిసి మండిపడతాడు హిరణ్యకశిపుడు. ఇక లాభం లేదని ఆహారం పెట్టకుండా మాడ్చడం, ఏనుగుల చేత తొక్కించడం, పాముల చేత కాటేయించడం, నిప్పుల్లో పడేయడం, కాగేనూనెలో వేపడం.. ఇలా ఎన్నో క్రూరశిక్షలు విధించి కూడా ఫలితం లేక అంతటి రాక్షసరాజు నీరసపడ్డాడు. అసహనంతో “ఏడీ నీ శ్రీహరి ఎక్కడున్నాడు?” అన్నాడు. ప్రహ్లాదుడు నిర్భయంగా,

“ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకిచూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే…” అన్నాడు.

“అయితే ఈ స్తంభంలో ఉన్నాడా చూపు” అంటూ గదతో స్తంభాన్ని కొట్టాడు తండ్రి.

వెంటనే నరసింహస్వామి స్తంభంనుంచి రావడం, హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి దుష్ట శిక్షణ చేయడం జరిగిపోయింది. భక్త ప్రహ్లాదుడు తండ్రికే హితవు చెప్పిన పుణ్య పుత్రుడు.

ధృవుడు మరో కోవకు చెందినవాడు. తమ్ముడు తండ్రి తొడపై కూర్చోవడం చూసి, తానూ తండ్రికి సన్నిహితంగా అలా కూర్చోవాలని కోరుకుంది బాల ధృవుడి మనసు. తండ్రిని చేరబోతుండగా, సవతి తల్లి అడ్డుకుంది. అలా తండ్రి తొడమీద కూర్చోవాలంటే తపస్సు చేయాల్సిందే అంది. గాయపడిన ఆ లేతమనసులో పట్టుదల పెరిగింది. తపస్సు చేసయినా తండ్రి ఒడిని జేరాల్సిందే అనుకొని ప్రచండ తపస్సు చేసి, భగవదానుగ్రహానికి పాత్రుడయి తన పంతం నెగ్గించుకుని చివరకు ధృవతారగా నింగిలో నిలిచిపోయాడు.

పల్నాటి చరిత్రలో బాలచంద్రుడైతే.. ఓరోజు బొంగరం ఆడుకుంటున్నాడు. బొంగరం ములుకు ఓ మహిళ కాలికి గుచ్చుకోవడం, ఆమె.. “నీ పెద్దవాళ్లు యుద్ధం చేస్తుంటే, రాకుమారుడివై ఉండి, నువ్వు తీరిగ్గా బొంగరం ఆడుతున్నావా” అని ఆగ్రహించడంతో బాలచంద్రుడు రోషంతో కదనరంగానికి పరుగులు తీశాడు. అంటే నాడే బొంగరాల ఆట ఉండేదన్నమాట.

బాలభారతంలో పాండవులు, కౌరవులు బంతాట ఆడటం, బంతి బావిలో పడటం, అది తీయడమెలాగా అనుకుంటున్న తరుణంలో ద్రోణుడు అక్కడికి వచ్చి బాణాలతో బంతిని వెలికి తీసివ్వటం, ఆపైన వారికి గురువు కావటం తెలిసిందే.

అభిలాష ఉండి అవకాశం దొరకని బాలలకు ప్రతీక ఏకలవ్యుడు. పాపం ఏకలవ్యుడికి ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకోవాలని ఉన్నా అనుమతించక పోవడంతో మనసా, వాచా ద్రోణుడినే గురువుగా ఆరాధిస్తూ అతడి ప్రతిమ ముందు సాధన చేసి ఎదురులేని విలుకాడయ్యాడు. శ్రవణకుమారుడైతే అంధులైన తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ వారి సేవలోనే కన్నుమూశాడు.

అల్లరి అంటే గుర్తొచ్చేది ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ నవల. తనకు ఇచ్చిన పనిషమెంట్‌ను (గోడకు సున్నం వేయటం) తెలివిగా తోటిపిల్లలకు అంటగట్టడం, హకిల్బరీ ఫిన్‌తో కలిసి సాహసాలకు పూనుకోవటం.. భలేగా ఉంటుంది. ఆర్.కె.నారాయణ్ బాలలకందించిన వరం.. ‘మాల్గుడి డేస్’, అలాగే పిల్లల్ని అలరించే రుడ్‌యార్డ్ కిప్లింగ్ రచించిన ‘ది జంగిల్ బుక్’ ఎప్పటికీ పిల్లల అభిమానపాత్రాలే. ఆ మాటకొస్తే ఆలీబాబా నలభై దొంగల కథ, ‘అరేబియన్ నైట్స్’, ‘సింద్ బాద్’ కథలు, అల్లావుద్దీన్-అద్భుతదీపం, పరమానందయ్య శిష్యుల కథ, తెనాలి రామకృష్ణుడి కథలు, అక్బర్-బీర్బల్ కథలు.. ఎన్నెన్ని బాల మనోరంజక కథలో!

‘బాలవాక్కు బ్రహ్మ వాక్కు’ అంటారు. ‘లేతమనసులు’ సినిమాలో పిల్లలు దేవుడు చల్లనివారే, కల్లకపట మెరుగని కరుణామయులే‘ అంటూ లల్లీ పప్పీ కవలలు దూరమైన తల్లిదండ్రుల్ని కలిపి కథను సుఖాంతం చేస్తారు. ‘బాలరాజుకథ’లో అనాథ బాలుడు బాలరాజు మహాబలిపురంలో గైడ్‌గా పని చేస్తూ, ఆడుతూ పాడుతూ పెద్దలకు కూడా కనువిప్పు కలుగజేస్తుంటాడు. అంతేకాదు. అడిగానని అనుకోవద్దు, చెప్పకుండ దాటేయద్దు.. ఏమిటీ రహస్యం, స్వామీ ఏమిటీ విచిత్రం… అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన దేవుడు ఉన్నాడంటారు, మీరొక్క దెబ్బతో తేల్చారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇక్కడికెందుకు వచ్చారు, ఏ రాతికి మొక్కగ వచ్చారు?‘ అంటూ సాధువును నిలదీస్తాడు. బాలల్లోని ప్రశ్నించే తత్త్వానికి బాలరాజు ఓ ప్రతీక. ‘మల్లీశ్వరి’ చిత్రంలో మల్లీశ్వరి కోతిబావకు పెళ్లంట.. కోవెల తోట విడిదంట..’ అంటూ బావను ఆటపట్టిస్తుంది. అలాగే అనేక సినిమాల్లో పిల్లల బొమ్మలాటలు చూస్తుంటాం. మరో సినిమాలో భర్త గురించి బెంగపడుతున్న నాయనమ్మకు బూచాడమ్మా బూచాడు.. బుల్లి పెట్టెలో ఉన్నాడు.. కళ్లకెపుడు కనపడడు, కబురులెన్నో చెపుతాడు‘ అంటూ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను పరిచయం చేసి ఆమె భర్త కుశలాన్ని తెలుసుకునేందుకు తోడ్పడుతుంది మనవరాలు. (సెల్‌ఫోన్‌లు అప్పటికింకా లేవు మరి). కల్లాకపటం లేని మనసుకు ఈ చిన్నారి పాత్ర ప్రతిరూపాలు.

బాల్యమంటే.. అగ్గిపెట్టెలో ఆరుద్రపురుగులు, పుస్తకాల్లో నెమలీకలు, గాలి బూరలు, పున్నాగపూలు ఏరి ఊదుకోవటాలు, జడలల్లుకోవడాలు, చెమ్మచెక్క, అష్టాచెమ్మా, పచ్చీను, వైకుంఠపాళి, వామన గుంతలు, బొమ్మల పెళ్లిళ్లు, ఒప్పులగుప్పా.. వయ్యారిభామా, ఉయ్యాలలూగడాలు, క్యారమ్స్, చదరంగం, దాగుడుమూతలు, నేల-బండ, నాలుగురాళ్ల ఆట, తాడాట, బొంగరాలాట, బిళ్లంగోడు, చిత్తా-పత్తా ఆటలు, చీపురుపుల్లలతో విల్లులు, బాణాలు, గోలీలు, తొక్కుడుబిళ్ల, కుంటాట, ఖోఖో, కబడ్డీ, గాలిపటాలు, ఇసుకలో గూళ్లు కట్టడం, తిరునాళ్లు, రంగులరాట్నాలు, బొమ్మలు, రంగు పెన్సిళ్లు, డ్రాయింగ్ పుస్తకాలు, బొమ్మల కథల పుస్తకాలు.. మౌత్ ఆర్గన్‌లు.. బైస్కోప్‌లు.. ఎన్నెన్నో..

అప్పటికీ ఇప్పటికీ కూడా పిల్లలంతా ఆడే ఆట ‘టీచరాట’. పిల్లలెవరూ అందుబాటులో లేకపోతే, బొమ్మల్నే విద్యార్థులుగా ఊహించుకుంటూ టీచరుగా అభినయం అదరగొట్టేస్తుంటారు. అది చూస్తే వాళ్ల స్కూలు, టీచర్లు, తీరుతెన్ను అన్నీ అర్థం చేసుకోవచ్చు.

ఇంక తిండి రుచులకు హద్దులే లేవు. జామెట్రీ బాక్సుల్లో చిరుతిళ్లు, మరమరాలు, బఠాణీలు, నువ్వు జీళ్లు, పల్లీల ఉండలు, చింతచిగురు, సీమచింతకాయలు కోసుకోవడాలు, చెరుకుగడలు, రేగిపళ్లు, జామకాయలు సరేసరి, తేగలు, తాటిముంజెలు, పచ్చిమామిడి ముక్కలు, పుల్ల ఐస్‌క్రీములు, పీచుమిఠాయి.. ఇంట్లో అమ్మ చేసే జంతికలు, బూందీ, గారెలు, బూరెలు, అరిసెలు, లడ్లు.. అబ్బో ఆ జాబితా జాబిల్లినందుకోవాల్సిందే.

రాత్రుళ్లు వెన్నెట్లో పడుకుని అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కోతులు-రొట్టె ముక్క, రాజుగారు-ఏడుగురు కొడుకులు, నాన్నా పులి, చాకలి-గాడిద, కుందేలు-తాబేలు, రాజకుమారుడు-రాక్షసుడు.. వగైరా కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం, అమ్మ పెట్టే గోరుముద్దలు తినడం, నాన్నతో షికారు కెళ్లడం.. ఆదివారం మధ్యాహ్నం రేడియో ముందు బైఠాయించి, ‘రారండయ్.. బాలబాలికలు రారండోయ్.. బాలవినోదం వినరండోయ్’ అంటూ మొదలయ్యే బాలానందం కార్యక్రమాన్ని వినడం, గంట వ్యవధి ఘడియలా గడిచిపోవటం… ఎంతో విజ్ఞానం.. వినోదం.

చినుకులుపడితే ‘వానావానా వల్లప్పా’ అంటూ తిరగడం, పెద్దవానయితే నీళ్లల్లో కాగితపు పడవలు వేసి, అవి కదిలిపోతుంటే కేరింతలు కొట్టడం, పెన్సిల్ చెక్కి, ఆ పొట్టును ఓ బాక్స్‌లో పోసి, అందులో కాసిని పాలు పోసి, అది రబ్బరుగా తయారవుతుందని ప్రయోగాలు చేయటం, కాగితపు విమానలు చేసి గాల్లోకి విసరటం ఒకటా, రెండా? ఎన్నెన్నో సరదాలు..

చుట్టాల రాక మరో సంబరం. వాళ్లు వెళ్లిపోతూ “చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కో” అంటూ, అయిదో, పదో ఇస్తే తెగ సంతోషపడిపోవడం, “పారేసుకుంటావ్, నేను దాస్తాలే” అంటూ పెద్దలు తీసేసుకోవడం… ఆ రోజులే వేరు. ఇప్పుడో నెలనెలా పాకెట్ మనీ.. కోరుకున్నవి కొనేసుకోవడం.. పెద్దలు కొనివ్వాలని ఎదురుచూపులు కొంతమేరకు తగ్గిపోయాయి. బాబాయో, మామయ్యో ప్రేమగా షికారుకో, ఎగ్జిబిషన్‌కో, జూకో తీసుకెళితే ఆ ఆనందమే వేరు. ‘ఉడుతా ఉడుతా ఊచ్.. ఎక్కడికెళతావ్ ఊచ్.. కొమ్మమీది జాంపండు కోసుకొస్తావా, మా బేబీకిస్తావా..’ అని ఆడిస్తే పొంగిపోని పసి హృదయం ఉంటుందా? బాలభారతం, బాల రామాయణం, మాయాబజార్ వంటి సినిమాలు చూసి ఎంత ఆనందించేవాళ్లు!

ఇప్పుడు పిల్లల వినోదాలూ మారిపోయాయి. రిమోట్ చేతపట్టుకొని టీవీ ఛానెల్స్ అన్నిటినీ మార్చేస్తూ, ఖుషీఖుషీగా సూపర్‌మేన్, స్పైడర్‌మేన్, శక్తిమాన్, టామ్ అండ్ జెర్రీ, మిస్టర్ బీన్, ఛోటా భీమ్, డోరమాన్ ప్రోగ్రామ్‌లు చూసేస్తూ, టెంప్ట్ చేసే యాడ్స్‌ని చూసి, అవసరమైన, అక్కర్లేని వస్తువులన్నీ కొనిపిస్తూ, వీడియోగేమ్స్‌లో మునిగితేలుతూ, ఎప్పుడెప్పుడు బైక్ ఎక్కి వాయువేగంతో విహరిద్దామా అనుకోవడం.. ఇదొక పార్శ్వం.

ఇక పెద్దలు తమ పిల్లలు అన్నింటా రాణించాలని, ర్యాంకులు సొంతం చేసుకొని, మెడిసిన్, ఇంజినీరింగ్.. వగైరా… వగైరా కోర్సుల్లో సీ ట్లు సాధించాలని, ఆపైన ఏ అమెరికానో (నిన్న మొన్నటి దాకా), ఆస్ట్రేలియానో, న్యూజిలాండో, జర్మనీయో వెళ్లి దండిగా డబ్బు సంపాదించాలని కోరుకుని పసిమనసులను అర్థం చేసుకోకుండా స్కూలు, ట్యూషన్లు, కోచింగ్‌లతో వారిని బాల్యమధురిమలకు దూర చేయడం మరో పార్శ్వం.

ఇంకా ఈ మధ్య చైల్డ్ ప్రాజిడీస్‌లను చూసి తమ పిల్లలు కూడా బాలమేధావులు అయితీరాలనే పట్టుదలతో పిల్లలకు మాటలు వచ్చీ రాగానే దేశాల పేర్లన్నీ, రాజకీయనాయకుల పేర్లన్నీ, కరెన్సీ పేర్లన్నీ.. ఇలా ఎంతెంతో విజ్ఞానాన్ని నూరిపోస్తున్నారు. గానం, నాట్యాలయితే తల్లి అన్ని పనులూ మానుకుని పిల్లలే సర్వస్వంగా వారివెంటే ఉంటూ, అన్నిరాష్ట్ర పోటీలకు, అన్ని ఈవెంట్లకు తీసుకువెళ్లి తీర్చిదిద్దటం కామన్ అయిపోయింది. పిల్లలు రాణించాలనుకోవటం తప్పుకాదు కానీ వారి బాల్యాన్ని దోచేయటం పాపం అనిపిస్తుంది. జీవితంలో నిశ్చింతగా ఆడుతూ, పాడుతూ ఉండే దశను కూడా గానుగెద్దులా మార్చేయడం మంచిదేనా అన్నది ప్రశ్న. బాల్యానికి బద్ధశత్రువులా తయారయింది బడి సంచి. మోయలేని ఈ భారాన్ని తగ్గించే కొత్త ఆలోచనలు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. అవన్నీ అమలయ్యే దెప్పుడో. వెనక ఇంట్లో పిల్లల సందడి వినిపిస్తోంది. ఎంత ముచ్చటగా ఉందో.. సన్నజాజి తీవెలోయ్.. సంపంగి పూవులోయ్… ఇల్లుపీకి పందిరేసి, పకపక లాడితే, పిల్లలున్న లోగిలని దేవుడే మెచ్చేనులే ‘ అంటూ భానుమతి పాట గుర్తొచ్చింది.

బాల్యమధురిమలు అందరికీ అనుభవానికి రాని దేశం మనది. ఎక్కడ చూసినా బాలకార్మికులు. బడిబాట కార్యక్రమాలు ఎన్నివచ్చినా బాలకార్మిక వ్యవస్థ దూరంకాని పరిస్థితులు. హెూటళ్లలో టీ కప్పులు అందిస్తూనో, కప్పులు కడుగుతూనో, టేబుళ్లు తుడుస్తూనో ఎందరో.. ఇటుకలు మోస్తూ, రైలు బోగీలు శుభ్రం చేస్తూ, కిరాణాషాపుల్లో వస్తువులందిస్తూ, ఇళ్లలో పనిపిల్లలుగా, బాల్యం వీడకుండానే పసిపిల్లల ఆలనాపాలనా చూసే ఆయమ్మలుగా ఎందరెందరో.. ఇవన్నీకాక శివకాశీ వంటి చోట్ల ప్రమాదకరమైన టపాసుల తయారీలో ఎందరో బాలలు. ఇదొక కోణమైతే బాలల అక్రమ రవాణా భూతం మరోవైపు. ఎందరో పిల్లలు కిడ్నాప్‌లకు గురై, సంఘవిద్రోహుల చేతుల్లో కుంటి, గుడ్డివారుగా మారి యాచకులై సంపాదనా సాధనాలుగా మారుతున్నారు. బహుముఖీన బాల్యం!

ఏమైనా జీవితమనే పుస్తకంలో బాల్యమొక బంగారు అధ్యాయం.. అనుకుంటుండగానే ‘కోతి.. కోతి.. కోతి’ బయట పిల్లల అరుపులు వినిపించడంతో నా ఆలోచనల గాలిపటం తెగిపడింది.

మళ్లీ కోతులు వచ్చినట్లున్నాయ్. ఎంత పెద్దయినా నాలో ఏమూలో దాగున్న పసిమనసు, కోతుల గోల తిలకించమని తొందరించడంతో బయటకు నడిచా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here