మానస సంచరరే -14: తోకలేని పిట్ట తోడుగా…

7
7

[box type=’note’ fontsize=’16’] “ఈ ఆధునిక కాలంలో జీవితం ఎంత వేగవంతమైనా అప్పుడప్పుడైనా లేఖలు రాసుకోవాలి, ఆత్మీయానుబంధాలకు ఉత్తమ సాధనమైన ఉత్తరాన్ని ఉద్ధరించుకోవాలి” అంటున్నారు జె. శ్యామలమానస సంచరరే -14: తోకలేని పిట్ట తోడుగా…’ కాలమ్‍లో. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం నుంచి నా మనసులో సద్గుణ మెదులుతోంది. సద్గుణ ఇంటర్‌లో నా క్లాస్‌మేట్. ఇన్నాళ్లకు సద్గుణ ఇంతగా గుర్తుకు రావడానికి కారణం లేకపోలేదు. నేను బస్‌లో ప్రయాణిస్తుండగా ఓ స్టాపులో ఒకావిడ ఎక్కింది. ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్లు బలంగా అనిపించింది. ఆ.. అవును.. సద్గుణ మాదిరే ఉంది. కానీ ఆ తర్వాత ఆమె మొబైల్‌లో మాట్లాడటంతో ఆ గొంతు, మాటతీరు ఆమె సద్గుణ కాదని రూఢిగా తేల్చేశాయి. అయినా సద్గుణ గురించిన జ్ఞాపకాల అలల అలజడి ఆగనంది.

సద్గుణ చాలా నెమ్మది. ఇంటర్లో ఉండగానే అమ్మా, నాన్న పెళ్లి చేయాలని తొందరపడ్డారు. ఇంకేముంది.. పెళ్లిచూపులు.. నచ్చుకోవడం, మెచ్చుకోవడం కూడా అయింది. నిశ్చయతాంబూలాలు కూడా అయ్యాయి. అయితే మూఢాలున్నాయని, ఆ పైన ఇంకేవో అడ్డంకులున్నాయని ఓ నాలుగునెలల తర్వాత ఉన్న ముహూర్తం నిర్ణయించారు. వరంగల్‌లో ఉద్యోగం చేసే ఆ అబ్బాయి, కాబోయే శ్రీమతికి లేఖ రాశాడు. సద్గుణకు బెరుకు, సిగ్గు. ఇంట్లో వాళ్లు ఏమంటారో అని జంకు. ఉమ్మడి కుటుంబంలో ఆ లేఖను సరిగ్గా చదువుక అనే అవకాశమూ లేదు. కాలేజీకి వచ్చాక మెల్లిగా మాతో చెప్పింది.

“రిప్లై రాయమంటున్నాడు.. ఎలా?” అడిగింది. ‘రాసెయ్’ చిలిపిగా నవ్వాం నేను, సుభద్ర.

“మీకు నవ్వులాటగా ఉంది. అసలు ఏమని అడ్రెస్ చేయాలి?” అడిగింది.

అప్పటికింకా పేర్లతో వ్యవహరించడం పెద్దగా వాడుకలో లేదు. శ్రీవారికి అని రాయడానికి ఇంకా పెళ్లి కాలేదుకదా అని సందేహం.

“సరే, ముందర ‘కాబోయే’ కలిపితే సరిపోతుందిగా” మా సలహా. చాలా సేపు ఆలోచించి శ్రీవారు అనే పదం రాయడానికి కూడా సిగ్గుపడి ‘కాబోయే డ్యాష్ డ్యాష్ డ్యాష్ గారికి’ అని రాసింది. ఆ తర్వాత ఆ అబ్బాయి ‘డ్యాష్ డ్యాష్ డ్యాష్’ అంటే ఏమిటి? అంటూ మరో లేఖ సంధించాడు. ఇలా ఆ లేఖలు నడిచి చివరకు శుభలేఖలు పంచేరోజు రానేవచ్చింది. ఇంకేముంది. పందిట్లో పెళ్లయింది. ఇంటర్ పరీక్షలు కానిచ్చి సద్గుణ కొత్త కాపురానికెళ్లిపోయింది. ఆ పైన అడపా దడపా ఉత్తరాలు రాసేది. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలన్నంతవరకు తెలుసు. ఆపైన కమ్యూనికేషన్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు.. ఉత్తరాలంటే చాలు.. నాకు తనే గుర్తిస్తుంది. ఆరోజుల్లో ప్రతి ఇంటా ఫోన్లు, మనిషి మనిషికీ మొబైల్స్ ఎక్కడివి? అయినా భావ వ్యక్తీకరణకు ఉత్తరాన్ని మించింది లేదు. మాటలకందని భావాలను సైతం అక్షరాలే అందిస్తాయి.

ఇప్పుడేమిటి? అలనాడు రుక్మిణీ, శ్రీకృష్ణుడికి బ్రాహ్మణుడి ద్వారా ప్రేమలేఖ పంపింది. ఈ లెక్కన చూస్తే రుక్మిణి చాలా ఫార్వార్డ్. నచ్చినవాణ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవటం, అందుకు అన్న వ్యతిరేకిస్తాడని తెలిసీ, పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఎంతో ధైర్యం చేసి పెళ్లికి ప్రపోజ్ చేస్తూ లేఖ రాయడం అంటే రుక్మిణి వ్యక్తిత్వం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు.

పోతన భాగవతంలో రుక్మిణీ కల్యాణ ఘట్టం ఎంత గొప్పగా ఉంటుందో!

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;

కర్ణరంధ్రంబుల కలిమి యేల?

పురుషరత్నమ! నీవు భోగింపఁగాలేని;

తనులతవలని సౌందర్య మేల?..

అని తన మనసును తెలిపి.. ఇంకా ఇలా అంటుంది…

ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా

ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యము లేల? నీవు నీ

తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్రు గాని వి

చ్చేయుము; శత్రులన్నుఱుము జేయుము చేయుము శోభనం బిలన్

అని వెంటనే వచ్చి, శత్రువులను తరిమికొట్టి, తనను చేపట్టవలసిందిగా సుస్పష్టంగా తెలియజేస్తుంది.

ఉత్తరాలు ఎన్నో రకాలు. వాటిని ఆయా వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి, సందర్భాలను బట్టి వర్గీకరించుకోవచ్చు. గతంలో ప్రతి ఇంటా పోస్ట్‌మ్యాన్ తెచ్చే ఉత్తరాల కోసం నిత్యం ఎదురుచూపులుండేవి. అమ్మాయి ఉత్తరం రాసిందా, అబ్బాయి ఉత్తరం రాశాడా? బంధువుల క్షేమ సమాచారం ఏమైనా ఉందా?.. చదువు రాని వారైతే పోస్ట్‌మ్యాన్‌తోనే ఆ ఉత్తరం చదివించుకోవడం కూడా కద్దు. పోస్ట్‌మ్యాన్ ఊరంతటికీ ఆత్మీయుడు. ఎందుకంటే అందరి మంచి, చెడు అతడితో పంచుకునేవారు కాబట్టి. పోస్ట్‌మ్యాన్ ఎండలో వస్తే మంచినీళ్లిచ్చి ఆదరించే కాలమది. మరి పోస్ట్‌మ్యాన్‌లు ఉత్తరాలు రాయరా? ఈ ఆలోచన వచ్చే కాబోలు ఓ సినీ కవి ..

పాఠాలు నేర్పేటి పంతులమ్మా.. ప్రేమ పాఠాలు చెపుతావా చిలకమ్మా..” అని పోస్ట్‌మ్యాన్ ప్రేమికుడితో పాడించాడు.

ఆ పంతులమ్మ అందుకు దీటుగా “లేఖలు అందించే చినవాడా… ప్రేమ లేఖలు రాశావా ఎపుడైనా…” అంటూ అడుగుతుంది.

ప్రేమలేఖ మాటొస్తే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ”. ఉత్తరమే కీలకంగా సాగే కథ. అందులో టైటిల్ సాంగ్ ఆరంభం దండకం లెవెల్‌లో ఉంటుంది..

శ్రీమన్మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా మీ శ్రీచరణాంబుజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి, మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు భయముతో, భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు…

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ

మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ శుభముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు…,

నిదురపోని కనుపాపలకు జోలపాడలేక ఈలవేసి చంపుతున్న ఈడునాపలేక

ఇన్నాళ్లకు రాస్తున్న.. ప్రేమలేఖ..” అంటూ సాగుతుంది.

మరోచిత్రంలో “రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్ని నీలో.. భువిలోన మల్లియలాయె, దివిలోన తారకలాయె నీ నవ్వులే” అని పాడుతాడు హీరోగారు.

అందాల ఓ చిలకా, అందుకో నా లేఖా.. నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా” అన్నారు మరో సినీకవి.

మొత్తంమీద నీనిమాల్లో ప్రేమలేఖల జోరు ఎక్కువే. అంతెందుకు, ‘ప్రేమలేఖలు’ పేరుతో ఓ సినిమాయే వచ్చింది కూడా. ప్రేమలేఖ రాయడం గొప్ప కళ. అందుకే కొందరు ప్రేమికులు, ప్రేమలేఖలు ఇతరులతో రాయించుకుంటారు. అవి ఒకచో ఫలిస్తాయి.. వేరొకచో వికటిస్తాయి. లేఖలంటే ఆషామాషీ కాదు. ఒక్కోసారి ఒక్క అక్షరం కుడిఎడమైనా అనర్థాలు జరగొచ్చు. కానీ చంద్రహాసుడి కథలో మాత్రం ఓ అక్షరం మార్చడంతో చంద్రహాసుడి జాతకమే మారిపోతుంది. కథాకమామీషులోకి వెళితే…

యువరాజు చంద్రహాసుడికి బాల్యంలోనే తండ్రి మరణిస్తాడు. కొంతకాలానికి పెంచి పెద్దచేసిన దాది కూడా మరణిస్తుంది. అంతలో ఓ జ్యోతిష్కుడు, త్వరలో చంద్రహాసుడు ఆ రాజ్యానికి రాజు కానున్నాడని చెపుతాడు. మంత్రి దుష్టబుద్ధికి అది చేదువార్త. దుష్టబుద్ధి తన కొడుకే రాజు కావాలనుకుంటాడు. దుష్టబుద్ధి కుమార్తె ‘విషయ’. దుష్టబుద్ధి, భటుల్ని పిలిచి, చంద్రుహాసుడిని గుట్టుగా సంహరించమని ఆదేశిస్తాడు. చంద్రహాసుడిని చంపడానికి వారికి మనసొప్పక అడవిలో వదిలేసి, అతడికున్న ఆరు వేళ్లలో అదనంగా ఉన్న వేలిని కోసి, తీసుకెళ్లి దుష్టబుద్ధికి చూపి చంపినట్లు నమ్మిస్తారు. దుష్టబుద్ధి హాయిగా ఊపిరిపీల్చుకుంటాడు. చంద్రహాసుడు అడవిలోనే ఉండిపోతాడు. అంతలో అక్కడికి మరోరాజు వేటకు వచ్చి చంద్రహాసుణ్ని చూసి, తన వెంట తీసుకెళతాడు. ఓసారి దుష్టబుద్ది పొరుగురాజ్యానికి వెళ్లి, అక్కడ చంద్రహాసుడిని చూసి ఆశ్చర్యపోతాడు. చంద్రహాసుడితోనే ఓ లేఖ పంపుతాడు.. అందులో ‘ఈ లేఖ తెచ్చినవానికి ‘విషము’ నిమ్ము అని రాస్తాడు. చంద్రహాసుడు ఆ లేఖ తీసుకొని వెళ్లి, అలసటతో ఉద్యాననవనంలో నిద్రించటం, అక్కడికి రాకుమార్తె ‘విషయ’ రావటం, అతడిని చూసి తొలిచూపులోనే మనసుపడటం, అతడివద్ద ఉన్న లేఖను అందుకుని చదివి, ఎంతో తెలివిగా ‘విషము’ను ‘విషయ’గా దిద్ది, అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. నిద్రలేచిన చంద్రహాసుడు లేఖను తీసుకొని దుష్టబుద్ధి కుమారుడు మదనుడి వద్దకు వెళతాడు. అతడు ఉత్తరం చదివి, వెంటనే చంద్రహానుడికి, విషయకు వివాహం జరిపిస్తాడు. కొద్దికాలానికి దుష్టబుద్ధి తిరిగివచ్చి, జరిగింది తెలుసుకుని అల్లుడైన చంద్రహాసుడిని ఏమీ చేయలేకపోతాడు. ఆపైన చంద్రహాసుడు రాజవుతాడు.

ప్రేమలేఖలు గురించి చలం ఇలా అంటారు.. “సర్వకాల సర్వావస్థలలో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చెయ్యడమే ప్రేమలేఖ. ఈ ప్రపంచమే, ఈ సృష్టి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ”.

తెలుగులో లేఖాసాహిత్యానికి కొదువలేదు. గోపీచంద్ ‘పోస్ట్ చెయ్యని ఉత్తరాలు’ సాహిత్యాభిమానులకు పరిచితమే. అబ్బూరి ఛాయాదేవి పెద్ద కథ ‘మృత్యుంజయ’ కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా రాసిందే. నెహ్రూగారు, తాను స్వాతంత్ర్యోద్యమంలో నిమగ్నమైనా, కుమార్తెకు లేఖల ద్వారానే అనేక విజ్ఞానాంశాలను తెలియజేశారు. అవి ‘లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిజ్ డాటర్’ గా ప్రచురితమయ్యాయి కూడా. అవి నేటికే కాదు, ఏనాటికైనా విలువైనవే.

అలాగే అబ్రహాం లింకన్ తన కుమారుడిని తొలిసారి బడికి పంపుతూ స్కూలు ప్రధానోపాధ్యాయుడికి తన కుమారుడికి నేర్పించాల్సిన అంశాలను వివరిస్తూ ఓ లేఖ రాశారు. అది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అందులో “మా అబ్బాయి ఈరోజే స్కూలుకు వస్తున్నాడు. అతడికంతా కొత్తగా ఉంటుంది. మీరు కొంచెం మృదువుగా మాట్లాడి దగ్గరయ్యేలా చేయాలి. మీరు చదువు మాత్రమే కాదు.. జీవితానికి కావలసిన ముఖ్యమైన కొన్ని అంశాలు నేర్పాలి.. దొరికిన పది డాలర్ల కన్నా, సంపాదించిన పది సెంట్లు విలువైనవని మీరు అతడికి చెప్పండి. విచారంగా ఉన్నప్పుడు ఎలా నవ్వాలో నేర్పండి. ప్రతి వైఫల్యంలోనూ విజయం ఉంటుందని చెప్పండి. పుస్తకాలెంత అద్భుతాలో చెప్పండి. అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, ప్రకృతిని తిలకించనీయండి. ఆత్మవిశ్వాసం నేర్పండి. అందరి మాట వినాలని, కాని సొంత నిర్ణయం తీసుకోవాలని చెప్పండి..” ఇలా కాలదోషం పట్టని విలువైన మాటలెన్నో ఆ లేఖలో రాశారు లింకన్.

ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు నేర్చుకునే అంశాల్లో ‘ఉత్తరం రాయడం’ ఒకటి. సెలవు చీటీలు, స్నేహితుడికి లేఖ, నాన్నగారికి ఉత్తరం ఇలా ఎన్నెన్నో నేర్చుకుంటారు.

కొంతమంది ఇతరుల ఉత్తరాలు దొంగతనంగా చదువుతారు. అదెంత సంస్కార హీనత! ఇతరులను బెదిరించే రీతిలో కొందరు దుష్టులు ఊరు, పేరు లేకుండా ఆకాశరామన్న ఉత్తరాలు రాయడమూ కద్దు. గతంలో ఇళ్లలో ఉత్తరాలను ఒక తీగెకు గుచ్చి భద్రపరిచేవాళ్లు. తీరికైన రోజున పాత ఉత్తరాలను చదువుకొంటే ఆ అనుభూతే వేరు. ‘తోకలేని పిట్ట తొంభై మైళ్లు పోతుంది’ అనే పొడుపు కథకు జవాబు ఉత్తరమే.

పట్టణాలు, నగరాల్లో ఇంటికి పోస్ట్ బాక్స్ తప్పనిసరి. సాయంత్రం ఇల్లు చేరగానే పోస్ట్ బాక్స్ చూసుకోవటం అసంకల్పితంగా జరిగేది. చిరునామా సరిగా లేక, లేదంటే మరే ఇతర కారణాల వల్లనో కొన్ని ఉత్తరాలు ఏళ్లకు ఏళ్లు ప్రయాణించి, గమ్యం చేరిన సంఘటనలూ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకుల్లో లేఖాస్త్రాలు పరిపాటే. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికార పక్ష నాయకుడిని నిలదీస్తూ ఉత్తరాల పరంపర కొనసాగిస్తూ, ఆ విషయమై ప్రచారం చేయడం తెలిసిందే. ఆఫీసుల్లో నడిచే లెటర్స్ వ్యవహారం వేరు. రాష్ట్రపతికి, ప్రధానికి, దేశపౌరులు, భావిపౌరులు సైతం ఉత్తరాలు రాయటం మామూలే. వారి మనసునాకట్టుకున్న ఉత్తరాలకు బదులివ్వటం, వాటికి ప్రచారం కల్పించటం జరుగుతుంటాయి. ఇక సినీతారలకు అభిమానులు ఉత్తరాలు రాస్తుంటారు. వాటిలో ఎన్నో అర్థరహితాలు, తమాషాలు ఉండటం సహజమే. ఉత్తరాలపై అతికించే తపాలా బిళ్లల సేకరణ ఎంతో మందికి ఒక హాబీ. ఇప్పుడది కాస్త తగ్గినట్లనిపిస్తుంది. తపాలా బిళ్లలు దేశ సంస్కృతి, సంప్రదాయాలు, దేశంలోని విశిష్ట వ్యక్తులు, దేశ పురోగతి.. ఇలా అనేకానేక అంశాలను ప్రతిబింబిస్తాయి. పోస్టల్ వ్యవస్థ లేని ప్రాచీన కాలంలో ఉత్తరాలను వార్తాహరుల కిచ్చి పంపడం, లేదంటే ఏ పావురానికో కట్టి పంపటం చేసేవారు.

అయితే ఆత్మీయుల నుండి సందేశాల కోసం అందరూ ఎదురు చూసేది ఒక ఎత్తయితే, సరిహద్దుల్లో ఉండే సైనికులు ఎదురుచూసేది మరో ఎత్తు. కన్నవారికి, అర్ధాంగికి, కన్న బిడ్డలకు దూరంగా ఒంటరిగా దీర్ఘ కాలం దేశరక్షణ కోసం అహరహం సతమతమయ్యే జవాన్లకు తమవారి గురించి తెలిపేవి లేఖలే కదా. ఎంత టెక్నాలజీ పెరిగి, మొబైల్స్ వగైరాలొచ్చినా, సరిహద్దులకు సిగ్నల్స్ అందటం సందేహమే. అందుకే చిట్టీయే చిరంజీవి. జవాన్ల మనోగతాలకు అద్దం పడుతూ జావేద్ అఖ్తర్

సందేశే ఆతే హై

హమే తడపాతే హైఁ

తో చిట్టీ ఆతీ హై

ఓ పూఛే జాతీ హై

కె ఘర్ కబ్ ఆవోగే

లిఖో కబ్ ఆవోగే

కె తుమ్ బిన్ ఏ ఘర్ సూనా సూనా హై…

….

కిసీ కీ సాసోం నే

కిసీ కీ ధడ్‌కన్ నే

కిసీ కీ చూడీ నే

కిసీ కీ కంగన్ నే

కిసీ కె కజరె నే

కిసీ కె గజరె నే

మహక్‌తీ సుభాహోం నే

మచల్‌తీ షామోం నే

అకేలీ రాతోం నే

అధూరీ బాతోం నే …

కె తుమ్ బిన్ ఏ దిల్ సూనానూనా హై” అద్భుతంగా పాట రాశారు.

మై ఏక్ దిన్ ఆవూంగా..

ఏక్ దిన్ ఆవూంగా అనేది ఆశాభావమే.

కానీ సైనికుడి బతుకు నిరంతరం గాలిలో దీపమేగా. నిన్నటికి నిన్న పుల్వామాలో జవాన్లు అకస్మాత్తుగా బాంబుదాడికి ఆహుతైపోలేదూ. ఈ మారణ హెూమాలు అంతమయ్యే రోజు వచ్చేనా? మనిషి, మనిషిగా బతికేనా? నేల కోసం, మతం కోసం, సంపద కోసం నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసే నరాధముల తీరు మారేనా? ఈ ప్రశ్నల లేఖని ఏ దేవుడికి నివేదించాలి? ఏమైనా ఈ ఆధునిక కాలంలో జీవితం ఎంత వేగవంతమైనా అప్పుడప్పుడైనా లేఖలు రాసుకోవాలి. మొబైల్స్‌లో ముద్రల భాషకో, ఈ మెయిల్స్‌లో మాడర్న్ షార్ట్‌హ్యాండ్ భాషకో పరిమితం కాకుండా అడపాదడపా మన మనోభావాలను అక్షరాలలో ఆవిష్కరించి, ఆత్మీయులతో పంచుకోవాలి… ఆత్మీయానుబంధాలకు ఉత్తమ సాధనమైన ఉత్తరాన్ని ఉద్ధరించుకోవాలి!

అలసట.. సద్గుణ జ్ఞాపకాల నుంచి తోకలేని పిట్ట వరకు రకరకాలుగా సాగిన నా తలపులకు, కళ్ల మీదకు ముంచుకొచ్చిన నిద్రముందు తలవంచక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here