మానస సంచరరే -16: మనసంతా మధుమాసం!

6
7

[box type=’note’ fontsize=’16’] “జీవితం వసంతం దగ్గరే ఆగదు.. లేదా శిశిరం దగ్గరే ఆగదు. కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అన్ని రుతువులనూ ఆస్వాదించడమే మనిషి కర్తవ్యం” అంటున్నారు జె. శ్యామలమానస సంచరరే -16: మనసంతా మధుమాసం!’ కాలమ్‍లో. [/box]

[dropcap]ప్ర[/dropcap]శాంత ప్రభాతాలంటే తగని పరవశం నాకు. వాహనాల రొద తక్కువగా ఉండి, మనుషుల సంచారం కూడా పరిమితంగా ఉండి, చల్లగాలికి ఊగుతూ చిరుసవ్వడులతో పలకరించే చెట్లు, చీకట్లను చీల్చుకుంటూ వచ్చి ఆకాశాన్ని అలంకరించే వెలుగు నగలు..

ఈరోజు త్వరగా మెలకువ వచ్చింది. తలుపు తీసి గేటువద్ద నిలుచుంటే, ఆహ్లాదాల ఆమని రారమ్మని పిలిచింది. ఇంతలో పనిమనిషి ప్రత్యక్షం. ‘నువ్వు పనిచేస్తూ ఉండు. నేను ఓ పదినిముషాలు వాకింగ్‌కి వెళ్లి వస్తా’ నని ఆమెకు చెప్పి చెప్పులు వేసుకుని బయటకు అడుగేసా.

అలా నడుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. ఆ.. ఆ యింటిముందు పెద్ద మామిడిచెట్టు. అంతే! నేను, పిల్లలు ‘స్టాట్యూ’ అంటే ఆగినట్లుగా ఆగిపోయాను. ఆకులెంత అందంగా ఉన్నాయో. కొన్ని పూర్తిగా ఆకుపచ్చగా ఉంటే, మరికొన్ని లేత ఆకులు, కుంకుమవర్ణం కలగలిసి వింత అందంతో మిడిసిపడుతున్నాయి. చెట్టు నిండా పూత. కొన్ని మామిడికాయలు వేలాడుతూ.. మామిడిచెట్టు అందమే అందం. అంతలో ఎక్కడినుంచి వచ్చిందో కోయిలమ్మ! మామిడిచెట్టుపై కూర్చుని కూకూ..కచేరీ మొదలుపెట్టింది. ఆ ఇల్లు అతి సామాన్యమైన పాత యిల్లు. అయితేనేం, ఈ మామిడిచెట్టుతో సహజ అలంకార శోభితంగా ఉంది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా.. కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా.. ఏమో, ఏమనుకోగానీ ఆమని, ఈ వని..’ మనసు అసంకల్పితంగా ఆలపించింది. సరే.. మరీ అలా ఆగిపోవడం బాగుండదని బలవంతంగా అడుగులు ముందుకు వేశా. అదుగో.. అక్కడో పెద్ద వేప చెట్టు. దాన్నిండా వేప్పూత. కొన్ని వేపపళ్లు కింద రాలిపడి ఉన్నాయి. ఇవి చేదుగా ఉంటాయి కానీ వాటి రంగు.. అదోరకం పసుపు వర్ణం మనోహరంగా ఉంటుంది. ఇక్కడ కాకులు అటూ, ఇటూ హడావిడిగా తిరుగుతున్నాయి. అంతలోనే రెడీ.. వన్, టు, త్రీ అని ఎవరో చెప్పినట్లు ఒక్కసారిగా ఎగురుతున్నాయి.

అలా నడుస్తూ ఉంటే ‘హాయి హాయిగా ఆమని సాగే.. సోయగాల గనవోయి సఖా.. హాయి సఖా… లీలగా పూవులు గాలికి ఊగ.. కలిగిన తలపుల వలపులురేగ ఊగిపోవు మది ఉయ్యాలగా, జంపాలగా.. ఆ ఆ ఆ ఆ..’ పాటను మనసు నెమరువేసింది. ఈలోపుగా ఒకరిద్దరు పరిచయస్థులు గుడ్మార్నింగ్లు, సుప్రభాతాలు, శుభోదయాలు చెప్పటం, నేనూ యాంత్రికంగా స్పందించటం జరిగిపోతోంది. కారు హారన్‌తో ఉలిక్కిపడ్డాను. ఆలోచనల్లో పడి చాలా దూరం వచ్చాను. టైమ్ చూస్తే పది నిముషాలు కాదు, నేను వచ్చి ఇరవై నిముషాలు దాటింది. బాబోయ్.. అనుకుంటూ వెనక్కు తిరిగాను.

ఇళ్ళ ముందు అందాల పూ లతల సయ్యాట ఎంత మనోహరంగా ఉందో..

బహారోం ఫూల్ బరసావో
మేరా మెహబూబ్ ఆ యా హై, మేరా మెహబూబ్ ఆయా హై
హవావోం రాగినీ గావో మేరా మెహబూబ్ ఆయా హై
ఒ లాలీ ఫూల్ కి మెహందీ లగా ఇన్ గోరె హాతోం మె
ఉతర్ ఆ యే ఘటా కాజల్, లగా ఇన్ ప్యారీ ఆంఖోం మె
సితారోం మాంగ్ భర్ జావో..

ఎన్ని కాలాలైనా నిలిచిపోయే పాట..

అంతలో పనిమనిషి ఎదురైంది. “పనయిపోయిందమ్మా. మీరేంటి ఇంతసేపైనా రాలేదూ..” అంటూ నా జవాబు కోసం ఆగకుండా హడావిడిగా వెళ్లిపోయింది. ‘నాలుగిళ్లల్లో పనిచేయాలి. తన తొందర తనది’ అనుకుంటూ గేటు తీసుకుని లోపలికి నడిచాను. గుమ్మం పక్కనే సన్నజాజి పరిమళం స్వాగతం చెప్పింది. బ్రష్ చేసుకుంటున్నా, టీ తయారుచేస్తున్నా నా మనసు మాత్రం వసంతం దగ్గరే ఆగిపోయింది. టీ సేవిస్తూ పెరటివైపు వెళ్లా.. మరుమల్లెలు గుప్పుమంటూ గుబాళించాయి. ఆహా అనుకుంటూ వెనక్కు నడిచాను.

మళ్లీ కోయిల గానం కూ..కూ..

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరీ..
చిగురాకులు తోరణాలు, చిరుగాలీ సన్నాయి..
డుడుండుడుం.. వసంతుడే పెళ్లికొడుకు, వనమంతా సందడీ
పూలన్నీ తలంబ్రాలు.. పున్నమీ తొలిరేయి..

మనసులో మెదిలింది. అంతలో చిన్నప్పుడు చదువుకున్న ఓ రైమ్ గుర్తొచ్చింది..అది.. ‘ది కుకూ కమ్స్ ఇన్ ఏప్రిల్. షి సింగ్స్ ఎ సాంగ్ ఇన్ మే. దెన్ ఇన్ జూన్ అనదర్ ట్యూన్. అండ్ దెన్ షి ప్లేస్ అవే..’

ఆంగ్లకవులు వర్డ్స్‌వర్త్, కీట్స్, రాబర్ట్ ఫ్రాస్ట్.. ఎందరెందరో ‘స్ప్రింగ్’ (వసంతం)ని అనంతంగా అక్షరబద్ధం చేసినవారే.

బెంగాలీ క్యాలెండర్లో అయిదు రుతువులే ఉంటాయి. గ్రీష్మ, వర్ష, శరత్, శీత్, వసంత్.. ప్రకృతి ఆరాధకుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల్లో వసంత వర్ణన విరివిగా చేశారు.

ఇక ‘భారత కోకిల’గా మన్ననలందుకొన్న సరోజినీ నాయుడు ‘ది జాయ్ ఆఫ్ స్ప్రింగ్ టైమ్’లో ఇలా..

‘స్ప్రింగ్ టైమ్.. ఓ స్ప్రింగ్ టైమ్.. వాటీజ్ యువర్ ఎస్సెన్స్
ది లిల్ట్ ఆఫ్ ఎ బుల్ బుల్, ది లా ఫ్ ఆఫ్ ఎ రోజ్
ది డ్యాన్స్ ఆఫ్ ది డ్యు ఆన్ ది వింగ్స్ ఆఫ్ ఎ మూన్ బీమ్…
ది హోప్ ఆఫ్ ఎ బ్రెడ్ ఆర్ ది డ్రీమ్ ఆఫ్ ఎ మెయిడెన్
వాచింగ్ ది పెటల్స్ ఆఫ్ గ్లాడ్నెస్ అన్‌క్లోజ్?..’

కాల చక్రంలోని ఆరుఋతువుల్లో ఆహ్లాదపరిచేది వసంత ఋుతువు. శరదృతువు కూడా అలరిస్తుంది కానీ మామిడిపూతలు, కోయిలగానాలు అప్పుడుండవు. చైత్ర, వైశాఖ మాసాలు వసంతఋతు శోభితాలు. వసంత పంచమి నాటి నుంచే వసంతం వస్తున్నానంటూ ఊరిస్తుంటుంది. వసంత పంచమి లేదా శ్రీ పంచమిని ఉత్తర భారతంలో విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజున లక్ష్మీదేవిని, రతీమన్మథులను పూజిస్తారు, గానం చేస్తారు. అలా చేస్తే వసంతుడు సంతోషిస్తాడని అంటారు. తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వసంత పంచమి నాడు సరస్వతి పూజ చేస్తారు. ఈమధ్య కాలంలో దక్షిణాదిన కూడా వసంత పంచమి నాడు సరస్వతీ పూజలు విశేషంగానే చేస్తున్నారు. ఆ రకంగా మాఘ మాసం ఋసంతరుతువుకు స్వాగతం పలుకుతుంది. కాముడి పున్నమి.. రంగుల హెూలి వసంతాల కేళి నుంచే ఆమని ఆనందాలు మొదలవుతాయి. మన్మథుడి మరో పేరు వసంతుడు. ముక్కంటి అంతటివాడే మన్మథ మాయకు డిస్టర్బ్ అయ్యాడు (ఆ తర్వాత మూడోకన్ను తెరిచి మన్మధుణ్ని భస్మం చేసి ఉండవచ్చుగాక).

కర్నాటక సంగీతంలోని రాగాల్లో ‘వసంత రాగం’ ఒకటి. ఈ రాగంలోనే త్యాగరాజుల వారు ‘సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి..’ కీర్తన గానం చేశారు. వసంతాన్ని సంవత్సరంగా కూడా వ్యవహరిస్తుంటాం. ‘ఎవరైనా పుట్టినరోజు అంటే..’ ఇది ఎన్నో వసంతమో? అని అడగడం పరిపాటి. మనిషి జీవితకాలంలో యవ్వనం, వసంతంలాంటిది అయితే ఈ ప్రకృతి యవ్వనం, వసంతరుతువు. మనిషికీ యవ్వనదశ కొంతకాలమే.. ప్రకృతి మాత్రం మళ్లీ మళ్లీ వసంతాన్ని సొంతం చేసుకుని మానవాళి మనసులనలరిస్తూనే ఉంటుంది. వసంతరుతువులోనే చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినంగా.. నూతన సంవత్సరాదిగా కాలం లెక్కలను మరొకసారి గుర్తుచేస్తుంది. నూతన సంవత్సరాన తొలి పండగ ఇదే. బ్రహ్మ సృష్టి ‘ఉగాది’ నాడే మొదలైందని పెద్దల ఉవాచ. మత్స్యావతారం ధరించిన విష్ణువు, సోమకుని సంహరించి, వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ వచ్చిందని పురాణాలు విపులీకరిస్తున్నాయి. వసంతంలో మావి కొత్త చిగుళ్లు వేసినట్లే కొత్త సంవత్సరంలో మనుషులలో కొత్త ఆశలు రెక్కలు తొడుగుతాయి. ‘ఈ సంవత్సరమైనా కలలు సాకారమయ్యేనా” అని అనేకులు పంచాంగాలన్నీ పదేపదే తిరగేసారు. రాశిఫలాల కేసి ఆశగా చూపు సారిస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, చేదు, వగరు, ఉప్పు వగైరా రుచులున్నా నచ్చే తీపిని కాస్తంత ఎక్కువగా వేసుకొని (చేతిలో పనే కదా) ఆస్వాదిస్తుంటారు. ఉగాది పచ్చడి జీవితానికి ప్రతీక అని, బెల్లం- తీపి; ఉప్పు-రుచి.. ఉత్సాహానికి; వేప-చేదు బాధ; పులుపు-నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు; పచ్చి మామిడి వగరు-సవాళ్లకు; కారం-సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు సూచికలని చెబుతారు. ఉగాదినాడు జీవిత గమనాన్ని సమీక్షించుకుని, సమస్యల పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఉత్సాహంగా కృషి చేయాలని, ఆ రోజు ఏ పని చేస్తే, ఆ పని ఏడాదంతా చేస్తామని ఆ రోజున కాస్తంత చదువుకోవటం వగైరాలు చేసేవారెందరో.

వసంత రుతు సౌందర్యానికి స్పందించని కవి ఉండడు. ఎందుకంటే ఋతువుల్లో రారాజు వసంతమే. వాల్మీకి, కాళిదాసుల నుంచి నేటి ఆధునిక కవుల వరకు ప్రతి కవి వసంతం మీద కవితలల్లినవారే. కాళిదాసు ‘ఋతుసం(మ)హారం’ రచిస్తే, గుంటూరు శేషేంద్రశర్మ ‘ఋతు ఘోష’, సినారె ‘రుతుచక్రం’ రచించారు. అంతెందుకు.. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం రెండేళ్ల కిందటే వసంత పంచమి సందర్భంగా ఓ కవిత రాసి మరీ ప్రజలకు శుభాకాంక్షలందజేశారు. ఆ కవితను, గాయకుడు పార్థివ్ గోహిల్ పాడి వినిపించాడు కూడా. ఆ పాట గుజరాతీలోనే ఉన్నా దాని అనువాదాలు హిందీలో, ఇంగ్లీషులో వచ్చాయి. మోడీ గారిలో ఓ మంచి కవి కూడా దాగి ఉన్నాడని ఈ కవిత తెలియజేస్తుంది. అది..

అంత్ మే ఆరంభ్ హై, ఆరంభ్ మే హై అంత్,
హియ్ మే పత్‌ఝర్ కె కూజ్‌తా వసంత్
సోలహ్ బరస్ కీ వయ్, కహీ కోయల్ కీ లయ్, కిస్‌ పర్ హై ఉఛల్ రహా పలాశ్ కా ప్రణయ్,
లగతా హే రంక్ భలే, భీతర్ శ్రీమంత్…
హియ్ మే పత్‌ఝర్ కె కూజ్‌తా వసంత్
కిస్ కీ షాదీ హై, ఆజ్ యహా బన్ మె? ఫూట్ రహే, దీప్-దీప్ వృక్షోం కే తనమే
దేనే కో ఆశీష్ ఆతే హై సంత్
హియ్ మే పత్‌ఝర్ కె కూజ్‌తా వసంత్

ముఖ్యంగా.. ‘కిస్ కీ షాదీ హై.. ఈ రోజు ఇక్కడ వనంలో ఎవరిదైనా పెళ్లి ఉందా? చెట్ల తనువుల నుంచి ఆశీస్సులు వస్తూనే ఉంటాయి..’ అనటం ఎంత బాగుంది!

మనసైన తోడు చెంత ఉండి, మూడ్ బాగున్నవారు

వసంతగాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా తనువు, మనసు ఊగి, తూగి.. ఒక మైకం కలిగేనులే.. ఈ మహిమ నీదేనులే, ప్రేమ తీరు ఇంతేనులే…” అని పాడుకుంటారు. మంగళంపల్లి ఈ పాట ఎంత మధురంగా పాడారో!

‘చక్రవాకం’ చిత్రంలో ‘చీకటి వెలుగుల కౌగిటిలో, చిందే కుంకుమ వన్నెలు’ పాటలో.. ఆరు రుతువులు ఆమని వేళలే మన తోటలో.. అన్ని రాత్రులు పున్నమి రాత్రులె మన మనసులో.. మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు.. అన్నీ మనకు చుట్టాలే, వచ్చీపోయే అతిథులే‘ అంటూ ఆంధ్రా షెల్లీగా ప్రశంసలందుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ అందమైన, మధురమైన పాటను అందించారు.

జీవితం చేజారిపోతోందని నిరాశ పడే మనసు

ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాగి కోయిల, మౌనమైన వేళలా… వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా.. గతించిపోవు గాధ నేననీ..” అంటూ వేదనా నాదం పలికిస్తాడు.

సంక్లిష్ట పరిస్థితిలో చెలిని వీడిపోతూ.. “రానిక నీ కోసం చెలీ రాదిక వసంత మాసం.. రాలిన సుమాలు ఏరుకుని, జాలిగ గుండెల దాచుకుని.. రానిక నీ కోసం..” అని పాడుకునే వియోగులు కొందరు. పెద్దకారణమేమీ లేకున్నా దూరమైన సఖిని తలచుకుని మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో మనసైన చిన్నదీ లేదేలనో..‘ అని బాధపడేవారూ ఉంటారు. అన్నట్లు ‘ఏకవీర’ చిత్రంలో పాటను తలచుకోకుంటే వసంతం సంపూర్ణమే..

“ప్రతిరాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి
ప్రతినిముషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి.
నీలో నా పాట కదలి నాలో నీ అందే మెదలి
లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసీ విరిసి
మనకోసం ప్రతి నిముషం మధుమాసం కావాలి..
ఒరిగింది చంద్రవంక వయ్యారి తార వంక
విరజాజి తీగె సుంత జరిగింది మావిచెంత
ననుజూచి, నిను జూచి వనమంతా వలచిందీ..”

ఎంత మధుర భావన! కాలం షట్ రుతువులతో కూడుకొన్నదయితే జీవితం షడ్రుచులతో కూడుకొన్నది. జీవితం వసంతం దగ్గరే ఆగదు.. లేదా శిశిరం దగ్గరే ఆగదు. కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అన్ని రుతువులనూ ఆస్వాదించడమే మనిషి కర్తవ్యం. మనిషి జీవితంలో భౌతికంగా యవ్వన వసంతం ముగిసిపోవచ్చు గాక. మానసికంగా యవ్వనంగా ఉండటం మనిషి చేతుల్లో పనే.. కాదు కాదు.. మనిషి మనసులో పనే. కాలం పోకడను, కొత్త తరాన్ని అర్థం చేసుకొని అర్థవంతంగా బతకడానికి ఇది చాలా అవసరం. మనసును పై బడే వయసుతో నిస్తేజపరచకుండా, ఒకింత ఉత్సాహం.. మరింత ఉల్లాసం మనసులో నింపుకోగలిగితే, ‘జీవితమే సఫలము. రాగసుధా భరితము.. ప్రేమ కదా మధురము’. అవును.. ‘తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం..’ పాటను తలపోస్తూ ఉండగా, మొబైల్ మోత మొదలైంది.

ఆమనిని మనోవనంలోనే ఆగమని.. స్వగతంలోంచి ప్రస్తుతానికొచ్చి ‘హలో’ అంటూ పలకరించాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here