మానస సంచరరే-19: కురిసే వర్షం.. విరిసే హర్షం!

8
7

[box type=’note’ fontsize=’16’] “దేశం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు సకాలంలో సరిగ్గా కురవాలి. రెయిన్ డ్యాన్స్‌లతో మస్తీ చేసుకుంటే సరిపోదు. మదిలోనూ మంచితనం వర్షిస్తూ ఉండాలి..” అంటున్నారు జె. శ్యామలమానస సంచరరే -19: కురిసే వర్షం.. విరిసే హర్షం!’ కాలమ్‌లో. [/box]

[dropcap]వే[/dropcap]సవి, వేధింపు చాలించి వెనక్కు తగ్గటం.. చినుకులు చిరునవ్వులతో పలకరించడంతో కొన్ని రోజులుగా కాస్తంత హాయిగా ఉంది. ఈరోజూ అంతే.. ఆఫీసునుంచి బయటపడేసరికి గాలి మట్టి పరిమళాన్ని మోసుకొచ్చి ‘వానొస్తోందోచ్’ అంది. అంతలోనే సన్నజల్లు. ఇలా చినుకుల్లో తడవటం నాకెంతో సరదా.

‘చినుకులా రాలి.. నదులుగా సాగి
వరదలై పోయి.. కడలిగా పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ’ మధుర గీతం గుర్తొచ్చింది. అంతేనా.. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే.. చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరిగెడుతుంటే..’ పాత బంగారు గీతం పలకరించింది.

దారిలో పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. మా ఊళ్లో ‘వానావానా వల్లప్పా.. చేతులు చాచు చెల్లప్పా.. తిరుగు తిరుగు తిమ్మప్పా.. తిరగలేను నరసప్పా’ అంటూ పిల్లలు చేతులు పట్టుకుని వలయంగా తిరిగిన గతకాలపు దృశ్యం కళ్లముందు కదలాడింది. ఇప్పటి పిల్ల లయితే ‘రెయిన్ రెయిన్ గో అవే.. కమ్ ఎగైన్ ఎనదర్ డే’ వల్లె వేస్తుంటారు’ అనుకుంటుండగానే ప్రకృతి దృశ్యం మారిపోయింది. ఆకాశం ఉరుముతోంది. వానజోరు పెరిగింది. నడక వేగం పెంచాను. హమ్మయ్య.. బస్‌స్టాప్ వచ్చేసింది. నిండా జనం. అలాగే ఓ పక్కగా తలదాచుకున్నా. మనదేశంలో సకాల వర్షాలు కొన్ని, అకాల వర్షాలు కొన్ని ఉంటుంటాయి. కానీ క్విబ్డో (కొలంబియా)లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తూనే ఉంటాయట. ఇదిలా ఉంటే అటకామా డెజర్డ్ (దక్షిణ అమెరికా)లో వర్షమనేదే ఉండదట. ప్రపంచంలో గినియా, సొలోమాస్ ఐలండ్స్, సియెరాలియోన్లు వర్షం విషయంలో టాప్ త్రీ గా ఉన్నాయి. మనదేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయలోని మాసిన్‌రాన్‌లో నమోదవుతుంది. ‘మేఘాలయ’ ఎంత అందమైన పేరు!

వర్షం ఆనందాన్నే కాదు దుఃఖాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మనసు విచారంగా ఉంటే “ముసురుపట్టిన ఆకాశంలా ఉందని’ వర్ణిస్తారు. వదనం విచార మేఘాలు కమ్ముకుని ఉందంటారు. భారీ వర్ష వర్ణనయితే ఆకాశానికి చిల్లుపడి భోరుమంది.. అంటారు. వానతీరు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కొద్దిసేపు దంచికొట్టి, ఆ తర్వాత తెరిపినిస్తుంది. మరికొన్నిసార్లు నానుస్తూ అలా కురుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు వడగళ్లు సైతం పడతాయి. బాల్యంలో వడగళ్లు ఏరుకున్న తీపి గురుతు మనసులో తొంగిచూసింది. వడగళ్లు.. అవును చాలా ఏళ్ల క్రితం ‘వాన’కు సంబంధించి “వానగళ్లు” కథ రాశాను. ‘ఓ సాయం ‘చిత్రం’ పేరుతో ఇంకో వాన కథ రాసిన విషయం గుర్తుకొచ్చింది.

వాన దృశ్యాలు ఆయా పరిసరాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. మంచి సెంటర్లో ఉండి గమనిస్తే.. అప్పటివరకు అమ్మకాల జోరు సాగించిన చిన్న వ్యాపారులు వానజోరుకు సరుకు సర్దుకుని నీడను వెదుక్కుంటూ వెళ్లటం, వాహనాలు ఆపేసి, షాపుల ముందు తలదాచుకునే జనాలు.. ఆ పక్కనే ఓ వారగా మొక్కజొన్న కండెలు కాలుస్తూ బండీ అతను, మరోవైపు వేడి వేడి మిరపకాయ బజ్జీల వ్యాపారి. నీళ్లు చిమ్ముతూ, కారుస్తూ రయ్‌మంటూ వెళ్లే భారీ వాహనాలు, కొన్నిచోట్ల వర్షపునీరు ఓ పెద్ద కాలువగా రూపుమార్చుకోవటంతో ట్రాఫిక్ అంతరాయాలు, జనాల పాట్లు. అదే ఏ కాలనీల్లోనో అయితే ఆ దృశ్యం వేరుగా ఉంటుంది. తలస్నానం చేసిన తరువులు తళతళలాడుతూ, తన్మయత్వంతో ఊగుతూ, గాలితో కలిసి రాగాలాపన చేస్తుంటాయి. పిల్లలు చేతులు ముందుకు చాచి వాననీటిని చేతుల్లోంచి జారుస్తూ ఆనందిస్తుంటారు. అంతేనా, వాన నీటిలో కాగితపు పడవలు వేసి అవి అలా అలా కదిలిపోతుంటే ‘భలే.. భలే’ అనుకుంటారు.

పల్లెల్లో అది వేరు చిత్రం అనుకోగానే బాల్యంలో ఓ పల్లెలో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్లటం గుర్తొచ్చింది. అది పెంకుటిల్లు.. వాన రావటం.. కొన్నిచోట్ల పెంకులు పోవడంతో ఆ రంధ్రాల్లోంచి వానపడటం, ఇంట్లో వాళ్ళు హడావిడిగా బకెట్లు తెచ్చి పెట్టడం.. గుర్తొచ్చి నవ్వొచ్చింది. రైతులకు వానే దైవం. సకాలంలో వాన కురిస్తేనే వ్యవసాయం సాగేది, పంట చేతికొచ్చేది. అందుకే ‘వానలు కురవాలి వానదేవుడా.. వరిచేలు పండాలి వానదేవుడా’ అంటూ వేడుకుంటారు. వానల కోసం కప్పల పెళ్లిళ్లు జరిపే పల్లీయులూ ఉన్నారు. వానాకాలం వానలు బాగా వస్తే చెరువులు నిండి కప్పలు బెకబెక కచేరీ చేస్తుంటాయి. అతివృష్టి, అనావృష్టి.. ఏదైనా మిగిలేవి కష్టనష్టాలే. వరుణుడు కరుణించాలని యాగాలు, కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నాలు.. సతమతమవుతూ, సవాళ్ల నధిగమిస్తూ మా నవజీవన పోరాటం..

సముద్రతీరాల్లో ఉండే బెస్తలయితే.. చేపల కోసం సముద్రం మీదకు వెళ్లిన భర్త కోసమో, కొడుకు కోసమో ఇంటింటా బెంగతో కూడిన ఎదురుచూపులు. ఇక ప్రతాపాన్ని ఆపమని వానదేవుడికి మొక్కులు. ఇవేమీ అర్థంకాని పిల్లల మంకుపట్టులు, ఏడుపులు.. ఇంతలో నా ఆలోచనను ఆగమంటూ బస్ రావడంతో ఎక్కాను. సీట్లన్నీకూడా తడిసి ఉన్నాయి. ఏం చేస్తాం. నిలబడటం అలవాటేగా. వాతావరణానికి అనువుగా పాట వినిపిస్తోంది.

“వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా..
గిచ్చేగిచ్చే పిల్ల గాలుల్లారా..
కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నయ్
తీరుస్తారా.. బాధ తీరుస్తారా గాలివానా లాలి పాడేస్తారా
పిల్లపాపల వాన.. బుల్లి పడవల వాన
చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలివానతో కూడీ, వేడి వేడి పకోడి..

శ్రేయా ఘోషాల్ గొంతు శ్రావ్యంగా సాగిపోతోంది. సినిమాల్లో వర్షం పాటల దృశ్యీకరణ అదో ప్రత్యేకత.

‘వర్షం’ పేరుతో సినిమానే వచ్చింది. అందులోనే..

“ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే, చూసెళ్లిపోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే..”

‘లక్డీకాపూల్’ కండక్టర్ అరుపుతో ఉలిక్కిపడి గబగబా బస్ దిగాను. హమ్మయ్య. ఒక మజిలీ అయింది. ట్రాఫిక్ జామ్‌ల గొడవ లేకుండా నా గమ్యం చేరాలంటే మెట్రోలో వెళ్లటం బెస్ట్ అనుకొని అటుగా నడిచా. అంతలో భయంకరంగా పిడుగు శబ్దం. చిన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో అమ్మ ‘అర్జున.. ఫల్గుణ’ అనేది. ఎందుకో ఇప్పటికీ తెలియదు. ప్లాట్‌ఫామ్ మీద జనాలు బాగానే ఉన్నారు. మెట్రో రానే వచ్చింది. గబగబా ముందుకెళ్లాను. నిలబడాల్సిందే. తప్పదు. అదృష్టం.. లేడీస్ కోచ్లో చివర ఓవరగా రాడ్ పక్కనే నిల్చోగలిగాను. బయట వాన జడి. మనసులో ఆలోచనల జడి.

హిందీ సినిమాల్లో వానపాటల చిత్రీకరణ అంటే రాజ్ కపూరనే చెప్పుకుంటారు. ‘శ్రీ420’లో..

‘ప్యార్ హువా.. ఇక్‌రార్ హువా హై
ప్యార్ సే ఫిర్ క్యో దర్తా హై దిల్
కెహతా హై దిల్.. రస్తా ముష్కిల్
మాలూమ్ నహీ హై కహా మంజిల్..’ మదిలో మెదిలింది.

వానకు సంబంధించి జానపద బృందగానమైతే ‘లగాన్‌’లో జావేద్ అఖ్తర్ రాసిన పాట..

‘ఘనన్ ఘనన్ ఘనన్….
ఘనన్ ఘనన్ ఘిర్ ఘిర్ ఆయె బద్‌రా
ఘనే ఘన్ ఘోర్ కరే ఛయ్యె బద్‌రా
ధమక్ ధమక్ గూంజే బద్‌ర కె డమ్‌కె
చమక్ చమక్ దేఖో బిజురియ చమకే
మస్ ధడ్‌కాయె బదర్‌వా… మన్ ధడ్‌కాయె బదర్‌వా
మన్ మన్ ధడ్‌కాయె బదర్‌వా
కాలే మేఘా, కాలే మేఘా పానీతో బర్సావో..’

వర్షాన్ని ఆహ్వానిస్తూ ఆనందంగా పాడే పాట ఎంతో ఇంపుగా ఉంటుంది కానీ పాట చివర ఆకాశంలో మబ్బులన్నీ చెదిరిపోయి, వారి ఆశ, నిరాశకావటం ఆ వేదనకు గురిచేస్తుంది.

వాన పాటలు ఒకటా, రెండా, అనేకం ఉన్నాయి.

అన్నట్లు తెలుగు చిత్రాల్లో అద్భుత కళాఖండంగా పేరొందిన ‘మల్లీశ్వరి’ సినిమాలో, తిరణాల కెళ్లిన నాగరాజు, మల్లీశ్వరి ఇంటికి తిరుగుముఖంపట్టే సమయానికి ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటాయి. ఆ సందర్భంలో ఇద్దరూ ‘పరుగులు తియ్యాలి, గిత్తలు ఉరకలు వేయాలి.. హెరుగాలి కారుమబ్బులు.. హెూరుగాలి కారుమబ్బులు ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి…. అవిగో అవిగో.. నల్లని మబ్బులు గుంపులు గుంపులు..’ మధురంగా ఆలపిస్తారు. వాన వచ్చే ముందు ప్రకృతి అందాలను ఈ పాటలో ఎంతో అందంగా ఆవిష్కరించారు. పాట విషయం అలా ఉంచితే, ఈ వానే అసలు కథకు బీజం అని చెప్పాలి. వాన వల్లే నాగరాజు, మల్లీశ్వరి మార్గమధ్యంలో ఆగి ఓ చోట తలదాచుకుంటారు. వినోదం కోసం మల్లీశ్వరి ‘పిలచినా బిగువటరా… చెలువలు తామే వలచి వచ్చినా..’ అంటూ జావళి అభినయిస్తుంది. మారువేషాల్లో ఉన్న రాయలవారు, మంత్రి కూడా వాన కారణంగా అక్కడికే చేరి, మల్లీశ్వరి ఆట, పాటను తిలకిస్తారు, ఆలకిస్తారు. ఆమె నృత్యాన్ని ఎంతగానో మెచ్చుకుని, ఓ హారాన్ని కానుకగా ఇచ్చి, విజయనగరంలో ఏ పని కావాలన్నా తమను అడగవచ్చంటారు. నాగరాజు వారేదో కోతలు కోస్తున్నారని భావించి, మల్లికి రాణీవాసం పల్లకీ పంపించమని పదేపదే చెపుతాడు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. వానే రాకపోతే నాగరాజు, మల్లి అక్కడ ఆగేవారే కాదు. అలాగే రాయలవారు సైతం అక్కడికి రావలసిన పనే ఉండేది కాదు. అలా వాన ఘటన ఆ కథను మలుపు తిప్పింది. కర్నాటక సంగీతానికి వస్తే.. ముత్తుస్వామి దీక్షితార్ అమృతవర్షిణి రాగంలో ‘ఆనందామృతవర్షిణి’ ఆలపించి ఏడాదిగా వానల్లేని ఎట్టయిపురంలో వర్షం కురిపించారట. ఆ రాగం అంత శక్తిమంతమైందంటారు. ఇంకా విశేషం.. ఆయన ఆ కీర్తనలో ‘వర్షాయ వర్షాయ వర్షాయ’ అని పాడగానే కుంభవృష్టి కురిసిందని, మళ్లీ దాన్ని ఆపటానికి ఆయన ‘స్తంభాయ, స్తంభాయ’ అని పాడారట. వర్షం ఆగిపోయిందట. హిందుస్థానీ సంగీతంలో మేఘ మల్హర్ రాగానికి కూడా వర్షం కురిపించే శక్తి ఉందని, తాన్‌సేన్ మేఘ మల్హర్‌లో గానంచేసి వర్షాన్ని రప్పించాడని చెపుతారు.

వర్ష బీభత్సాన్ని ఎదుర్కోవటం కూడా ఆషామాషీ కాదు. ద్వాపరయుగంలో బృందావనంలో వానలు బాగా పడ్డాయని ప్రజలు ఇంద్రుడి పేరిట ఉత్సవం జరపాలనుకుంటారు. కృష్ణుడికి అది తెలిసి వానలు కురిపించి, జనులకు ఎంతో మేలు చేస్తోంది గోవర్ధన పర్వతమని, అందువల్ల ఇంద్రుడికి ఉత్సవాలు వద్దంటాడు. దాంతో ప్రజలు ఉత్సవాలు నిలిపేస్తారు. ఇంద్రుడు విషయం తెలుసుకొని, ఆగ్రహంతో వారికి తన తడాఖా చూపించాలని రెండురోజులపాటు కుంభవృష్టి కురిపిస్తాడు. దాంతో ప్రజలు, పశువులు అతలాకుతలమైతే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తిపట్టుకుని ప్రజలకు, పశువులకు ఆశ్రయం కల్పించి, రక్షించాడన్నది ఇతిహాస కథనం. అందుకే ఆయన గోవర్ధన గిరిధారి అయ్యాడు. అది చూసి ఇంద్రుడు స్థాణువయ్యాడు. అతడు బాలుడు కాడు, విష్ణువని బ్రహ్మ తెలియజెప్పడంతో ఇంద్రుడు, కృష్ణుణ్ణి మన్నించమని వేడుకుంటాడు. పురాణకాలంలో యుద్ధాల్లో వాడిన అస్త్రాల్లో వారుణాస్త్రం ఒకటి. అన్నట్లు వరుణ లింగం కూడా ఉంది. తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణలో దర్శనమిచ్చే అష్టలింగాల్లో వరుణ లింగం కూడా ఒకటి. ఇక్కడి వరుణ తీర్థంలో స్నానం చేస్తే రోగులకు వ్యాధి నివారణ అవుతుందన్నది భక్తుల విశ్వాసం.

అన్నట్లు ఋషులు ఘోర తపస్సు చేసిన సందర్భాల్లో భగవంతుడు వర్షపరీక్ష కూడా పెడతాడు. కుంభవృష్టి కురిపించినా చలనం లేకపోతే దేవుడి పరీక్షలో ఒక స్టెప్ గట్టెక్కినట్లే.

భక్తులు, వాన అంటే శంకరాభరణంలో శంకరశాస్త్రి వానలో తడుస్తూ పాడే

‘శంకరా! నాద శరీరా పరా…
వేద విహారా హరా… జీవేశ్వరా..
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా.. ధరకు జారెనా శివగంగా..
నా గాన లహరి నువ్వు మునగంగా
ఆనంద వృష్టి నే తడవంగా..ఆ..’

ఎంతటి భక్తి భావన!

వాన వచ్చేముందు, వాన పడేటప్పుడు, వాన వెలిశాక దృశ్యాలు వేర్వేరుగా ఉంటాయి. వాన వెలిసి ఆకాశాన వర్ణ మనోహరంగా హరివిల్లు విరిస్తే అదెంత అద్భుతం!

రాత్రిపూట వానలు అది వేరు సంగతి. జనమంతా నిద్రలో ఉండగా వర్షం తన పని తాను చేసుకుపోతుంది. ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు ‘రాత్రి వచ్చిన రహస్యపు వాన’ అంటూ ఓ మంచి కవిత రాశారు. వానలు ఊపందుకునే ఆషాఢంలో తెలంగాణ ప్రాంతంలో బోనాల కోలాహలం ఇంతా అంతా కాదు. అదొక పండుగ వాతావరణం. శ్రావణ, భాద్రపదాల్లో ప్రకృతి సమతుల్యంగా ఉంటే వర్షాలు బాగా కురుస్తాయి. శ్రావణం నోముల మాసం. ఇప్పుడు పట్నాల్లో నోముల హడావిడి కొంత తగ్గినా, పల్లెలలో ఇప్పటికీ శ్రావణమాసం నోములు, పేరంటాల సందడి కొనసాగుతూనే ఉంది. శ్రావణం అంటే పిల్లలు చెప్పుకునే శ్రావణ, భాద్రపదాల కథ గుర్తిస్తోంది.. ఇంతలో, ‘అగ్‌లా స్టేషన్… బాయీ తరఫ్ సే దర్వాజా ఖులేంగే..” అనౌన్స్‌మెంట్‌తో ఉలిక్కిపడి ముందుకు నడిచాను. బయటకు వచ్చేసరికి వాన వెలిసింది. గొడుగులు ముడిచిపట్టుకుని, నీళ్లల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తూ పాదచారులు. వాతావరణ సూచన అంటూ ఆ శాఖ వివరాలందించినా చాలాసార్లు ప్రకృతి నాడిని సైన్స్ పట్టుకోలేకపోతోంది. అందుకే వాన ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆగుతుందో చెప్పడం కష్టం. అందుకే ‘వానరాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియ’దని సామెత వచ్చింది. వానలో తడిస్తే జలుబు, జ్వరం వచ్చేస్తాయన్న భయంతో జాగ్రత్త పడతాం కానీ పశువులు మాత్రం పెద్దగా పట్టించుకోవు. అందుకే ‘దున్నపోతు మీద వాన కురిసినట్టు’ అంటుంటారు. అన్నట్లు గతంలో ఎంతవరకు చదువుకున్నారు అని ప్రశ్నిస్తే, ‘ఆఁ.. ఏదో వానాకాలం చదువు’ అని జవాబు చెప్పేవాళ్లు. వానాకాలం చదువేమిటో? బహుశా వానాకాల బడులు సరిగా నడవకపోవటం వల్ల పిల్లల చదువు సాఫీగా సాగదని, దాంతో పోలుస్తూ వానాకాలం చదువన్నారేమో. అయినా ఇప్పుడు కాలాలూ గతులు తప్పుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్‌లతో ఋతువులు తీరు మార్చేస్తున్నాయి. ఆయా కాలాల్లో ఆయా ప్రత్యేకతలు సలక్షణంగా ఉండాలంటే మనం పర్యావరణ హితంగా నడుచుకోవాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు సకాలంలో సరిగ్గా కురవాలి. రెయిన్ డ్యాన్స్‌లతో మస్తీ చేసుకుంటే సరిపోదు. మదిలోనూ మంచితనం వర్షిస్తూ ఉండాలి.. వర్షపు నీటిలోని ప్రతిచుక్కను నిల్వ చేసుకొని, అందరి అవసరాలు తీరేలా సద్వినియోగం చేయాలని, మూతల్లేని మ్యాన్‌హెూల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు, విద్యుత్ తీగెలకు దూరంగా ఉండాలని అందరూ గుర్తిస్తే, గుర్తుంచుకుంటే ఎంత బాగుండు….

మళ్లీ హఠాత్తుగా వానజల్లు మొదలయింది. అయితే ఆ సమయానికి యిల్లు వచ్చేయటంతో నా మనసులో అప్పటివరకు ఏకధారగా కురుస్తున్న ఆలోచనల వాన ఆగిపోక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here