మానస సంచరరే-20: మూగవైన ఏమిలే.. గుణములోన మిన్నలే!

7
6

[box type=’note’ fontsize=’16’] “ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా మనిషి మనసు జంతుకారుణ్యంతో నిండినపుడే జంతురక్షణ సాధ్యమవుతుంది” అంటున్నారు జె. శ్యామల ‘మానస సంచరరే-20: మూగవైన ఏమిలే.. గుణములోన మిన్నలే!’ కాలమ్‌లో. [/box]

[dropcap]బ[/dropcap]స్ దిగి మా ఇంటి లేన్‌లో నడక మొదలు పెట్టానో లేదో ఎక్కడినుంచో వచ్చింది పరిచిత శునకరాజం.. నా వెంటే నడవసాగింది. అది చూసి మరో రెండు కుక్కలు దాన్ని అనుసరించాయి. దాని ఫ్రెండ్స్ కాబోలు. ఈ కుక్క చాలా రోజుల్నుంచి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నాతో పాటే ఇంటివరకు వచ్చి, నేను ఇంటి దగ్గరకు రాగానే మౌనంగా వెనుతిరుగుతుంది. అదేదో బాడీగార్డ్ డ్యూటీ మాదిరి. ఈ రోజూ అంతే. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే అది వెనక్కు మళ్లింది. కానీ నా ఆలోచనలు మాత్రం దాని చుట్టే తిరుగుతున్నాయి. ఏదో మాట్లాడుతూ అన్యమనస్కంగా రొటీన్ పనులు చేస్తున్నా ఆలోచనా స్రవంతి అంతా దాని పైనే. అసలు అదేమనుకుంటోందో. పాపం మూగజీవి. నా ముఖం. మూగ ఏమిటి? దానిక్కానీ కోపమొస్తే కాలనీ మొత్తం దద్దరిల్లేట్టు మొరుగుతుంది. దాని సరిహద్దుల్లోకి కొత్త కుక్క వచ్చిందా? ‘ఎన్ని దమ్ములే నీకు? ఖబడ్డార్’ అన్న లెవెల్లో అరిచి, తోటి స్నేహిత శునకాలచేత కోరస్ ఇప్పించి నానా యాగీ చేస్తుంది. సో.. మూగ అనకూడదేమో. మాట్లాడలేదనే కానీ దానికి ఎంత తెలివి ఉంది! తెలివైన మనిషికే అది రక్షణగా ఉంటోందంటే దానిదా వీరత్వం, మనిషిదా? వీరత్వం అనుకోగానే కెఎన్‌వై పతంజలి రాసిన ‘వీరబొబ్బిలి’ గుర్తొచ్చింది. ఎంత గొప్ప రచన!

ఆలోచనల్లోనే అన్నం తినటం ముగించి పడక చేరాను. ఆలోచన ఆగితేనా.. కుక్కకు కాసింత అన్నం పెట్టి ఆదరిస్తే ఆజన్మాంతం విశ్వాసం చూపిస్తుంది. అందుకే ‘ఆత్మబంధువు’ చిత్రంలో ఆత్రేయగారు

‘అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న, రాణి మనసు వెన్న..
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు..’ పాటలో
‘కొడుకులతోపాటు రాజు కుక్కను పెంచె
ప్రేమయనే పాలుపోసి పెంపు చేసెను
కంటిపాప కంటే ఎంతో గౌరవించెను..
దాని గుండెలోన గూడుకట్టి ఉండసాగెను
తానుండసాగెను..
కూరిమి కలవారంతా కొడుకులేనురా
జాలిగుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా…కుక్క మేలురా..’ అన్నారు.

ఈ పాట ఎంతమంది శ్రోతల మనసుల్ని తాకి ఉంటుందో. పేదవాడిగా పుట్టడం కన్నా ధనవంతుల ఇంట కుక్కగా పుట్టటం మేలని కొందరు తలపోస్తుంటారు. పెంపుడు కుక్కల దర్జా చూసినప్పుడు కొంతమందికి ఆ క్షణాన అలా అనిపిస్తుంటుంది. శునకాల్లో ఎన్ని రకాలని.. ఆల్సేషియన్, పమేరియన్, జర్మన్ షెవర్డ్, బుల్ డాగ్, లాబ్రడార్ వగైరాలు కాక పోలీసుశాఖకు నేర పరిశోధనలో సహకరించే జాగిలాలూ ఉన్నాయి. మంచి తిండి పెట్టి పోషించాలే కానీ అవి వీర సైనికులే. అందుకే వాటిని ‘గ్రామ సింహాలు’ అని కూడా అంటారు. పెంపుడు జంతువుల్లో మనదేశంలో పట్టణప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేది శునకాలే. పల్లెల్లో వ్యవసాయానికి, పాడి రైతుల ఇళ్లల్లో ఆవులు, గేదెలు ఉండటం పరిపాటి. విదేశాల్లో అయితే కుక్కలు, పిల్లులు కూడా ఇళ్లల్లో పెంపుడు హాదాలో మహారాజభోగాలను అనుభవిస్తుంటాయి. వాటికి ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు, రెడీమేడ్ ఆహారం, దుస్తులు, చెయిన్లు, గాగుల్స్ వంటి షోకులెన్నో. డాగ్ షో పేరిట పోటీలు, బెస్ట్ డాగ్‌లకు బహుమతులు, సన్మానాలు ఉంటాయి. కార్లలో, బైక్స్ మీద యజమానులతో పాటు ప్రయాణిస్తూ దర్జాగా లోకాన్ని వీక్షించే వాటిని చూసినపుడు కాసింత జెలసీ కలగడం సహజం. అదే క్షణంలో మనదేశంలో పాపం ఊరకుక్కలు.. చెత్తకుండీల దగ్గర తిండి కోసం ఫైట్ చేసి, అరచి, అలసిపోయి దక్కిందే భాగ్యమనుకునే దృశ్యాలూ గుర్తుకొస్తాయి. అంచేత కుక్కల్లోనూ అన్ని కుక్కలూ, లక్కీ కుక్కలు కావన్నమాట. మనమేదో గుప్పెడు మెతుకులు పెట్టి పోషిస్తున్నామనుకుంటాం కానీ అవి మనిషికి అందించే సేవలముందు మనం చేసేది ఎంత? అందుకే గోవుల గోపన్నలో కొసరాజుగారు..

‘వినరా వినరా నరుడా.. తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా.. నాతో సరిపోలవురా..
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా..
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటికవాని పాల్జేస్తే
ఉసురుగోలుపోయి మీకే ఉపయోగిస్తున్నాను..
నా బిడ్డలు భూమి చీల్చి దుక్కిదున్నుతున్నవోయ్
నా యెరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయ్
నా చర్మమె మీ కాలి చెప్పులుగా మారునోయ్
నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్..’

“ఓస్. ఆవు అంతేకదా. లేదంటే గోమాత.. దండం పెట్టేస్తే సరి’ అనుకుంటామే కానీ ఇంతలోతుగా దాని గురించి ఆలోచిస్తున్నామా. ఇక బసవన్నలనైతే.. ఈ సిటీలో ఏడాది పొడుగునా దానిమీద రంగు వస్త్రాలు కప్పి, ఇళ్లముందు గిట్టుబాటు కాక, బస్‌స్టాపుల్లో సైతం తిప్పుతున్నారు. అతగాడికి అదొక ఆదాయవనరు. దాని ఆకలి, ఆరోగ్యం పట్టించుకున్నట్లే ఉండదు. గతంలో అయితే పల్లెల్లో సంక్రాంతి పండగ రోజుల్లో గంగిరెడ్ల వాళ్లు ఇంటింటికీ వచ్చేవారు. అతగాడు ‘అయ్యగారికి దండం పెట్టు’ అనగానే గంగిరెద్దు ఆ విన్యాసాలు చేయటం భలే సరదాగా ఉండేది.

‘నమ్మిన బంటు’ చిత్రంలో అనారోగ్యంగా ఉన్న దూడనీ వాకిట్లోంచి ఈడ్చేయమని యజమాని ఆదేశిస్తే, అది ప్రాణంతోనే ఉందంటాడు పనివాడు చంద్రయ్య. అయితే నీ ఇంటికి తీసుకెళ్లి నువ్వే బతికించుకోమంటాడు యజమాని. చంద్రయ్య కూతురు, తువ్వాయి బతుకుతుందంటుందంటుంది తండ్రి చంద్రయ్యతో. దాంతో దూడని చంద్రయ్య ఇంటికి తీసుకెళ్లారు. చంద్రయ్య కూతురు (సావిత్రి) దానికి సేవలు చేసి, అనారోగ్యాన్ని పోగొడుతుంది. చక్కని తువ్వాయిలని చూసి ఆనందంతోపాటందుకుంటుంది..

‘చెంగుచెంగున.. చెంగుచెంగునా గంతులు వేయండీ
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా.. నోరులేని తువ్వాయిలారా.. చెంగుచెంగున
రంగురంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజెపుడో
చకచకమంటూ అంగలు వేసి చేలను దున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి గోదా గింజ పెట్టేదెపుడో
ఆశలన్ని మీ మీద పెట్టుకుని తిరిగే మా వెతలడిగేదెపుడో..
పంచభక్ష్యపరమాన్నం తెమ్మని బంతిని కూర్చుని అలగరుగా
పట్టుపరుపులను వేయించండని పట్టుపట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో, గుక్కెడు నీళ్లతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ…
పగలనకుండా, రేయనకుండా పరోపకారం చేస్తారు.
వెన్ను గాచి మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బ్రతుకే లేదు..’

ఎంతో నిజం. ఎన్ని అధునాతన యంత్రాలు వచ్చినా ఇప్ప టికీ మెజారిటీ రైతులకు ఎద్దులే కుడిభుజాలు.

అన్నట్లు రొమాంటిక్ సాంగ్‌లో కూడా పెంపుడు జంతువుకు స్థానం కల్పించారు సినారె.

జీవనజ్యోతి చిత్రంలో

“ఎందుకంటే ఏమి చెప్పను
ఏమిటంటే ఎలా చెప్పను సద్దుమణిగిన ఈవేళ.. మనమిద్దరమే ఉన్నవేళ..”
అంటూ చెలిని సుముఖురాలిని చేసుకునేవేళ మ్యావ్ మ్యావ్‌మంటూ పిల్లి ప్రవేశించటంతో
“అందాల ఓ పిల్లి – అరవకే నా తల్లి
ఇపుడిపుడే కరుణించే – చిన్నారి సిరిమల్లి
క్షణము దాటిందంటే -మనసు మారునో యేమో
అంతగా పని వుంటే – ఆ పైన రావే -దయచేసి పోవే..”

అంటూ పిల్లిని బతిమాలుకుంటాడు హీరో.

మనుషులకే కాదు, దేవుళ్లకూ జంతువులు వాహనాలయ్యాయి. శివయ్యకు ఎద్దు వాహనం కాగా, ఆయన జ్యేష్ఠపుత్రుడు గణపయ్యకు మూషికం వాహనమయింది. శివుడు సర్పాన్ని మెడలో ధరిస్తే, విఘ్నేశ్వరుడు నడుముకు అలంకరించుకున్నాడు. దుర్గాదేవి పులిని, కాళికాదేవి సింహాన్ని వాహనాలుగా చేసుకున్నారు. అంతేనా… దశావతారాల్లో విష్ణుమూర్తి కూర్మావతారం (తాబేలు), మత్స్యావతారం (చేప), వరాహావతారం (పంది) ధరించాడు. శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడే కదా. బోళాశంకరుడు, గజాసురుడి కోరికపై అతడి గర్భంలోనే ఉండిపోవడంతో పార్వతీదేవి భర్త జాడ తెలియక కలవరపడి, భర్త గజాసుర గర్భస్థుండగుట తెలిసి, అతడిని రప్పించుకొను మార్గము తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించటం, ఆయన గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే యుక్తమని నందిని, గంగిరెద్దుగా అలంకరించి, గజాసురుడి వద్దకు తీసుకు వెళ్లి ఆడించి, నందితో గజాసుర సంహారం జరిపించి, శివుణ్ని రక్షించటం.. కథ తెలిసిందే.

రామాయణంలో సేతువు నిర్మాణంలో రాముడికి వానరసైన్యం ఎంతగానో సేవలందిస్తుంది. అంతేకాదు, చిన్నప్రాణి ఉడుత సైతం ఇసుక రేణువులు మోసి, భక్తిని ప్రకటించి రాముడి కృపకు పాత్రురాలు కావడం, రాముడు చేత్తో దాని వెన్ను నిమరగా, ఆయన మూడువేళ్లు అచ్చుపడ్డాయని, అందుకే ఉడుతకు చారలుంటాయని చెపుతారు. ఉడుత భక్తి గురించి రామదాసుగారు ‘పలుకే బంగారమాయెనా.. కోదండపాణి పలుకే బంగారమాయెనా..’ అనే కీర్తనలో

‘ఇరువుగ ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి..’ అంటారు.

భాగవతంలో ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం భక్తులెంతగానో మెచ్చేది. ఏనుగు నీళ్లు తాగటానికి వెళ్లటంతో, నీటనున్న మకరి (మొసలి) ఏనుగుకాలును పట్టుకోగా, ఏనుగు దాన్ని వదిలించుకోలేక శ్రీహరికి మొరపెట్టుకుంటుంది. దాంతో

‘లావొక్కింతయు లేదు, ధైర్యము
విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె
దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితపరం బెఱుంగ
మన్నింపదగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద
సంరక్షించు భద్రాత్మకా!’ అని గజేంద్రుడు, శ్రీహరిని వేడుకుంటాడు.

కరి మొరను విన్న శ్రీహరి గజేంద్రుడిని రక్షించడానికి హుటాహుటిని బయల్దేరిన తీరును పోతనగారు ఎంతో సహజంగా, రమ్యంగా వర్ణిస్తూ..

‘సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణ వనోత్సాహియై’.. అంటారు.

పూర్వం రాజులు అశ్వమేధ యాగాలు చేయడం తెలిసిందే. నేటికాలంలో గుర్రపు పందేలు ఆడటం అదీ తెలిసిందే. ఎడ్లపందాలు జరుగుతూనే ఉన్నాయి, ఏటా జల్లికట్టుమీద వివాదం తెరమీదకు రావడం, అంతలోనే అణిగిపోవడం షరా మామూలే. పూర్వం రాజుల కాలంలో చతురంగ బలాల్లో అశ్వాలు, గజాలు ఉండేవి. ఇప్పుడు కూడా సైన్యంలో అరవై ఒకటవ కావలీ రెజిమెంట్ (భారత సైన్యంలో) అశ్వాలతో కూడిందే. ఈ రెజిమెంట్ ఉత్సవ సమయాల్లో తన పాత్ర నిర్వహిస్తుంది.

ఇక ఇప్పటికీ కొన్ని పెళ్లిళ్లలో వరుడు గుర్రమెక్కి వచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గుర్రాలలో ఆట గుర్రాలు వేరు. ఇక ఆలయాల్లో ఏనుగులు దేవుడి ఊరేగింపుల్లో పాల్గొనటం తెలిసిందే. భక్తిలోనూ జంతువులూ తమకు తామే సాటి అని శ్రీకాళహస్తి చరిత్ర చెపుతుంది. అందులో సాలెపురుగుతోపాటు, పాము, ఏనుగు లింగాన్ని పూజించటంలో ఒకదానితో ఒకటి పోటీపడి ఊరిపేరుగా చిరస్థాయిగా నిలిచాయి.

దేవుళ్లలో కాలభైరవుడు, హయగ్రీవుడు కూడా ఉన్నారు. చట్టం ఎంత కూడదంటున్నా ఇప్పటికీ సర్కస్లలో ఏనుగులు తదితరాల విన్యాసాల వినోదం కొనసాగుతూనే ఉంది. భారతదేశంలోనే ఆవిర్భవించిన చదరంగ క్రీడలో ఏనుగులు, గుర్రాలు ఉండనే ఉన్నాయి. చిన్నపిల్లలకు జంతువుల అరుపులను పరిచయం చేసే పాఠం ఒకటి ఉంటుంది.

కుక్క భౌభౌ అనును.. పిల్లి మ్యావ్ మ్యావ్ అనును ఆవు అంబా అనును.. కోతి కిచకిచలాడును… పులి గాండ్రించును, సింహం గర్జించును.. వగైరా..

పిల్లలు ‘బాబా బ్లాక్ షీప్.. హావ్ యు ఎనీ ఊల్’ అని పాడే రైమ్‌లో ఆ బ్లాక్ షీప్ ఎంతో ఒబీడియెంట్‌గా

‘ఎస్సార్ ఎస్సార్ త్రీ బ్యాగ్స్ ఫుల్
వస్ ఫర్ ది మాస్టర్.. వన్ ఫర్ ది డేమ్’ అంటూ బదులివ్వటం గమ్మత్తుగా ఉంటుంది.

అన్నట్లు ఇటీవల ఓ గొర్రె, తన యజమాని హత్యకు గురైతే, నేరస్థుడిని పట్టించిన సంఘటన గొర్రె స్వామిభక్తిని, తెలివిని చాటింది.

జంతువులనే పాత్రలుగా చేసి విష్ణుశర్మ మనకు అందించిన ‘పంచతంత్రం’ కథలు ఎన్నితరాలు మారినా నిత్య నూతనాలే. హితోపదేశంలో ఓ ఆవు మేతకోసం అడవికి వెళుతుంది. పులి ఎదురై ఆకలిగా ఉంది, ఆరగిస్తానంటుంది. ఆవు తనకు కొంత సమయం అనుమతి ఇస్తే ఇంటికి వెళ్లి తన దూడకు పాలిచ్చి, తిరిగి వచ్చి ఆహారమవుతానని వేడుకోగా, పులి ముందు అభ్యంతరం తెల్సినా చివరకు మనసు కరిగి ఒప్పుకుంటుంది. ఆవు ఇంటికి వెళ్లి తన బిడ్డకు కడసారిగా పాలిచ్చి, ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు ఆహారం కావటానికి వచ్చినా, ఆవు సత్యసంధతకు మెచ్చిన పులి, ఆవును తినకుండా వదిలివేస్తుంది. తల్లి ప్రేమకు, మాటకు కట్టుబడి ఉండటానికి ఈ కథ అద్దం పడుతుంది.

రుడయార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. సినిమాగా కూడా పిల్లల్ని, పెద్దల్ని అలరించింది. డైనోసార్స్‌పై తీసిన ‘జురాసిక్ పార్క్” బ్రహ్మాండంగా హిట్టయింది. ‘స్టువార్ట్ లిటిల్’ పేరుతో ఎలుకగారి గురించి ఓ చక్కటి ఇంగ్లీష్ సినిమా వచ్చింది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ కథలు వినోదించని వారుండరు. తాబేలు-కుందేలు, చాకలి-గాడిద, సింహం-చిట్టెలుక.. కథలు ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.

‘మ్యాన్ ఈజ్ సోషల్ ఏనిమల్” అన్నారు. అసలు వానరుడి నుంచే నరుడొచ్చాడనే థియరీ కూడా ఉంది కదా. కోతులంటే.. వాటి చేష్టలంటే మనకెంతో ఇష్టం. నిజానికి మనిషి మనుగడకు జంతువులనే ఆధారం చేసుకున్నాడు. తనకున్న తెలివితేటలతో వాటి పాలను ఆహారంగా తీసుకోవటం, వాటిని ఎక్కి ప్రయాణించడం, వాటితో భూమిని దున్నించడం, వాటితో బరువులు లాగించడం, వాటి మాంసాన్ని ఆహారంగా స్వీకరించడం, వాటి చర్మం, కొమ్ములు – వగైరాలతో రకరకాల వస్తువులు తయారుచేయటం ఇలా ఎన్నెన్నో. భూతదయ ఉండాలని, జంతువుల పట్ల కారుణ్యంతో మెలగాలని పెద్దలు ఏనాడో చెప్పినా, స్వార్ధంతో జంతువుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంతో ఎన్నో జంతువులు బాధలకు గురవుతున్నాయి. కొన్ని జంతువుల ఉనికే మాసిపోయింది, పోతోంది. జంతువుల్లో సాధు జంతువులు, క్రూర జంతువులు ఉన్నాయి క్రూర జంతువులయినా వాటి జోలికి మనం వెళితేనే అవి మనకు ప్రమాదం కలిగిస్తాయి. ఒక్కోసారి మావటినే మట్టు పెట్టిన ఏనుగు వంటి వార్తలు వింటుంటాం. కానీ అది వాటి మానసిక స్థితి లోపం కావచ్చు. దాన్ని గుర్తించలేనప్పుడు జరిగే ప్రమాదాలవి. జంతువులలో నేలమీద ఉండేవి, నీళ్లలో ఉండేవి, పాకేవి ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలున్నాయి. ఈమధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు పెరుగుతున్నారు. అయితే మాంసాహారమే లేకుండా కేవలం మొక్కలు, చెట్లనే ఆహార వనరులుగా చేసుకొంటే ప్రపంచ జనాభాకంతటకీ ఆ ఆహారం ఎంతోకాలం సరిపోయే ప్రశ్నే ఉండదన్నది కొందరి వాదన. ఆహారం సంగతి అటుంచితే మాట, బుద్ధి ఉన్న మానవుడు తానే అధికుడననుకుంటూ జంతువులను నిర్దయగా చూడటం పరిపాటిగా ఉంది. ‘కుక్క తోక వంకర’, ‘కనకపు సింహాసనమున శునకము’ వంటి పదప్రయోగాలతో వాటిని కించపరుస్తుంటాం. జీవవైవిధ్య ప్రాధాన్యతను గుర్తించి ఇటీవలి సంవత్సరాలలో వన్యప్రాణి సంరక్షణకు కొంతవరకు కృషి జరుగుతోంది. జంతుప్రదర్శనశాలలే కాక, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా మనిషి మనసు జంతుకారుణ్యంతో నిండినపుడే జంతురక్షణ సాధ్యమవుతుంది. అసలు జంతువుల ఆరోగ్యం విషయానికి వాటికి అందిస్తోన్న ఆరోగ్య సేవలు నామమాత్రమే. పశు వైద్యశాలలు.. అన్నిరకాల జంతువులకు వైద్యాన్ని అందించగలుగుతున్నాయా? ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో కేవలం ఏనుగుల కోసమే ఓ వాటర్ క్లినిక్ ఏర్పాటయిందన్న న్యూస్ వచ్చింది. అంతేకాదు పెంపుడు జంతువుల విషయంలో తప్పిపోయినా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ నమోదు చేయలేమట. మనుషులకే దిక్కులేదు, జంతువులకా అని నవ్వేవాళ్లూ ఉంటారు కానీ ఎందుకు చేయకూడదనే కోణంలో ఆలోచించవచ్చు కదా. తాజాగా మంచిర్యాలలోని ఓ వ్యక్తి తమ పెంపుడుకుక్క కనబడలేదంటూ దాని ఫొటోతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, ఎవరికైనా కనిపిస్తే తనను సంప్రదించమని చిరునామా ఇచ్చాడు. నిజమైన జంతుప్రేమికుడు. హృదయం ఉన్న జంతువులకు మాట లేకున్నా పోయేదేం లేదు కానీ, ఆలోచనా శక్తి ఉండి, వాక్కు వచ్చిన మనిషికి హృదయం లేకపోతే అది అతడికే తీరని కష్టనష్టాలను తెచ్చి పెడుతుంది. ఎందుకంటే ప్రకృతి సమతుల్యతకు జీవ వైవిధ్యం తప్పనిసరి…

అంతలో ఏమైందో కానీ దూరంగా కుక్కలన్నీ ఒక్కసారిగా భౌభౌలు మొదలెట్టాయి. ‘కుక్కల అసెంబ్లీ కావచ్చు’ అనుకొని నాలో నేను నవ్వుకుంటుండగానే హఠాత్తుగా ‘శాండియాగో జూ’ నా మదిలో మెదిలింది. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన జూ అది. దాని విశేషాలు వృత్తిపరంగా ఒకటి, రెండుసార్లు రాశాను కూడా. కానీ శాండియాగో జూను స్వయంగా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అయితే కొద్దికాలం కిందట చూడటం తటస్థించింది. చాలా పెద్ద జూ. ఆయా జంతువులకు కావలసిన సహజసిద్ధ వాతావరణం కల్పించటంలో వాళ్లు సిద్ధహస్తులని చెప్పాలి. జూ నిర్వహణ ఎంతో బాగుంది. ముఖ్యంగా ఆయా జంతువుల గురించి వివరించి చెప్పే సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. బస్సులో ఓ రౌండ్ చూసినప్పుడు డ్రైవర్ ఓ గైడ్‌లాగా ఎంతో చక్కగా ఒక్కో జీవి గురించి మొక్కుబడిగా కాదు, ఇష్టంగా, వచ్చిన వారికి కూడా వాటిపట్ల ఇష్టం పెరిగేలా చెప్పటం నాకెంతో నచ్చింది.. అనుకుంటుండగానే మదిలో తిరుగుతున్న శాండియాగో జూ రీలును తుంచేస్తూ, నా ఆలోచనలకు తెర దింపుతూ నిద్ర ముంచుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here