మానస సంచరరే-26: మదిలో దీపం వెలిగించు!

4
7

[box type=’note’ fontsize=’16’] “ఈ చరాచర ప్రపంచంలో సకల ప్రాణికోటికి సిసలైన బంధువు సూర్యుడు. ప్రత్యక్షదైవం” అని సూర్యుడి గురించి చెబుతూ, “పేరుకే అమావాస్య కానీ, అంతటా వెలుగులే” అంటున్నారు దీపావళి గురించి జె. శ్యామల. [/box]

[dropcap]ఆ[/dropcap]దివారం.. ప్రశాంత ప్రభాత సమయం.

టీ కప్పుతో వరండాలో బైఠాయించాను. దూరంగా చెట్ల మధ్యనుంచి తొంగిచూస్తున్న సూర్యుడు. చూడగానే మనసంతా ఆకాశమై.. ఆహ్లాదం, ఆనందం విడిది చేశాయి. మొదట అర్ధ సూర్యుడిగా దర్శనమిచ్చి, క్రమంగా చెట్ల మీదికొచ్చి నిండు సూర్యుడిగా, ధగధగా.. దర్జాగా.. అరుణారుణ కాంతులతో అదరగొడుతున్నాడు. ఆకాశానికే గొప్ప అలంకారంగా భాసిస్తున్నాడు అనంత తేజోమూర్తి. గత రెండు మూడు రోజుల తర్వాత ఈరోజే సూర్యుడు ఎప్పటివలె ‘ఎవర్ రెడ్’గా కనిపిస్తున్నాడు.

ఎప్పుడో చదివిన ‘వెన్ ది సన్ అప్పియర్స్ ఇన్ ది ఈస్ట్’ .. ఇంగ్లీష్ పొయమ్ గుర్తొచ్చింది..

ఐ మేక్ ఫ్రెండ్స్ విత్ మై పొయట్రీ

ఐసీ ఎ గోల్డెన్ డిస్క్

రైట్ ఎబౌ ది బ్లూ సీ

ఎ రెడ్ హైబిస్కస్ ఈజ్ స్మైలింగ్ ఎట్ మి

ఈజ్ దేర్ ఎనీబడీ ఆన్ ఎర్త్, ఓ సన్

హు డజన్డ్ లాంగ్ ఫర్ యువర్ స్మైల్?

నో, నోబడీ

ఎవిరీబడీ వాంట్స్ యువర్ స్మైల్

ఐటూ వాంట్ యు స్మైల్

అండ్ సమ్ థింగ్ మోర్

ఐ వాంట్ టు బౌ టు యు

విత్ మై హార్ట్స్ అడొరేషన్..

పొయట్ శ్రీ చిన్మయ్ ఎంత బాగా రాశారు!

అలా సూర్యోదయ సౌందర్యాన్ని వీక్షిస్తుండగానే మొబైల్ మోగింది. లేచి చూస్తే సూర్యారావుగారి ‘శుభోదయ’ సందేశం. నేనూ బదులిచ్చి నా రొటీన్‌కు ఉపక్రమించాను. అయినా మనోవీధిలో ఆలోచనంతా సూర్యుడి చుట్టూనే పరిభ్రమించడం మొదలు పెట్టింది..

ఈ చరాచర ప్రపంచంలో సకల ప్రాణికోటికి సిసలైన బంధువు సూర్యుడు. ప్రత్యక్షదైవం, లోకబాంధవుడు.. కర్తవ్యపాలనలో సూర్యుడి తర్వాతే ఎవరైనా.

ఆదిదేవ

నమస్తుభ్యం ప్రసీదే

మమ భాస్కర

దివాకర నమస్తుభ్యం

ప్రభాకర నమస్తుతే

సప్తాశ్వ రథమారూఢం

ప్రచండం కశ్యపాత్మజం,

శ్వేతపద్మధరం దేవం

తం సూర్యం ప్రణమామ్యహం

ఇది ఆదిత్య హృదయం (సూర్యాష్టకాన్ని)లోది. ప్రభాత సమయంలో పఠిస్తారు. ఆదిత్య హృదయం పఠనం సూర్యుడికి మేలుకొలుపు, స్వాగత గీతం.

లోహితం రథమారూఢం

సర్వలోక పితామహం మహాపాపహరం దేవం

తం సూర్యం ప్రణమామ్యహం..

వెలుగుల దైవాన్ని సర్వలోకాలకు పితామహుడుగా భావించడం ఎంతో సముచితంకదా. చీకటిని చీల్చే శూరుడు సూర్యుడు అనుకుంటుంటే ఓ మంచి పాట గుర్తొచ్చింది..అది..

దినకరా.. దినకరా..

హే శుభకరా.. దేవా.. దీనాధారా

పతిత పావన మంగళ దాత

పాపసంతాప లోకహితా

బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప

వివిధ వేద విజ్ఞాన నిధాన

వినతలోక పరిపాలక భాస్కర..

ప్రత్యక్షదైవంగా భాసిల్లే భాస్కరుడికి కోణార్క్‌లో ఓ దేవాలయం, అరసవిల్లిలో ఓ దేవాలయం ఉండడం తెలిసిందే.

ఉత్తరభారతంలో ఏటా నాలుగు రోజుల పాటు జరుపుకునే ఛాత్ పండుగలో లోకానికి వెలుగునిచ్చి, సకల జీవుల ఉనికికి ఊతమిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజలు చేస్తారు. అభ్యంగన స్నానాలు చేసి, ఉపవాసాలు ఉండి, నదినీటిలో నిలుచుని ఉదయించే సూర్యుడికి, అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. ఇక మాఘమాసంలో వచ్చే రథసప్తమిని వైవస్వత మన్వాది అని కూడా అంటారు. అదే సూర్యజయంతి కూడా. అయితే రథసప్తమిగానే ప్రాచుర్యం పొందిన ఈ పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకోవడం తెలిసిందే. సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అవి ఏడు కిరణాలను సూచిస్తాయి. అయితే రథ చక్రం మాత్రం ఒకటే. అదే కాల చక్రం. ఆరు ఆకులుంటాయి. అవి ఆరు రుతువులకు సంకేతాలు. సూర్యుడి రథ సారధి అనూరుడు. ఊరువులు లేనివాడు. అయితేనేం సూర్యరథాన్ని నడిపే మహత్తర కర్తవ్యాన్ని నిరంతరాయంగా నిర్వర్తిస్తున్నాడు.

ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత. సైన్స్ దృష్ట్యా కూడా ‘డి’ విటమిన్ మనకెంతో ముఖ్యం. మరి అది పుష్కలంగా ఇచ్చేది సూర్యభగవానుడే.

అంతేకాదు ‘సూర్య నమస్కారాలు’ చేయటం గతంలో ఎక్కువగా వాడుకలో ఉండేది. శరీర దారుఢ్యతకు అవి ఎంతగానో ఉపకరించేవి. అంతేకాదు పెద్దగా పూజలు, పునస్కారాలు చేయనివాళ్లు కూడా సూర్యుడికి నమస్కరించాకే భోజనం చేయడం పరిపాటిగా ఉండేది. బాగా ముసురుపట్టి సూర్యుడు కనిపించకపోతే అదొక దుర్దినంగా భావించడం మామూలే. ఆదిత్యుడు, భాస్కరుడు, రవి, దినకరుడు, దివాకరుడు, మార్తాండుడు, ఇనుడు, సూర్యుడు… ఇలా ఎన్నో పేర్లతో అలరారుతున్నాడు. ఏదైనా విషయం ఆలస్యంగా అర్థం చేసుకుంటే ‘ఇప్పటికి లైటు వెలిగింది, ఇప్పటికి బుర్ర వెలిగింది’ అనడం పరిపాటి.

సూర్యుడు అఖండ, అమేయ తేజారాశి. సూటిగా చూడనైనా చూడలేం. ఈ సందర్భంలో భారతంలోని కుంతీదేవి గుర్తుకొస్తోంది. కుంతి, శూరసేనుడి కుమార్తె. అయితే ఆమె తండ్రి ఆమెను పిల్లలు లేని కుంతిభోజుడికి పెంచుకోవడానికి ఇస్తాడు. అలా ఆమె కుంతిగా పేరొందింది. ఓసారి దూర్వాసుడు రాగా, కుంతి ఎంతో భక్తిశ్రద్ధలతో అతడికి సేవలందించింది. అందుకు మెచ్చి దూర్వాసుడు కుంతికి ఓ మంత్రం చెప్పి, అది పఠించి కోరుకున్న దైవాన్ని తలచుకుంటే, ఆ దైవం ప్రత్యక్షమై సంతానాన్ని ప్రసాదిస్తాడని వరమిచ్చాడు. కుంతికి ఆ వరాన్ని పరీక్షించాలనే కుతూహలం మొదలైంది. ఆమె మదిలో వెంటనే మార్తాండ తేజుడు సూర్యుడు మెదిలాడు. మంత్రం పఠించింది. ఇంకేముంది.. సూర్యుడు ప్రత్యక్షమై ఏం కావాలని ప్రశ్నిస్తే, ఆ తేజోమూర్తిని చూసి నివ్వెరపోయి, మూగబోయింది. సూర్యుడు ఆమెకు ఓ బిడ్డను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఆ బిడ్డే సహజ కవచ కుండలధారి కర్ణుడు. కుంతి మదిలో సూర్యుడు మెదలడానికి కారణం సూర్యుడి తేజోమయరూపమే.

ఇక రామాయణంలో హనుమ, బాల్యంలోనే భానుడిపట్ల ఆకర్షితుడయ్యాడు. ఎర్రని, గుండ్రని రవిబింబాన్ని ఫలమని భ్రమించి, అందుకోవాలని – పైకెగిరి వెళ్లాడు కపీశుడు. తన దరికి నిర్భయంగా దూసుకువస్తున్న బాలహనుమను చూసి సూర్యుడు భయంతో అరవడం తక్షణం ఐరావతంపై ఇంద్రుడు అక్కడకు వచ్చాడు. ఐరావతాన్ని చూసిన హనుమ అదొక ఆటవస్తువనుకొని ఆకలి మరచి ఐరావతం వెంటపడటం చూసి ఇంద్రుడు అతణ్ని వారించినా వినకపోవడంతో వజ్రాయుధంతో హనుమను తోశాడు. హనుమ ముఖానికి వజ్రాయుధం తగలటం.. తండ్రి వాయుదేవుడు హనుమను రక్షించి, పట్టుకెళ్లడం.. ఆ తర్వాత ఇంద్రుడు, సూర్యుడు కూడా హనుమకు వరాలివ్వడం తెలిసిందే.

ఒక్కొక్కరిని ఒక్కో రకంగా భ్రమింపజేసే లక్షణం సూర్యుడిలో ఉందని వివరిస్తూ పోతన మహాకవి భాగవతంలో ఓ చక్కని పద్యాన్ని అందించారు. అది..

ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కక్కడై తోచు పో

లిక నేదేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్నజ

న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుడై యొప్పుచునుండు నట్టి హరినే బ్రార్ధింతు శుద్ధుండనై!..

అంటారు.

సూర్యుడి వెలుగు వింతలు ఒకటా, రెండా.. ఆ వెలుగు ప్రసరించే తీరును బట్టి, ప్రాంతాన్ని బట్టి వివిధాలుగా గోచరిస్తుంది. ఆరుబయట చూసే వెలుగు, ఇళ్లలోకి ప్రసరించే వెలుగు, తలుపులన్నీ మూసినా, తలుపు సందుల్లోంచి, చిన్ని కన్నాల్లోంచి దూసుకొచ్చే కాంతి.. ఇలా రకరకాలు.

ఉదయాన్నే తూరువు ఇంటినుంచి పయనం మొదలెట్టే సూర్యుడు, అలా అలా సంచరించి సాయం సమయాన పడమటింటికి చేరుతాడు. అదే సూర్యోదయం, సూర్యాస్తమయం. రెండూ అద్భుత దృశ్యాలే. ప్రభాత సమయాన కొండల వెనుక నుంచి తొంగిచూస్తూ మెల్లగా పైకి చేరి ప్రత్యక్షమయ్యే ప్రభాకరుడు, సాయంత్రాన ఏ సముద్రం ఒడ్డునో చూస్తుంటే మెల్లగా కొద్దికొద్దిగా మాయమయ్యే సూర్యబింబం దృశ్యాలు ఎంత మనోహరాలు! తూర్పుదేశాల్లో అస్తమించే సూర్యుడు పశ్చిమదేశాల్లో ఉదయిస్తాడు. అక్కడ కర్తవ్యపాలన కాగానే అస్తమించి, మళ్లీ తూర్పుదేశాల్లో ఉదయస్తాడు. అందుకే మనకు రాత్రయితే, అమెరికాలో పగలు, మనకు రాత్రయితే వారికి ఉదయం.

చలికాలం నీరెండలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది.

గోరువెచ్చని సూరీడమ్మా

పొద్దుపొడుపులో ఉన్నాడమ్మా

వద్దన్నా.. రావద్దన్నా..

గుండెలో గుడిసె వేసి అది గుడిగా చేసి

ఆ గుడిలో దాగున్నాడమ్మా

మిట్టమధ్యాహ్నం నడినెత్తిన వచ్చాడు..

ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు

ఇనకుండా పోతుంటే అరిచరిచి పిలిచాడు…

పిలిచిపిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు

ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు

ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంట

నే తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంట..

పొద్దుగూకే యేళ ఎదురుగా వచ్చాడు…

ఎనుతిరిగి పోతుంటే ఎనకెనక పిలిచాడు

పోని అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు..

దాసరిగారి వైవిధ్య కలానికి ఇదొక ఉదాహరణ.

అలాగే ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలో మనమరాలు, మనసైన బావ ఆ ఉదయానే వస్తున్నాడని తెలిసి ఎప్పుడెప్పుడొస్తాడా అని ఆరాటపడటం చూసిన అమ్మమ్మ భానుమతి ఓ చక్కటి పాటందు కుంటుంది. అది..

‘శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో..

మా చిలకమ్మ బులపాటమూ చూసిపో.. అని.

మనవరాలు తక్కువ తిన్నదా?

‘శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో

మా అమ్మమ్మ ఆరాటమూ చూసిపో, చూసి పో..‘ అంటూ మనవడి రాక కోసం ఆమే ఆరాటపడుతోందని తిప్పికొడుతుంది.

మేలుకొలుపు పాటలో మనమరాలి ఇలా ఆరాటాన్ని ఉబలాటాన్ని జతచేసిన గీత రచయిత చతురత ఎంత గొప్పది!

మనిషి జీవితంలో అన్ని ఉదయాలూ ఒక్కలా ఉండవు. ఒక్కో ఉదయం మరీ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే..

‘ఈ ఉదయం.. నా హృదయం

పురులు విరిసి ఆడింది.. పులకరించి పాడింది..

పడుచుపిల్ల పయ్యెదలా పలుచని వెలుగు పరచినది..‘ అంటూ ఆత్రేయగారు ‘కన్నె మనసులు’ చిత్రంలో ప్రేమికుడి భావుకతకు అద్దంపట్టే పాటనందించారు.

‘మనుషులు మారాలి’ చిత్రానికి శ్రీశ్రీ గారు తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం… హృదయగానం..‘ అంటూ ఓ మధురగీతాన్ని రచించారు. తూరువుకు ఆ ‘వన్నె’ చిన్నెలన్నీ సూరీడు ఇచ్చినవే కదా.

గుంటూరు శేషేంద్ర శర్మగారు ‘మండే సూర్యుడు’ అని కవితా సంకలనం వెలువరించారు. దాశరథి సైతం తన కలంతో ‘తిమిరంతో సమరం’ చేశారు. అన్నట్లు నెల్సన్ మండేలా ‘నల్లజాతి సూర్యుడు’గా జగద్విఖ్యాతి చెందారు.

ఇదంతా ఓ ఎత్తయితే సైన్స్ చెప్పే విజ్ఞానాంశాలు మరో ఎత్తు. క్రీ.పూ. నాలుగువందల యాభైలో అనక్సా గోరస్ తొలిసారిగా సూర్యుడు ఓ నక్షత్రమని పేర్కొన్నాడు. సూర్యుడి వయసు నాలుగున్నర బిలియన్ సంవత్సరాలు. సౌరవ్యవస్థలో సూర్యుడి పరిమాణమే పెద్దది. మిగిలిన నక్షత్రాల కంటే సూర్యుడే భూమికి దగ్గర. సూర్యుడు ఓ వాయుగోళం. అందులో తొంభై ఒక్క శాతం హైడ్రోజన్, దాదాపుగా ఎనిమిది శాతం హీలియం, ఒక శాతం ఇతరాలు ఉన్నాయట. అన్నట్లు నేటి ఆధునిక క్యాలెండర్ సౌరమానం ప్రకారమే రూపొందుతోంది. సూర్యుడి ఉష్ణశక్తి (సోలార్ పవర్) నేడు మనకు గొప్ప ఇంధనశక్తిగా అందుబాటులోకి వస్తోంది. సోలార్ పవర్‌తో లైట్లు, సోలార్ కుక్కర్లు, సోలార్ గీజర్లు… ఇలా ఎన్నెన్నో. ఇదంతా ప్రకృతి సిద్ధమైన వెలుగు గురించి. మరి మనిషి సృష్టించిన వెలుగుల మాటో! థామస్ అల్వా ఎడిసన్ ‘బల్బు’ ను ఆవిష్కరించి కొత్త వెలుగునందించాడు. అంతకుపూర్వం నూనెతో, వత్తులతో దీపాలు, లాంతర్లు, చిమ్నీలు, కాగడా వెలుగులు, కొవ్వొత్తులు మాత్రమే ఉండేవి. మానవుడు తన మేధతో విద్యుత్ దీపాలు, బ్యాటరీ లైట్లు, క్రమంగా ఎల్‌ఇడి లైట్లు, సోలార్ లైట్లు.. ఇలా ఎన్నెన్నో కనుగొన్నాడు.. అనుకుంటుండగానే టీ.వీ.లో ‘దీపావళి ధమాకా’ అంటూ ఓ ప్రకటన వినిపించింది. దాంతో వెలుగుల పండుగ రాబోతోందని గుర్తొచ్చింది. అమావాస్య చీకట్లను తరిమి కొడుతూ దీపాలన్నీ ధీరుల్లా ప్రజ్వలించే ‘దీపావళి’ పండుగ అంటే పిల్లలు, పెద్దలు కూడా ఇష్టపడతారు. పేరుకే అమావాస్య కానీ, అంతటా వెలుగులే. అందుకే ఓ చిత్రంలో మల్లెమాల గారు

వెన్నెల రోజూ, ఇది వెన్నెల రోజు

అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు

దీపావళి రోజు.. దీపావళి రోజు…

మింటనున్న తారకలు ఇంటింట వెలిగే రోజు..

అని ఓ చక్కటి పాటను రాశారు. చంద్రుడు వెన్నెల వెలుగులు విరజిమ్మినా సూర్యకిరణాల ముందు తగ్గాల్సిందే. ఎందుకంటే సూర్యుడు స్వయం ప్రకాశకుడు. మరి వెన్నెల వెలుగో.. అది ప్రత్యేకమైంది. అందులో వేడి, తీక్షణతలుండవు. వెన్నెల వెలుగు చల్లగా, హాయిగా ఉంటుంది.

దీపావళి పండుగకు నేపథ్యంగా ఎన్నో పురాణగాథలున్నాయి. శ్రీరాముడు వనవాసం ముగించుకొని, అ యోధ్యకు తిరిగిరాగా, ప్రజలు సంతోషంతో నగరమంతా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారని, అప్పటినుంచే దీపావళి పండుగ వాడుకలోకి వచ్చిందని ఓ కథనం. మరోకథనం ప్రకారం నరకాసురుడనే రాక్షసుడు, తనను కన్నతల్లి తప్ప మరెవరూ సంహరించలేరనే వరం ఉందన్న గర్వంతో లోక కంటకుడిగా మారడం, అతడి నుంచి తమను రక్షించమని ప్రజలు దైవాన్ని వేడుకోవటంతో శ్రీకృష్ణుడు నరకాసుర వధకు బయల్దేరుతాడు. సత్యభామ కూడా వస్తుంది. కొంత తడవు యుద్ధం జరిగాక, కృష్ణుడు గాయపడటంతో సత్యభామే పూనుకొని అతడిని సంహరిస్తుంది. అలా నరకుడి పీడ వదలటంతో పురప్రజలు పండగచేసుకున్నారని, నాటి నుంచి దీపావళి ఆరంభమైంది. ఏ కథనమైనా, చెడు పై మంచి సాధించిన విజయానికి గురుతుగా జరుపుకునే పండుగనే చెపుతుంది. అసలు దీపారాధన సంప్రదాయం అలనాటి నుంచే ఉంది. ఏ కార్యక్రమం జరిగినా ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేయడం మన సంప్రదాయం. ఇక దీపావళి పండుగ రోజున చెప్పనే అక్కర్లేదు. ఎక్కడ చూసినా కొలువుతీరిన దీపాలే దర్శనమిస్తాయి. అది చీకటి వెలుగుల సమ్మిళిత సమయం..వెలుగులదే పైచేయిగా తోచే సందర్భంఆ చీకటి వెలుగులు, మానవ జీ వితంలోని కష్టసుఖాలకు ప్రతీకలని భావించుకోవచ్చు. అందుకే ఓ సినీకవి

చీకటి వెలుగుల రంగేళి

జీవితమే ఒక దీపావళి,

మన జీవితమే ఒక దీపావళి

అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల

వెలిగించు దీపాలవెల్లిఅన్నాడు.

ఈ దీపం జ్ఞానానికి సంకేతం. అంధకారం అజ్ఞానికి సంకేతం. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించుకోవటానికి జ్ఞానదీపాలు వెలిగించుకోవాలి. భౌతికంగా చుట్టూ ఎంత వెలుగు ఉన్నా, మనసులో వెలుగు లేకుంటే ఆ మనిషి అజ్ఞానాంధకారంలో ఉన్నట్లే. అందుకే అహంకారం, స్వార్థం, అసూయల వంటి చెడు లక్షణాలను వీడి, మమకారం, నిస్వార్ధం, సమత వంటి మంచి లక్షణాలను ప్రోదిచేసుకొని ఎద లోపల వెలుగు నింపుకోవాలి. ‘నీలో దీపం వెలిగించు.. నీవే వెలుగై వ్యాపించు’ లలిత గీతం స్ఫురణకు వచ్చింది. కష్టాలనే చీకట్లను ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల, కృషి ఆయుధాలుగా చేసుకొని అధిగమించాలి. ‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోక, ప్రయత్నించి ఓ చిన్ని దీపాన్ని వెలిగించు’ అన్నారు పెద్దలు.

దీపం జ్యోతి పరబ్రహ్మ

దీపం జ్యోతి మహేశ్వర

దీపేన సాధ్యతే సర్వం

సంధ్యాదీపం నమోస్తుతే….

అంతలోనే ‘ప్రమిదలమ్మా..ప్రమిదలు’ కేక వినపడటంతో వెలుగుల ఆలోచనలను వెనక్కు నెట్టి ప్రమోదాన్నిచ్చే దీపకాంతులకోసం, కొత్త ప్రమిదలు కొందామని బయటకు నడిచాను. బండి నిండా రకరకాల ప్రమిదలు.. కళాత్మకంగా.. కనువిందుగా. నచ్చినవి కొని, సూరీడు చురుక్కుమనిపిస్తుండగా లోపలకు నడిచాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here