[box type=’note’ fontsize=’16’] “కాలం మహత్తరమైంది. మనిషికి కాలమే నేస్తం. రేపు మనకోసం ఏం దాచి ఉంచిందో అన్న ఆశ.. మనిషి ఉత్సాహంగా జీవించటానికి ఊతమిస్తుంది” అంటూ పాఠకులని కాలయాత్ర చేయిస్తున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]’డి[/dropcap]యర్ డిసెంబర్! అన్ని నెలలూ ఒక ఎత్తు. నువ్వొక ఎత్తు. నువ్వొచ్చావంటే ఎక్కడలేని బెంగ పుట్టుకొస్తుంది. అప్పుడే సంవత్సరమయిపోయిందే, ఏం చేశాం, ఎంత సాధించాం. 2019లో ఫలాని రాశివారికి ఏవో అద్భుతాలు జరుగుతాయని యు ట్యూబ్‌లో తెగరాశారు. తీపికబుర్లను నమ్మని మనసుంటుందా? రోజులు గడిచేకొద్దీ ‘అంతా భ్రాంతియేనా..’ మనసు మూల్గటం మొదలైంది. ఆలస్యాలు, అవరోధాలు షరా మామూలే. ఆఫీసుకు తయారవుతున్నా మనోభాషణం కాలంతో పోటీపడుతూ సాగుతోంది. బాబోయ్… టైమ్ దాటిపోతోంది. ఇక్కడా మళ్లీ కాలమే ప్రత్యక్షమవుతోంది. బస్టాప్‌కు చేరుకుంటుండగానే నేనెక్కాల్సిన బస్సు వెక్కిరిస్తూ వేగంగా వెళ్లిపోయింది. ‘ప్చ్’ అనుకొని ‘అయినా అది బాగా రష్‌గా ఉంది. చూద్దాం, బ్రేవో’ అనుకుని అలాగే నిలుచుంటే కాలం నిజంగానే కరుణించి ఖాళీ ఎ.సి.బస్సును నా కాళ్లముందే ఆపింది. ‘చిత్రం భళారే విచిత్రం.. నే పరుగెత్తకనే బస్సు వచ్చి నాముందు నిలుచుటేమి చిత్రం’ అనుకుంటూ బస్సెక్కేశాను. సీట్లో బైఠాయించి కాలయంత్రం.. అదే గడియారం వంక చూసుకున్నా. ఫర్వాలేదు. ఓ పావుగంటే ఆలస్యం. బస్సెక్కాక ఇక దాని ఇష్టం. ఎప్పుడు చేర్చితే అప్పుడు. అంతలోనే ఓ మంచి పాట వినిపించింది.
‘కదిలే కాలమా.. కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక.. కళ్లార చూడవమ్మా..
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే..’
ఆశే కానీ కాలాన్ని ఎవరు పట్టి ఉంచగలరు.
‘కాల హరణమేలరా హరే సీతారామా
కాలహరణమేల సుగుణజాల కరుణాలవాల…
చుట్టిచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి
భువిని పుట్టగానే పదములు పట్టుకున్న నన్ను బ్రోవ…
కాలహరణమేలరా..
త్యాగరాజు శుద్ధసావేరిలో ఎంతో ఆర్తిగా శ్రీరాముడిని అడిగాడు.
‘నన్ను కాలం తప్ప ఏదైనా అడుగు ఇస్తాను. కాలం మాత్రం నా దగ్గర లేదు’ అంటాడు నెపోలియన్. ఎంతో వాస్తవం. ఒకరికివ్వడానికే కాదు, మనకు మనకే కాలం ఉండదు. గతించిన కాలాన్ని ఎవరూ వెనక్కు తేలేరు. కాల స్వరూపం- భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్ కాలం. అయిపోయిన భూతకాలంతో నాకేంటి పని అని అనుకోవటానికి లేదు. భూతకాలం పునాదుల పైనే వర్తమానం నిలిచేది. వర్తమానం పైనే భవిష్యత్తు నిలిచేది. భూతకాలాన్ని గురించిన ఆలోచన శుద్ధదండగ అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కానీ నిన్నటి జాడే నేటి నడకకు ఆధారం.
ఇక ఇతిహాసాల ప్రకారమయితే ఉన్నవి నాలుగు యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృత యుగానికే సత్యయుగమని పేరు. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచిందట. త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం మూడు పాదాల మాత్రమే నడిచింది. ద్వాపరయుగం వచ్చేసరికి ధర్మం రెండుపాదాలకు తగ్గిపోయింది. ఇక కలి.. కల్యంతే కలహన్ కుర్వన్త్యస్మిన్ ఇతి కలిః – అంటే పరస్పరం కలహించుకునే కాలం.
అదేం చిత్రమో కానీ త్రేతాయుగానికి చెందిన రామాయణంలో.. కైకేయి, రాముడిని పధ్నాలుగేళ్లు వనవాసం పంపాలంటుంది, ద్వాపరయుగానికి చెందిన మహాభారతంలో పాండవులకు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం విధిస్తారు. రెండింటిలోనూ బహిష్కారం పదునాలుగేళ్లే. చరిత్రలోకి చూపుసారిస్తే చరిత్ర పూర్వ యుగం (ప్రీ హిస్టారిక్), కంచుయుగం, ఇనుపయుగం.. కాస్మొలాజికల్,
జియొలాజికల్, ఏంధ్రాపాలజికల్, హిస్టారికల్.. మానవ నాగరికత పుట్టుక.. పరిణామాలు. మోడరన్ హిస్టరీలో యంత్ర యుగం, అణుయుగం, రాకెట్ యుగం, సమాచార (ఇన్ఫర్మేషన్) యుగం. ఇవిగాక చరిత్రలో జరిగిన అతి పెద్ద ఘటనలను కొండగుర్తులుగా చెపుతూ మొదటి ప్రపంచయుద్ధ కాలం, రెండో ప్రపంచయుద్ధ కాలం అంటారు. అలాగే పేరొందిన రాజుల పాలనా కాలాలు. అక్బర్, విక్రమాదిత్యుడు, సముద్రగుప్తుడు, శ్రీకృష్ణదేవరాయలు.. విక్రమాదిత్యుడు, శాలివాహనుల పేరుమీదైతే శకాలే రూపొందాయి. కాలధర్మాన్ని అనుసరించి కాలాలు మూడు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. రుతువు లయితే ఆరు. వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతువు, హేమంత, శిశిరం. తెలుగు అయినా, ఇంగ్లీషు అయినా నెలలు మాత్రం పన్నెండే. రెండు నెలలకో రుతువు మారుతుంది. నెలకు ముప్పయి రోజులు. తెలుగు సంవత్సరాలు అరవై. నిత్యం కూడా పంచాంగం ప్రకారం కాలాన్ని ఎంత వివరంగా చెపుతారంటే.. వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిరమాసం, హేమంతరుతువు, శీతాకాలం, సౌమ్య (బుధ) వాసరే, కృష్ణపక్షే, .. తిధి. నక్షత్రం, యోగం, కరణం, వర్జ్యం, అమృతఘడియలు, దుర్ముహూర్తం,
రాహుకాలం, గుళిక కాలం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయం.. ఇలా అనంతమైన కాల వివరం కూడా అనంతమే అనిపిస్తుంది.
కాలమంటే ‘శంకరాభరణం’ చిత్రంలో ‘ఓం నమఃశివాయః’ పాటలో ‘త్రికాలములు నీ నేత్రత్రయమై. చతుర్వేదములు ప్రాకారములై’ శివుడి కళ్లనే మూడు కాలాలుగా వర్ణించాడు. కాలం ఒక్కోదేశంలో ఒక్కోరకంగా, ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా నడుస్తూ, గడుస్తూ ఉంటుంది. ఏదేమైనా మంచికాలం విషయంలో మాత్రం అందరిదీ ఒకే మాట. అందులోనూ అన్నిటికీ మంచి సమయం చూసుకోవటం తిథి మంచిదేనా, వర్జ్యం ఉందా వగైరాలు. అలనాడు కోరుకున్నప్పుడు మరణించగల వరం గల భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అంపశయ్యమీద యాభైఎనిమిది రోజులు ఎదురుచూశాడు. ఇప్పుడయితే చాలామంది మహిళలు తమ బిడ్డలు మంచిరోజున, మంచి ముహూర్తంలో పుట్టాలని, ఆరోజును ఎంచుకుని మరీ సిజేరియన్ చేయించుక అంటున్నారు. పుట్టిన తిథి, సమయాన్ని బట్టే జాతకచక్రం వేయడం జరుగుతుంది. జన్మకాలాన్ని నిర్ణయించుకోగలిగినా, మరణకాలం మాత్రం మనిషి చేతుల్లో లేదు. ఎప్పుడో, ఏ నిమిషమో ఎవరూ చెప్పలేరు. ముహూర్తాల విషయానికి వస్తే బారసాల దగ్గర్నుంచి జీవితంలో ప్రతి దానికి ముహూర్తం చూడటం మామూలయింది. అన్నిటినీ మించి పెళ్లి ముహూర్తాల సంగతి వేరు. కానీ దేవుళ్ల పుట్టిన రోజులను పరిశీలిస్తే అవేవీ మనం పరిగణించే మంచి రోజులుగా ఉండవు. శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి.. ఇలా. రేడియోలు, టీవీ కార్యక్రమాల కాలపరిమితి వివరం ముందే నిర్ణయిస్తారు. ఎనిమిది నిముషాల పాట, ఇరవై నిమిషాల నాటిక, గంట నాటకం, అరగంట చర్చ.. వగైరా. ఇక బ్యాంకు రుణాలలో దీర్ఘకాలికాలు, స్వల్పకాలిక రుణాలు..ఇలా.. మనిషి ఆశాజీవి. అందుకే ముందుముందు మంచికాలం ఉంటుందని ఆశపడుతూ రోజులు గడుపుతాడు. అసలు మంచి కాలమంటే ఏమిటో ఓ సినీకవి..
‘ఉందిలే మంచి కాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందానా.. ఉందిలే.
దేశసంపద పెరిగే రోజు.. మనిషి మనిషిగా బ్రతికే రోజు
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు…
ఆరోజెంతో దూరంలేదోరన్నయ్యో
అదిగో చూడు రేపే నేడే చిన్నయ్యో..’
ఆరోజు కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం
కాలం మారిందనీ, దాంతోపాటే అన్నీ మారాయని అనుకుంటుంటాం. కానీ మారేది మనుషులే. తద్వారానే కాలం మారినట్లు అనిపిస్తుంది. అందుకే రాముడు భీముడులో
‘దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్..’ అంటాడు కవి.
కాలంలో క్షణకాలానికి ఎంతో విలువుంది.
నిరీక్షణలో ఉన్న ప్రేమ జీవులకు క్షణమొక యుగం. ఆ మనసు గానం ఇలా..
‘నీవులేక వీణా.. పలకలే నిదన్నది!
నీవురాక రాధా నిలువలేనన్నది..’
అంటూ తన పరిస్థితిని వివరిస్తూ..
‘కదలలేని కాలం విరహ గీతి రీతి..
పరువము వృధగా బరువుగ సాగె..’
అదే ప్రేమికులకు కాలం కలిసొస్తే ఇలా…
‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలి..’ అనుకుంటారు.
కానీ కాలాన్ని కట్టి ఉంచలేమన్నది వాస్తవం. అందుకే ఓ సినీ కవి
‘ఆగదు ఏ నిముషం నీకోసము
ఆగితే సాగదు ఈలోకము
ముందుకు సాగదు ఈ లోకము..’ అంటాడు.
అసలు మనిషికి బాల్యం నుంచే కాలపరిచయం మొదలవుతుంది. పొద్దున్నే లేవాలితో మొదలవుతుంది. బడి టైమ్ అవుతోందని, బస్సు వచ్చేస్తుందని హడావిడి. టైమ్ టేబుల్ ప్రకారం పుస్తకాలు సర్దుకున్నామా అన్న సందేహం. స్కూలుకెళ్లాక రుతువులెన్ని అని అడుగుట, కాలము-పని అంటూ లెక్కల మాష్టారు, పర్యావరణ కాలుష్యం వల్లే ఎండకాలంలో ఎండ, వానాకాలంలో వాన, చలికాలంలో చలి ఉండటం లేదని సైన్స్ మాష్టారు, చలికాలంలో స్వెట్టర్లు ధరించవలెను, స్వెట్టర్లను ఉన్నితో తయారుచేస్తారంటూ సోషల్ మాష్టారు, ‘టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో మాన్’ అంటూ ఇంగ్లీషు టీచర్.. ఇలా కాలం చుట్టూ ఎన్నెన్నో అంశాలు తిరుగుతూనే ఉంటాయి.
కాలం కరిగిపోతుందని తెలిసినా చాలాసార్లు బద్ధకం పెద్ద అవరోధమవుతుంది. అలాంటప్పుడు
‘తెల్లారింది లెగండో…. కొక్కోరోకో
మంచాలింక దిగండో… కొక్కోరోకో..’ పాడుతూ నిద్ర లేపే వాళ్లు ఉండాల్సిందే.
నిద్రాదేవి తరచు మనిషిని ఓడిస్తూంటుంది. ఆ నిదురమత్తు వదలక అవస్థలు.
‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదువురా…
జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగంబు చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
పరమార్గం గానకుండా వ్యర్ధంగా చెడతాడు..’ అని పాఠంలాంటి ఓ చక్కని పాట మదిలో మెదిలింది.
టైమ్ టేబుల్ ఒక్క స్కూళ్లకే కాదు, రైల్వేకు, ఆర్టీసికి కూడా ఉంటుంది. గతంలో ఏటా రైల్వేటైమ్ టేబుల్ పుస్తకాన్ని కొనేవాళ్లు. ఇప్పుడు ఆన్‌లైన్‌ల వ్యవహారం వచ్చాక ఆ పుస్తకం మరుగునపడిపోయింది. అయినా రైళ్లకు అనేకానేక కారణాల వల్ల లేటు పరిపాటే. అలాంటప్పుడు తమవారిని రిసీవ్ చేసుకోవాలని వచ్చినవారికి కాలక్షేపం బఠాణీలు తినక తప్పదు. రైలు త్వరగా వచ్చి, రిసీవ్ చేసుకునేవారు కాలయాపన చేసే సందర్భాలూ ఉంటాయి. కాలం అనుకూలత, ప్రతికూలత తరచు చర్చించుకునేవే. ప్రతికూల సమయాల్లో కాలం మనపై కక్షగట్టిందని వగచటం మామూలే. కాలంలో అకాలాలు, సకాలాలు ఉన్నాయి. ఏ పని అయినా సకాలంలో అయితేనే దాని ప్రయోజనం. చిన్న వయసులో, ఏ రుగ్మత కారణం లేకుండా కన్నుమూస్తే ‘అకాల మరణం’ గా పరిగణిస్తారు. కాలదోషం పట్టిన వస్తువులైనా, ఆలోచనలైనా వ్యర్థాలే. ప్రభుత్వాలు ముఖ్యమైన కొన్ని పత్రాలను కాల పేటికల్లో భద్రపరచటం తెలిసిందే. అంతేనా.. దేశాభివృద్ధికోసం పంచవర్ష ప్రణాళికలు చేపడుతుంది.
కాలం ఎంతో విలువైంది. మనిషి జీవితమూ ఎంతో విలువైంది. కాలపరిమితి ఉన్న విలువైన జీవితంలో కాలపరిజ్ఞానాన్ని, కాలం విలవను సదా గుర్తుంచుకోవాలి. నిన్న, నేడు, రేపు. నిన్న సరే.. గతమయిపోయింది. నేడు.. తెల్లవారితే ఇదీ గతానికి చేరుకుంటుంది. రేపయినా అంతే. సూటిగా చెప్పాలంటే అన్నీ గతం ఖాతాలో కలిసేవే. చాలామంది నిన్నను.. ఎన్నోనిన్నలను మరిచిపోవాలని అంటుంటారు. కానీ నేటికి నిన్నే కదా ఆధారం. నేడు, రేపటికి ఆధారం. అందుకే నిన్న లేనిదే నేడు లేదు, నేడు లేనిదే రేపు లేదు. గతమనేది రెఫరెన్స్ బుక్ లాంటిది. అందుకే అన్ని మీడియాలలో సంవత్సరాంతాన ఆ సంవత్సరంలో జరిగిన ప్రధాన సంఘటనల సమాహారాన్ని అందిస్తుంటాయి. అయితే నిరంతరం గతం గురించే ఆలోచిస్తూ, వైఫల్యాలను మననం చేసుకుంటూ..
‘చీకటిలో.. కారుచీకటిలో
కాలమనే కడలిలో.. శోకమనే పడవలో
ఏ దరికో.. ఏ దెసకో’
అని పాడుకుంటూ ఉంటే ఉపయోగం ఏం ఉండదు. దాన్లో నుంచి బయటపడి తక్షణ కర్తవ్యం దిశగా సాగిపోవాలి. నిరాశలను వీడి, నిస్సత్తువను జయించి లక్ష్యసిద్ధి కోసం చిత్తశుద్ధితో పూనుకోవాలి. ఈ నిముషాన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో ప్రారంభ వచనాలు గుర్తుకొస్తున్నాయి. అవి..
‘మై సమయ్ హు
మేరా కోయి అంత్ నహీ.. మై అనంత్ హు
జబ్ తక్ మై హు యే మహాభారత్ చల్తా రహేగా…’
నిజమే కాలం ఉన్నంత వరకు మానవజీవిత మహాభారతాలు నడుస్తూనే ఉంటాయి. ఏమైనా నిన్న అనేది అయిపోయింది. రేపటి సంగతి మన చేతిలో లేదు. ఉన్నదల్లా ఒక్క వర్తమానమే. వర్తమానాన్ని విచక్షణతో సద్వినియోగం చేసుకోవటంలోనే మనిషి జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ముగియనున్న సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించి నూతనోత్తేజాన్ని సంతరించుకుని మనకోసం కొత్త సంవత్సరంలో కొత్త వాకిళ్లు తెరుచుకుంటాయన్న సానుకూల వైఖరితో ముందుకు సాగాలి.
‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫా
డే బై డే.. డే బై డే కాలం ఒడిలో డే బై డే
పయనించే షిప్పే ఫ్రెండ్‌షిప్‌రా…’
కాలం మహత్తరమైంది. మనిషికి కాలమే నేస్తం. ఎంతటి బాధలనయినా కాలమేకదా మరిపించి, మళ్లీ మనుషుల్ని చేసేది. అన్నిగాయాలకు కాలమే మందు. రేపు మనకోసం ఏం దాచి ఉంచిందో అన్న ఆశ.. మనిషి ఉత్సాహంగా జీవించటానికి ఊతమిస్తుంది. కాలరథంలో పయనించే సూర్యుడిని చూసి మనం కర్తవ్యపాలన నేర్చుకోవాలి.
‘గోరువెచ్చని సూరీడమ్మా
పొద్దుపొడుపులో ఉన్నాడమ్మా..’
గుర్తుకు వస్తుండగా..
‘ఠాప్…’
ఉలిక్కిపడ్డాను. రోడ్డుమీద ఏదో వాహనం టైర్ బరస్ట్ అయినట్లుంది. కాలయాత్ర చేస్తూ కాలాన్నే మరిచిపోయాను. నా స్టాప్ రానే వచ్చింది. దిగి నడుస్తూ ఉంటే మనసు తెరపై ‘ఆదిత్య 369’ చిత్రం ప్రారంభమైంది. అంతలో ఆఫీసు రానే వచ్చింది. మనసంతా టైమ్ మెషీన్.. మనిషిని మాత్రం పంచింగ్ మెషీన్ ముందు.. అంతలో అతిధులెవరో వచ్చి కొత్త క్యాలెండర్ అందించి, అడ్వాన్స్‌గా అభినందనలు.. మళ్లీ కాలం కళ్లముందు!