మానస సంచరరే-33: అలుపెరుగని అల!

7
6

[box type=’note’ fontsize=’16’] “అలను చూసి ఆనందించడమే కాదు, అల నుంచి అకుంఠిత ప్రయత్న స్ఫూర్తిని పొందాలి..” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఆ[/dropcap]దివారం.. అందమైన సాయంకాలం.. టీని ఆస్వాదిస్తూ పాటలు వింటున్నాను.. అంతలో మొబైల్ రింగయింది. రమ్య నుంచి ఫోన్.

ఏంటో విషయం అనుకుంటూ నొక్కాను.

‘హలో మేడమ్! రేపు మా పాప బర్త్ డే. మీరు తప్పక రావాలి’.

‘తప్పకుండా వస్తాను. ఎక్కడ, ఎన్నింటికి వివరాలు మెసేజ్ పంపు. ఇంతకూ మీ పాప పేరేమిటి?’ అడిగాను.

‘అల’ చెప్పింది రమ్య. .

‘ఓ.కె. వస్తాలే..’ అంటూ ఫోన్ పెట్టేశాను.

‘అల’ ఎంత చక్కని పేరు. అనుకుంటున్నానో లేదో..

“అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
ఆనందమోహన వేణుగానమున
ఆలాపనే కన్నా
మానసమలై పొంగెరా…
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా…
కడలికి అలలకు కథకళి కళలిడు
శశికిరణము వలె చలించవా..”

పాట వినిపించింది. వింటూనే నా మదిలో ‘టోరీ పైన్స్’ ప్రత్యక్షమయింది. సౌత్ కాలిఫోర్నియాలోని శాండియాగోలో పసిఫిక్ తీరాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరు బీచున్నాయి. అందులో ఒకటి ‘టోరీ పైన్స్ స్టేట్ నేచురల్ రిజర్వ్’. ప్రశాంత ప్రకృతిని ఇష్టపడే వారికి అది చక్కటితావు. సముద్రం ఒడ్డున గోడకట్టినట్లుగా కొండల వరుసలు. మధ్యమధ్యలో చిన్న వరండాల సైజులో ఖాళీలతో, అందులో నిల్చుని ఫొటో దిగేందుకు వీలుగా ఉన్నాయి. ఇసుకలో ఎవరో అల్లరిగా విసిరేసినట్లు రకరకాల రాళ్లు, ఆల్చిప్పలు. రకరకాల పరిమాణాల్లో, రకరకాల రంగుల్లో, రకరకాల ఆకారాల్లో.. పలకలుగా, గుండ్రంగా, త్రికోణంగా, దీర్ఘ చతురస్రంగా, అంచులు వంపులు తిరిగి కొన్ని.. అనంతకాల గమనంలో నీటిలో నాని, నాని రూపుదిద్దుకున్న అందమైన రాళ్లు. గచ్చకాయరంగులో, ఆకాశవర్ణంలో, కాఫీరంగులో, నలుపులో, తెలుపులో, లేత ఎరుపులో, పాచిరంగులో ఎన్నెన్నో! వాటిమీద చిత్ర విచిత్ర డిజైన్లు అబ్బురపరుస్తున్నాయి. కఠినమైన రాయి.. ద్రవమైన నీరు.. అయితేనేం. కాలక్రమంలో నీరే ఉలిలా పనిచేస్తోంది. అంతుచిక్కని ప్రకృతి. అంతలో సముద్రం అలలతో ఆహ్వానం పలకటంతో అసంకల్పితంగానే నా కాళ్లు అటు దారితీశాయి. సముద్రం మనసు పొంగిందేమో అలలై వచ్చి నాకు పాదాభిషేకంచేసి ఆత్మీయంగా పలకరించింది. తెల్లని నురగల అలలు, మళ్లీ మళ్లీ తాకి వెళ్తుంటే, ప్రతిసారి మాటలకందని ఆశ్చర్యానందానుభూతి. సన్నీగా ఉన్న ఆ సమయాన చల్లనినీళ్లు పాదాలను సేద తీరుస్తుంటే దాన్ని మించిన ‘పెడిక్యూర్’ ఏముందనిపించింది. అప్పుడే రెండేళ్లయింది నేను శాండియాగో సందర్శించి. ఇంకా పసిఫిక్ అనుభూతులు నా మదిలో తాజాగానే ఉన్నాయి.. నా మనో సంద్రంలో ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

ప్రకృతి ఆరాధకుల మనసు పై స’ముద్ర’ తప్పకుండా ఉంటుంది. ఏ బీచ్ అందం ఆ బీచ్. విశాఖలో రామకృష్ణా బీచ్, భీమ్లీ బీచ్, చెన్నైలో మెరినా బీచ్, విజిపి బీచ్, ముంబైలో జుహు బీచ్, గోవాలో బీచ్ సందర్శన స్మృతులు కళ్లముందు మెదిలాయి. వేటి అందం వాటిదే.

అందమె ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
పడిలేచే కడలి తరంగం..ఓ…..ఓఓఓ..
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం..

సముద్రం మనిషి కళ్లలోనూ ఉంది.

అదే… కన్నీటి సంద్రం.

సిరివెన్నెల పాట గుర్తొచ్చింది..

ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే..

సంసారం సాగరంలాంటిదే అని పెద్దల మాట. అది నిజం కూడాను. ‘సంసారం సాగరం’ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. అందులో టైటిల్ సాంగ్..

సంసారం సాగరం.. సంసారం సాగరం
బ్రతుకే ఓ నావగా, ఆశే చుక్కానిగా
పయనించే ఓ నావికా! ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది నీ తీరం?…
నడిసంద్రం సుడిగుండం నావను ముంచేసింది.
కుమిలే నీ గుండెల్లో కోత కోసి పోయింది
సడలిన నీ చేతులతో కడలినీదలేవు
గట్టుచేరుకోలేవు, మరి ఊరుకోలేవు….

కష్టాల కడలినీదలేని నిస్సహాయుడి మనో ఘోష..

హిందీలో ‘సముందర్’ సినిమాలో ఓ యుగళగీతం ఇలా..

ప్యార్ సముందర్ సె హై గహ్‌రా
ఇస్‌మె కహి హమ్ డూబ్ న జాయె
దిల్ చాహె తుఫాన్ సె ఖేలే
సాహిల్ పర్ వాపస్ న ఆయె
అయ్ సాగర్ కి లహరో
హమ్ భీ ఆతే హై టహరో..
ఓ సాహిల్ సాహిల్ మంజిల్
మంజిల్ హమ్‌కో లే చలో..

సముద్రం ఆయా వ్యక్తులకు.. ఆయా సందర్భాల్లో వైవిధ్య భావాలను కలిగిస్తుంది. కవులకు సముద్రం గొప్ప కవితా వస్తువు. సామ్యూల్ టేలర్ కాలరిడ్జ్ తన ‘ది రైమ్ ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్’ పొయమ్‌లో ఇలా అంటారు..

ది సన్ నౌ రోజ్ అపాన్ ది రైట్
అవుట్ ఆఫ్ ది సీ కేమ్ హి
స్టిల్ హిడ్ ఇన్ మిస్ట్, అండ్ ఆన్ ది లెఫ్ట్
వెంట్ డౌన్ ఇన్‌టూ ది సీ…

సముద్రం.. సూర్యోదయ, సూర్యాస్తమయాల దృశ్యాన్ని కళ్ల ముందుంచారు.

జాన్ మేస్ ఫీల్డ్.. ‘సీ ఫీవర్’ పేరిట అందించిన సాల్ట్ వాటర్ బ్యాలడ్స్‌లో…

ఐ మస్ట్ గో డౌన్ టు ది సీస్ అగైన్, టు
ది లోన్లీ సీ అండ్ ది స్కై
అండ్ ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ఎ టాల్
షిప్ అండ్ ఎ స్టార్ టు స్టీర్ హర్ బై
అండ్ ది వీల్స్ కిక్ అండ్ ది విండ్స్
సాంగ్ అండ్ ది వైట్ సెయిల్స్ షేకింగ్
అండ్ ఎ గ్రే మిస్ట్ ఆన్ ది సీస్ ఫేస్
అండ్ ఎ గ్రే డాన్ బ్రేకింగ్…

సముద్రానికి మూడ్స్ ఉంటాయి. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కెరటాల విన్యాసం తుఫానుముందు గంభీర ప్రశాంత వదనం తుఫాను వేళ ప్రళయ గర్జనల సాగరం ఒక్కోసారి నిద్రిస్తోందా అన్నట్లు నిశ్శబ్దమయ్యే సముద్రం. పౌర్ణమి వేళల కడలి పొంగులు సముద్రం ఎన్నెన్ని వేషాలమారో!

సముద్రుడు కరుణా సముద్రుడు కూడా. ఎందుకంటే సముద్రం ఆదినుంచి మానవుడికి ఆసరాగానే ఉంది. సముద్రంలో చేపలు పట్టి ఆకలి తీర్చుకున్న నాటి మనిషి.. నాటి ఏమిటి, ఈనాటికీ సముద్రం అందించే ఆహారోత్పత్తి ఎంతో ప్రధానమైందే.. ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండువందల బిలియన్ పౌండ్ల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి అనుకుంటుంటే జేసుదాస్ మధురగానం గుర్తొచ్చింది.

సాగర తీర సమీపాన
తరగని కావ్య సుధామధురం
కాల చరిత్రకు సంకేతం
కరుణకు చెరగని ప్రతిరూపం…
మట్టిని నమ్మిన కర్షకులు.. మాణిక్యాలు పొందేరు…
కడలిని నమ్మిన జాలరులు.. ఘన ఫలితాలు చెందేరు..

బెస్తవారి బెస్ట్ ఫ్రెండ్ సముద్రుడు. జాలరికి, సముద్రానికి ఉన్న అనుబంధం ఎంతో గాఢమైంది.

సముద్రమే అతడికి జీవనాధారం. సముద్రమే నేస్తం… సముద్రమే సమస్తం. సముద్రానికి ఆగ్రహం వస్తే తనను ముంచేసే ప్రమాదమున్నా జాలరి తన సాహసజీవనానికే తలొగ్గుతాడు. ఆదిలో మనిషి ప్రయాణాలన్నీ సముద్ర దారుల్లోనేగా. ఇటాలియన్ అయిన కొలంబస్ అమెరికాను కనుగొన్నది. అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణించేగా. సముద్రంపై ప్రయాణించి ఎందరెందరు ఎన్నెన్ని అన్వేషణలు చేశారో! చిన్నప్పుడు ‘సింద్‌బాద్ సాహసయాత్ర’ చదవటం ఎంత ఇష్టంగా ఉండేదో. బాగ్దాద్‌లో వర్తకుడైన సింద్‍బాదు సముద్రయాన మంటే ఇష్టం కావటంతో వర్తకులతో కలిసి సముద్రయానం చేయటం, మధ్యలో తుఫాను, ఓడ నాశనం, వింతవింత అనుభవాలు… సింద్‌బాద్ కథతో ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. అలాగే ‘గల్లీవర్ ట్రావెల్స్’ కథ.. ఆ సాహసయాత్రలో లిల్లీపుట్స్ (అంగుష్ఠమాత్రులు) ఉన్న తావుకు చేరుకోవటం.. అక్కడి అనుభవాలు..అంతా థ్రిల్లింగే.

అంతదాకా ఎందుకు, మన ఇతిహాసాల్లో సముద్రమెంతో కీలకమైంది. మనకు ఉప్పు సముద్రమే తెలుసు కానీ ఇతిహాసాల్లో అమృతమథనం జరిగింది క్షీరసముద్రంలో. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా ఉపయోగించి క్షీరసముద్రాన్ని మథించారు. ‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం..’ లక్ష్మీ దేవి క్షీరసముద్రరాజు కుమార్తె. ఇక రామాయణంలో అయితే సీతాన్వేషణకు సముద్రాన్నిలంఘించాడు హనుమ. ఆ తర్వాత వానరులంతా కలిసి వారధి కట్టడం తెలిసిందే. చందమామ కథల్లో సప్తసముద్రాలు దాటి వెళ్లి ఏ రాక్షసుడినో అంతమొందించి మహిమగల ఉంగరమో, మరొకటో సాధించి తేవటం మామూలే. ఆర్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, దక్షిణ మహాసముద్రాలయితే మిగతావన్నీ మామూలు సముద్రాలు. ఇంకా ఎర్రసముద్రం, నల్ల సముద్రం, పచ్చసముద్రం… ఇలా ఎన్నెన్నో. సముద్రం మనిషికి పె’న్నిధి’. ఉప్పు లేని ఆహారాన్ని ఊహించుకోగలమా? మరి లవణాన్ని అందించేది సాగరుడే కదా. అంతేనా, ఇసుక, గ్రావెల్, మాంగనీస్, రాగి, నికెల్, ఐరన్, కోబాల్ట్, క్రూడాయిల్ ఎన్నెన్నో మనిషికందిస్తోంది. పైకి కనిపించే సముద్రం ఒక ఎత్తయితే, సముద్రం అడుగున మరో ప్రపంచం. రకరకాల ప్రాణులు, పగడపు దిబ్బలు… డైవింగ్ నేర్చినవారు ఆ మరో ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు. ఇక పర్యావరణంలో సముద్రాల పాత్ర ఎంతో ఉంది. కార్బన్‌ను తొలగించి, ఆక్సిజన్‍ను ప్రసాదించే ప్రక్రియలో సముద్రం కీలకంగా ఉంటుంది. భూమి ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసేది సముద్రం. సముద్రం బయోమెడికల్ ఆర్గానిజమ్స్‌కు ప్రధాన వనరు. సముద్రంలో ఉండేది ఉప్పునీరే అయినా ‘డీశాలినేషన్’ ప్రక్రియతో మంచినీటిగా మార్చే టెక్నాలజీ కూడా మనిషి కనుగొన్నాడు. రవాణాకు తోడ్పడుతూ, వినోదానికి కేంద్రబిందు వవుతూ.. తరం తరం.. నిరంతరం మన కోసం ఘోషిస్తూనే ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా కొంతకాలం భోజనం చేస్తే.. వారి ఉప్పు తిన్నామని, ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలని అంటుంటారు. ఆ మాటకొస్తే అసలు మానవాళికంతటికీ ఉప్పునందించే సముద్రుడి పట్ల మనిషి ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి! సముద్రగర్భంలో బడబాగ్ని ఉంటుందట. అందుకే వాడుకలో ‘లోపల బడబాగ్ని దాచుకొని పైకి నవ్వుతు న్నాడు’ అంటుంటారు. సముద్రమెంత లోతైందో, మనిషి మనసూ అంతే లోతైంది. అంత తేలిగ్గా అంతుచిక్కదు. సముద్రాన్ని సారూప్యంగా చూపుతూ..

‘అగాధమౌ జలనిధిలోన, ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం..
కల కానిది.. విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు..’

అంటూ శ్రీశ్రీ ఏనాడో స్ఫూర్తినిచ్చాడు.

అంతదాకా ఎందుకు సముద్రం ముందు కూర్చుని అలల్ని గమనిస్తే చాలు. అలుపెరుగని అలలు మళ్ళీ మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడటం, మున్ముందుకు ఉరుకుతూనే ఉండటం.. ఆలోచింపజేసే దృశ్యం. అలలు, తీరం చేరలేదని ఉస్సూరని, నిరాశచెందవు. మళ్లీ మళ్లీ గొప్ప పూనికతో ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అలను చూసి ఆనందించడమే కాదు, అల నుంచి అకుంఠిత ప్రయత్న స్ఫూర్తిని పొందాలి.. అనుకుంటుంటే పెద్దగా ఉరుముల శబ్దంతో ఆలోచనల అలలకు తాత్కాలిక అంతరాయం.. బాబోయ్ ఆకాశం ఉరమకపోతే ఇంకెంత సేపు ఆలోచనల సముద్రంలో కొట్టుకు పోయేదాన్నో.. అనుకుంటూ టీవీ ఆన్ చేశాను. వాతావరణం.. బంగాళాఖాతంలో వాయుగుండం… కి.మీ. వేగంతో గాలులు, ..నెంబరు ప్రమాద హెచ్చరిక,

జాలరులకు చేపలు పట్టడానికి వెళ్లకూడదన్న సూచన వగైరాలు వింటూ బంగాళాఖాతం అడపా తడపా గాభరా పెడుతూనే ఉంటుంది అనుకున్నా. అంతలో నేను చేయాల్సిన పనుల జాబితా గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాను.

ఇంకేముంది, అల ఆవలకు.. నేను లోపలకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here