[box type=’note’ fontsize=’16’] శార్వరి అర్థం ‘రాత్రి’ అయినా.. అది చీకటి రాత్రిగా కాక, వెన్నెల రాత్రిగా అవతరిస్తుందని.. అవనికంతటికి క్షేమకరి, శుభకరి అవుతుందని ఆశిస్తున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]శా[/dropcap]ర్వరి నామ ఉగాది వేకువ! కోవిడ్-నైంటీన్ (కరోనా) చీకట్లలో వచ్చిన ఉగాది వేకువ! ‘వికారి’ తన పేరును సార్ధకం చేసుకుని వికారంగా వీడ్కోలు పుచ్చుకుంది. శార్వరి ప్రవేశించింది. ఓ విధంగా ఆలోచిస్తే ఇది, వేకువలో ప్రవేశిస్తున్న ‘రాత్రి’! ఎందుకంటే శార్వరి అంటే ‘చీకటి’, ‘రాత్రి’ అర్థాలున్నాయి. గేటు బయటకు తొంగి చూస్తే కనుచూపు మేర మనిషన్న వాడే లేడు. అంతా నిశ్శబ్దం. కుహూ కుహూలు సైతం లేవు. కోయిల కూడా గొంతెత్తడానికి భయపడినట్లుంది. లేకుంటే కోయిలకూ గొంతు నొప్పి రాలేదు కదా! ఇప్పటివరకు ఎన్నో ఉగాదులు చూశాం. కానీ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ విచ్చేసిన శార్వరి ఉగాదిని ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటుంటే పనిమనిషి రాదన్నసంగతి గుర్తొచ్చింది. ఈ కరోనా దెబ్బకు ఎవరింటికి వారు పరిమితం. ఎవరి వల్ల ఎవరికి ఎక్కడ కోవిడ్-నైంటీన్ వస్తుందోనని పనిమనుషుల్ని కొందరు యజమానులే రావొద్దంటే, కొందరు పనిమనుషులు తామే రామని చెప్పేస్తున్నారు. ఏదైనా, అందులో జాగ్రత్తను అర్థం చేసుకుంటే ‘రోగీ పాలే కోరాడు, డాక్టరూ పాలే తాగమన్నాడు’ సామెతలా అందరికీ అది ఆమోదమే అవుతుంది. సరే తప్పేదేముందని పనిలోకి దిగాను. పనిదారి పనిదే, ఆలోచన దారి ఆలోచనదే.. వాకిలి చిమ్ముతున్నా, ముగ్గు వేస్తున్నా, మనసులో ఆలోచనల పచార్లు సాగుతూనే ఉన్నాయి. ఈ కరోనా మహమ్మారి హఠాత్తుగా అందరి జీవితాలను మార్చేసింది. కళకళలాడే భాగ్యనగరం.. నిశ్శబ్దంగా, నిస్తేజంగా.. అప్పుడెప్పుడో కొన్ని వందల ఏళ్ల కిందట హైదరాబాద్లో ప్లేగు మహమ్మారి వచ్చిందట. ఆ గండం గట్టెక్కిందనే, అందుకు గురుతుగా చార్మినార్ నిర్మాణం జరిగింది. భాగ్యనగర అందాలను, చరిత్రను, విశిష్టతను తెలుపుతూ ‘ఎమ్.ఎల్.ఎ.’ చిత్రంలో ఓ చక్కటి పాట ఉంది. అదే..
“ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం
మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం..
అలనాడు వచ్చెనిట మహమ్మారి…… …
అల్లా దయవల్ల ఆ పీడ పోయినాది
ఆ గండం తప్పిందని గురుతు నిలిపినారు
ఆ గురుతే అందమైన చార్మినారు..ఇదేనండి.. ఇదేనండి…”
మరి ఈ కరోనా గండం గడిచేనా.. కోవిడ్-నైంటీన్‌కు మందు ఇంకా కనుక్కోవలసి ఉంది. మనిషి శాస్త్రీయంగా ఎంత మేధావిగా పురోగమిస్తున్నా కొత్త కొత్త వైరస్ వైరులు సవాల్ చేస్తూనే ఉన్నాయి. కోవిడ్-నైంటీన్‌కు మందు ఇంకా రాలేదని చెపుతుంటే మరోవైపు యు.ఎస్.లో కోవిడ్-నైంటీన్‌కు ఇంజెక్షన్ మార్కెట్ లోకి వచ్చిందని మరో కబురు. అది నిజమో, కాదో తెలియకపోయినా కబుర్లు మాత్రం ప్రపంచం మొత్తం చుట్టేయగలవు. అయినా ఓ వ్యాధికి మందు కనుక్కోవాలంటే అదేదో రోజుల్లో, నెలల్లో జరిగే వ్యవహారం కాదని ఆ ప్రక్రియలోని దశలనీ పూర్తయి మందు వెలుగు చూడాలంటే ఐదారు సంవత్సరాలు పడుతుందని, అత్యవసరమని కొన్ని దశలను తప్పించి ప్రయోగాలు చేసినా కనీసం రెండేళ్లు పడుతుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు.
స్నానం, ఉగాది పచ్చడి తయారీ, టీ తయారీ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఆలోచన మనసును అల్లుకునే ఉంది..
మందులు ఆదిమానవ కాలంనుంచి ఉన్నాయి. మనిషి తన చుట్టూ ప్రకృతిలో ఉన్న ఆకుపసర్లను, మూలికలనే వైద్యానికి ఉపయోగించుకుని, అనారోగ్యాలను పోగొట్టుకుని, స్వస్థతను పొందేవాడు. అన్నట్లు పురాణేతిహాసాల్లోనూ వైద్య ప్రస్తావన ఉంది. వైద్యభగవానుడు ధన్వంతరి. విష్ణువు అవతారమని, పురాణాలు ధన్వంతరిని ఆయుర్వేద దైవంగా పేర్కొన్నాయి. సముద్ర మథన సందర్భంలో ధన్వంతరి కూడా ఉద్భవించాడు.
‘నమామి ధన్వంతరి ఆది
దేవం, సురాసుర వందిత పాద పద్మం
లోకే జరా రుగ్భయ మృత్యు
నాశం, దాతారం ఈశం
వివిధౌషాధినాం‘
అని ధన్వంతరి దైవాన్ని ప్రార్థిస్తుంటారు. ముఖ్యంగా దీపావళి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్వంతరి త్రయోదశి’ అని కూడా అంటారు. భారత ప్రభుత్వం ఈరోజును ‘జాతీయ ఆయుర్వేద దినం’గా కూడా ప్రకటించింది. ధన్వంతరి సర్జరీలో నిపుణుడని, ఆత్రేయ ఋషి ఇంటర్నల్ మెడిసిన్‌లో నిపుణుడని, కశ్యప ఋషి గైనకాలజీ, పీడియాట్రిలో నిపుణుడని చెపుతారు. అధర్వణవేదంలో ఆయుర్వేదం ఉందంటారు. వేదాల తర్వాత ఆయుర్వేదంలో ముఖ్యమైన గ్రంథాలు చరకసంహిత (చరకుడు రాసింది), సుశ్రుతసంహిత (సుశ్రుతుడు రాసింది), అష్టాంగ హృదయ (వాగ్భట్ట రాసింది).
రామాయణంలోని యుద్ధకాండలో హనుమ, సంజీవనిని తీసుకురావడం చాలా కీలకమైన ఘట్టం. రామరావణ యుద్ధంలో రావణ కుమారుడైన మేఘనాథుడి శరాఘాతానికి లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడు. వైద్యుడు సుషేణుడు పరీక్షించి, లక్ష్మణుడికి ప్రాణాపాయం తప్పించడానికి హనుమంతుడిని ద్రోణగిరి కొండలకు వెళ్లి, నాలుగు రకాల మొక్కలను వెదకి తెమ్మంటాడు. అవి మృత సంజీవని (ప్రాణాలు నిలిపేది), విశల్యకరణి (బాణాలను తొలగించేది), సంధానకారిణి (చర్మాన్ని రక్షించేది), సవర్ణ్యకారిణి (చర్మం రంగును నిలిపేది). సంజీవనిని తీసుకురావడానికి వీరాంజనేయుడు ఒక్క ఉదుటున పైకి ఎగిరాడు.. మారుత తుల్యవేగంతో వెళ్లాడు. ఆ పర్వతం మీద అనేక రకాల మొక్కలు, చెట్లు ఉండటంతో ఏది సంజీవనో తెలుసుకోవటం కష్టమై, ‘పర్వతాన్నే పెకలించుకు వెళితే సరి’ అనుకుని అమాంతం సంజీవని పర్వతాన్ని అరచేత పుచ్చుకుని ఆగమేఘాల మీద తిరిగివచ్చాడు. అలా సంజీవనితో లక్ష్మణుడు పునర్జీవితుడయ్యాడు.
ఇక వినాయకోత్పత్తి కథలో అయితే పార్వతీదేవి నలుగు పిండితో బాలుణ్ని తయారుచేసి ద్వారం వద్ద కాపలా ఉంచి, ఎవరినీ లోపలికి అనుమతించవద్దని బాలుడికి చెప్పి, తాను అభ్యంగన స్నానమాచరించడానికి వెళుతుంది. అంతలో గజాసుర సంహారం చేసిన శివుడు కైలాసానికి అరుదెంచగా, ద్వారం వద్ద బాలుడు అడ్డగించడం, శివుడు ఆగ్రహించి బాలుని శిరసు ఖండించి, లోపలకు వెళ్లడం జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీదేవితో మాట్లాడుతున్న సమయంలో ద్వారం వద్ద అడ్డగించిన బాలుడి ప్రస్తావన రాగా, జరిగింది తెలుసుకుని పార్వతీదేవి ఖిన్నురాలవుతుంది. దాంతో శివుడు తాను తెచ్చిన గజాసురుడి తలను, ఆ బాలుడికి అతికించి బ్రతికించడం వినాయకవ్రతకల్పంలో చదువుతాం.
అలా తలను అతికించి, బతికించడమంటే అది ఓ రకమైన సర్జరీగానే భావించవచ్చేమో. అయితే ఇప్పుడు శరాఘాతాలు, దృష్టి ప్రభావాలు, అస్త్రశస్త్రాలు, తుపాకి గుళ్లు ఇవేవీ కావు. కంటికి కనపడని కరోనా వైరస్ కాటు. అసలీ కోవిడ్-నైంటీన్ విజృంభణకు చైనా తప్పిదమే కారణం. తమ దేశంలో తలెత్తిన కరోనా గురించి గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చి, ప్రపంచ దేశాలన్నిటికీ పాకించింది. దాంతో మొదలైంది ఈ మృత్యుహేల. సంసారం గుట్టు, రోగం రట్టు.. అన్నారు మన పెద్దలు. కానీ చైనావాళ్లు రోగాన్ని గుట్టుచేసి లోకానికి అపకారం చేశారు. చిన్నప్పుడు జ్వరమొచ్చినప్పుడు మందు తాగనని మొండికేస్తే అమ్మ ‘కమ్మని రోగాలు.. తీయని మందులు ఉంటాయా, మందు చేదు! – ఉండక ఎట్లా ఉంటుంది, గొడవ చేయకుండా కళ్లు మూసుకు తాగేసెయ్’ అని గొంతులో మందు పోసేసేది. అమ్మ అలా అనేదే కానీ తీయని మందులూ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు వాడే సిరప్‌లన్నీ తీపివే. హెూమియోపతి అయితే తీపి మాత్రల వైద్యమేకదా. వైద్యులైనా అనారోగ్య లక్షణాలను అర్థం చేసుకుని మందులివ్వడం ఆషామాషీ కాదు. కడుపునొప్పికి, కాలు నొప్పి మందు ఇస్తే కష్టమేకదా. కొన్నిసార్లు కొండనాలుక్కి మందేస్తే, ఉన్న నాలుక పోయిందన్న సామెత తీరు అవుతుంది.
‘వైద్యో నారాయణో హరి’ అన్నారు. ఆ నమ్మకంతోనే వెళ్లాలి వైద్యుడి దగ్గరకు. ఎందుకంటే నమ్మకం ఉంటేనే మందు పని చేస్తుందనేది చాలావరకు నిజం. ఇప్పుడయితే కొందరు ‘వైద్యో నారాయణో ‘హరీ!’ (రోగి హరీ అంటాడనే అర్థంలో) వ్యంగ్యంగా అంటుంటారు. దానిక్కారణం కొన్ని ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. వృత్తిని దైవంగా భావించి సేవచేసే డాక్టర్ల గురించి ‘మానవుడు.. దానవుడు’ చిత్రం కోసం డా.సినారె ఓ గొప్పపాటనందించారు. అది…
‘అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా..
వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులూదీ
జీవనదాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా.. ‘
వైద్యుల, నర్సుల మహోన్నత సేవను గుర్తించే ఈ నెల ఇరవై రెండున జనతా కర్ఫ్యూ పాటించిన అనంతరం జాతి యావత్తు వైద్యులకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసింది. వైద్యుడు, నర్స్ పిల్లల్ని కూడా ఎంతో ఆకట్టుకుంటారు. పిల్లలు డాక్టర్ సెట్ బొమ్మలతో ఆడుకోవడం తెలిసిందే.
అలా ఆడుతూనే పిల్లలు..
“నేనొక అందాల డాక్టర్ని
నాకొక చిట్టి పొట్టి బ్యాగుంది
ఆ బ్యాగులో టాబ్లెట్లు, వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి.
గుండె తీసి గుండెలో పెట్టేస్తా
తెలివిగా ఆపరేషన్ చేసేస్తా..” రైమ్‌ను యాక్షన్ చేస్తూ ముద్దుగా పాడేయడం మామూలే.
నర్సులకు సంబంధించి ఓ చక్కని నర్సరీ రైమ్ ఉంది.
“తెల్లదుస్తులు వేసుకొని
తెల్లని దేవత వచ్చింది.
ప్రేమగ మమ్మల్ని చూసింది
తమ్ముడికి వైద్యం చేసింది
కాలిని చూపించు అని అడుగగా
తమ్ముడు గొడవచేశాడు
నొప్పి తెలియకుండా గాయాన్ని తగ్గిస్తానని చెప్పింది
కొద్దిగా దూదితీసి మందును దానికి పూసింది
నువ్వు కాలుచాపితే నేను మందు రాస్తాను
నొప్పి ఎగిరిపోతుంది
తమ్ముణ్ని చాలా బుజ్జగించి మెల్లగా మందును రాసింది
మొదట్లో నొప్పితో ఏడ్చినవాడు మెల్లగా నవ్వాడు
ప్రేమ, సహనం ఉంటే అనారోగ్యం పోతుంది
ప్రజల క్షేమం చూడటం బాధ్యతేకాదు అది సేవకూడా…”
చాలా చక్కటి రైమ్.
అన్నట్లు చాలామంది పిల్లలు చదవటం తప్పించుకోవటం కోసం కడుపునొప్పి వంటి ఏదో ఒక అనారోగ్యం సాకుగా చెప్పటం మామూలే. దీనికి సంబంధించే ‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో ఓ పాట ఉంది.
“అమ్మా నొప్పులే..అమ్మమ్మా నొప్పులే..
ఫస్టుక్లాసులో పాసవుదామని
పట్టుపట్టి నే పాఠాల్ చదివితే
పరీక్షనాడే పట్టుకున్నదే..” అంటాడు పిల్లవాడు
అమాయకురాలైన అమ్మమ్మ వచ్చి
“బాబూ లేవరా.. ఈ మందూ తాగరా..
పరీక్షకోసం దిగులుపడకురా
వచ్చే యేటికి పాసవుదులే..” అంటుంది
అమ్మకు పిల్లవాడు దొంగ ఎత్తు వేస్తున్నాడని తెలుసు. ఆమె పై ఎత్తు వేసి.. గారెలు, బూరెలు చేశానని చెపుతుంది. అంతే పిల్లవాడు
“అమ్మా పాయనే.. అమ్మమ్మా పాయెనే
అమ్మా ఒక్కటే.. అమ్మమ్మా ఒక్కటే..” అంటూ కడుపునొప్పి పోయిందని గారెలు, బూరెలు పెట్టమని బతిమాలుకుంటాడు.
తల్లి ‘బుద్ధివచ్చెనా, నీకు బుద్ధివచ్చెనా‘ అంటుంది. నవ్విస్తూనే పిల్లలకు బుద్ధిచెప్పే పాట.
చాలామంది యాక్టర్లు గతంలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పటం ఓ జోక్‌గా ఉండేది.
అసలు వైద్యుడి అవసరం మనిషికి ఎంత ఉందో సుమతీ శతకకారుడు ఎంతో బాగా చెప్పాడు.
“అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ”
మనిషికి బతకడానికి ధనం అవసరం. అది లేకుంటే దాన్ని అప్పుగా ఇచ్చే దాత అయినా ఊళ్లో ఉండాలి. ఆ తర్వాత అనారోగ్యం వస్తే వైద్యం చేసే వైద్యుడుండాలి.. అని సుమతీ శతకకారుడు బద్దెన వైద్యుడి సౌకర్యం ఉన్నఊళ్లోనే నివసించాలని సూచించాడు.
యాంత్రికంగా వంట చేస్తున్నాను. మనసులో ఆలోచనలు దౌడు తీస్తూనే ఉన్నాయి…
ఇక శారీరక అనారోగ్యాలకు మందులుంటాయే కానీ మనోవ్యాధికి మందులేదు అంటారు పెద్దలు. అయితే ఆధునిక కాలంలో దానిక్కూడా మానసిక వైద్యులు కౌన్సెలింగ్ వగైరాలతో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీకాక ‘మాయరోగం’ పద ప్రయోగం తరచు వినిపిస్తుంది. అవతలివారిది నిజమైన రోగం కాదని భావించినా, లేక వారిమీద బాగా కోపం వచ్చినా ‘ఏం మాయరోగం’ అని తిట్టడం మామూలు.
అసలు అనారోగ్యానికి వేసుకునే మందును చాలామంది మెడిసిన్, డ్రగ్స్ అని వాడుతున్నారు. రెండూ ఇంగ్లీషు పదాలే కానీ వాడుకలో చొరబడ్డాయి. ‘డ్రగ్’ అనే పదానికి మందు అనే అర్థం ఉన్నా దాన్నెక్కువగా మాదకద్రవ్యాలకు వాడుతుంటారు. డ్రగ్ అనే పదం గుర్తొస్తే చాలు జలజ వాళ్ల బ్రదర్ గుర్తొస్తాడు. ఆమధ్య అతడికి పెళ్లి సంబంధం కుదిరింది. అయితే మాటల మధ్యలో ఆ అమ్మాయితో అతను తాను డ్రగ్ వాడతాను అన్నాడట. అతడి ఉద్దేశం ఔషధమనే. కానీ ఆ అమ్మాయి అపార్థం చేసుకుని అతడికి మాదకద్రవ్యాల అలవాటు ఉండే ఉంటుందని, ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్ళికి ‘నో’ చెప్పేసింది.
పద ప్రయోగాలు కూడా ఇలా కొన్నిసార్లు కొంపముంచుతాయి. అన్నట్లు ‘మందు’ అంటే ఇప్పుడు చాలామందికి అది బీరు, విస్కీ, రమ్ అనే అర్థమవుతోంది. ‘మందు బాబులు’ ప్రయోగం విరివిగా వినిపిస్తుంది.
‘మందుబాబులం మేము మందుబాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం‘ అని ఓ సినిమా పాటహిట్ అయింది కూడా. తాగుడు పాటలు దాదాపుగా చాలా వరకు హిట్ అయినవే. అలనాటి దేవదాసులో
‘జగమే మాయ.. బ్రతుకే మాయ…
వేదాలలో సారమింతేనయా.. ఈ వింతేనయా..
కలిమిలేములు కష్టసుఖాలు
కావడిలో కుండలని భయమేలోయి
కావడి కొయ్యేనోయ్.. కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి…
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్… బ్రహ్మానందమోయ్..‘
తాగుబోతు పాటగా కాక వేదాంతసారాన్ని బోధించే పాటగా చిరకాలం చిరంజీవిగా నిలిచిపోయింది.
ఈమందు మంచిది, మితంగా పుచ్చుకుంటే మంచిదేనని కొందరి ఉవాచ. ఫారిన్ సరుకయితే మరింత నాలుక్కోసుకుంటుంటారు. ఫారిన్ నుంచి వచ్చేవాళ్లు కూడా మందుసీసా కానుకగా తేవడం, దాన్ని అవతలివారు మహాభాగ్యంగా పుచ్చుకోవడం తెలిసిందే. మామూలు బడుగు జీవులు, మధ్యతరగతివారు ఈ మందు వలయంలో గిలగిలలాడుతుంటారు. మందు మానలేరు, ప్రభుత్వం నిషేధించలేదు. కారణం మందు ఇచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వం వదులుకుంటుంది?
ఇది అటుంచితే మందులు ఇంకెన్నో రకాలున్నాయి. పంటపొలాలకు మందులు, చెట్లకు మందులు, పశువులకు, పెంపుడు జంతువులకు మందులు, పక్షులకు మందులు.. ఇలా ఎన్నో. ఈ కోవిడ్-నైంటీన్ మహమ్మారి అంతం కావడానికి ఎంత కాలం పడుతుందో. ఈ హౌస్ అరెస్ట్ ఎన్నాళో. ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా ప్రజ కన్నుమూస్తున్న వేళ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చెప్పినట్లు
‘మాకు ఉగాదుల్లేవు.. ఉషస్సుల్లేవ’నే అనిపిస్తుంది. అయినా ఆశావాదిగా –
శార్వరి అర్థం ‘రాత్రి’ అయినా.. అది చీకటి రాత్రిగా కాక, వెన్నెల రాత్రిగా అవతరిస్తుందని.. అవనికంతటికి క్షేమకరి, శుభకరి అవుతుందని..
కుక్కర్ ఎన్నిసార్లు విజిల్ వేసిందోకానీ గట్టిగా మొత్తుకోవటంతో ఉలిక్కిపడి స్టవ్ ఆఫ్ చేశా. ఆలోచన కూడా ‘వస్తా, వెళ్ళొస్తా’ అంటూ అల్లంత దూరం వెళ్లింది.