మానస సంచరరే-45: చూపుల్లోకి ఓ చూపు!

9
8

[box type=’note’ fontsize=’16’] “ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడంలో సహకరించేది మనోనేత్రమే. మనోనేత్రం విశాలదృష్టిని కలిగి ఉండాలి. మనోనేత్రం నిర్మలంగా ఉంటే మానవత్వం పరిమళిస్తుంది” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]’క[/dropcap]న్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి…

ఘంటసాల, భానుమతిల యుగళం చెవులను కట్టిపడేస్తున్నా, ‘తప్పదుగా’ అనుకుంటూ వంటింట్లో సింక్ వైపు నడిచాను. ఎందుకంటే అక్కడ ‘గిన్నెలె నాకోసం కాచుకున్నవి.. విమ్ జెల్లు అందుకనే వేచి ఉన్నది’. అదన్నమాట సంగతి. ఇప్పుడు బద్దకిస్తే ఉదయానే గిన్నెలు తోమడం నాకస్సలు ఇష్టం ఉండదు. కరోనా గొడవతో పనిమనిషి వద్దనుకున్నాం. కనకమ్మ ఉంటే పొద్దున్నే ఐదులోపలే హాజరయ్యేది. కనకమ్మతో పాటు ఆ సీన్ మొత్తం గుర్తుకు వస్తోంది. ఆమె వచ్చాక పదినిముషాలు గడవగానే ఆమె ఫోన్ రింగయ్యేది..

“నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు..
సామజ వరగమనా.. నిను చూసి ఆగగలనా”

ఆమె గిన్నెలు తోమే చేతుల్ని తుడుచుకుని, ఫోను ఎత్తేలోపల పాట అలా సాగుతూనే ఉంటుంది. ఆమె ఏదో బదులిచ్చాక కాస్త నిశ్శబ్దం. మళ్లీ పది నిముషాల కల్లా..

‘నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ మళ్లీ మొదలు. అలా ఆమె పని పూర్తిచేసి వెళ్లేలోగా ముచ్చటగా మూడుసార్లు ఆ పాట వినిపించేది. అప్పుడు అదొక ట్రెండ్. ఎవరి నోట విన్నా అదే పాట.. అల వైకుంఠపురంలోని వెరైటీ సాంగ్..

‘నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు’..

సిరివెన్నెల లేఖిని నుంచి వెలువడిన, శ్రీరామ్ పాడిన వినూత్న గీతం. ఇదే పాతరోజుల్లో అయితే అనుకోగానే

‘నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణీ ఆ చిన్నది,ఆమె కనుచూపులోనే హాయున్నది..
సోగకనులారా చూసింది సొంపారగా
మూగకోరికలు చిగురించే ఇంపారగా.. నడచిపోయింది ఎంతో
నాజుకుగా, విడచి మనజాలను.. విరహతాపాలు,
మోహాలు రగిలించింది..

రాణీ రత్నప్రభలో కొసరాజు గీతాన్ని ఘంటసాల మాష్టారు అపూర్వంగా పాడారు. పాత అయినా, కొత్త అయినా దేని ప్రత్యేకత దానిదే.

గిన్నెలు యాంత్రికంగా కడుగుతున్నానే కానీ మనసు మాత్రం కళ్లలోగిళ్లలో సంచరిస్తోంది.

కళ్లు.. దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. ‘కళ్లు లేకపోతే కలియుగమే లేదు’ అంటారు కొందరు. కానీ కలియుగమే కాదు, ఏ యుగమూ ఉండదు. ద్వాపర యుగంలో, మహాభారతకాలాన శ్రీకృష్ణుడు, తన విశ్వరూప సందర్శనం సందర్భంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి చూపు ప్రసాదించాడంటారు. అనంతమైన అందాల ప్రకృతిని వీక్షించాలంటే కళ్లుంటేనేగా. లేదంటే చెంతనున్నవారు చెపితే విని ఊహించుకోవలసిందే.. ‘శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. కనులు లేవని నీవు కలత పడవలదు.. నా కనులు నీవిగా చేసికొని చూడు..’ అంటాడో హీరో.

అలాగే అంధురాలైన హీరోయిన్ కూడా తనను పెళ్లాడిన వ్యక్తి ఎలా ఉంటాడో ఊహించుకుంటూ… ‘ఓహో ఒహో పావురమా.. వయ్యారి పావురమా.. మావారి అందాలు నీవైన తెలుపుమా..’ అని పావురాన్ని అడుగుతుంది. పాపం.

మనిషి ముఖానికి అసలైన అందాన్నిచ్చేవి కళ్లే. కళ్లల్లో ఎన్ని రకాలో. ఆల్చిప్పల్లాంటి పెద్ద పెద్ద కళ్లు, సోగకళ్లు, మీనాల్లాంటి కళ్లు.. మళ్లీ రంగురీత్యా అయితే నల్ల కళ్లు, నీలికళ్లు, తేనె కళ్లు.. ఇలా ఎన్నెన్నో కళ్ల రంగుల గురించిన ఆలోచనతో వెంటనే ఓ పాట పలుకరించింది.

‘నీలికన్నుల నీడలలోన, దోర వలపుల దారులలోన
కరిగిపోయే తరుణమాయే.. అందుకో, నన్నందుకో…’

‘గుడిగంటలు’ చిత్రానికి సినారె రాసిన యుగళం.. పి.బి.శ్రీనివాస్, సుశీల ఆలపించిన చక్కటి గీతం. పి.బి.శ్రీనివాస స్వరం ప్రత్యేక మార్దవంతో గమ్మత్తుగా ఆకట్టుకుంటుంది. ‘సై’ సినిమాలో శివశక్తి దత్త రాసిన పాట ‘నల్ల నల్లాని కళ్ల పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా..’ బాగా హిట్టయ్యింది.

దేవుళ్ల వర్ణనలోనూ కళ్ల వర్ణన ప్రత్యేకం. మహా భాగవతంలో పోతన కృష్ణుణ్ని వర్ణిస్తూ

‘నల్లని వాడు పద్మనయనంబుల వాడు
కృపారసంబు పైజల్లెడు వాడు..అంటాడు.

మళ్లీ నవమస్కంధంలో శ్రీరాముణ్ణి వర్ణిస్తూ కూడా

‘నల్లనివాడు పద్మనయనంబుల వాడు
మహాశుగంబులున్.. అంటాడు.

‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు అరవింద దళాయతాక్షం‘.. శ్లోకంలో అరవిందమన్నా పద్మమే.

పిల్లలకు పాడే జోలపాటలోనూ
‘రామాలాలీ మేఘశ్యామా లాలీ
తామరస నయనా దశరథ తనయా లాలీ..’ అని పాడటం తెలిసిందే.

కళ్ల రూపు ఒక ఎత్తయితే చూపు మరో ఎత్తు. అందువల్లే కళ్లు మనసుకు గవాక్షాలని కూడా అన్నారు. ఓర చూపులు, కోర చూపులు, దొంగచూపులు, వాడిచూపులు, వేడి చూపులు, వలపు చూపులు, జాలిచూపులు, బేలచూపులు, దీర్ఘమైన చూపులు, శూన్యంలోకి చూపులు, నిరాశాపూరిత చూపులు, అన్వేషణా దృక్కులు.. ఇలా ఎన్నెన్నో. అన్నట్లు ‘పాపిష్టి కళ్లు’ పదప్రయోగం కూడా ఉంది.

‘దేవుడు చల్లగా చూడాలి’ అయితే.. గణేశుడి పైని ఓ పద్యంలో

‘తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్..

అంటాడు కవి. సో, మెల్లని చూపు కూడా గమనించాలి. శివుడు త్రినేత్రుడు.. ఫాలాక్షుడు. అయితే మూడోకన్ను తెరిచాడంటే భస్మీపటలం కావలసిందే అనటానికి ఆయన మన్మధుణ్ణి బుగ్గి చేసిన ఉదంతమొక్కటి చాలు.

బ్రహ్మ చతుర్ముఖుడు కాబట్టి ఆయనకు ఎనిమిది కళ్లుండాలి. మరి దశకంఠుడి విషయానికి వస్తే ఇరవై కళ్లు లెక్కేకదా మరి. ఇక ఇంద్రుడికయితే శాపకారణంగా ఒళ్లంతా కళ్లయ్యాయని పురాణ కథనం. మనిషికున్నవి రెండు కళ్లే అయినా మనో నేత్రం కలుపుకుంటే మనిషీ ముక్కంటే. కన్ను అదరటంలో కూడా శుభాశుభాలపై విశ్వాసాలున్నాయి. శాస్త్రీయతను పక్కనబెట్టి, పురుషులకు కుడికన్ను అదిరితే శుభమని, మహిళల కు ఎడమకన్ను అదిరితే మంచిదని నమ్ముతుంటారు.

మళ్లీ ప్రేమ విషయాలలో చూపులకుండే పవర్ తక్కు వేం కాదు.

‘చూపులతో గుచ్చిగుచ్చి చంపకే మెరే హాయ్
ఓలల్లా… గుండెల్ని గుల్లచేసి జారకే మెరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణయి పోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్…

‘ఇడియట్’ చిత్రంలో భాస్కరభట్ల గీతానికి శంకర్ మహదేవన్ తనస్వరంతో సొబగులద్దారు.

‘చూడకు, అలా చూడకు,
చూసి నన్ను పిచ్చిదాన్ని చేయకు.. అని హీరోయిన్ అంటే, ‘… పిచ్చివాణ్ణి చేయకు’ అంటూ హీరో. ‘విశాలి’ చిత్రానికి ఆత్రేయ రాసిన ఈ పాట సుశీల, రామకృష్ణ పాడగా, బాగా హిట్టయ్యింది. అసలు ప్రేమ గుట్టంతా చూపే చెపుతుంటూ ఓ కథానాయకుడు… ‘నీ కళ్లు చెబుతున్నాయి నను ప్రేమించావనీ’ అంటే,

మరో కథా నాయకుడు

‘నీ కళ్లు చూశాను.. కళ్లలో మన ఇల్లు చూశాను ఇంటిలోనికి రమ్మంటావని ఎదురుచూశాను’ అంటాడు. ‘ఆ కనులు.. పండు వెన్నెల గనులు’ అని ఓ భావుకుడు ఆరాధిస్తే,

‘ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు’ అంటాడు మరో భావుకుడైన హీరో.

మళ్లీ ‘తొలిచూపులోనే ప్రేమ జనించటం కొందరి ప్రేమానుభూతి. ‘కవితల కందని భావాలు కంటిపాపలే చెబుతాయి’ అంటాడో సినీకవి. విచారంలోనూ కళ్ల పాత్ర ఉంది. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఆత్రేయగారు ఏనాడో చెప్పారు. దేవదాసు చిత్రానికి ఆయనే..

‘కల చెదిరింది కథ మారింది
కన్నీరే ఇక మిగిలింది.. కన్నీరే ఇక మిగిలింది…
ఒక కంట గంగ, ఒక కంట యమున
ఒక్కసారే కలసి ఉప్పొంగెను
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు రాకూడదు.. అని దేవదాసు ఖేదానికి అక్షర రూపమిచ్చారు. ‘అంతులేని కథ’లో కష్టాలకే అంకితమైన కథానాయిక

‘కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు
కాగా ఇంకెవరికి తెలుసు?’ అని ఘోషిస్తుంది.

నాట్యంలో అయితే నవరసాలను నర్తకి కళ్లతోనే అభినయిస్తుంది. మనమూ కొన్ని సందర్భాల్లో కను సైగల భాషనే అనుసరిస్తాం. ‘కన్నుగీటటం’ కూడా ఇందులోకే వస్తుంది.

అసలు ‘నేత్రావధానం’ అనే ఓ ప్రత్యేకప్రక్రియ సైతం ఉంది. గతంలో వేటూరి ప్రభాకరశాస్త్రి, గుర్రం జాషువా వంటి ప్రసిద్ధ సాహితీవేత్తలకు నేత్రావధానంలో పట్టు ఉండేది. ఇటీవలికాలంలో కాశీభట్ల రమాకుమారి, లలితా కామేశ్వరిలు నేత్రావధానంలో ప్రసిద్ధులయ్యారు. మామూలు అవధానమే క్లిష్టమైన దనుకుంటే నేత్రావధానం మరి ఇంకెంత క్లిష్టమైందో కదా..

కళ్లు పూర్తిగా తెరవటంలోనూ, సగం వాల్చటంలోనూ కూడా ఎంతో తేడా ఉంటుంది. కవుల కంటిని దాటిపోయేదేదీ ఉండదుగా.. అందుకే

‘విరబూసిన కలువల కనులు అరమూసిన అది ఒక అందం
చిరుగాలికి నల్లని కురులు చెలరేగిన అది ఒక అందం… అంటాడో సినీకవి. అదే మన పురాణాల్లో అయితే ‘అర్ధనిమీలిత నేత్రి’ అని కాసింత గ్రాంథికంలో వర్ణిస్తారు.

‘మనుచరిత్ర’లో ప్రవరుడు హిమనగ సౌందర్యాన్ని వీక్షించి, మరలిపోదామనుకునే సరికి సిద్ధుడు తన పాదాలకు రాసిన పసరు అక్కడి మంచుకు కరిగిపోయిందని తెలిసి ఏం చేయాలో తెలియక అలా నడుస్తుంటే వరూధిని కనిపిస్తుంది. అప్పుడు ప్రవరుడు

‘ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ ఒంటిచరించె దోటలే
కివ్వన భూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్.. అంటాడు. ఎలా ఇల్లు జేరడమా అని భయపడుతున్నవాడు ప్రవరుడు. కానీ ఆమెను ‘బెదిరే లేడి కళ్లలాంటి కళ్లున్నదానా అని సంభోదిస్తాడు. తర్వాత ఆమె సంభాషణ చదివితే ఆమెకు భయమేమిటి అని నవ్వుకుంటాం. అతడిపై మనసుపడ్డ వరూధిని గడుసుగా ఇలా అంటుంది..

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరు వేడెదు భూసురేంద్ర
ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు
లాగింతియెగాదె, నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పునీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్

నీకు ఇంతలేసి కళ్లుండగా తోవ నన్నడగడమేమిటి, వచ్చిన తోవ నీకు తెలియదా అని క్లాసు తీసుకుంటుంది. ప్రేమలో పడ్డ వారికి ధ్యాస అంతా వారిపైనే.

‘సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే..
కనులు తెరిచినా నీవాయే, నే కనులు మూసినా నీవాయే …
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయె
కలవరపడి నే కనులు తెరువ నా కంటిపాపలో నీవాయే

గుండమ్మ కథ చిత్రంలో పింగళి నాగేంద్రరావు అందించిన ఈ మనోహర గీతం సుశీలమ్మ గొంతులో సార్ధకమైంది.

తల్లికి బిడ్డలు కంటిపాపల్లాంటి వారే. ఇంగ్లీషులో అయితే తల్లిదండ్రులకు బిడ్డ ‘ఏపిల్ ఆఫ్ ది ఐ’.

ఎంతో ప్రధానమైన కంటిచూపు బాగుండటానికి అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఏదో కారణంగా దృష్టిలోపాలు మామూలు. లాంగ్ సైట్, షార్ట్ సైట్ వగైరా సమస్యలు. ఆ సమస్యల్ని అధిగమించడానికి కళ్లద్దాలు. ఇప్పుడు కళ్లద్దాలు కూడా మోటయ్యాయి. లేజర్ ట్రీట్‌మెంట్‌తో కళ్లద్దాల అవసరం లేకుండా చేసుకుంటున్నారు. ఇక చలువ కళద్దాల షోకు సరేసరి. రేబాన్ గ్లాసెస్ వాడితే చాలా గ్రేట్.

ఇక అంధులకూ ఓ ప్రత్యేక లిపిని ప్రసాదించిన గొప్ప శాస్త్రవేత్త బ్రెయిలీ. దానిమూలంగానే అంధులు చదువుకోగలుగుతున్నారు.అంధులకు ప్రత్యేక పాఠశాలలున్నాయి. అంధుల పట్ల మానవీయతతో ప్రవర్తించి, కాసింత సాయపడటం మన కర్తవ్యం. కళ్లుండీ ఎన్నో విషయాల్లో అంధులుగా ప్రవర్తించేవారు కోకొల్లలు. కళ్లు కూడా ఒక్కోసారి మోసం చేస్తాయని నానుడి. కారణం దృశ్యాన్ని మాత్రమే కన్ను చూస్తుంది. ఆ దృశ్యానికున్న నేపథ్యం దానికి తెలియదు. మనిషి ఆ క్షణంలో కంటినే పూర్తిగా నమ్మేసి, ఆవేశపడి నానా అనర్థాలు తెచ్చుకోవడం పరిపాటి.

అన్నట్లు ‘చెడు కనవద్దు’ అనే ఆర్యోక్తిని సదా గుర్తుంచుకోవాలి. అలాగే కళ్ల అభిప్రాయాన్ని అనుసరిస్తూ ఉండలా అంటే అన్ని వేళలా కాదు. ఉదాహరణకు కొంతమందిని చూడగానే ఆకర్షణీయంగా లేరు అని మన కళ్లు రిపోర్టు ఇస్తాయి. కానీ వారితో పరిచయమై, వారి మంచితనం, మృదు స్వభావం, ప్రత్యేకతలు అర్థమై, మనల్ని ఆకట్టుకోవడం మొదలైతే అంటే వారి ఆత్మ సౌందర్యాన్ని గుర్తించిన మనోనేత్రం వారెంతో అందంగా ఉన్నారని కితాబిస్తుంది.

అన్నట్లు పంచేంద్రియాల్లో ప్రథమంలో నిలిచే నేత్రాలను దానం కూడా చేయవచ్చు. ఇందుకు ‘ఐ బ్యాంకు’లున్నాయి. మరణానంతరం కళ్లను ఐ బ్యాంకుకు డొనేట్ చేయవచ్చు. వారు అంధులకు వాటిని అమరుస్తారు. ఆ రకంగా మనిషి మరణించినా అతడి కంటిపాపలు మాత్రం మరొకరి కంట్లో చిరంజీవులుగా వెలుగుతూనే ఉంటాయి. ఆరకంగా మరొకరికి చూపునివ్వడం ఎంత గొప్ప సంగతి!

ఋషులకు దివ్యదృష్టి ఉంటుందంటారు. దాంతో లోకాల్లోని అన్ని సంగతులను గ్రహిస్తారు. సాధారణంగా ముందు జరగబోయేది ఊహించో, సిక్స్త్ సెన్స్ తోనో చెప్పినప్పుడు ‘నీకేమైనా దివ్యదృష్టి ఉందా’ అనటం పరిపాటి. అలాగే భవిష్యత్తుకు గురించిన అంచనాలతో ప్రణాళికల రచనలో ఉపయోగించేది దూరదృష్టి. ఇక మనోనేత్రాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఎందుకంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడంలో సహకరించేది మనోనేత్రమే. మనోనేత్రం విశాలదృష్టిని కలిగి ఉండాలి. మనోనేత్రం నిర్మలంగా ఉంటే మానవత్వం పరిమళిస్తుంది.. ఆలోచనా ప్రవాహంలో ఈది ఈది అలసట.. దాంతో ‘చాలిక చూపుల్లోకి చూపు’, ఇక నిముషమైనా ఆగనంటూ కళ్ల పైకి నిదురముంచుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here