మానస సంచరరే-49: ఎందరో గురుబ్రహ్మలు.. అందరికీ వందనములు!

10
7

[box type=’note’ fontsize=’16’] “వివిధరంగాల్లో తాము వెలుగుతూ, ఆచరణాత్మక బోధకులై, అందరికీ స్ఫూర్తిమంతులుగా నిలిచి, పరోక్షగురువులుగా ఎందరెందరికో మార్గదర్శనం చేసేవారందరూ కూడా గురువులే” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఎ[/dropcap]న్నాళ్లుగానో చదవాలనుకుంటున్నపుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’. కొన్నేళ్ల కిందట స్నేహితురాలొకరు నాకు బహకరించినా తగిన సమయం కుదరక చదవనే లేదు. ఇప్పుడా విషయం గుర్తురావడంతో బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్లి పుస్తకం కోసం చూస్తుంటే గులాబి రంగు ఆటోగ్రాఫ్ బుక్ ఒకటి జారిపడింది. దాన్ని పైకి తీస్తుంటే జ్ఞాపకపరిమళం నిలువనీయలేదు. దాంతో కుర్చీలో బైఠాయించి, పేజీలు తిప్పుతుంటే నాకు చదువుచెప్పిన టీచర్లందరి ఆటోగ్రాఫ్‌లు మాత్రమే కాదు, వారి మూర్తులే ప్రత్యక్షమై భక్తితో కూడిన అనిర్వచనీయ ఆనంద భావన.. నాకున్న ఈ కాసింత జ్ఞానం గురువుల ప్రసాదితమే అనుకుంటుంటే మది సంద్రంలో ఆలోచనా కెరటాలు ఎగసిపడసాగాయి.

గురుబ్రహ్మ గురువిష్ణు
గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః

ఈ శ్లోకం తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గురుస్తోత్రాలలో ఇదొకటి. ఆదిశంకరాచార్య విరచితమిది. అయితే ఈ పద్యానికి నేపథ్యంగా ఓ కథ ఉంది. అది.. పూర్వం కౌత్సుడు అనే విద్యార్థి ఓ గురుకులంలో విద్యనభ్యసించేవాడు. కౌత్సుడు చాలా తెలివైన విద్యార్థి, వినయసంపన్నుడు, గురువుగారికి ప్రీతిపాత్రుడు. ఓసారి గురువుగారు పొరుగూరులో పని ఉండి మూడురోజుల పాటు ఆశ్రమాన్ని వీడి వెళ్లవలసివచ్చింది. అందువల్ల మూడు రోజుల పాటు గురుకులం బాధ్యతను కౌత్సుడికి అప్పగించి వెళ్లారు. కౌత్సుడు గురువుగారు లేని లోటు తెలియకుండా యథావిధిగా గురుకులాన్ని నిర్వహించసాగాడు. అదే సమయంలో కౌత్సుడు జ్యోతిష శాస్త్ర విద్యార్థి కావడంతో తనకున్న పాండిత్యంతో గురువుగారి జాతకాన్ని పరిశీలించాడు. ఇంకేముంది, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కారణం కొద్దిరోజుల్లో రానున్న ఉగాదినాటినుండి గురువుగారికి కుష్టువ్యాధి సంక్రమించి, రెండు సంవత్సరాలపాటు గురువుగారిని పీడిస్తుందని గ్రహించాడు. అంతే.. కౌత్సుడి దుఃఖానికి అంతులేకపోయింది. మనసు మనసులో లేదు. నాలుగోరోజు గురువుగారు తిరిగివచ్చారు. విద్యార్థులకు శాస్త్రాలు బోధించారు. అనంతరం శిష్యులందరూ లేచి ఆశ్రమంబయటకు నడిచారు. కానీ కౌత్సుడు, గురువుగారి వద్దే ఉండిపోయాడు, అమితంగా దుఃఖించడం మొదలు పెట్టాడు. గురువుగారు ఆశ్చర్య పోయి, ఎందుకు దుఃఖిస్తున్నావో కారణం చెప్పమని అడిగారు. కౌత్సుడు విషయం వివరించాడు. గురువుగారు తనకు వ్యాధి రానున్నదని విచారించడానికి బదులు, శిష్యుడు తనకున్న అసంపూర్ణ పరిజ్ఞానంతోనే తనకు రానున్న వ్యాధి గురించి గ్రహించాడంటే అతడిదెంత గొప్ప మేధాసంపత్తో అని ఆనందించాడు. రెండు సంవత్సరాల తర్వాత తగ్గుతుంది కదా అని ఊరడించాడు. కానీ కౌత్సుడు, గురువుగారిని కాశీకి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తే రెండు సంవత్సరాలలో తగ్గేది, సంవత్సర కాలం లోనే తగ్గుతుం దని, తాను గురువుగారికి తోడుగా ఉంటానని చెపుతాడు. గురువుగారు ఎంత చెప్పినా వినడు. చివరకు గురువుగారు, ‘నువ్వు నాతో రావాలంటే మీ తల్లిదండ్రులు అంగీకరించాలి’ అంటారు. కొద్దిరోజుల్లోనే శిష్యుల విద్యాభ్యాసం ముగియడంతో వారి వారి తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకువెళతారు. కౌత్సుడి తల్లిదండ్రులు కూడా వచ్చినా, ఎంత చెప్పినా అతడువారితో వెళ్ళడు. చివరకు గురువుగారిని తీసుకుని కాశీకి వెళతాడు. అక్కడ బసచేసి, గురువుగారికి అన్ని సేవలుచేస్తూ, విశ్వేశ్వరుడికి పూజలు చేస్తూ, వేదం చదువుతూ భిక్షాటన చేసి, ఆ ఆహారాన్ని తెచ్చిగురువుగారికి అందించేవాడు. అయితే కాలక్రమంలో వ్యాధి తీవ్రమై గురువుగారికి బాధ, కోపం పెరిగిపోయి, శిష్యుణ్ణి దూషించడమే కాక, తెచ్చిన ఆహారాన్ని సైతం కాళ్లతో తన్నేయసాగాడు. అయినా కౌత్సుడు భరించాడు. అంతలో బ్రహ్మ విష్ణుమహేశ్వరులు మారు వేషాల్లో కౌత్సుడి గురుభక్తిని పరీక్షింప వచ్చి, అతడిని గురువును వీడి వెళ్లి పొమ్మని చెబుతారు. కౌత్సుడు ససేమిరా అంటాడు. దాంతో వారు నిజరూపంతో ప్రత్యక్షమై గురువును వీడి వెళితే నీకు మోక్షమిస్తామంటారు. అప్పుడు కౌత్సుడు గురుబ్రహ్మ శ్లోకం చెప్పి, ఆ మోక్షాన్ని గురువుగారికివ్వమని, ఆయనే తన పాలిటి పరబ్రహ్మమని, ఆయన ద్వారా తనకు మోక్షం లభిస్తుందని అంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతడి గురుభక్తికి ఆనందించి, అనుగ్రహిస్తారు.

మాతృదేవో భవః.. పితృదేవో భవ.. ఆచార్య దేవో భవ.. అతిధి దేవోభవ.. అంటూ పూజనీయుల ప్రాధాన్యతా క్రమాన్ని వివరించింది మన సంప్రదాయం. ఈ ప్రకారం తల్లిదండ్రుల తర్వాత పూజించవలసింది ఆచార్యుడిని అంటే గురువునే. మనిషికి తొలి గురువు అమ్మ. అమ్మ ఒడే తొలి బడి. ఆపైన విద్యాలయం మలిబడి, ఉపాధ్యాయులు మలిగురువులు. అయితే ఆధ్మాత్మికత నిండిన చిత్తంతో

నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణా.. అన్నాడు కృష్ణ శతకకర్త.

అసలు ‘గురు’ అనే పదాన్ని విశ్లేషిస్తే ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే తొలగించేవాడు… అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు గురువని అర్థం. ‘గురుగీత’ అనేది వేదవ్యాస విరచితం. ఇది స్కంద పురాణంలో భాగమే అని కొందరు విశ్వసిస్తే, మరికొందరు ఇది ‘విశ్వసార తంత్ర’ లో భాగంగా భావిస్తున్నారు. పార్వతీదేవి, గురువు గురించి, ముక్తి గురించి శివుణ్ణి ప్రశ్నించడం, ఆయన వివరించడం గురు గీతలోని విషయం.

గురు పూజోత్సవాలను ఏటా రెండు విశేష సందర్భాలలో నిర్వహిస్తుంటారు. అవి ఏటా ఆషాఢమాసంలోని పౌర్ణమినాడు వచ్చేగురుపూర్ణిమ (వ్యాస పూర్ణిమ), సెప్టెంబరు అయిదవ తేదీన వచ్చే టీచర్స్ డే (మహోపాధ్యాయ, మాజీ రాష్ట్రపతి, తత్త్వవేత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి). అన్నట్లు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబరు అయిదవ తేదీ. గురుపూర్ణిమ రోజున ఆధ్యాత్మిక గురువులను దర్శించి, వారిని సత్కరించి, ఆశీస్సులు పొందటం సంప్రదాయం. గురుపూర్ణిమ నేపాల్‌లో జాతీయ సెలవుదినం కూడా. అక్కడ ‘త్రినోక్ గుహ పూర్ణిమ’ పేరుతో బడులలో గురుపూజోత్సవం జరుపుతారు. పూలమాలలు ప్రత్యేకంగా తయారుచేసిన టోపీలతో గురువులను సత్కరిస్తారు. వేద, పురాణ, ఇతిహాస గ్రంథకర్త వేదవ్యాసుడు గురువులకే గురువు. అందుకే గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా పేర్కొంటారు. శివుడి తపోరూపం దక్షిణామూర్తిని ఆదిగురువుగా భావిస్తారు. పురాణేతిహాసాలలో ఎందరో గురువులు. మహావిష్ణువు ఆరవ అవతారంగా పేర్కొనే పరశురాముడు భీష్ముడికి గురువు. ద్రోణుడు, కర్ణుడు కూడా ఆయనకు శిష్యులే. మహాభారతంలో కురుపాండవులకు గురువు ద్రోణుడు. అందుకే భారత ప్రభుత్వం క్రీడారంగంలో విలువిద్య విభాగంలో ‘ద్రోణాచార్య అవార్డు’ను ఏర్పాటు చేసింది. ఏకలవ్యుడు సైతం ద్రోణుడి వద్ద విద్య నేర్చుకోవాలనుకున్నాడు. కానీ ద్రోణుడు తిరస్కరించాడు. దాంతో ఏకలవ్యుడు, ద్రోణుడి బొమ్మనే గురువుగా చేసుకుని, విలువిద్యలో నిష్ణాతుడయ్యాడు. ఆ తర్వాత ద్రోణుడికి ఆ విషయం విన్నవించుకున్నాడు. ద్రోణుడు అందుకు గురుదక్షిణగా అతడి బొటనవేలు కోరడం, ఏకలవ్యుడు మారుమాట్లాడక బొటనవేలు సమర్పించడం తెలిసిందే. గురువులలోని సంకుచితత్వానికి, శిష్యుల పట్ల పక్షపాత ధోరణికి ఏకలవ్యుడి కథ ఓ ఉదాహరణ. ఈ ఉదంతాన్ని ‘అడవిరాముడు’ చిత్రంలో వేటూరి గొప్ప స్ఫూర్తిదాయక పాటగా అందించారు. అది..

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ..
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహాపురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు..
ఏకలవ్యుడంటే ఎదురులేని బాణం.. తిరుగులేని దీక్షకి అతడే
ప్రాణం.. కులం తక్కువని విద్యనేర్పని గురువు బొమ్మగ మిగిలాడు..
బొమ్మ గురువుగా చేసుకొని బాణవిద్యలో పెరిగాడు..
వేలునిచ్చి తన విల్లును విడిచి.. వేలుపుగా ఇల వెలిగాడు…”

రామాయణంలో వాల్మీకి, శ్రీరాముడి గురువు. శ్రీరాముడి ఆజ్ఞ పై లక్ష్మణుడు, సీతను అడవిలో వదిలివేసినపుడు ఆమెకు, వాల్మీకి ఆశ్రమమే ఆశ్రయమైంది.

అంతేకాదు, లవకుశులకు, వాల్మీకి సకల శాస్త్రాలను, ఆయుధ విద్యలను నేర్పాడు. రామాయణం రచించాడు. సప్తర్షులలో ఒకడైన వశిష్ఠుడు రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నులకు గురువు. అలాగే గాయత్రి మంత్రాన్ని విరచించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గురువు, వారికి అస్త్రవిద్యలను నేర్పాడు. తాటక, మారీచ, సుబాహ వధలలో వారికి తోడ్పడ్డాడు. బృహస్పతి దేవతల గురువు. ఋగ్వేదంలో బృహస్పతి ప్రస్తావన ఉంటుంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు భృగువు కుమారుడు, సప్తర్షులలో ఒకడు. ఇలా ఎందరెందరో. మహాభాగవతంలో ‘ప్రహ్లాద చరిత్రం’ లో పోతన చదువు గురించి ఎంతో అర్థవంతమైన, అందమైన పద్యాలనందించారు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని గురువుల వద్దకు పంపే ముందు ఇలా అంటాడు..

చదవని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ.

అలాగే గురుకులంలో ఉన్న ప్రహ్లాదుని చూడటానికి వెళ్లి, ఏం చదువుకున్నావో చెప్పమని హిరణ్యకశిపుడు అడిగితే..

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్యశాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ.. అంటాడు ప్రహ్లాదుడు.

అసలైన గురువు ఎలా ఉంటాడో ‘బడిపంతులు’ చిత్రంలో చూడవచ్చు. అన్నిరకాలుగా భ్రష్టుపట్టిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు తీర్చిదిద్ది, హైస్కూలుగా ఎదిగేలా చేస్తాడు. ఆ గురువుగారికి, విద్యార్థులే స్వయంగా ఓ ఇంటినికట్టి ఇవ్వటం ఎంత గొప్ప సంగతి. బడిపిల్లలు ఉన్నత చదువులు చదివి, వివిధరంగాల్లో ఉన్నతపదవులను సాధిస్తారు. మాష్టారి ఇల్లు వేలం వేస్తున్నారని తెలిసి, ఓ శిష్యుడు తానే ఆ ఇంటిని కొని, తిరిగి మాష్టారికి సమర్పించడం మరింత అపూర్వం. ‘విశ్వరూపం’ చిత్రంలో ‘గురువు’కు సంబంధించి దాసరినారాయణరావుగారు రచించిన ఓ గొప్ప పాట ఉంది. అది..

నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు
అది మీరే మీరే మాస్టారు.. మా దేవుడు మీరే మాస్టారు..
ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు
మీ నవతకు నేతాజీ మీలో రగిలారు
అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు
దేశానికి మీరే సారథులు.. దేశానికి మీరే సారథులు ॥నూటికో॥

బడి, గుడి దేనికి ప్రాధాన్యత అనే అంశంపై ‘బుద్ధిమంతుడు’ చిత్రంలో కొసరాజు రచించిన ఓ చక్కని పాట ఉంది. ఇద్దరన్నదమ్ములు గుడి, బడి గురించి వాదించుకునే పాట అది..

బడిలో ఏముందీ దేవుని గుడిలోనే ఉందీ
భక్తిముక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే..
గుడిలో ఏముందీ బాబూ బడిలోనే ఉందీ
భుక్తి శక్తి కావాలంటే మాధవ సేవా చెయ్యాలంటే..
చదువుల సారం హరియని..హరి కూడా చదవాలని
చదువుల మర్మం హరియని..ఆ హరికీ గురువుండాలని
హరియే సర్వస్వమ్మని.. చదువే సర్వస్వమ్మని
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు
ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు…

‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రంలో సిరివెన్నెల మరో వెరైటీ గీతం రాశారు..

ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా కన్నా
అనుబంధపు తీరానికి నడిపించిన గురువని
వందనం చెబుతున్నా, నేనే గురుదక్షిణగా అంకితం అవుతున్నా.
ఇన్నాళ్ల మనదూరం ఇద్దరికీ గురువురా
ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా..

గురుశిష్యులకు సంబంధించి మేలైన హాస్యం అంటే ముఖ్యంగా గుర్తొచ్చేవి మాయాబజార్, పరమానందయ్య శిష్యులు చిత్రాలే. ‘మాయాబజార్’ లో ఘటోత్కచుడి రాజ్యంలో ఆచార్యుడు, శిష్యులు ఇలా.. శిష్యులకు ఏ పదం పలకటానికి నోరు తిరగదు. అస్మదీయులు అనమంటే అసమదీయులంటారు. అయినా ఘటోత్కచుడు పాండిత్యం కాదు ముఖ్యం జ్ఞానం అంటూ ఆ శిష్యుడికి వీరతాడు వేయిస్తాడు. అస్మదీయుడికి వ్యతిరేకపదం చెప్పమంటే మరో శిష్యుడు తసమదీయుడు అంటాడు. తను చెప్పని మాటలు కూడా పుట్టిస్తున్నారని గురువు అంటే, ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయంటూ అతడికి రెండు వీరతాళ్లు వేయిస్తాడు ఘటోత్కచుడు. దుష్టచతుష్టయం అనమంటే దుసటచతుసటయం అంటాడు ఇంకో విద్యార్థి.

దానికీ ఘటోత్కచుడు సానుకూలంగానే స్పందించి ఆ పదాన్ని అలా విరిచి పలకడమే సరైనదని మెచ్చుకుంటాడు. నవ్వుల పూవులు పూయించే సన్నివేశమిది. ఇక పరమానందయ్య శిష్యుల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. శాపవశాత్తు మూఢులైన శిష్యులు తమ అజ్ఞానంతో గురువుగారికి కష్టాలు తెచ్చిపెడుతూ నవ్విస్తారు. అయినా పరమానందయ్య ఎంతో సహనంతో, సహృదయంతో వారిని చివరివరకు మన్నిస్తాడు.

గురుశిష్యుల సంబంధాలు పవిత్రంగా ఉండాల ని చెప్పే సినిమా ‘సుందరకాండ’. విద్యార్థులు చదువుకుంటూ ప్రేమలోపడి, ఇబ్బందులకు గురైతే, వారికి సరైన మార్గం చూపి, వారి ప్రేమ గెలిచేలా చూసిన మాస్టారిని ‘కొత్త బంగారులోకం’ చిత్రం చూపించింది. నేటికాలంలో గురుశిష్యుల మధ్య అనుబంధాల్లో వచ్చిన మార్పుకు అద్దంపట్టే పాట ఒకటి ‘స్టూడెంట్ నెం.వన్’ చిత్రంలో ఉంది. కీరవాణి రాసిన ఆ పాట..

“ఓ మైడియర్ గర్ల్స్, డియర్ బాయ్స్
డియర్ మేడమ్స్, గురుబ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము
చదువులమ్మ చెట్టునీడలో..
వీడలేమంటు వీడుకోలంటు వెళ్లిపోతున్నాము..
చిలిపి తలపు చివరి మలుపులో..
బోటని మాస్టారి బోడిగుండు పై బోలెడు జోకులూ
రాగిణి మేడమ్ రూపు రేఖపై గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండుపిన్నులూ …
క్లాసురూముల్లోన కుప్పిగంతులు..
మరుపురాని తిరిగిరాని గురుతులండీ..
మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండీ”

అంటే..

“మనకు మనకు క్షమాపణలు ఎందుకండీ.. మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ..” అంటారు గురువులు.

హిందీ చిత్రాల్లో సైతం గురు, శిష్యులకు సంబంధించి ఎన్నోమంచి పాటలున్నాయి. ముఖ్యంగా ‘కితాబ్’ లో మాస్టర్ జీకీ ఆగయె చిట్టీ; ‘ఇంతిహాన్’లో రుక్ జానానహి; ‘సర్’ లో సర్ సర్ ఓ సర్ ఉయ్ లవ్ యు; ‘పాఠశాల’ లో ఆయే ఖుదా; ‘ఇన్సాఫ్ కీ దగర్‌పార్’ లో గుర్ బిన్ గ్యాస్ నహీ.. ఎంతో పాపులర్ అయ్యాయి. బోధనపై ఆంగ్ల కవయిత్రి మార్గరెట్ హేచర్ ‘ఎ టీచింగ్ ఫాంటసీ’ పేరుతో ఓమంచి పొయమ్ రాశారు. అది..

ఐ టీచ్.. ఐడియాస్ ఆండ్ వర్డ్స్ ఆర్ మై బిజినెస్
ఐ టాస్ దెమ్ ఇన్ టు ది ఎయిర్.. అండ్ వాచ్ దెమ్ ఫ్లోట్
సాఫ్టలీ యాజ్ ఆటమ్ లీవ్స్. దే ఫ్లోట్ ఎరౌండ్ యువర్ హెడ్స్
డ్రిఫ్ట్ ఇన్ పైల్స్ ఆన్ యువర్ డెస్క్‌టాప్స్
గైడ్ ఎలాంగ్ యువర్ స్లీవ్స్
అండ్ విస్పర్ డ్యాన్స్ ఎరౌండ్ యువర్ ఇయర్స్
సమ్ డే.. వన్ మే క్యాచ్ యువర్ అటెన్షన్
అండ్ ఇన్‌స్పైర్ యు విత్ ఇట్స్ కలర్
ఎట్‌లీస్ట్ ఫర్ ఎ సీజన్.

గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే.. అంటే గురువు అనుగ్రహం లేనిదే ఇహపరలోకాలలో సుఖం పొందడం దుర్లభం. గురువు వెలుగు.. గురువు జ్ఞానం. ‘గురువు’ అంశం పై ఎందరో మహనీయులు ఎన్నో కోణాలను ఆవిష్కరించారు.

తనకుతాను గురువైన వ్యక్తి లోక గురువు కాగలడు – జిడ్డు కృష్ణమూర్తి; నీ విచక్షణే నీకు గురువుగా ఉండాలి – షేక్‌స్పియర్; అనుభవం ఏకైక గురువు. మనం ఎన్నయినా మాట్లాడవచ్చు. హేతుబద్ధంగా తర్కించవచ్చు. కానీ అనుభవంలోంచి దరి స్తేనే సత్యం బోధపడుతుంది-స్వామి వివేకానంద; ఉపాధ్యాయుని చేతిలో పదునైన ఆయుధాలు విద్యార్థులు – డా.ఎపిజె అబ్దుల్ కలాం.

నేడు గురు అనే పదాన్ని సలహాలిచ్చే స్నేహితుడికి కూడా ఆ పాదిస్తున్నారు. అదొక వాడుకగా మారింది. ‘ఏం గురూ ఎలా ఉన్నావు?’ లాంటి పలకరింపులు మామూలయ్యాయి. ‘హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం..’ వంటి పాటలూ ఉన్నాయి. గురువునే మోసం చేసేవారిని ‘గురువుకే పంగనామాలు పెడతాడు’ అంటారు. అలాగే ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు’ వంటి సామెతలు ఉన్నాయి. లోకంలోని టక్కరి, సోమరి, అజ్ఞాన గురువులకు ఉదాహరణలు. గురజాడవారి కన్యాశుల్కంలోని గిరీశం, చిలకమర్తి వారి గణపతి నాటకంలో గణపతి పాత్రలు.

గురువులే భావిపౌరుల సృష్టికర్తలు. అందుకే గురువులు తమ వృత్తికి సంబంధించిన పవిత్రతను, గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సదా ఒక యెరుకతో ప్రవర్తించాలి. గురువు సైతం నిత్య విద్యార్థిగా జ్ఞానశోధన చేస్తూ, విద్యార్థులకు జ్ఞానాన్ని పంచాలి, పెంచాలి. అలాకాక గురువులే తప్పుటడుగులు వేస్తే విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వగలరు? ఇటీవల కాలంలో కొందరు గురువులు అవినీతికి పాల్పడుతూ, అంతకంటే హేయంగా కీచకులుగా మారుతూ గురువు అనే మాటకే కళంకం తెస్తున్నారు. అటువంటివారి వల్ల మొత్తం గురువర్గం పట్లే గౌరవం కొరవడుతోంది. ఒకప్పుడు ‘బతకలేక బడిపంతులు’ అనేవారు. కారణం వారికి జీతభత్యాలు సరిగా లేకపోవడమే. కానీ ప్రస్తుతం వారిది మెరుగైనపరిస్థితే. ఇప్పటి తరం విద్యార్థుల్ని క్రమశిక్షణలో ఉంచటం కూడా గురువులకు కష్టంగా ఉందన్నది నిజం. క్లాసులోని ఒక్కో విద్యార్థిని చేరదీసి మంచిచెడ్డలు విచారించి, వారి మనస్తత్వాన్ని అర్థంచేసుకొని, వారి ఆసక్తికి, తెలివితేటల స్థాయికి అనుగుణంగా విద్యనేర్పి, వారిని తీర్చిదిద్దే ఉపాధ్యాయులెందరు? విద్యార్థులు కూడా టీచర్లపట్ల గౌరవం చూపించడం మాట ఎలా ఉన్నా, నిక్ నేమ్‌లు పెట్టటం, క్లాసులో అల్లరిచేయడం, పాఠం వినకుండా చేయడం వగైరాలతో టీచర్లకు బోధనపై శ్రద్ధ సన్నగిల్లేలా చేస్తున్నారు. ఏమైనా విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తారు టీచర్లు. స్కూలు విడిచి వెళ్లినా, ఎంతకాలం గడిచినా తమపై చెరగని ముద్రవేసిన టీచర్‌ను వారు మరువలేరు. ఇందుకు సరైన దృష్టాంతంగా ఇటీవల వెలుగుచూసిన గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్‌కి సంబంధించిన వీడియోను చెప్పుకోవచ్చు. విద్యాలయాన్ని వీడిన ఇరవై ఆరేళ్ల అనంతరం సుందర్ పిచాయ్ తానెంతో అభిమానించే టీచర్  మాలి అబ్రహాంను కలుసుకున్నారు. ఆమె తనపట్ల చూపిన ప్రేమాభిమానాలు, కరుణ, ఆమె బోధనా విధానాలే తాను ఇంతగా ఎదగడానికి తోడ్పడ్డాయంటారు సుందర్ పిచాయ్. ఆమే తనకు ప్రేరణగా నిలిచారంటారు, ఆమె కౌన్సెలింగ్, గైడెన్స్ తననెంతో ప్రభావితం చేశాయంటారు. ఇరవై ఆరేళ్ల అనంతరం ఆయన, ఆమె ఇంటికి వెళ్లి, కుశలప్రశ్నలు వేసి, పట్టుచీరె బహకరించారంటే గురువుగా మాలి అబ్రహాం ఎంత గర్వించి ఉంటారో! పైగా సుందర్ పిచాయ్ అంటారు… తొంభైఆరులో మీరు రిటైరయ్యారు.. అయితేనేం తొంభై ఏడులో మరో మాలి అబ్రహాం అవతరించింది. నేను గూగుల్ సిఇఒ నయ్యాను..’ అంటారు. గురుశిష్యుల అనుబంధానికి చక్కటి నిర్వచనంగా నిలిచిన సందర్భమది. ప్రపంచంలో ఎందరెందరో మహనీయ గురువులున్నారు. కేవలం విద్యాలయాల్లోని గురువులు, ఆధ్యాత్మిక గురువులే కాదు. వివిధరంగాల్లో తాము వెలుగుతూ, ఆచరణాత్మక బోధకులై, అందరికీ స్ఫూర్తిమంతులుగా నిలిచి, పరోక్షగురువులుగా ఎందరెందరికో మార్గదర్శనం చేసేవారందరూ కూడా గురువులే. ‘ఓం న మః శివాయః’ తో మొదలయ్యే జ్ఞానసముపార్జన ఆయా వ్యక్తుల ఆసక్తి, ఉత్సాహం, పట్టుదల వగైరాలను బట్టి దినదిన ప్రవర్ధమానమవుతుంది. నా మనసు ఆల్బమ్‌లో నా అయిదో ఏట జరిగిన అక్షరాభ్యాస చిత్రం ప్రత్యక్షమైంది. విజయదశమినాడు, నాన్న తన ఒళ్లో కూర్చో బెట్టుకుని పలకమీద అక్షరాలను దిద్దిస్తోన్న అపురూపచిత్రం.. అక్షరాలు దిద్దించటమే కాదు, ఏమీ చెప్పకుండానే తన చేతలతోనే ఎంతగానో ప్రభావితం చేసి, తాను మరలిరాని లోకానికి వెళ్లిపోయినా ఈనాటికీ తనకు వెలుగుబాట చూపుతున్న అజ్ఞాతగురువు మా మంచి నాన్నే. గురుస్మరణలో ఉన్న నాకు కాలింగ్ బెల్ మోగటంతో ఆలోచనాకెరటాలు సద్దుమణిగి, అడుగులు అప్రయత్నంగా అటుగా.. తలుపు తీస్తే ‘మేడమ్’ అంటూ చిరునవ్వుతో పూలగుచ్చాన్నందించింది. నన్ను గురువుగా భావించే మాధురి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here