మానస సంచరరే-50: ‘లోకా సమస్తా హసితో భవంతు’!

11
6

[box type=’note’ fontsize=’16’] “చిరునవ్వును మించిన ఆభరణం లేదన్నది నిజం. అది ప్రకృతిసిద్ధ ఆభరణం. ఖర్చులేనిది, ఎవరూ దోచుకోలేనిది” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే సుస్మిత ఫోన్ చేసింది. కరోనా కష్టాలన్నీ ఏకరువు పెట్టి “ఏం చెప్పమంటావ్, ఇంట్లో కూడా నోరు తెరవడానికి లేకుండా పోయింది. హాయిగా నవ్వి ఎన్నాళ్లయిందో. నాకేమో అన్నింటికీ గలగలా నవ్వటం అలవాటని నీకు తెలుసుకదా. మా ఆయన కూడా నా నవ్వు చూసే లవ్ చేశాడని మన ఫ్రెండ్సందరికీ చాలాసార్లు చెప్పానా, అలాంటి మా ఆయన ఇప్పుడేమో, నేనిట్లా నవ్వాలని నోరు తెరుస్తానో లేదో ‘మూస్కో, మూస్కో, తుంపర్లు పడతయ్, జాగ్రత్తగా ఉండాలని తెలీదా?’ అంటూ కోప్పడుతున్నారు. పిల్లలేమో ‘ఇలా అయితే ఇంట్లో కూడా నీకు మాస్క్ పెట్టేస్తాం’ అని బెదిరిస్తున్నారు. హాయిగా నవ్వుకోకుండా ఇదేం ఖర్మో. ఈ కరోనా ఏదో ఖతం అయితే అర్జెంటుగా ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తా” అంది. “ఏం ప్రోగ్రామ్ స్మితా?” అడిగాను నవ్వుకుంటూ. ‘నవ్వుల సాయంత్రం’, “మీరంతా ఇప్పట్నుంచే బాగా నవ్వించేందుకు ప్రిపేర్ కండి. బాగా నవ్వించిన వాళ్లకు ప్రైజులు కూడా ఉంటా యి. కరువుతీరా నవ్వేద్దాం” అంది.

“ఓ.కే. ఇప్పుడు కూడా కరోనా మీదా, కరోనా టైమ్‌లో మనుషుల తీరు మీద, లాక్‌డౌన్ లాఫ్స్ అని.. జోకులు, కార్టూన్లు, కథలు ఎన్నెన్నో వాట్సాప్ అందరికీ షేర్ చేస్తోంది కదోయ్. చూస్తున్నావా?” అన్నాన్నేను. “చూస్తున్నా. కానీ ఏం లాభం? స్వేచ్ఛగా ఎక్కడ నవ్వుతున్నాం. మా ఇంట్లో అయితే మరీ.. నా నవ్వుని బ్యాన్ చేసేశారు. నవ్వుకోవాలంటే ఒంటరిగా, చాటుగా నవ్వుకునే పరిస్థితి. ఏమైనాసరే, మీరంతా నవ్వుల సాయంత్రానికి వచ్చేసి, నవ్వులు వండి వడ్డించాలి. మామూలు వంట సంగతి నేను చూసుకుంటా” అంది. “సరే. నేను ఎవరెడీ. ఉంటా మరి” అని ఫోన్ పెట్టేశాను.

కానీ నా మనసు నవ్వు చుట్టూ పరిభ్రమించడం మొదలు పెట్టింది. మనుషులందరికీ ఉన్న ఒకే ఒక భాగ్యం నవ్వగలగటం. ఈ భాగ్యం పెద్దలిచ్చే ఆస్తి కాదు, కష్టపడి ఆర్జించేది కాదు, కొంతమంది ముఖాలు సహజంగానే నవ్వుతున్నట్లుంటాయి. అసలు చిరునవ్వును మించిన ఆభరణం లేదన్నది నిజం. అది ప్రకృతిసిద్ధ ఆభరణం. ఖర్చులేనిది, ఎవరూ దోచుకోలేనిది. పోతన విరచిత భాగవతంలోని దశమ స్కంధంలో గోపికలు కృష్ణుణ్ణి వెదుకుతూ ఆయన ఎలా ఉంటాడో వర్ణించే పద్యం.. తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందింది. మృదుమధురమైన ఆ పద్యం..

నల్లనివాడు పద్మనయనంబుల వాడు గృపారసంబుపై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లేడుగదమ్మ! చెప్పరే!

ఇందులో ‘నవ్వు రాజిల్లెడు మోము వాడొకడు’ అని పోతన పలికారంటే ఆయనకు సౌందర్యంలో నవ్వు ప్రాముఖ్యత ఎంతో తెలుసు కనుకే.

‘నవ్వు’ పై సినిమా పాటలు ఎన్నెన్నో ఉన్నా ముందుగా గుర్తు వచ్చేది మాత్రం ‘జ్యోతి’ చిత్రానికి ఆత్రేయ రాసిన గీతం. అది..

సిరిమల్లెపువ్వల్లె నవ్వు.. చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు.. చిగురిస్తూ ఉండాలి నా నవ్వు.. నా నువ్వు.

తన ప్రేయసికి ఎలా నవ్వాలో సూచిస్తూ..

చిరుగాలి తరగల్లె మెలమెల్లగా.. సెలయేటి నురగల్లె తెలతెల్లగా..
చిననాటి కలలల్లె తియతియ్యగా.. ఎన్నెన్నోరాగాలు రవళించగా ॥సిరి॥

తర్వాతి చరణంలో ఆమె నగుమోమును ఇలా వర్ణిస్తారు..

నీ పెదవి పై నవ్వులే కెంపుగా.. ఆఁ నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా. చెక్కిళ్లపై నవ్వు నునుసిగ్గుగా.. పరువాన్ని ఉడికించి ఉరికించగా.. అంటాడతడు. అంతటితో ఆగకుండా.. నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా.. ఆ వెలుగులో నేను పయనించగా అని అతడంటే, ఆమె వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా.. నే మిగిలి ఉంటాను తొలినవ్వుగా.. అంటుంది. ఈ పాటలో స్వరాలతో సమంగా జానకి పండించిన నవ్వులు ప్రత్యేకంగా వీనుల విందుచేస్తాయి. లలిత మనోహరమైన ఈ పాట చాలా పాపులర్ అయింది..

నవ్వుల్లో అబ్బో ఎన్ని రకాలో.. చిరునవ్వులు, మందహాసాలు, గలగల నవ్వులు, ఇకఇకలు, పకపకలు, వికటాట్టహాసాలు, గేలి చేస్తూ నవ్వే నవ్వులు, సరదాగా వేళాకోళం చేస్తూ నవ్వే నవ్వులు, ముసి ముసినవ్వులు, విషపు నవ్వు ఇలా ఎన్నో.. మరి నవ్వే తీరులు అనేకాలు. కొంతమంది పడీపడీ నవ్వుతారు. కొంతమంది నవ్వు మొదలెట్టి మధ్యమధ్య విరామమిస్తూ సీరియల్ నవ్వు నవ్వుతారు. మరికొంతమంది పొట్టపట్టుకు ఊగిపోతూ నవ్వుతారు. ఇంకొందరు పక్కవాళ్లను పట్టుకుని లేదా వారి భుజం చరుస్తూనో నవ్వేస్తుంటారు. కొందరు నవ్వుతుంటే గాజుసీసా భళ్లున బద్దలైన శబ్దం వస్తుంది. ముప్పైరెండు పళ్లూ కనిపించేలా నవ్వేవారు కొందరయితే, పెదాలు విడి విడవడకుండా నవ్వేవారు మరికొందరు. కొందరు ఎదుటివారిని వెక్కిరించడానికి కిసుక్కున నవ్వుతారు. కొంతమంది నోటికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతారు. నలుగురు కలిసి నవ్వులు సాగిస్తే అవి పకపకలే. పసిపాపలకు కితకితలు పెడితే వాళ్లు నవ్వే నవ్వులు గమ్మత్తుగా ఉంటాయి. ఇలా చెప్పాలంటే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్టైల్.. కొంతమంది పరిచయస్తులో, స్నేహితులో ఎదురయితే టార్చిలైట్ ఆన్ చేసి, ఆఫ్ చేసినట్లు ఓ క్షణకాలం చిరునవ్వు వెలిగించి, మాయంచేస్తారు.

మహాభారతంలో తిక్కనగారయితే ముప్పయ్ రెండు రకాల నవ్వులు పరిచయం చేశారు. అందులో కొన్ని పిన్ననవ్వు, కల కలనవ్వు, బెట్టు నవ్వు, లేత నవ్వు, కినుక మానిన నవ్వు, సాదర దరహాసం, పౌఢస్మితం, నవ్వురాని నవ్వు, కన్నుల నవ్వు, అలతి నవ్వు వగైరాలు.. చిరునవ్వు గురించి చెప్పాలంటే పేరుకు ‘చిరు’ నవ్వే అయినా అది ముఖానికి ఇచ్చే అందం మాటల కందనిది. చిరునవ్వు ఎంత ప్రియమైనదో డా.సి.నారాయణరెడ్డిగారు ‘పగబట్టిన పడుచు’ చిత్రానికి రాసిన పాటలో ఇలా చెప్పారు. అది.. ‘చిరు నవ్వు వెల ఎంత.. మరుమల్లె పువ్వంత మరుమల్లె వెల ఎంత? సిరులేవీ కొనలేనంత..’ అని. నిజం కదూ. మనసును అలరించే మరో మంచి యుగళ గీతం.. ‘అగ్గిబరాటా’ చిత్రంలో సినారె అందించింది..

చిరునవ్వులోని హాయి.. చిలికించె నేటి రేయి
ఏనాడు లేని హాయి..
ఈనాడు కలిగెనోయి…
సిగపూవులోన నగుమోములోన వగలేవో చిందులేసి..

శ్రీశ్రీగారు నర్తనశాల చిత్రానికి సమకూర్చిన పాటలో మందహాసాన్ని అందంగా పొదిగారు. అది ఇలా…

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే సొగసరి..
చెలిమికోసం చెలి మందహాసం.. ఏమని వివరింతును గడసరి..

నవ్వు అందాన్ని ఎవరి ఊహను బట్టి ఎంత అందంగా అయినా వర్ణించుకోవచ్చు. ‘ఏకవీర’ చిత్రంలోని ‘తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు’ యుగళంలో నాయిక, నాయకుడి నవ్వుని మనోజ్ఞంగా అభివర్ణిస్తూ ‘నవ్వులా.. అవి.. కావు.. నవ పారిజాతాలు.. రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు..’ అంటుంది. దేవులపల్లి ‘కలం’కారీ ఇది. దేవులపల్లివారే ‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘కోతి బావకు పెళ్లంట.. కోవెలతోట విడిదంట.. రాశారు. అందులో.. ‘పల్లకి ఎక్కి కోతిబావ పళ్లికిలిస్తాడు.. మా కోతిబావ పళ్లికిలిస్తాడు’ అంటూ సరదా సరాగాలను చక్కగా పలికించారు.

స్నేహితులు, ఆత్మీయులు విచారంగా ఉంటే ఎలా చూడగలం? వారిని ఎలాగైనా నవ్వించాలని ప్రయత్నిస్తాం కదా. ‘నిప్పు లాంటి మనిషి’ చిత్రంలో దోస్త్ విచారంగా ఉండటం చూసి, ఆ దిగులును పోగొట్టి, మూడ్‌ను మార్చి హాయిగా నవ్వించాలని మిత్రుడు పాటందుకుంటాడు. సినారె అందించిన ఈ గీతం..

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..అంటూ
నిండుగా నువ్వు నేడు నవ్వాలి.. అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కల్ని కోసుకుని తెమ్మంటావా.. దిక్కుల్ని కలిపేయమంటావా..
దింపమంటావా ఆ చంద్రుణ్ణి.. తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ..
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న..
ఒక్కనవ్వే చాలు.. వద్దులే వరహాలు.. నవ్వరా…
నవ్వెరా హోయ్ మావాడు.. నవ్వెరా నిండుగా..
నవ్వెరా నాముందు రంజాను పండగ…

సంతోషం ప్రతీక నవ్వే కదా. అలాగే పదహారేళ్ల వయసు చిత్రంలో సినారె రాసిన మరో ఆణిముత్యం…

పంటచేలో.. పాలకంకి నవ్వింది.. పల్లకీలో పిల్లఎంకీ నవ్విందీ
పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా.. లేత పచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే.. గుమ్మాడి నవ్వవే.. గుమ్మాడి పువ్వులాగ
అమ్మాడినవ్వవే..
నువ్వు కంటి సైగ చేయాల, నే కొండ పిండి కొట్టాల
మల్లినవ్వే మల్లి పువ్వు కావాల.. ఆ నవ్వుకే ఈ నాప చేను పండాల..
కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే.. నవ్విస్తే…
బంగారు పాలపిచ్చుక మా మల్లి నవ్వాల పకపక

బలేబలే నవ్వాల పకపక.. అంటూ ఆ పైన చిన్న సరదా కథ పాటలాగా సాగుతుంది.. చివరకు ‘తదరిన తదరిన’ కు గాడిద ఓండ్ర జతకలపడంతో నాయిక పకపక నవ్వుతుంది. శ్రోత, ప్రేక్షకులు కూడా హాయిగా నవ్వుకునే సన్నివేశమిది. ఇందులో మధ్యలో వృద్ధురాలి పాట, నవ్వు సందర్భంలో జానకి గాత్ర ప్రతిభ అనన్య సామాన్యం.

అన్నట్లు మొలక నవ్వుల మాట చెప్పుకోవాలి. ‘ఆ రజనీకర మోహన బింబము.. నీ నగుమోమును బోలునటె..’ అని సాకీలోనే ప్రేయసి నవ్వుముఖాన్ని పొగిడి, ఆ పైన ‘తలనిండ పూదండ దాల్చిన రాణీ, మొలక నవ్వుల తోడ మురిపించబోకే నారాణి..’ అనే ఘంటసాల లలితగీతం ఎంతో పాపులర్. ‘నవ్వుల నదిలో పూవుల పడవ కదిలే.. ఇది మైమరపించే హాయి.. ఇక రానీ రాదీ రేయి..’ ఓ జంట పాడుకుంటే.. ‘నవ్వు.. నవ్వించు.. నీ నవ్వులు.. పండించు’ అని ఓ నాయకుడు ఆలపిస్తాడు. ‘నవ్వని పూవే నవ్వింది, తన తుమ్మెదరాజును రమ్మందీ’ అని ఓ నాయిక ఆలపిస్తే, ‘నవ్వవే నాచెలీ, చల్లగాలి పిలిచేను, మల్లెపూలు నవ్వేను.. వలపులు పొంగే వేళలో..’ అంటాడు మరో నాయకుడు. ఇంకో హీరో ‘ముసిముసి నవ్వులలోన కురిసెను పువ్వులవాన’ అంటే, మరో నాయిక పిలల్లను ఆడిస్తూ ‘సన్నజాజి తీవెలోయ్, సంపంగి పూవులోయ్… ఇల్లుతీసి పందిరేసి పకపక లాడితే పిల్లలున్న లోగిలని దేవుడె మెచ్చేను’ అంటుంది. మరో మాతృమూర్తి ‘పాపాయి నవ్వాలి, పండగే రావాలి.. మా యింట కురవాలి పన్నీరు’ అని పాడుకుంటుంది. ‘బడిపంతులు’ చిత్రంలో పంతులుగారి భార్య ‘మీ నగుమోము నాకనులారా కడదాకా కననిండు..’ అంటూ తన ఆకాంక్షను వెల్లడించే గీతం పాడుతుంది. త్యాగరాజుగారు కూడా ‘నగుమోము గనలేని నా జాలి తెలిసి.. ననుబ్రోవ రారాద శ్రీరఘువర..’ అంటూ రాముణ్ణి వేడుకున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో నవ్వులు ఆపదలను తెచ్చి పెడతాయనటానికి అనేక దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. వినాయకుడి కథలో బొజ్జనిండా అందరూ సమర్పించిన నైవేద్యాలను భుజించి, తల్లిదండ్రుల వద్దకేగి వారికి ప్రణామాలు చేయబోయి, ఉదరభారంతో ఇబ్బంది పడటం చూసి చంద్రుడు వికటంగా నవ్వటం, దాంతో వినాయకుడి పొట్టపగిలిపోవటం, పార్వతి చంద్రుడికి శాపమివ్వటం వగైరా అంతా అందరికీ తెలిసిన పురాణకథే. అలాగే మహాభారతంలో మయసభ చూడడానికి వచ్చిన దుర్యోధనుడు అక్కడి చిత్ర విచిత్రాలకు అయోమయానికి లోనయి, నీళ్లు లేవని భ్రమించి కాలుజారి పడటం, అది చూసి ద్రౌపది నవ్వడం.. దాన్ని అవమానంగా భావించిన దుర్యోధనుడు వారిపై మరింత కక్ష కట్టడం తెలిసిందే. నిజజీవితాల్లో కూడా కొన్నిసార్లు యధాలాపంగా నవ్వినా అవి వికటించే సందర్భాలు ఉంటుంటాయి. అందుకే అలాంటి వేళల్లో తా’నవ్వక’ నొప్పింపక రీతిలో ఉండాలి. ఇతరులను గేలిచేసే నవ్వులు వద్దేవద్దు. గతంలో ఆడవాళ్లు నవ్వకూడదని ఆంక్షలు విధించేవారు. ఆ తర్వాత అది అర్ధరహితమని కొట్టిపడేయటమూ జరిగింది. అయితే అమ్మాయిల నవ్వుల కోసం రోమియోలు పడరాని పాట్లు పడుతుంటారు. ఒక్కోసారి ఆ అమ్మాయి ఎవర్నిచూసి నవ్విందో కూడా అర్థం కాక తన్నుకుంటారు. ఇలాంటి సందర్భమే ‘అసాధ్యుడు’ చిత్రంలో కాలేజ్ డే కల్చరల్ ప్రోగ్రామ్‌లో ఐటమ్‌గా ఉంటుంది.

నిన్ను చూసి నవ్విందా, నన్నుచూసి నవ్విందా
బందరులడ్డూ ఎక్స్ వై జడ్డూ బాగుందోయ్ బాగుంది
నన్నే చూసి నవ్వింది, నా పై కన్ను వేసింది
బంగినపల్లి మామిడిపండు బాగుందోయ్ బాగుందోయ్..
అయితే మనం వెళ్ళొద్దాం.. ఎక్కడికంటా?
ఆ పిల్లను అడిగేద్దాం… ఏమనంట?
నిను చూసి నవ్విందో, నను చూసి నవ్విందో
నిన్నైనా నన్నయినా అది చూసిందో, నవ్విందో ఇక తేల్చేద్దాం పద పద
అమ్మా, చెప్పవే ముద్దుగుమ్మా! బంగారు బొమ్మా! అమ్మా చెప్పవే..
నీవు విసిరిన నవ్వు పువ్వులు ఎవరి గుండెల దూరెనమ్మా..
నీవు మెచ్చిన, నీకు నచ్చిన మందభాగ్యుండెవ్వరమ్మా అమ్మా..
ఛీఛీ అమ్మా ఏమిట్రా వాజమ్మా.. హలో మై డార్లింగ్ ప్లీజ్..
అప్పుడు ఆ అమ్మాయి
వీధిలో పోవు అమ్మాయి వెంటనంటి ఈలలను వేసి చాల గగ్గోలు
చేసి.. ఇంటి కేతెంచి ఇకిలించు కొంటె చవట నాప ఎవ్వడో ఆతని జూసి నవ్వినాను..అంటుంది. అంతే ఆ ఇద్దరూ..
చవటాయను నేను.. ఒఠ్ఠి చవటాయను నేను..నీకంటే పెద్ద చవటాయను నేను.. వఠ్ఠి చవటాయను నేను కావాలంటే క్వాలిఫికేషన్ చెపుతాను వింటేను..

అని పోటీపడి తమ ‘ఘన’ చరిత్ర చెపుతారు. నవ్వుల పువ్వులు పూయించే పాట యిది.

నవ్వు కేవలం మనిషి సొంతమని పొరబడుతుంటారు. నవ్వే పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి. లాఫింగ్ కూకబుర్రా, లాఫింగ్ గల్, లాఫింగ్ ఔల్, లాఫింగ్ ఫాల్కన్, వైట్ క్రెస్టెడ్ లాఫింగ్ త్రష్, చింపాంజీలు ఇలా ఎన్నో నవ్వే ప్రాణులున్నాయి. నైట్రస్ ఆక్సైడ్ పీలిస్తే నవ్వులే నవ్వులు. ఫెంగ్ షూ ప్రకారం లాఫింగ్ బుద్ధ ఆనంద చిహ్నం. అందుకే లాఫింగ్ బుద్ధ బొమ్మల్ని ఇళ్లలో అలంకరిస్తుంటారు. నవ్వుకు సంబంధించి తెలుగులో, నవ్విన నాప చేనే పండుతుంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు వంటి సామెతలెన్నో ఉన్నాయి. గతంలో తెలుగువారి పెళ్లిళ్లల్లో సరదాలకు, నవ్వులకు ప్రాధాన్యం బాగా ఉండేది. వియ్యాలవారి విందు గురించి భోజనాల సమయంలో హాస్యపూరితంగా పాడే పాట చాలా పాపులర్. అది..

విందు చేసినారు వియ్యాల వారింట
విందుమాట చెపితే వింతగా తోచును
పప్పు ఉడకలేదు.. చారు కాగలేదు
అరటికాయ కూర పోపే అంట లేదు
ఏలాగు భోంచేతుము.. మే మేలాగు భోంచేతుము..
విస్తళ్లు వేశారు.. చారెడేసి లేవండీ
హస్తంబుతో కలుపుటకు ఔరర చోటులేదు
ముక్కబియ్యము వండిరి.. దానిలోకి ముద్దపప్పే చేసిరి
లడ్డు, జిలేబీల పాకములో మడ్డి తేలిందట
వడ్డించే వదినగారి వడ్డాణం ఊడిపోయే..

చివరి వాక్యం మరీ హైలైట్. అయితే ఇవన్నీ వియ్యాలవారి పై కోపంతో సాధిస్తూ పాడేవి కాదు, కేవలం సరదాగా నవ్వుకోవడానికే. ఈ నవ్వించే పాట వింటూ అంతా ఆనందంగా విందారగించే వారు, వడ్డించేవారు కూడా శ్రమ తెలియకుండా వడ్డించేవారు. ఇక ‘ఏ బేబీస్ లాఫ్టర్’ పేరుతో సింథియా బుహెయిన్ బేలో ఓ మంచి పొయమ్ రాశారు. అది…

ఈచ్ టైమ్ ఐ హియర్ ఎ బేబీస్ లాఫ్టర్
ఐ ఫీల్ ఎ టికిల్ ఇన్ మై హార్ట్
ఐ హావ్ టు స్టాప్ అండ్ లిజన్ బెటర్
క్యాచింగ్ ఈచ్ నోట్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్
సచ్ ఇన్నోసెంట్ లాఫ్ ఇన్ జాయ్ రిలీజ్‌డ్
ఎ సూతింగ్ బామ్ ఫర్ ఎ వియర్డ్ సోల్
ఆల్ ఎర్త్‌లీ వర్రీస్ సీమ్ టు ఈజ్
ఎ బేబీస్ లాఫ్టర్ మేక్స్ మి హోల్..

ప్రస్తుత కాలంలో నవ్వును ఖర్చులేని దివ్యౌషధంగా అనేకులు గుర్తిస్తున్నారు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు, నలభై విధాల మేలు అంటున్నారు. లాఫింగ్ క్లబ్బులు వెలిసింది ఈ నేపథ్యం లోనే. నవ్వు.. మానసిక, భౌతిక ప్రభావాల గురించిన శాస్త్రాన్ని ‘జెలోటాలజీ’ అంటారు. నవ్వు వల్ల కొటికోల్ అయాన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవి ఆ వ్యక్తి బాధను మరిపిస్తాయి. లాఫ్టర్ థెరపీ వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బిగ్గరగా నవ్వినపుడు ముఖంపై ఉండే కండరాలు సంకోచ, వ్యాకోచం చెంది, ముఖం కాంతివంతమవుతుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు మరో ఏడేళ్లు ఎక్కువ జీవిస్తారని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. నవ్వులతో అలరించేందుకు ఎన్నో హాస్యరచనలు, జోక్స్, కార్టూన్లు, హాస్య నాటకాలు, నాటికలు, కామెడీ సినిమాలు, కామెడీ షోలు అందుబాటులో ఉన్నాయి. అయితే హాస్య ప్రమాణాలు పడిపోతున్నాయన్నది చాలామంది అభియోగం. ఎందరో తెలుగు రచయితలు హాస్యాన్ని పండించారు, పండిస్తున్నారు. గురజాడవారి కన్యాశుల్కం నాటకం నిజానికి సీరియెస్ సబ్జెక్ట్ అయినా కథను నడిపిన తీరు పాఠకుణ్ణి నవ్వుల్లో ముంచెత్తుతుంది. బహుశా హాస్యయుతంగా ఉంటే పాఠకులు ఎక్కువగా ఆకర్షితులై చదువుతారని గురజాడ భావించారేమో. మొక్కపాటి వారి బారిష్టర్ పార్వతీశం, చిలకమర్తివారి గణపతి వగైరాలు అందరికీ పరిచితాలే. ముళ్లపూడివారి బుడుగు చిన్నా, పెద్ద అందరినీ అలరించింది. మల్లిక్ ‘నవ్వితే నవరత్నాలు’ నవ్వులపంట పండించాయి. డా.శంకరనారాయణ గారు హాస్యంలో ప్రసిద్ధులై ‘హాస్యబ్రహ్మ’ బిరుదునందుకొన్నారు. గరికపాటి నరసింహారావు గారి ప్రసంగాల్లో హాస్యం శ్రోతలను అమితంగా ఆకర్షిస్తుంది. మిమిక్రీ రంగంలో గతంలో నేరెళ్ల వేణుమాధవ్ గారు, ప్రస్తుతం శివారెడ్డి, శ్రీనివాస్ తదితరులెందరో తమ హాస్యంతో ప్రజలను అలరించారు, అలరిస్తున్నారు. మాయాబజార్ (పాత) సినిమా కూడా ఆద్యంతం నవ్వించే చేతలు, మాటలతో ఆహ్లాదకరంగా ఉండి న భూతో న భవిష్యతిగా నిలిచింది. మిస్సమ్మ, గుండమ్మకథ వంటి చిత్రాలు చక్కటి హాస్యాన్ని అందించాయి. గతంలో కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం, కెవిచలం, గిరిజ, రమాప్రభ, గీతాంజలి, శ్రీలక్ష్మి మొదలై నవారు హాస్యతారలుగా ఒక వెలుగు వెలిగారు. జంధ్యాల దర్శకత్వంలో అహనా పెళ్లంట, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్, ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడిపంబ’ వగైరాలెన్నో హాస్యాన్ని బాగా పండించాయి. ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అన్నారు జంధ్యాల. వీరి సినిమాల్లో సుత్తి (మామిడిపల్లి) వీరభద్రరావు, సుత్తివేలు (కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు) జంట పండించిన హాస్యం ఇంతా అంతాకాదు. అప్పుల అప్పారావు, ఏప్రిల్ ఒకటి విడుదల వంటి చిత్రాలు నవ్వులపూలు పూయించాయి. ఇవివి సత్యనారాయణగారి ‘కితకితలు’ పూర్తి నిడివి హాస్యచిత్రం. ఇక కమెడియన్‌గా బ్రహ్మానందంగారు గిన్నిస్ కెక్కిన తెలుగు వారి ఖ్యాతి పెంచారు. నవ్వు ప్రస్తావనలో చార్లీ చాప్లిన్‌ను తప్పక స్మరించుకోవాలి. కేవలం హావభావాలతో ఆయన పండించిన హాస్యానికి ప్రపంచమే ఫిదా అయింది.

పాత తరంలో లారెల్ హార్డీ కామెడీ జంటగా ప్రసిద్ధులయ్యారు. ‘నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా చచ్చినాక నవ్వలేవురా.. ఎందరేడ్చినా తిరిగిరావురా… అందుకే నవ్వుతూ బతకాలిరా’. నిజం. బతికినంతకాలం హాయిగా నవ్వాలి, ఇతరులను నవ్వించాలి అనుకుంటుంటే కొన్నేళ్లపాటు నేను ప్రయాణించిన దారిలో నా కళ్లముందు నిలిచిన బోర్డులు గుర్తుకువచ్చాయి. కార్లు రిపేరు చేసే చోట.. పంచర్ చేయబడును, విడో రిపేరు, అటుపక్కనే సిఎమ్ఎస్ వాహనం పై ‘బ్యాంక్ ఆన్ డ్యూటీ’, దాంతో ఆగనంటూ నవ్వు పరుగెత్తుకొచ్చింది. ఆ నవ్వులజోరులోనే మరో అల్టిమేట్ బోర్డు గుర్తుకొచ్చింది. అది…

‘వక్షో రక్షతి రక్షితః!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here