మానస సంచరరే-53: జయమ్ము నిశ్చయమ్మురా

8
6

[box type=’note’ fontsize=’16’] “కేవలం బలం, శక్తి, సామర్థ్యాలే విజయాన్ని అందిస్తాయను కోవడం పొరపాటు. గర్వంతో, హద్దులు మీరిన ఆత్మవిశ్వాసంతో ఏమాత్రం అలసత్వం వహించినా, విజయం చేజారిపోతుంది” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]అ[/dropcap]ఖిలాండేశ్వరి.. చాముండేశ్వరి

పాలయమాం గౌరీ.. పరిపాలయమాం గౌరీ..

ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి

ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి

సకలభోగ సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి దేవీ.. అఖిలాండేశ్వరి…

కర్ణపేయమైన పాట. దసరా పండుగ రోజులేమో ఈ పాట తరచు వినిపిస్తోంది. అష్టలక్ష్ములలో విజయలక్ష్మి ఒకరు. అందరికోరిక విజయసాధనే. అందుకే

జననీ శుభకామినీ, జయశుభకారిణి, విజయరూపిణీ..జననీ …

నీ దరినున్న తొలగు భయాలు, నీ దయలున్నా కలుగు జయాలు..

నిరతము మాకు నీడగ నిలచి జయమునీయవే అమ్మా…

జయము నీయవే అమ్మా భవానీ..

అని అమ్మను వేడుకునేది.. తెలుగు ఇళ్లలో నిన్న మొన్నటి వరకు జయలక్ష్మి, విజయలక్ష్మి, జయశ్రీ పేర్లు సర్వ సాధారణం. అలాగే విజయ్ పేరు కూడా. అర్జునుడికి ఉన్న అనేక పేర్లలో విజయుడు కూడా ఒకటి. తెలుగు సినిమాలయితే పేరులో విజయం ఉన్నవి.. విక్రమార్క విజయం, శ్రీకృష్ణ విజయం, వినాయక విజయం, విజయం మనదే, దేవీ విజయం, భామా విజయం, విజయం, జయం.. ఇలా ఎన్నెన్నో.

విజయం అనేది కేవలం కోరుకుంటే సరిపోదు. ఏ విజయానికైనా ఆత్మ విశ్వాసంతో కూడిన అకుంఠిత కృషి ముఖ్యం..

మళ్లీ మళ్లీ రాదండి ఈక్షణం

చిన్ని మాట నీ చెవిని వేయనీ

నిన్ను నీవే నమ్ముకుంటే నింగి వంగదా..

ఎంతో స్ఫూర్తినిచ్చే ఈపాట నాకు భలే నచ్చుతుంది. ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రానికి భాస్కరభట్ల యువత మెచ్చేలా ఈ పాటనందించారు. పాట వింటూ ‘అంతటి నమ్మకంతో, సంకల్పశుద్ధితో ప్రయత్నిస్తే విజయం సొంతమవటం ఖాయం’ అనుకుంటుంటే నీట్ ఫలితాలు వచ్చేశాయన్న వార్త.. వెంటనే నాకు నీలిమ గుర్తుకొచ్చింది. ఎందుకంటే వాళ్లబ్బాయి ప్రవీణ్‌కు మెడిసిన్‌లో సీటు రావాలని ఓ పాపులర్‌ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించింది. అంతేకాదు, కోచింగ్ సెంటర్‌కు దగ్గరగా ఉంటే అబ్బాయికి టైమ్ వేస్ట్, అలసట లేకుండా ఉంటాయని ఇల్లు కూడా మారింది. అబ్బాయి చదువుకు నీలిమ పడిన హైరానా ఇంతా అంతా కాదు, నీలిమ అనే కాదు, ప్రస్తుతం దాదాపుగా తల్లిదండ్రులందరి పరిస్థితి అలాగే ఉంది. ఎదురుగా పేపర్, నీట్‌లో ఆ పాపులర్ కోచింగ్ సెంటర్ నుంచి ఉత్తమ ర్యాంకుల పొందిన వారి ఫొటోలు. హఠాత్తుగా నా కళ్లు ఓ ఫొటో దగ్గర ఆగిపోయాయి. అవును నీలిమ కొడుకే. అరవైఐదో ర్యాంకు.

నీలిమ కష్టం ఫలించింది. వెంటనే ఫోన్ చేశా. ..’ఇన్ అనదర్ కాల్’ అని రావడంతో వెంటనే శుభాకాంక్షలంటూ వాట్సాస్ మెసేజ్ పంపాను. ఈ విజయదశమి ప్రవీణ్‌కు గొప్పవిజయాన్నే అందించింది.

విజయదశమి విశిష్టమైన రోజు. ఈ రోజున ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుందని చాలామంది నమ్మకం. అయితే ఇది తప్పు, అది కేవలం యుద్ధాలకు మాత్రమే అనేది మా ఫ్రెండ్ మాలిని. ఇటీవలి సంవత్సరాలలో వ్యక్తిత్వ వికాసంపై ఎందరో పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాస్తున్నారు. విజయం సాధించడమెలా?, సక్సెస్‍కు ఆరు సూత్రాలు, ఓటమిని ఓడించాలంటే, విశ్వాసమే విజయానికి పునాది, గెలుపు సులువులు.. ఇలా కోకొల్లలు. రాజుల కాలాల్లో ‘విజయమో వీరస్వర్గమో’ అనేవారు. అనుక్షణం వందిమాగధులు జయీభవ.. దిగ్విజయీభవ.. అనేవారు. ఇప్పటికీ సైన్యంలో ఉన్నవారిది అదే స్ఫూర్తి.

ఏ విషయంలో అయినా పెద్ద అడ్డుగోడలుగా నిలిచేవి ఆత్మన్యూనత, భయం, నిరాశ, కృతనిశ్చయులు కాకపోవటం, చిత్తశుద్ధి, పట్టుదల లేకపోవటం, కృషిలేమి వగైరాలు.

జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా…

కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును..

ఈ లోకమందు సోమరులై ఉండకూడదు, ఉండకూడదు

పవిత్రమైన ఆశయాల మరువకూడదు,

మరువకూడదు.. జయమ్ము..

గాడాంధకారమలముకొన్న భీతిచెందకు..

సందేహపడక వెలుగు జూపి సాగు ముందుకు, సాగు ముందుకు

నిరాశలోనే జీవితాన్ని కుంగదీయకు, కుంగదీయకు ॥జయమ్ము॥

పరాభవమ్ము కల్గునంచు పారిపోకుమోయ్..

జయమ్ము నిన్వరించుదాక పోరి గెల్వవోయ్, పోరి గెల్వవోయ్

స్వతంత్రయోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్, నిల్వబెట్టవోయ్..

కొసరాజుగారు ఎంత చక్కటి గీతం.. అందించారో.. గతంలో రాచరిక వ్యవస్థలో వీరత్వానికే అధికారం. విజయమో, వీరస్వర్గమో అన్న స్ఫూర్తితో వీరులు పోరాడేవారు. ప్రపంచ చరిత్రలో వీరులెందరో.. అయితే ఇరవై ఏళ్ల పిన్నవయసులోనే గద్దెనెక్కి, ముప్పయ్ రెండేళ్ల వయసుకే అలెగ్జాండర్ గ్రీస్ నుండి వాయవ్యభారతదేశం వరకు జయించి అతి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. యుద్ధంలో అజేయుడు. ‘విశ్వవిజేత’గా నిలిచి అందరినీ నివ్వెరపరిచాడు. ‘ఫిలిప్ ది గ్రేట్’కు గొప్ప పుత్రుడు, తండ్రిని మించిన తనయుడు. అరిస్టాటిల్‌కు గొప్పశిష్యుడు, గురువును మించిన శిష్యుడు. ప్రపంచ చరిత్రలో అత్యంత విజయవంతమైన చక్రవర్తులలో అగ్రశ్రేణిలో నిలుస్తాడు అలెగ్జాండర్. అయితే మన భారతీయ రాజుల వీరత్వం తక్కువైందేమీ కాదు. ఆనాడు పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. పురుషోత్తముడి ధైర్యం అలెగ్జాండర్‌ను ఎంతగానో ఆకట్టుకోవడం వల్లే అతడి రాజ్యాన్ని అతడికి ఇచ్చివేశాడు.

ఏ విజయానికైనా ప్రయత్నమే పునాది. ఇదే భావనతో చంద్రబోస్ ‘చిత్రలహరి’ చిత్రానికి చక్కటి పాటనందించారు. కైలాష్ ఖేర్, విష్ణు ప్రియ రవి పాడిన పాట.. అది..

ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదె

మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే

అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమె అందేనా

పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా

మునిగిమునిగి తేలనిదే మహా సంద్రమే లొంగేనా

కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా

ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా ఈ సాధన

ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం..

ఒకే ప్రయత్నంతో విజయం పొందడం అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు. అంత మాత్రాన లక్ష్యాన్ని విస్మరించడం, ప్రయత్నాన్ని విరమించడం కార్యసాధకుల లక్షణం కాదు. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుగొనడానికి వంద ప్రయత్నాలు చేశాడు. చివరకు సఫలీకృతుడయ్యాడు. అంటే ఆయనకు ఎంతటి పట్టుదల ఉండి ఉండాలి? ప్రతి ఓటమి ఆయన పట్టుదలను మరింతగా పెంచబట్టే చివరకు ఆయన విద్యుత్ బల్బు ఆవిష్కర్తగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు, అందరికీ ఆదర్శంగా మిగిలిపోయాడు. అంటే అందరూ అన్నిసార్లు ఓడిపోవాలని కాదు, అంతటి పట్టుదలతో కృషి చేయాలన్నదే భావం. అలాగే విజయం పొందగానే అహంకరించకుండా అణకువగా ఉండాలనే సందేశాన్ని అందించే ఓ చక్కటి పాటను ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రానికి అందించారు. అది…

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది

ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా

దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా

భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా

బాధవెంట నవ్వులపంట ఉంటుందిగా

సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది

విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ

అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ

కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ

తెలుసుకుంటే సత్యమిదీ తలచుకుంటే సాధ్యమిదీ ॥మౌనంగానే॥

చిత్రగారు ప్రతి అక్షరంలో అర్థాన్ని పలికిస్తూ ఎంతో గొప్పగా పాడిన స్ఫూర్తిదాయక పాట.

‘జీవితంలో విజయానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, కానీ మనం పని చేయనిదే అవి పనిచేయవు’ అన్నారు స్వామి వివేకానంద. అంతేకాదు, ‘ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకో, దాన్నే జీవితం అనుకో, దాని గురించే ఆలోచించు, దాని గురించే స్వప్నించు, మెదడు, కండరాలు, నరాలు, నీ శరీరంలోని ప్రతిభాగం ఆ లక్ష్యంతో నిండిపోవాలి. ఇంకే ఆలోచన వద్దు. ఇదే విజయానికి మార్గం’ అని కూడా అన్నారు.

మహాభారత ఇతిహాసం మూలకథ పేరు ‘జయసంహిత’. దీన్ని వేదవ్యాసుడు చెపుతుండగా విఘ్నేశ్వరుడు రాశాడట. అటు తర్వాత దీన్ని జయ అని, విజయ అని పిలిచారు. ఆ పైన ‘భారతం’ అన్నారు. ఆ తర్వాత ‘మహాభారతం’ గా స్థిరపడింది. అన్నట్లు విష్ణునిలయమైన వైకుంఠద్వారానికి ఇరు వైపుల కావలిగా ఉండేవారు జయ, విజయులని పురాణాలు చెపుతున్నాయి. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందాదులు విష్ణుమూర్తి దర్శనానికి వస్తే జయవిజయులు లోపలికి అనుమతించలేదట. చివరకు వారి రాకను విష్ణువే గుర్తించి స్వయంగా ద్వారం వద్దకు వచ్చాడట. ఈ లోపునే సనక సనందాదులు జయవిజయులపై ఆగ్రహించి వైకుంఠానికి దూరంగా ఉండండి అని శపించడంతో జయవిజయులు విష్ణుమూర్తిని శరణువేడి, తమ తప్పును మన్నించమని, తమకు శాపవిముక్తులను చేయమనికోరుకున్నారట. అప్పుడు విష్ణువు వారి శాపానికి తిరుగులేదని, కానీ ఆ శాపానికి కొద్దిపాటి వెసులుబాటు చేయవచ్చనీ, మూడు జన్మలు రాక్షసులై జన్మించి, నాకు శత్రువులుగా ఉండి, నా చేత సంహరింపబడి, తిరిగి వైకుంఠం చేరడం లేదా, ఏడు జన్మలు మిత్రులుగా ఉండి వైకుంఠం చేరడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి కోరుకోమంటే జయ విజయులు రాక్షసులుగా జన్మించి, త్వరితగతిని విష్ణువును చేరుకోవడానికే ఇష్టపడ్డారు. ఫలితంగానే.. మూడు జన్మల్లో రాక్షసులుగా అవతరించి, ఆ హరి చేతిలోనే హతమై, మోక్షాన్ని పొందారు. అలా జయవిజయులు తమ మోక్ష విజయసాధనలో కృతకృత్యులయ్యారు.

కేవలం బలం, శక్తి, సామర్థ్యాలే విజయాన్ని అందిస్తాయను కోవడం పొరపాటు. గర్వంతో, హద్దులు మీరిన ఆత్మవిశ్వాసంతో ఏమాత్రం అలసత్వం వహించినా, విజయం చేజారిపోతుంది. బాల్యంలో అందరూ చదువుకునే తాబేలు – కుందేలు కథ జీవితాంతం గుర్తు పెట్టుకోతగ్గది. కుందేలు ఎంత పరుగుల వీరుడైనా, తాబేలును తక్కువ అంచనా వేసి, అది ఎక్కడో ఉంది, తాపీగా అది వచ్చేలోపల నేను ఓ కునుకు తీస్తాననుకుని హాయిగా పడుకుంది. తాబేలు మాత్రం తన కర్తవ్యంలో ఏమరుపాటు లేకుండా అదేపనిగా నడిచి గమ్యం చేరింది. తాబేలు విజయం చేజిక్కించుకుంటే, కుందేలు విజయం చేజార్చుకుంది.

ఏ విజయానికైనా పట్టుదలే పెట్టుబడి. పట్టుదలకు మారు పేరైన మార్కండేయుడిని విజయసాధనలో ఉన్న ప్రతివారు గుర్తు పెట్టుకోవాలి. మార్కండేయుడు మృకండ, మరుద్వతి దంపతుల పుత్రుడు. మృకండ రుషి సంతానం కోసం వారణాసి చేరి, శివుని పూజించాడు. శివుడు ఆయన మొర విని ప్రత్యక్షమయ్యాడు. కానీ కోరిక తీర్చడంలో ఒక మెలిక పెట్టాడు. దీర్ఘకాలం జీవించే అజ్ఞాని, దుష్టుడు అయిన పుత్రుడు కావాలా, అల్పాయుష్కుడైన మంచిపుత్రుడు కావాలా అని అడగటంతో మృగంద రుషి, అల్పాయుష్కుడైనా, మంచిపుత్రుడే కావాలని కోరుకున్నాడట. ఆ బాలుడే మార్కండేయుడు. పదహారేళ్లే ఆయుషుగల మార్కండేయుడు ఆ నిర్దిష్టకాలంలో తల్లిదండ్రులకే కాదు, అందరికీ కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. పదహారేళ్లు నిండేకాలం దగ్గరపడటంతో తల్లిదండ్రులు విచారగ్రస్తులయ్యారు. అది తెలిసి, వారిని బాధపడవద్దని తాను పరమేశ్వరుడిని మెప్పించి, దీర్ఘాయుషు పొందుతానని వారిని ఓదార్చి, అడవికి వెళ్లి, తానే ఇసుకతో ఓ లింగం తయారుచేసి, అక్కడే తపస్సు ఆరంభించాడు. దాంతో యమదూతలు వచ్చినా, అతడి చుట్టూ ఉన్న రక్షణ జ్యోతికి భయపడి మరలిపోవలసివచ్చింది. ఆ తర్వాత యముడే స్వయంగా వచ్చి లింగాన్ని కౌగలించుకుని ఉన్న మార్కండేయుడిపై యమపాశాన్ని విసిరాడు, యముడి చర్యకు శివుడు ఆగ్రహించి యముణ్నే హతమారుస్తాడు, మార్కండేయుడి భక్తికి అభయమిచ్చి, దీర్ఘాయుషునిస్తాడు. అయితే యముడు లేకపోతే లోకంలో జననమరణాల జీవనచక్రం స్తంభిస్తుందని, అందువల్ల యముడిని బతికించమని దేవతలు కోరగా వారి కోరిక మేరకు చివరకు యముణ్ని కూడా బతికిస్తాడు.. అది వేరే సంగతి. గెలుపును కోరుకునే ముందు లక్ష్యం కూడా ఉత్తమమై ఉండటం అవసరం. ఏ పేకాటలోనో, గుర్రపు పందేలలోనో, జూదంలోనో గెలుపు కోసం ప్రయత్నించడం చివరకు అనర్థాలకే దారితీస్తుంది. కారణం అవి మనిషిని పతనం చేసే వ్యసనాలు కావడమే. పేకాటలో గెలుపుకు సంబంధించి కొసరాజుగారు ‘కులగోత్రాలు చిత్రంలో హాస్యపూరితంగా ఓ గీతాన్ని అందించారు. మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు పాడిన ఆ పాట..

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే..

ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది

పెళ్లాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయిందీ..

గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు,

మళ్లీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదవ చేర్చవచ్చు

ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు..

పోతే.. అనుభవమ్ము వచ్చు..చివరకు జోలె కట్టవచ్చు.. ॥అయ్యయ్యో॥

గుర్రపు పందేలలో గెలుపు గుర్రంపైనే ఆధారపడి ఉంటుంది. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంలోనే తెలివితేటలు పనిచేస్తాయి. అది అందరికీ సాధ్యంకాదు. ఈ రేసుల పిచ్చిలో జీవితాన్నే మసిచేసుకున్నవారనేకులు. ఇక జూదం.. కేవలం వినోదం కోసం ఆడితే ఫర్వాలేదు కానీ పందెం కాయడమంటే అది నాశనానికే దారితీస్తుంది. మహాభారత ఇతిహాసంలో ధర్మరాజంతటివాడు కేవలం జూద వ్యసనం కారణంగానే రాజ్యాన్ని, చివరకు ఇల్లాలిని కూడా పందేనికి ఒడ్డి ఇక్కట్ల పాలయ్యాడు.

దసరా, దీపావళి పండుగలు చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటున్నవే. లోక కంటకుడైన మహిషాసురుణ్ణి దుర్గాదేవి వధించిన ఉదంతానికి గుర్తుగా దసరా, నరకాసురసంహారం జరిగిన రోజును పురస్కరించుకుని దీపావళిని జరుపుకోవడం తెలిసిందే.

అన్నిటికన్నా భారత జాతి యావత్తుకు ముఖ్యమైన విజయం, భారత స్వాతంత్ర్య సాధన. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో మగ్గుతున్న ప్రజకు మహాత్మాగాంధీ నాయకత్వం వహించి జాతిని ఏకతాటిపై నడిపించి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. అదీ అహింసామార్గంలో. అదీ గొప్పతనం. అన్నట్లు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాక్ పై విజయం సాధించి, ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకుంది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జులై ఇరవైఆరున ‘విజయ్ దివస్’ జరుపుకోవడం మనకెంతో గర్వకారణం.

విజయం గురించిన ప్రస్తావన వస్తే ‘లగాన్’ చిత్రంలోని పాటను మరువగలమా? జావేద్ అక్తర్ రాసిన ఆ పాట..

బార్ బార్ హా, బోలొ యా హా

అప్ని జీత్ హో, ఉనికి హార్ హా

కోయి హమ్ సె జీత్ న పావె.. చలె చలొ, చలె చలొ…

కభీ న దుఖ్ ఝెలెంగె, ఖేలేంగే… ఐసీకి దుష్మన్ హారే

కె అబ్ తొ లే లేంగే, హిమ్మత్ కా రాస్తా

ధర్తీ హిలా దేంగే, సబ్ కొ దిఖా దేంగే

రాజా హై క్యా, పర్జా హై క్యా ఓ ఓ ఓ

హమ్ జగ్ పె ఛాయేంగే, అబ్ యే బతాయేంగే

హమ్ లోగోం కా దర్జా హై క్యా, హో ఓ ఓ ఓ… ॥బార్ బార్ హా..॥

‘ది కీ టు సక్సెస్’ శీర్షికతో రాబిన్ ఎ. వాకర్ చక్కని పొయమ్ రాశారు. అది..

దికీ టు సక్సెస్ ఈజ్ నాట్ గోల్డ్ ఆర్ సిల్వర్

ఇట్ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ స్టీల్

బట్ ఎ లాంగింగ్, ఎ సై అండ్ ఎ యార్నింగ్ టు ట్రై

ఎ యార్నింగ్ ఫర్ లెర్నింగ్, ఎ బర్నింగ్ టు ట్రై

టు క్లైంబ్ టు ది గోల్ వేర్ ఎ సోల్ డ్వెల్స్ టు బ్లెస్

దట్ యు కెన్ సీ, ఈజ్ ది కీ టు సక్సెస్

ది కీ టు సక్సెస్ నో మేన్ ఎవర్ గేవ్

నో మేన్ ఎవర్ పర్‌చేజ్డ్ ఫర్ గోల్డ్

ఫర్ ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది థింగ్స్ దట్ ఎ పర్‌ఫెక్ట్ లైఫ్

ఇట్ బ్రింగ్స్

ఎ విల్లింగ్ ఫర్ స్టిల్లింగ్ ది బేసర్ థాట్స్ ఫిల్లింగ్

టు మెరిట్ అవర్ ప్లేస్ విత్ ది గ్రేస్ వుయ్ పొజెస్

అండ్ ఇటీజ్ ఫ్రీ యాజ్ ది సీ ఈజ్ ది కీ టు సక్సెస్…

విజయాలు అనేక రకాలు. చదువుల్లో మెరిట్ సాధన, ఉద్యోగ సాధన వంటి వ్యక్తిగత విజయాలు ఆయా వ్యక్తులకు, వారి కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే క్రీడా పోటీలకు సంబంధించిన విజయాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, ఇస్రో, నాసా వంటి అంతరిక్ష పరిశోధన, ప్రయోగ కేంద్రాల విజయాలు పదుగురికీ, దేశానికి, ప్రపంచానికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వైజ్ఞానిక, సాంకేతిక విజయాలు, ఆవిష్కరణలు ప్రపంచమంతటికీ మేలు చేస్తాయి కూడా. మరో కోణంలో కూడా విజయాలను గమనించవచ్చు. అన్ని అవయవాలు బాగుండి, అన్ని హంగులు, సౌకర్యాలు గలవారు సాధించే విజయాలు ఒక ఎత్తయితే, దివ్యాంగులు, ఆర్థిక స్తోమత, సౌకర్యాలు లేనివారు సాధించే విజయాలు మరో ఎత్తు. ఇక ఆయా స్థాయిలను బట్టి సాధారణ విజయాలు, అసాధారణ విజయాలుగా పరిగణిస్తుంటాం. కొన్ని అంశాలలో తొలిసారిగా విజయం సాధించిన వారికి చిరకీర్తి లభిస్తుంది. ఎవరెస్ట్ ఎంతో మంది అధిరోహించారు, అధిరోహిస్తున్నారు. కానీ తొలిసారిగా ఎవరెస్టు అధిరోహించిన టెన్సింగ్ నార్గే, హిల్లరీలు అగ్రతాంబూలమందుకున్నారు. అలాగే చంద్రమండలంపై తొలిసారిగా పాదం మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. కరోనా కష్ట కాలంలోనూ ఇటీవల దేశమంతటికీ గర్వకారణంగా ఆనందం కలిగించింది బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగ విజయం. భారత నౌకా దళానికి మరో బ్రహ్మాస్త్రాన్ని అందించిన డిఆర్‌డీఒ కృషి అభినందనీయం.

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. తప్పక ఆ ప్రయోగాలు విజయవంతమవుతాయి. ఎందుకంటే..

మానవుడే మహనీయుడు.. శక్తియుతుడు, యుక్తిపరుడు

మానవుడే మాననీయుడు…

గ్రహరాశుల నధిగమించి, ఘనతారల పథమునుంచి

గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ తతుల దాటి

చంద్రలోకమైనా, దేవేంద్రలోకమైనా

బొందితో జయించి మరల, భువికి తిరిగి రాగలిగే.. ॥మానవుడే॥

‘బాలభారతం’ చిత్రానికి ఆరుద్రగారు రచించి, ఘంటసాల గానం చేసిన ఈ ఘనమైన పాట విజయస్ఫూర్తికే తలమానికం.

అనేకరంగాలలో విజయం సాధించినవారు అనేకులు ఉండవచ్చు. కానీ సమాజ సేవ చేస్తూ, అసంఖ్యాక జన హృదయాలను గెలుచుకునే వారు అరుదుగా ఉంటారు. అలా అనుకుంటుండగా సోనూ సూద్, సుధామూర్తి.. ఇంకెందరో మదిలో మెదిలారు. అలాంటి వారందరికీ ‘దిగ్విజయీభవ’ అనుకుంటుండగా ఫోన్ మోగటంతో మనసులో ‘విజయ విహారం’ చేస్తోన్న ఆలోచనకు అంతరాయం.. చూస్తే నీలిమ.. అప్రయత్నంగానే ఆన్సర్ నొక్కాను…

ఇంకేముంది, ఆమె మాటలనిండా తనయుడి పరీక్షా విజయం తాలూకు మాధుర్యం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here