మానస సంచరరే-56: అంతా ‘మాయ’ మయం!

9
8

[box type=’note’ fontsize=’16’] “మాయ చాలాసార్లు ఆశ్చర్యానందాలు కలిగించి అద్భుతానుభూతి నిస్తుంది. కొన్నిసార్లు కష్టనష్టాలను తెస్తుంది” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ను[/dropcap]వ్వేం మాయ చేశావోగానీ, ఓమనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి, మరీ చిలిపిదీ వయసు బాణి
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా ఎటుపోతోందో ఏమో మరి
ఔరా పంచకల్యాణి పైన వస్తాడంటా యువరాజు ఔనా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా
మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా
మేళతాళాల మనువెప్పుడే

ఎంతో హుషారుగా పాడుతోంది ఓ అమ్మాయి. ఈ టీవీ ఛానెల్స్ లో పాటల పోటీల కార్యక్రమాలు వచ్చాక ఎందరో గానకళ పైన శ్రద్ధ పెంచుకుంటున్నారు. పోటీ పడుతున్నారు. విజేతలవుతున్నారు, వెలుగులోకి వస్తున్నారు. ‘నువ్వేం మాయ చేశావో కానీ..’ మళ్లీ నా చెవిని తాకింది.

అంతే, నా ఆలోచన ‘మాయ’ వెంట పడింది. మనిషి ఎంత బుద్ధిశాలి అయినా మాయకు మాత్రం తెలియకుండానే వశమవుతున్నాడు. బహురూపాల మాయ మనిషిని పదేపదే బుట్టలో వేసుకుంటూనే ఉంటుంది. మాయ చాలాసార్లు ఆశ్చర్యానందాలు కలిగించి అద్భుతానుభూతి నిస్తుంది. కొన్నిసార్లు కష్టనష్టాలను తెస్తుంది.

నిత్యజీవితంలో మాయనుమళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూనే ఉంటాం. ‘మాయ’తో కూడిన కొన్ని పదాలు విరివిగా వాడకంలో ఉన్నాయి. మాయదారి, మాయగాడు, మాయావి, మాయాజాలం ఇలా ఎన్నెన్నో.. వెన్నదొంగ చిన్నికృష్ణుడి మీద ఉన్న భక్తి పూర్వక ప్రేమతో అల్లరి కృష్ణుడు, మాయదారి కృష్ణుడు, చిలిపి కృష్ణుడు.. ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. మాయదారి కృష్ణుడంటూపాడే గొబ్బి పాటొకటి గుర్తుకొస్తోంది. అది..

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ జేసెనే
ఉట్టిమీద పాలు పెరుగు ఎట్లు దించెనే..
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ॥ఏల॥
కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా ॥ఏల॥
చీరలన్ని మూటకట్టి చిన్ని కృష్ణుడు
ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే ॥ఏల॥

‘విష్ణుమాయ’ మరో పదం. దీన్ని పోతనగారు తమ భాగవతంలో కృష్ణలీలలను వర్ణిస్తూ అద్భుతంగా చెప్పారు. ఆ సందర్భం.. చిన్ని కృష్ణుడు గోపికల ఇళ్లలో వెన్న దొంగిలించడమే గాక మన్ను కూడా తింటున్నాడని బలరాముడితో సహా గోపబాలలందరూ చెప్పడంతో యశోద, చిన్నికృష్ణుడితో ‘మన ఇంట తిండికేమైనా కొదువా, మన్నెందుకు తింటున్నావు’ అని చెవి మెలేస్తే, వారంతా తన గురించి అబద్ధాలు చెపుతున్నారని కావాలంటే నోరు వాసన చూడమని అమాయక ముఖంతో నోరు తెరిచాడు. అంతే! యశోదకు ఆ నోట పదునాలుగు భువనాలు ప్రత్యక్షం కావడంతో ఆమె అవాక్కయింది. ఆ క్షణంలో ఆమె మనసులోని భావతరంగం..

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్ధమో సత్యమో
తలపన్నేరకయున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత? యీతని ముఖస్థంభై యజాండంబు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపఁగన్.

అన్నట్లు శ్రీ కృష్ణ జనన వృత్తాంతంలో యోగమాయ ప్రస్తావన ఉంటుంది. దేవకికి అష్టమ గర్భంలో పుట్టే శిశువుతో కంసుడికి చావురాసి పెట్టి ఉందని అశరీరవాణి చెప్పడంతో కంసుడు దేవకిని చంపబోతాడు, ఆమెను చంపవద్దని పుట్టిన బిడ్డలను తెచ్చి ఇస్తానని, వారిని చంపి నిర్భయంగా ఉండమంటాడు వసుదేవుడు. కంసుడు అంగీకరిస్తాడు. అన్నమాట ప్రకారం తమకు పుట్టిన తొలి బిడ్డను కంసుడి వద్దకు తీసుకెళతాడు. అతడి సత్యసంధతకు ఆనందించిన కంసుడు ఎనిమిదవ బిడ్డ కదా నాకు ప్రాణాంతకుడు, ఈ బిడ్డను తీసుకెళ్లిపో అని విడిచి పెడతాడు. కానీ ఆ తర్వాత నారదుడి మాటలతో వారు ఎనిమిదో బిడ్డకు సాయపడే ప్రమాదం ఉంటుందని ఆరుగురు బిడ్డలను ఒకేసారి చంపేస్తాడు. ఏడో బిడ్డ పిండదశలో ఉండగానే యోగమాయ ఆ పిండాన్ని రోహిణి గర్భానికి తరలిస్తుంది. ఆ బిడ్డే బలరాముడు. ఇక ఎనిమిదోసారి దేవకి గర్భవతి కాగా కంసుడు కలవరపడతాడు. ఆమెకు ప్రసవకాలం సమీపించడంతో చెరసాల భద్రతను కట్టుదిట్టం చేస్తాడు. ఓ రాత్రి కుంభవృష్టి కురుస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించి, వసుదేవుడి అంతరంగంలో కర్తవ్యోపదేశం చేశాడు. నందవ్రజంలో యశోదకు అదే సమయంలో యోగమాయ పుట్టిందని, తనను అక్కడకు చేర్చి, ఆ యోగమాయను దేవకి వద్దకు చేర్చమని చెప్ప డంతో వసుదేవుడు అందుకు సంసిద్ధుడయ్యాడు. యోగమాయ ప్రభావం వల్ల చెరసాల కావలివారు గాఢనిద్రకు లోనయ్యారు. వసుదేవుడి కాళ్లకున్న సంకెళ్లు అవే తెగిపోయాయి. ద్వారాలు అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్నికృష్ణుడిని బుట్టలో పెట్టుకుని బయటకు నడిచాడు. యమునకు ఆవలి వైపు నందవ్రజం. యమునానది తనంత తానుగా రెండుగా చీలి, వసుదేవుడు తనను దాటడానికి తోడ్పడింది. వసుదేవుడు వెళ్లి కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి, యోగమాయను తెచ్చి దేవకి పక్కన ఉంచాడు. వెంటనే చెరసాల ద్వారాలు మూసుకున్నాయి. వసుదేవుడికి సంకెళ్లు బిగుసుకున్నాయి. అప్పుడిక అందరికీ తెలివి వచ్చింది. కంసుడు వేగంగా వచ్చాడు. పుట్టింది ఆడబిడ్డే కదా అన్న దేవకి మాటను వినిపించుకోకుండా నవజాత శిశువును చంపబూనాడు. యోగమాయ ఒక్కసారిగా ఆకాశానికి ఎగసి, తన అసలు స్వరూపాన్ని చూపి ‘నాతో పాటుపుట్టి నిన్ను సంహరించే వారు వేరొక చోట పెరుగుతున్నారు. నీకు మరణం తప్పదు’ అని హెచ్చరిస్తుంది. ఆ పైన యోగమాయ వింధ్యాచల పర్వతంపై వింధ్యాచల దేవిగా వెలిసింది.

వివిధరకాల ‘మాయ’లకు సంబంధించి ఎన్నో తెలుగు సినీగీతాలు అనుకోగానే మదిలో మెదిలిందో ఆపాత మధురం…

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా,
ఏమిటో నీ మాయ..
వినుటయె కాని వెన్నెల మహిమలు..
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు,
లీలగ ఇపుడే కనిపించెనయా.. ॥ఏమిటో ఈ మాయ॥
కనుల కలికమిది నీ కిరణములే.. మనసును వెన్నగా చేసెనయా
చెలిమికోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా.. ॥ఏమిటో ఈ మాయ॥

‘మిస్సమ్మ’ చిత్రంలో నాయిక తన మదిలో చెలరేగిన కొంగ్రొత్త భావ సందడికి కారణం చల్లని వెన్నెలలు కురిపించే చంద్రుడి మాయేనంటూ ఆలపించే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ‘ప్రే’ మాయలో పడ్డ నాయికల వరస ఇదైతే.. జానపదశైలిలో సాగే ప్రేమ జోరు మరోవిధం…

మాయదారి మైసమ్మో మైసమ్మ
మనం మైసారం పోదమే మైసమ్మా..
మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ
గాబరబెట్టి, మమ్ము గాబర పెట్టి
గాయబుగాకె మైసమ్మ
జర పరేషాని జెయ్యకే మైసమ్మా..

‘కాలేజ్’ చిత్రానికి గుండేటి రమేష్ రాసిన ఈ జానపద గీతాన్ని గాయకుడు శ్రీకాంత్ పాడాడు.

మేజిక్ (ఇంద్రజాలం).. అచ్చతెలుగులో చెప్పాలంటే గారడీ అందరూ ఎంతో ఇష్టపడే కళ. గారడీవాడి మాయ కళ్లప్పగించి చూసినా ఆ కనికట్టు కనుగొనలేక ‘ఔరా!’ అని ఆశ్చర్యానందానుభూతి పొందుతాం. గారడి గురించి అనుకోగానే గుర్తొచ్చింది. ‘మాయలోడు’ చిత్రంలోని పాట..

ఛూ మంతర్ కాళీ.. ఇది జంతరమంతర మోళీ
మాయాలేదు, మంత్రంలేదు, యంత్రంలేదు, తంత్రంలేదు
మోసం గీసం మొదలే లేదు.. మస్క గొట్టె సిట్కా ఏదో
బయటెట్టేస్తే సరదాబోదూ..
అరె ఇందరిముందర ఇందరజాలం..
చిందరవందర చిందుల మేళం
గలాట గారడి గందరగోళం
తెగించి ఆడె తలాంగు తాళం…
జాగోరే బేతాళా నీ జాదు సూ పెట్టాలా
కళ్లకు చుట్టూ గంతలు గట్టు..
ఐనా అంతా సూస్తున్నట్టు అసలు నకిలీ
కనిపెట్టాలా దగాలు చేసే మగానుబావుల
ముసుగు లొసుగూ పసిగట్టాలా…
మహామహా బేతాలుడికి బేజారెత్తే మాయమరాఠీలు
పరాగ్గా వున్నారంటే పంగనామం బెట్టి పోతారు..
మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇద్యండి
దగాలు దారుణాలు శాతగాని కోతులాటండీ
దగుల్బాజీగాళ్లు సుట్టూరా వున్నారూ..
జాగర్తండీ బాబు..అమ్మా జాగర్తా..

అంటూ తమకు, మోసగాళ్లకు ఉన్నతేడా చెపుతూనే దొంగలున్నారు జాగ్రత్తని హెచ్చరిస్తాడు. ఇదే చిత్రంలో ఓ చక్కటి యుగళగీతం ఉంది. అది..

నీ మాయలోడిని నేనే
నీ మాయలేడిని నేనే
వయసుగారడి మనసు పేరడి
ప్రేమంటే అంతులేని మాయ..
ప్రేమ..మనిషికెంతో ఇష్టమైన మాయ

అసలు ఈ జగమే మాయతో కూడిందని బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి సన్నివేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన పద్యం ఉంది. అది..

మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక నెం
తో యల్లాడిన యీ శరీరమిపుడిందు గట్టెలం గాలుచో
నా ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు రక్షింపగన్

ఓ శవదహన సందర్భంలో కాటికాపరి అయిన హరిశ్చంద్రుడిలో కలిగిన మనోస్పందన. ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవం లోకి వచ్చే కఠిన వాస్తవాన్ని ఎంతో సహజంగా చెప్పిన పద్యమిది. భగవద్గీతలోని రెండో అధ్యాయంలో పార్థుడికి, శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశిస్తాడు.

నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయా సమావృతః
మూఢయం నాభి జానాతి
లోకో మామజ మవ్యయమ్

నా యోగమాయ యందు నేను అందరికీ గోచరించను. అజ్ఞానులు నన్ను జన్మ రహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకోలేరు.

రామాయణంలో మాయలేడి వృత్తాంతము ఎంతో కీలకమైంది. మారీచుడు బంగారు లేడి రూపంలో పర్ణశాల దాపున తిరుగాడడం చూసి, అది మాయలేడి అని గుర్తించక, దాని అందం మాయలో పడి ఆ బంగారులేడి కావాలని రాముణ్ణి కోరటం, రాముడు ఆ లేడిని వేటాడి తేవటానికి వెళ్తూ సీతకు రక్షణగా లక్ష్మణుణ్ణి ఉంచి వెళ్లడం తెలిసిందే. ఆ మాయలేడి పరుగులు తీస్తూ, రాముడిని సుదూర ప్రాంతానికి తీసుకెళ్లడం, ఎంతకూ రాముడు రాక పోవడంతో, ఏదైనా ప్రమాదంలో చిక్కు కున్నాడేమో అని భయపడి, లక్ష్మణుణ్ణి వెళ్లి చూడమని ఒత్తిడి చేస్తుంది. చేసేదిలేక, లక్ష్మణ రేఖను గీసి, అది దాటి రావద్దని సీతకు చెప్పి రాముడిని వెదకడానికి వెళతాడు. అదే అదనుగా రావణుడు భిక్షాందేహి అంటూ సన్యాసి రూపంలో ప్రత్యక్షమై, సీత గీత దాటేలా చేసి, ఆమెను అపహరిస్తాడు.

‘మాయ’ ఆధారం చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. మాయాబజార్, మాయామశ్చీంద్ర, మాయలోడు.. ఇలా ఎన్నో. వీటిలో ఆద్యంతం అలరిస్తూ, నాటికి, నేటికీ కూడా అగ్ర స్థానంలో నిలిచే చిత్రం మాయాబజార్’. ఇందులో ఘటోత్కచుడు ‘మాయాశశిరేఖ’ గా నాటకమాడి ఎంతో రక్తి కట్టించి, చక్కటి హాస్యంతో కడుపుబ్బ నవ్వించి, మనసులు ఇచ్చిపుచ్చుకున్న శశిరేఖ, అభిమన్యులకు వివాహం జరిపించి కథను సుఖాంతం చేస్తాడు. ఘటోత్కచుడు శశిరేఖను ఎత్తుకురావడానికి వెళ్లినప్పుడు కృష్ణుడు వృద్ధుడి రూపంలో అడ్డుపడి చేసే సంభాషణలో ‘చినమాయను పెనుమాయ,అది స్వాహా, ఇది స్వాహా’ అంటాడు. విడిది ఏర్పాట్లలో తసమదీయుల్ని తందానాలాడించడానికి తతంగమేదీ అని లంబు, జంబు అనగానే గురువు అం అః,ఇం ఇహీ, ఉంఉహూ, అంటూ నగలు, బొమ్మలు, పాత్రలు, కిరీటాలు, పాదరక్షలు.. సకల వస్తుశాలల్ని సృష్టిస్తాడు. జీవితంలో తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు ‘అంతా మాయే’ అను కోవడం సహజం. విఫల ప్రేమికుడు దేవదాసు సైతం జగము, బతుకు రెండూ మాయే అంటాడిలా…

జగమే మాయ..బతుకేమాయ
వేదాలలో సారమింతేనయా, ఈ వింతేనయా..
కలిమి లేములు, కష్టసుఖాలు
కావడిలో కుండలని భయమేలోయి..
కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి, ఈ వింతేనోయి.. ॥జగమే॥

అయితే మహాకవి శ్రీశ్రీ తన ‘మిథ్యావాది’ కవితలో ‘మాయ’ భావనపై ఉవ్వెత్తున విరుచుకుపడ్డాడు.

మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ!
ఏమంటావు?
మాయంటావూ? లోకం
మిథ్యంటావూ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరుపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ! మాయ!
మాయంటావూ? అంతా
మిథ్యంటావూ?
జమీందారు రోల్సుకారు
మాయంటావూ? బాబూ
ఏమంటావు?
మహారాజు మనీపర్సు
మాయంటావూ? స్వామీ
ఏమంటావూ?
మరఫిరంగి, విషవాయువు
మాయంటావూ? ఏం
ఏమంటావు?
పాలికాపు నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావూ?
తుపాకులూ, భూకంపం
తిరుగుబాట్లు, సంగ్రామం
సంగ్రామం, సంగ్రామం
మాయంటావూ? ఏయ్
ఏమంటావు?

‘మాయరోగం’ అనే పదంనిత్యం వినిపించేదే. అంతుచిక్కని రోగం, దొంగ రోగం అర్థాల్లో , ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు తిట్టుగా కూడా వాడుతుంటారు. మనుషుల్లోని మాయరోగం గురించి ‘అందాల రాముడు’ చిత్రంలోని పాటలో కవి ఇలా అంటాడు..

మము బ్రోవమని చెప్పవే..సీతమ్మతల్లీ
మము బ్రోవమని చెప్పవే…
పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదూ..
మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగ మదేమోగాని మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ.. ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్లము..
మీ అండ కోరేవాళ్లము కరుణించమని చెప్పవే మా కన్నతల్లి..

పిల్లలు మాయలు.. అద్భుతాలతో కూడిన మాయాద్వీపం, అల్లావుద్దీన్ అద్భుతదీపం, మాయాజాలం వంటి కథలనెంతో ఇష్టపడతారు. ‘మటుమాయం’ మరో పదం.. మాత్రతో తలనొప్పిక్షణాల్లో మటుమాయం, సోప్ డిటర్జెంట్‌తో మరక మటుమాయం వంటి ప్రకటనలు రోజూ వింటుంటాం, టీవీలో చూస్తుంటాం. వస్తువుల్ని మాయం చేయటం, ఏమీలేని శూన్యం నుంచి ఒక వస్తువుని సృష్టించడం. మరెన్నో అద్భుతాలు ఇంద్రజాలికులు చేసి, ప్రేక్షకులను అనిమేషుల్ని చేస్తుంటారు. మనదేశంలో అగ్రస్థానంలో ఉన్న ఇంద్రజాలికుడుగా పి.సి.సర్కార్ జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించారు. తెలుగు నేలపై సామల వేణు వంటి ఎందరో ఇంద్రజాలికులు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అలరించే మాయ అందరికీ ఇష్టమే. కానీ ఎదుటి వారిని వంచన చేసేమాయ క్షంతవ్యం కాదు. మనిషి ఎంతో నాగరికత సంతరించుకున్నాడని చెప్పుకునే నేటికాలంలో మనిషిలో మానవత్వం మాయమైపోవటం అందరినీ కలవరపరిచే విషయం. దీని పైనే కవి అందెశ్రీ గారు ‘ఎర్రసముద్రం’ చిత్రానికి ఓ మంచి పాటను రాశారు.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు…
యాడ వున్నడొ కాని కంటికీ కనరాడు ॥మాయమై॥
నిలువెత్తు స్వార్ధము నీడలాగొస్తుంటే
చెడిపోక ఏమైతడమ్మ.. చెడిపోక ఏమైతడమ్మ
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
దిగజారుతున్నడోయమ్మా.. దిగజారుతున్నడోయమ్మా
అవినీతి పెను ఆశ అంధకారములోన..
చిక్కిపోయి రోజు శిధిలమవుతున్నాడు ॥మాయమై॥

అకాలంగా మోగిన అలారం నా ఆలోచనా ప్రపంచం నుంచి ‘మాయ’ను మాయం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here