మానస సంచరరే -6: ‘మహోజ్జ్వల’ జగతి!

2
9

[box type=’note’ fontsize=’16’] అగ్నికి రెండు లక్షణాలున్నాయి. అది శక్తి, వెలుగు. అగ్ని లేనిదే మనుగడ లేదంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే-6: ‘మహోజ్జ్వల’ జగతి! ” అనే కాలమ్‍లో.  [/box]

[dropcap]హే[/dropcap]మంత ప్రభాతం. రోజుకన్నా తొందరగా మెలకువ వచ్చింది. చూస్తే కిటికీ నుంచి సన్నగా ఒకింత వెలుగు పలకరించి మేలుకోమంది. అదే క్షణంలో పనిమనిషి రెండురోజులు రానని చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘ముందు వాకిట్లో ముగ్గేయాలి’ అనుకుంటూ బద్దకాన్ని అధిగమించి లేచాను. తలుపు తీయగానే రివ్వుమంటూ చలిగాలి… వాకిలికి ఎదురుగా కొద్దిదూరంలో చలిమంట వేసుకొని ఓ నలుగురు హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకు హఠాత్తుగా మా ఫ్రెండ్స్‌తో వెళ్లిన షిల్లాంగ్ ట్రిప్ గుర్తుకొచ్చింది. ఆ రోజు… హెూటల్లో దిగేసరికే చీకటిపడింది. స్నేహితులందరం రిఫ్రెష్ అయి, తిండి తినటం పూర్తిచేశాక చక్కగా పెద్ద నిప్పుల పొయ్యి చుట్టూ కుర్చీల్లో కూర్చున్నాం. ఏవేవో కబుర్లు… పాటలు… ఆ క్షణాన ఆనందానికి అదే చిరునామా. ఆ తర్వాత ఎప్పటికో అలిసిపోయి నిద్రకుపక్రమించాం… నా జ్ఞాపకం గొలుసును తెంచుతూ ఓ కుక్క భౌభౌమంటూ మొరిగింది. దాంతో ముగ్గుమాట గుర్తొచ్చి గబగబా వాకిలి కడిగి, ముగ్గేసి లోపలికొచ్చాను. బయట చలికితోడు, చేతికి నీళ్లు తగలటంతో చల్లగా ఉంది. స్టవ్ వెలిగించి కాఫీ ప్రయత్నం చేస్తూ స్టవ్ దగ్గరగా చేతులుంచి చలికాచుకున్నాను. సంక్రాంతికి భోగిరోజున భోగిమంటలు వేయడం, కాముడిపున్నమి రోజున పనికిరాని చెక్కలన్నీ పోగుచేసి కామదహనం చేయటం గుర్తొచ్చింది.

కాఫీ కప్పు పట్టుకోని హాల్లోకొచ్చి కూర్చున్నాను. ఇలా ఇంట్లో మిగతా వారూ లేవకముందు, ఏకాంతంగా, ప్రశాంతంగా కాఫీతాగుతు ‘నాలో నేను’తో గడపటం నాకిష్టం. నా మనో నేత్రం ముందు ఇంకా చలిమంట వెలుగుతూనే ఉంది. అగ్ని… పంచభూతాల్లో ఒకటి. అగ్నికి రెండు లక్షణాలున్నాయి. అది శక్తి, వెలుగు. అగ్ని లేనిదే మనుగడ ఎక్కడ? అమ్మ చెబుతూ ఉండేది… వాళ్ల చిన్నప్పుడు ఏడాదికోసారి పిట్టలదొర వచ్చేవాడని, ‘మాకేం తక్కువ పొయ్యి కిందికి, పొయ్యి మీదికి తప్ప… గుమ్మడి కాయంత బంగారం కుళ్లిపోతే గోడవతల పెంటకుప్ప మీద పారేశాం’ అంటూ తమాషా మాటలు చెప్పి నవ్వించేవాడని… నిజమే పొయ్యి వెలగాలంటే ఏదో ఓ రకం మంట తప్పదు. అది కట్టెలపొయ్యి కావచ్చు, కిరోసిన్ స్టవ్ కావచ్చు, గ్యాస్ స్టవ్ కావచ్చు.. మంటకు సంబంధించి రాజ్‌కపూర్ సినిమాలో ఓ డైలాగ్ బాగా గుర్తుండిపోయింది… ‘ఆగ్ జల్తీ హై మగర్ రోష్ని నహీ…’ ఎంత చక్కని వ్యక్తీకరణ. మనసు జ్వలిస్తుంటే వెలుగెక్కడుంటుంది?

అగ్ని పవిత్రతకు ప్రతీక. అందుకే నిజాయితీపరుణ్ని ‘నిప్పులాంటి మనిషి’ అంటుంటారు. ఏదైనా క్లిష్టపరిస్థితి ఎదురైతే ‘అగ్ని పరీక్ష’ అంటారు. అలనాడు సీతాన్వేషణకు వెళ్లిన హనుమ తన తోకకున్న నిప్పుతో లంకా దహనం చేసి రావణుడికి ఒక ఝలక్ ఇచ్చాడుకదా. ఆ పైన రావణ సంహారం జరిగి కథ సుఖాంతం అనుకునే క్షణంలో రాముడు, సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. రామాయణమేకాదు, భారతంలోనూ అగ్ని ప్రస్తావన పలు మార్లు ఉండనే ఉంది. పాండవులను లక్క ఇంట్లో ఉంచి, దానికి నిప్పు పెట్టటం తెలిసిందే. అదేనా, అగ్నిదేవుడు తాను ఖాండవవనాన్ని దహిస్తేనే తన ఆకలి తీరుతుందని, అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడని, ఖాండవవన దహనానికి అర్జునుడి సాయం అభ్యర్థిస్తాడు.

అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌పై దండెత్తి, కోటను స్వాధీనం చేసుకున్న సందర్భంలో రాణి పద్మిని, ఇతర రాణీవాస స్త్రీలు అతడికి లొంగకుండా అగ్నికి ఆహుతై తమ ఆత్మగౌరవం నిలబెట్టుకున్నట్లు చరిత్ర చెబుతుంది.

సతీదేవి తన తండ్రి ఆహ్వానించకపోయినా యజ్ఞానికి వెళ్ళి అవమానానికి గురై, యజ్ఞకుండంలోనే పడి ఆహుతి అయ్యింది. ఫిరోషియస్ దేవుడు శివుడు త్రినేత్రుడు. ఆయన ఫాలనేత్రం తెరిస్తే అంతా భస్మమే… మన్మథుణ్ని మూడోకన్ను తెరిచే కదా భస్మం చేసింది ముక్కంటి. అష్టాదశ పురాణాల్లో ‘అగ్నిపురాణం’ ఒకటి. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘జ్వాలాముఖి’ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అన్నట్లు శివాలయాల్లో కార్తీక పౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం జరుపుతారు. వైశ్వదేవం చేసేవాళ్లు నిత్యం విశ్వదేవతల గూర్చి హెూమం చేస్తారు. అగ్ని చాలా పవర్‌ఫుల్ దేవుడని మనుచరిత్ర కూడా చెబుతుంది. ప్రవరుడు హిమాలయాలు తిలకించి, ఆనందించి, ఇక తిరుగుముఖంపడదామనుకుంటాడు. తీరా చూస్తే ఆ మంచుకు సిద్దుడు పూసిన కాలిపసరు కాస్తా కరిగిపోయిందని తెలుస్తుంది. దాంతో కంగారుపడతాడు. వరూధుని ఎదురైతే తోవచెప్పమని అడుగుతాడు. ఆమె అతడిపై మరులుగొని విపరీతంగా ప్రవర్తించడంతో ఇంక లాభంలేదని ‘దానజపాగ్ని హెూత్రపరతంత్రుడనేని… భవత్పదాంబుజ ధ్యానరతుండనేని… – సన్మానముతోడ నన్ను సదనమ్మున నిల్పుము… ఇనుండు పశ్చిమాంబో నిధిలోన గ్రుంకయమున్న రయమ్మున హవ్యవాహనా!” అంటూ ప్రార్థించి.. అరుణాస్పదపురంలోని తన ఇంటికి క్షణాల్లో చేరుకుంటాడు.

కాలమేదైనా నిప్పు తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. దుష్టులెంతోమంది ఇళ్లను, గోదాములను, కార్లను, బస్సులను, రైళ్లను తగలబెడుతూనే ఉన్నారు. పైగా మనిషి స్వార్థం ఎంతగా పెరిగిపోయిందంటే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని ఇళ్లను, గోదాములను కావాలని తగులబెట్టి ప్రమాదంగా చూపుతున్నారు కొందరు. ఎండాకాలం ప్రమాదవశాత్తు గుడిసెలు దగ్ధంకావటం తరచు జరిగేదే.

మంటల్ని ఆర్పడానికి గణగణ గంటలు మోగించుకుంటూ ఫైర్ ఇంజన్లు వస్తుంటాయి. ‘ఫైర్ ఇంజన్లో నీళ్లుకదా ఉండేది, మరి ఫైర్ ఇంజన్ అంటారెందుకు డేడీ’ అంటాడో గడుగ్గాయి ఓ జోకులో. పాత సినిమాల్లో అయితే విలన్లు పంటలకు, ఇళ్లకు – నిప్పు పెట్టడం ఎక్కువగా చూపేవాళ్లు. ఈ రోజుల్లో ఆందోళనల్లో దిష్టిబొమ్మలు తగలేయడం పరిపాటే. దసరాకు రావణ దహనం చేస్తారు.

ఒంటికి నిప్పంటించుకుని ఎత్తునుండి కింద నీళ్లలోకి బంగీ జంప్ చేసే సాహసికులు మనకు తెలుసు. ఈ సాహసం చేస్తూనే ప్రాణాలు పోగొట్టుకున్నవారూ ఉన్నారు. అలాగే మెజీషియన్లు నిప్పును సృష్టించి, మంటల్ని నోటితో మింగి ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటారు. మొహర్రం రోజుల్లో ముస్లిమ్ సోదరులు పాటించే సంప్రదాయంలో నిప్పులపై నడక కూడా ఒకటి.

“నిప్పుతో చెలగాటం’ కూడదంటారు. ముఖ్యంగా దీపావళి పండుగవేళ అగ్ని… ప్రమోదాన్ని, ప్రమాదాన్ని కూడా తెచ్చి పెడుతుంటుంది. అందుకే ఓ సినీకవి… దీపావళి గురించి… వెన్నెలరోజు… ఇది వెన్నెల రోజు… అమావాస్యనాడు వచ్చే పున్నమిరోజు… దీపావళిరోజు… నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని, తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది’ అంటాడు. నిజము నిప్పులాంటిదన్నది నిక్కమైన నిజం. ‘నిజము నిప్పులాంటి దెప్పుడూ… నిన్ను దహించక తప్పదు’ అని మరో సినీకవి చెప్పాడు కూడా. దాని సంగతి అటుంచితే అప్పు కూడా నిప్పులాంటిదేనని నిన్నమొన్నటివరకు మెజారిటీ జనం నమ్మేవాళ్లు. కానీ రోజులు మారాయి. దేశాలే ప్రపంచబ్యాంకు దగ్గర అప్పు చేస్తుంటే మనం చేయటంలో వింతేముంది అంటున్నారెందరో. పైగా మేం అప్పిస్తామంటే, మేం అప్పిస్తామని ఎన్నో బ్యాంకులు పోటీలుపడుతూ క్రెడిట్ కార్డులు అందిస్తున్నవేళ, ఎన్ని క్రెడిట్ కార్డులుంటే అంత గొప్ప అని భావించే రోజుల్లో అప్పు, నిప్పనే మాట తప్పయిపోతోంది. కమ్మరి కయినా, కంసాలికయినా నిప్పుతోనే పని. ఒకప్పుడు స్టీమ్ ఇంజన్లతో రైళ్లు నడవడానికి సైతం రాక్షసిబొగ్గు నిప్పే ఇంధనమైంది. అసలు ఆదిమానవుడు నిప్పురాయి కనుక్కోవటంతోనే నిప్పు ప్రయోజనాలెన్నో క్రమంగా అనుభవించగలిగాడు. ఒకప్పుడు పొయ్యి వెలిగించుకోవడానికి పక్కింటినుంచి నిప్పు తెచ్చుకునే సందర్భాలు కూడా ఉండేవి. చుట్టలు, వగైరాలు కాల్చేవారు నిప్పు ఇచ్చిపుచ్చుకోవటంలో ఎంత ఆత్మీయంగా వ్యవహరిస్తారో ఆ సందర్భాలను వీక్షిస్తే బోధపడుతుంది. ఇప్పుడయితే సిగరెట్ కయినా, స్టవ్‌కయినా లైటర్లు వచ్చాయి. సాధనం మారవచ్చు కానీ సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు నిప్పు నిత్యావసరమే. బాధల్లో ఉన్నప్పుడు చల్లని చందమామ సైతం మంటలు రేపుతాడు. అందుకే ఓ భార్యా వియోగి పాత్ర నోట, కవి… ‘మంటలు రేపే నెలరాజా. ఈ తుంటరితనము నీకేలా’ అని పాడించాడు. పౌరాణిక చిత్రాల్లో

అయితే ఆగ్నేయాస్త్రం నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లడం కళ్ళింతలు చేసుకు చూస్తుంటాం. హెూమాలు, యజ్ఞాలు అగ్నితోడివేగా. అగ్నిసాక్షిగా వివాహాలు మామూలే. ఆపైన పెళ్లి నూరేళ్లపంట కాదు, నూరేళ్ల మంట అనుకోవటం కూడా కద్దు. చివరాఖరుకు మనిషి మరణించినా చేర్చేది చితిమంటలనే. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ పాటలో.. ‘తారాజువ్వల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి, చితిమంటల చిటపటలు వినిపించేనా…’ అంటాడు కవి. మనిషి మరణించినా అది భౌతికమేనని, ఆత్మకు ఆది, అంతం లేవని, ఆత్మను అగ్ని సైతం ఏంచేయలేదని గీతాకారుడు బోధించాడు.

ఈ సృష్టి ఎంత చిత్రమో! నిద్రాణమై ఉండే అగ్నిపర్వతాలు, లావాను చిమ్మే అగ్నిపర్వతాలు, హఠాత్తుగా విస్ఫోటనం చెందే అగ్నిపర్వతాలు… ఇలా ఎన్నో. అన్నిటిలోకి అతి పెద్ద అగ్నిపర్వతం హవాయ్‌లోని ‘మౌనలోవా’. అగ్నిపూల చెట్లు ఎర్రెర్రని పూలతో ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో. కాలిఫోర్నియాలో అయితే కార్చిచ్చు ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. సముద్రాల అడుగున సైతం అగ్ని ఉంటుందట. దాన్నే ‘బడబానలం’ అంటారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి వయొలిన్ వాయించుకుంటూ ఆనందించాడని చరిత్ర చెబుతోంది. అదేమి ఆనందమో. అన్నట్లు నరకంలో తొలిశిక్ష జ్వాలా తోరణమే(నట)… ఇక మండేగుండలు, ఒళ్లు మంటలు, ‘కడుపు మంటలు’, కళ్లల్లో నిప్పులుపోసుకోవడం, కళ్లు నిప్పులు రాల్చడం, క్రోధాగ్ని, కొరివితో తల గోక్కోవడం, నివురుగప్పిన నిప్పు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆకలి మంటలు… వంటివెన్నో వాడుకలో మనం వినేవే. జఠరాగ్ని దుస్సహమైంది. అందుకే ‘ఆకలి మంటలు బాబూ… ఇవి ఆరని మంటలు బాబూ… సిరులుండే బాబుల దాపులకయినా చేరగలేనివి బాబూ’ అన్నారు. కోపిష్టికళ్లు ఎంత చెడ్డవో గోరింటాకు చిత్రంలోని పాట చెబుతుంది. ‘..పడకూడదమ్మా పాపాయి మీద… పాపిష్టి కళ్లు… కోపిష్టి కళ్లు, పాపిష్టి కళ్లల్లో పచ్చకామెర్లు… కోపిష్టి కళ్లల్లో కొరివి మంటలు’ అని. మంటలకు క్రూరమృగాలు సైతం జడుసుకుంటాయి. అందుకే దివిటీలు చేత బుచ్చుకుని క్రూరమృగాలనుంచి ఆపదవేళల తమను తాము రక్షించుకుంటుంటారు. దీపపు పురుగులు దీపంచుట్టూ తిరిగి ఆ మంటలోనే పడి మాడిపోతాయి. నిప్పులేనిదే పొగరాదన్నది ఒక సామెత. కానీ ఈ కాలంలో నిప్పులేకపోయినా పొగచుట్టేసే సందర్భాలు కోకొల్లలు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్ట కాల్చుకోవచ్చని సంతోషించాట్ట ఇంకోడు. ఆ ఇంకోడు నీరో చుట్టమే అయ్యుంటాడు. అన్ని అగ్నులలోకి విప్లవాగ్ని ప్రత్యేకమైంది. విప్లవాగ్నిలో ముందుగా గుర్తొచ్చే పేరు ‘అల్లూరి సీతారామరాజు’.

ఇక అక్షరాలనే అగ్ని కణాలుగా వెలిగించినవారెదరో ఉన్నారు. దిగంబర కవులలో ఒకరు జ్వాలాముఖి. శ్రీశ్రీ సృష్టించిన అక్షరాగ్నులెన్నో… ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను…’ అన్నాడు. అంతేనా, ‘కనబడలేదా… మరోప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు… హెమజ్వాలల భగభగలు’ అన్నాడు. ఇంకా చెప్పాలంటే..

“నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నేనెగిరిపోతే

నిబిడాశ్చర్యంతో వీరు

నెత్తురుకక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే..” అంటాడు.

దాశరథి ‘అగ్నిధార’నే కురిపించాడు. ఇంకెందరో కవులు అక్షరాలను అభ్యుదయం దిశగా ప్రజ్వలింపజేశారు. అగ్నిపూలు, అగ్ని ప్రవేశం, అగ్నికణం… వంటి ఎన్నో నవలలు వచ్చాయి. అగ్నిబరాట, నిప్పులాంటి మనిషి, అగ్గిదొర, జ్వాలాద్వీప రహస్యం, అగ్ని సంస్కారం వంటి చిత్రాలొచ్చాయి.

అగ్నికున్న విశిష్టత కారణంగానే ‘అగ్ని మిస్సైల్ ప్రోగ్రామ్’ పేరిట మిస్సైల్స్ రూపకల్పన జరిగింది… మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలామ్ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పేరిట రాసిన ఆత్మకథ ఎనలేని ప్రాచుర్యం పొందింది. కలామ్ ఇలా అంటారు.. ‘వియ్ ఆర్ ఆల్ బార్న్ విత్ ఎ డివైన్ ఫైర్ ఇన్ అజ్. అవర్ ఎఫెక్ట్స్ షుడ్ బి టు గివ్ వింగ్స్ టు దిస్ ఫైర్ అండ్ ఫీల్ ది వరల్డ్ విత్ ది గ్లో ఆఫ్ ఇట్స్ గుడ్‌నెస్’. ఎంత విలువైన మాటలు. మనలో అంతర్లీనంగా ఉండే అగ్నిలాంటి శక్తికి అకుంఠిత కృషితో రెక్కలందించి, ప్రపంచమంతా వెలుగులతో నింపేయాలంటూ జ్ఞానజ్యోతిని ప్రజ్వలింప చేశారు. అబ్దుల్ కలాం అందించిన ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే ప్రతి మనిషి ఓ మహా మనీషి అవుతాడు. నేను ‘సింధువులో బిందువునైనా కావాలి.’ అనుకొంటుండగా, ‘గ్యాస్‌స్టవ్ రిపేర్లు చేస్తాం’ అన్న కేక నా ఆలోచనాగ్ని మీద నీళ్లు చల్లినట్లయి, ప్రస్తుతంలోకి వచ్చి, ‘బాబోయ్! టైమ్’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here