మానస సంచరరే-62: జ్ఞాపకాల దారులలో!

6
7

[box type=’note’ fontsize=’16’] “మనసును కుంగదీసే జ్ఞాపకాలను అదుపు చేసుకుంటూ, మరిచిపోవటానికి ప్రయత్నిస్తూ, ఆనందాన్నిచ్చే జ్ఞాపకాలతో పునరుత్తేజం పొందుతూ ముందుకు సాగడమే వివేకం” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ప[/dropcap]డుకున్నానన్నమాటే కానీ మనసులో ఆలోచనలు అవిశ్రాంతంగా సాగుతూనే ఉన్నాయి. ఎందుకో గానీ నా బాల్యం బాగా గుర్తుకొస్తోంది. నాన్న ఉద్యోగరీత్యా మేం ఆదిలాబాద్‌లో ఉండటం.. ఆ యిల్లు, మనుషులు, కొన్ని సంఘటనలు కళ్ళ ముందు సినిమాలా కదలాడుతున్నాయి. గచ్చుచేయని ఆ మిద్దె యిల్లు, వెనుక వైపు పెద్ద బావి అటువైపు ఇంటి ఓనర్లు, మరో వైపు రెండు గదుల రేకుల షెడ్లో ఓ అమ్మమ్మ, మనవడు. చదువుకుంటున్న అతనికి ఆమె వండి పెట్టేది. ఇప్పటిలా పాలప్యాకెట్లు ఉండేవికావు. పాలు ఇంటికే తెచ్చిపోసేవారు. ఒకటి రెండుసార్లు పాలు పోసే అతను, తన గేదెను పులి లాక్కెళ్లిందని, మళ్లీ కొత్తది కొనుక్కోవటానికి అడ్వాన్సు ఇమ్మని అడగటం గుర్తుంది. అక్కడ అడవుల్నుంచి తరచు పులుల దాడి అప్పట్లో మామూలే. అక్కడే నేను రెండో తరగతిలో చేరాను. అక్షరాభ్యాసం అయ్యాక నిజామాబాద్‌లో నన్ను ఒకటో క్లాసులో చేర్చారు. పోచమ్మగుడి దగ్గర ఉండేవాళ్లం. అక్కతో పాటు మొదటి రోజు స్కూలుకెళ్లి అక్క క్లాసులోనే కూర్చున్నాను. ఆరోజు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. పిల్లలంతా ఎవరి బెంచీలో వాళ్లు నిశ్శబ్దం. బుర్రమీసాల సార్ లోపలకు వచ్చారు. అంతాలేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ సార్’ అన్నారు. ఆయన సిట్ డౌన్ అన్నాక, అంతా కూర్చుని, వెంటనే గుసగుసలు మొదలు పెట్టారు. సార్ ‘సైలెన్స్’ అని అరుస్తూ అక్కడున్న లావుపాటి రూళ్లకర్రతో టేబుల్ మీదగట్టిగా కొట్టాడు. ఆ చప్పుడుకు నేను బెదిరిపోయాను. ఇంటికి వెళ్లిపోదామంటూ గట్టిగా ఏడుపు మొదలు పెట్టాను. అక్క సార్ నడిగి నన్ను ఇంటి దగ్గర దించి, మళ్లీ స్కూలుకెళ్లింది. దాంతో ఆ యేడు ఇంట్లోనే నా చదువు గడిచింది. ఆ తర్వాత ఆదిలాబాద్ రావడంతో మళ్లీ స్కూల్లో చేర్చే ప్రయత్నం జరిగింది. రెండు ప్రశ్నలు అడిగి రెండో తరగతిలో చేర్చుకున్నారు. క్లాస్ రూమ్‌లో నేల మీదే కూర్చునేవాళ్లం. రెండు, మూడు తరగతులు అక్కడే చదివాను. నాన్న నన్ను, అక్కను ‘మహామంత్రి తిమ్మరుసు’ సినిమాకు తీసుకెళ్లటం గుర్తుంది. అప్పట్లో మాకు బట్టలు అమ్మే కొనేది. కానీ నాకు మాత్రం ఓ మూడుసార్లు నాన్నే రెడీమేడ్ గౌన్లు కొన్నారు. ఒకటి నీలిరంగు శాటిన్ గౌన్‌పై ముద్ద గులాబీల డిజైన్, రెండవది ఆలివ్ గ్రీన్ ఫ్రాక్‌పై రంగురంగుల పూసల డిజైన్, మరొకటి లావెండర్ కలర్‌పై వైలెట్ రంగులో పెద్ద పెద్ద డాలీల డిజైన్ ఫ్రాక్. అవి ఎంత ఇష్టంగా ఉండేవో. అక్క, నేను మిద్దెమీద చేరి చదువు తక్కువ, కాలక్షేపం ఎక్కువ చేసేవాళ్ళం. కింద జంతికలు, చేగోడీలు చేస్తున్న అమ్మ దగ్గరకు నోట్ పుస్తకాలు తీసుకెళ్ళి పాత పేజీల్లో రాసినవి కూడా అప్పుడే రాసినట్లు చెప్పటం, అమ్మ అమాయకంగా నమ్మేసి ప్లేట్లల్లో జంతికలు, చేగోడీలు అందించడం, వాటితో మళ్లీ మిద్దెపైకి చేరడం.. తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. ఓసారి ఆ బావి దగ్గర పడ్డాను. బావి గట్టు కొట్టుకుని కంటి పక్కగా దెబ్బ తగిలి రక్తం కారడం మొదలైంది. అదేంటో నేను ఏడవనే లేదు. ఇంటి వాళ్ల నగేష్ రక్తం అంటూ అరవడంతో అమ్మ పరుగెత్తుకొచ్చి, ముందు పంచదార అద్దింది. అంతలో సమయానికి ఆఫీస్ ప్యూన్ జమాలుద్దీన్ రావడం, సైకిల్ పై ఆసుపత్రికి తీసుకెళ్లటం, డాక్టర్ కుట్లువేసి కట్టుకట్టి పంపడం గుర్తుంది. ఏవేవో జ్ఞాపకాలు.. మనిషి మెదడెంత అద్భుతమైంది! ఈ అనంతకాల గమనంలో నిన్న, నేడు, రేపటి సంగతుల సమన్వయానికి మెదడే కదా కీలకం. అంతలో నా మదిలో మెదిలింది, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ చిత్రానికి చంద్రబోస్ గారు అందించిన పాట.. కె.కె.స్వరంలో..

గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏమూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి..

అయితే జ్ఞాపకాలు అన్నీ మళ్లీ మళ్లీ నెమరువేసుకో తగ్గవిగా ఉండవు. కొన్ని చేదు జ్ఞాపకాలు తప్పవు. ప్రాణ స్నేహితులు దీర్ఘకాలం తర్వాత కలుసుకుని తమ గత, ప్రస్తుతాలను నెమరు వేసుకుంటే ఎలా ఉంటుందో ఆచార్య ఆత్రేయ  గారి మనసుకు బాగా తెలుసు. ఆయన ‘అనుబంధం’ చిత్రానికి అందించిన ఓ చక్కని గీతమే అందుకు సాక్ష్యం..

ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా
లేదురా ఆ సుఖం రాదురా..
నేను మారలేదు నువ్వు మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమికాదు
ఈ నేల ఆ నింగి అలాగె వున్నా
ఈ గాలి మోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము ఆ రోజు
భ్రమలాగ వుంటాయి ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా…

అలాగే మనసు ఇచ్చిపుచ్చుకుని కారణాంతరాల వల్ల ఆమె దూరమై, మళ్లీ ఎప్పుడో ఎదురైతే అతడిలా..

ఆనాటి చెలిమి ఒక కల.. కలకాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ.. మరచిపోవుట ఎలా..
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
పరిచయాలు, అనుభవాలు గురుతుచేయును గతం..

‘పెళ్లి రోజు’ చిత్రానికి రాజశ్రీ రాసిన ఈ గీతానికి, పి.బి.శ్రీనివాస్ స్వరంలోని ఫీల్ ప్రాణం పోసింది. ఇద్దరు రమణుల ప్రేమ భావనాగీతం.. అదొక ఆపాతమధురం. మళ్లీ మళ్లీ వినాలని పించే ఈ లలితలలిత పద వల్లవ గీతాన్ని తోలేటి వెంకటరెడ్డిగారు రాశారు. ‘సంఘం’ చిత్రంలోని ఆ పాట ఇలా..

సుందరాంగ మరువగలేనోయ్ రావేలా…
నా అందచందములు దాచితి నీకై రావేలా..
ముద్దు నవ్వులా మోహన కృష్ణా రావేలా..
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ..॥సుందరాంగ॥
చరణాలన్నీ కూడా ఎంతో బాగుంటాయి.. ముఖ్యంగా చివరన…
మనసు నిలవదోయ్ మధువనంతమోయ్ రావేలా..

అనటం మదిని రంజింపజేస్తుంది.

ఇక ప్రేమించి, అంతలోనే తనను మరచి పొమ్మంటూ దూరమైన ప్రేయసిని మరువలేని ప్రేమికుడి మనోగతిని తెలిపే ఆత్రేయ పాట ‘ప్రేమనగర్’ చిత్రంలో ఇలా..

తాగితే మరిచిపోగలను.. తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను.. మరవనివ్వదు
మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖములేదంతే..
ఒకరికిస్తే మరలి రాదు.. ఓడిపోతే మరిచిపోదు
గాయమైతే మాసిపోదు.. పగిలిపోతే అతుకుపడదు..
॥మనసు గతి॥

మరుపు ఒక్కోసారి ఎన్ని చిక్కులు తెచ్చి పెడుతుందో. శకుంతల దుష్యంతుల కథలో కణ్వుడు లేని సమయంలో అడవికి వేటకై వచ్చిన దుష్యంతుడు అక్కడ శకుంతలను చూసి తొలిచూపులోనే వలచి, ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తన గుర్తుగా ఆమెకు ఉంగరం ఇచ్చి, వెళ్లిపోతాడు. ఆ పైన ఆమె సంగతే మరచి పోతాడు. ఇక్కడ శకుంతల గర్భవతి అయి, భరతుడు పుట్టి, పెరగడం జరిగి పోతుంది. ఇక కణ్వుడు, శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. అయితే దారిలోనే నావలో ప్రయాణించే సమయంలో దుష్యంతుడిచ్చిన ఉంగరం నీళ్లల్లో పడిపోతుంది. ఆ విషయం ఆమె గమనించదు. తీరా దుష్యంతుడు కొలువుకు వెళ్ళే సరికి, దుష్యంతుడు ఆమె ఎవరో తనకు తెలియనే తెలియదంటాడు. ఆమెను వివాహమాడినట్లు సాక్ష్యం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. ఆమె వెంటనే ఉంగరం కోసం చూసుకుంటే కనిపించదు. అంతలో ఓ జాలరి వచ్చి, తనకు నీళ్లలో ఉంగరం దొరికిందని, శకుంతలకు దుష్యంతుడిచ్చిన ఉంగరాన్నే తెచ్చిస్తాడు. ఆ ఉంగరాన్ని చూడగానే దుష్యంతుడికి శకుంతలతో తన ప్రణయం, పరిణయం చటుక్కున స్ఫురణకు వస్తాయి. అలా  కథ సుఖాంతమవుతుంది. కొంతమంది తమకు లాభదాయకంగా ఉండే విషయాలను గుర్తుంచుకోవడం, అలా కాని విషయాలను మరిచిపోవడం చేస్తుంటారు. తాము చెల్లించవలసిన అప్పులను మరిచిపోవడం, తమకు రావలసిన బాకీలను గుర్తుంచుకోవడం వంటివి ఆ కోవ కిందకే వస్తాయి. మరుపును కొన్ని సార్లు ఒక సాకుగాను వాడుతుంటారు. అది క్షేమకరమైన సాకు. అవతలివారు కూడా ఏమీ అనలేని సాకు. నిజంగా మరుపు కొందరిదయితే, మరుపు నటించడం మరికొందరి లక్షణం. ముఖ్యంగా రాజకీయ నాయకులకయితే ఇది వెన్నతో పెట్టిన విద్య. పదవి లభించాక వాగ్దానాలన్నీ ఊసేలేకుండా పోతాయి. అయితే ఆసక్తి గల అంశాలను, ఇష్టమైన అంశాలను మరువలేమన్నది చాలావరకు వాస్తవం. చదువు విషయంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇదే చెపుతుంటారు. ఇష్టంగా చదివితే కష్టమేమీ ఉండదనీ, మరిచిపోరనీ చెపుతారు. భయంతో ఉంటేనే మరుపు వస్తుందని కూడా అంటారు. ఒక్కోసారి ఒక అంశాన్ని జ్ఞాపకం ఉండాలని అతిగా ఆలోచించటం వల్ల చివరకు అది మరచి పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ జ్ఞాపకాలు చిత్రంగా కూడా ఉంటాయి. అప్రధానమైన అంశాలు బాగా గుర్తుండటం కూడా చాలాసార్లు జరుగుతుంది. బాల్యంలో చదివే ఇల్లు అలుకుతూ  పేరు మరిచిపోయిన ఈగ కథ అందరికీ తెలిసిందే. అలాగే ‘ఆలీబాబా నలభై దొంగలు’ కథలో ఆలీబాబా అన్న కాశిమ్ గుహ తలుపులు తెరవడానికి ఉచ్చరించే ‘ఓపెన్ సెసేమ్’ అనే మాటను మరచిపోయి, గుహ నుంచి బయటపడలేక చివరకు దొంగల చేతిలో హతమవుతాడు. ‘మరిచిపోకు’ అనే పద ప్రయోగం నిత్యం వినవచ్చేదే. ప్రస్తుత కాలంలో అయితే కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేటప్పుడు ‘మాస్క్ ధరించడం మరువకండి’ అని హెచ్చరించడం సర్వసాధారణం. ‘ఏ అవసరం వచ్చినా నీకు నేనున్నాను అని మరిచిపోకు’ అని అభయమిచ్చే మిత్రవాక్యాలు, బంధువుల వచనాలు తెలిసినవే. ఆధ్యాత్మిక పథంలో త్యాగరాజు గారయితే శ్రీరాముడితో, సేవ చేసేందుకు తాను ఉన్నానన్న విషయం విన్నవించుకుంటూ…

‘ఉపచారము జేసే వారున్నారని మరువకురా
కృప కావలెనని నే నీ..కీర్తిని పల్కుచునుండగ
॥ఉపచారము॥
అలాగే మరో కీర్తనలో
రాముని మరువకవే మనసా
రాముని, యాగము కాచిన పాప
విరాముని, సద్గుణధాముని, సీతా
॥రాముని॥
అని మనసంతా రామమయం చేసుకున్నారు.

మతిమరుపు ప్రొఫెసర్ గురించిన ఎన్నో ఉదంతాలు, కథలు విని నవ్వుకోవటం మామూలే. కళ్లద్దాలు ధరించి కళ్లద్దాల కోసం వెతుక్కోవడం వంటివి తరచు జరిగేవే, వినేవే. అలాగే ‘తాళము వేసితిని, గొళ్ళెము మరిచితిని’ అనే మాట కూడా ఎంతో పాపులర్. ‘ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికినట్లు’ అని ఓ సామెత. అయితే ఆలోచిస్తే మరుపు కూడా మనిషికి భగవంతుడిచ్చిన ఓ వరంగానే భావించాలి. ఎలాగంటే కష్టాలను, బాధలను, వేదనలను మరిచిపోకపోతే మనిషికి బతకగలడా? వేదన అనగానే ఓ పాట గుర్తుకొస్తోంది. అది.. ‘ధనమా దైవమా’ చిత్రానికి సినారె రాసిన పాట..

నీ మది చల్లగా స్వామీ నిదురపో…
దేవుని నీడలో వేదన మరిచిపో..

ఒక్కోసారి గాయపడిన హృదయానికి జ్ఞాపకాలే లేపనాలవుతాయి అనుకుంటుంటే మరో మాట మదిని తాకింది..

ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పో..దూ..
ఊరువిడచి వాడ విడచి ఎంత దూరమేగినా….
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్..
అంతరాన ఉందురోయ్..
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధమూ
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకునోయ్..
జ్ఞాపకాలే అతుకునోయ్
॥ఏటిలోని॥

‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి కొసరాజుగారు అందించిన ఈ పాటను మంగళంపల్లిగారు గొప్ప ఫీల్‌తో పాడారు.

కొన్ని చిత్రమైన మరపులు ఉంటాయి. తాత్కాలిక మరుపుకు సంబంధించిన కథాంశంతో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఎంతగానో హిట్ అయింది. ఒక ముఖ్యమైన పనిలో ఉండి, అంతలోనే వేరే విషయం పైకి దృష్టి మారి అసలు పనిని మరిచిపోవడం, అది ఎప్పుడో గుర్తుకురావడం.. దాంతో అడుగడుగునా ఇబ్బందులు, అపార్థాలు, వైఫల్యాలు అంతా గందరగోళం.. సినిమాలో ఆ ఇబ్బందులను ఎప్పటికప్పుడు నాటకీయంగా అధిగమించినా వాస్తవంగా అయితే ఇంతే సంగతులు. మరుపుకు సంబంధించే వచ్చిన మరో హిట్ చిత్రం ‘గజిని’, ఆ చిత్రం వచ్చాక మతిమరుపు వ్యక్తుల్ని సరదాగా ‘వాడొక గజిని, ఆమె ఒక గజిని’ అనడం పరిపాటి అయింది.

చాలాకాలం తర్వాత ఎదురైన పరిచయస్థుల్ని, స్నేహితుల్ని మరుపు కారణంగా గుర్తుపట్టలేని సందర్భాలు తటస్థిస్తూ ఉంటాయి. ముఖం చూసి గుర్తుపట్టినా వారి పేరు ఎంతకూ గుర్తురాదు. కొందరిని చూడగానే ఎక్కడో చూశాం అనుకుంటాం. కానీ ఎక్కడో, ఎవరో గుర్తుకు రాదు. ఇక కూరలో ఉప్పు వేయడం మరిచిపోవడమో, వేసినా ఆ విషయం మరిచిపోయి మళ్లీ వేసేవారూ ఉంటారు. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం, ఇంటికి తాళం వేయడం వంటివి మరిచిపోతే అనర్ధాలు తప్పవు. తీవ్రమైన పని ఒత్తిడిలో కొన్నిసార్లు, ఆందోళనలో కొన్నిసార్లు, వయసు పైబడ్డ కారణంగా మరిచిపోవడం జరుగుతుంటుంది.

అన్నట్లు కుక్కలు, ఏనుగులు, కోతులు, డాల్ఫిన్లు, వేల్స్, చిలుకలు మొదలైన వాటికి కూడా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉంటుందట. ‘మైమరుపు’ అని మరో పదప్రయోగం ఉంది. మన కళ్లను, మనసును ఏదో కట్టిపడవేసి నప్పుడు వివశులై మేను మరువడమే మైమరుపు. హిందీలో జ్ఞాపకాల గురించి ‘యాదోంకి బారాత్’, ‘యాదేఁ’ వంటి సినిమాలెన్నో వచ్చాయి.

యాదో కి బారాత్ నిక్లి హై ఆజ్ దిల్ కె ద్వారే, దిల్ కె ద్వారే..
సప్నో కి షహనాయి బీతె దినోం కో పుకారే, దిల్ కె ద్వారే
హో ఛెడొ తరానె మిలన్ కె ప్యారే ప్యారే సంగ్ హమారే..

ఒక్కోసారి భరించలేని జ్ఞాపకాలయితే వాటినుంచి పారిపోవాలని కోరుకోవటమూ సహజమే. దాన్ని గురించే ఆంగ్ల కవయిత్రి ఎమిలీ డికిన్సన్ ‘టు ఫ్రీ ఫ్రమ్ మెమరీ’ అని ఓ పోయెమ్ రాశారు.

టు ఫ్రీ ఫ్రమ్ మెమరీ
హ్యాడ్ వుయ్ ది వింగ్స్
మెనీ వుడ్ ఫ్లై
ఇన్యూర్డ్ టు స్లోవర్ థింగ్స్
బర్డ్స్ విత్ సర్‌ప్రైజ్
వుడ్ స్కాన్ ది కొవరింగ్ వ్యాన్
ఆఫ్ మెన్ ఎస్కేపింగ్
ఫ్రమ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్

స్మృతి కావ్యాలు (ఎలిజీ), స్మృతి కవిత్వం తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీశ్రీ తన నేస్తం కొంపెల్ల జనార్దన రావు కన్ను మూసినపుడు ‘తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి’ అంటూ కవిత రాసి తన మహా ప్రస్థానంలో చేర్చారు. సినారెగారు తనకు దూరమైన భార్యను గుర్తుచేసుకుంటూ…

‘సతీ నా స్మృతిలో నడిచొస్తే
ఏమంటాను నే నేమంటాను
నలుగురు కూతుళ్లను చూస్తూ
నిలబడి పొమ్మంటాను’

అంటూ స్మృతి గజళ్లు రాశారు.

ఇక బసవరాజు అప్పారావు కన్ను మూయగా వారి సతీమణి రాజ్యలక్ష్మమ్మ ‘ప్రియ నిరీక్షణం’ పేరుతో స్మృతి కవితలు రాశారు…

చల్లని చిరుగాలి పాట
మెల్లగా వీనుల సోకగా
వాకిట నిలబడి అడుగుల
చప్పుడైనప్పుడల్లా
ఆత్రముగా నీవే వచ్చితివని
భ్రమపడి చూతు నాథా..

ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. స్మృతి సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీటివల్ల పాఠకులు ఆయా రచయితల అనుభూతులను, విషాదపు లోతును మాత్రమేగాక ఎవరి స్మృతిలో రాస్తారో వారి గొప్పతనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలుసుకొని, స్ఫూర్తి పొందగలుగుతారు.

జ్ఞాపకాలలో కష్టం కలిగించే వాటిని మెదడునుంచి తొలగించుకోవడం, కోరుకున్నవాటినే దాచుకోవటం అనేది అసాధ్యం. జీవితంలోని విషాదాలను కాలక్రమంలో మనిషి మరిచి పోగలడు కాబట్టే బతక గలుగుతున్నాడు. ఆ రకంగా మరపు ఓ వరం. జీవితమనే పుస్తకంలో దాచుకునే ఇష్టమైన నెమలీకలు బాల్య జ్ఞాపకాలు. జ్ఞాపక శక్తి వల్లే మనిషి విద్యలో విజయం సాధించగలుగుతున్నాడు, విజ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాడు, ప్రగతి పథంలో పయనించగలుగుతున్నాడు. బట్టీపడితే చదివింది గుర్తుంటుందని కొందరంటారు. పదేపదే చదవటంవల్ల కొంతమేరకు ఫలితం ఉండే మాట నిజమే అయినా యాంత్రికంగా పదిసార్లు చదివేకన్నా, మనసు పెట్టి ఒకటి, రెండుసార్లు చదివితే చాలన్నది మేలైన మాట. జ్ఞాపకశక్తి పెరగడానికి సరైన ఆహారం తీసుకోవడం, యోగ చేయడం వంటివి ముఖ్యమని చెప్పటం తెలిసిందే. ఇక గతం గతః అని అంటుంటారు. గతాన్నే నెమరేస్తూ ప్రస్తుతాన్ని విస్మరిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అయితే గతమనేది ప్రస్తుతానికి, భవిష్యత్తుకు కూడా పునాది. అందువల్ల గతం తాలూకు గురుతులనేవే ఉండకూడదనుకోవడం సరికాదు. మనసును కుంగదీసే జ్ఞాపకాలను అదుపు చేసుకుంటూ, మరిచిపోవటానికి ప్రయత్నిస్తూ, ఆనందాన్నిచ్చే జ్ఞాపకాలతో పునరుత్తేజం పొందుతూ ముందుకు సాగడమే వివేకం అనుకుంటుంటే కళ్ల మీదకు నిదుర కమ్ముకు రాగా ల్యాప్‍టాప్ షట్‌డౌన్ చేయలేదని గుర్తుకువచ్చి, చటుక్కున లేచి ఆ పని ముగించి మళ్లీ పడక మీద వాలాను. అంతే నా జ్ఞాపకాల ఆలోచనలూ షట్‌డౌన్ అవుతూ.. నేను సుషుప్తిలోకి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here