మానస సంచరరే-65: చివరాఖరులు.. చివురులు!

8
8

[box type=’note’ fontsize=’16’] “ఒకప్పుడు అసాధ్యాలుగా ఉన్నవి నేడు సుసాధ్యాలు, నేడు అసాధ్యాలుగా ఉన్నవి రేపు సుసాధ్యాలుగా మారుతాయి. ఎందుకంటేకాలం అనంతమైందే, మానవ కృషీ అనంతమైందే” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]ప[/dropcap]గటి వెలుగులు పక్కకు తప్పుకుంటుండగా, అప్పటివరకు దాక్కున్న చీకట్లు ధైర్యంచేసి లోకాన్ని ఆవరించే వేళ.. ఏకాంతంగా ఉన్న నేను ఇష్టమైన పాటలు వింటూ..

విధాత తలపున ప్రభవించినది.. అనాది జీవన వేదం.. ఓం..
ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం.. ఓం..
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం..ఆఁ ఆఁ..
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది..
నే పాడిన జీవనగీతం.. ఈ గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం..
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారముకాగా
విశ్వకావ్యమున కిది భాష్యముగా
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆదితాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే.. విరించినై..

‘సిరివెన్నెల’ చిత్రంలోని మహోన్నత గీతం ఎంతగా జనాదరణ పొందిందంటే చిత్రం పేరే గీత రచయిత సీతారామ శాస్త్రిగారి పేరు ముందర చేరేంతగా. ఇందులో ప్రతి పదం ఎంతో అర్థవంతంగా, అందంగా ఉంటాయి. ప్రాగ్దిశ వీణియ పైన..అనగానే శ్రోత కళ్ల ముందు ఓ మనోహర చిత్రం దర్శనమిస్తుంది. అయితే ‘అనాది రాగం ఆదితాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే..’ పంక్తి దగ్గరే నా మనసు ఇప్పుడు చిక్కుకుపోయింది. ఆది..అంతం..అనంతం..వీటి గురించి మనోమథనం మొదలైంది. ‘ఆది’ సంగతి అటుంచితే ‘అంతం’ అనేది ఉందా. మనిషి జీవితాన్నే తీసుకుంటే.. అమ్మ గర్భంలో నవమాసాలుండి, ఆపైన ప్రపంచంలోకి వచ్చేస్తూ.. కేర్ కేర్ మంటూ నేనొచ్చానోచ్ అని తెలియజెపుతాడు.

లాలీ లాలీ లాలీ లాలీ..
వటపత్ర శాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి.. ఆఁ..
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి..
జగమేలు స్వామికి పగడాల లాలి..

వంటి ఎంచక్కని లాలిపాటలెన్నో వింటూ, ఉయ్యాలలూగుతూ.. అదో అద్భుత దశ. ఇంట్లో వారందరి దృష్టి పసివాడి పైనే. బోర్లపడటం, పాకడం, కూర్చోవడం, నిల్చోవడం, అత్త..తాత అంటూ మాటలు మొదలు పెట్టడం, పడుతూ లేస్తూ అడుగులేయడం.. ఆ పైన నిటారు నడకలు.. అంతలో రానే వచ్చేస్తుంది తొలి పుట్టినరోజు పండుగ. ఈ స్పీడ్ యుగంలో అయితే మాటలు రావడంతోనే అ, ఆలు దిద్దించక ముందునుంచే ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటూ ఇంగ్లీషు ఒంటబట్టిస్తారు. మూడేళ్ల నుంచే స్కూలు.. బాల్యం అలా అలా కలలా కరిగిపోతుంది. కౌమారం వచ్చేసరికి చదువు ఒత్తిడి పెరిగిపోతుంది.. చెడు స్నేహాలయితే దురలవాట్లు.. ఈ మెట్టు ఎక్కితే యవ్వనం మరో చిత్రం.. ఓవైపు గొప్పచదువులు.. పెద్ద ఉద్యోగాలకై సాధనలు, మరో వైపు ఆకర్షణలు, ప్రేమ వ్యవహారాలు, సఫలాలు, విఫలాలు.. సరే ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం.. కృషిచేశావంటే, ఎదురీదేవంటే సాధించేవు, గెలిచేవు నీదే జయం’ అనుకుంటూ ఈ మెట్టు ఎక్కేస్తే పెళ్లి, కుటుంబం బాధ్యతలు, పిల్లల చదువులు, ఆర్థిక సమస్యలు.. జీవితంతో నిరంతర కుస్తీతో నడివయసు సతమవుతుంది. వృద్ధాప్యంలోకి అడుగు పెడితే అదొక సమస్యల తోరణం.

డబ్బులు, జబ్బులు.. తరానికి తరానికి మధ్య అవగాహనలో అంతరాలు.. ఇల్లో, ఆశ్రమమో.. ఆసుపత్రో.. ముక్కుతూ..మూలుగుతూ.. చివరకు తనువు చాలించడం. అంతటితో అంతం అనుకుంటే పొరపాటు. ఆత్మకు ఆది, అంతం లేవని భగవానుడు గీతోపదేశం చేశాడు కదా అనుకుంటుంటే ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో సముద్రాల రాఘవాచార్య రచించిన శ్రీకృష్ణ గీతోపదేశం గుర్తొచ్చింది. అందులో ఇలా..

తనువు అనిత్యము, నిత్యము ఆత్మ యొకటే
చివికి జీర్ణములైన చేలముల్ వదలి
క్రొత్త వలువలు గట్టికొన్నట్టి రీతి
కర్మానుగతి ఒక్క కాయమ్ము వదలి
వేరొక్క తనువు ప్రవేశించునాత్మ
ఆత్మకు ఆదియు, అంతంబు లేదు..
అది గాలికెండదు, అంబుతో తెగదు,
నీట నానదు, అగ్ని నీరై పోదు
కరుణా విషాదాలు కలిగించునట్టి
అహంకార మావలనెట్టి మోహమ్ము వీడి
ప్రబుద్ధడవగుమా..

పుట్టుక, మరణం; మరణం, పుట్టుక అంతర్గర్భితాలు. మనిషి చినిగిన వస్త్రాలను వీడి, కొత్త వస్త్రాలను ధరించినట్లే జీవాత్మ ఒక శరీరం వీడి మరో శరీరాన్ని ఆశ్రయిస్తుంది. అందువల్ల జీవితం అనంతమైన యాత్ర అవుతోంది. మరణం కేవలం దీర్ఘ నిద్రమాత్రమే. జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఇదే భావం భజగోవింద శ్లోకాలలో కూడా గమనించవచ్చు.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే

‘పుడుతూ, మరణిస్తూ, మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుర్భరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కావడం లేదు. మురారీ కృపతో నన్ను రక్షించు’ అని వేడుకుంటాడు.

కాలమూ అనంతమైనదే. తాజాగా ఉగాది జరుపుకున్నాం. శార్వరి సెలవు తీసుకుంది. ప్లవ పాదం మోపింది. ఉగాది అంటే.. యుగాది. ‘యుగ’ అంటే ద్వయం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనాలు కలిసి యుగం (సంవత్సరం) అయితే ఆ యుగానికి ఆది, యుగాది అయింది. అదే సంవత్సరాది. ఇలా సంవత్సరాల పేర్లు మారుతూ ఉంటాయి. కానీ కాలం సాగుతూనే ఉంటుంది. అరవై తెలుగు ఉగాదుల పేర్లు కాలచక్రభ్రమణంలో మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

అలాగే శిశిరంలో ఆకులు రాల్చి మోడులైన చెట్లన్నీ, చైత్రం రావడంతోనే చిగురులు తొడిగి, సరికొత్త సింగారాలు మొదలు పెడతాయి. హఠాత్తుగా నాకు కొలీన్ కోరినీ రాసిన ‘న్యూ బిగినింగ్’ పొయెమ్ గుర్తొచ్చింది..

ఆటమ్ లీవ్స్ కమ్ టంబ్లింగ్ డౌన్
సేమ్ యాజ్ మై టియర్స్
ఫాలింగ్ టు ది గ్రౌండ్
రిలీజ్డ్ అన్‌ఫెట్టర్డ్
దే ఫ్లోట్ అన్‌బౌండ్
సూన్ టు విదర్
కర్ల్ అండ్ బ్రౌన్
దోజ్ లీవ్స్ విల్ డై
అపాన్ ది ఎర్త్
యాజ్ మై టియర్స్ టూ షల్ డ్రై
విత్ మై రెన్యూయింగ్ స్ప్రింగ్ రీబర్త్.

ఆది, అంతం అనే పదాలు జీవితంలో అనేకానేక సందర్భాలలో, అనేకానేక సంఘర్షణలలో, మనసు పడే వ్యథలో వ్యక్తమవుతూ ఉంటాయి. విధి ప్రతికూలించి, మనసిచ్చిన అమ్మాయి దూరమైతే, ఆమెను మరువలేక తన వేదనకు అంతం లేదనుకోవడం సహజమే కదా అనుకోవడంతోనే ‘అభినందన’ చిత్రంలో ఆత్రేయ అందించిన, ఎస్.పి.బాలు మధురంగా ఆలపించిన గీతం మనసులో మెదిలింది.

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా..
కథైనా కలైనా కనులలో చూడనా ॥అదే నీవు॥
కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము…
గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము.. అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదిలేని గానము ॥అదే నీవు॥

ప్రేమ కథలు చాలా చిత్రంగా ఉంటాయి. ఎప్పుడు, ఎక్కడ ఆరంభమవుతాయో, ఎక్కడ, ఎలా ముగుస్తాయో ఎవరికీ తెలియదు. ‘దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయి’ లోని పాట ఇదే చెపుతుంది..

అజీబ్ దాస్‌తాన్ హై యే
కహాఁ షురూ కహాఁ ఖతమ్,
యే మంజిలేఁ హై కౌన్ సి,
న ఓ సమఝ్ సకె న హమ్…

శైలేంద్ర రాసిన ఈ గీతం అప్పటికీ, ఇప్పటికీ తాజాగానే ఉంది. ఎందరి జీవితాల్లోనో కష్టాలకు ఆది, అంతం ఉండదు. పుట్టుకే కష్టాల లోగిలిలో.. ఆ పైన ఆ కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి, లేదంటే ఒకేసారి అనేక కష్టాలు చుట్టుముట్టటం మామూలే. ఆ కష్టాలను అధిగమిస్తూనే ముగింపులేని కథలా జీవితంలో ముందుకు ప్రయాణించడం, ఆశయాల సాకారానికి ప్రయత్నించడం.. ఆ తలపుతోనే ‘మహర్షి’ చిత్రంలోనిపాట మదిలో మెదిలింది.

ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా ॥ఇదే కదా॥
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుష్టుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా
మనుష్యులందు నీ కథ.. మహర్షి లాగ సాగదా.. ॥ఇదే కదా॥

మహాకవి భక్త పోతనగారు ఎవరిని భగవంతునిగా ఎంచి, శరణు వేడుకోవాలో గజేంద్రమోక్షంలో గజేంద్రుడితో ఇలా పలికించారు..

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

ఈ జగమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో, ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో, సర్వ మూ తానే అయిన వాడెవ్వడో, ఎవడు తనకు తాను పుట్టినవాడో, అటువంటి ఈశ్వరుని శరణు వేడుతాను.

అసలు శివుడు, ఆదిమధ్యాంతరహితుడుగా లింగాకారం దాల్చడం వెనుక ఓ పురాణ కథ ఉంది. అది.. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వాగ్వివాదం మొదలై తామిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారు. కానీ ఎంతకూ తేలలేదు. అంతలో శివుడు వారికి తన శక్తి చూపించాలని మాఘమాస చతుర్దశి రోజున వారిద్దరి మధ్య జ్యోతిర్లింగరూపం ధరించాడు. బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని ఆది, అంతం (మొదలు, తుది) తెలుసు కోవాలని విష్ణువు వరాహరూపం ధరించి శివలింగం అడుగుభాగాన్ని వెతుకుతూ వెళ్లాడు. ఇక బ్రహ్మ హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరుగుతూ వెతకనారంభించాడు. ఎంత ప్రయత్నించినా వారిద్దరికీ శివలింగం ఆది, అంతాలు తెలియలేదు. దాంతో ఇద్దరూ కలిసి, శివుడి దగ్గరకు వెళ్లి ‘మహేశా! మేం, మీ శక్తిని తెలుసుకోలేక పోతున్నాం’ అన్నారు. అప్పుడు శివుడు మందస్మితం చేసి, ‘మీ ఇద్దరి మధ్య వివాదాన్ని నివారించడానికే లింగాకారం ధరించాను’ అని నిజరూపంతో దర్శనమిచ్చాడు. అలా బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడి ఆధిక్యతను గుర్తించారు. నిశితంగా గమనిస్తే ప్రారంభం, ముగింపు, ప్రారంభం.. ఇది ప్రకృతి సూత్రం. సముద్రాన్నే పరికిస్తే అలలు ఉవ్వెత్తున లేచి, అంతలో విరిగి పడుతుంటాయి.. మళ్లీ లేస్తాయి, మళ్లీ పడతాయి. అది నిరంతర ప్రక్రియ. ఆ అలల పోరాటానికి అంతమే ఉండదు. ప్రపంచ గమనమూ అంతే. ఆయా దేశాలలో పాలన విషయమే ప్రస్తావించుకుంటే ఆయా దేశాలలో అధికార పార్టీలు మారవచ్చు. కానీ ప్రభుత్వ వ్యవస్థ మాత్రం సాగిపోతూనే ఉంటుంది. అలాగే వివిధ కార్యాలయాలలో సిబ్బంది మారవచ్చు. కానీ కార్యాలయ వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.

మానవుడు తన మేధతో నిరంతర ప్రయోగాలు జరుపుతూ ఎన్నింటినో కనుగొన్నాడు, కనుగొంటున్నాడు. అయితే ఈ అన్వేషణ, పరిశోధనలకు అంతమనేది లేదు. కొత్త అవససరాల దృష్ట్యా కావచ్చు, మరింత సౌకర్యవంతంగా బతకడానికి కావచ్చు, ఇంకా ఇంకా శోధనలు చేస్తూనే ఉన్నాడు. దీనికి అంతమే లేదు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, రోబోలు, రాకెట్లు, అంతరిక్షనౌకలు, ఔషధాలు, టీ కాలు.. ఇలా ఎన్నో. ఒకప్పుడు అసాధ్యాలుగా ఉన్నవి నేడు సుసాధ్యాలు, నేడు అసాధ్యాలుగా ఉన్నవి రేపు సుసాధ్యాలుగా మారుతాయి. ఎందుకంటేకాలం అనంతమైందే, మానవ కృషీ అనంతమైందే.

టి.ఎస్.ఇలియట్ ఇలా అంటాడు…

‘వాట్ వుయ్ కాల్ ది బిగినింగ్ ఈజ్ ఆఫెన్ ద ఎండ్. అండ్ టు మేక్ ఏన్ ఎండ్ ఈజ్ టు మేక్ ఎ బిగినింగ్. ది ఎండ్ ఈజ్ వేర్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్’. అలాగే ప్రసిద్ధ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ‘ది ఎండింగ్ ఈజ్ ది బిగినింగ్, అండ్ ది బిగినింగ్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ది ఓన్లీ స్టెప్’ అన్నారు. మనిషి ఆలోచనలూ అంతే. ఎక్కడో మొదలై, అనేక దారుల్లో అలా అలా పయనిస్తూ చివరకు హఠాత్తుగా అంతరాయానికి గురవుతాయి. అలాటి సందర్భంలో అసలీ ఆలోచన ఎక్కడ మొదలైందీ అని మనల్ని మనం ప్రశ్నించుకుని, ఆ ఆలోచన గొలుసు వెంట వెనక్కి నడుస్తూ, పరిశోధించుకుంటే, ఆశ్చర్యపోవటం మనవంతవుతుంది. ఎందుకంటే ఆలోచన ఒకదాంట్లోంచి, మరొక దాంట్లోకి మారిపోతూ ఎన్నో అంశాలను తెలియకుండానే స్పృశిస్తుంది. మూలాంశం మాత్రం మరుగున పడుతుంది. ఆలోచనలకు అంతరాయం కలిగినా ఆ విరామం తాత్కాలికమే. మనిషి ఆలోచనా ప్రవాహంలో నిరంతరం మునిగి, తేలుతూనే ఉంటాడు. వాటికి అంతు, పొంతు ఉండదు.

అన్నట్లు ఇంతకాలంగా అనేకానేక అంశాల గురించిన నా ఆలోచనలను ‘మానస సంచరరే‘ పేరిట ఓ కాలమ్‌గా నాదైన శైలిలో మీ ముందుంచాను. పాఠకులైన మీ ఆదరణ, ప్రోత్సాహాలే నా కలానికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చాయి. సాహిత్య పఠనమే తగ్గిపోయిన నేటికాలంలో ఏ విషయమైనా చదివించేలా రాయాలన్న ఉద్దేశంతోనే శక్తివంచన లేకుండా ఆ ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాన్ని సఫలం చేసిన సాహిత్యాభిమానులకు, సాహితీ మిత్రులందరికీ నా అక్షరాంజలులు. ‘మానస సంచరరే‘ రచన నా మనసుకి ఎంతో తృప్తినిచ్చింది. అయితే మరింత వైవిధ్యంతో ఏదైనా రాయాలన్న తలంపుతో ‘మానస సంచరరే‘కి ఇక్కడ లంగరు వేస్తున్నాను.

అతి త్వరలో సరికొత్త కాలమ్‌తో మీ ముందుంటాను. నాకీ అవకాశం కల్పించిన సాహిత్య వేదిక ‘సంచిక’కు అక్షరాభివందనాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here