మానస సంచరరే -7: విహంగ వీ‘క్షణాల్’!

7
6

[box type=’note’ fontsize=’16’] పక్షుల్ని చూసి మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. వాటికున్న స్నేహపాత్రత ఇంతా అంతా కాదంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే-7: విహంగ వీక్షణాల్’!” అనే కాలమ్‍లో.  [/box]

[dropcap]ఆ[/dropcap]ఫీసునుంచి త్వరగా బయటపడగలిగినందుకు సంతోషిస్తూ సాయంకాల సౌందర్యం స్వాగతిస్తుండగా చకచకా నడిచాను. మనసు ‘సంధ్యా రాగం’ అందుకుంది. అలా.. అలా బస్‌స్టాప్ చేరాను. నాక్కావలసిన బస్సు కోసం నిరీక్షించక తప్పదనుకుని కూర్చున్నాను. ట్యాంక్‌బండ్.. ఎదురుగా రోటరీపార్క్.. దానికావల జలరాశి. ఆకాశాన సూర్యుడు అస్తమయ అందాలతో మిడిసిపడుతున్నాడు. ఇంతలో ఓ పెద్ద పక్షుల గుంపు సామూహిక ప్రయాణం చేస్తూ కనువిందు చేసింది. హాయిగా.. స్వేచ్ఛగా ఎగురుతూ.. వాటి అదృష్టమే అదృష్టం.. అసలు స్వేచ్ఛకు ప్రతీక పక్షి. అందుకే ఓ చిత్రంలో స్వేచ్చాభిలాషి అయిన కథానాయిక.. ‘ఎగిరేగువ్వ ఏమంది? విసిరే గాలి ఏమంది? ప్రకృతిలోన స్వేచ్ఛ కన్నా మిన్న లేనే లేదంది..’ అని పాడుకుంటుంది.

పాట అంటే గుర్తొస్తోంది. పక్షులకు మాటలు రాకపోయినా కొన్ని మాత్రం ఎంచక్కా తమదైన శైలిలో గానం చేస్తాయి. వసంతకాలంలో కోకిల గానానికి సాటి ఏది? మహిళలకు స్ఫూర్తిమూర్తి అయిన సరోజినీనాయుడు ‘భారతదేశపు కోకిల’ (ఇండియన్ నైటింగేల్)గా పేరొందారు. కోకిల గానం గొప్పదే కానీ అదేమిటో కాకి గూట్లో తాను గుడ్లు పెట్టి, పొదగకుండా వెళ్లిపోతుందట. అమాయకపు కాకి వాటిని కూడా పొదిగి, వాటికి బతుకునిస్తుందట. మాటలు రావు అని అనుకోడానికి కూడా లేదు. నేర్పాలే కానీ చిలుకలు చక్కగా మాట్లాడుతాయి. ‘చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వింటేనా’ అని కొన్నిసార్లు కొందరు వాపోవటం తెలిసిందే. రామదాసుగారు ‘ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా..’ కీర్తనలో ‘రామచిలుక నొకతె పెంచి ప్రేమ మాటలాడ నేర్పి.. రామరామరామయనుచు రమణియొకతె పల్కగా.. ప్రేమమీర భద్రాద్రి దాసుడైన రామవిభుడు, కామితార్థ ఫలములిచ్చి కైవల్యమొసగలేదా..’ అంటాడు. అంతలో ఎవరో ‘ఫైవోచ్చింది’ అరిచారు. ఉలిక్కిపడి లేచి ఒక్క ఉదుటున బస్సెక్కాను. జాతకం బాగుంది. సీటు దొరికింది. ‘ఇప్పటికీ అదృష్టం చాలు’ అనుకొని బైఠాయించాను. జాతకం అనుకోగానే చిలుక జోస్యం గుర్తొచ్చింది. అసలు చిలుకలతో అలా జోస్యం చెప్పించాలనే ఐడియా వచ్చినవాడెవడో.. ఇంతకాలమైనా.. కాలమెంత మారినా.. జనాలు చిలకజోస్యం మాయలో పడుతూనే ఉన్నారు. పంజరంలో పెట్టి నాలుగ్గింజలో, ఓ జామపండో అందించి కార్డులు తీయించటం. నరుడా.. ఏమి తెలివిరా. ‘చిలకమ్మ చెప్పింది’ అని ఓ సినిమా కూడా వచ్చింది. అన్నట్లు చిలక కొరికిన జామపండు మరింత రుచిగా ఉంటుందట. అదేమో కానీ చిలుకలు వాలిన చెట్టు మాత్రం ఎంతో అందంగా ఉంటుందనేది మాత్రం అక్షరసత్యం. ఎన్నో కథల్లో అయితే రాజకుమార్తె చిలుకతో ముచ్చటించటం, అది ముద ముద్దుగా మాట్లాడటం మామూలే. చూడముచ్చటైన జంటను ‘చిలుకాగోరింకలు’ అంటుంటారు. జంట నచ్చకపోతే మాత్రం కాకిముక్కుకు దొండపండు అనటం కద్దు. అన్నట్లు చిలుకను సింబాలిక్‌గా తీసుకోని సముద్రాల జూనియర్ ఓ గొప్ప పాట రాశారు.. అది.. ‘పయనించే ఓ చిలుకా… ఎగిరిపో పాడైపోయెను గూడు…’ అంటూ.. ‘పుల్ల పుడక ముక్కున కరచి గూడును కట్టితి వోయి,.. వానకు తడిసిన నీ బిగి రెక్కలు.. ఎండకు ఆరినవోయి, ఫలించలేదని చేసిన కష్టము మదిలో వేదన వలదోయి, రాదోయి సిరి నీ వెనువెంట, త్యాగమె నీ చేదోడు..’ ఎంత గొప్ప తత్త్వం.. అంతేనా.. ‘తీరెను రోజులు నీకీ కొమ్మకు.. కొమ్మా ఈ గూడు వదలి.. ఎవరికి వారే ఏదో నాటికి.. ఎరుగము ఎటకో ఈ బదిలీ, మూడుదినాల ముచ్చటయే ఈ లోకంలోమన మజిలీ, నిజాయితీగా ధర్మపథాన.. ధైర్యమే నీ తోడు..’ ఆపై చరణాలు కూడా మనసును కదిపికాదు, కుదిపివేస్తాయి.

రామాయణ మహాకావ్య రచనకు ప్రేరణనిచ్చింది క్రౌంచ పక్షుల జంటే. ఓ రోజు వాల్మీకి గంగా తటాన నడుస్తుండగా హఠాత్తుగా పక్షుల కమ్మని స్వరం వినిపించింది. చూస్తే రెండు క్రౌంచ పక్షులు మైథునంలో. వాల్మీకి ఆనందంగా వాటిని చూస్తూ కొంత తడవు అలాగే ఉండిపోయాడు. అంతలో బాధతో గట్టిగా రోదిస్తూ మగపక్షి నేలవాలింది. ఎర్రటి రక్తం దాని ఛాతీ నుంచి. బాణంతో కొట్టిన వేటగాడు దాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. వాల్మీకి బాధతో, కోపంతో,

మానిషాద ప్రతిష్ఠాంత్వం

ఆగమః శాశ్వతీ: సమాః

యత్ క్రౌంచమిథునాదేకం

అవధీః కామమోహితః

అని పలికాడు. (మానవులే కాదు, పక్షుల జంటలు సైతం మైధునంలో ఉండగా వాటికి భంగం కలిగించడం, గాయపరచడం చేయ కూడదు. నువ్వు అలాచేసి పాపం మూటగట్టుకున్నావు) ఇదే రామాయణంలో తొలి శ్లోకం.

రామాయణంలో సీతను కాకాసురుడు బాధించడం, సీతను రావణుడు ఎత్తుకెళ్లినప్పుడు జటాయువు అడ్డుపడి పోరాడి ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. జటాయువుకు శ్రీరాముడు మనుషులకు మాదిరే అంత్యక్రియలు నిర్వహించి, దానిపట్ల గౌరవాదరాలు ప్రకటించాడు. జటాయువు, సంపాతి సోదరుడు. బాల్యంలో ఇరువురూ అత్యంత ఎత్తుకు ఎగరటంలో పోటీ పడేవారట. ఒకసారి జటాయువు అత్యంత ఎత్తుకు ఎగరగా, సూర్యుని మంటకు గురికాకుండా సంపాతి తన రెక్కలు విప్పి, అడ్డుంచి రక్షించాడు. ఆ సందర్భంలో సంపాతి గాయపడి రెక్కలు కోల్పోయాడు. దాంతో రెక్కలు లేకుండానే సంపాతి జీవితం గడపవలసివచ్చింది.

అందానికీ, కులుకుకు పేరెన్నిక గన్న పక్షి హంస. ‘నిలువవే వాలు కనులదానా, వయారి హంస నడకదానా’ పాట పాతకాలంలో గొప్ప హిట్. వీటిలో మళ్లీ రాజహంసలున్నాయి. అనార్కలీ చిత్రం లో.. ‘మదనమనోహర సుందర నారీ.. మధుర దరస్మిత నయన చకోరీ.. మందగమన జిత రాజమరాళీ.. నాట్యమయూరీ…’ పాటలో చకోరం, మయూరం రెండూ చోటు చేసుకున్నాయి. చక్రవాకాలే వాడుకలో చకోరాలు. అవి వానచుక్కతోనే దప్పిక తీర్చుకుంటాయి కాబట్టి వానచుక్కకోసం నిరీక్షిస్తాయట. అందుకే నిరీక్షణ ప్రస్తావన వస్తే చకోరంతో పోలుస్తారు. సంగీతంలోనే వీటి పేరిట రాగాలున్నాయి. చక్రవాకరాగం, హంసధ్వనిరాగం వగైరాలు. హంసలకు మరో ప్రత్యేకత ఉంది. అవి నీటిని, పాలను వేరుచేయగల నైపుణ్యం కలవి. దాన్నే నీర, క్షీర న్యాయం అంటుంటారు. దేవుళ్లు సైతం పక్షులను వాహనాలుగా చేసుకున్నారు. విష్ణువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుంటే, బ్రహ్మ హంసను, కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకున్నారు. సరస్వతీదేవి చెంతనకూడా నెమలి, హంస ఉండనే ఉంటాయి. నలదమయంతుల కథలో హంస రాయబారం నడుపుతుంది. అష్టాదశ పురాణాల్లో గరుడపురాణం ఒకటి. మనుషులు మరణించినపుడు గరుడపురాణం చదవడం పరిపాటి. పుణ్యక్షేత్రాల్లో ‘పక్షితీర్థం’ ఒకటి. బ్రహ్మమానసపుత్రులు శివుడి ఆగ్రహానికి గురై, గద్దలుగా మారారని, శాపవిముక్తి కోసం అవి వేదగిరిలో దైవాన్ని ఆరాధిస్తున్నాయని చెపుతారు. ఆ పక్షులు నిత్యం ఉదయం పదకొండు గంటలకు ఆలయానికి వచ్చి, పూజారి పెట్టే చక్రపొంగలి తిని వెళ్తాయట. అక్కడ ప్రచారంలో ఉన్న జానపద కథ ప్రకారం ఆ పక్షులు నిత్యం గంగంలో స్నానం చేసి, మధ్యాహ్నం పక్షి తీర్థం వచ్చి తిండి తిని, సాయంత్రం రామేశ్వరంలో శివుణ్ని ఆరాధించి, రాత్రికి చిదంబరం వెళ్తాయట. ఏదైనా ఎత్తుకుపోవటంలో గద్ద, పీక్కుతినటంలో రాబందు పేరుమోశాయి.

అందరి ప్రేమను పొందేవి అందాల పావురాలు. ఓ అంధురాలైన నాయిక ‘ఒహెూ, ఒహెూ పావురమా, వయ్యారి పావురమా, మావారి అందాలు నీవైనా తెలుపుమా..’ అంటూ అడిగితే, మరో నాయిక ‘రామ చిలుకా! పెళ్లికొడుకెవరే? మాఘమాసం మంచిరోజు.. మనువాడే పెళ్లికొడుకెవరే’ అని చిలుకనడుగుతుంది. పావురాలు శాంతికపోతాలుగా పేరొందాయి. బుద్ధుడు బాల్యంలో దెబ్బతిన్న పావురాన్ని అందుకుని ప్రేమతో, దయతో సేవలుచేసి, కాపాడడం తెలిసిందే. పూర్వకాలంలో పావురాలు తపాలా సేవలుకూడా అందించేవి. రాజులకు వార్తాహరులుగా పనిచేసేవి. పావురం ప్రస్తావన వస్తే శిబి చక్రవర్తి తప్పక గుర్తువస్తాడు. దానగుణంలో పేరెన్నికగన్న శిబిచక్రవర్తి ఓ సారి పెద్ద యజ్ఞం చేస్తుండగా ఓ పావురం వచ్చి ఒళ్ల వాలి, తనను ఓ డేగ వెంటాడుతోందని భయపడుతూ చెప్పింది. అభయమిచ్చాడు శిబి. అంతలో దాన్ని తరుముతూ డేగ వచ్చి, పావురాన్ని వదలమని కోరింది. పావురం తన ఆహారమని, దాన్ని విడువకుంటే తాను ఆకలితో మరణిస్తానని అంటుంది. శిబి చక్రవర్తి పావురం తప్ప వేరే ఏ ఆహారం కావాలన్నా ఇస్తానంటాడు. డేగ, పావురమంత మాంసాన్ని శిబి శరీరంనుంచి ఇవ్వమని కోరుతుంది. శిబి చక్రవర్తి సరేనంటూ తన చేతినుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేస్తాడు. అలా ఎన్ని సార్లు వేసినా పావురం బరువుకు సరితూగదు. దాంతో శిబి చక్రవర్తి తానే వెళ్లి త్రాసుపళెంలో కూర్చుంటాడు. అప్పుడు డేగ, పావురం ఇంద్రుడు, అగ్నిగా నిజరూపాలు ధరించి శిబిని పరీక్షించడానికే వచ్చామని, అతడి దానగుణాన్ని కీర్తించి, ఆశీర్వదిస్తారు. అన్నట్లు మేనక, పసికందైన శకుంతలను్ వదిలి వెళ్తే కాకులే కాపాడాయట… కాకులకున్నపాటి కనికరం మనుషులకే లేకుండా పోతోంది. తల్లికి బిడ్డ ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటుందనడానికి ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అని సామెత చెపుతారు. ‘గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది’ సామెత ప్రతినిత్యం ఎక్కడో అక్కడ అనడం, వినడం పరిపాటే. ఇంతలో కండక్టర్ “లాస్ట్ స్టాప్’ అని అరవడంతో హడావిడిగా లేచాను. బస్సుదిగి ఇంటివైపు నడుస్తున్నానే కానీ మనసులో విహంగాలే విహరిస్తున్నాయి. ఓసారి అందం గురించిన టాపిక్ వస్తే మా మిత్రబృందం మనుషుల్లో ఆడ, పక్షుల్లో మగ అందమైనవని తీర్మానించారు. మగ పక్షులకే తల పై జూలు, కిరీటాలు ఉంటాయి. కోడిపుంజు అందంగా ఉంటుందంటే ఎవరైనా కాదనగలరా? నాట్యం చేసేది మగ నెమలే. పక్షుల ఈకలతోనే ఒకప్పుడు కలాలుగా ఉపయోగపడ్డాయి. పుస్తకాల్లో నెమలీకలు భద్రంగా దాచుకోని పిల్లలుంటారా? మన జాతీయ పక్షి నెమలి. రాష్ట్రీయ పక్షి పాలపిట్ట. పక్షులలో కూడా బాతుల వంటి నీటి పక్షులు వేరు. అయితే పక్షులలో చాలావరకు ఎగిరేవే. పక్షులే మనిషికి విమాన తయారీకి స్ఫూర్తినిచ్చాయి. మనుషుల్లాగానే వలసపోయే పక్షులు ఉన్నాయి. మన కొల్లేరు, పులికాట్, చిల్కా తదితర ప్రాంతాలకు వలస పక్షులు వచ్చి అలరించటం తెలిసిందే. చిన్నదే అయినా హమ్మింగ్ బర్డ్ ఎంత అందంగా ఉంటుందీ! ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఆస్ట్రిచ్. అతి చిన్న పక్షి క్యూబాకు చెందిన ‘బీ హమ్మింగ్ బర్డ్’. ఈ సృష్టిలో ఎన్ని రకాల పక్షులో.. ఎంత వైవిధ్యమో. పెలికాన్లు, పెంగ్విన్లు, ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్, స్పూన్ బిల్స్, పారాకీట్స్, హెరాన్స్.. ఇలా ఎన్నెన్నో.. ‘ఆర్నిథాలజీ’ (పక్షుల అధ్యయనశాస్త్రం) జంతుశాస్త్రంలో ఓ విభాగం. సలీం అలీ సాబ్ భారత్‌కు చెందిన సుప్రసిద్ధ ఆర్నిథాలజిస్టు. ‘బర్డ్‌మ్యాన్’ గా పేరొందారు. ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ రాశారు. సలీం అలీ తన ఆత్మకథకు సైతం ‘ది ఫాల్ ఆఫ్ స్పారో’ అని నామకరణం చేసి, తాను పక్షుల అధ్యయనం చేపట్టడానికి కారణమైన నేపథ్యం అందరికీ తెలిసేలా చేశారు. ప్రపంచం మొత్తంమీద పదివేల జాతుల పక్షులు ఉన్నాయట. గూడు కట్టడంలో వాటికున్ననైపుణ్యత ఎంత చెప్పినా తక్కువే. అందులో ఎంత వైవిధ్యం! అదేమిటో ఇంత గొప్పవైన పక్షులను ‘అక్కుపక్షి, శకున పక్షి’ అంటూ తిట్లలో ఉపయోగిస్తూ చిన్న బుచ్చుతున్నాం. ఇంటాబయటా సందడిచేసే పిచ్చుకలకు ఉండ తావే లేకుండా చేసి మాయమయ్యేలా చేశాం. పిల్లలకు పిచ్చుక అంటే పుస్తకాల్లో బొమ్మను చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. పక్షులను ఒకింత దయతో చూడటం పిల్లలకు సైతం నేర్పాలి. పక్షుల్ని పంజరాల్లో బంధించి, వాటి స్వేచ్ఛను హరించటం కూడదని, వాటిని సహజ సిద్ధమైన ప్రకృతిలోనే ఉండనివ్వాలని, వాటిని హింసించి వినోదించకూడదని ముందు పెద్దలు తెలుసుకోవాలి, ఆపై పిల్లలకు నేర్పాలి. అన్నిటికన్నా మరీ ముఖ్యమైంది విత్తన పరివ్యాప్తిలో పక్షుల పాత్ర. పక్షులు గింజలను వేర్వేరు ప్రాంతాలలో వెదజల్లడం వల్లే అసంఖ్యాక వృక్షజాతులు వర్ధిల్లి మానవుడి ఆహార, తదితర అవసరాలు తీరుతున్నాయి. అలాంటి పక్షులకు నాలుగు గింజలు, కాసిన్ని నీళ్లు అందించటానికి వెనకాడటమెందుకు? పక్షుల్ని చూసి మనిషి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. వాటికున్న స్నేహపాత్రత ఇంతా అంతా కాదు. ‘గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది.. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది… అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది, పొద్దున చిలకను చూడందే ముదుముద్దుగ ముచ్చటలాడందే, చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల’ అని కవి వాటి స్నేహాన్ని ఎంత మధురంగా వర్ణించాడు.

ఇక కాకులకుండే సమైక్యత మనుషులకు ఉంటే ప్రపంచం ఎంత బాగుపడుతుందీ! ఇల్లు దగ్గరవుతోంది.. సాయంత్రాన గూటికి చేరే పక్షిలాగే నేనూ నా గూడుచేరుతున్నా. దసరా పండుగ నాడు శుభకరమైన పాలపిట్ట సందర్శనం గురించి గుర్తుచేసుకుంటూ మా ఇంటి బెల్ నొక్కాను. ‘చిప్ చిప్ చిప్’ అనడం.. తలుపు తెరుచుకోవడం.. జరిగిపోయాయి. ఇంకేముంది, నా ఆలోచన “చుప్’ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here