మానస సంచరరే -9: మట్టి పరిమళించెనే.. మనసు పరవశించెనే!

4
11

[box type=’note’ fontsize=’16’] “భూమిని పదిలంగా కాపాడుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉండి మనిషి మనుగడ భద్రంగా ఉండేది” అంటున్నారు జె. శ్యామల “మానస సంచరరే -9: మట్టి పరిమళించెనే.. మనసు పరవశించెనే!” అనే కాలమ్‍లో. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు ప్రియనేస్తం వస్తానంది. తనతో ఎప్పటెప్పటి కబుర్లో కలబోసుకుని తీపి గురుతుల్లో తేలియాడాలనుకున్నాను. అందుకే ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాను. కానీ ఏం లాభం. ఆదిలోనే హంసపాదు. తమ ఇంటికి బంధువులెవరో వచ్చారని, మరోసారి కలుస్తానని నేస్తం ఓ మెసేజ్ పంపి నా ఉత్సాహాన్ని ఉఫ్ అని ఊదేసింది. సరే ఇల్లన్నా చక్కబెట్టుకుందాం అనుకుని రంగంలోకి దిగానే కానీ కొద్ది సేపటికి విసుగొచ్చేసింది. బాల్కనీలోకి నడిచాను. హఠాత్తుగా వాతావరణం మారిపోసాగింది. గాలి ఊపందుకుంది. మనసైన మట్టిపరిమళం.. మట్టికున్న ప్రత్యేకతల్లో ఇదొకటి. వానొచ్చేముందు పరిమళించటం.. దోస్త్ వస్తుందని ఇంట్లో ఉండబట్టి కానీ లేకుంటే ఇలా బాల్కనీలో తీరిగ్గా కూర్చుని మట్టి పరిమళాన్ని ఆస్వాదించగలిగేదాన్నా? అనుకుంటుండగానే టపటప చినుకులు.. కుర్చీని వెనక్కు జరుపుకుని అక్కడే బైఠాయించాను. అంతలోనే నాకెంతో ఇష్టమైన పాట…

“అమ్మా! అవనీ! నేల తల్లీ.. అని ఎన్నిసార్లు పిలిచినా

తనివి తీరదెందుకని

కని పెంచిన ఒడిలోనే కన్నుమూయనీ

మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ..

తల్లీ నిను తాకితేనే

తనువు పులకరిస్తుంది

నీ ఎదపై వాలితేనే

మేను పరవశిస్తుంది..

మాళవిక గళ మాధుర్యంతో నా మనసు ఉత్తేజితమయింది. అంతరంగకడలిలో ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగసి పడటం మొదలైంది. నిజమే.. అమ్మ ఎంతో అవనీ అంతే! అమ్మకు కూడా అవని అమ్మే కదా. ఒక్క మా అమ్మ ఏమిటి.. అందరమ్మలకు.. ఆ మాటకొస్తే భూమ్మీది సకల చరాచర ప్రాణికోటికి ఆధారమైంది నేల తల్లే కదా.

ఈ భూతల సౌందర్యాన్ని వీక్షించడానికి ఒక జీవితకాలం ఏం సరిపోతుంది? ప్రకృతిసిద్ధమైన సింగారాలు కొన్ని.. మానవ కల్పిత సింగారాలు మరికొన్ని.. వెరసి నిత్యనూతన సొగసులతో అలరారుతోంది భువి. గిరులు, ఝరులు, విరులు, తరులు, నదులు, సముద్రాలు, లోయలు, గుహలు, మనుషులు, జంతువులు, పక్షులు, పిట్టలు, కీటకాలు.. ప్రకృతి సిద్ధ సింగారం కాగా, మనిషి తన కష్టంతో, చెమటతో రూపుదిద్దిన సస్య కేదారాలు, హాయినిచ్చే హరిత వనాలు.. శిల్పకళా శోభిత దేవాలయాలు.. అనేకానేక కట్టడాలు.. నివాసాలు, అసంఖ్యాక చిత్రవిచిత్ర వస్తు సముదాయాలు.. మానవుడి నిత్యనూతన శోధనలు, ఆవిష్కరణలతో అవని అమేయమై, అనుపమానమై అలరారుతోంది. సకల సంపదల నిలయం ఈ ఇలాతలం. భూమి పైనా సంపదే.. భూగర్భంలోనూ సంపదే.. ఎంతెంత ఖనిజ సంపదను దాచి ఉంచిందో. ముఖ్యంగా మట్టినే నమ్ముకొని బతికే రైతన్నకు మట్టి దైవమే. అందుకే ఓ కవి

ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము

మట్టిని మించిన దైవం లేదు, మట్టే మేలురా.. ఈ మట్టే మేలురా అన్నారు.

నాటి నుంచి నేటి వరకు ఈ నేల కోసం జరిగిన పోరాటాలు, యుద్ధాలకు అంతే లేదు. నాడు పాండవులంతటి వాళ్లే అయిదు ఊళ్లయినా ఇమ్మని అడిగారు. చివరకు అది కూడా ఇవ్వకపోవడంతో మహాభారత యుద్ధానికే దారితీసింది. వామనావతారంలో, వామనుడు బలి చక్రవర్తిని మూడడుగుల నేల అడిగి బురిడీ కొట్టించి తొలి అడుగుతో ఆక్రమించింది భూమండలాన్నే. అంతేనా.. వరాహ పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు భూమిపై దాడిచేసి, ఏకంగా భూగోళాన్నంతటినీ ఎత్తుకెళ్లి సముద్రం అడుగున పాతాళంలో పడేశాడు. ఆ తర్వాత విష్ణువు వరాహావతారం ఎత్తి పాతాళంలోని భూగోళాన్ని ఎత్తిపట్టి బయటకు తెచ్చి యథాస్థానానికి చేర్చాడు. యుద్ధానికి తలపడ్డ హిరణ్యాక్షుడిని వరాహుడు సంహరించాడు.

భూదేవి కశ్యప ప్రజాపతి తనయ. అందుకే ‘కశ్యపి’ అయింది. వరాహమూర్తికి పత్ని. ద్వాపరయుగంలో భూదేవే సత్యభామ అయింది. త్రేతాయుగంలో సీతకు భూదేవే జనని. భూమి దున్నుతుంటేనే జనకుడికి ‘సీత’ దొరుకుతుంది. అలమేలు మంగ (పద్మావతి) కూడా ఆకాశరాజుకు భూమి దున్నుతుండగానే దొరికింది. భూగోళమంతా భూమే అయినా ఈ భూమి మొత్తం ఆరాధ్యనీయమే అయినా మనం పుట్టి, పెరిగే భూభాగమంటే ఇంకొంచెం ఎక్కువ మమకారం, భక్తి ఉండటం సహజం. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసి’ అన్నారు. ఇదే భావాన్ని మరో కవి ‘నాదు జన్మభూమి కన్న నాక మెక్క డున్నదీ’ అన్నాడు. జన్మభూమిని తలచుకుంటేనే భక్తితో ఒళ్లు పులకరించటం, భావోద్వేగానికి లోనుకావటం మామూలే. జన్మభూమి.. అందునా మన భరత భూమి విశిష్టత ఎంతటిది!

మెరే దేశ్ కి ధర్తీ

సోనా ఉగులే హీరే మోతి..

మెరె దేశ్ కి ధర్తీ..

‘ఉపకార్’లో మహేంద్రకపూర్ గీతం వింటుంటే అప్రయత్నంగానే గొంతు కలుపుతాం కదా.

జయ జయ జయ జన్మభూమీ…

జయజయోస్తు మాతృభూమి..

గంగాయమునల కృష్ణల కన్నతల్లి భారతి

కనకవర్షమొలికించే స్వర్గ సీమ భారతి

తల్లికి నీరాజనమిడ తరలిరండి రండీ..రండీ..రండి

ఆదిరుషుల జన్మభూమి ఇది పవిత్ర భూమి

ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం..

ఇది భారత జనావళి అసిధారా వ్రతము

ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము..

జయ జయ జయ జన్మభూమి..

బాల్యంలో రేడియోలో ఈ పాటను వింటూ పొందిన ఆనందం ఇంతా అంతా కాదు, అప్పుడేమిటి, ఇప్పుడు మాత్రం..

పుణ్యభూమి నాదేశం నమో నమామి

ధన్యభూమి నా దేశం సదా స్మరామి

నన్ను కన్న నా దేశం నమో నమామి

అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి

మహామహుల కన్నతల్లి నా దేశం

మహెజ్వల చరితకన్న భాగ్యోదయ దేశం.. నాదేశం

జాలాది గీతం మరువగలమా!

మాతృభూమి సేవలో తరిస్తున్న సిపాయిలకు మనసా, శిరసా ప్రణామాలు, అభినందనలు తెలియజేసుకోవాలి. సైనికుల మాతృమూర్తులకు, అర్థాంగులకు కూడా దేశం యావత్తూ రుణపడే ఉంటుంది. అది తీరే రుణం కానే కాదు. మన భూమి మనకే సొంతం.. మన భూమిపై మనదే అధికారం, మన భూమిని మనమే పాలించుకోవాలనే కదా స్వాతంత్ర్యం కోసం ఎందరో మహామహులు పోరాటంచేసి, మనకు స్వేచ్ఛా భారతాన్ని అందించింది.

భూవాసులకు భూమిపై ప్రేమ ఉండటంలో వింతలేదు, కానీ దేవలోకంవారికి కూడా భూలోకంపై ఆసక్తి అని ఎన్నో కథలు చెపుతాయి. జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్రం ఎంత హిట్ అయిందో.. మరెన్నో చిత్రాల్లో యముడు వగైరాలు భూలోకానికి వచ్చి, ఇక్కడి విశేషాలకు అబ్బురపడటం, తబ్బిబ్బుకావడం కథలతో కూడా ఎన్నో చిత్రాలు వచ్చాయి. అన్నట్లు యాగాశ్వాన్ని బంధించిన లవకుశలతో యుద్ధానికి దిగిన శ్రీరాముడు, చివరకు వారు తన చిరంజీవులేనని గుర్తెరిగి, సీతకు దగ్గరవ్వాలనుకుంటాడు. కానీ సీత రాముడిని, లవకుశలను కూడా వీడి భూదేవి నాశ్రయిస్తుంది. ఆ సందర్భంలో నేల విచ్చుకొని, భూదేవి పైకి వచ్చి, సీతను ఆదరంగా తీసుకెళ్లే దృశ్యం సినిమాల్లో గొప్పగా ఉంటుంది.

వాడుకలో భూములు ఎన్నో రకాలు. వ్యవసాయ భూములు, ఇతర భూములు. వ్యవసాయ భూముల్లో మళ్లీ పంట భూములు, బీడు భూములు ఉన్నాయి. మాగాణి, మెట్ట… ఏ నేలైనా ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉంది. వందల ఎకరాల వ్యవసాయ భూములున్నవారు ఒకప్పుడు భూస్వాములుగా చలామణి అయ్యారు. సామాన్యుల పై వారి జులుం ఎక్కువై పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు కొంతకాలానికి భూస్వామ్యవ్యవస్థ కనుమరుగైంది. ల్యాండ్ సీలింగ్ చట్టం రావడంతో పరిమితి దాటిన భూములన్నీ ప్రభుత్వ పరమయ్యాయి. అప్పుడు కూడా దుర్నీతితో భూమిని తమకే ఉంచుకున్నవారూ ఉన్నారు. అందుకోసం భార్యాభర్తలు విడాకులు తీసుకొని.. బతుకే నాటకంగా చేసుకున్న కేసులూ ఉన్నాయి. పూర్వకాలంలో రాజులు దేవాలయాలకు ఆస్తి కింద భూములిచ్చేవారు. అలాగే పండితులకు అగ్రహారాలిచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అడపాదడపా బంజరు భూముల్ని పేదలకు పంచుతున్నాయి. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ పేరిట భూములను డెవలప్ చేయటం, ప్లాట్లు అమ్మటం లేదా అపార్ట్‌మెంట్లు కట్టి అమ్మటం.. వగైరాలు గొప్ప బిజినెస్. భూమ్మీద పెట్టుబడి పెడితే లాభమే కానీ నష్టం ఉండదని రెండుచేతులా సంపాదించేవారు అదే పనిగా ప్లాట్లు కొంటుంటారు. ఈ నేపథ్యంలో భూకబ్దాలు చేసే భూబకాసురుల కథలు తరచు వినిపిస్తూనే ఉంటాయి. కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తూనే ఉండేభూ వివాదాల కేసులెన్నెన్నో. ఏ కట్టడం నిర్మాణం మొదలు పెట్టినా ముందుగా భూమి పూజచేయడం తెలిసిందే. ‘భూమ్మీద సుఖపడితే తప్పులేదురా… బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా… తప్పే లేదురా… తప్పే లేదురా..” అని నొక్కి వక్కాణించాడో సినీకవి. ఇతరులకు అన్యాయం చేస్తూ, నొప్పిస్తూ సుఖపడితే మాత్రం అది తప్పు మాత్రమే కాదు, తప్పున్నర కూడా. ఊహల్లో విహరిస్తూ వ్యవహరించే వారిని నేల విడిచి సాముచేస్తున్నారంటారు. ‘మేం డౌన్ టు ఎర్త్ మనుషుల’మంటూ చెపుతుంటారు చాలామంది తమ మేట్రిమోని ప్రొఫైల్స్‌లో. అన్నట్లు ఒకప్పుడు భూమి, బ్యాంకులాగా కూడా పనిచేసింది. ధనం, బంగారం వంటివి భూమిలోనే గొయ్యితీసి పాతి పెట్టి దాచుకునేవాళ్లు. తర్వాత ఎన్ని తరాలు గడిచాకో ఎవరికో ఆ స్థలంలో లంకెబిందెలు దొరికాయని చెప్పుకోవటాలు కద్దు. గతంలో ప్రాథమిక తరగతులలో తెలుగులో ‘పిసినారి’ అనే పాఠం ఉండేది. అందులో పిసినారి ముసలి లోభిగా బతుకుతూ తన వద్ద ఉన్న డబ్బంతా రహస్యంగా ఓచోట గొయ్యి తీసి దాయటం, అదంతా గమనించిన ఓ దొంగ ఆ డబ్బును తస్కరించడం, ఆ తర్వాత డబ్బంతా పోయిందని పిసినారి గొల్లుమనటం సారాంశం. ప్రస్తుతం మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, బ్యాంకుల్లో నగదు మొత్తాలపై ఆంక్షలు, నగదు బదిలీలు క్లిష్టతరం కావటం, తమ డబ్బు తాము తిరిగి తీసుకోవటానికి కూడా పరిమితులు.. వీటన్నిటితో కొంత మంది డబ్బును పాతంకాలంలో లాగా గొయ్యి తీసి దాచుకోవడమే బెటర్ అనుకుంటున్నారు కూడా. ఏదైనా ఘోరమైన వార్త విన్నప్పుడు ‘కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయింది’ అని చెపుతుంటారు. మనం ఏంచేసినా భరిస్తుంది కాబట్టి భూదేవికి సహనానికి ప్రతీకగా చెప్పుకుంటాం. నిజంగా భూమి కంపిస్తే.. అదీ తీవ్రంగా కనిపిస్తే అది మరుభూమిగానే మిగులుతుంది.

చాలా ఏళ్ల కిందట ఓ చిత్రమైన అనుభవం ఎదురైంది. ఆ రోజు చాప మీద పడుకునున్నాను. అంతలో నెమ్మదిగా ఊగే ఉయ్యాలలా నేల కదలిక. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామం చిత్రంగా ఉందే అనుకుంటూ లేచాను. భూకంపం అంటే ఇదేనా.. మెదడులో మెరుపు.. కాసేపటికి అది నిజమేనన్న వార్త. అది అతి స్వల్పకాలమే. కానీ లాతూర్, భుజ్ భూకంపాల వంటివి కలలో కూడా భయపెడతాయి. అహమ్మదాబాద్ వెళ్లినప్పుడు అక్కడి సైన్స్ సిటీలోని మ్యూజియంలో భూకంప సందర్శ నమూనాలే మనసును చెమరింపజేశాయి. ఇక వాస్తవంగా తట్టుకోగలమా!

సకల జీవులకు ఆవాసంగా నిలిచి, అందరికీ ఆహారాన్ని సైతం అందించే నేలను మనిషి స్వార్థంతో కాలుష్యానికి గురిచేస్తున్నాడు. భూమి జీర్ణించుకోలేనటువంటి వ్యర్థాలను భూమిపై పడేసి సహనానికే మారు పేరుగా చెప్పుకునే భూదేవి సహనాన్నే పరీక్షిస్తున్నాడు. జనాభా పెరుగుతోంది కానీ భూమి పెరగదు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తున్నాడు. ఉన్న భూమిని పరిరక్షించుకోకుండా విష రసాయనిక ఎరువు వాడకంతో నేలకు చేటు తెస్తున్నాడు. తద్వారా మనిషి తనకు తానే చేటు కొనితెచ్చుకుంటున్నాడు. మనిషికి తాను జీవించే భూగ్రహం గురించిన అవగాహన చాలా అవసరం. అందుకే జాగ్రఫీ, జియాలజీలున్నది. మహి, ఇల, భువి, ధాత్రి, ధరిత్రి, ధరణి, ధర, పుడమి.. వగైరా… వగైరా పర్యాయపదాలెన్నో భూమికి ఉన్నాయి. ఒకప్పుడు భూమండలంపైని కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి కొలంబస్ వంటివారు సాహసయాత్రలు చేసి, సఫలీకృతులయ్యారు. వైజ్ఞానిక శాస్త్రం, సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన నేటికాలంలో ఇతర గ్రహాలపై చూపు సారించటం అధికమైంది.

ఏమైనా భూమిని పదిలంగా కాపాడుకుంటేనే పర్యావరణం పదిలంగా ఉండి మనిషి మనుగడ భద్రంగా ఉండేది. ఆ చైతన్యాన్ని పెంపొందించేందుకే ఏటా ఏప్రిల్ ఇరవై రెండున ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకుంటున్నాం.

మట్టిలేనిదే మనిషి ఎక్కడ?

పుట్టినప్పుడు మట్టి పైన

మరణించినప్పుడు మట్టిలోపల..

తరచి చూస్తే అంతేగా.

విశ్వంలో జీవావరణానికి అనుకూలమైన వాతావరణం ఒక్క భూగోళానికే పరిమితమైంది. అందుకే మన కోసం భూమి .. భూమి కోసం మనం అన్నరీతిలో మెలగాలి. మన భరత భూమిని భక్తిగా, భద్రంగా కాపాడుకోవాలి.

నా జన్మభూమి ఎంతో అందమైన దేశము

నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము

నా సామిరంగా.. హాయ్ హాయ్.. నా సామిరంగా…

బతకాలందరూ దేశంకోసమే..

ఎంతోనిజం…

దేశమంటేనే మట్టి కాదోయ్.. మనుషులోయ్..

ఇక్కడ మాత్రం మట్టిని, మనిషిని వేరుచేసి చూడకుండా మట్టి పట్ల, మనిషి పట్ల కూడా బాధ్యతగా, ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనిషి మనుగడకు పుడమి తల్లే ఆధారం కనుక.

మనల్ని అన్ని విధాలా భరిస్తోన్న భూమిని మన పాదతాడనాలతో ఎంత నొప్పిస్తున్నామో. అందుకే పెద్దలు.. “సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే!” అని అవనికి వినమ్రపూర్వక ప్రార్థన చేయాలన్నారు.

భూమి చుట్టూ నా ఆలోచనలు పరిభ్రమించటంలో వాన ఎప్పుడు వెలిసిందో కూడా తెలియలేదు. పిడుగు శబ్దంతో ఉలిక్కిపడ్డాను. తడితడిగా కొత్త అందాలు సంతరించుకున్న నేల వంక చూస్తూ ‘జయ హే భూమి! జయజయజయ హే జన్మభూమి!!’ అనుకుంటుండగానే కొరియర్ అతను రావడంతో నా ఆలోచనల భూప్రదక్షిణ ఆగక తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here