[dropcap]“నీ[/dropcap]కు అంతే అర్థమైందా.. ఇంకా లోతుగా ఆలోచించలేవా బావా? అవమానం నాకు మాత్రమేనా. అతనికి అవమానం లేదా?” అంది నీల.
నీల మాటలు వింటూ తన వైపు చూసాను నేను. తను మాట్లాడుతూ కదలిపోతూ ఉంది. నాతో ఇంకా చెప్తోంది
“నేను విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మదన్ నా సహాధ్యాయి. ఇంకా మంచి స్నేహితుడు. ఎందుకో తెలియదు కానీ అతను అంటే ఒక లాంటి ఆకర్షణ ఏర్పడింది. నా మనస్సు ఎంత వద్దన్నా అతని వైపు లాగేసింది. అతను ఎటు వైపు పోతే అటు వైపు పోయేది. మేము స్నేహితులుగా మా భావాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ సాన్నిహిత్యంగా ఉన్నంతలో మా మధ్య ఒక రకమైన భావోద్వేగ సంబంధం ఏర్పడింది. ఇద్దరం ఒకరితో ఒకరు చమత్కారంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.
ఆ రోజుల్లోనే ఒక రోజు నా స్నేహితురాలు భావన ‘మదన్‍కి పెళ్లి కుదిరింది. అతను కూడా ఒప్పుకున్నాడు’ అని చెప్పింది. వెంటనే ఆ రోజు నేను మదన్‌ని అడిగాను ‘పెళ్లికి ఒప్పుకున్నావా’ అని. మదన్ ‘హా ఒప్పుకున్నాను. నా చిన్నప్పుడే నాకు నా మరదలితో పెళ్లి కుదిరింది’ అని చెప్పాడు. పెళ్లి చేసుకోవాలా అని నేను అడిగితే చేసుకోవాలి అని చెప్పాడు.
అంతలో మా మధ్య బంధం పెరిగేది గమనించి నేను అతనితో ఇక మాట్లాడకూడదు అనుకొని ‘నీతో ఇక మాట్లాడను’ అని చెప్పాను. మా మధ్య మాటలు ఆగిపోవడంతో అతను ప్రతి క్షణం నన్ను నిశ్శబ్దంగా గమనించడం మొదలు పెట్టాడు.
మేము స్నేహితులందరం కలిసి క్షేత్ర పర్యటనకు బెంగళూరు వెళ్ళాము. అతని చేతి నుండి నేను తప్పించుకుంటున్నానని తలచి నేను ఏదో పనిలో ఏమరుపాటుగా ఉన్నప్పుడు నా అంగీకారం లేకుండా అతను నా అరచేతిని గట్టిగా పట్టుకున్నాడు. నేను ఆ క్షణం చాలా ఆందోళన పడ్డాను. నేను ఎవరికి చెప్పుకోలేక పోయాను అవమానంతో.” అంటూ కొద్దిసేపు ఆపింది నీల.
నీల నా వైపు చూసినప్పుడు తన కంట్లో అప్పటి భయం కనిపిస్తుండగా అన్నది “తరువాత మరుసటి దినం మేమందరము మైసూర్ ప్రయాణం అయ్యి వెళ్ళాము. అందరం బృందావనంలో తిరుగుతుండగా నేను ఒంటరిగా ఉండటం చూసి మదన్ వచ్చి నా చేతిని మరొక సారి గట్టిగా పట్టుకున్నాడు. మదన్ నా చేతిని పట్టుకున్న మరుక్షణం నేను నాలో తెలియని భయంతో కదలిక లేక బొమ్మలా కనురెప్పల తాకిడి కూడా లేకుండా అలా శిల్పంలా నిలుచుండి పోవడం చూసి మదన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అతను దుందుడుకు చర్యతో నా శరీరం మీద దాడి చేసాడు” అని బాధతో చెప్తూ నా వైపు నిస్సారమైన కళ్ళతో చూసింది.
నేను అనుకున్నాను ‘అవును కదా స్త్రీ శరీరానికి పురుష శరీరానికి చాలా తేడా ఉంటుంది. స్త్రీ శరీరం లోని స్పర్శ నాడులు యాంత్రిక ప్రక్రియతో ప్రేరణ చెందుతాయి’ అని.
నిజమే.. ఎంత ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా అలా ఎదుటివారి అనుమతి లేకుండా మనల్ని బలాన్ని ఉపయోగించి ముట్టుకోవడం లైంగిక చర్య క్రిందకు వస్తుంది. మనము ఒకరిని తాకాలి అంటే వారి అనుమతి తోనే వారిని ముట్టుకోవాలి. హానికరమైన స్పర్శను మన బుద్ధి గ్రహిస్తుంది. వెంటనే మన శరీరాన్ని మన బుద్ధి గడ్డ కట్టిస్తుంది లేక పోరాటానికి సిద్ధం చేస్తుంది. ఇంతేకాకుండా పారిపోవడం కూడా సహజమైన శారీరక ప్రతిచర్య. ఈ శారీరక ప్రతిచర్యలు మన నియంత్రణలో ఉండవు. అంతేకాకుండా ఈ శారీరక చర్యలకు కారణం ఏదైనా ఉత్తేజకరమైన, ఆందోళన, భయం కలిగించే అనుకోని సంఘటన జరిగినప్పుడు హడావిడిగా స్రవించిన అడ్రినలిన్ హార్మోన్ యొక్క స్పందన.
నేనిలా ఆలోచనలలో ఉన్నంతలోనే నీల అన్నది “నాకు అతని మీద ప్రేమ ఉన్నా, మనస్సులో ఏదో అవమానం, భయం, దుఃఖం. అతనికి చాలా మంచివాడని అందరిలో పేరు. నేను ఎందుకు చావాలి. తాను తప్పు చేసి దాక్కున్నాడు. అతనే నా చెయ్యి పట్టుకున్నదని బయటపడి చెప్పాలి అని నేను నా మనస్సు లోనే శపథం చేసుకున్నాను. కలుగులో నుండి తనను బయటకు తేవాలి. మరణించడం కన్నా పోరాడదామని నిర్ణయించుకున్నాను.”
నీల ఆ మాట అనగానే నేను తన వైపు మాట రానట్టు చూసాను. నిజమే కదా ఒక ఆడపిల్లని బాధపెట్టి ఆమె అవమానం చెందితే అతను కూడా అవమానం పొందాలి కదా.
“మదన్ మంచి వాడే కానీ తప్పు చేశాడు.. నా చెయ్యి పట్టుకుని చాలా తప్పు చేశాడు. నా అరచేతిని బలవంతంగా పట్టుకున్నప్పుడు నాలో తెలియని భయం ఏర్పడింది. తరువాత నా గుండె మండిపోయింది. ఆ రోజుల్లో ప్రతి క్షణం నాలో అతని ఆలోచనే. చాలా రోజులు నిద్రలేదు. చాలా బాధ కలిగింది. అతను నా చెయ్యి పట్టుకున్నప్పుడు భయంతో నా ఆత్మ, నా శరీరం రెండు వేరు అయ్యాయి. నా శరీరం పూర్తిగా ఆ క్షణంలో గడ్డ కట్టింది. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఫ్రీజ్ అయ్యాను. నాలో తర్వాత భావోద్వేగాలు పెరిగాయి. కోరికలు పెరిగాయి. నన్ను అతను ఉత్తేజితం చేశాడు. అతను నా అనుమతి లేకుండా నా చెయ్యి స్పర్శించడం వలన నాలో శృంగార భావనలు తలెత్తాయి.
తరువాత జీవితం శూన్యంగా అనిపించింది. నేను చాలా భయపడిపోయాను. నాకు చాలా బాధ కలిగింది. నేను బాధ పడటం చూసి అతను నా దగ్గరగా వచ్చి నన్ను మాట్లాడించాలని చూసాడు. కానీ అప్పుడు కూడా భీభత్సమైన భయంతో నేను అతనికి చాలా దూరం జరిగాను. అతను చాలా అపరాధం చేసినట్లు నాకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అతను నా చెయ్యి అలా పట్టుకోవడంతోనే మా మధ్య ఏదో తెలియని బంధం ఏర్పడింది. కొద్ది రోజుల లోనే నాకు అర్థం అయ్యింది, నేను పూర్తిగా అతని ప్రేమలో పడిపోయానని. నేను అతనికి నా మనస్సు లోని ప్రేమ భావన తెలిపాను. కానీ అతను ముందడుగు వేయలేదు. నేను ఆలోచించాను ‘పెళ్లి అన్నది బాధ్యత. నా బాధను చూపి బలవంతంగా అతనిని పెళ్ళికి ఒప్పిస్తే ఆ పెళ్లి నిలబడుతుందా’.
తరువాత సుమారుగా నాలుగు సంవత్సరాలు నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరించాను. ఎందుకంటే అతను నన్ను ముట్టుకున్నది నాకు అనుక్షణం గుర్తుకు వచ్చింది. వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది. నన్ను పట్టుకున్న వాడిని ఎలా వదిలేది అనిపించింది. నేను మా విశ్వవిద్యాలయం లోనే బోధకురాలిగా చేరాక అతను ఒకసారి వచ్చి నన్ను కలిసినప్పుడు కూడా అతనిలో చాలా పశ్చాత్తాపం కనిపించింది” అంది నీల.
నేను నీల వైపు చూసి అన్నాను “అతనికి శిక్ష వేయాలని అనుకున్నావా లేక నిన్ను నువ్వు శిక్షించుకున్నావా?”
నీల నా వైపు చూసి కండ్లల్లో నీరు ఉబుకుతుండగా కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది.. “శిక్ష అతనికి కాదు.. నాకు వేసుకున్నాను. నాకు నాపైన జరిగిన శారీరక దాడి మానని గాయం అయ్యింది. ఇప్పటికి కూడా నేను ప్రతి వ్యక్తిని అనుమాన దృక్పథంతో చూస్తుంటాను. అతి జాగ్రత్తతో అడుగు తీసి అడుగు వేస్తుంటాను” అని చెప్పింది.
మళ్ళీ తనే మాట్లాడుతూ.. “ఒక రోజు మా స్నేహితుడు గోపాల్ నన్ను విశ్వవిద్యాలయంలో కలిసి టీ కి వెళదాము రమ్మని పిలిచాడు. అప్పుడు చెప్పాడు ‘మదన్ కి ప్రాబ్లమ్స్ నీల’ అని. నేను అడిగాను.. ఏమి ప్రాబ్లమ్స్ అని. ‘ఫ్యామిలీ ఉంది.. కొడుకు పుట్టాడు’ అని చెప్పాడు.
అప్పుడు ఆలోచించాను.. ‘మదన్ నా స్నేహితుడు. నేను అతను బాగుండాలి అని ఆలోచించాలి కానీ నన్ను నేను నాశనం చేసుకుంటూ అతని జీవితాన్ని నాశనం చేయకూడదు’ అనిపించింది.
మదన్‌కి ఫోన్ చేసి చెప్పాను… ‘మనం మంచి స్నేహితులం. నేను నిన్ను ప్రేమించింది నిజం. నీకు పెళ్లి కుదిరింది అని నాకు తెలియకముందే నేను నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు నా చెయ్యి పట్టుకోవడం వలన మన మధ్య ఒక బంధం ఏర్పడింది నా మనస్సులో. అందుకే నేను నిన్ను ప్రేమించాను అని చెప్పాను. లేకపోతే ఎప్పటికీ చెప్పి ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నా దృష్టిలో ప్రేమ అన్నది సార్వత్రిక భావన. మనం ఒకరిని ఒకరు క్షమించుకుని ముందుకు వెళదాము’ అన్నాను. నేను అతనిని చిన్న పిల్లాడు అని తలచి, బాల్య చేష్టలుగా భావించి తనని క్షమించేశాను.” అంది నీల.
నేను నీలవేణిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ తన వైపు చూసాను మెరుస్తున్న కళ్లతో..
(ఆడపిల్లలకు లైంగిక దాడి ఒక శిక్ష.. మానసికంగా మరియు శారీరకంగా)