మనసు మాట వినదు

0
9

(అల్జిమర్స్ బారిన పడిన వారిలో, జ్ఞాపకశక్తి కోల్పోయిన వారిలో ఔషధాల ద్వారా; సంగీతం ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించగల అవకాశాల గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి.)

[dropcap]ప్ర[/dropcap]పంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు డిప్రెషన్, మతిమరపు, అల్జిమర్స్ వంటి ‘ఆలోచన’కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. 20 సంవత్సరాల నుండి మందుల కంపెనీలు కోట్ల డాలర్ల ఖర్చుతో పరిశోధనలు చేసి, 320కై పైగా మందులను తయారు చేశాయి.. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

చైనాలోణి షాంఘై ‘మెటిరియా మెడికా’ సంస్థ, గ్రీన్‍వాలీ అండ్ ఓషన్ యూనివర్సిటీలు సంయుక్తంగా పరిశోధనలు జరిపి విడుదల చేసిన జి.వి.971 క్లినికల్ ట్రయల్స్‌లో కూడా గీటుకు వచ్చి నిలబడింది. 22  సంవత్సరాల కృషి ఫలితంగా తయారైన ఈ ఔషధం 2019లో మార్కెట్‍లోకి ప్రవేశించింది. అల్జిమర్స్ ఒక మోస్తరు తీవ్రత ఉన్న దశలోనూ ఈ ఔషధం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. ఈ ఔషధం తయారీకి కావలసిన ముడిసరుకును గోధుమరంగు ఆల్గే నుండి సేకరించారు.

చైనా జాతీయ ఔషధ ఉత్పత్తి సంస్థ విడుదల చేసిన ఈ జి.వి.971 ఖరీదు ఒక రోగికి సాలీనా డోసు 40,000 యువాన్‍లు, డాలర్లలో అయితే 5,700 డాలర్లు. సాధారణ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండటానికై రీయింబర్స్‌మెంట్ అవకాశం కల్పించడానికి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‍లో ఈ ఔషధాన్ని చేర్చాలని ‘గ్రీన్‌వాలీ’ అభిప్రాయపడింది.

నాణ్యమైన వైద్యసేవలకు పేరుపొందిన అమెరికాలోనే 5 మిలియన్ల ప్రజలు అల్జిమర్స్ బాధితులు. ఆ సంఖ్య 2050 నాటికి 14 మిలియన్లకు చేరుతుందని అంచనా! ఇటువంటి విపత్కర పరిస్థితులలో చైనా ఔషధం సమర్థవంతంగా పనిచేస్తే అంతకటే కావలసినది ఏముంటుంది?

జన్యువులలో నిక్షిప్తమైన ఉన్న సమాచారం మొదట RNA  గా, తరువాత ప్రొటీన్‍గా మారుతుంది. అదే ‘జీన్ ఎక్స్‌ప్రెషన్’గా వ్యవహరించబడుతోంది. అల్జిమర్స్‌తో మరణించిన వ్యక్తి పోస్ట్ మార్టమ్ శాంపిల్ నుండి సేకరించబడిన ‘Gene expression data’ విశ్లేషణల ప్రకారం ఈ HDAC2 – SP3 ల నడుమ గట్టి లింక్ ఉన్నట్లు తేలింది. ఈ HDAC2 అనేది జ్ఞాపకశక్తికి సంబంధించిన విధులను నిర్వర్తించే పలు జన్యువులను నియంత్రిస్తూ ఉంటుంది. అల్జిమర్స్‌లో ఈ HDAC2 స్థాయిలు పెరిగి పోయిన కారణగా జ్ఞాపకశక్తికి సంబంధించిన జన్యువుల వ్యక్తీకరణనను నిరోధించే దిశగా HDAC2 పని చేయడం మొదలు పెడుతుంది. అంటే జన్యువుల పనితీరును క్రమబద్ధీకరించడం అన్న విధులను ప్రక్కనబెట్టి వ్యతిరేకదిశలో పనిచేయడం మొదలుపెడుతుంది.

ముఖ్యంగా అభ్యాసానికి సంబంధించిన మన మెదడు లోని ‘హిప్పోకాంపస్’ జ్ఞానార్జన/నిక్షిప్తం మొదలైన అంశాలకు సంబంధించిన విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పలు మార్పులను గురి అవుతూ ఉంటుంది. మన భావోద్వేగాలన్నిటినీ క్రమబద్ధీకరిస్తూ ఉండే ‘సెంట్రల్ పలేడియం’ అనబడే నాడీవలయం పనితీరు దెబ్బతింటే జ్ఞాపకశక్తికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ నాడీ కేంద్రంలోని ల్యూకోట్రెయిన్స్ కణాలు అస్తవ్యస్తమైతే మతిమరుపు వస్తుంది. అల్జిమర్స్‌లో ఈ కణాలకు కీలకమైన పాత్ర ఉంది.

మనిషి మెదడులో 86-100 వరకు బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఇంచుమించు అదే స్థాయిలో గ్లయల్ కణాలు ఉంటాయి. ఇవి కూడా కేంద్ర నాడీ మండలం, చుట్టు ప్రక్కల వ్యాపించి ఉంటాయి. మెదడు పనిచేయటంలో వీటి పాత్ర చాలా కీలకమైనది. ఇవి ప్రారంభ దశలో మెదడు ఎదుగుదలకు సహకరిస్తాయి. మెదడులో న్యూరోప్లాస్టిసిటీ, వ్యాధి నిరోధక శక్తి వంటివి దెబ్బతినకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ కాపాడుతూ ఉంటాయి. ఈ గ్లయల్ కణాలలో పెద్దవి – మైక్రోగ్లియా – న్యూరాన్లను చుట్టుముట్టి రక్షిస్తూ ఉండటమే కాక అవి వృద్ధి చెందడానికి మరొక చోటికి పోవడానికి సహకరిస్తూ ఉంటాయి.

మైక్రోగ్లియా మెదడులో చెడిపోయిన కణాలను తొలగించడం, బయటనుంచి ప్రవేశించే హానికారకాలను నాశనం చేయడం చేస్తూ ఉంటాయి. ఇవి చాలా చురుకుగా నిరంతరం కదులుతూ మెదడు పనితీరును పర్యవేక్షిస్తూ సినాప్టిక్ కార్యకలాపాల నియంత్రణ/క్రమబద్ధీకరణ వంటి విధులను నిర్వహిస్తూ ఉంటాయి. న్యూరాన్లకు భౌతికపరమైన, శక్తిపరమైన అంతరాయాలు కలగకుండా చూసుకుంటూ ఉండడమే కాక, మెదడులో విడుదలవుతూ ఉండే వ్యర్థాలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ మెదడుకు ఉండే రక్త సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూస్తాయి.

అల్జిమర్స్ – జ్ఞాపకశక్తికి సంబంధించిన కీలకమైన జన్యువులను క్రమబద్ధమైన రీతిలో చైతన్యవంతం చేస్తూ ఉండే ఈ రెండు రకాల సూక్ష్మ కణాలను అమిలాయిడ్ ప్రొటీన్ నిల్వలు, నాడులలోని పోగులు కమ్మివేసి/పీల్చుకుని నిద్రాణస్థితి లోనికి నెట్టివేస్తాయి. ఆ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే నాడీ వ్యవస్థలో ఆ ప్రొటీన్ నిల్వలు పేరుకుపోతాయి. అవే అమిలాయిడ్ ఫ్లేక్స్. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థ దెబ్బ తినడంతో మెదడుకు ఆక్సీజన్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఫలితంగా నాడీ కేంద్రాలు కుంచించుకుపోవటం జరుగుతుంది. క్రమంగా మెదడు సైతం తన పరిమాణాన్ని కోల్పోతూ వస్తుంది.

నివారణ దిశగా శక్తివంచన లేకుండా:

హార్వార్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ రూడాల్ఫ్ బృందం ‘అల్జిమర్స్’కు సంబంధించి ప్రయోగాల కోసం ఆ వ్యాధికి గురైన 25 ఎలుకలని నమూనా తీసుకొని ప్రయోగాలు నిర్వహించింది. ఆ అధ్యయనాల ప్రకారం మెదడులో న్యూరోప్రొజెనిటర్ కణాలు ఉంటాయి. ఇవి క్రొత్త న్యూరాన్లను తయారు చేస్తూ ఉంటాయి. జ్ఞాపకశక్తి తగ్గుదల కేసులలో ఈ AHN ప్రక్రియ బలహీనంగా ఉంటున్నట్లు తెలిసింది.

వ్యాయామం వలన శరీరానికి మెదడుకు మేలు జరుగుతుందన్న వాదనలలోని హేతుబద్ధతను తేల్చుకోవడానికి ఆ బృందం ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించింది. అల్జిమర్స్ గ్రస్తమైన ఎలుకను కదలే చక్రంపై రోజుకు మూడు గంటల పాటు ఉంచడం మొదలుపెట్టారు. అలా అనేక రోజులు చేశాకా, చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చాయి.

ఎలుక మెదడులోని అమిలాయిడ్ ప్రొటీన్ ఫ్లేక్స్ కొంతవరకు తగ్గాయి. AHN స్థాయి పెరగడమే కాకుండా క్రొత్త నాడీకణాలు తయారు కావడం జరిగింది. BDNF (Brain Derived Neurotrophic Factor) మాలిక్యూల్ స్థాయి పెరగడమూ జరిగింది. ఎలుకలో జ్ఞాపకశక్తి సైతం కొంత మేరకు మెరుగుపడింది. వ్యాయామం నాడీవ్యవస్థను సైతం ఉత్తేజితం చేస్తుందన్న వాదనలో నిజం ఉందని తేలింది.

సాధారణ ఆరోగ్యంతో ఉన్న ఎలుకలలో క్రొత్త నాడులను రూపొందించి దీర్ఘకాలిక జ్ఞాపకాన్ని ప్రోత్సహించడంలో ఒక చిన్న మాలిక్యూల్ సమర్థవంతంగా పనిచేయటాన్ని గురించి (ప్రయోగాత్మకంగా) న్యూరోసైన్సెస్‌కు చెందిన జర్నల్‍లో 2013లో ప్రొ. కుండు బృందం ప్రచురించింది.

ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలలో CBP/P300 అనబడే చిన్న మాలిక్యూల్‌ని ఉపయోగించి శాస్త్రజ్ఞులు సంబంధిత ఎంజైములను ప్రేరేపించడం ద్వారా ఎలుకలలో పాత జ్ఞాపకాలను పునరుద్ధరించగలిగారు. అల్జిమర్స్‌లో రిప్రెషన్‍లో ఉన్న 81 జన్యువులు సాధారణ స్థితికి రావడంతో తుడిచిపెట్టుకుపోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి.

అల్జిమర్స్‌లో HDAC2 స్థాయిలు పెరిగిపోయి జ్ఞాపకానికి సంబంధించి జన్యువుల వ్యక్తీకరణకు అవరోధం ఏర్పడుతుంది. ఒక్కసారి చైతన్యరహితమైపోయిన ఆ జన్యువులను చైతన్యవంతం చేయగలిగితే క్షీణించిన నాడీకేంద్రాల పనితీరు యథాస్థితికి వస్తుంది.

స్ప్లీన్ టైరోసిన్ కినాస్ (SYK) జ్ఞాపకశక్తికి సంబంధించిన కీలకమైన పలు జీన్స్‌ను చైతన్యవంతం చేయడంలో ముఖ్యపాత్ర వహించే ఆ రెండు ఎంజైమ్స్‌ని చైతన్యవంతం చేయగలిగింది. అమిలాయిడ్ ప్రొటీన్ నిల్వలు, నాడుల లోని టాంగిల్స్‌చే క్రమ్మివేయబడిన కారణంగా నిద్రాణ స్థితిలోనికి నెట్టివేయబడిన మైక్రోగ్లయా, ఆస్ట్రోసైట్స్ చైతన్యవంతం కావడంతో మెదడులో విడుదలయ్యే వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థ పునరుద్ధరింపబడుతుంది. ఈ రెండు సూక్ష్మ కణాలు వాటి పని అవి చేయడం ప్రారంభించడంతో మెదడు పనితీరు సాఫీగా సాగిపోతుంది.

వయసు పైబడిన కొద్దీ మెదడు దృఢంగా మారిపోతుంది. కాబట్టి మరమ్మత్తు అసాధ్యం అన్న వాదనలు ఉండేవి. ఆ వాదనలలో పస లేదని ఏ స్థాయి లోనైనా మెదడు కణాలను సరిచేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

జర్మనీలో మాన్‌స్టర్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రజ్ఞులు తీవ్రమైన క్రుంగుబాటులో ఉన్న వారిలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ఫలితంగా 6 వారాలలో వారిలో న్యూరో ట్రాన్స్‌మిషన్ మెరుగుపడింది.

అల్జిమర్స్ – సంగీతం:

జ్ఞాపకశక్తికి సంబంధిచిన పలు సమస్యలలో సంగీతం శక్తిమంతమైన చికిత్సా విధానంగా పని చేస్తున్నట్లు అనేక పరిశోధనలలో ఋజువైంది. మనిషి మెదడు సంగీతానికి, రిథమ్‌కు స్పందిస్తుందని, అది అత్యంత స్వాభావికమైన చర్యగా మనిషి కదలికలు, డాన్స్, ఊగడం వంటి వాటి ద్వారా బయటపడుతుందని ప్రొ. నందినీ ఛటర్జీ బృందం (NCBR, మనేసర్, హర్యానా) చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

నాడీ కణాల క్షీణత, నాడీ సంబంధిత సమస్యల కారణంగా జ్ఞాపకశక్తికి సంబంధిచిన సమస్యలతో బాధపడుతున్నవారిలో సైతం పాత జ్ఞాపకాలు పదిలంగానే ఉంటుననట్లు తేలింది. పాత/క్రొత్త సంగీతాలను వారికి వినిపించినప్పుడు పాత సంగీతం వారి మెదడులోని పలు కేంద్రాలను ఉత్తేజితం చేసింది. చాలా తక్కువ జ్ఞాపకశక్తితో ఉన్న 17 మస్తిష్క భాగాలు పాత సంగీతానికి చక్కగా ప్రతిస్పందిస్తున్నట్లు FMRI స్కాన్‌లు వెల్లడించాయి.

మెడడును నిరంతరం చురుకుగా ఏదో ఒక పనిలోనో, అభిరుచి లోనో నిమగ్నం చేయడం ద్వారా అల్జిమర్స్‌ను కొంతకాలం ముదిరిపోకుండా ఆపగల అవకాశం ఉందనీ బెంగుళూరుకు చెందిన శాస్త్రవేత్త డా. విజయలక్ష్మి తన అధ్యయనాలతో సాధికారికంగా నిరూపించారు.

మార్థా గోంజెల్స్ గత శతాబ్దపు ప్రసిద్ధ బాలే నృత్య కళాకారిణి. స్పెయిన్‍కు చెందిన ఈ డాన్సర్ అల్జిమర్స్‌కు గురైంది. 1967లో ఈమె న్యూయార్క్‌లో ఇచ్చిన ప్రదర్శన ‘స్వాన్‍లేక్’ చాలా ప్రసిద్ధి. ఆమె చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ‘Asociación Música’ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా ‘స్వాన్‍లేక్’ డాన్స్ సంగీతాన్ని/రికార్డును వినిపించినప్పుడు అప్పటివరకు ప్రతిస్పందించని ఆమె కొద్ది సెకన్లలోనే ప్రతిస్పందించటం మొదలుపెట్టి తన వీల్ చైర్ నుండే ఆ డాన్స్ తాలూకు అభినయాన్ని ఏ మాత్రం పొల్లుపోకుండా చివరిదాకా చేసింది. అంటే అంతటి వ్యాధి తీవ్రత లోనూ ఆమె పాత జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయన్న మాట. ఆమె మరణం తరువాత ఆ  మ్యూజిక్ కంపెనీ ఆ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసింది. మార్థా ఉదంతం శాస్త్రజ్ఞులకు, వారి పరిశోధనలకు మరింత ప్రోత్సాహకరం కాగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here