మనసులోని మనసా-10

2
10

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]నా[/dropcap]కీ మధ్య ఒక పెళ్ళి పిలుపు వచ్చింది.

అది నా స్నేహితురాలి కూతురిదే. ఈ మధ్యకాలంలో మేము కలిసి చాలా సంవత్సరాలయ్యింది.

ఆ కార్డులో కేవలం వివాహం గురించి వివరాలేమి లేవు. కొత్తగా పెళ్ళయిన ఆ జంటని దీవించడానికి ఫలానా హోటల్లో యిస్తున్న విందుకు హాజరు కమ్మని, బహుమతులేమి తేవద్దని మాత్రమే వుంది.

ఒక వేళ వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే వీళ్ళు రిసెప్షన్ ఎరేంజ్ చేసారేమో అనుకున్నాను.

బహుమతులు వొద్దని నొక్కి వక్కాణించారు కాబట్టి అందమైన ఫ్లవర్‌బొకె ఒకటి తీసుకుని వెళ్ళాను.

హాల్ తగుమోతాదులో అందంగా పూలతో అలంకరించారు. చాలా మంద్రస్థాయిలో సన్నాయి వాయిద్యం వినిపిస్తోంది. నా స్నేహితురాలు, ఆమె భర్త ఆప్యాయంగా వచ్చి ఆహ్వానించారు. వెంటనే వారి వియ్యంకుణ్ణి వియ్యపురాలిని పరిచయం చేసారు. ఇద్దరూ డాక్టర్లట. చాలా సింపుల్ బిహేవియర్, చక్కటి చిరునవ్వులతో వారు కూడ నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఒక వందా నూట యాభయి మంది పట్టే ఆ హాలు చిన్నగా నిండుతున్నాది. నేను వెళ్ళి వధూవరుల్ని ఆశీర్వదించి పుష్పగుచ్ఛం యిచ్చేను. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాల అందంగా అనిపించారు నా కంటికి. కారణం యిద్దరూ చాలా సింపుల్‌గా తయారుయ్యేరు. ముఖ్యంగా పెళ్ళికూతురు తన జుట్టుతో మాత్రమే చక్కగా దువ్వుకుని జడవేసుకుంది. నెత్తి మీద బొప్పలేమీ లేవు. తలలో చిన్న చెండు విరజాజులు, మెడలో కొత్త పసుపుతాడుతో ఒక సన్నని రవ్వల నెక్లెస్, క్రీమ్ కలర్ పట్టు చీర, చెవులకి చిన్న జూకాలు, ఎంతో ముద్దగా హాయిగా కనిపించింది నా కంటికి.

ఈ మధ్య కాలంలో అలాంటి తయారులో పెళ్ళికూతుర్లని చూడలేదు. అలాగే వధూవరుల తల్లిదండ్రుల్ని కూడ. వాళ్ళు కూడ వయసుకి తగిన తయారులో హుందాగా వున్నారు.

భోజనాల దగ్గర నా స్నేహితురాల్ని అడిగాను ‘పెళ్ళి ఎక్కడ చేసారు?’ అని.

“ఇక్కడే జరిగింది. పెళ్ళికి కేవలం అబ్బాయి తరవు ముఖ్య బంధువుల్ని, మా తరపు బంధువుల్ని మాత్రమే పిలిచాం. మేం ముందే అనుకున్నాం పెళ్ళి పేరిట అనవసరపు ఖర్చులు చేయకూడదని” అని చెప్పింది.

నేను చాలా విస్తుపోతూ ఆనందించాను.

నిజమే కదా… పెళ్ళి పేరుతో నేడు పెరిగి పోయిన వ్యయం చూస్తుంటే నాకు చాలా బాదగానూ, కొపం గాను కూడా వుంటుంది.

నా స్నేహితురాలు ఎగువ తరగతికి చెందిందే! కాని వృథా ఖర్చులని తగ్గించుకోవాలని అనవసరపు ఆర్భాటాలు చెయ్యకూడదని అనుకోవటం హర్షదాయకం కాదా!

భోజనాలు కూడ కావల్సిన పదార్ధాలతో రుచికరంగా చేసారు. ఎన్ని రోజులకో యిలాంటి వివాహం చూడగల్గినందుకు చాలా సంతోషం కలిగింది.

ఆ మధ్య మరో స్నేహితురాలి కూతురి పెళ్ళికి వెళ్ళాను. జనం కిటికిటలాడుతున్నారు. కారు ఎక్కడో పెట్టి చాలా దూరం నడవాల్సి వచ్చింది. నిజానికి అంత గందరగోళంగా వుండే ప్రాంతాలకి నేను వెళ్ళడం నాకిష్టముండదు. అందుకే సహజంగా అంతా అయ్యేక ఇంటికి వెళ్ళి విష్ చేస్తుంటాను. కాని ఈ పెళ్ళికి వచ్చి తీరాలని బలవంతం చెయడంతో వెళ్ళేను. ఎవర్ని ఎవరూ పలకరించలేని రష్. ఎలాగో మెల్లిగా వెళ్ళి ఒక మూల కుర్చీ వెదుక్కుని కూర్చున్నాను. విపరీతమైన పూలతో కప్పేసినట్లున్న పూల అలంకరణలూ, ఇంతలో పెళ్ళికూతురు పల్లకీలో వచ్చింది సరాసరి హాల్లోకి. వీడియోల కోసం జనం పడే తాపత్రయం అన్నీ అలా చూస్తూ కూర్చున్నాను. అమ్మాయికి మేలి ముసుగు, ఈ పల్లకి వ్యవహారం, పెళ్ళి కూతురు మొహం అసలు కనిపించనివ్వని నగలు, వంటి మీద బంగాలు చీర, దానితో కలిసి పోయిన నగలు వాటి జిగిబిగిలో ఇక పెళ్ళికూతురేం కనిపిస్తుంది. అసలు ముసుగులు మన ఆంధ్రాలో లేవు కదా! మధ్యలో పల్లకీ వూరేగింపు ఏమిటి?

అసలు పల్లకి వూరేగింపు ఎందుకొచ్చిందో ఎంత మందికి తెలుసు! పాత రోజుల్లో చట్టాలు, రిజిస్ట్రేషన్ లేని రోజుల్లో అమ్మాయిని అబ్బాయిని అలా వూరిలో వూరేగిస్తే ఫలానా వారి అమ్మాయిని, ఫలానా వారి అబ్బాయికిచ్చి వివాహం చేసేరని వూళ్ళో అందరికి తెలిసేది. నిజానికి అది ‘వూరి ఎరిగింపు’ అంటే వూరికి తెలియ జేయడం. కాలగతిలో అది ఊరేగింపుగా మారింది.

మరిదేమిటి పెళ్ళి హాల్లోకి మోసుకురావడం! ఆ రోజుల్లో బాల్య వివాహాలు కాబట్టి ముద్దుగా వధూవరుల్ని మోయడం తేలిగ్గా వుండేది. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్‌లూ అయిస్ క్రీములూ తిని పెరుగుతున్న పాతికేళ్ళ పెళ్ళికూతుర్ని మోయాలంటే ఎంత కష్టం!

ఇక అక్కడ పెళ్ళి పేరుతో జరుగుతున్న ఆర్భాటానికి నేను వుక్కిరి బిక్కిరయి పోతున్నాను. అక్కడ వారి తయార్లు చూస్తే అసలెవరు పెళ్ళికూతురు? అనే స్థాయిలో వున్నాయి. అందరూ అందాల పోటీ కొచ్చినట్లు తయారయ్యేరు. ఇక ఎలాగోలా నా స్నేహితురాల్ని గుర్తుపట్టాను. గుర్తు పట్టి తెల్లబోయేను. ఆమె అచ్చం పెళ్ళికూతురిలానే తయారయ్యంది. పెద్ద పెద్ద జుంకాలు, చెంపస్వరాలు, మెడంతా కప్పేసే నెక్లెస్, ముందుకు పొడుచుకొచ్చిన పొట్ట మీద వడ్డాణం, ఇక బ్లౌస్‌కి చేసిన వర్క్ చూస్తే అసలీ వయసులో ఆమె దాన్నేలా తోడుక్కోగల్గిందీ అని ఆశ్చర్యపోయాను. ఇక అక్కడ ఒకరేమిటి అందరూ అలానే వున్నారు.

పెళ్ళికూతురి మీద అక్షింతలు వెయ్యడానిక్కూడా క్యూలు, భోజనాల దగ్గర క్యూలు. అక్కడ వారు చేసిన అయిటమ్స్ చూసి కళ్ళు తిరిగాయి. నిజానికి ఇవన్నీ ఎవరు తింటారు! ఎందుకింత ఖర్చు! అని బాధకల్గింది. ఎలాగోలా బయటపడి వూపిరి పీల్చుకున్నాను.

తర్వాత తీరుబడిగా నా స్నేహితురాలు ఫోను చేసి “నువ్వేక్కడికీ రావు. నా పిలుపు మన్నించి వచ్చింనందుకు చాలా థాంక్స్!” అని చెప్పింది. “పెళ్ళి చాలా ఘనంగా చేసేవ్!” అన్నాను ఏమనాలో తోచక.

“ఏం చేయటమే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు యి.ఎస్.ఏ లో మా వియ్యంకుడు రూపాయి కట్నం వద్దు. మాకే చాలా ఆస్తి వుంది అన్నాడు. ఇంకమిటని చాలా సంతోషించాం .”

‘అయితే పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలని వాళ్ళు చెప్పిన కోరికలు విని అలా చేయక తప్పలేదు. ఈ అప్పులు తీర్చుకోవడానికి మాకు మరో పదేళ్ళు పడుతుంది’ అంది బాధగా.

నాలుగేళ్ళ క్రితం మా చెల్లెలు కొడుకు పెళ్ళకి విజయవాడ వెళ్ళి, రావుల పాలెం మిదుగా రాజమండ్రి వెళ్తున్నాం. గోదావరి ప్రాంతం కదా! ప్రత్యూషంలో యింకా ఎండరాని ఆ వేళ చల్లగాలుల్లో ఆ ప్రాంతాన్ని ఆనందంగా చూస్తుంటే అక్కడక్కడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అడుగడుగునా కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూశాను.

పాల వెంకటాద్రి ఏకైక కూతురు మానసని అరిసెల రాజయ్య కూమారుడు శేఖర్ కిచ్చి వివాహం చేస్తున్నాం కాబట్టి అందరూ రావాలని ఆహ్వానం పలుకుతూ వధూవరులు దండం పెట్టిన ఫ్లెక్సీలు అవి!

“ఎవరు వీళ్ళు ఇలా పెళ్ళి పిలుపులకి కూడా ఫ్లెక్సీలు పెడతారా?” అని తెల్లబోతూ మా కారు నడుపుతున్న డ్రైవర్ని అడిగాను.

అతను పకపకా నవ్వుతూ “ఈ మజ్జిన మా వొళ్ళందరికీ యూ వ్యాధి సోకిందండి. చావులకీ పెళ్ళిళ్ళకి కూడా ఫ్లెక్సీలే. బడాయిలు మరిగేరు” అన్నాడు.

“అంత జమీందర్లా అందర్నీ రమ్మంటున్నారు” అనడిగాను. “నా బొంద. బడాయికి. ఎవరూ రారని ఆళ్ళకీ తెలుసు” అన్నాడు.

నాకు చాలా విచారమేసింది.

జనం ఎందుకిలా ఆర్భాటాలకి లొంగి పోతున్నారు!

స్వాతంత్య్ర పోరాటంలో తమ ఆస్తుల్ని త్యాగం చేసి జైళ్ళకెళ్ళి గాంధీ గారిని అనసరించిన భారతీయులమేనా మనం!

ఒక పుస్తకం కొని చదవండంటే మనసొప్పని మనం బ్యూటీ పార్లర్‌లకి, విందులకి యిలా తగలబెడుతున్నామా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here