మనసులోని మనసా-13

3
8

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]మా[/dropcap][dropcap][/dropcap] అమ్మమ్మగారింటి పెరటి గుమ్మం-

అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ ఒక పెళ్ళకి వెళ్ళాము. అది మా మామయ్యగారి మనవరాలి పెళ్ళి.

పెళ్ళి సర్పవరంలో…

కాబట్టి రాజమండ్రి నుండి కారులో నేను మా చెల్లెలు తదితరులం బయల్దేరేం. మొదట వచ్చేది సర్పవరమే కాబట్టి అక్కడే దిగి పెళ్ళికి హాజరవ్వాల్సి వచ్చింది. అంతా బాగా జరిగింది. ఎప్పటెప్పటి బంధువులూ, చిన్ననాటి స్నేహితులు కలిసి పరస్పరం సరదాగా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం.

చిన్ననాటి విషయాలు గుర్తుతెచ్చుకుని ఆనందపడ్డాం.

రాని వారి గురించి ఆరా తీసాం.

అంతా బాగుంది కాని… ఒకసారి జగన్నాధపురం వెళ్ళకుండా వెళ్ళపోవడం నాకు నచ్చలేదు. జగన్నాధపురం అంటే వేరే వూరు కాదు. హైద్రాబాదు-సికింద్రాబాదులా అంతా కాకినాడే. ఆ రెండు ప్రాంతాలని విడదీస్తూ మధ్యలో ఉప్పటేరు (బాక్‌వాటర్) ప్రవహిస్తుంది. ధవళేశ్వరం నుండి వచ్చిన గోదావరి పంట కాలువ కాకినాడలో ప్రవేశించే సరికి లాకుల దగ్గర వుప్పుటేరుగా మారి సముద్రంలో కలుస్తుంది. చిన్నప్పుడు ఆ కాలువ పక్క రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ అనందం ఆనందమే వేరు! ఎటు చూసినా కొబ్బరి తోపులూ, పంట పొలాలూ, సాగిపోతున్న తెరచాప పడవలూ, చేపల కోసం కాలువ మీద ఎగిరే కొంగలూ – ఓహ్ చెప్పరాని అందమది!

కాలువ నిండుగా ప్రవహిస్తుండేది. కొన్ని చోట్ల రోడ్డు కటూ యిటూ కూడా కాలవలుండేవి. కారు ఎక్కడ కాలవలో పడిపోతుందోనని నేను పెద్దవాళ్ళని గట్టిగా పట్టుకుని మరీ ఆ దృశ్యాల్ని చూస్తూండేదాన్ని.

ఇప్పడీ సారి రాజానగరం మీదుగా కాకినాడ వెళ్ళేం. అందుకని కాలువల సమస్య పెద్దగా లేదు.

తిరిగి రాజమండ్రి బయల్దేరబోతుండగా కారు ఒకసారి జగన్నాధపురం లోకి తిప్పమని అడిగాను. మా చెల్లెలు ఆశ్ఛర్యంగా చూసి “ఎందుకూ, ఎవర్నయినా కలవాలా?” అనడిగింది.

“ఒక సారి… మన వీధి చూద్దామని…” అంటూ నసిగాను.

 నేననుకున్నట్లే అది ఫక్కున నవ్వి “ఏ ముందక్కడ.. ఎవరూ లేరు. అందరూ ఇప్పుడు సర్పవరం జంక్షన్‌లోనే యిళ్ళు కట్టుకున్నారు. చాలా మంది హైద్రాబాదులోనో, అమెరికాలోనో వున్నారు” అంది.

“అందుక్కాదు. వురికే చూద్దామని” అన్నాను.

ఇవివరలో ఈ మాట మా అన్నయ్య కూడా అన్నాడు. అది నా సెంటిమెంటు గ్రహించి కారు అటు తిప్పించింది.

ఉప్పుటేరు రాగానే నా మనసు లయ తప్పింది.

కాకినాడలో నాకు పెద్ద మార్పులు కనిపించలేదు.

జనాభా పెరిగింది. పెద్ద బిల్బింగ్స్, ఎపార్టుమెంట్సు వచ్చినా ఆ రోడ్డు సిస్టమ్ అలానే వుంది.

కాకినాడ రోడ్లని రెక్టాంగులర్ రోడ్ సిస్టమ్ అంటారు. మెయిన్ రోడ్డు నానుకుని అటూయిటూ నాలుగయిదు రోడ్లు పేరెలల్‌గా ఎంత దూరమైనా సాగుతుంటాయి. వాటిని క్రాస్ చేస్తూ అడ్డరోడ్లు వుంటాయి. ఎంత దూరమైనా వంకరటింకరలుండవు. అందుకే ఆ నగరం ఒక ప్రత్యేకతగా, అందంగా వుండేది. నేను హైవేస్ సబ్జక్టు చదివేటప్పుడు ఈ సిస్టమ్ గురించి తెలుసుకున్నాను.

చర్చి స్క్వేర్ వచ్చేటప్పటికి నా గుండె ఝల్లుమంది. ఇక మా యిల్లు వచ్చేసినట్లే!

ఆ ప్రాంతాన్ని చూడగానే నా గుండె లయతప్పింది.

చిన్నప్పుడు ఆడిన ఆటలూ, అల్లరి పనులూ, బంధువులూ గుర్తొచ్చి ఒళ్ళు ఝల్లుమంది.

మా వీధి మలుపు తిరగగానే నేను చెప్పలేని నిరాశకి గురయ్యేను.

నిజానికి ఆ వీధంతా అప్పట్లో మాదే!

పొడవాటి మండువా యిల్లు. ఆ వీధినంతా చాలా వరకు ఆక్రమించుకుంటుంది. అటూ యిటూ వున్న స్థలాల్లో ఒకటి ఆవులదొడ్డి. అందులో మా తాతగారి ఆవుల మంద వుండేదట. కానీ నాకు వూహ వచ్చేటప్పటికీ అందులో ఒక్క ఆవూ లేదు. నేను పుట్టేటప్పటికే మా తాతగారు లేరు. అందులో రకరకాల పండ్ల మొక్కలూ, మధ్యలో మా మూడో మామయ్య చేసే పీచు వ్యాపారం తాలూకు పాకలూ, పనివాళ్ళూ వుండేవారు.

మండువా యింటికి అటుగా కొళాయి దొడ్డి అని ఒక స్థలం వుండేది. అందులో ఒక కొళాయి వుండేది. చూట్టూ బూరుగు దూది చెట్లు, ద్రాక్షతీగలూ వుండేవి. ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ కొచ్చి మంచి నీళ్ళు పట్టుకునే వారు. కేవలం బీద సాదలకే నీళ్లు యివ్వడానికే మా తాతాగారు అది కట్టించారట. ఇది మాత్రం నేను కాలేజీ చదువు కొచ్చేంత వరకూ అలాగే వుంది.

ఇప్పుడా స్థలాల్లో వేరే యిళ్ళు వెలిసాయి.

ఇక మా మండువా యిల్లు దుస్థితి చూస్తే కళ్ళ నీళ్ళు తిరుగుతాయి.

ఇల్లు పూర్తిగా కూలిపోయింది.

ఆ పొడుగాటి వరండా అంతా ముష్టివాళ్ళు ఆక్రమించుకున్నారు.

ఎదురుగా వుండే పెదనాన్నగారి యిల్లు కూడా ఆ దుస్థితిలోనే వుంది

కారణం – ఆస్తి తగాదాలు!

అంత కన్నా ఆ ఆస్తుల పట్ల ఎవరికీ ఆసక్తి లేకపోవడం! ఎప్పుడో కోర్టులో కేసులు వేసుక్కూర్చున్నారు.

వాటిని పట్టించుకున్న వారే లేరు.

అక్కడ ఆ పక్కగా వున్న పెరటి గుమ్మం వైపు చూశాను. చెట్లు మొలిచి, శిధిలమై దీనంగా కనబడిందది.

నిజానికి పేరుకి పెరటి గుమ్మమే గాని ఒకప్పుడు రాజసంగా ఆడవారికీ, పిల్లలకీ రాజమార్గంగా వెలిసిన రహదారి అది!

ఇంటెకెవరొచ్చినా ఆడవాళ్ళంతా ఆ దారినే లోపలకి ప్రవేశించేవారు. ఆ గుమ్మం పొడవునా గచ్చు చేసి లోపలి దాకా సాగి వంటగదిలకి దారి చూపించేది.

అక్కడ విడిగా కట్టిన వంటగదులు, స్టోర్‌రూములూ, ఆడవారి బాత్రూంలూ వేరుగా వుండేవి. వాటికి పొడవునా వరండా వుండేది. అక్కడే వంటలూ వాటికి సంబంధించిన పనులూ సాగుతుండేవి. వంట గదంటే ఇప్పట్లా చిన్న చిన్నవి కాదు. నాలుగయిదు పొయ్యలు సర్వీపేడులతో, మడకర్రలతో భగభగ మంటూ మండుతుండేవి. ఒక అరడజను మట్టెల్లో పాలూ, పెరుగూ, దిబ్బరొట్టెల్లో మాకు వేసేందుకు దాచిన చెరకు పాకం ఇత్యాది వన్నీ వుండేవి.

నిలువెత్తు భోషాణం ఒకటి పక్కన వుండేది. వండిన పిండి వంటలు – ఇంకా ఏవేవో అందులో దాచేవారు.

ఆ పొయ్యల మంటల కాంతిలో మా తెల్లటి అమ్మమ్మ ఎర్రగా అయి బిజీగా వండి వారుస్తుండేది.

అత్తలు సహాయ పడుతుండేవారు.

నా కిష్టమైన స్టోర్రూమ్ వంటగది నానుకుని వుండేది.

అందులో అప్పటి సీజనల్ పళ్ళన్ని వుండేవి. జాంకాయలు, సీతాఫలాలు. పంపరపనస, పనస, మామిడి పళ్ళు, తేగలూ, బుర్రగుంజూలూ, పూలోచ్చిన కొబ్బరి కాయలూ, కొబ్బరి, అరటి గెలలూ, విటికి తోడు పిండి వంటలూ – నేను కాసేపు ఆటలాడి మధ్యలో ఆ గదిలో దూరేదాన్ని. కంగారుకి ఏదో ఒకటి తడుముకుంటూ పడేసేదాన్ని.

“అయ్యో, అయ్యో పిల్లి కాబోలు! చూడండి” అనేది అమ్మమ్మ.

స్తంభానికి జేరబడి నిలుచున్న మా అందాల నాలుగో అత్త కిసుక్కున నవ్వు “పిల్లేం కాదు – పిల్ల” అనేది.

“పిల్లా?” అని అడిగేది మా అమ్మమ్మ.

“ఇంకెవరండి, మన మాయదారి శారదే” అంటూ మా మూడో అత్త అరుంధతి గబగబా లోపలికొచ్చేది.

అప్పడికే సున్నుండలు చేయడానికి విసిరిన మినప్పిండి కారియర్ నేల మీద బోర్లా పడి వుండేది.

ఆ పిండి పేరిన నెయ్యి తీసుకుని కలుపుకుని తిందామని నిలబడ్డ నేను దొంగలా అత్త వైపు చూసేదాన్ని.

“నీతో మాయదారి సంత శారదా! నన్నడిగే నేనివ్వనూ” అంటూ అత్త గబగబా నాలుగుండలూ అటూ యిటూగా చుట్టి యిచ్చేసి “మెల్లిగా పారిపో. మీ అమ్మ చూస్తే తంతది” అని నన్ను పంపించేసి పిండి ఎత్తుకునేది పాపం!

అలా ఎన్ని అల్లర్లో! ఎన్ని జ్ఞాపకాలో!

పెద్దత్త ఆ వరండాలో చిన్న స్టూలు వేసుకుని పెద్ద కడవంత గిన్నెలో మజ్జిగ చిలుకుతుండేది. మావయ్య తాసిల్దారు. అత్త కూల్. చాలా చిన్నగా జోకులు వేసేది. పేరు సూర్యకాంతం. అచ్చూ అలానే వుండేది. అత్తది పాలకొల్లు. మేమెంత అల్లర్లు చేసినా ఏమీ అనేది కాదు.

మేము ఒక్కోసారి ఆవిడ జుట్టు ముడి విప్పేసి గబగబా రెండు జడలు వేసేవాళ్ళం. చెవి కమ్మలు తీసేసి రింగులు పెటే వాళ్ళం. ఒకరెళ్ళి గబగబా ఒక గులాబీ పువ్వు కోసి ఒక జడలో పెటేవారు. ఇంకొకరు కొంచెం స్నో రాసి పౌడరు కొట్టి తిలకం బొట్టు పెట్టేవారు. ఏమి చేసినా తనకి పట్టనట్లు మజ్జిగ చిలుకుతూ కూర్చునేది. అదేంటలా వూరుకుంటావూ వాళ్ళంతంత అల్లరి చేస్తుంటే.. అని ఎవరైనా అడిగితే.. ‘వాళ్ళెంతా గోపికలు, నా కొడుకు కిష్ణుడు, చెయ్యనియ్యి’ అనేది తన ఒక్కగానొక్క కొడుకు రామక్రిష్ణని తలచుకుని మురిసిపోతూ.

ఆ మాట వినగానే ‘ఛత్’ అని మేమంతా ఎక్కడి వాక్కడివి పడేసి పారిపోయేవాళ్ళం.

పనులయ్యేక స్నానాలు చేసి ఒక రెండు బస్తాల బియ్యమో పప్పులో ఆ వరండాలో పోసి ఏరుతుండేవాళ్ళు.

ఆ టైంకి ఇరుగుపోరుగు ఆడవాళ్ళూ, పనిమనుషులూ అందరూ చేరి సాయపడేవారు. మూడు బాగుంటే మేమూ కొంచెం ఏరి పెట్టేవాళ్ళం.

ఆ పెరటి గుమ్మం ద్వారానే ఎంతటి గొప్ప ఆడవారయినా వచ్చి ఆ వరండా చాపల మీదే కూర్చుని కబుర్లు చెప్పి, మర్యాదలు పొంది వెళ్ళేవారు.

ముందు హాల్లో సోఫాలు, ఫర్నీచర్ వున్నా అక్కడెప్పుడూ మావయ్యలూ వారి కోసం వచ్చిన మగవారు మాత్రమే కూర్చునేవారు.

ఆ ప్రయివసీ నిజంగా చాలా హాయిగా వుండేది.

ఇప్పటిలా ఆడా మగా ఈ ఎపార్టుమెంట్సులో ఒక హాల్లోనే ఇరుక్కుని కూర్చుని కబుర్లు చెప్పుకునే కన్నా అలా ఎవరి ప్రయివసీ వారి కుండడం చాలా హాయిగా వుంటుంది కదా.

నిజంగా వాళ్ళే చాలా స్వేచ్ఛని, సంతోషాన్ని అనుభవించి వుంటారనిపిస్తుంది నాకు గతం తలచుకుంటే.

ఒక సారి నేను అమెరికా నుండి వస్తూ దాహా(ఖతార్) ఎయిర్ పోర్టులో దిగి గేట్ దగ్గర కూర్చున్నాను.

తిరిగి ఇండియాకి ఫ్లైయిట్‌కి మరో రెండుగంటల సమయముంది. అప్పుడే సరిగ్గా ఒక పెద్ద జట్టు ఆడవాళ్ళు బిలబిల మంటూ వచ్చి నా పక్క సీట్లు ఆక్రమించారు.

వాళ్ళంతా అప్పడే వచ్చిన లండన్ ఫ్లైయిట్‌కి వచ్చారు.

అందరూ పెద్దా చిన్నా లేకుండా చక్కని డ్రెస్సులు వేసుకుని గలగలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారు.

కాసేపటికి మాటా మాటా కలిసాయి!

వాళ్ళందరూ యూరప్ టూర్‌కి వెళ్ళి వస్తున్నారట!

అందరూ బంధువులూ, స్నేహితులూ మాత్రమే!

వారందరిలో ఒకే మగపిల్లాడు వున్నాడు!

ఆ అబ్బాయి పని కుర్రవాడట!

“మరి అంతా ఆడవాళ్ళేనా… మగవాళ్ళేరీ?” అని చాలా అమాయకంగా అడిగాను నేను.

బదులుగా వాళ్ళు కిసుక్కున నవ్వు మళ్ళా వాళ్ళెందుకు. “వాళ్ళతో వెళ్ళే బదులు ఇంట్లో వుండటం నయం-కదూ” అంటూ ఒకరి మొహాలొకళ్ళు చూసుకుని మళ్ళీ నవ్వారు.

నా తెల్ల మొహం చూసి “అది కాదండి.. వాళ్ళతో వెళ్తే యింట్లో వున్నట్లే వుంటుంది. ఆ టవలివ్వు, ఈ చొక్కా యివ్వు అంటూ గరుడ సేవలు! ఇలా తుళ్ళి తుళ్లి నవ్వుకోడాని కుంటుందా! అదీ గాక ఒకరి భర్త మరోకరికి పరాయి వాళ్ళే కదా! నవ్వుకోవడానికీ, జోక్స్ వేసుకోవడానికీ ఇబ్బందే కదా! ఇంకేం సరదా వుంటుంది! అందుకే దేని కన్నా పనికొస్తాడని ఈ వెధవని తీసుకుని వచ్చాం” అని ఆ అబ్బాయిని చూపించి నవ్వారు.

నిజమే కదా.. కొంత సేపయినా ఎవరి ప్రయివసీ వారి కుండాలి కదా! అనుకున్నాను నేను కూడా.

అలా మా అమ్మమ్మగారి శిధిల పెరటి గుమ్మం నాలో ఎన్నో జ్ఞాపకాలని రేపింది.

ఉసూరుమంటూ నా ఆలోచనలతో నేను చెమర్చిన కళ్ళతో వెనుతిరిగాను దిగాలుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here