మనసులోని మనసా-16

1
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఒ[/dropcap]కసారి సీరియల్‌గా రన్ అవుతున్న నా రచన స్క్రిప్ట్ ఇవ్వడానికి నేను ఒక ప్రముఖ పత్రికాఫీసుకి వెళ్ళేను. ఎడిటర్‌గారు నా స్క్రిప్ట్ అందుకుని ఒక రెండు వుత్తరాలు నాకు అందించారు.

 “ఏంటివి సర్?” అనడిగాను

“మీ ఫాన్ మెయిల్” అన్నారు నవ్వుతూ

“బొత్తిగా రెండు వుత్తరాలా సర్?” అన్నను అశ్చర్యంగా.

“కాదు. చాలానే వచ్చాయి. ఈ రెండూ మాత్రం ప్రత్యేకం” అన్నారాయన.

నేను విప్పి చూశాను.

రెండూ ఒకే వ్యక్తి రాసినవి.

రెండూ నన్ను తిడుతూ రాసినవి.

మనం రాసే రచనలు గాని, మరో పని కాని అందరికీ నచ్చి తీరాలని లేదు. ‘లోకో భిన్నరుచిః’ అన్నారు. కాని ఆ వుత్తరాలు రెండూ నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూవున్నాయి. సరిగ్గా చదివితే అవి ఎవరు రాశారో కూడా నాకు అర్థమయిపోయాయి. ఆ ఆకాశరామమ్మ నా స్నేహితురాలే. ఆఫీసులో నన్ను అంటిపెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి. అంతకు మించి అత్యంత క్లిష్ట పిరిస్థితిలో నా సహాయం పొందిన స్నేహితురాలే. ఆమె ఉత్తరంలో అనేక చోట్ల దొరికిపోయింది. నా కథలు వెయ్యెద్దంది. నాకు చాలా గర్వం అని చెప్పింది. ఆఫీసులో ఫోజులు కొడుతున్నానంది. ఇంకా కొన్ని విషయాల వలన నేను ఆమెను గుర్తుపట్టేసాను.

నా మొహం ఎర్రబడిపోయింది.

అంత వరకూ అలాంటి సంఘటన నేను ఎదుర్కోలేదు.

చాలా వరకు మాట పడకుండా సౌమ్యంగా ప్రవర్తిస్తూ తప్పుకు తిరుగుతుంటాను నేను. అలానే నాకు ఆఫీసులో మంచి పేరే వుంది.

అందుకని నా కళ్ళ వెంట నీళ్లోచ్చేసేయి.

పరిస్థితి గమనించిన ఎడిటర్ గారు “ఈ ఉత్తరాలు మిమ్మల్ని బాధ పెట్టాలని చూపించలేదు. శత్రువులు పెరుగుతున్నారంటే మీరు ఎదుగుతున్నట్లే. అరిషడ్వర్గాలలో ఒక్క మత్సరానికి తప్ప అన్నింటికీ కొద్దోగొప్పో కారణాలుంటాయి. అసూయకి ఏ కారణమూ అక్కర్లేదు. ఎన్నెన్నో భయంకరమైన వుత్పాతాలకి కారణం కూడా అసూయే. ఈ లెటర్స్ రాసిందెవరో కూడ నాకు తెలుసు. మీరప్పుడప్పుడూ తోడుగా తీసుకొస్తుంటారే ఆవిడే!” అన్నారు నవ్వుతూ.

నేను మాత్రం జీర్జించుకోలేక పోయాను.

నాతో ఎంతో స్నేహంగా తిరుగుతూ నా వున్నతిని కోరుతున్నట్లుగా ఎంతో ప్రేమ కురిపించే ఆ వ్యక్తి ఇలా చేయగలదా అని.

తర్వాత ఇది నా కలవాటయిపోయింది.

నేను హైద్రాబాదు ట్రాన్సఫరయి వచ్చినప్పుడు ఈ భాగ్యనగరంలో వుద్యోగం చేయడం గురించి చాలా కలలు కన్నాను. ద్రిల్ ఫీలయ్యేను. నిజంగా అప్పుడు డిసెంబరు నెల. చలి గాలులు చాలా వుండేవి. ఎత్తయిన కొండ మీద మా ఆఫీసు చూస్తే చెప్పలేని ఆనందం కల్గేది.

ఎంతో మంది ఆడవారు స్వెట్టర్లు, కోట్లు వేసుకుని ఆఫీసుకి వస్తుంటే చూడటానికి భలేవుండేది.

మాకొక లంచ్ ‌రూమ్. కాంటిన్, అందరూ గలగలా కబుర్లు, పలుకరింపులు! సరదాలు! పొడవాటి వరండాలు – బోల్డంత మంది స్టాఫ్.

ఆఫీసుకి ఇద్దరూ ముగ్గురూ ఆడవాళ్ళుగా బిక్కు బిక్కుమంటూ వూళ్ళలో చేసిన కాస్త కాలం వుద్యోగం గుర్తొచ్చి మహా సంతోషమేసింది.

ఎవరైనా ఒక చీర కొనుక్కుని కట్టుకొచ్చి ‘ఎలా వుంది?’ అనడిగితే “ఛీ! ఛండాలంగా వుంది. అసలీ రంగు నీకెలా నప్పుతుందని కొనుక్కున్నావు!” అని మొహం మీదే అనేసేది మరొకావిడ.

ఆ మాట విని నేను తెల్లబోయేను.

ఆవిడ తనకి నచ్చేకదా.. సరదా పడి కొనుక్కున్నారు.

‘బాగుంది’ అని ఒక కాంప్లిమెంటు ఇస్తే వచ్చే నష్టమేముంది. లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయితే వేరుగా బాగోక పోవడానికి గల కారణాలు చెప్పవచ్చు.

అలా అయితే ఈవిడకి ఆనందం కలగదు.

అలానే ఎన్నో మాటలు వినేదాన్ని.

ఎవరయినా ఏదయినా నగ పెట్టుకొస్తే “సుజాతా.. ఇది నీకయితే బాగుంటుంది” అని ఇంకొకర్ని మెచ్చుకుని చెప్పేవారు. ఈ అకారణ దెప్పిపొడుచుకోవడాలూ, అసూయలూ దాటలేరా స్త్రీలు! అని బాధ కలిగేది.

ఇక రచయిత్రిగా ఎదిగే కొలది ఆ బాధలు నేను కూడా ఎదుర్కోవడం కూడా మొదలయ్యింది.

కొందరు నేను వెళ్ళగానే మరో రచయిత కథలు మెచ్చుకోవడం అసలతనే నిజమైన రచయిత అని చర్చిండం చేసేవారు. అందులో తప్పేం లేదు. కాని ఆ చెప్పడంలో చాలా శ్లేష వుండేది.

ఇంకొక ఆమె “నాకు చాలా ఆలోచనలు వస్తాయి. ఇంత కంటే బాగా రాయగలను. కాని ఖాళీలేదు. అవతల సంసారముంది కదా! మొగుడూ పిల్లల్ని వదిలేసి తగుదునమ్మా అని కాగితాలు ముందేసుక్కూర్చోలేను” అంటూ అక్కడికి నేను సంసారం వదిలేసి రాస్తున్నట్లు సంతోష పడేది.

కొందరు కాపీ నవల్సని ప్రచారం చేసేవారు.

ఇవన్నీ నాకు బాధ కల్గించినా ఎడిటర్‌గారి మాట గుర్తొచ్చి సంమయనం పాటించేదాన్ని.

ఆఫీసులోని జెంట్స్ నన్ను చాలా గౌరవించేవారు. తమ ఆఫీసుకి నా వలన గౌరవం లభించిందని చెప్పేవారు.

కోడూరి కౌసల్యాదేవి గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె కూడ తను పడిన బాధలు చాలా నాకు చెప్పారు.

ఒక్కసారిగా తనకి చక్రభ్రమణం, శాంతినికేతన్ నవలలతో చాలా గుర్తింపు రాగానే ఆమె ఇలాంటి ఇక్కట్లు చాలా పడ్డారట. ఏడ్చి ఇంట్లో వుండిపోయి మరి రాయనన్నారట.

అప్పుడు కొందరు సంపాదకులు, పబ్లిషర్సు ఆమెను వూరడించి “మీరు మీ మానాన మీరు రాసుకోండి. ప్రచురించేది మేము. సభలూ, సమావేశాలకి వెళ్ళనంత మాత్రాన మీరు మనసునిండా గాయాలు తప్ప ఒరిగేదేమీ లేదని చెప్పేరట. దాంతో ఆమె తన కలం ద్వారానే బయటికి వచ్చేరు తప్ప మనిషిగా కాదు.”

చాలా సేపు ఇంటర్వ్యూ ఇవ్వనన్న కౌసల్యాదేవి చివరికి నన్ను అర్థం చేసుకుని ఇంటర్వ్యూకి అనుమతి ఇచ్చేరు.

ఒకర్ని మెచ్చుకుని ప్రశంసిస్తే మనకు వచ్చే నష్టం ఏమిటి. ఒక చిన్న మెచ్చుకోలు అవతలి వారికి ఊపిరి పోస్తుంది. దాని వలన మనం కూడ వారి దృష్టిలో ఎంత గౌరవం పొందుతాం. ఈ చిన్న విషయాన్ని విస్మరించి నాలుకతో కత్తులు దూసుకుంటారు చాలా మంది.

నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా గమనించింది అదే.

ఎదురు పడగానే చక్కని చిరనవ్వు నవ్వి ‘హౌ అర్యూ ?’ అని పలకరిస్తారు. ఏ మాల్స్‌లో ఎదురయినా చక్కగా నవ్వుతారు. మన కోసం డోర్ తెరుస్తారు. మనం తెరిస్తే థాంక్స్ చెబుతారు. వెంటనే మనం ఆనంద పడిపోతాం. మన పిల్లల్ని ముద్దు చేస్తారు. నిజానికి వారి పిల్లల ముందు మనవారు వెలా తెలా బోతారు. అయినా వారు ‘క్యూట్ బేబి’ అని ముద్దుగా మెచ్చుకుంటూరు.

మా వంశీ మొదటిసారి తను పని చేసిన లేటురోప్ (పెనిన్స్‌ల్‌నియా)లో ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. అది వాడు రెగ్యులర్‌గా వెళ్ళే రెస్టారెంట్ అట. అందుకని అందులో స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి ‘మీ మదర్ చాలా బాగున్నారు.’ ఆమె కట్టుకున్న చీర చాలా బాగుందని ప్రెయిజ్ చేసి నాకు చాలా స్పెషల్‌గా సర్వ్ చేసి ఆనందపరిచారు. నేను వుబ్బి తబ్బిబ్బయి పోయాను. అదే మన వారు ఎక్కడ ఎదురయినా మాడు పెసరట్లుల్లా మొహాలు పెట్టుకుని మనం నవ్వినా చూడనట్లుగా వెళ్ళిపోతారు.

ఒక మనిషి మిమ్మల్ని ఎందుకు పలుకరిస్తారు! ఎందుకు హలో చెబుతారు! ఎందుకు మీ పనిని మొచ్చుకుంటారు! ఎందుకు స్పందిస్తారు! వారికి గతి లేక కాదు. ఎంతటి గొప్పవారినయినా వారికి సంస్కారం స్పందనా లేక పోతే ఎవరూ దాసోహం అనరు.

మీ చిరునవ్వు, మీరు వారిని గుర్తించే తీరులోనే తిరిగి మీరు ప్రేమని గుర్తింపుని పొందుతారు.

ఎంతటి మేకప్పు, బ్యూటీ ఎయిడ్స్ ఇవ్వని సౌందర్యం మీ పలకరింపు, మీ చిరునవ్వు, మీ సహాయం చేసే గుణం మీకు యిస్తాయి.

అది నిజం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here