మనసులోని మనసా-17

2
10

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఒ[/dropcap]క అయిడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు అయిడియా వాడు. అదేమో గాని ఒక ఉత్తరం జీవితాన్ని రసమయం చేసి ఎన్నో అనుభూతుల్ని పెంచుతుంది.

సెల్‌ఫోనుల దయ వలన ఉత్తరాలు ఊడ్చుకుపోయాయి. ఆహ్లాదకరమైన స్నేహాలు, అందమైన అనుభూతులు అంతటితోనే అంతమయిపోయాయి.

నాకు ఊహ తెలిసి చూసిన మొదటి వుత్తరం మా మూడో మామయ్య మా అమ్మకి రాసిన ఉత్తరాలు. ఆయన చాలా రెగ్యులర్‌గా అంటే సోమవారం నాడు ఒక కార్డు ముక్క ఠంచనుగా మా అమ్మగారికి రాస్తే అది మంగళవారం మధ్యాహ్నం మాకు చేరేది.

ఇక ఉత్తరాల కోసం గుమ్మం కేసి చూడటం పోస్ట్‌మాన్ కోసం ఆ టైముకి వీధి వేపు చూస్తూ నిరీక్షించడాలు మేమెరుగం. కారణం మా క్వార్టర్సు పోస్టాఫీసు కలిపి వుండడమే. ఒక్కోసారి మేం వీధిలో వేపచెట్టు క్రింద నిరీక్షించేవాళ్ళం. అది ఆంధ్రప్రభ వారపత్రిక కోసం. ఆదివారం అనుకుంట వచ్చేది. మధ్యాహ్నం రైలు కూత వినగానే అక్కడ తచ్చాడేవాళ్ళం. అందులో పిల్లల సీరియల్స్ ఏవో ఒకటి వస్తుండేవి. మా అమ్మగారు పత్రిక రాగానే మధ్య హాల్లో చాపలు పరిచి మమ్మల్ని అటూ ఇటూ పడుకోబెట్టుకుని గట్టిగా చదివేవారు. అలా చదువుతున్నప్పుడు దాన్ని దృశ్యకావ్యంగా మలచుకుని వూహల్లో తేలిపోయి వుబ్బితబ్బిబ్బయిపోయేవాళ్ళం. ఎప్పుడూ మా అమ్మగారికి దూరంగా వుండే నేను కథ కోసం ఆవిడ పక్కనే పడుకునేదాన్ని. నిజంగా ఆ రోజుల్లో రచయితలు ఎంత హృద్యంగా రాసేవారో! అలాంటి వేళ మాకు పోస్టాఫీసుకు మధ్య తలుపు తెరుచుకుని ఒక కార్డు ముక్క మా మీదకి వచ్చి పడేది.

అది మా మామయ్య రాసిన వుత్తరం! ఆ ఉత్తరం చూడగానే అమ్మ కళ్ళు మెరిసేవి.

నిజానికి ఆవిడ సోదర ప్రేమ తప్ప అంతగా కళ్ళు జిగ్‌జిగేలుమని మెరవాల్సినంత మేటరేదీ అందులో వుండేది కాదు.

ఆ వుత్తరంలోని మాటర్ ఎప్పుడూ మారేది కాదు. ఎప్పుడూ ఒకటే….  జిరాక్స్ కాపీ తీసినట్లుగా.

“చిన చెల్లికి, భగవంతుడి దయవలన మేము క్షేమము. మీరు క్షేమమని తలుస్తాను. బావగారిని అడిగినట్లు చెప్పవలెను. పిల్లలు జాగ్రత్త! వారిని క్రమశిక్షణగా పెంచవలెను. ముఖ్యముగా ఆ శారదని కొద్దిగా అదుపులో పెట్టవలెను…” ఆ చివరి వాక్యం చూడగానే నాకు అరికాలి మంట నెత్తికెక్కేది. నాకెందుకంత ప్రత్యేకతో నా కర్థమయ్యేది కాదు.

అందుకే మా మూడో మామయ్యంటే నాకు పడేది కాదు.

అందుకే ఆ వుత్తం చూడగానే మా అమ్మగారిని నేను వెక్కిరించేదాన్ని.

“ఎందుకంత కష్టపడి చదవడం! అందులో ఏముందో నేను చెబుతాను” అంటూ దూరంగా నిలబడి వుత్తరం అంతా చెప్పేదాన్ని! మా అక్కాచెల్లెళ్ళు నవ్వేవారు. అది చూసి మా అమ్మగారు మండిపడిపోయేవారు.

ఆంధ్రప్రభలో ప్రమదావనం చూసి, నేనూ మా అక్కా మాలతీ చందూర్ గారి ‘ప్రశ్నలు – జవాబులు’ శీర్షికకి వుత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నాం. మా నాన్నగారికి తెలియకుండా క్లర్క్ దగ్గర రెండు కార్డులు కొని, చాలాసేపు ఏం రాయలో తెలియక తల బద్దలు కొట్టుకున్నాం. అందులో చాలామంది ప్రశ్నలు చదివి చివరకు ఏదో ఒకటి కిట్టించి బాక్స్‌లో వేసేశాం.

ఇక నిరీక్షణ మొదలు!

ఆంధ్రప్రభ రాగానే మొదట ప్రమదావనం పేజీ తెరిచి చూసుకుని మాకు జవాబు ఇవ్వకపోవడంతో నిరాశపడేవాళ్ళం. అయినా ప్రయత్నం మాత్రం మానలేదు.

అలా గజనీ మహమ్మద్ దండయాత్రల్లా చేసి చేసి చివరికి 10th క్లాసులో విజయం సాధించాం.

మా అక్క వుత్తరానికి ఆవిడ చక్కగా కవితాత్మకంగా జవాబిచ్చేరు. ప్రత్యూషంలో పూసిన కొన్ని పూల పేర్లు చెబుతూ, వాటి సువాసనలన్నీ కలిపితే ఏమవుతుందని అడిగింది మా హేమక్క. దాన్ని చూసి మా అన్నయ్య “ఈ మాత్రానికి ఆవిడని అడిగి బాధ పెట్టడమెందుకు – నన్నడిగితే చెప్పనా – మురికి కంపు కొడుతుంది” అని దాన్ని చాలా ఏడిపించాడు.

తర్వాత నేను విజయం సాధించాను.

ఆ జవాబులు కత్తిరించి నా ఆటోగ్రాఫ్ బుక్‌లో అతికించి తెగ మురిసిపోయేదాన్ని. మరి అచ్చులో నా పేరు చూసుకోవటం చాలా థ్రిల్ కలిగించే విషయం కదా!

తెలుగు రచయిత్రుల మహాసభలో నేను మాలతీ చందూర్ గారి పక్కన కూర్చుని ఆమె అధ్యక్షతన ఒక రచయిత్రిగా మాట్లాడుతానని అసలే మాత్రం ఊహించని విషయం. ఆ తర్వాత చెన్నయ్‌లో వారిని రెండుసార్లు కలిసాను. ఒక టి.వి. సీరియల్ కోసం ఆమె నాకు కథలు పంపడం, ఫోనులో సంభాషించడం… అదంతా ఒక అదృష్టం.

ఒకసారి మాచర్లలో నేను మా నాన్నగారి కొక ఉత్తరం రాశాను. మా అమ్మగారి మీద కోపం వచ్చి మా నాన్నకి కంప్లైంట్ చేస్తూ రాసిన ఉత్తరం అది!

ఆ ఉత్తరం రాశాక చాలా భయం వేసింది. అప్పుడు నా వయసు ఏడేళ్ళు.  ఆ ఉత్తరం అందే టైముకి మా నాన్నగారి టేబుల్ క్రింద పడేసి ఉన్న పోస్టల్ బాగ్స్ క్రింద దాక్కుని కూర్చున్నాను.

ఆ ఉత్తరాన్ని సోమయ్యగారనే క్లర్కు నాన్నగారికి ఇవ్వడం – అది ఆయన చదవడం – అందులో మాటర్ స్టాఫ్‌కి చెప్పి నవ్వడం నేను గమనిస్తూనే వున్నాను. ఆయన నవ్వేక నాకు ధైర్యమొచ్చింది. చిన్నగా బల్ల క్రింద వున్న ఆయన పాదాలను గోకడం మొదలుపెట్టాను. ఆయన మండ్రగప్ప అనుకుని కాళ్ళు పైకి లాక్కుని బాగ్స్ తీయమని రన్నర్స్‌ని పిలిచేరు. తీరా తీసి పళ్ళికిలిస్తున్న నన్ను చూసి, రూలర్ టేబుల్ మీద కొడుతూ “యూ బ్లడీ ఫూల్! క్రింద తేళ్ళుంటే ఏమవుతావు” అని కేకలేసారు.

పెద్దయ్యేక మేం కజిన్స్‌మి సరదాగా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అందులో మా నవ్వుల గలగలలు, ఆసలు, ఆశయాలు, బంధువుల మీద జోక్స్ – యిలా ఎన్నో దొర్లేవి. అయితే మాకు నచ్చనివి ఏమిటంటే అన్నీ మా అమ్మా నాన్నగారి చేతుల్లో పడి సెన్సారయి మాకు వచ్చేవి.  ఇది మాకు చాలా అసహనంగా వుండేది. మా మీద ఇంత పెత్తనమేమిటని ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్ళం.

మా అమ్మగారు అందులో విషయాల్ని తర్కించి కేకేలేసేవారు. “మీ చదువులు మీ ఇష్టమా – మేం చదివించింది మీరు చదవాలి” అని కోప్పడేవారు. ‘ఉత్తరాల్లో కూడా వెకిలి నవ్వులా…’ అని మందలించేవారు.

అయినా మేం ఉత్తరాలు దాచుకుని తోటలో అరుగుమీద కూర్చుని చదువుకుని తెగ నవ్వుకునే వాళ్ళం. ఇద్దరం తిరిగి అక్కడే జవాబులు రాసి పోస్టు చేసేవాళ్ళం.

ఇక కాకినాడలో మా మణక్కా వాళ్ళు ఎదురింటి బంధువుల ఎడ్రసులిచ్చి అక్కడ తీసుకుని చదువుకునేవారు. మా అక్కాచెల్లెళ్ళకే ఇన్ని నిబంధనలుండేవి మా యింట్లో.

మా పెళ్ళిళ్ళయ్యేవరకూ ఈ నిబంధనలు అలా సాగుతూనే వచ్చాయి. తర్వాత ఉత్తరాల విషయంలో ఫ్రీ అయిపోయాం.

మా నాన్నగారు నాకు రెగ్యులర్‌గా రాసేవారు.

ఆయనంతా ఇంగ్లీషులోనే రాసేవారు. ఆయన గుంటూరు హిందూ కాలేజీలో చదివారు. ఆయనకి కొంతమంది బ్రిటీష్ లెక్చరర్స్ వుండేవారట అప్పట్లో. అందుకని ఆంగ్లం మీద ఆయనకి బాగా పట్టు వుండేది.

ఆయనకి తిరిగి ఇంగ్లీషులో రాయాలంటే మాకు భయం వేసేది – ఎక్కడ తప్పులు పట్టుకుంటారోనని.

మొన్న ఏదో సర్దుతుండగా ఆయన ఉత్తరాలు కొన్ని దొరికేయి. ఆ రోజంతా వాటిని చదువుతుంటే ఆయనతో వున్న అనుబంధం అంతా గుర్తొచ్చి కన్నీళ్ళు కారిపోయాయి.

ఆ ఉత్తరాలు వుండబట్టే కదా… తిరిగి ఎన్నో అనుభూతుల్ని స్మరించుకోల్గేను అనిపించింది.

ఉత్తరాలు నిజంగా మనల్ని ఓదార్చి, ఏమయినా వైషమ్యాలుంటే వాటిని పోగొట్టి కలిపే వారధుల్లాంటివి.

మాటల్లో చెప్పలేని ఎన్నో భావనలని ఉత్తరాల్లో పొందుపరచవచ్చు. ఎప్పుడయినా ఎవరి మీదనన్నా కోపం వచ్చినప్పుడు వాళ్ళు గతంలో రాసిన ఉత్తరాలు తీసి చదువుకుంటే ఆ అపార్థాలు చిటికెలో మాయమయి సుహృద్భావం ఏర్పడి తీరుతుంది.

నిజంగా సెల్‌ఫోన్లు, వాట్సప్‌లు అనుబంధాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. కోపమొచ్చినా, ఆవేశమొచ్చినా వెంట వెంటనే ఠపీఠపీమని అనేసుకోడాలు, విచక్షణ లేకుండా ఇతరులకి చెప్పేయడాలు, ఆలోచించుకోవడానికి వీలు లేని అపార్థాలు టకటకా జరిగిపోతున్నాయి. ఈ విషయంలో ఆడవారు ముందంజలో వుంటారు.

కాపురానికొచ్చిన కొత్త కోడలు అత్తవారింట్లో ఏ మాత్రం కలవడానికి ప్రయత్నించకపోగా, మూలమూలకి వెళ్ళి అమ్మగారింటికి ఫోన్ చేసి మినిట్ టు మినిట్ రిపోర్టులివ్వడం – అక్కడి నుండి పుట్టింటివాళ్ళు సలహాలివ్వడం – ఆ కాపురాలు ముక్కలూ చెక్కలయి కోర్టుల కెక్కడం చూశాను.

అదే ఉత్తరమైతే రాసే లోపున మనలో ఆవేశం కొంత తగ్గుతుంది. తీరా పెన్ కాగితం మీద పెట్టేటప్పటికి కొంత విచక్షణ కలిగి ‘ఈ మాత్రం విషయం అక్కడిదాకా ఎందుకులే!’ అనిపించి ఆగిపోవడం కూడా జరుగుతుంది.

మా పనమ్మాయి మా వాచ్‍మాన్ కోడలు. పెళ్ళయి ఆరేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. అయినా అత్తమామలతో తగాదాలు రావణకాష్టంలా చల్లారకుండా రగులుతూనే వున్నాయి. నిజానికి అక్కడ అంత దెబ్బలాడుకోవాల్సిన ఘోరాలు ఏమీ లేవు. భర్త చాలా మంచివాడు. ఏ వ్యసనమూ లేదు. అత్త కూడా దుర్మార్గురాలు కాదు. కాని గొడవలు చల్లారడం లేదు. కారణం ఆమె చేతిలోని సెల్‌ఫోన్. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి ఆ అమ్మాయి మా ఇంట్లోంచి ఏడ్చి రాగాలు తీసి తల్లికి చెబుతుంది.

అంతే! వాళ్ళు ఈ అమ్మాయి ఫోన్ స్విచాఫ్ చేసేసరికి ఆగమేఘాల మీద దిగిపోతారు! మాటల యుద్ధం మొదలు!

నేను మధ్యలో సర్దిచెప్పిన సందర్భాలు ఎన్నో వున్నాయి. తాత్కాలికంగా సద్దుమణిగినా, మళ్ళీ కార్చిచ్చు రగులుతూనే వుండి చివరకు విడిపోయే స్థాయికి చేరాయి. కారణం ఆమె చేతిలో వున్న అతి చిన్న పరికరమనబడే సెల్ బాంబు.

అందుకే తిరిగి మనం ఉత్తరాలను పునరుద్ధరించుకుంటే ఎంత బాగుంటుంది!

మనసు బాగోనప్పుడు… ఒంటరితనం ఆవరించినప్పుడు వాటిని తిరిగి తిరిగి చదువుకోవడంలో ఎంత సాంత్వన లభిస్తుంది. ఒక జోలపాటలా… మనసుకి ఒక లేపనంలా!

దాని వలన మూతపడబోతున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్ తిరిగి జీవం పోసుకుంటుంది. చాలామంది నిరుద్యోగులకు వుద్యోగాలొస్తాయి.

అనవసరపు కలహాలు, అపార్థాలూ తగ్గిపోతాయి.

వెంటనే కలం అందుకుని మీ ప్రియమైన స్నేహితులకు ఒక ఉత్తరం రాయండి. జవాబు కోసం ఎదురుచూడండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here