మనసులోని మనసా-18

1
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]అ[/dropcap]సలు మన సగటు ఆలోచన విధానానికి ఆటోబయోగ్రఫీలు, బయోపిక్స్ సూటవుతాయా?

నన్ను చాలామంది స్నేహితులు “నువ్వు అనేక విషయాలు బాగా చెబుతావు. బయోగ్రఫీ రాయి” అని చెబుతుంటారు. ఒక్కోసారి నా మనసూ వురకలేస్తుంటుంది రాయాలని. కాని మన ఆలోచనా విధానం విదేశీయుల్లా వుండదు.

బయోగ్రఫీ అంటే అనేక విషయాలు దొర్లుతాయి. నిజాయితీగా రాయగల్గాలి. మనతో పాటు ముడిపడిన అనేకమంది కూడా బయటకి వస్తారు. వారి గురించి మంచో చెడో ప్రస్తావించగల్గాలి. బలాలు, బలహీనతలు, తప్పులూ, ఒప్పులు – వాటికి గల కారణాలు, సంఘటనలూ నిజాయితీగా చెప్పగల్గాలి.

అలా చెప్పినప్పుడు ఎన్నో అవాకులు, చవాకులు, విమర్శలూ ఎదురవుతాయి. వాటిని తట్టుకునే శక్తి కూడా మనకు వుండితీరాలి.

ఇటీవల ప్రముఖ నటి సావిత్రి గారి బయోపిక్ చేసిన అలజడి, అల్లరి అంతా ఇంతా కాదు.

ఆ మహానటి జీవితం ఒక విషాదం.

ఈ సినిమా రాక మునుపు మనం ఆమె గురించి కొద్దిగానే చర్చించుకునేవాళ్ళం. జెమినీ గణేశన్‌ని ప్రేమించిందని, మోసపోయిందని – ఆస్తినంతా పోగొట్టుకుని అత్యంత దయనీయంగా చనిపోయిందని.

అంతే!

ఆమె మీద అంతకు మించి మరేం ఎక్కువగా మాట్లాడుకుని ఎరుగం.

కాని చాలా దురదృష్టంగా ఆ సినిమా విడుదలయ్యేక ఆమె మీద ఒక్కసారిగా ఉప్పెనలా దాడి మొదలైంది. ప్రతివారూ ఆమె గురించి చర్చించేవారే! దుర్భాషలాడేవారే! ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎవరి స్థాయిని బట్టి వారు విమర్శించి ఖూనీ చేసినవారే!

అయ్యో అంత అద్భుతమైన నటిని, మన తెలుగువారికి దొరికిన ఆణిముత్యాన్ని ఆ విధంగా ఆడిపోసుకుంటుంటే నా మనసు దుఃఖంతో నిండిపోయేది.

నిజానికి ఆమె చనిపోయి ఎన్నో ఏళ్ళయ్యింది. ఆమె ఆస్తిని, తన హృదయాన్ని పోగొట్టుకుంది. కాని ఒక రూపాయికి ఎవరి దగ్గరా చెయ్యి చాచలేదు.

నిజానికి ఆమె ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు రోడ్డున పడలేదు. ఈ బయోపిక్ మూలాన రోడ్డున పడింది.

ఆమెను విమర్శించేవారు ఎవరూ కూడా తమ గురించి తాము ఆలోచించుకోలేదు. అందరు రాయి వేస్తున్నారు – మనమూ ఒక రాయి వేద్దామన్న సిద్ధాంతాన్ని నమ్మినవారే!

ఆమె దానధర్మం గురించి కాని – అమాయకత్వాన్ని గురించి గాని, నమ్మినవారు చేసిన ద్రోహాన్ని గురించి గాని మాట్లాడకుండా ఆమె వ్యసనాల గురించి రాద్ధాంతం చేసి చనిపోయిన ఆమె ఆత్మని నోటికొచ్చినట్లు గాయపరిచారు. ఆమె సొమ్ము తిని – ఆమెని వాడుకున్న కొంతమంది నటీమణులు కూడా ఆమె పట్ల న్యాయనిర్ణేతలు అయిపోయారు.

అలాగే ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న ఒక చిన్న అమ్మాయి అమృత గురించి.

అమృత ఒక దళితుణ్ణి ప్రేమించింది. తల్లిదండ్రుల్ని ధిక్కరించి అతన్ని వివాహం చేసుకుంది. ఇందులో విచిత్రమేమీ, కానిది – కాకూడనిది ఏమీ లేదు.

ప్రేమ వివాహాలు, కుటుంబ సభ్యుల్ని ఎదిరించి వెళ్ళి వివాహం చేసుకోవడం పురాణాల నుంచీ వున్నవే.

అత్యంత కిరాతకడు, నీచుడు అయిన ఆమె తండ్రి నిండు నెలలతో గర్భిణిగా ఉన్న ఆ అమ్మాయి ఎదుటే అతి కిరాతకంగా ఆమె భర్తని కిరాయి రౌడీలతో హత్య చేయించేడు.

ఎంత దిగ్భ్రమకి గురి చేసే సంఘటన అది!

అంత చిన్న అమ్మాయి కళ్ళెదుట రక్తపుటేరులో వున్న భర్తని చూసి ఎంత షాక్‌కి గురయి వుంటుంది? ఎంత తల్లడిల్లిపోయి వుంటుంది!

అలాంటి అమ్మాయిని ఛానెల్స్ వాళ్ళు మైకులు పెట్టి గుక్కలు పెట్టి ఏడుస్తున్న పిల్ల చేత వాగించారు.

ఇప్పటికీ నా కళ్ళలో ఆ అమ్మాయి ఏడ్వలేక ఓపిక లేక సొమ్మసిల్లిపోతూ చెప్పిన విషయాలు గుర్తున్నాయి.

కాని ఇంటర్వ్యూలు చేస్తున్న కసాయిలకి మాత్రం దయ కలగలేదు. ఆ అమ్మాయిని పగలూ రాత్రి ఛానెల్స్‌లో కూర్చోబెట్టారు.

తీరా ఎవరికి ఆమె పట్ల దయకలిగింది? ఎందరో ఆమె తండ్రి చేసినదాన్ని సమర్థించారు.

పెంచిన తండ్రిని మోసం చేస్తుందా అని గర్జించారు. ఇంకా ఇంకా నోటితో ఉచ్చరించలేని నిందలేశారు. నేనయితే నరికేస్తానని, చంపేస్తానని ప్రగల్బాలు పలికేరు.

ఎలా కూర్చోవాలో, నిలబడాలో తెలియని వారు కూడా ఆ చిన్నపిల్లని విమర్శించేరు.

నాకెంతో ఆశ్చర్యమేసింది.

అదే వాళ్ళ కూతురయితే వారిలా చేస్తారా?

ఒక జీవితం దురదృష్టం కొద్దీ రోడ్డు మీదకొచ్చింది కాబట్టి ప్రతివారు న్యాయనిర్ణేతలు అయిపోయారు!

ఒక మనిషి మరో మనిషిని దారుణంగా హత్య చేయడమేంటి? అది కదా అసలు విషయం!

కడుపున పుట్టినంత మాత్రాన చంపుతారా?

అది నేరం కాదా?

ఆ అమ్మాయి మీద సోషల్ మీడియా అంతా చర్చలు సాగాయి. విమర్శల వర్షం కురిసింది.

అసలు ఆమెను నిందించే వారికి ఆధారాలు, నిజానిజాలు తెలియవు. ఒక చిన్నపిల్ల మీద చెప్పలేని దాడి జరిగింది.

మనకు తెలియని విషయాల గురించి చర్చించేకన్నా తెలిసిన హత్య గురించి విమర్శిస్తే నేరస్థులు సిగ్గుపడే అవకాశం వుంది.

అలాగే ఇప్పుడు సింగర్ బేబీ!

అద్భుతమైన కంఠస్వరం ఆమెది!

ఎక్కడో మారుమూల కుగ్రామంలో తన కంఠస్వరం గురించి తనకే తెలియని పల్లె కోయిల! ఒక కూలి మనిషి!

ఆమె యథాలాపంగా ఒక పాట పాడింది.

అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందరూ నివ్వెరపోయారు.

ఆమెకి సంగీత జ్ఞానం లేదు. స్వరాలు తెలియవు. చదువు లేదు. కేవలం పాటని గుర్తుపెట్టుకుని పాడాలి!

ఆమెని ఎంతో ఔదార్యంతో కోటి గారు పిలిచారు.

ఆమె పాటకి ముగ్ధులైన రెహమాన్, చిరంజీవి గారు – ఇంకా రఘు కుంచె లాంటి వారు ఆమెని గౌరవించి అవకాశాలిస్తామన్నారు.

ఇది నిజంగా శుభ పరిణామం!

సంగీత జ్ఞానము, నేపథ్యమూ, అహర్నిశలూ అందులో కృషి చేసేవారికి అవకాశాలు రావడమేమీ విశేషం కాదు.

తన గురించి తనకే తెలియని ఒక అమాయకురాలికి అనుకోని అవకాశాలు వచ్చాయి. అందుకు మనమంతా సంతోషించాలి. ఆమెని ఆశీర్వదించాలి.

కళలు ఎవరి సొత్తూ కాదు. కొందరు పుట్టుకతో అదృష్టవంతులు. ఆ నేపథ్యమున్న కుటుంబాల్లో పుడతారు. చిన్నతనం నుండి తల్లిదండ్రులిచ్చే ప్రోత్సాహంతో విద్యలు నేర్చి రాణిస్తారు. అదంత విశేషం కానే కాదు.

ఆమె గాత్రంలో ఒక విశిష్టత వుంది కాబట్టే కోటి లాంటి నిస్వార్థ సంగీత దర్శకులు ముగ్ధులయి ఆమెని తీర్చిదిద్దడానికి తన కాలాన్ని వినియోగిస్తున్నారు.

అప్పుడే ఆమె మీద విమర్శలూ, అవాకులూ చవాకులూ సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

ఆమె ఊరి వారే ఆమె ప్రగతిని సహించలేక అసూయపడుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆమె పెళ్ళి గురించి రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక్కడ అవన్నీ అవసరమా? ఆమె గాత్రానికి ఇవన్నీ ఆటంకాలా!

అలా అంటే ఎంతమంది ప్రముఖుల జీవితాల్లో కథలు లేవు? అందులో నిజానిజాలు మనకి తెలుసా?

పాపం ఆమె ఖిన్నురాలాయిపోయింది.

నాకు సినీనటి ప్రభ రంగప్రవేశం చేసిన నాటి సంఘటన ఒకటి గుర్తొస్తున్నది.

నీడలేని ఆడది! ఆమె నటనకి ఆమెకి బహుముఖ ప్రశంసలు లభించేయి. ఆ ఆనందంలో ఆమె వుండగానే ఆమె మీద విమర్శలు వెల్లువలా చుట్టుముట్టేయి. అంతకుముందు సీనియర్ నటులని ఆమె తిట్టారని, హేళన చేసేరని – అలా ఆమె మీద దాడి చేసేరు.

వాటిని తట్టుకుని ఆమె చివరకి నిలబడ్డారు.

ఇలాంటి విమర్శలు ఎక్కువగా స్త్రీల మీద జరగడం కద్దు. కేరక్టర్ ఎసాసినేట్ చేసినప్పుడు స్త్రీలు సహజంగా కృంగిపోతారు.

దాన్ని అలుసుగా తీసుకుని చాలామంది దండయాత్ర చేస్తుంటారు. సంస్కారం లేని వారి సంగతి సరేసరి! మనలాంటి వారం అలాంటివి నమ్మకుండా సంయమనం పాటించాలన్నదే నా అభిమతం.

జీవితం పారే నది లాంటిది. నది స్వచ్ఛమైనదే! కానీ దాని ప్రవాహపు వాలులో అది అనేక కాలుష్యాల మీదుగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎన్నిటినో తనలో కలుపుకోవాల్సి వుంటుంది. ఎంతో ఉదాత్తంగా సాగి సాగరంలో ముగిసిపోయేవే జీవితాలు కూడా!

తాము ఎన్నుకొన్న రంగాల్లో ఎన్నో అవరోధాల్ని, అవమానాల్ని కళాకారులు ఎదుర్కొంటారు.

వాటన్నింటిని వెలికి తీసి భూతద్దంలో చూసి మన మనసు చెప్పిన రంగులేసి చిత్రించకుండా వుండడం మన సంస్కారాన్ని చాటుతుంది.

ఈ మధ్య లేటు వయసులో నా స్నేహితురాలొకామె ఒక ప్రైవేటు వుద్యోగంలో చేరి అక్కడి సాధక బాధకాలు చెప్పి బావురుమంది. నిజానికి అవి కష్టాలు కానేకావు.  ఎప్పుడూ జాబ్ చేసి ఎరుగదేమో, వాటిని చూసి పాపం తట్టుకోలేకపోయింది.

నేను బుద్ధుడు దుఃఖం లేని యింటి నుండి ఒక తల్లిని నువ్వులు తెమ్మన్న కథ చెప్పి ఊరడించేను.

కష్టం, అవమానం లేని రంగాలు వుండవు.

అందుకే ఆత్మకథలంత అవసరం లేదనిపించింది – అర్థం చేసుకునే సమాజం లభించేంత వరకు.

లేకపోతే మరింత బాధలు కొనితెచ్చుకుని మనసుని గాయపరుచుకోవడమే మిగులుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here