మనసులోని మనసా-21

0
12

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ని[/dropcap]న్న, అటు మొన్న లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నాను.

బొమ్మలు వెయ్యాలని ప్రయత్నించినా మూడ్ కుదరలేదు.

వంట్లో బాగోలేదు కాబట్టి దేవుడి సినిమా చూడలేదు.

ఆ సినిమా నిజానికి ఒక గొప్ప కళాఖండం!

అది ఆ సినిమాకి దర్శకత్వం వహించిన చిత్తజల్లు పుల్లయ్యగారు, వారి అబ్బాయి సి.యస్. రావుగారి గొప్పతనం!

ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టిన శంకర రెడ్డిగారి ధైర్యం!

ఇక నటులంతా హేమాహేమీలు.

ఘంటసాలగారి సంగీత దర్శకత్వానికి అది పెద్ద ప్రామాణికం. ఎన్నెన్ని పాటలు! ఎన్నెన్ని పద్యాలు!

ఇక ఆ సినిమాకి ప్రాణం పోసిన సీతారాముల పాత్రధారులు ఎన్.టి.ఆర్ – అంజలీదేవి గార్లు చిరస్మరణీయులు!

నిజానికి నేను నిన్న ఆ సినిమా చూసింది – చివరి సీన్ కోసం!

ఇంట్లో సి.డి వుంది కాబట్టి ఆఖరి సీనే చూడొచ్చు!

కాని.. ఆ ఇంపాక్టు వుండదు.

సీత నమ్మకం, ప్రేమ, ఓర్పు, దుఃఖం, అవమానం, భయం, తీరా భర్త వచ్చి పిలిచే సరికి ఒక్కసారిగా వుప్పొంగిన అభిజాత్యం, ఉక్రోషం – అతని ఆహ్వనాన్ని తిరస్కరించి భూదేవి వడిలో ఇమిడిపోవడం – కన్నీరు తెప్పిస్తాయి. అందులో తల్లిగా నటించిన ఎస్.వరలక్ష్మి ‘రాజట రాజధర్మమట!’ అంటూ ఆవేశంగా నటిస్తూ పాడిన పద్యం వింటే మనకూ చెప్పలేని ఆవేశం వచ్చి రాముణ్ణి తూలనాడుతాము.

ఇక్కడ రాముడు దేవుడు, అది పురాణం అనే మాటలు వదిలేద్దాం. ఆయన ఒక రాజు. ధర్మపరిపాలకుడు. ఒక పురుషుడు. ప్రజల్ని కన్న తండ్రిలా పరిపాలించాడు. ఇవన్నీ సరే! కాని తాను అత్యంతంగా ప్రేమించిన సీతని అంత నిర్దయగా అందులోనూ నిండు చూలాలిని ఎందుకు వదిలేసాడని బాధ కల్గితీరుతుంది!

రాజులకి బహు భార్యత్వం చెల్లుతుంది. అందుకు అతని తండ్రే సాక్ష్యం. కాని రాముడు ఏకపత్నీవ్రతుడిగా భాసించేడు. అది అతని నియమమో – లేక సీతలాంటి సౌందర్యవతి, ఉత్తమురాలు భార్యగా లభించేక మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడాలనిపించకపోవడమో – అప్రస్తుతం.

రాముడు – సీత మాత్రం ఒకరి కొకరుగా బ్రతికారు.

ఇద్దరూ అరణ్యవాసం చేసేరు.

భయంకరమైన దండకారణ్య మంతా తిరిగేరు.

చెల్లెలు చెప్పిన మాటకు ఉగ్రుడయిన రావణాసురుడు చెరపట్టడం – ఆమె అనుమతి లేనిదే ముట్టుకోననే అభిజాత్యంతో రావణాసురుడు పగలూ రాత్రి ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిన కథే!

అన్ని సుముద్రాలు దాటి రాముడు రాగలడో లేదో ఆమెకు తెలియదు. ఆయినా భర్త పట్ల, భర్త ప్రేమ పట్ల, భార్య పట్ల అతనికున్న బాధ్యత పట్ల ఆమెకు నమ్మకముంది.

ఆ నమ్మకమే ఆమెని గెలిపించింది.

అతను వచ్చాడు.

తీసుకెళ్ళాడు.

కాని.. ఆ శీల పరీక్ష ఏమిటి? అది నిజంగా సీతకి అవమానమే కదా! మరప్పుడే ఆమె భూమిలోకి ఎందుకు వెళ్ళిపోలేదు?

కాని సీత అలా చేయలేదు.

అగ్ని పరీక్షకి తల ఒగ్గింది.

కారణం – రాముడి గౌరవాన్ని ప్రజల్లో కాపాడాలి.

అందుకే ఆమె పునీతగా బయటకు కొచ్చింది.

మరింతా జరిగేక రాముడు తిరిగి ఆమెని నిర్దాక్షిణ్యంగా అడవుల్లో వదిలేయడం – ఈ నాటికి చాలా మందికి కోపం తెప్పిస్తుంది.

అది త్రేతాయుగం నాటి కథ!

కవులేమేమి జోడిస్తూ వచ్చారో మనకు తెలియదు.

వాల్మీకి రామాయణం రామ పట్టాభిషేకం వరకే అంటారు. మొత్తానికీ సారి సీతమ్మకి కోపం వచ్చింది.

రాముణ్ణి ఎంత బ్రతిమాలిడినా వదిలేసి తల్లి ఒడిలోకి వెళ్ళిపోయింది.

అలా తల్లి ఆదరణ అంటే పుట్టింటి ఆదరణ వుంటే చాలామంది ఆడవారు అత్తారింట్లోనే మగ్గిపోతూ ఉరి పోసుకోరు కదా! అనిపించింది నాకు. నిజానికి నేను రాముణ్ణి యిక్కడ విమర్శించడం లేదు.

రాముడు ఈనాటి రాజకీయ నాయకుడు కాదు. తనేదైనా చెయ్యొచ్చు అని భావించడానికి. తానే తప్పులు చేస్తే ప్రజలది అవకాశంగా తీసుకుంటారని ఆ యుగంలో ఆయన భావించి వుండొచ్చు. అందుకే ఆయన పురుషోత్తముడుయ్యేడు. వూరు వూరికి ఆయన మందిరాలు వెలిసేయి.

నిజానికి నేను చిన్నప్పుడు రాముడంటే యిష్టపడే దాన్ని కాదు.

అబ్బా.. ఆయనకే బోల్డు కష్టాలూ.. కన్నీళ్ళు.. ఇక మన బాధలేం తీరుస్తాడులే అనుకునేదాన్ని. కృష్ణుడంటే యమ ప్రేమ. చిన్నప్పుడు శ్రీ కృష్ణలీలలు మొదలైన సినిమాలు అదే పనిగా టూరింగు టాకీసుల్లో చూసి థ్రిల్ ఫీలయ్యే దాన్ని.

మా యింట్లో పూజామందిరంలో రామ విగ్రహాలుండేవి.

మా చెల్లెలు నా తర్వాతది ఎప్పుడూ ఆ గదిలో ఆ విగ్రహం ముందు కూర్చుని ఏదేదో మాట్లాడుతుండేది. అప్పుడు దానికి అయిదేళ్ళు. నాకు ఏడేళ్ళుంటాయి. నేను కిటికీలోంచి దాన్నే నవ్వు బిగబెట్టుకుని దాన్నే గమనిస్తుండేదాన్ని. ఎప్పుడో అది నన్ను సడెన్‌గా చూసి కోపంతో కళ్ళు రెప రెప లాడించేది.

నేను ఫక్కున నవ్వేసేదాన్ని.

“ఉండు నీ పని అమ్మతో చెబుతా” అనేది ఉక్రోషంగా.

“అది కాదే.. రాముణ్ణి కొలిస్తే ఏం ఉపయోగం లేదు. ఆయనకే చాలా బాధలున్నాయి. ఇంచక్కా కృష్ణుణ్ణి ప్రార్థించు. ఠక్కున ప్రత్యక్ష్యమవుతాడు. చిటికెలో నీకు ఏం కావాలన్నా యిస్తాడు” అని చెప్పేదాన్ని.

తర్వాత కాలంలో నేను ఎప్పుడు ఏ కారణాల వలన షిఫ్టయ్యేనో గుర్తు లేదు కాని రామ భక్తురాలిగా మారిపోయాను.

ఇప్పడిదంతా ఎందుకు చెబుతున్నానంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు నాగార్జున సాగర్‌లో పని చేసేటప్పుడు అప్పుడప్పుడు మా యింటికి మాకు అత్త వరసయ్యే ఆమె మా యింటికి వస్తుండేవారు. ఆమె చాలా సౌమ్యురాలు. నోట్లోంచి మాట వచ్చేది కాదు. దిగులుగా, కుర్చుని వుండేవారు. మా అమ్మ మాత్రం ఆమెను మందలిస్తుండే వారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని మౌనంగా కూర్చునేవారు.

అలా అప్పుడప్పుడూ ఆమె రావడం, ఆమ్మ కేకలు వెయ్యడం అలవాటయిపోయింది మాకు.

కొంచెం పెద్దయ్యేక తెలిసిందేమిటంటే ఆమె భర్త ఆమెని వదిలేసి (చట్టప్రకారం కాదు) మరొకామెని వివాహం చేసుకుని – ఇక్కడ కాంట్రాక్టులు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడని. ఈమె పుట్టింట్లో వూడిగం చేస్తూ వదినా మరదళ్ళ చేత చివాట్లు తింటూ అప్పుడుప్పుడూ ఇతన్ని యాచించడానికి వస్తుంటుంది. ఇతని వలన ఒక కొడుకు కూడా ఆమెకున్నాడు. ఆ విషయంలోనే మా అమ్మగారు ఆమెను కోర్టుకెళ్ళి మనోవర్తి పొందమని కేకలేసేవారట.

కాని.. ఆమె ఎన్నడూ బయట కొచ్చిన మనిషి కాదు. చదువు లేదు. కోర్టంటేనే భయం! అందుకని ఆమె జీవిత కాలం ఆ బాధల్ని మోసి చివరికి ఆనాథశ్రమంలో చనిపోయారని తెలిసి మనసు విచలితమయ్యింది.

ఇప్పుడు పడుకుని ఆలోచిస్తుంటే ఆ రోజున ఆమె తన ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎంత విలవిలలాడి వుంటుందో కదా అని చెప్పలేని బాధ కల్గుతుంది.

ఆర్థిక పుష్టి, సామాజిక అండ వుంటే చాలా మంది స్త్రీలు అలాంటి నిరాదరణ జీవితాన్ని గడపరు కదా!

కొంతమంది పురుషులు భార్యల్ని చాలా కించపరుస్తుంటారు. ప్రతి క్షణం అవమానిస్తుంటారు. ఆమె హృదయమేంటో, బాధేంటో ఎంత మాత్రం గ్రహించడానికి ప్రయత్నించరు.

మరి కొంతమంది పెళ్ళి పేరుతో మూడు ముళ్ళు వేసి ఇక యిది మనకి పనిమనిషి కమ్ అన్నీ అని వాడేసుకుంటుంటారు. ఇంటి పనులూ, బజారు పనులూ – ఒక్కటేమిటి అన్నీ నెత్తిన వేసి జడపదార్థాల్లా బ్రతుకుతుంటారు.

భార్యకి, ఆదరణ ప్రేమ యివ్వలేని భర్త దేనికి!

ఆమె కన్నీళ్ళు తుడవలేని అతని చేతులెందుకు!

కించిత్తు సహయం నోచుకోని ఆ సంసారం దేనికి!

కాని.. వీటిని భరిస్తూ, సహిస్తూ కాలం వెళ్ళదీస్తున్న బ్రతుకులెన్నో.

నేను భర్త చేత బాధలు పడుతున్న మా కొలీగ్‌ని అడిగేను.

“సుమతీ.. నీకు ఆర్థిక స్వాతంత్ర్యం వంది. ఎందుకిన్ని బాధలు పడుతున్నావ్.. వదిలేయెచ్చు కదా!” అని.

ఆమె విరక్తిగా నవ్వింది.

“నా కంత ధైర్యం లేదు శారదా! ఇప్పుడయితే ఒకడే విలన్. అప్పుడు చాలా మంది విలన్లు ఎంటరవుతారు. ఆ బాధలు పడలేను” అంది.

నేను ఏమీ అనలేక పోయాను.

ఇప్పుడొక కొసమెరపు!

నేను ఆఫీసుకి బయల్దేరుతుండగా ఒకామె నాకెదురొచ్చింది.

“ఎవరు నువ్వు.. ఏం కావాలి!” అని అడిగాను.

 “నా పేరు ఓంకారమ్మ, మాది కర్నూలు” అంది.

“అయితే..?” అనడిగాను.

“పని కావాలి” అంది.

“నాకు పనిమనిషి వుంది.”

“లేదు నువ్వు మంచిదానివని.. ఆదరిస్తావని కాలనీలో కొందరు చెప్పారమ్మా. నేను వున్నపాటున యిల్లోదిలేసి వచ్చినా. నువ్వే కాపాడాలి” అంది.

“ఎందుకూ?”

“నా మొగుడుత్త ఎదవ. తాగి రోజూ తంతున్నాడు. భరించలేక కట్టు గుడ్డలతో వచ్చేసాను. ఒక కొడుకున్నాడు. వాణ్ణి కూడ వాడి మొహాన పడేసి వచ్చాను. నాకు వంటొచ్చు. నీకు అన్నీ చేసి పెడతా” అని బ్రతిమాలింది.

నిజానికి నాకు యింట్లో ఎవర్నీ వుంచడం యిష్టం వుండదు. ఇంటికి తాళం వేసి ఆఫీసుకి వెళ్తాను.

ఈమె ఎవరో..

కాని.. జాలి పడి ఒప్పుకున్నాను.

అలా మూడేళ్ళుంది మా యింట్లో.

మాలో ఒకర్తయిపోయింది.

“మీ ఆయన్ని చూడాలనిపించడం లేదా!” అనడిగితే ఇంతెత్తున లేచేది.

“వాడు అరిగిపోయిన చీపురుకట్టతో సమానం! అప్పుడే పడేసే!” అనేది.

మేమంతా నవ్వితే తనూ నవ్వేది!

‘మొత్తానికి ఓంకారమ్మ ఆస్తీ పాస్తీ అండా దండా లేకపోయినా ఆత్మాభిమానం వున్న మనిషి!’ అనుకునే దాన్ని నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here