మనసులోని మనసా-26

0
10

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]తె[/dropcap]లియక చేసిన తప్పులు తెలిసి అనుభవించాలనంటారు పెద్దలు.

కొన్ని సరదాకి చేసినవి కూడా మనకి హాని కలిగిస్తాయి.

కాని చిన్న వయసులో వుత్సాహం, స్నేహితులు పురిగొల్పడంతో మనం కొన్ని తప్పులు చేసేస్తుంటాం.

అలా నేను చదువుకునే రోజుల్లో నేను చేసిన తప్పు నాకు ఫస్ట్ క్లాస్ రాకుండా చేసింది.

ఒకసారి మా హెడ్టాఫ్‌ ది డిపార్టుమెంటు హైడ్రాలిక్స్ క్లాస్ తీసుకుంటున్నారు.

హైడ్రాలిక్స్ క్లాసంటే నాకు చాలా యిష్టం. నీటితో సంబంధించిన సబ్జక్ట్సు బాగా చదివేదాన్ని. అలాగే ఇరిగేషన్ సబ్జక్టు కూడ.

ఆ రోజు మాస్టారు ఒక స్విమ్మింగ్ పూల్‌లో నీటిని ఖాళీ చేయడం గురించి డెరివేషన్ చెబుతున్నారు. చాలా పెద్ద డెరివేషన్ అది. మాస్టారికి చివరిలో తప్పు రిజల్టు వస్తున్నది. ఆయన చాలాసార్లు ప్రయత్నించారు. నేను దాన్ని అంతకు ముందే మా కజిన్ దగ్గర నేర్చుకుని వున్నాను. ఎక్కడ ఆయన తప్పుతున్నారో నాకు అర్థం అవుతూనే వుంది. చెబితే ఆయనేమనుకుంటారో అని నేను సందేహిస్తూ కూర్చున్నాను.

కాని ఆయన డస్టర్‌తో చెరుపుతూ మళ్ళీ అవస్థ పడుతుంటే ఆగలేక లేచి ఆయన ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పేసేను. మాస్టారు వెంటనే దాన్ని ఫాలో చేసేరు. రిజల్టు కరెక్టుగా వచ్చింది.

‘నువ్వెక్కడ నేర్చుకున్నావ్?’ అనడిగారు మాస్టారు.

నేను చెప్పేను.

‘అయ్‌సీ!’ అన్నారాయన. కాని మొహంలో ఒక అసహనం గమనించాను.

క్లాస్‌మేట్స్ అందరూ సంతోషించి అభినందించినా, అతి కొద్దిమంది క్లోజ్ క్లాస్‌మేట్స్ ‘ఆయన అఫెండయినట్లున్నారే’ అన్నారు.

‘ఇక చేసేదేముంది అయిపోయింది’ అన్నాను నేను.

ఆ తర్వాత అంతా బాగానే జరిగిపోతున్నది.

మాకు ఏనివర్శరీ కాంపిటిషన్స్ జరుగుతున్నాయి.

నేను ఇండోర్ గేమ్స్ ఆడేదాన్ని కాదు. గదుల్లో కూర్చుని ఆడే ఆటలు నాకు నచ్చేవి కావు. సహజంగా ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్, త్రో బాల్.. లాంటి వాటిల్లో పార్టిసిపెట్ చేసేదాన్ని.

కాని ఆ సంవత్సరం ఇమిటేషన్ మీద ఒక పోటీ పెట్టేరు. దాన్ని ఫిష్ పాండ్ అని అనేవారు. పోటీ జరుగుతోంది. అందరూ పేరిచ్చిన వారు పొల్గొంటున్నారు. మేం బాగా నవ్వుతున్నాం.

చాలా సరదా ఆయన పోటీ అది!

ఎవరికి నచ్చిన వాళ్ళని వారు అనుకరించి నవ్విస్తున్నారు.

సరిగ్గా అప్పుడే నా క్లాస్‌మేట్ ‘ఏయ్ మొద్దూ.. క్లాసులో అందర్నీ ఇమిటేట్ చేసి నవ్విస్తావ్. వెళ్ళు చెయ్యి, ప్రయిజు నీకే వస్తుంది’ అని గొడవ చేసింది. నేను వెళ్ళనంటే మిగతా కొంత మంది వెళ్ళమని గొడవ చేసారు.

“మన క్లాసుకి పేరు తేవా?” అంటూ అరవడం మొదలు పెట్టారు. అప్పుడు మా ప్రిన్సిపాల్ ‘కమాన్ శారదా’ అన్నారు.

ఇక నాకు తప్పలేదు.

నాకు ఎలాంటి ప్రిపరేషనూ లేదు.

అనుకోకుండా చేయడం.

అనాలోచితంగా ఒక స్నేహితురాలి కళ్ళద్దాలు తీసుకుని ముక్కు మీదకి జారిపోతున్నట్లు పెట్టుకుని, ఆ మునివేళ్ళ మీద నడుస్తూ ఒక పుస్తకం పట్టుకుని కాస్త వంగి నడుస్తూ వెళ్ళాను.

అంతే.

కాలేజీ అంతా గోల గోల వుషారుగా.

ఇంకే ముంది, నాలో వుత్సాహం కట్టలు తెంచుకుంది.

మా పెడ్డాఫ్ ది డిపార్టుమెంటులానే నెల్లూరు యాసలో మాట్లాడుతూ అయన అన్నట్లే మధ్య మధ్యలో ‘అయ్‌సీ అయ్‌సీ’ అంటూ పాఠం చెప్పాను.

మా ప్రిన్సిపాల్, తోటి లెక్చరర్స్ కూడా నవ్వారు.

ఆ తర్వాత మా శర్మగారి వంతు వచ్చింది.

ఆయన మా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ లెక్చరర్. ఆయన చాలా చాలా మంచివారు. పిల్లలలో కలిసి పోయేవారు. ఆయన క్లాసులో మేం అల్లరితో రెచ్చిపోయే వాళ్ళం. ముఖ్యంగా ఆ సబ్జక్టు అంటే నా కిష్టముండేది కాదు. అందుకని ఒక అరగంట ఆయనకి కబుర్లు చెప్పి పక్కదారి పట్టించే వాళ్ళం.

సాయంత్రం ఆఖరి క్లాసు వుండేది ఆయనది.

ఆయన దూరం నుండి వచ్చేవారు.

సాయంత్రం ఒకటే బస్ ఆయన ఇంటి వైపు వచ్చేది.

అందుకని మేం ‘సార్ మీ బస్ వచ్చేసింది’ అనే వాళ్ళం.

ఆయన వెంటనే బుక్స్ చంకన పెట్టుకుని ‘నేనెళ్తున్నా.. మీరూ కామ్‌గా వెళ్ళిపొండి’ అనేవారు.

నా కప్పుటికప్పుడు తోచక అదే ఇమిటేట్ చేసేసాను.

మా ప్రిన్సిపాల్ శర్మ మాస్టారి వైపు తిరిగి ‘వాటీజ్‌ దిస్ శర్మా’ అన్నారు.

అలాగ నాలుగయిదు బిట్స్ చేసిన నాకే మొదటి బహుమతి వచ్చింది.

శర్మ మాస్టారు మాత్రం ‘నా కొంప ముంచావు కదా శారదా’ అన్నారు నవ్వుతూ.

అంతకు మించి కోపాన్నేం ప్రదర్శించలేదాయన.

మా హెడ్డాఫ్‌ ది డిపార్టమెంటు ఏమీ అనలేదు.

సెకండియర్ నుండే మా క్లాస్‌మేట్స్‌లో కొంత మంది స్వభావం మారిపోయింది. హెడ్స్ వెంబడి ఎప్పుడూ ఏవో డౌట్స్ పేరుతో తిరగడం, కాకా పెట్టడం ఎక్కువయింది. వాళ్ళ చేతిలో సెషనల్స్ మార్కులు వుంటాయని – ఫస్టు క్లాసు రావడానికి అవే దోహదం చేస్తాయని తెలియని అజ్ఞానిని నేను.

మేం రికార్డ్ సబ్‌మిట్ చేసే రోజు వచ్చింది.

నేను నా రికార్డు వర్కు ముందుగా పూర్తి చేసాను.

రాత్రింబవళ్ళు నిద్రపోకుండా అతి శ్రద్దగా వర్క్ చేస్తాను.

హెవీ మెషినరీ బొమ్మలన్ని ఆర్ట్ పేపర్ మీద ఇండియన్ ఇంక్‌తో వేసాను.

ఇక డిస్క్రిప్షన్ చాలా అందంగా అచ్చు అచ్చుగుద్దినట్లు బ్లాక్ యింక్‌తో రాసాను.

నిజానికి సబ్‌మిట్ చేయడానికి మనసొప్పనంత అందంగా వుంది నా రికార్డు.

నేను హైడ్రాలిక్స్ రికార్డు సబ్‌మిట్ చేయగానే మా హెడ్డు క్లాసులో అందరికీ చూపించారు.

అందరూ “మాకు అలా ఐసోమెట్రిక్ బొమ్మలు వేయటం రాదు సర్!” అన్నారు.

 “సరే.. ఈ రికార్డు తీసుకుని చూసి వెయ్యండి” అన్నారాయన.

నా మనసు బాధతో రెపపెపలాడింది.

“సర్, రికార్డు నలిగిపోతుంది” అన్నాను గాబరాగా.

ఆయన నవ్వి “నువ్వు ముందే సబ్‌మిట్ చేసేవని నాకు తెలుసు కదా! వర్రీ కాకు” అన్నారు.

నేను గతిలేక వూరుకున్నాను.

ఎగ్జామ్స్ అయిపోయాయి.

రికార్డ్స్ స్టాఫ్ రూమ్‌లో వున్నాయి, తీసుకోమన్నారు.

అందిరోతో పాటు నేను వెళ్ళి నా రికార్డు తీసుకుని తెరచి చూసాను.

అంతే!

నా కళ్ళు నీళ్ళతో నిండి కన్నీరు జలజలా రాలిపోయింది.

ఏడుస్తున్న నన్ను ఫ్రెండ్స్ చూసి గాభరాపడి “ఏంటే ఏమయ్యింది?” అని రికార్డు చేతిలోకి తీసుకుని తెల్లబోయారు.

మా హెడ్ నా రికార్డులోని ప్రతి పేజీ మీద డయాగనల్‌గా ఆ మూల నుండి ఈ మూలకి రాసేసారు.

అందరూ తెల్లబోయి ‘ఎంత అన్యాయమే’ అంటూ ఫీలయ్యేరు.

ఎవరూ ఏం ఫీలయినా జరగవలసిన అన్యాయం జరిగిపోయింది.

నాకు సెకండ్ క్లాసే వచ్చింది.

అయతే ఉద్యోగం రావడంలో నాకిదేం హాని చేయలేక పోయింది.

నాకందరి కన్నా ముందే జాబ్ వచ్చింది.

కాని.. ఆ సంఘటన మాత్రం చాలా సంవత్సరాలు నన్ను వేధించేది.

తర్వాత ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత.. అంటే నేనొక ప్రముఖ రచయిత్రిగా గుర్తింపబడిన తర్వాత నేను ఆఫీసు నుండి మెట్లు దిగి యింటికి వెళ్తున్నాను.

ఎవరో చప్పట్లు చరచి ‘శారదా మేడం’ అని పిలిచారు.

నేను తలెత్తి అటువైపు చూశాను.

అక్కడ కొంతమందితో మాట్లాడుతున్న మా హెడ్డాఫ్‌ ది డిపార్టుమెంటు నిలబడి వున్నారు.

ఆయన రూపురేఖల్లో అంత మార్పు లేదు. జుట్టు కొద్దిగా నెరసింది.

నేను వెళ్ళి విష్ చేసాను.

సర్ నాతో చాలా బాగా మాట్లాడేరు. ఒక రచయిత్రిగా నేను సాధిస్తున్న ప్రగతిని, పేరుని చాలా పొగిడారు. ‘మన కాలేజీకి ఎసెట్’ అని, ‘మేం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం’ అంటూ చాలా సేపు నన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పాను.

మరో డిపార్టుమెంటుకి హెడ్ వుండేవారు. ఆయన మా కాలేజీలో జరిగే కల్చరర్ ప్రోగ్రామ్స్‌ని తానే పర్యవేక్షించేవారు. నేను ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా వుండేదాన్ని. ఆయన నాతో చాలా మంచిగానే వుండేవారు కాని బహుమతులు వాళ్ళ స్టూడెంట్స్‌కి రావాలని తాపత్రయ పడేవారు. వాళ్ళకే యిచ్చేవారు. అలా ఒకసారి జరిగినప్పుడు మా లెక్చరర్ ఒకరికి కోపమొచ్చి నాకు స్టేజి మీద ఆయన ఉంగరం యిచ్చేసారు.

ఒకసారి నా కాలింగ్ బెల్ మోగింది.

తలుపు తీయగానే ఆయన నిలబడివున్నారు.

ఆయనలో పెద్ద మార్పులు లేవు.

ఆయన నాకు నమస్కరించి ‘లోపలకి రావొచ్చా’ అనడిగారు.

‘అయ్యో మాస్టారూ రండి రండి’ అన్నాను ఆనందంగా.

ఆయన మాత్రం నన్ను వారి కాలేజి స్టూడెంట్‌గా కాకుండా ఒక ప్రముఖ రచయిత్రిగానే గుర్తిస్తూ వాళ్ళ కాలేజీకి నన్ను ఛీఫ్ గెస్టుగా పిలవడానికి వచ్చారు. వారిని నేను నా అంగీకారం తెలుపుతూ గౌరవించి పంపించాను.

కొందరు లెక్చరర్ మాత్రం నా అల్లరిని వినోదంగా తీసుకుని ప్రేమగానే చూసేవారు. అల్లరంటే నేను సభ్యత దాటి ప్రవర్తించలేదు.

ఏదో సరదాగా గడపడం నా ప్రవృత్తి.

ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నేను నా నవ్వుని, హాస్యచతురతని ఎన్నడూ కోల్పోలేదు.

ఎంతో మంది మా డిపార్టుమెంటు కాకపోయినా నన్ను వచ్చి కలుస్తుండేవారు.

ఏది ఏమైనా కొన్ని తొందరపాటు పనులు చేసి మనకి మనమే హాని చేసుకోకూడదు.

నొప్పింపక తానొవ్వక.. గడపడం మేలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here