మనసులోని మనసా-29

0
14

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]అం[/dropcap]తర్జాతీయ స్త్రీ దినోత్సవ సందర్భంగా ఈ మాటలు రాస్తున్నాను.

ఈ సందర్భంగా మనకు అనేక రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి వినుతికెక్కిన విదుషీమణులు, స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న నారీమణులు ఇలా ఎంతో మంది గుర్తుకు వస్తారు. ఏ సదుపాయాలూ, ఎలాంటి ప్రోత్సాహం లేని రోజుల్లో స్త్రీలు సాధించిన ప్రగతిని చూస్తే నిజంగా చెప్పలేని ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఒక్కోసారి ‘వారిలా చేయగలిగేరా ఆ పరిస్థితుల్లో కూడా!’ అని అబ్బుర పడక తప్పదు.

అయితే ఏ గుర్తింపు పొందని స్త్రీలు గొప్పవారు కాదా?

వారి వారి కుటుంబాల కోసం, వారి పిల్లల ఔన్నత్యం కోసం వారిలో వున్న బహుముఖ ప్రజ్ఞల్ని నివురులో దాచుకుని నిరంతరంగా శ్రమించ లేదా? వారందరూ గొప్పవారే కదా!

నిజానికి ఒక పాట పాడటమో, ఒక కవిత అల్లడమో, ఒక పెద్ద పదవిని అలంకరించడం కన్నా ఇలా అను నిత్యం శ్రమించి అందర్నీ అందలం ఎక్కించడం ఎంతటి త్యాగం!

ఒక గాంధీ, ఒక అబ్దుల్ కలాం – ఇలాంటి మహోన్నత వ్యక్తుల వెనుక వున్నది అమ్మే కదా!

ఇలా గుర్తుచేసుకున్నప్పుడల్లా నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ‘పాట ఆగింది’ కథలో నేను ఆమెనే గుర్తు చేసుకుంటూ రాశాను.

ఈ సారి నేను పూర్తిగా ఆమె గురించి నిజాలు చెప్పాలని ఆమెని స్మరించాలని ఇదంతా రాస్తున్నాను.

మా అమ్మగారి పెళ్ళినాటికే మా తాతగారు లేరు.

అందు వలన నాకు తాతగారసలు తెలియదు.

మా అమ్మమ్మ గారింటి హల్లో ఒక పెద్ద నిలువెత్తు పటం వుండేది.

అందులో మా తాతగారు జరీ తలపాగా పట్టు పంచె, లాల్చీ చొక్కా బటన్ నుండి జేబులో వేసుకున్న బంగారు గడియారం, చేతిలో పొన్ను కర్ర, నుదుట నిలువెత్తు నామం, బుర్రమీసాలుతో ఠీవిగా రంగూన్ నుంచి తెచ్చిన కేన్ వాలు కుర్చీలో కూర్చుని వుండేవారు. పక్కన అమ్మమ్మ పట్టు చీరలో(బ్లాక్ ఎండ్ వైట్ ఫోటో కాబట్టి ఏ రంగు చీరో తెలియదు) మెడలో కంటె, కాసులపేరు, వడ్డాణం, ఇత్యాది నగలతో నుదుట పెద్ద బొట్టుతో వినయంగా నిలబడి వుండేది. మేము అటూ యిటూ తిరిగుతున్నప్పుడల్లా, ఆ ఫోటో మా కళ్ళ పడుతుండేది.

నిజానికి ఆ ఫోటోని మేమంతా నిశితంగా పరిశీలించింది కూడా లేదు.

మా తాతగారు ఏం చేసేవారో కూడా సరిగ్గా తెలియదు.

రంగూన్ వెళ్ళి, విలువైన రత్నాలు తెచ్చి అమ్మేవారని, తరచూ షిప్‌లో బర్మా వెళ్ళేవారని చెప్పుకోవడం వినేవాళ్ళం – కాని పెద్ద ఆసక్తి వుండేది కాదు. అయితే అందరి ఇళ్ళలోనూ విలువైన రంగూన్ ఫర్నీచర్ వుండేది.

పెద్దవాళ్ళు పని గట్టుకుని ఏమీ చెప్పేవారు కాదు.

కొంత ఊహ వచ్చేక నేను అమ్మమ్మని గమనించాను.

ఆస్తిపాస్తులు పంచుకుని విడిపోయాక అమ్మమ్మ మూడో మామయ్య ఇంట్లో వుండేది.

దాదాపు అయిదడుగుల తొమ్మిందంగుళాల పొడవు, పసిమి ఛాయ, నొక్కుల జుత్తు, వెంకటగిరి జరీ చీరలు, పెద్దపెద్ద రూబీ దుద్దులు, పలకసర్లు బంగారు గాజులతో ఎప్పుడూ వంటగదిలో పని చేస్తూ మా పిల్లల తిండీ తిప్పలు చూస్తూ వుండే అమ్మమ్మ నాకు బాగా గుర్తుంది.

క్రమశిక్షణ పేరుతో మా అమ్మగారు చాలా కఠినంగా మమ్మల్ని శిక్షిస్తుంటే అమ్మమ్మ మాకు రక్షణగా వచ్చేది. అందులో ముఖ్యంగా నేను అమ్మమ్మ ఆశ్రయం తీసుకునేదాన్ని. మేం పిల్లల గాంగ్ చాలా మంది వుండే వాళ్ళం. వంటగదులు వెనుక వైపు విడిగా వుండేవి. అక్కడా గాడిపొయ్యల్లా నాలుగైదు పొయ్యల మీద వంట చేస్తూ ఆ వెలుగులో నిలువెత్తు కాగడాలా మెరిసిపోతూ వుండేది అమ్మమ్మ.

కొంత వూహ వచ్చేక తాతయ్య అమ్మమ్మల ఫోటోలో వున్న పురుషాదిక్యత నాకు కొట్టొచ్చినట్లు కనబడేది. ఒక సున్నతమైన స్త్రీని అలా నించోబెట్టి, శారీరక బలాఢ్యుడయిన మగవాడు దర్జాగా కూర్చీలో కూర్చోవడం నాకు చాల ఎబ్బెట్టుగా తోచేది. ఆ సంగతే అడిగితే ‘కళ్ళుపోతాయ్, అలా వాగకు’ అని మందలించేది పాపం పిచ్చి అమ్మమ్మ. అయినా నేను అంటూనే వుండేదన్ని.

అమ్మమ్మకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు.

అయితే ఆమెని బాగా చూసుకున్నది మా మూడో మావయ్య, మా నాలుగో మామయ్య, మా అమ్మగారు మాత్రమే.

ఆమె ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళిన దాఖలాలు కానీ, వాళ్ళు అమ్మమ్మ కోసం వచ్చినట్లు గాని నేనెప్పుడూ చూడలేదు. ఒక్కసారి మా అక్క (పెద్దమ్మ కూతురు) పెళ్ళికి ఆమె తమ్ముడు, అక్కగారు రావడం చూసాను. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. అయిదేళ్ళ వయసు. అయినా అమ్మమ్మ నన్ను దగ్గరికి పిలిచి “ఏవే శారదా ఇలారా” అని పిలిచి పరిచయం చేసింది. అప్పుడు అమ్మమ్మ కళ్ళు ఎంతగా మెరిసాయో నాకు బాగా గుర్తుంది. తిరిగి ఎన్నడూ వాళ్ళని చూడలేదు.

ఒక సారి మేము కాలేజీలో చదివే రోజుల్లో అమ్మమ్మ గారింటికి ఒక జ్యోతిష్యుడు వచ్చాడు. హాల్లో (వెనుక వైపు) చాపలు వేసి – మా యింటి ఎదురుగా వుండే దూరపు బంధువులు, మా దొడ్డమ్మ, మా అమ్మగారు, తదితరులంతా చేతులు చూపించుకుంటున్నారు. ఎప్పుడూ అటువంటి చోట్లకి మా పిల్లలకి నిషిద్ధం. అసలు మా తరానికి మా పూర్వీకుల విషయాలు తెలియక పోవడానికి కారణం ఈ పెద్దలే! వాళ్ళ దృష్టిలో పిల్లలకి అన్ని నిషిద్దమే!

సరే.. మేం మాత్రం వూరుకుంటామా!

గుప్పిట బిగించే కొలది అందులో వున్నది తెలుసుకోవాలన్న ఆసక్తి పెరగడం సహజం కదా!

పక్క గదిలో గప్ చిప్‌గా జేరేం.

అతనేవో జరగబోయేవి చెబుతున్నాడు.

‘నీ రెండో కూతురు (నేనే) మెడిసెన్ చదువుతంద’ని మా అమ్మగారికి చెప్పగానే నేను కిచకిచ నవ్వబోయేను కాని మా మణక్క నా మూతి మీద ఒక్కటి కొట్టి ‘ష్’ అంది.

ఇక అమ్మమ్మ వంతు వచ్చింది.

‘నీకు ముగ్గురు కొడుకులు – ఇద్దరు కూతుళ్ళు’ అని చెప్పేడతను. ‘తప్పు చెప్పేడు, తప్పు చెప్పేడు’ అని ఎగిరి గంతేయబోయే లోపున అక్కడందరూ అవునన్నట్లుగా తల పంకించేరు.

మేం తెల్లబోయాం. చాలా అసంతృప్తిగా, అసహనంగా అనిపించింది మా పిల్లల సైన్యానికి.

అప్పటికి ఓపిక పట్టి మా యింటి ఎదురు వరసకి అత్తయ్యే చంద్రకాతం అత్త దగ్గర కెళ్ళి ఆరా తీసేం. ఆవిడ పిల్లలతో చనువుగా సరదాగా వుండేది.

అడగ్గా అడగ్గా ఆవిడ భయపడుతూనే ‘తెలిస్తే నన్ను చంపేస్తార్రా’ అంటూ మా పెద్ద మామయ్య సవతి కొడుకని, పురిట్లోనే తల్లి చనిపోతే మీ తాతగారు రెండో పెళ్ళి చేసుకున్నారని, ఇప్పుడు మీ అమ్మమ్మ పేరు ఆ మెదటి భార్యదేనని చెప్పుగానే మే షాకయ్యేం.

అమ్మమ్మ మా పెద్దమావయ్యని చాలా అపురూపంగా ప్రేమగా ప్రత్యేక శ్రద్ధతీసుకుని పెంచిందని, కాకినాడలో కాలేజీలు వున్నా, సంపన్న వర్గాలు హోదా ప్రదర్శించుకోవడానికి మద్రాసులో చదివించినట్లు అక్కడ చదివించేరని తెలిసి విస్తుపోయాం. చంద్రకాంతం అత్తకిచ్చిన మాట ప్రకారం మేం కూడా తెలియనట్లే ప్రవర్తించాం.

తర్వాత కాలంలో ఆయన తహసిల్దారు చేసి డెప్యూటీ కలెక్టర్ హోదాలో రిటైరయినా ఒక్కనాడు తల్లి మొహం చూడలేదు. పది రూపాయలు తల్లికివ్వ లేదు.

ఆయన ఎంత స్టయిల్‌గా జీవించేవారో నా కిప్పటికీ గుర్తే.

ఆయనకి ‘టై’లకి, ‘సూట్స్‌’కి, ‘హేట్స్‌’కి ప్రత్యేకమైన స్టాండ్సు వుండేవి. హంటింగ్‌కి వెళ్ళేవారు. గుర్రపు స్వారీ చేసేవారు. కానీ.. తల్లి మొహం ఏనాడూ చూడలేదు.

ఇక రెండో కొడుకు అనబడే పెద్ద కొడుకు మునిసిపల్ కమీషనర్ హోదా వెలగబెట్టి తల్లి పట్ల నిర్దయగానే వుండేవారు. మా పెద్దమ్మని కలవడానికి వచ్చి చిన్న పలకరింపు కోసం గుమ్మం పట్టుకుని నిలబడ్డ తల్లి వైపు చూడకుండానే వెళ్ళిపోతుంటే కన్నీటిని ఆపుకుని తిరిగి తన మంచమ్మీద కూర్చుని కుమిలిపోయే అమ్మమ్మ నాకు బాగా గుర్తుంది. నేను వెళ్ళి గడ్డం పట్టుకుంటే “చూడవే.. నేనేం డబ్బుల కోసం నిలబడలేదు. తల్లిని పలకరించకుండా వెళ్తున్నాడు” అని ఏడ్చేది. మనుష్యుల్లో ఇంత కాఠిన్యం, నిర్దయ, కృతఘ్నత ఎలా వస్తాయో నా కిప్పటికీ అర్థం కాని విషయం.

మా నాన్నగారు వేరే చోట జాబ్ చేస్తుండగా మేం కాలేజీ చదువుల కోసం కాకినాడలో వున్నాం. అప్పుడు అమ్మమ్మని మా అమ్మగారు తీసుకొచ్చి మా యింట్లో వుంచుకునేవారు. అలా అమ్మమ్మ నాకు బాగా సన్నిహితురాలయ్యింది.

ఒక సారి మా అమ్మగారు మా చిన్నతనంలో నాగార్జున సాగర్ మా యింటికి తీసుకొచ్చేరు. అదీ చాలా బలవంతంగా. కారణం ఆమె అల్లుళ్ళకి కనబడదు. అది వాళ్ళ ఆచారం. ఎంత చెప్పినా వినేది కాదు. అలాగే ఆమె వున్నంత కాలం మా నాన్నగారి మకాం ఆఫీసులోనే. నాగార్జున కొండ చూపించాలని మేం అంతా కారులో వెళ్ళేం. మా నాన్నగారు మరో కారులో వచ్చారు. సడెన్‌గా అమ్మమ్మ కారు దిగినప్పుడే మా నాన్న కారు దిగేరు. ఇక చూడాలి ఆ గొడవ! అమ్మమ్మ ఏడుస్తూ తిరిగి కారెక్కేసింది. ఇక చూసిందేమీ లేదు. కారులో ‘నేను అల్లుడికి కనబడిపోయాను, చచ్చిపోతాను’ అని. నాకు నవ్వు తన్నుకొస్తున్నది. అమ్మ నవ్వద్దని కళ్ళెర్ర జేసింది. ఇంటి కొచ్చేక గదిలో పడుకుని తలుపేసుకుని ఏడుపు అన్నం తినలేదు. అమ్మ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. చివరకి మా నాన్నగారు గొడవతల నిలబడి ‘నేను మీ కొడుకులాంటి వాడిని. ఎందుకలా బాదపడుతున్నారు. భోంచేయండి’ అని చెబితే అది విని ఏడుపు రెట్టింపు చేసేసింది. చివరికి చేసేది లేక అమ్మ తీసుకెళ్ళి కాకినాడలో వదిలేసింది.

అమ్మమ్మ చివరి రోజుల్లో మా యింట్లోనే వుంది. తను ఆరోగ్యంగా వుండగానే తన మరణం గురించి చెప్పింది. ఒక రోజు వెంకటగిరి చీరలబ్బాయి వచ్చాడు. అమ్మమ్మ పొడగరి కావడంతో చీరలు ప్రత్యేకంగా నేయించేవారు. అమ్మ తనకి చీరలార్డర్ యివ్వబోతే “నీకు పిచ్చా, నేను వచ్చే నెలలో చచ్చిపోతాను” వద్దు అని చెప్పింది ఎండకి మెట్లమీద కూర్చుని తలదువ్వుకుంటూ అమ్మకి కోపం వచ్చి తిట్టింది పిచ్చిమాటలు మాట్లాడొద్దని.

అలాగే చుట్టాలెవరో పెళ్ళకి పిలవడానికొచ్చి అమ్మమ్మని కూడా రమ్మంటే ‘వధూవరులకి నా ఆశీర్వాదాలు, నేను అప్పటికుండన’ని చెప్పింది. వాళ్ళంతా విషయం తెలుసుకుని నవ్వి వెళ్ళిపోయేరు.

ఆ మరుసటి నెలలో నేను టెక్నికల్ టూర్‌కి వెళ్తూ రిక్షా ఎక్కుతుంటే పరుగున వచ్చి “ఏవే శారదా ఎప్పుడొస్తావో ఏమో.. నువ్వొచ్చే సరికి నేనుండనే!” అని చెప్పింది.

అమ్మ వెంటనే అమ్మమ్మని కేకలేసి “శుభమా అని అది వూరెళ్తుంటే ఏంటా మాటలు!” అని.

“మరేం చెయ్యను. అది వచ్చేటప్పటికి వుండను కదా” అంది.

నేను అమ్మమ్మని కౌగలించుకుని “నువ్వెక్కడికీ వెళ్ళవు. నా చదువయిపోయాక ఉద్యోగమొస్తుంది. నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను” అన్నాను ఊరడింపుగా.

నేను టూర్ నుండి వచ్చేసరికి అంతా అయిపోయింది.

అమ్మమ్మ ఎంతటి సత్యసంధురాలో కాకపోతే ఆరోగ్యంగా వుంటూనే తన మరణం గురించి చెబుతుంది!

అలా అమ్మమ్మకి సేవ చేసే అవకాశం నాకు రానేలేదు.

అందుకే నా మనసులో అణగారిన తీరని కోరికని కథారూపంలోకి మలచి “పాట ఆగింది” కథ రాశాను.

ఇలా తమ వునికిని కోల్పోయి పరుల కోసం వెలిగి పోయిన ఉత్తమ స్త్రీలెంత మందో ఇంటింటికీ వుంటారు.

స్వార్థమెరుగని ఆ తల్లులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నమస్కరిస్తూ ఈ ‘కాలం’ ముగిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here