మనసులోని మనసా… 3

5
13

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]వి[/dropcap]ధి చాల విచిత్రమైనది.

అది మనిషిని అందలం మీద కూర్చోబెడుతుందో… ఎప్పుడు విసిరి పాతాళంలోకి విసిరి పడేస్తుందో చెప్పలేము.

కాని… మనిషి ఆ విషయాన్ని విస్మరించి క్షణికంలో దొరికిన పదవినో, డబ్బునో చూసి గర్వపడతాడు. ఏ కళ్ళద్దానికి లొంగని అంధత్వం కళ్ళకి పట్టేస్తుంది. అయన వారిని కూడ చులకన చేసి మాట్లాడి అగౌరవ పరుస్తారు. నాలుక మీద తుమ్మముళ్ళు మొలుస్తాయి. ఒక సారి తుళ్ళిపాటులో తూలిపడితే అంతే సంగతులు!

అడుగు దొరకని అధఃపాతాళమే!

నాకెప్పుడూ జవాబు దొరకని ప్రశ్న ఏమిటంటే మనిషికి సుఖంగా వుండటానికి ఎంత డబ్బు కావాలి!

ఇప్పుడంటే కార్పోరేట్ కాలేజీలు, కార్పోరేట్ ఆస్పత్రులు వచ్చి సగటు మనిషిని పిప్పి చేస్తున్నాయి కాని ప్రభుత్వ పరిధిలో వున్నంత కాలం మనిషి హాయిగా జీవించాడు. ఎవరి ఆదాయాలతో వారు మరొకరితో పోల్చుకోకుండా సుఖంగా బ్రతికారు.

ముందు నుండీ నేను ధనిక వాతావరణంలో ఇమడలేకపోయేదాన్ని. అక్కడ వారి మాటలు నాకసలు రుచించవు. ఆక్సిజన్ అందనట్లు ఫీలయ్యేదాన్ని.

నా చిన్నప్పుడు మా అక్కయ్యలకు పైడా జమీందారు గారమ్మాయిలు, రామచంద్రపురం జమీందారుగారమ్మాయిలు క్లాస్‌మేట్స్. అప్పుడప్పుడూ వాళ్ళు మా యింటికి వస్తుండేవారు. మా పెద్దనాన్నగారు కూడ హోదా, డబ్బు వున్న వారు కావడంతో వీళ్ళకి స్నేహాలు కుదిరేయామో నాకు తెలియది. వాళ్ళు సింపుల్‌గానే వుండేవారు.

నేను చిన్నదాన్ని కావడంతో అవన్నీ పట్టంచుకునేదాన్ని కాదు. నాదసలు వేరే ప్రపంచం. మా యింటికి వెనుక చాలా పెద్ద పెరడు వుండేది. అందులో రకరకాల మొక్కలు, చెట్లు వుండేవి. నేను వాటి మధ్య తిరుగుతుండేదాన్ని. ఏదయినా ఎడ్వంచర్స్ చేయాలని కొత్తదేదయినా కనిపెట్టాలని మనసు విశ్వప్రయత్నం చేస్తుండేది. బంకమట్టి తెచ్చి బొమ్మలు చేయడం, ఆకు పూల పసర్లతో బొమ్మలకి రంగులు వేయడం లేదా ఒక్కదాన్నే డాన్సులు చేసుకోవడం… ఇలా చాలా బిజీగా వుండేదాన్ని.

ఎప్పుడూ, మట్టిగొట్టుకుని చింపిరి జుట్టుతో తిరుగుతుండే దాన్ని నాకు భేషజాలు, ఫాషన్స్ అసలు పట్టేవి కావు.

అప్పుడప్పుడూ మా అక్కల ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీళ్ళంతా ఒక గదిలో చేరి తలుపులు బిడాయించుకునేవారు. అందరూ ఎత్తుగా సన్నని నడుములతో అందంగా వుండేవారు.

ఎప్పుడయినా ఏదయినా కావాలంటే నన్ను తలుపు కొద్దిగా తెరచి తెచ్చిపెట్టమని బ్రతిమిలాడేవారు. నేను తేగానే తలుపు సందులోంచి తీసుకుని మళ్ళీ మూసేసేవారు. నన్ను మాత్రం లోపలికి రానిచ్చేవారు కాదు. ఇదంతా మ పెద్దనాన్నా, దొడ్డమ్మ కేంపుకి వెళ్ళినప్పుడు జరుగుతుండేది.

నేను కొంచెం పెద్దయ్యేక అర్థమయింది నన్ను చెల్లెలిగా చెప్పడం వాళ్ళకి నామోషి అని. అందుకు నేను బాధపడింది కూడా అసలు లేదు.

మా యింట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఒకామె వచ్చేవారు. ఆమె నాకు చాలా బాగా గుర్తుండిపోయారు. డైమండ్ నగలు, ఖరీదైన చీరలు కట్టుకుని వచ్చే చాలామంది ఆడవారిలో ఆమె ప్రత్యేకంగా కనపడేవారు. ఆమె జరీలేని వెంకటగిరి చీర కట్టుకుని చేతి నిండా ఎర్రరంగు మట్టిగాజులు వేసుకునేవారు. మెడలో నల్లపూసల మధ్య చిన్న పెండెంట్ వుండేది. చెరగని చిరునవ్వుతో గోడవార చాప మీద కూర్చుని పలకరించిన వారికి జవాబులిస్తుండేవారు. నేను అటూ యిటూ తిరుగుతూ ఆమెనే చూస్తుండే దాన్ని.

చివరికి ఒక రోజు దొడ్డమ్మని  ‘ఆవిడెవరు?’ అనడిగేను. “వాళ్ళు జమీందార్లే. అతను ఆస్తిని తగలబెట్టి, తాగి చచ్చిపోయాడు. ఆమె ఇప్పుడు వున్నదాంట్లో పిల్లల్ని చదివిస్తున్నది”  అని చెప్పింది.  “ఎందుకే ఆవిడ గురించి అడిగేవు” అంది నవ్వుతూ.

“ఈ రోజు వచ్చిన అందరిలోకీ ఆవిడే దర్జాగా వున్నారు దొడ్డమ్మా” అన్నాను నేను.

దొడ్డమ్మ నవ్వింది “నీకు అన్నీ బాగానే తెలుసే!” అంటూ.

నేను కాలేజీలో చదివే రోజుల్లో మా చర్చ్ స్క్వేర్ వీధిలో అతి కష్టంగా మలుపులు తిరుగుతూ ఓ పడవంత కారు తరచూ మీ యింటి కొచ్చేది. దాని పేరు ఇంపాలా ఛెవర్లెట్ అని తర్వాత తెలిసింది. ఆ కారు కాకినాడలో ఎవరికీ లేదు.

ఆ కారు లోంచి ఖద్దరు బట్టలు ధరించి పల్చటి తెల్ల జుట్టుతో ఒకాయన దిగేవారు. ఆయనపేరు నాయుడు. ఆయన సీలేరులో పనులు చేస్తున్న క్లాసు వన్ కాంట్రాక్టరు. మా బావగారి కోసం తరచూ వస్తుండేవారు.

ఒక సారి ఆయనలానే వచ్చి మా హాల్లో కూర్చున్నారు. ఎవరొచ్చినా ఏమీ పట్టని నేను మొక్కల్లో తీవ్రంగా డాన్సు చేస్తున్నాను. ఆయన్నసలు గమనించలేదు.

“మొక్కల్లో డాన్సు చేస్తున్న ఆ పిల్లెవరూ!” ఆయన మా బావగార్ని అడిగేరట.

ఆయన నవ్వుతూ “మా పిన్నత్తగారి కూతురండి” అని చెప్పారట.

‘దాన్నొకసారి ఇటు పిలవండి’ అన్నారట ఆయన. బావగారు ‘ఏవే శారదా, ఇలారా’ అని పిలిచారు.

ఆయన పెళ్ళికి నేను అయిదు సంవత్సరాల పిల్లని. నా చేతనే ఆయనకి చితపిక్కల బొబ్బట్లు, ఉప్పువేసిన కాఫీ ఇత్యాదివి ఇప్పించి మర్యాదలు చేయించారు.

నేను వెళ్ళి నిలబడ్డాను.

“డాన్సు బాగా చేస్తున్నావే. సినిమాల్లో చేస్తావా… ఇప్పిస్తాను” అన్నారు.

నా కళ్ళు ఆ మాట విని మెరిసేయి కాని మా బావగారు కంగారుగా చుట్టూ చూసి “గట్టిగా అనకండి. విన్నారంటే ఇప్పుడే మా వాళ్ళు చంపేస్తారు” అన్నారు.

ఆయన చిత్రంగా చూసి “తప్పేముంది. కళ్ళవి పెద్దగా వున్నాయి. పనికొస్తుంది!” అన్నారు.

“టాపిక్ మార్చండి సార్!” అని ఆయనతో అని, “నువ్వు లోపలకి పోవే” అన్నారు నన్ను.

నేను వచ్చిన ఛాన్స్ పోయినట్టు బాధపడి లోపలికెళ్ళిపోయాను.

ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకి నాయుడి గారి ఆస్తంతా పోయిందని, చితికి పోయారని తెలిసి చాలా బాధపడ్డాను.

ఒకసారి మా అక్క నేను నెల్లూరు పెళ్ళికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిందగ్గర్నుండీ నాయుడుగారిని చూడాలనిపించింది.

“ఇంకా వున్నారా, వుంటే ఎక్కడున్నారో…” అని అక్క నేనూ అనుకున్నాం.

మేము వచ్చింది సుపర్నెంటెండింగు ఇంజనీరు గారి అమ్మాయి పెళ్ళి కాబట్టి ఎడ్రస్ రాబట్టేం. ఆయన వున్నారన్న విషయం విని రిలీఫ్ ఫీలయ్యేం.

ఇద్దరం ఆ పల్లెటూరు వెళ్ళాం.

ఆయన్ని చూస్తూన్నామంటే ఎంతో ఉత్కంఠ!

కారు వెళ్ళి ఒక పెద్ద పాక ముందు ఆగింది. దాని చూరు చాలా క్రిందికి దిగి వుండటంతో మనుషులెవరూ కనబడటం లేదు.

డ్రైవరు వెళ్ళి చెప్పడంతో నాయుడు గారు బయటకి తల వంచి పాకలోంచి వచ్చి కారు దగ్గరగా వచ్చారు.

మేము వస్తున్న కన్నీళ్ళు ఆపుకుని ఆయనకి నమస్కరించాం. అదే చిరునవ్వు! అలానే వున్నారాయన. కాకపోతే సన్నబడ్డారు.

మమ్మల్ని ఆ పాకలోనే కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. పెద్ద బాండిలో ఆయన భార్య పచ్చి మిర్చి బజ్జీలు, పునుకులు పకోడీలు చేస్తున్నారు. మాకు అర్థమైంది. ఆమె మమ్మల్ని చూసి నోరంతా తెరచి సంతోషంగా నవ్వారు. గుర్తుపెట్టుకుని వచ్చినందుకు ఎంతగానో సంతోషించారు.

చూస్తుండగానే స్వీట్లు, కూల్‌డ్రింక్స్ వచ్చేసేయి.

“నువ్వు ఇంజనీరు వయ్యావా? చాలా సంతోషం!”  అన్నారాయన.

మాకేం మాట్లాడటానికీ తోచలేదు.

ఇద్దరూ నవ్వుతూ మాకు చీరలు రవికలు గుడ్డలు పళ్ళు యిచ్చి బొట్టు పెట్టారు.

ఎంతో ఆనందంగా మమ్మల్ని సాగనంపారు. కనిపంచినంత మేర వాళ్ళని కన్నీటితో చూశాం.

నా కప్పుడనిపించింది ‘కోట్ల ఆస్తి పోగొట్టుకొని బజ్జీలు అమ్ముతున్నా ఆయన కన్నా ధనికుడెవరని!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here