మనసులోని మనసా-32

2
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఒ[/dropcap]కసారి నేను యింటికి వచ్చేసరికి గుమ్మంలో కొన్ని చెప్పుల జతలు కనిపించాయి. వంశీ అప్పుడు ఇక్కడ లేడు. అందువలన వంశీ ఫ్రెండ్స్ వచ్చేరని అనుకోవడానికి లేదు. ఎవరా అనుకుంటూ చూసేసరికి టెన్త్ చదువుతున్న నా కుతురు బిక్కమొగమేసుకుని నా వంక చూసింది.

వాళ్ళంతా నా ముందుగదికి సీల్ వేస్తున్నారు.

నేను ఆశ్చర్యపోయి “ఎవరు మీరు? ఏం జరుగుతోంది?” అనడిగాను.

“మేము ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ నుండి వచ్చాం. మీరు ఫలానా ఆవిడకి షూరిటీ సంతకం పెట్టారు. ఆవిడ కట్టడం మానేసారు” అన్నారు వాళ్ళు.

నేను నిర్ఘాంతపోయాను.

“ముగ్గురి షూరిటీల్లో నేకొకర్తిని. మీరు ఒక నోటీసు కూడా ఇవ్వకుండా యిలా చేయడం అన్యాయం” అన్నాను.

“వాళ్ళెవరూ దొరకలేదు మేడం. ఏదయినా వుంటే మా ఆఫీసు కొచ్చి మాట్లాడండి” అని వెళ్శిపోయారు.

మొదటిసారి చాలా అవమానమనిపించింది. ఎప్పుడూ అప్పు చేయడం, దాన్ని తీర్చలేకపోవడం నా జీవితంలో లేదు.

కుప్పకూలి కూర్చీలో కూర్చుండి పోయాను,

చివరికి లేచి ఆమెకు ఫోను చేసేను.

జవాబు లేదు.

ఆమె ఫ్రెండ్స్‌కి ఫోను చేసేను,

“మాకు తెలుసు ఆమె సంగతి. మీరు వినకుండా సంతకం పెట్టారు” అన్నారు వాళ్ళు.

నిజానికి అప్పుడు నేను కొంత ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాను. ఇవ్వడమే కాని తిరిగి రాబట్టుకోవడం రాని నేను చాలాసార్లు నష్టపోయాను. అయినా ఇచ్చే బుద్ధి పోలేదు నాకు.

మర్నాడు చిట్ ఫండ్ ఆఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఆమె కట్టవలసిన మొత్తం కడితే లాక్ ఓపెన్ చేస్తామన్నారు.

బ్యాంక్ కెళ్ళి నా బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బు కట్టేను. వాళ్ళు తాళం తెరిచారు.

ఆమె చాలా రోజులు ఆఫీసుకి కూడా రాలేదు.

ఆమె సరిగ్గా ఎప్పుడూ ఆఫీసుకి వచ్చేది కాదు.

అసలు జరిగిందేమిటంటే ఆమెకు భర్త, ఇద్దరు వుద్యోగాలు చేసే పిల్లలు వున్నారు. ఆమెది లవ్ మారేజ్. ఎక్కడ చెడిందో ఏమిటో ఆమెకి అతనికీ పడదు. ఒకే యింట్లో వుంటారు. ఎవరి వంట వారిది. పిల్లలు బాంబేలో మంచి ఉద్యోగాలే చేస్తున్నారు. వారి గురించి ఈమె సంతోషంగా చెబుతుంది. కాని.. వాళ్ళు ఈమెకేమీ ఆర్థికంగా సహాయపడరు. ఆమె ఇంటి కోసమే అప్పులు చేసింది. దుర్వ్యసనాలేమీ లేవు. కాని తీరా కట్టవలసిన టైముకి ఆమె కట్టలేకపోయింది. ఆ కేసు కోర్టుకెళ్ళింది. కేసు నడిచింది. ఆమెకి వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఆసారి కట్టకపోతే ఆమె అరెస్టయి జైలు కెళ్తుంది. ఉద్యోగం పోతుంది. ఆ టైంకి ఈ చిట్ పాడి కట్టలేకపోతే జైలే ఆమెకు గతి. ఆమె అందరి చుట్టూ తిరిగింది. అందరూ కుదరదన్నారు.

ఒక రాత్రి పూట ఆమె నా యింటికి పరిగెత్తుకొచ్చింది.

షూరిటీలంటే అందరికీ భయమే.

నేను మొదట సందేహించినా ఆమె జైలుకి వెళ్తుందన్నది భరించలేకపోయేను. జాలి పడి సంతకం పెట్టాను. ఆమె శిక్ష తప్పించుకుంది గాని ఆ డబ్బు నాకు తిరిగి యివ్వలేక పోయింది.

నేను ఆమెను నిందించలేక పోయాను.

కాని… ఇంట్లో మాటలు పడ్డాను.

అయినా ఎలాగోలా బ్యాంక్‌కి కొద్ది కొద్దిగా పే చేస్తూ నగలు విడిపించాను. నగలు పెద్దగా పెట్టుకునే అలవాటు లేదు. కాని.. అమ్మాయికి ఇవ్వాలి కదా అని కొన్నాను.

చిన్నతనం నుండి డబ్బు దాచడం – జాగ్రత్త పడటం నాకు తెలియదు. అది వెర్రి అనుకునే వారందరూ. సర్వీసులో జాయినయినప్పుడు జీతాలు చాల తక్కువ. అయినా ఒక వంద రూపాయలు మిగిలితే “నా దగ్గర వందున్నాయి, ఎవరూ అడగలేదు” అని నవ్వేదాన్ని. అలాగే ఇచ్చేసే దాన్ని.

వరుసకి ఆడపడుచు అయ్యే అమ్మాయి భర్త సడెన్‌గా చనిపోతే ఆ అమ్మయిని ఆస్తి యివ్వకుండా మోసం చేసేరు అత్తగారు వాళ్ళు. ఆ అమ్మాయి పలుకరించడానికి వెళ్తే మా కాళ్ళకు చుట్టుకుని ఏడ్చంది. ఏదో చిన్న షాపు పెట్టుకుంటానంటే నేను నా జవ్వారి (హహ్హహ్హ) బాంక్‌లో పెట్టి డబ్బు యిచ్చేను. ఆ అమ్మాయి తిరిగి యివ్వలేకపోయింది. మళ్ళీ వచ్చి ఆ డబ్బు సరిపోలేదని ఇంకా కొంత కావాలని అడిగింది. అప్పుడు నా దగ్గరేమీ లేదు.

అమ్మాయి పెళ్ళి చేసేను అప్పుడే. అడిగిన వాటి కన్నా ఎక్కువే ఇచ్చాను. అయినా నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు వాళ్ళు. ఇలాంటి వ్యవహారాలలో లౌక్యం తెలియని నేను చాలా కష్టాలు పడ్డాను. అలాంటి తరుణంలో ఈమె నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ఎక్కడన్నా వడ్డీకన్నా యిప్పించమంది. నాకు తెలిసిన పోలీసాఫీసరుగారి భార్య వడ్డీకి అప్పులిస్తారు. “నువ్వు ఖచ్చితంగా వడ్డీ కట్టాలి. ఈ సారి నన్ను ఇబ్బంది పెట్టకు” అని చెప్పాను.

బుద్ధిగా తలూపింది.

అంతే, రెండు సంవత్సరాలు కనబడకుండా దాక్కుంది.

ఉత్తరాలకి జవాబు లేదు.

చివరికి అంతా నేనే కట్టాను.

ఇప్పుడు హైద్రాబాదులో సెటిలయి ఇల్లు కొనుక్కుంది కాని. ఇప్పుడు నేను విరోధిని. మా యింటికి రాదు.

ఇలా చెబితే ఎన్నో.

హైద్రాబాదు వచ్చాక నా యిల్లు ఒక సత్రం.

అందులో సెంటర్‌లో వుంది మా క్వార్టర్స్.

హాస్పటల్స్‌కని, ఆఫీసు పనులని, పిల్లల చదువులని ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రతి రోజూ వస్తూనే వుండేవారు.

ఎప్పుడూ వాళ్ళకి సేవలు చేసి, వాళ్ళకి మంచాలచ్చి క్రింద పడుకోవటమే.

చివరికి ఎన్నో నిష్ఠూరాలు!

నా ఇన్‌ఫ్లూయన్స్‌తో ట్రాన్స్‌ఫర్స్‌కి, వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి పనులు కూడా చేయించుకునే వారు.

పిల్లలు పెద్దయ్యే కొలది కొంత అసహనం ప్రదర్శించినా ఏమీ అనేవారు కాదు.

ఇప్పుడు మనకి మాట సహాయానికి కూడా ఎవరూ కనిపించరు.

నేను మొదటి నుండి ఆత్మాభిమానంగానే వున్నాను.

ఎప్పుడూ ఎవరి దగ్గరా చెయ్యి చాచని స్థితి ఆ దేవుడు నాకిచ్చినందుకు సంతోష పడుతూనే వుంటాను.

ఎప్పుడూ నాకు ఆశ్చర్యం ఒకటే.

మనుషులెందుకు చేసిన సహాయం మరచిపోతారు.

ఒకసారి నా మొదటి సర్వీసులో నాతో పని చేసినామె నేను ఆఫీసుకి బయల్దేరుతుండగా గేటు మీద నుండి ‘శారదా శారదా’ అని కేకలు వేయడం మొదలు పెట్టింది. ఆమె టైపిస్టు. ఆమె బిహేవియర్ బాగుండక ఎవరం ఆమెతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. అయినా ఆమె పనిగట్టకుని మా డ్రాయింగ్ బ్రాంచ్ లోకి వచ్చి ఏదేదో మాట్లాడేది.

నేనామెను చూసి “మా యిల్లు ఎలా తెలుసు?” అని ఆశ్చర్యపోతూ గేటు తీసేను.

ఆమె అమాంతం నా చేతులు పట్టుకుని “నా మనవరాలికి బాగోలేదు శారదా. నిమ్స్‌లో చూపించాలని వచ్చాం. ఆ మందు ఎల్లుండి విమానంలో బాంబే నుండి వస్తుందంట. రెండ్రోజులు మీ యింట్లో వుంటాం” అంటూ పర్మిషన్ తీసుకోకుండానే కూతుర్ని, మనవరాలిని తీసుకుని లోపలికొచ్చేసింది.

ఏం చేయాలో నాకు తోచలేదు.

హాయిగా నా పిల్లల గదిలో సెటిలయిపోయింది.

ఆ తర్వాత మర్నాడు అల్లుడు, ఆమె భర్త వచ్చేసారు.

ఆ మందు వారం దాకా రాలేదు.

ఈ లోపున ఆమె బంధువులు రావడం మొదలయ్యింది. చివరికి మొగమాటం చంపుకుని ఎక్కడయినా హోటల్లో వుండమంటే.. ‘దిక్కులేని వాళ్ళం గాదు. ఊరుగాని వూరు. మాకూ ఆస్తులున్నాయ్’ అంటూ ఆరున్నొక్కరాగం అందుకుంది.

ఇంకా పెద్ద జోక్ ఏమిటంటే ఇంజనీరింగ్ చదువుతున్న మా అబ్బాయిని “అబ్బాయ్ రెండరటి పళ్ళెత్తుకురా! ఎక్కువ తెస్తే నువ్వు తినేస్తావు” అన్నదోసారి.

వాడు బిత్తరపోయి చూశాడు.

నాకు ఒళ్ళు మండి ఆ సాయంత్రం “ఇక కుదరదు” అని తెగేసి చెప్పాను. అప్పుడు కదిలారు వాళ్ళు.

ఇందులో నా మొగమాటమే ఎక్కువ నన్ను నష్టపెట్టిందని నాకు తెలుసు. కాని అది నా బలహీనత.

అందుకే చేతనయితే డబ్బు దానం చెయ్యాలి కాని అప్పు ఇవ్వకూడదు. అవి రాకపోగా శత్రువులు పెరిగిపోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here