మనసులోని మనసా-34

0
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]మ[/dropcap]న జీవిత యానంలో ఎంతోమందిని కలుస్తుంటాం.

కొందరిని గాఢంగా హత్తుకుపోతాం.

వాళ్ళే జీవిత సర్వస్వమనే భావనతో అల్లుకుపోతాం.

ఇంతలో ఏమవుతుందో… బలమైన గాలి వీచి అల్లుకున్న తీగె ఆధారం నుండి జారిపోయినట్లుగా స్నేహాలు చెయ్యి జారిపోతుంటాయి.

గాలి విసురుకి ఎటో కొట్టుకుపోయినట్లుగా దూరమయిపోతాం.

కొన్నాళ్ళు అవి మనసు చుట్టూ వ్యాపించిన పరిమళాల్లా సుగంధాలు వెదజల్లుతుంటాయి.

ఏ తలగడకో తల వాల్చినప్పుడు మనసు కదిలి లోపలి పొరల నుండి ఆ వ్యక్తులు మన హృదయాలపై పరిచిన అపురూప సంఘటనలు గుర్తొచ్చి ఆనందంతోనో, కలత తోనో కళ్ళు తడి అవుతాయి.

అలా నా జ్ఞాపకాల్లో పదిలాతి పదిలంగా వుండిపోయిన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు.

ఆమెను పదే పదే తలచుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. 1982లో నా మొదటి నవల ‘గౌతమి’కి ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు దీపావళి పోటీకి గాను మొదటి బహుమతి ప్రకటించారు. శ్రీ నండూరి రామ్మోహనరావు గారు సంపాదకులు.

ఆ సీరియల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రముఖ చిత్రకారులు బాలి (అన్నయ్య) గారు బొమ్మలు వేసేరు.

అంతకు ముందు చాలా చిన్నతనం నుండి కథలు రాస్తునే వచ్చాను. నిజానికి ‘స్టెప్ ఫాదర్’ అనే చిన్న నవల అందకుముందే ‘మహిళ’ స్త్రీల పత్రికలో ప్రచురితమైంది.

సరే! ‘గౌతమి’తో నేను చాలామందికి ఒక రచయిత్రిగా తెలిసాను. ఫాన్‍మెయిల్ రావడం మొదలైంది.

ఒక రోజు నేను ఆఫీసులో బిజీగా వున్నప్పుడు డెప్యూటీ చీఫ్ ఇంజనీరు పేషీ నుంచి అటెండర్ వచ్చి “అమ్మా, మీకు ఫోనొచ్చింది” అని పిలిచాడు. అప్పట్లో నాకు యింట్లో ఫోన్ లేదు. ఒకటే బిఎస్‌ఎన్‌ఎల్ వారి ఫోన్‌లే వుండేవి. చాలా ప్రయత్నిస్తున్నాను గాని పని జరిగేది కాదు.

పేషికి వెళ్ళి, ‘హలో’ అన్నాను.

“నేను వాసిరెడ్డి సీతాదేవి నమ్మా” అన్నారు.

ముందు నమ్మలేక, మాట రాక ఆశ్చర్యపోతూ, ‘మాడం’ అన్నాను వినయంగా, – అంతకంటే థ్రిల్‍గా.

“నీ సీరియల్ చదువుతున్నానమ్మా. చాలా బాగుంది. ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి నీవీ ఆఫీసులో పని చేస్తున్నావని తెలిసి ఫోన్ చేస్తున్నా” అన్నారు.

“థ్యాంక్స్ మాడం. ఏదో ఇంకా ఇప్పుడిప్పుడే రాస్తున్నా. ఇది నా మొదటి నవల” అన్నాను.

“అవునా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో రాసినట్లుంది. చాలా బాగుంది” అన్నారు నవ్వుతూ.

“ఒకసారి ఇంటికి రా. ప్రకాష్‌నగర్‌లో మా యిల్లు” అన్నారు.

నేను సరే అన్నాను.

ఆ వెంటనే, “ఎప్పుడో ఎందుకు, సాయంత్రం పర్మిషన్ పెట్టి మా ఆఫీసుకి రా. నేను తీసుకెళ్తాను” అన్నారు.

అప్పుడామె యూత్ సర్వీసెస్‌లో డైరక్టరుగా చేస్తున్నారు. ఆఫీసు లకడీకాపూల్‍లో వుండేది. అంటే మా ఆఫీసుకి చాలా దగ్గరగా.

నేను భయభక్తులతో ఆ సాయంత్రం ఆమె ఆఫీసుకి వెళ్ళాను. ఆఫీసు క్లోజింగ్ అవర్స్ కాబట్టి ఆమె కూడా లీజర్‌గా వున్నారు.

నన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి టీ తెప్పించారు. అప్పటికే ఆమె రచయిత్రిగా శిఖరం మీద వున్నారు.

ఏవో ప్రేమ కథలో, ప్రేత కథలో రాసిన రచయిత్రి కాదు ఆమె. ‘మట్టిమనిషి’, ‘మరీచిక’ లాంటి అద్భుతమైన నవలల రచయిత్రి ఆమె.

నేనప్పుడప్పుడే రచనారంగంలో క్రింద మెట్టు మీద వున్నదాన్ని.

ఆమె నన్ను తీసుకుని జీప్‌లో ఇంటికి తీసుకెళ్ళేరు.

సాహిత్యం గురించి వారు చెప్పడం, నేను వినడం – అంతే!

నిజానికి నేను నా ధోరణిలో రాసుకుంటున్నానే గాని, రచయితలు, రచయిత్రూలూ ఎవరూ తెలియదు. ఏ సంపాదకుల్ని చూడలేదు.

మా యిద్దరికీ ఏ కెమిస్ట్రీ కుదిరిందో నాకు తెలియదు. కాని వయసురీత్యా ఎంతో తేడా వున్నా, గురుశిష్యుల్లా అల్లుకుపోయాం. నిజానికి ఆమె గంభీరంగా వుండేవారు. ఆమె చూపులు మనిషిని నిశితంగా పరిశీలిస్తున్నట్లుండేవి. నేను ఇప్పటికీ కొత్తవారితో చనువుగా కలవలేను.

ఆదివారం వచ్చిందంటే నాకు పిలుపు వచ్చేది.

ఇంతలో నాకు ఫోన్ కనెక్షన్ కూడ వచ్చింది.

ఒకరోజు నాకు ఫోను వచ్చింది.

“మాడం” అన్నాను.

“ఏం చేస్తున్నావ్” అనడిగారు.

“చీరకి ఫాల్ కుడుతున్నా” అన్నాను.

“ఛీ! పది రూపాయలు పడేస్తే టైలర్ కుడతాడు. నీలాంటి రచయిత్రి కథ రాయాలి” అన్నారు.

నేనెంత ఇన్‌డిసిప్లిన్డ్ రైటర్‌నో నాకు తెలుసు కాబట్టి కొంచెం సిగ్గుగా నవ్వాను.

“అద్సరే, నువ్వర్జంటుగా బయల్దేరిరా… ఇక్కడ నీ కోసం ఒక వ్యక్తిని కూర్చోబెట్టాను” అన్నారు.

ఆమె చెప్పారంటే శాసనమే.

వెంటనే వెళ్ళాను.

అక్కడొకాయన కూర్చుని వున్నారు.

నేనిద్దరికీ నమస్కరించాను.

“ఈ అమ్మాయే శారద. బాగా రాస్తున్నది” అని చెప్పి, “ఈయన మారేమండ సీతారామయ్య గారు. ఆదివారం సంపాదకులు” అని పరిచయం చేసారు.

సీతారామయ్యగారు చిరునవ్వు నవ్వి నన్ను సినాప్సిస్ ఇవ్వమని చెప్పారు.

అప్పటిదాక అందులో సీతాదేవి గారి సీరియల్ వస్తుండేది. అది అయిపోవస్తున్నది.

అప్పుడే ఇండియా టుడేలో వచ్చిన చిన్న న్యూస్ ఆధారంగా ఒక సినాప్సిస్ తయారు చేసి ఆయనకిచ్చేను.

అదే చాలామంది దృష్టిలో పడి  మెప్పుపొందిన నవల ‘వానకారు కోయిల’.

ఆమె ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా జీప్ మా యింటి ముందు ఆగేది. అలానే ఆమె ద్వారా చాలామంది ప్రముఖులు నాకు పరిచయం అయ్యేరు. ఆమె సమకాలీన రచయిత్రుల్ని చూడడం జరిగింది.

ఆమె కూడ తరచూ కనబడే నా మీద అందరి దృష్టి పడేది. ‘ఈ స్నేహమేమిటా’ అని విచిత్రంగా చూసేవారు.

ఏదైనా కొత్త పోటీ ప్రకటిస్తే ‘రాస్తున్నావా’ అని అడిగేవారు.

ఆ సాయంత్రం ఆ కథ చెప్పించుకుని, “భలే ట్విస్ట్ చేస్తున్నావే! చెప్పు చెప్పు” అని వంటమ్మాయికి “శారదకి కూడ వంట చెయ్యి” అని చెప్పేవారు.

నాకు బహుమతి వచ్చిన ‘చంద్రోదయం’, సస్పెన్స్ థ్రిల్లర్ ‘పిలుపు నీ కోసమే’ విని థ్రిల్ అయిపోయేవారు.

ఒక్కోసారి కొంతమంది మా స్నేహం చూసి అసూయపడి ఆమెకేదేదో చెప్పేవారు. ఒక్కోసారి తాత్కాలికంగా నమ్మి, “నువ్వర్జంటుగా రా, నీ పని పట్టాలి” అని బెదిరించేవారు.

నేను నవ్వుతూ వెళ్ళేసరికే సగం కోపం తగ్గిపోయేది.

రూలర్‍ని టేబుల్ మీద కొట్టి, “నీకు దెబ్బలు పడాలి” అని కుర్చీలో కళ్ళురుమి కదిలేవారు.

“అలాగే కొట్టండి” అనేదాన్ని నవ్వుతూ.

అప్పటికే నేను త్వరత్వరగా బహుమతులు పొందుతూ ఎస్టాబ్లిష్ అయిపోయాను. దాదాపు నా రచనలు రాని పత్రికలు లేవు.

అయినా ఆమె బెత్తం ఊపితే నేనామెలో గురువుని చూశాను.

ప్రేమగా పలుకరిస్తే తల్లిని చూశాను.

నా నవల ఒకటి ఆమెకు అంకితమిచ్చినప్పుడు ఆమె శ్రీకృష్ణదేవరాయ లైబ్రరీలో సభ ఏర్పాటు చేసి కీర్తిశేషులు శ్రీ దాశరథి రంగాచార్య గారిని, శ్రీ పోతుకూరి సాంబశివరావు గారిని, మల్లాది సుబ్బమ్మ గారిని వక్తలుగా పిలిచి విశ్లేషణ చేయించారు. నాకొక మంచి చీర పెట్టారు.

ఆమె తోనే 1984లో తెలుగు మహాసభలకి వెళ్ళాను. శ్రీమతి మాలతీ చందూర్ గారిని, రామలక్ష్మి గారిని కలిసాను.

అక్కడ మౌంట్ రోడ్‌లో ఉన్న పూంగ్‌పుహార్‌లో నాకొక పేపర్ మెష్‌డ్ సరస్వతీదేవి బొమ్మ కొనిచ్చారు. మొదటిసారి ఆమెతో ఫ్లయిట్ ఎక్కాను.

ఆమె కారు కొనుక్కున్నాకా నేనే ఫోన్ చేస్తే మా లేబరేటరీ నుండి మెహబూబ్ అనే అనే ఒక అబ్బాయిని డ్రైవరుగా పంపుతుండేదాన్ని.

రావిశాస్త్రి గారు చనిపోయినప్పుడు నేను ‘మమ్మల్నొగ్గేసి ఎల్లిపోనావా బావూ!’ అని రాసిన ఆర్టికల్ చదివి చాలా మెచ్చుకున్నారు. “మేమెంతో కష్టపడి ఆయన గురించి రాస్తే, నువ్వడ్డ దారిన వచ్చి మార్కులు కొట్టేసేవా? ప్రొద్దుట నుండి నీ ఆర్టికల్ చదవమని ఒకటే కాల్స్!” అని చెప్పి మెచ్చుకున్నారు.

ఇలా ఎన్నో జ్ఞాపకాలు వున్నాయి నా మనసులో. ఒకసారి ఆమెకు ఘన సన్మానం జరిగింది.

“నువ్వు తప్పకుండా రావాలి! లేకపోతే చంపేస్తా” అని ఫోన్ చేశారు.

నేను సంతోషంగా ఒక మంచి జరీ చీర కొని ఫంక్షన్‌కి వెళ్ళాను. త్యాగరాయ గాన సభలో జరిగినట్లు గుర్తు. హేమాహేమీలు ఆమె సమకాలీన రచయితలూ, రచయిత్రులూ వచ్చారు.

ఆమెకు సన్మానం జరుగుతున్నప్పుడు నన్ను తప్ప అందర్నీ స్టేజి మీదకు పిలిచారు. ఒక కవిత, ఒక కథ రాసిన వారు కూడా వేదిక మీద వున్నారు. నా పక్కన కూర్చున్న ఆహుతులు కొందరు “అదేంటి శారద గారూ, మిమ్మల్ని పిలవలేదేంటి?” అని అడుగుతున్నారు.

నాకు అర్థమవుతూనే వుంది.

అప్పుడు నేను చాలా పాపులర్‌గా వున్నాను నిజానికి రచయిత్రిగా.

బాధగానూ వుంది.

ఆమెకు చీర యివ్వాలి! ఎలా?

వెనుతిరిగి వెళ్ళి పోవాలని వుంది.

అభిమానాన్ని బిగపెట్టి చూస్తున్నా.

ఆ నిర్వాహకులకి నేను శత్రువుని కాను. వారిని నేను గౌరవంగానే చూస్తాను. ఇప్పటికీ వారు ఎక్కడయినా కనిపిస్తే నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు.

చివరికి సీతాదేవి గారు హడావిడి తగ్గి క్రింద కూర్చుని వున్న నన్ను ఆశ్చర్యంగా చూసి, ‘పైకి రా’ అని సైగ చేసేరు.

నేను వెళ్ళి చీర ఆమె భుజాల మీదుగా కప్పి పాదాలకి నమస్కరించి ఇంటికి వచ్చేసేను.

చాలా రోజులు ఆ సంఘటన నన్ను చాలా బాధించింది.

తర్వాత సీతాదేవి గారు ఆ విషయం తెలుసుకుని నొచ్చుకున్నారు. రాను రాను నాకర్థమయిందేమిటంటే మనల్ని గుర్తించడానికి, గౌరవించడానికి మన మంచితనం, నిగర్వం, ప్రతిభ చాలవని.

వీటిన్నింటిని మించిన ఆశ్రిత బంధాలేవో కావాలని.

సీతాదేవి గారు చనిపోయినప్పుడు నేను అమెరికాలో వున్నాను. చివరిసారి చూడలేకపోయిన బాధ నన్ను వెంటాడుతూనే వుంటుంది.

వారితో వున్న అనుబంధాన్ని కుదించి రాసుకుని మరోసారి ఆమె పట్ల నా ప్రేమని తెలియబరుచుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here