మనసులోని మనసా-38

1
10

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఈ[/dropcap] వూరు వచ్చిన తొలినాళ్ళలో నేను హెడ్డాఫీసులో జాయినైనప్పుడు జరిగిన సంఘటన!

నా కొలీగ్ ఇందిర పెళ్ళి జరిగింది.

ఆ కళ్యాణమండపం కోటీలో అని గుర్తు.

తెల్లవారుఝాము ముహూర్తం!

రాత్రికే అందరం వెళ్ళిపోయాం.

అందరం చిన్నవాళ్ళం. చాలా ఉత్సాహంగా వున్నాం.

సరదాగా ఛలోక్తులు వేసుకుంటూ, తోచిన పనులు చేస్తున్నాం. నాకు పూలు కట్టడం చాలా ఇష్టం. బాగా కడతానని పేరుంది.

చిన్నతనంలో మా నాన్నగారు గురజాలలో పనిచేస్తున్నప్పుడు మా పక్కింటి మేజిస్ట్రేట్ గారమ్మాయి లలిత దగ్గర శుశ్రూష చేసి మరీ చంద్రకాంతం పూలతో (సంజెమల్లెని కూడ అంటుంటారు) దండ కట్టడం నేర్చుకున్నాను.

మేం చాపల మీద పోసిన పూలు కడుతున్నాం.

ఒక నడివయసావిడ మాకు పూలు బొత్తిగా పెట్టి అందిస్తున్నారు. పెళ్ళికూతురు ఇందిర కూడా మాతోనే ఉంది. ఆమె తెల్లగా కొంచెం బొద్దుగా కళకళలాడుతూ వున్నారు. బాగా జోక్స్ వేస్తున్నారు.

ఇందిర ఆవిడ తనకి పిన్నిగారని చెప్పింది.

ఆమె మాతో పిల్లల్లాగే కలిసిపోయి నవ్వుతున్నారు.

ఇక పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుండంగా ఆవిడ మేం కూర్చున్న వరండా చివరికి వెళ్ళి వెనక్కి తిరిగి నిలబడ్డారు.

నేనటు అనుకోకుండా చూశాను.

ఆమె భుజాలు కదులుతున్నాయి. ఆమె ఏడుస్తున్నారని అర్థమైంది. నేను కంగారుగా, “ఇందిరా… మీ పిన్ని ఏడుస్తున్నట్లున్నారు” అన్నాను.

ఇందిర విచారంగా “అవును” అంది.

“అయ్యో! ఏమయ్యింది?” అనడిగేం మేమంతా.

“నా వయసుదే… మా పిన్ని కూతురు చనిపోయింది. అది గుర్తు వచ్చి…” అంది బాధగా.

“అయ్యయ్యో” అన్నాం మేం విచారంగా.

“మీకు గుర్తే వుండుంటుంది. దాని పేరు ధనలక్ష్మి. మెడికో. వైజాగ్‌లో చదువుతుందేది. ఒకసారి ఇంటికి వస్తుంటే బెల్లంపూర్‌ నుండి వస్తున్న కొంత మంది నీచులు, టి.సి.తో కలిసి రేప్ చేసి చంపేసారు. తర్వాత కొవ్వూరు దగ్గర గోదావరిలో పడేసారు. చిన్నాన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. రైల్లో వచ్చిన దాని లగేజ్ చూసి నిర్ఘాంతపోయేరు. కేసు నడిచింది కాని నేరస్థులకి శిక్ష పడలేదు” అంది ఇందిర బాధగా.

నేను నిర్ఘాంతపోయాను.

ఆ కేసు నాకు బాగా గుర్తుంది.

అప్పట్లో చాలా సంచలనం సృష్టించిన కేసు అది!

మన దేశంలో నేరస్థులని రక్షించడం కొత్తదేం కాదు.

ఇక ఆ పెళ్ళి ఎలా చూశానో నాకు తెలియదు.

చాలా రోజులు ఆమె నా కళ్ళలో కనిపిస్తూనే వుండేవారు.

తర్వాత సంచలనం సృష్టించిన కేసు సంజయ్ చోప్రా  పిల్లల్ని అమానుషంగా చంపిన బిర్లా రంగాల కేసు!

ఏదో నేరం చేయడానికి మాటు వేసి, అందాక కాలక్షేపానికి ఎదురుగా కార్లో కనిపిస్తున్న చిన్నారిపై అత్యాచారం చేసి అక్కాతమ్ముళ్ళని హతమార్చిన కేసు!

ఆ నీచులకి ఉరిశిక్ష వేస్తే ‘ఉరి’ అమానుషమని ఘోషించి ఏజిటేషన్స్ చేయడం, ఆ బిల్లుని చాలామంది మేధావులు అంగీకరించకపోవడం చాలామందికి గుర్తుండే వుంటుంది.

అప్పుడు నేనొక కథ రాశాను. ఆ కథ పేరు ‘ఆగండి – ఆలోచించండి’. 1982లో అనుకుంటాను, ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది.

ఆ బిల్లు కోసం తర్జన భర్జన పడుతున్నపుడు ఒక లేడీ జర్నలిస్టు, జడ్జీలని, న్యాయవాదుల్ని, మేధావుల్ని కాకుండా ఎవరైతే బలయిపోయారో ఆ కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేస్తుంది. వారు చెప్పిన మాటలు, వారి వేదన, వారి జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమైపోయాయో చూపించడానికి ప్రయత్నించాను. అందులో మంచానికి అంటుకుపోయి జీవచ్ఛవంలా వున్న ఒక తల్లి చివరిగా ఒక మాట అంటుంది.

“అమ్మా మీరందరూ ఆ కరడుగట్టిన నేరస్థులకి క్షమాభిక్ష పెట్టాలనుకుంటే ఒక పని చేయండి. జూలో క్రూరమృగాల్ని బయటకు వదిలి మనం ఒక బోను లాంటి వేన్‌లో కూర్చుని చూస్తున్నట్టుగా అమాయకులకి ఒక పెద్ద బోను కట్టి, అందులో మాలాంటి వారిని పెట్టి ఆ నీచులని విచ్చలవిడిగా వదిలేయండి” అని.

ఆ మాట పాఠకుల్ని విపరీతంగా కదిలించింది.

ఆ కథకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

నేను తర్వాత పత్రికాఫీసుకి వెళ్తే దూరం నుండి చూసిన కనకంబరరాజు గారు “వెల్‌కమ్ శారద గారూ, వెల్‌కమ్! మీకు రెడ్ కార్పెట్ ఆహ్వానం!” అన్నారు.

నేను గతుక్కుమని కంగారు పడ్డాను.

నేను వెళ్ళి వినయంగా కూర్చుని విష్ చేసాకా ఆయన “నేను జోక్ చేయడం లేదు శారద గారూ! మీ చిన్న కథ పాఠకుల్ని కదిలించేసింది. నా పత్రికాఫీసు ఫాన్ మెయిల్‍తో నిండిపోయింది. అందరూ ఎంతో కసిగా ఉత్తరాలు రాశారు” అని కొన్ని లెటర్స్ నాకు చూపించారు.

నిజంగానే పాఠకులు చాలా ఆవేశంగా ఉరిశిక్షని సమర్థిస్తూ లెటర్స్ రాశారు.

ఆ సంవత్సరం ఆ కథని ‘బెస్ట్ స్టోరీ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించి బహుమతి ఇచ్చారు.

చూస్తుండగానే నేరాల సంఖ్య పెరిగిపోయింది.

ఎన్నో ఘోరాలు చూస్తున్నాం.

ఆ కాసేపు ‘అయ్యో’ అనుకుంటున్నాం. పరిష్కారం మాత్రం లేదు.

నేను చదువుకునే రోజుల్లో మద్రాసులో సెఫైర్ థియేటర్‌లో ‘సేండ్ పెబుల్స్’ అని సినిమా చూశాను. అందులో ఒక నేరస్థుడిని చివరిలో ఊరి మధ్య ఒక రాటకి కట్టి ఊరివారందరూ రాళ్ళతో కొడ్తారు. చనిపోయేవరకు ఆ శిక్ష అమలు జరగాలి. అతని శరీరమంతా రక్తం ఓడుతూ గాయలవుతుంటాయి. ఆ వయసులో ఆ శిక్ష నాకు చాలా అమానుషంగా అనిపించింది. కాని ఇప్పటి ఈ వ్యవస్థని చూస్తుంటే అంతకంటే కఠిన శిక్షలు వేసి తీరాలనిపిస్తుంది.

మనల్ని రక్షించలేని ప్రభుత్వాలూ, చట్టాలు దేనికనిపిస్తుంది. అత్యధిక జనాభా వున్న మన దేశం వీటికి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుందో అర్థం కాదు.

నాయకులున్నది మనల్ని రక్షించడానికి కాదా???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here