మనసులోని మనసా-39

2
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]చ[/dropcap]దివిన చదువుకి ఆఫీసులో ఎదురయ్యే విభిన్నమైన పరిస్థితులకు కొన్నిసార్లు లంగరు కుదరదు.

పుస్తకాల్లో చదివినదానికి ప్రాక్టికల్‌గా పని చేసే విధానానికి చాలా తేడా అనిపిస్తుంది.

అలాంటప్పుడు ఆఫీసులో కాంట్రాక్టర్లతో కొన్ని చిత్రమన పరిస్థితులు తారసపడుతుండేవి.

గుంటూరులో కొన్ని నెలలు పనిచేసినప్పుడు ఒక క్లాసు వన్ కాంట్రాక్టరు గారు వచ్చేవారు. ఆయన్ని చూడగానే స్టాఫ్ చాలా మర్యాదగా లేచి నిలబడేవారు. ఆయన ఖద్దరు బట్టలు వేసుకుని తెల్లగా ఎత్తుగా, హుందాగా వుండేవారు. అదంతా చూసి నేను ఇబ్బంది పడేదాన్ని.

ఆయన కాంట్రాక్టరే కదా! తన పని మీద వచ్చేరు కదా! ఆయనకి మనమెందుకు అణకువగా లేచి నిలబడి దండాలు పెట్టడం – అని అనిపించేది. అందరితో పాటుగా నేనూ పెట్టాలంటే మనసు మొరాయించేది.

ఒకసారి ఆయన టెండర్ నేను డీల్ చేసేను. అది ఏక్సెప్ట్ అయ్యింది. ఆయన ఎగ్రిమెంటు రాయడానికి వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చున్నారు. సంతకాలన్ని అయ్యాక, ఆయన నా చేతికి ఒక కవరు ఇవ్వబోయారు. నేను సందేహంగా చూసి, “ఏంటండి?” అన్నాను.

“ఉంచమ్మా. ఇదంతా మామూలే” అన్నారాయన.

నేను తీసుకోలేదు.

“నా టెండరు చేసేవుగా. అందుకని” అన్నారాయన నవ్వుతూ.

నాకర్థమైంది. ఆ తర్వాత చాలా కోపమొచ్చింది.

“అందుకు మాకు జీతమొస్తున్నది సర్!” అన్నాను అసహనంగా.

ఆయనదోలా చూసి, “ఏమయ్యా హెచ్.డీ! మరి మీ అందరికీ జీతాలు రావడం లేదా?” అని, “సరేనమ్మా, అలానే వుండు” అంటూ వెళ్ళిపోయారు.

ఆయన వెళ్ళేక మా స్టాఫ్ నన్ను అలా తిరస్కరించినందుకు నిందించారు.

తర్వాత నేను హైదరాబాదు వచ్చాక, ఆయన ఇక్కడ చూసి, మా డి.సి.ఇ. గారితో, ‘మంచమ్మాయి. పని బాగా చేస్తుంద’ని చెప్పి మెచ్చుకున్నారు.

అప్పుడాయన ఎం.ఎల్.ఎ. తర్వాత మినిస్టరు కూడా అయ్యారు.

గుంటూరు నుంచి వైజాగ్ వెళ్లిపోయాను.

అక్కడొక తమాషా కాంట్రాక్టరు గారిని చూసాను.

ఆయనకి చదువు రాదు. గాజువాకలో అనుకుంటా – ఒక సినిమా థియేటర్ వుంది.

ఆయన అన్ని వర్కులకి టెండరు వేసేస్తారు. పరమ తక్కువ రేట్లతో. ఆ రేట్లతో ఎవరు పని చేయలేరు.

వైజాగ్‌లో వర్కులకి చాలా కాంపిటీషన్ వుండేది. ఒక వర్కుకి పది, పదిహేను మంది టెండరు వేసేవారు. అందరికన్నా గిట్టని ధరలకి ఈయన టెండర్ వేసి సాయంత్రం టెండర్స్ ఓపెన్ చేసేముందే వచ్చి ఆఫీస్ కాంపౌండ్ వాల్ మీద కూర్చునేవారు.

అక్కడ బేరం మొదలయ్యేది.

నిజంగా సిన్సియర్‌గా ఆ పని చేయాలనుకునేవారు అతనితో బేరమాడి ఆ డబ్బు యిచ్చి అతన్ని టెండర్ వేయకుండా విత్‌డ్రా చేయించేవారు. అలా ఆయన ఏ పనీ చేయకుండా డబ్బు సంపాదించేవాడు.

మా అందరికీ ఆయన సినిమా థియేటర్‌లో సినిమా చూడమని చిన్న చిన్న కాగితాల మీద ఏదో సున్నాల్లా రాసి యిచ్చేవారు. అవే పాస్‌లన్న మాట.

ఇలా ఎంత పని ప్రెషర్ వున్నా మధ్య మధ్యలో ఆయన పాస్‌లు చూసి నవ్వుకుని డస్ట్‌బిన్‌లో వేసేసేవాళ్ళం.

ఇంకో కాంట్రాక్టర్ గారుండేవారు. ఆయన పేరు గోపాలకృష్ణరాజు గారు. కాని ఆయన్ని అందరూ కిరికిరి రాజు గారనేవారు. పేరెవరికీ తెలియదు. పెద్దాయన. తెల్లటి దూదిలాంటి క్రాఫు, తెల్ల లాల్చీ పంచె కట్టుకుని హడావిడిగా వగరుస్తు వచ్చేవారు.

వస్తూనే, “ఇదిగో అమ్మాయ్! నా టెండర్‌కి ఏవీ కిరికిరి పెట్టకు” అంటూ, “ఏమయ్యా, పి.ఏ… ఈ పిల్ల దొంగనవ్వు నవ్వుతోంది. ఏదో కిరికిరి పెట్టేటట్లుంది” అని చెప్పేవారు.

ఆయన మాటలకి మేమంతా నవ్వేవాళ్ళం.

“అదిగో అందరూ కలిసి కట్టకట్టుకుని నవ్వుతున్నారు. ఏదో కిరికిరి చేసేట్లున్నారు మీరు!” అనేవారు.

ఆయన వున్నంత సేపూ నవ్వులే!

నిజానికి ఆయన చాలా ఇన్‌ఫ్లూయన్స్ వున్న వ్యక్తి. కాని… అదెప్పుడూ ప్రదర్శించేవారు కాదు.

ఒకసారి మా అటెండర్ ఒకడు నా సీటు దగ్గరకి పరిగెత్తుకొచ్చి, “అమ్మా, ఎస్టిమేట్ రేట్స్ కావాలి!” అన్నాడు.

అతను చాలా కన్నింగ్. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని తనే మెహర్బానీగా పని చేసినట్లు డబ్బులు తినేవాడు.

నా సీట్లో ఆ టెండర్ పిలిచేం.

కాంట్రాక్టర్లు ఎస్టిమేట్ రేట్స్ చూసుకుని దాన్ని బట్టి వాళ్ళకెంతకి గిట్టుబాటవుతుందో నిర్ణయించుకుని రేటు కోట్ చేస్తారు.

విధిగా మేము ఎస్టిమేట్ వాళ్ళకి చూపించాలి. అది రూల్.

“ఎవరికి?” అన్నాను నేను ఏదో ఫైల్ డీల్ చేసుకుంటూ.

“వెంగళ్రావ్ గారి బామ్మరిదకమ్మా” అన్నాడు అటెండరు గుసగుసగా.

“ఎవరయితే నాకేంటి… వచ్చి తీసుకోమను” అన్నాన్నేను.

“అయ్యో తల్లీ – ఆయనిక్కడే వున్నారు” అన్నాడు అటెండరు.

అప్పుడు తలెత్తి చూశాను.

సదరు బావమరిది గారు గుమ్మం పక్కకి నిలబడి ముసిముసిగా నవ్వి నాకు విష్ చేసాడు.

నేను “రండి, దీనికితని రికమండేషన్ దేనికి? మీకు చూపించాల్సిన బాధ్యత మాది” అన్నాను.

ఆయన సారీ చెప్పి వచ్చి కూర్చుని నోట్ చేసుకున్నారు.

“ఏమన్నా తీసుకుంటారా మేడం?” అన్నారాయన భయం భయంగా.

“ఇది మా డ్యూటీ అండి” అన్నాను.

“కాని… చాలా మంది డిమాండ్ చేస్తారు మాడం. అందుకని అడిగాను. సారీ!” అంటూ వెళ్ళిపోయడు.

నిజానికి ఆయన ఆనాటి చీఫ్ మినిస్టర్ వెంగళ్రావ్ గారికి స్వయానా బావమరిదే. కాని ఆ భేషజం కాని, పలుకుబడి వాడాలన్న అహం కాని లేకుండా ఆయన సాత్వికంగా ప్రవర్తించి వెళ్ళిపోయారు.

రాయలసీమ నుండి వచ్చే కాంట్రాక్టర్స్ తీరు తెన్ను వేరుగా వుండేది. వాళ్ళు ‘అక్కా, అక్కా’ అంటూ చుట్టరికం కలిపేసుకుంటూ వచ్చేసేవారు.

“అక్కా నువ్వో తూరి మా మదనపల్లె రావాలక్కా. అక్కడ నీకు కాటేజి బుక్ జేస్తాం. అక్కడు కూర్చుని నువ్వు కథలు రాయాలక్కా. కావాలంటే బావని కూడా తీసుకురా” అని చెప్పేవారు.

నాకు బాగా నవ్వొచ్చేది.

సాహిత్యం అంటే వాళ్ళకి చాలా మక్కువ. పుస్తకాలు తెగ చదివేవారు.

నా మొదటి నవల గౌతమి పబ్లిష్ అయినప్పుడు నా కొలీగ్ పబ్లిషర్ దగ్గర ఒక వంద నవలలు కొని వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గరంతా ఎంతంటే అంత తీసుకుని హాట్‌కేకుల్లా అమ్మేసింది. వాళ్ళు పాపం పాతిక రూపాయల నవల్ని వందా రెండొందలూ యిచ్చి కొనేసారు. ఆ డబ్బంతా నాకొస్తుందని వాళ్ళనుకున్నారు.

“నాకేం ఇందులో సంబంధం లేదండి” అని చెప్పాల్సి వచ్చింది చివరకు.

రాను రాను ఆఫీసు వాతావరణాలు మారిపోయాయి.

ప్రతి కాంట్రాక్టరు వెనుక ఒక ఎం.ఎల్.ఏ. లేదా మంత్రి ఫోనులు, జులుంలూ మొదలయ్యేయి. ‘డబ్బు పడేస్తే చేస్తారు’ అనే ధోరణి ప్రబలిపోయింది.

చివరికి టెండర్ బాక్స్‌లో బాంబులు వేసుకునే స్థితికి వచ్చేసేయి పరిస్థితులు.

దాంతో కడప సర్కిల్ టెండర్ బాక్స్ హెడ్డాఫీసులో పెట్టడం ప్రారంభించేరు.

బాక్స్ మా టేబుల్స్ మీద పెడితే, టెండర్ వెయ్యడానికి వచ్చిన కాంట్రాక్టర్‌లని నా కొలీగ్ కృష్ణ “బాబూ, మీకు పుణ్యం వుంటుంది. బాంబు పెడితే చెప్పండి. దూరంగా వెళ్ళిపోతాం. పిల్లలు గల వాళ్ళమి” అనేది.

వాళ్ళు నవ్వుతూ, “ఊరుకోండి మేడం, మీరు మరీనూ!” అనేవారు.

“మరీనేమిటి, బాంబులు వేసుకోబట్టే కదా… బాక్స్ అక్కడి నుండి ఇక్కడ కొచ్చింది!” అనే వాళ్ళం.

అలా మేం మా సర్వీసులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా అనేక ఆటూపోట్లూ ఎదుర్కుంటుండేవాళ్ళం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here